వ్యాస ​మధురాలు

సీ.పీ. బ్రౌన్, తెలుగు తల్లి ఫ్రౌన్, నిజం డౌన్ (మూడవ భాగము)

నెల్లుట్ల నవీన్ చంద్ర

డాక్టర్ నెల్లుట్ల నవీన చంద్ర

క్లుప్తముగా

బ్రౌను కాలము 1825-1855 అని ఇప్పుడందరికీ తెలిసిపోయింది కదా. 1600-1907 వరకూ తెలుగు సాహిత్యములో ప్రసిద్ధులైన కొందరి చిట్టా క్రింద ఇవ్వబడ్డది. వారి కవితా ధురంధరత్వమును గూర్చి మొదటి రెండు భాగాలలో వివరించబడ్డది. చాలా మంది తెలుగు వాళ్ళు వీరి పేర్లు వినే వుంటారు.

1600-1680 క్షేత్రయ్య 

1600-1634 చేమకూరి వేంకటకవి

1684-1712 షహజి I

1763 ముద్దుపలని  

1730 సముఖము వెంకట క్రిష్ణప్ప నాయక 

1762-1827 శ్యామ   శాస్త్రి 

1767-1847 త్యాగరాజ స్వామి  

1807-1861 చిన్నయ సూరి  

1762-1907 గద్వాల సంస్థానపు రాజులు  

తెలుగు సాహిత్యపు భిన్న పోకడల గూర్చి రాస్తూ ఇతిహసాలూ, ప్రబంధాలూ, ద్విపదలూ, కావ్యాలూ, కీర్తనలూ, జానపద గీతాలూ, మీడియా  సాహిత్యమూ, శతకాలూ, చాటుపద్యాలూ , నవలలూ, కథానికలూ, వ్యాసాలూ, విమర్శలూ, ముత్యాల సరాలూ, మహాప్రస్థానము  లాంటి  గీతాలూ, శివతాండవమూ  మొదలైన భంగిమలను ఉదాహరణలుగా చెప్పడమైనది. త్యాగయ్య గారు 1847 వరకూ రాసిన కవిత్వము వీటిలో ఏ ఒక్క ప్రక్రియకూ తగ్గదని నిరూపించబడినది. శ్యామ శాస్త్రి, చిన్నయ్య సూరి కూడా ఇదే కాలము లో తెలుగు సాహిత్యానికి  బ్రహ్మాండమైన సేవ చేసారని తెలుసుకున్నాము. వెలిచెర్ల నారాయణరావు గారు తమ అనువాద పుస్తకములో త్యాగయ్య గారి కీర్తనలు కూడా చేర్చడము విశేషము.  అటువంటప్పుడు 1825 లో తెలుగు సాహిత్యము చచ్చిపొయిందని బల్ల గుద్ది చెప్పడానికి  ధీమా ఒక్క గుండెలు తీసిన బంటుకే కలదు అని చెప్పితే అబద్ధము కానేరదు.ఇంగ్లీషు వాళ్ళలో ఇలాంటి వారు కొంచెము ఎక్కువ మోతాదులో వుంటారేమో!  

“1825 లో తెలుగు సాహిత్యము చచ్చిబడివున్నది నేను ఒంటరిగా 30 ఏళ్ళలో దానిని బ్రతికించాను” అన్న బ్రౌనులో అహంభావము, అజ్ఞానము, అమర్యాద మూర్తీభవించి వున్నాయా అని సందేహించవలసి వస్తున్నది.  తెలుగు మహాభారతము రాయమని రాజ రాజ నరేంద్రుడు  ప్రోత్సహించినప్పుడు నన్నయ్యగారు ఒక పద్యము  రాసారు. భారతము రాయడము ఎంత కఠినమైన పనియో అని నమ్రతగా  చెప్పారు.

అమలిన తారకా సముదయంబులనెన్నను సర్వ వేద శా

స్ర్తముల యశేష సారము ముదంబున పొందను, బుద్ధి బాహు వి

క్రమమున దుర్గమార్థజల గౌరవ భారత భారతీ సము

ద్రము దరియంగ నీదను విధాతృనకైనను నేరబోలునే.

