top of page

పుస్త​క పరిచయాలు

శాయి రాచకొండ

నిర్వహణ: శాయి రాచకొండ  |  శ్రీనివాస్ పెండ్యాల

sahityam@madhuravani.com

ముకుంద

ఈ ప్రపంచమంతటా వీచే గాలి ఒకటేనా? సైన్సు ప్రకారం ఆక్సిజెన్, నైట్రొజెన్ల మిశ్రమమే, అదీ, సుమారుగా ఒక పాళ్ళలో వుంటుంది అంతటా వ్యాపించి.  మనోభావాల్లోనూ, మనుషులు తామనుభవించే భావాల్లోనూ, కవిత్వంలోనూ కూడా ప్రపంచ ప్రజలమందరం కూడా ఒకటే కదా అన్న భావన కలుగుతుంది ముకుంద రామారావు గారు ఎంతో పరిశోధనతో అందించిన  ’అదే గాలి - ప్రపంచదేశాల కవిత్వం - నేపథ్యం’ పుస్తకంలో.  అదే ఆలోచనా సరళిలో దాసరి అమరేంద్ర గారు ’అండమాన్ డైరీ’ పుస్తకంలో అండమాన్ నికోబార్ దీవుల పర్యటనలో తనొక యాత్రీకుడిగా పొందిన అనుభవాలని మనతో పంచుకున్నారు.  అయితే ’ఆ నేల, ఆ నీరు, ఆ గాలి’ అనే పుస్తకంలో వేలూరి వెంకటేశ్వరరావు గారు మాత్రం ఏ గాలి ఆ గాలే అంటారు. 

అదే గాలి  - ముకుంద రామారావు

శాయి రాచకొండ

mukundra ramarao

 ఇది ఎంతో విలువైన, పరిశోధనా గ్రంథం.  చైనా దేశం మొదలుకొని అన్నిఖండాలలోని దేశాలలోని కవిత్వాన్ని మనకు పరిచయం చేసారు ముకుంద రామారావు గారు.  ప్రతి దేశపు కవులగురించి, వారి వారి కవిత్వాన్ని పరిచయం చేసే ముందు సూక్ష్మంగా ఆ దేశపు గత చరిత్ర, సాంఘిక సంక్షోభాలు, కవుల స్పందన, దాని వెనుక వున్న మానసిక సంఘర్షణ, ఇలా ఎన్నో విపులంగా రాసారు.  పుస్తకం కవిత్వం గురించే అయినా, పుస్తకం పూర్తి చేసేటప్పటికి ప్రపంచం మొత్తాన్ని, ఒక హాట్ ఎయిర్ బెలూన్ లో, అన్ని దేశాల్ని కలుపుతూ వర్తులంగా ఒక చుట్టు చుట్టి వచ్చిన అనుభూతి కలుగుతుంది.  చరిత్రలు కొంచెం అటు ఇటు అయి వుండవచ్చు.  కాని చరిత్రలో జరిగిన అనేకానేక సంఘర్షణలు, మనుషులు పొందిన ఆవేదన, యుద్ధభూముల్లోని ఆక్రందనలు, నలుపు, గోధుమ, తెలుపు, పసుపు రంగు జాతుల్లో పుట్టిన ఏ మనిషయినా అనుభవించిన అంతర్మధనం ఒక్కటే.  భాష వేరవచ్చు, మనుషులు వేరవచ్చు, ప్రదేశం వేరవచ్చు, వ్యక్తం చేసిన భావం ఒక్కటే.  అవును,  అదేగాలి. 