(ఆకాశంలో నక్షత్రాలను లెక్కపెట్టడమూ, అన్ని వేద శాస్త్రాల తరగని సారము ముదముతో పొందడమూ, బుద్ధితో, బాహు విక్రమముతో కష్టముగా లభించే గౌరవప్రదమైన నీటితో నిండియున్న భారత భారతీ సముద్రము దరి చేరుకొనేటట్లు ఈదడమూ, ఆ బ్రహ్మకైనా వీలుపడుతుందా?)

కురుక్షేత్రములో అర్జునునికి శ్రీకృష్ణుడు  సహాయము చేసినట్లు, తనకు నారాయణ  భట్టు సహాయము చేసారని ఇంకొక పద్యము అదేనమ్రతతొ రాసారు. తనను శ్రీకృష్ణుడని వర్ణించుకోలేదు. నన్నయ్య గారి ఈ నమ్రతకు, బ్రౌన్ అహంభావానికి హస్తిమశకంతర భేదము వున్నది కదా!

పాయక పాకశాసనికి భారత ఘోరరణంబునందు నా

రాయణునట్లు, వానస ధరామరవంశ విభూషణుండు, నా

రాయణ భట్టు, వాఙ్మయ ధురంధరుడుం, దనకిష్టుడున్ సహా

ధ్యాయుడు నైన వాడభిమతంబుగ దోడయి నిర్వహింపగన్.  

అయితే బ్రౌన్ ఇలాఎందుకు చేశాడు అని ప్రశ్నించక తప్పదు.తాము లేకపోతే భారత దేశము వుండదనే తప్పు అభిప్రాయము కొందరు ఇంగ్లీషు వాళ్ళకి వుండేది. వాళ్ళు భారత దేశానికి మంచి కంటే చెడే ఎక్కువ చేసారు అని చెప్పుకోక తప్పదు.

అజ్ఞానము

• శ్యామ శాస్త్రి, త్యాగరాజు, ఇంకా ఇతరులు వున్నారని బ్రౌనుకు తెలియదు అని నిర్ధారించి చెప్పవచ్చు.

• చిన్నయ్య సూరిని తన సలహాదారులలో ఉంచుకున్నా ఆయన రాతలను గూర్చి బ్రౌనుకు తెలియదు. వారి గొప్పదనము బ్రౌనుకు తెలియదు.

• 1825 లో తెలుగు చచ్చిపోయిందని అన్నది సత్యము కాదని నిరూపించబడ్డది.

• త్యాగరాజు గారి ఘనత మద్రాసు ప్రెజిడెన్సీ అంతా పాకిపోయింది. బ్రౌను వినలేదు ఆయనను గూర్చి.

• బ్రౌను ఎప్పుడూ వెళ్ళే మద్రాసు ప్రెజిడెన్సీ కళాశాలలో చిన్నయసూరి పాఠాలు చెప్పేవాడు. సూరి కీర్తివంతుడు.

• సూరి గారి బాల వ్యాకరణము (1855) మద్రాసు ప్రెజీడెన్సీ అంతా పాఠ్య గ్రంధముగా ఉపయోగించబడ్డది. బ్రౌన్ కు ప్రాముఖ్యత చెందిన సూరి గారి పుస్తకము తెలవదు. 

• బ్రౌన్ శిష్యులూ, పరశిష్యులూ, ప్రాపర శిష్యులూ కూడా బాల వ్యాకరణం బ్రౌను పుస్తకము (1857) కన్నా ముందే రచించ బడడము నిర్లక్ష్యము చేసారు.

అహంభావము

  • 1825 లో తెలుగు కవిత్వము చచ్చిపోయిందని బ్రౌను అన్నాడు. దీనికి నిరూపణ చూపలేదు.

  • తెలుగు మిణుకు, మిణుకు మంటున్న  దివ్వె యని దానిని గొప్ప జ్యొతిగా 30 ఏళ్ళలో చేశానని దంభాలు కొట్టాడు.

  • త్యాగయ్య కారి కవిత్వపు లోతులు తెలిసిన వారు తెలుగు ఒక అఖండ జ్వాలగా వెలుగుతున్నదని నిస్సంకోచముగా చెప్పగలరు. త్యాగయ్య గారిని గూర్చి తెలుసుకోకపోవడము అహంభావము  కాదా!

  • కాల్ద్వెల్లు అనే స్నేహితుడు, తోడి మిషనరీ అహంభావముతో కూడియున్న బ్రౌను మూఢత్వమును గూర్చి రాసాడు. 

  • అహంభావముగా ప్రవర్తించి తన ఉద్యోగం నుండి తొలగించబడ్డాడు - ఒకసారి కాదు.

అమర్యాద

• తనను తాను తెలుగు ఉద్ధారకుడుగా వర్ణించుకున్న బ్రౌన్ ఈ వర్ణన ఒక అభూత కల్పన అని నిరూపించే సత్యాలను పూర్తిగా నిర్లక్ష్యము చేసాడు.

• తను తెలుగు సంరక్షకుడు అని దుష్ప్రచారము చేసుకున్నాడు.

• తనతో పని చేసిన చిన్నయ్యసూరి గొప్పదనము గుర్తించలేదు.

• తనను తాను మోసగించుకునే గుణంతో తన సిద్ధాంతాన్ని ఖండించే సత్యాలను చాప కిందికి నెట్టాడు.

 

చేసే పధ్ధతి

• వేమన పద్యాలు అనువదించాడు.

• పదాలను, కీర్తనలను అనువదించలేదు. సంగీత పదాలు మత మార్పిడికి వినియోగపడవు. క్షేత్రయ్య మువ్వ గోపాలుడు, అన్నమయ్య వేంకటేశ్వరుడు,శ్యామ శాస్త్రి కంచి కామాక్షి, త్యాగయ్య రాముడు క్రైస్తవ  మతానికి పనికి రారు.

• ఇంగ్లండులో ఎవరు చదువుతారు హిందూ దేవుళ్ళను గూర్చి? హిందూ సంఘాన్ని విమర్శించే వేమన తొందరగా అమ్ముడు పోతాడు .

తెలుగు భాష రెండవ ప్రేయసి

“విశాలాక్షి” సంపాదకుడు ఎతకొట సుబ్బారావు “సాక్షి “ లో బ్రౌను గూర్చి ఇంకొక ఉదంతము రాసాడు. తెలుగుభాష తన రెండవ ప్రియురాలు అనీ, తనకు ఇంకొక తెలుగు వనిత ప్రియురాలు వుండిందని ఒక కథ. మనమంతా తెలుగు భాషని "తెలుగు తల్లి" గా వర్ణించడమేమిటి? ఈ ఆంగ్లేయుడు రెండవ ప్రేయసి గా వర్ణించడమేమిటి? బ్రౌను భక్తులకిది నచ్చుతుందా?

ఎందుకు ఇలా చేశాడు?

రాజీవ్ మల్హొత్రాగారు "డి బాటిలు  ఫరు  సంస్కృత్ " అనే ఉద్గ్రంధము కవరు పై ఆక్స్ఫర్డు విశ్వవిద్యాలయ చాపెలులో వున్న చలువరాతి విగ్రహాల బొమ్మ ఒకటి వేసారు. విలియం జోన్సు ఒక సింహాసనము లాంటి కుర్చీలో, ఒక బల్ల వెనుక కూర్చుండి, పుస్తకములో రాస్తున్నాడు. ముగ్గురు పండితులు నమ్రతగా నేలమీద కూర్చుండి వున్నారు. ముగ్గురు పండితులలో ఒకరు ఏమీ అర్థము కానట్లు పైకి చూస్తున్నారు. మిగిలిన ఇద్దరు తలవంచి నేలపై చూస్తున్నారు. దాని క్రింద రాసి వున్నది: "మహమ్మదీయుల, హిందువుల న్యాయ సూత్రాలను ఆకళింపు చేసుకున్న విలియం జోన్సు". ఈ శిల్పము హిందువులకు ఎంత అవమానకరముగా వున్నదో వివరించి చెప్పాల్సిన అవసరము  లేదు. ఈ జోన్సు మనుస్మృతిని ఇంగ్లీషులోకి చేసి, అది హిందువుల ధర్మశాస్త్రమని చెప్పి, మనకు తీరని అన్యాయం చేశాడు. మనకు నాలుగు యుగాలు ఉన్నవి - ఒక్కొక యుగానికి ఒక ధర్మశాస్త్రము నిర్ణయించబడ్డది. కృత యుగానికి మనుస్మృతి, త్రేతాయుగానికి యాఙ్న్యవల్క్య స్మృతి, ద్వాపర యుగానికి సంఖ-లిఖిత స్మృతి, కలియుగానికి పరాశర  స్మృతి వరుసగా ధర్మశాస్త్రాలు. పాతకాలపు మనుస్మృతి  ప్రస్తుత ధర్మశాస్త్రమని చెప్పడం అజ్ఞానమూ, అనృతమూ, అమర్యాదా. ఈ మూడు గుణాలూ ఈ ఆంగ్లేయులలో మూర్తీభవించి వున్నవి  అనిపిస్తున్నది. జోన్సు మన యుగాలను, కల్పాలనూ, వాటి కాలపు కొలతలనూ ఒప్పుకోలేదు - ఎందుకంటే బైబులు ప్రకారము భూమి ఆరువేల ఏళ్ళ వయసుదే. లక్షల, కోట్ల యేళ్ళు జోన్సుకు అర్థం కాలేదు. పరాశర స్మృతిలో విధవా వివాహాలు ధర్మమని  చెప్పారు అని విరాటపర్వపు మూడవ ప్రవచనములో గరికపాటి నరసింహారావుగారు అన్నారు.