ముకుంద రామారావు గారు ఈ పుస్తకంలో మనకు చూపించిన కవితలు మచ్చు తునకలు మాత్రమే.  అన్ని దేశాల్లోని కవితలు, ఈ పుస్తకానికి పరిమితమయిలేవు.  అయితే రామారావు గారు కవితలను ఎంచుకోవడంలో ఎంత శ్రమించారో చదివితే తెలుస్తుంది.  పుస్తకంలోని కవితలు కేవలం అనువాదాలు కావు.  అనువాదాలకు అనువాదాలు.  రామారావు గారు ’అనువాదం కానిదేది?’ అని రాసిన ముందు మాటలో అనువాదంలో అంతర్గతంగా వున్న క్లిష్టత, అనువాదం చెయ్యవలసిన అవసరం, అందువల్ల సాహిత్యానికి కలిగే ప్రయోజనం, చాలా చక్కగా, ఫ్హ్రాంక్ గా పాఠకులముందు వుంచారు.  ’అనువాదంలో పోగొట్టుకున్నది, ఏ కొంతో తప్పకుండా ఉంటుంది.  దానితోబాటు పొందేదీ కొంత ఉంటుంది.  ఈ లాభ నష్టాల బేరీజుల్లో నష్టం గురించి చింతిస్తూ, పొందే లాభం, లాభమే కాదన్నట్టు మడి కట్టుకు కూర్చుంటే, మనల్ని మనమే ఇతర భాషా సాహిత్యాలనుండి వెలివేసుకున్నట్టు’, అంటారు.  ఆయన చెప్పినట్లుగా ’ఇందులో అనువాదాలన్నీ ఆంగ్లంలో ప్రయాణిస్తూ సాంస్కృతిక సరిహద్దుల్ని దాటుకుంటూ, ఆ ప్రయాణంలో పొందే జ్ఞానంతో తిరిగొచ్చి, ఆ కవితను దేశీయ నేలమీదకు తీసుకొచ్చే ప్రయత్నాలే.’ 

 

రామారావు గారు కవితల్ని తన సహజమయిన శైలిలో చాలా సరళమయిన భాషలో హృద్యంగా అనువదించారు.  మాతృకలోని భావాలతో పాటు అనువాదకుడు తనకు తెలియకుండానే తన శైలి రంగుల్ని కుంచెతో అద్దడం జరుతుందేమో! 

 

నూరు దేశాలకు పైగా సంబంధించిన కవితలను పరిచయం చేస్తుంది ఈ పుస్తకం.  అంతే కాదు.  కవిత్వం ఆయా దేశాల చరిత్ర కాలంలో ఎలా మార్పు చెందిందో కూడా తెలుసుకోవచ్చు.  రామారావు గారు రాసిన ఈ పుస్తకం ఒక కవితల సంపుటి కాదు.  ప్రతి దేశపు చరిత్రలోను కవిత్వానికున్న స్థానాన్ని చూపిస్తుంది.  చరిత్రలో కవిత్వంలో వచ్చిన మార్పుల్ని మన ముందుంచుతుంది.  కవులగురించి చెబుతుంది.  అందుకే, ఇది ఒక పరిశోధనా గ్రంధం.  కవిత్వం మీద ఆసక్తి కలిగిన వారందరూ తప్పక చదవవలసిన పుస్తకం. 

 

ఇది ఎమెస్కో వారు ప్రచురించిన మరో మంచి పుస్తకం.  వెల రూ ౩౦౦/-.

*******

మీ అభిప్రాయాలు తెలుపుటకు క్లిక్ చేయండి...click here to post your comments...

దాసరి అమరేంద్ర

విజయనగరం వెళ్ళినప్పుడు చాగంటి తులసి గారిని కలిసే అవకాశం కలిగించాడు శ్యాం.  ఆవిడ నాకు ఇచ్చిన పుస్తకాల్లో ఒకటి 'మహా కవయిత్రి మహాదేవివర్మ గీతాలు'.  ఇవి మహాదేవివర్మ గారు హిందీ లో రాసిన కవితలకి తులసి గారు చేసిన అనువాదాలు.  తులసి గారు అటు తెలుగు నించి హిందీకి, హిందీ నించి తెలుగులోనికి కూడా ఎన్నో తర్జుమా చేసారు.  ఒక భాషలో వ్యక్త పరచిన భావాలు నలుగురూ పంచుకోగలిగి, వివిధ భాషల ప్రజల మధ్య అవగాహన పెంచగలిగే అవకాశం ఈ అనువాద గ్రంధాలు మాత్రమే ఇవ్వగలవు.  అలాంటి సదుద్దేశంతో ఆవిడ అలుపులేకుండా చేస్తున్న కృషి ఎంతో అభినందనీయం.​