The Second World War: The Hinge of Fate (page 204) అనే పుస్తకములో చర్చిలు ఇలా రాశాడు, "ఒక చిన్న ద్వీపము ఒక పెద్ద హిందూస్తాన్ను రెండవ ప్రపంచ మహా యుధ్ధము నుండి రక్షించింది.” మధుశ్రీ  ముఖర్జీ తన పుస్తకము Churchill’s Secret Wars లో ఇది అబధ్ధమని నిరూపించింది. అస్సలు నిజం ఏమిటంటే పదార్థాలూ, మనుష్యులనూ పెద్ద ఎత్తుగా ఇచ్చి భారత దేశమే ఆ చిన్ని ఇంగ్లండును తన అవసరాలను త్యాగం చేసి రక్షించింది. చర్చిలు ఇండియాను అనేక విధాలుగా నాశనము చేశాడు. వాటిల్లో ఒకటి, అతడు స్వంతముగా బాధ్యత వహించాల్సిన బెంగాలు కరువూ, అందులో చనిపోయిన ముప్ఫై లక్షల మందీ లార్డు చెర్వెల్లు అనే హిందూ ద్వేషి సలహాపై చేయడమే! ఇది హిట్లరు చేసిన హోలోకాస్టు (HOLOCAUST) తో సమానమైనది, ఆ కాలపు ఇండియా యొక్క Secretary of State, Leopold Amery చర్చిల్లును హిట్లరు తో పోల్చాడు, ఆ కాలపు వైసు రాయి వేవెల్లు కూడా ఇదే అన్నాడు.

బ్రౌన్ను జోన్సు తొ, చర్చిలు తో  పోలుద్దాం. 

• సమానాంతర ప్రవర్తన 

• తన సిద్ధాంతాన్ని బలపరచని నిజాలను నిరాకరించడము.

• తానే గొప్పవాడినని అతిశయోక్తులను చాటు కోవడము.

• ఇండియాకు మేలుకంటే హాని చేయడము.

• వీళ్ళకు ధ్వజాలెత్తేవాళ్ళు, అందులో భారతీయులు , స్వగౌరవము లేనివాళ్ళు  కావడము, అత్యంత శోచనీయమైన విషయము.

 

కృతులెన్నో బతికాయి బ్రౌను ప్రమేయము లేకుండా.

నన్నె చోడుని కుమార సంభవం, శ్రీనాధుని అనేక కృతులు, పింగళి సూరన కృతులు, తెనాలి రామకృష్ణుని  పాండురంగ  మహాత్మ్యము, మొల్ల రామాయణము, అన్నమయ్య, క్షేత్రయ్య, చేమకూరి వేంకటకవి రాసిన విజయ విలాసము, శ్యామ శాస్త్రి, త్యాగయ్య, కొన్ని ఉదాహరణలు  మాత్రమే! ఇంకా చాలా పుస్తకాలు  ఇప్పుడు మనం చదివేవి బ్రౌను హస్తాలనుండి తప్పించుకున్నవే. బ్రౌను, అతనితో పని చేసిన పండితులు ప్రచురించిన బహుకొన్ని పుస్తకాలు కూడా అలాగే బ్రతికి వుండేవి. చాలా ఇండ్లలో, గద్వాల వంటి సంస్థానాలలో, గుళ్ళల్లో, తంజావూరు లాంటి రాజ కొలువుల్లో మహా కావ్యాల పుత్రికలు వుండినవి. తాళపత్రాలను తిరిగి రాయించి సురక్షితము చేసిన వాళ్ళూ ఉన్నారు. వాటిని అత్యంత అమూల్యమైన సొత్తుగా భావించిన సాహితీ పరులు గూడ వున్నారు.

ఒక సాహితీ వేత్త అభిప్రాయము    (డా. కృష్ణ కుమారి యజ్ఞంభట్ల)

దేశంలో పాతుకుపోయిన కులవ్యవస్థను బ్రిటిష్ వారు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. అప్పటికే సమాజంలో ప్రచారంలో ఉన్న వేమన పద్యాలు మొత్తం సామాజిక దురాచారాలకు, అస్తవ్యస్తపు వ్యవస్థకు ఎదురు నిలబడినవి. వేమన విమర్శించని కోణం లేదు. తెలుగుదేశంలో వేమన పద్యాలు బ్రిటిష్ వారికి స్వార్ధానికి  బాగా ఉపయోగ పడ్డాయి. వేమన పద్యాలలోని అర్ధానికి, భావానికి మాత్రమే మురిసిపోతే ఆ పద్యాలను పరిష్కరించి తెలుగులో వ్యాఖ్యానం రాయించవచ్చు కదా! కానీ  అప్పటికే వేమన పద్యాలు ఎందరికో నోటికి వచ్చును. వారికి బ్రౌన్ వ్యాఖ్యానం తో పనిలేదు. మరి ఆ ఇంగ్లీష్ వ్యాఖ్యానం ఎవరికోసం?  మత మార్పిడులకు ఆ పద్యాలు వారికి ఉపయోగపడ్డాయి. లభ్యమైన వేమన పద్యాలను సంకలనం చేయించి వాటికి అవగాహన చేసుకొని తన వ్యాఖ్యానంతో అచ్చు వేయించాడు బ్రౌన్. అవి తర్వాతి బ్రిటిష్ వారికి ఉపయోగపడ్డాయి. అతనే చెప్పుకున్నట్లు అవసానదశలో ఉన్న తెలుగు సాహిత్యం  కేవలం బ్రౌన్ వల్ల తలెత్తుకొని నిలబడింది అన్నది అబద్ధం.

ప్రాచీన కాలంలో కూడా కొందరు కవులను సంఘం పట్టపుటేనుగుపై ఊరేగించింది. కొందరిని అసలు పట్టించుకోలేదు. దానికి ఎన్నో సామాజిక, రాజకీయ కారణాలున్నాయి. ఆ కాలంలో చాలామంది కవులకు వ్రాయస కాళ్ళు ఉండేవారు. కవి చెబుతూ ఉంటే వీరు వెంటనే రాసేవారు. అందుకే అటువంటి గ్రంధాలు నిలిచాయి. అయితే ఈ భోగం అందరికి అందుబాటులో లేదు. అందువల్ల ఎన్నో అమూల్యమైన గ్రంధాలు కాలగర్భంలో కలిసి పోయాయి. తెలుగు భాష అంటే ఇష్టమే కానీ మహాకవులు రాసిన వాటిని పరిష్కరించే పాండిత్యం బ్రౌన్ కి లేదు. ఒక భాషతో పరిచయం వేరు, అందులో పాండిత్యం ఉండడం వేరు. తెలుగు ప్రాంతాలలో ఉద్యోగరీత్యా ఉండవలసి వచ్చింది కాబట్టి, స్థానిక భాష రావడం అవసరం కూడా కాబట్టి బ్రౌన్ తెలుగు నేర్చుకున్నాడు. తనకంటే ముందున్న బ్రిటిష్ అధికారి చక్కగా తెలుగు మాట్లాడడం గమనించిన అతడు తెలుగు వచ్చి ఉండడం అధికార్లకు తప్పనిసరి అని అర్ధం చేసుకున్నాడు.