మహాదేవివర్మ గీతాలు

అండమాన్ డైరీ    -దాసరి అమరేంద్ర

శాయి రాచకొండ

dasari amarendra

ఆ గాలే అండమాన్ నికోబార్ ద్వీపాలను అంత అందంగా మలచిందేమో!  సౌందర్య పిపాసకులకి, మనుషుల గురించి, కొత్త కొత్త ప్రదేశాలగురించి తెలుసుకోవాలనే ఉత్సుకత వున్నవారికి, ప్రపంచమంతా ఒకటే! కొత్త కొత్త ప్రదేశాలని చూడాలనే కోరిక దాదాపు చాలామందిలో బాహ్యంగానో అంతరంగంలోనో వుంటుంది.  అలాంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుదు ’ఆ, మీరేమి చూశారక్కడ?’ అని అడగడాలు, మేము ఫలానా ఫలానా ప్రదేశాలు చూశామని, ఇంకా బోలెడన్ని చూడలేకపోయామని, చూసినవి ఎంత బాగున్నాయో అని మురిసిపోవడాలు, డిజిటల్ కెమేరాలో లెక్కలేనన్ని క్లిక్కులు, ముఖపుస్తకంలో పంచుకోవడం, సహజాతిసహజంగా జరిగిపోయే విషయాలు.  చూసిన ప్రదేశాలన్నిటినీ ప్రజలు నిజంగా  అనుభవిస్తారా?  అన్నీటినీ అస్వాదిస్తారా?  ఎవరికి వారు అనుకోవచ్చు నిజంగానే అనుభవించామని.  కాని, పచ్చల ద్వీపాలూ, పగడాల సంద్రాలూ ఎవరు ఎంత ఆనందిస్తారో అంతే వారివి.

 

పుస్తకం చదివితే తెలుస్తుంది, అమరేంద్ర గారు ఎంత సౌందర్య పిపాసో అని!  ఎంత ఓపికున్న మనిషో అని!  తను చూసి అనుభవించాలనుకున్న ప్రదేశాలకు పరిగెట్టడంలో ఎంత అసహనపరుడో అని!  'దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్' అన్న గురజాడ మాటల్ని పూర్తిగా అరిగించుకున్న మనిషని - అందుకే పుస్తకం అట్టమీద బొమ్మ ఏ భవనమో, ఏ అందాల పరిసరమో, ఏ పచ్చని చేలో, ఏ పగడాల రంగులో వేయలేదు.  బంగ్లాదేశ్ నించి వచ్చి స్థిరపడి అండమాన్ లో నివసిస్తున్న ఒక తల్లి, పిల్లల ఫోటో అది.  

 

పుస్తకం చదువుతుంటే అక్కడి చరిత్ర తెలుస్తుంది.  అక్కడి దీవుల భౌగోళిక ప్రమాణాలు తెలుస్తాయి.  అక్కడి ప్రజల జీవన విధానం తెలుస్తుంది.  అక్కడి అందచందాలు మనం కూడా అనుభవిస్తే ఎంత బాగుండును అనిపిస్తుంది.  

 

పుస్తకంలోని విషయాలు క్రోడీకరించి ఇక్కడ చెప్పడం లక్ష్యం కాదు కాబట్టి, ఆ ద్వీపాల వివరాలు కావాలనుకునే వారు పుస్తకం చదవండి.  అయితే అమరేంద్ర గారి మాటల్లోనే చూద్దాం ఈ ద్వీపాల సౌందర్యం - "... ఇసుకలోకి అడుగు పెట్టగానే అటు ఇటు అర్ధచంద్రాకారంలో రెండు కిలోమీటర్ల మేర అద్భుత సౌందర్యం.  స్నేహంగా పలకరించే నీలాల జలాలు.  చిన్న చిన్న అలలు.  తెలుపూ గోధుమ రంగుల ఇసుక.  తీరానికి ఏభై మీటర్లలో అంతటా పరచుకొన్న చిక్కని చక్కని పచ్చని అడవి.  నిడుపాటి వృక్షాలు.  వాటికి అల్లుకొన్న లతలు.  ఆ అర్ధచంద్రాకారపు రెండు కొసల్లోనూ దూరాన సముద్రంలోకి చొచ్చుకువస్తోన్న చిరుగిరి శిఖరాలు.  మళ్ళీ వాటి నిండుగా వృక్షాలు".  ఎవరికి మాత్రం చూడాలని వుండదూ?

 

అయితే ప్రకృతిని రంగురంగుల మాటలలో వర్ణించారే కానీ, పుస్తకంలో చూపించిన చిత్రాలు మాత్రం బ్లాక్ అండ్ వైట్లే.  చిత్రాలు రంగుల్లో వేసివుంటే అమరేంద్రగారు తన అనుభవించిన సుందర దృశ్యాలను మనకు మరింత దగ్గరికి తీసుకు రాగలిగేవారేమో - పుస్తకం అచ్చు వేయించే ఖరీదు సంగతి పక్కనుంచితే!  ఇంకోటి, దీవుల మ్యాపు పుస్తకం సగం చదివి లోపలకెళ్తే కానీ తెలియదు అది ఉందని.  దాని స్థానం కొంచెం ముందుకు తీసుకొస్తే బాగుండుననిపించింది.  చదువుతున్నవారికి ఏ దీవి ఎక్కడుందో, ఏ పరిసరం ఎక్కడుందో కొంచెం ముందస్తుగా తెలుసుకోగలవచ్చు కదా అని అనిపించింది!  