సాహిత్యంలో ఎన్నో ప్రక్రియలు ఉంటాయి వారివారి ఇష్టానుసారం ఆయా కవులు ఆయా ప్రక్రియలను గ్రహిస్తారు. అందులో ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉండవు. త్యాగరాజు కీర్తనలు అద్భుతమైనవి.  త్యాగరాజ స్వామి తానెన్నడూ ఒక పండితుడనని చెప్పుకోలేదు. తనకు రాముని పట్ల గల భక్తిని కీర్తనల రూపంలో వెల్వరించాడు. అయినప్పటికీ ప్రతి కీర్తన సంగీత సాహిత్యాలలో ఆతనికున్న పాండిత్యాన్ని స్పష్టంగా చెబుతుంది . కీర్తన రచన తక్కువ స్థాయిది అనుకోవడం మన అజ్ఞానం.

పరవస్తు చిన్నయసూరి మహా పండితుడు. అతను రచించిన బాలవ్యాకరణం లోని సూత్ర్రాలు వ్యాఖ్యానం లేకుండా వరుసగా చదువుకుంటూ పొతే ఒక కావ్యం చదివినట్లు ఉంటుంది.

నేను మొదటే చెప్పనట్లు భారతీయులకు అందులో తెలుగు వారికి సొంతవారి ఘనకార్యాలు కంటికి కన్పించవు. ఇతరులు చేసిన కాస్త పని కూడా హిమాలయమంత కన్పిస్తుంది. నిజంగా ఇది చాలా శోచనీయం.

అందువల్ల బ్రౌన్ గురించి అతిశయోక్తులు మానేసి అతను తెలుగు భాష అంటే  ఇష్టపడ్డాడు కాబట్టి ఆ భాష నేర్చుకొని తన పరిధిలో కొంత భాషా సేవ చేసాడు అని చెబితే సమంజసంగా ఉంటుంది.

 

ఒక ముఖ్యమైన సూచన:  ఈ వ్యాసము రాసిన తర్వాత చేమకూరి వేంకటకవి రాసిన  విజయ విలాసము, కె.వి. రమణా రెడ్డి రాసిన , మహోదయం  నా దృష్టిలోనికి వచ్చినవి.

  1. కొందరి  అభిప్రాయ ప్రకారము “ఆముక్త మాల్యద”, “మనుచరిత్ర” , “పాండురంగ మాహాత్మ్యము”, “వసుచరిత్ర” లతో పాటు ఈ “విజయ విలాస” కృతిని చేర్చితెలుగు సాహిత్య పంచకావ్యాలుగా గణించడము భావ్యమేనని. ఆయితే కవి సార్వభౌముని “శృంగార నైషధము” కూడా ఈ పంచ మహాకావ్యాలలొ ఒకటని పూర్వ కాలములో అభిప్రాయపడడము  జరిగింది. ఏది ఏమైనా ఈ అయిదుగురు మహాకవుల కోవకు చెందిన చేమకూరి గారి కాలము 1600-1634 అని నిర్ణయించబడ్డది. అందుచేత ఈయనను  కూడా మన 1600-1861 లిస్టులో చేర్చవలసి యున్నది. బ్రౌనుకు ఈ మహాకవి పేరు కూడ తెలుసునా? తెలిస్తే “విజయ విలాసము” ను ఎందుకు ఉధ్ధరించలేదు? అని అడిగితే నాగరిక నాజూకుతనానికి తలవంపులు జరుగవుకదా?

 

  1. గురజాడ అప్పారావు గారు చిన్నయ్యసూరి రచన master piece అంటూ, ఆయన అభిరుచి మెచ్చదగింది అంటూ, "The faults which Chinnaya Suri avoided by correct taste rare among Telugu Pandits....” అని పొగిడారు. (కె.వి. రమణా రెడ్డి, మహోదయం, జనవరి 2012, పేజీ.55, italics are mine). మనమంతా శ్రీ శ్రీ మహాకవి అని ఒప్పుకొంటాము. ఆయనే గురజాడ అప్పారావును మహాకవి అని తిక్కన గారితో సమానులని అన్నారు. అప్పారావు చిన్నయసూరి రచన (ఇంకొక సారి)  “master piece” అని అన్నారు. చిన్నయసూరిని తీసివేసిన  బ్రౌను, అతని భక్తులు ఏమంటారు దీనికి?