 

మొత్తం మీద ఈ పుస్తకం చదివితే, ముఖ్యంగా అండమాన్ దీవులకు వెళ్లని వాళ్లకు అక్కడికి వెళ్లి చూస్తున్న భావన కలుగుతుంది.  మనము వెడదాం ఎప్పటికైనా అనే మరో కోరిక 'బకెట్ లిస్ట్'  లోకి  చేరిపోతుంది అనుమానం లేకుండా. 

 

ఈ పుస్తకం ఖరీదు   100 రూపాయలు (అమెరికాలో అయితే పది డాలర్లు).  ప్రచురించింది నవచేతనా పబ్లిషింగ్ హౌస్ వారు.


*******

మీ అభిప్రాయాలు తెలుపుటకు క్లిక్ చేయండి...click here to post your comments...

Aa Nela

ఆ నేల, ఆ నీరు, ఆ గాలి - వేలూరి వెంకటేశ్వరరావు

శాయి రాచకొండ

ఇది వేలూరి వెంకటేశ్వరరావు గారు రాసిన కథల సంపుటి.  సుమారు ఇరవై తొమ్మిది కథలున్నాయి.  నిజంగా చిన్న కథలే.  ప్రతి కథా, అప్పుడే అయిపోయిందనిపించినా, మనలోనూ, మన చుట్టుపక్కల వుండే కపటం, అర్థం లేని ఆచారాలు, వస్తువు ఉపయోగమున్నా లేకపోయినా పారేయలేని మనస్తత్వం, ఇలా ఇవన్నీ మనకు గుర్తు చేస్తూ, టెంకి జెల్లలు తగిలిస్తారు రావు గారు. 

పుస్తకానికి ముందుమాటలో రావుగారు అంటారు 'ఒక 'కథా పూర్తిగా చదివిన తరువాత మీకు కూడా 'వావ్' అనాలనే అనుభూతి కలిగెతే, అది కథే' అని.  ఆ పరిమితమయిన నిర్వచనం ప్రకారం చూసినా, పుస్తకంలో చాలానే ‘కథ’లే వున్నాయి. 

'గోదావరి, కృష్ణల నీళ్ళు తాగి ఆ నేలపై నడిచిన వారంతా, కీచులాడుకోవడం, పోట్లాడుకోవడం, జ్ఞాతి వైరాలతో సతమతమవడం, మామూలే' - ఆ సీతా రామ లక్ష్మణులంతవారికే తప్పలేదు అని మరీ వెటకారం చేస్తారు,'ఆ నేల, ఆ నీరు, ఆ గాలీ' అన్న కథలో!

హాస్యం, వ్యంగ్యం మేళవించి ఉంటాయి చాలా కథలు.  దేముళ్ళు కూడా తప్పించుకోలేదు రావు గారి కలం నేసిన వ్యంగ్య పాశాల్లోంచి.  అలాగని సీరియస్ గా వుండవని కాదు. కథ చదివిన తరువాత రచయిత చెప్పదలుచుకున్న నిజం మనకు అవగతమైన మరు నిముషం ఆగిపోతాం. ఓ సారి తల విదల్చుకుని మళ్ళీ రెండు పేజీలు వెనక్కి వెళ్ళి మరీ చదువుదాం అని అనిపిస్తుంది..

'గోమెజ్ ఎప్పుడొస్తాడో'’, అన్న కథ అమెరికాలో ప్రతి ఇంట్లోనూ లాన్ మోవ్ చేసే పుట్టు పూర్వోత్తరాలు లేని (undocumented) మెక్సికన్ మనుషులు గుర్తుకొచ్చి ఒక్క సారి గుండె కలుక్కుమనడం చాలా సహజంగా జరుగుతుంది.  మనం పనులు చేయించుకుంటామే కాని మనకు పని చేసే వాళ్ళకూ ఓ జీవితం ఉందని ఆలోచించం.  తరం మారినా అన్న కథలో పార్వతమ్మ కూడా అలాంటిదే.  ఆ గుర్తింపు ఒకప్ ఎవరిలో ఉంటుంది?  'కొంత మంది చచ్చి గాల్లోనూ, వాతావరణంలోనూ, పూల్లోనూ, పసిపాపల నవ్వుల్లోనూ, మన తలపుల్లోనూ... నిరంతరం నిత్యనూతనంగా బతుకుతారు ' అని గుర్తు చేస్తారు.  

గాంధీ గారు, వశిష్టుడు, ఐన్ స్టీనూ కలసి ఉన్న స్వర్గం ఎప్పుడైనా ఊహించారా?  'స్వర్గంలో స్ట్రిప్ టీజ్' అన్న కథ చదవండి.  చివరలో  'ఓస్ ఇంతేనా! మీరు పొగిడే సౌందర్యం కేవలం చర్మ సౌందర్యమేనన్న మాట.  స్వర్గంలో కూడా ఇంతకు మించి వేరే సౌందర్యం లేకపోవడం ఎంత దౌర్భాగ్యం?' అని చిరునవ్వుతో అన్న గాంధీ గారిని చూసి ఐన్ స్టీన్ నిశ్చేష్టుడయితే ఆశ్చర్యమేముంది? 

‘మెట మార్ఫసిస్’ బాహ్యంగా వేషభాషలు  మార్చుకున్న అంతరంగంలో మనం అంత సులభంగా మారమని చెప్పే కథ. 

కథ చాలా సరళంగా సాగిపోతూనే ఉన్నా, ఎక్కడో, ఎప్పుడో ఝలక్ అనిపించి కథ అయిపోతుంది, ఒక్కోసారి కథ ఆగిపోయి ఝలక్ మనిపిస్తుంది.  ఇలా చాలా కథలు మనల్ని, మన (మూఢ) నమ్మకాల్ని, సూదుల్తో గుచ్చుతాయి.  రచయితగా అంతకంటే ఆశించే ప్రయోజనం ఏముంటుంది మరి?

మీ అభిప్రాయాలు తెలుపుటకు క్లిక్ చేయండి...click here to post your comments...

chikatlo

చీకట్లో నీడలు   - డా. రామారావు

వంగూరి చిట్టెన్ రాజు

భువనచంద్ర, Buvanachandra

లండన్  లో తెలుగు వారు అనగానే చాలా మందికి గుర్తుకి వచ్చే పేరు డా. వ్యాకరణం రామారావు గారు. గత 42 సంవత్సరాలుగా అక్కడ స్థిరపడి,  వృత్తి రీత్యా మానసిక వైద్య రంగంలో అత్యున్నత శిఖరాలను అందుకోవడమే కాకుండా ఒక ప్రముఖ రచయితగా, తెలుగు సాంస్కృతిక రాయబారిగా తమ విశిష్టతని చాటుకున్నారు. ఆయన మాటల్లోనే చెప్పాలంటే ఆయన  “జీవిత రథ సారధి” డా.పద్మావతీ రావు గారు. చిన్న చిన్న కథలు, వ్యాసాలూ రచించినా ఆయన స్వతహాగా కవి. 2015 లో “తోటమాలి” అనే కవితా సుమాహారాలు ప్రచురించి తెలుగు కవిత్వాభిమానుల ప్రశంసలు అందుకున్నారు. “చీకట్లో నీడలు” డా. రామారావు గారి తొలి నవల. అర్థ శతాబ్దం నాటి జ్ఞాపకాలని ఒక కాల్పనిక చరిత్రగా వినూత్న శైలిలో పాఠకుడిని ఆగకుండా చదివించే గుణం ఉన్న అపురూప ప్రయత్నం. ప్రతీ అధ్యాయం ఒక రాజకీయ, చారిత్రక సంఘటన ప్రస్తావన తో మొదలవడం ఒక ప్రత్యేకత. నవల, పాత్రలు కల్పితం కానీ చరిత్ర నిజం అని చెప్పుకుంటారు రచయిత. 190 పేజీల ఈ నవలారాజానికి గొల్లపూడి గారు, “పద్మభూషణ్” డా. యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ గారు ముందు మాటలు వ్రాశారు... డి. చంద్రశేఖర రెడ్డి గారి సంపాదకత్వంలో ఎమెస్కో వారి సాహితీ ప్రచురణల విభాగం వారు ఈ నవలని ఆకర్షణీయంగా ముద్రించి, ప్రపంచవ్యాప్తంగా పంపిణీ చేస్తున్నారు. అన్ని ఎమెస్కో బుక్ స్టాల్స్ లోనూ కేవలం Rs. 120 లకి కొనుక్కుని చదివి ఆనందించవలసిన ప్రవాసాంధ్ర రచన.