 

తుది మాట

భారతదేశంలో ఇప్పుడు మన ప్రాచీన సంస్కృతి, చరిత్ర గూర్చి ఎన్నో అబధ్ధాలను ప్రాపకం చేస్తున్నారు. ప్రెస్సు, టీ.వీ., రేడియోల ద్వారా దుష్ప్రచారము ఎక్కువైపోయింది. మనము నిద్ర లేచి మన సాంప్రదాయలను కాపాడుకోకపోతే వినాశనమే జరుగనున్నది. మన దేవతలను గూర్చి, మన చరిత్రను గూర్చి, సాహిత్యాన్ని గూర్చి, మన విజ్ఞానశాస్త్రపు, గణితపు, లోహ పరిశ్రమపు, వస్త్ర పరిశ్రమపు, ఓడల పరిశ్రమపు, వైద్యశాస్త్రపు ఇంక అనేక ఇతర రంగాలలో మన ప్రతిభ, ప్రగతి కొట్టి పారేస్తున్నారు. ఇదంతా  భారతీయుల సహకారంతో జరుగుతున్నది. ఎన్నో పుస్తకాలు రచించబడ్డాయి భారతదేశాన్ని ఎలా కించపరిచారో అని తేటతెల్ల పరచడానికి. 1750 వరకూ అంటే ఆంగ్లేయులు ఇక్కడ లోతుగా స్థిరపడక ముందే మన దేశము ప్రపంచపు జీ.డీ. పీ. లో 22% వాటా వుండేది, ఇంగ్లండు 2% కన్నా తక్కువే. 1947 లో వాళ్ళు వదిలిపెట్టినప్పుడు మనది 2% అయింది వాళ్ళది 22% అయింది. ఇంత ఘోరమైన దొంగతనము ఎక్కడ, ఎప్పుడూ జరగలేదు. 1857 లో మన మూడు పరిశ్రమలనూ ధ్వంసము చేసారు సామ్రాజ్య వాదులు. ఐనా ఇప్పటికీ చాలా మంది కళ్ళు తెరవలేదు. నా ఈ చిన్ని ప్రయత్నము తెలుగు వాళ్ళ గొప్పదనము మీ ముందు ఉంచాలనే ఉద్దేశ్యముతో చేశాను. మన చరిత్రపు అట్టడుగున పడివున్న నిజాలను బాహాటంగా బహిర్గతం చేయడమే నా సంకల్పం. ఇందులో నేను ఎంత కృతకృత్యుణ్ణి అయ్యానో చదువరులే చెప్పగలరు. జై హింద్! తెలుగు తల్లికి జయము కలుగు గాక!

***

 

మీ అభిప్రాయాలు తెలుపుటకు క్లిక్ చేయండి...click here to post your comments...

 

డాక్టర్ నెల్లుట్ల నవీన చంద్ర

నెల్లుట్ల నవీన్ చంద్ర గారి జన్మ స్థలం వరంగల్ నగరం. పుట్టిన తేదీ డిశంబర్ 17, 1941. ఉస్మానియా, ఎడ్మంటన్ -ఆల్బర్టా (కెనడా) లలో విద్యాభ్యాసం. Ph. D. (Physics) పట్టా పొందారు. భారత, కెనడా, బ్రజిలు, మొజాంబిక్  దేశాలలో పరిశొధకులు, అధ్యాపకులు, భూతత్వ-భూభౌతిక శాస్త్రఙులుగా పనిచేసి రిటైర్ అయ్యారు. తెలుగు రచయితగా కథలూ, గేయాలూ, వ్యాసాలూ, సైన్సు పుస్తకాలూ రచించారు.
ఆయన చిన్నపిల్లల కోసం రచించిన Big Bang, Floating Continents, Life on Earth పుస్తకాలు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. తోట పనిలో సిద్ధహస్తులుగా టొరాంటో నగర బహుమతి పొందారు. 
Toronto Dharma Group ఉపన్యాసకులు. సంస్కృత, హిందీ భాష అధ్యాపకులు.సాంఖ్య-వైశెషిక అనుచారులు.గౌతమ బుద్ధునిపై ప్రీతి. కపిల మహర్షి ప్రాపర శిష్యులు. భగవత్ గీత,  ఉపనిషత్తులు ఇంగ్లీషులోకి అనువదించారు. తెలుగు భాష అంటే ప్రాణం. ప్రస్తుత నివాసం టొరాంటో, ఆంటేరియో, కెనడా.