*******

మీ అభిప్రాయాలు తెలుపుటకు క్లిక్ చేయండి...click here to post your comments...

అందమా... నిను వర్ణింప తరమా  -ఆచార్య కడారు వీరారెడ్డి

సంక్షిప్త పుస్తక పరిచయం

భువనచంద్ర, Buvanachandra

ఆచార్య కడారు వీరారెడ్డి రాసిన ఈ కావ్యం గురించి రాస్తూ, దాస్యం సేనాధిపతి గారు “అందం జాడ తెలియకున్నా... దాని ఊహల నీడలను అందుకోవడమే లక్ష్యంగా కవి తమ రచనను కొనసాగించి పాఠకులను మెప్పించ యత్నించారు. అందం ఆహార్యానికి అతీతమనీ... అది విశ్వపరివ్యాప్తి, సకల రూపాంతర శక్తి అనీ.. అందనిదీ... అనిర్వచనీయమైనదని కవి తేల్చి చెప్పిన తీరు బాగుంది. మాటలు రాకున్నా, భాష తెలియకున్నా... ప్రకృతిలో పొదిగిన అందానికి పంచ భూతాలే సాక్ష్యమని కవి విడమర్చి చెప్పారు.”

 

అలాగే కవి చూపిన అందాల్ని గురించి చెబుతూ, “శిల్పంలో కొంత, చిత్రలేఖనంలో కొంత, మనిషి నడకలో కొంత, మమతలో కొంత, మనసులో కొంత, బుంగమూతిలో బుక్కెడంత, శబ్దంలో కొంత, నిశ్శబ్దంలో కొంత, చిరునవ్వులో కొంత, నిండు నవ్వులో బోలెడంత, అభినయంలో ఆశించినంత అంటూ కవి అందం యొక్క వ్యాప్తిని అక్షరాల్లో అందంగా ఆవిష్కరించారు” అని అంటారు.

 

ఇంత అందంగా మలచిన ఈ కావ్యం తప్పక రసాస్వాదులను అలరిస్తుందని ఆశిద్దాము.  ఈ పుస్తకానికి కవర్ పేజీ కూడా అంత అందంగానూ తీర్చిదిద్దేరు.

 

ఈ పుస్తక ప్రచురణ వివరాలు ఈ క్రింద చూడండి. 

పేజీలు: 88, వెల: రూ. 100/-

ప్రతులకు: ఆచార్య కడారు వీరారెడ్డి

ఇం. నెం.: 8-12-20, బృందావన్ నగర్

రోడ్ నెం.: 8, హబ్సిగూడ, హైదరాబాద్ – 500007

*******

మీ అభిప్రాయాలు తెలుపుటకు క్లిక్ చేయండి...

click here to post your comments...

andama

పుస్తక విశ్లేషణ

మేము ఎంపిక చేసుకున్న కొన్ని మంచి గ్రంధాలు ఈ ‘పుస్తక పరిచయాలు’ శీర్షికలో విశ్లేషించబడతాయి. కేవలం మా ప్రత్యేక వ్యక్తిగత ఆహ్వానం మీరకే  పుస్తకాలు స్వీకరించబడతాయి.

సంక్షిప్త పుస్తక పరిచయం

పుస్తక రచయితలకి ఉచితంగా ప్రచారం కలిగించడం, పాఠకులకి కొత్త పుస్తకాల అందుబాటు గురించి క్లుప్తంగా  పరిచయం చేసే సంక్షిప్త పుస్తక పరిచయం" శీర్షిక రాబోయే ఉగాది సంచిక (ఏప్రిల్ 09, 2016) నుండి ప్రారంభం అవుతుంది. అందులో తమ సరికొత్త గ్రంధాలని పరిచయం చెయ్యదల్చుకున్న వారు డిశంబర్ (2015), జనవరి, ఫిబ్రవరి, మార్చ్ (2016)  మాత్రమే ప్రచురించబడ్డ  కొత్త పుస్తకాల ముఖ చిత్రం (స్కాన్ చేసిన ఫ్రంట్ కవర్), రచయిత వివరాలు, పుస్తకం గురించి ఐదు వాక్యాలు మించకుండా సంక్షిప్త సమీక్ష, కొనుగోలు వివరాలు మాకు మార్చ్ 31, 2016 లోపుగా పంపించవచ్చును.

పంపించవలసిన చిరునామా

saahityam@madhuravani.com

‘పుస్తక పరిచయం విషయాలలో అంతిమ నిర్ణయం మధురవాణి నిర్వాహకులదే. 

comments
bottom of page