top of page

ఆహ్వానిత మధురాలు

నా డైరీల్లో కొన్ని పేజీలు...ఎన్. టీ. ఆర్ జ్ఞాపకాలు

గొల్లపూడి మారుతీ రావు

1971 జనవరి 10: ఎన్. టీ. ఆర్ పుండరీకాక్షయ్యగారితో అన్నారట: మారుతీరావుగారు ఏక్షన్ సబ్జెక్ట్ అంతబాగా చెప్తారనుకోలేదు-అని. "మధ్యాహ్నం అవుట్ డోర్ షూటింగ్ దగ్గరికి రాకూడదా? తీరికగా మాట్లాడుకుందాం" -అన్నారు ఎన్.టీ.ఆర్.

అక్కినేనికీ, ఎన్.టీ. ఆర్  కీ మధ్య ప్రచ్చన్న యుద్ధం జరుగుతున్న రోజులు. కారణాలు అనవసరం. ఇద్దరూ రెండు మేరుశృంగాలు. క్రమశిక్షణకీ, అకుంఠితమైన కార్యదక్షతకీ పెట్టింది పేరు.

రాయపేటలో పాత ఉడ్ లాండ్స్ హోటల్లో కూర్చుని పూర్ణచంద్రరావుగారికి అక్కినేనితో తీయవలిసిన 'రైతు కుటుంబం' కథను తయారు చేస్తున్నాం. మరొక పక్క హైదరాబాదులో అక్కినేని నటిస్తున్న 'ఆత్మీయులు ' షూటింగు జరుగుతోంది. సారధీ స్టూడియో నిర్మిస్తున్న చిత్రమది. ఆ కథ విని- "దీనికీ మారుతీరావుగారు రాస్తున్న "రైతుకుటుంబం" చిత్రంలో కొన్ని సంఘటనలకీ దగ్గర పోలికలు ఉన్నాయి."- అన్నారట అక్కినేని. "ఆత్మీయులు" స్క్రిప్టు పని దుక్కిపాటి మధుసూధనరావుగారు చూస్తున్నారు.  వెంటనే సారధీ స్టూడియోస్ పార్టనర్ జి.డి. ప్రసాదరావుగారు (సినీనటుడు, మిత్రుడు నారాయణరావు తండ్రి) మద్రాసు వచ్చారు. ఆనాటి సత్సంప్రదాయాలు అవి. ఇద్దరు నిర్మాతల కథలలో పోలికలుంటే- ఇద్దరూ కలిసి కూర్చుని కొత్తదారులు వెదుక్కునేవారు. కాగా, నేను రెండు కంపెనీలకూ సన్నిహితుడిని. తీసేది అక్కినేని చిత్రం. మర్నాడే నన్ను హైదరాబాదు బయలుదేరదీశారు ప్రసాదరావుగారు. మరొక పక్క ఎన్.టీ..ఆర్ కి పుండరీకాక్షయ్యగారి కంపెనీకి కథలు తయారు చేస్తున్నాను. అప్పటికి రెండు కథలు అనుకున్నాం. 


ఆ రాత్రి సారధీ స్టూడియోలో మా గురువుగారు దుక్కిపాటి గదిలోనే ఉండి- రెండు కథలలో పోలికల్ని గుర్తుపట్టి సవరించాం. మర్నాటి ఉదయమే నా తిరుగు ప్రయాణం. పుండరీకాక్షయ్యగారు మద్రాసు విమానాశ్రయంలో కలిశారు. ఏదో అవసరమైన పనిమీద ఎన్.టీ.ఆర్ వారిని హైదరాబాదు పంపుతున్నారట. మరి ఆయన కథలు? "మారుతీరావుగారి దగ్గర నేను వింటాను" అన్నారట ఎన్.టీ.ఆర్. ఆయనే రెండు మూడుసార్లు అడిగారట- కథ ఎలా వస్తోంది అని. తర్వాత రెండు రోజులూ బలరాం (పుండరీకాక్షయ్యగారి తమ్ముడు) కొడుకు బాబు నన్ను ఎన్.టీ.ఆర్ దగ్గరికి తీసుకెళ్ళారు. ఆయనతో ఉదయపు సమావేశం ఒక అపూర్వమైన సంఘటన. వారి దగ్గరకు వెళ్ళటమంటే పొద్దుటే దేవాలయానికి వెళ్ళిన అనుభూతి. ఉదయం నాలుగు గంటలకి సమావేశం. మేం  వెళ్ళేసరికి- ఆయన పెద్ద లోటాతో టీ సేవిస్తూ ఉండేవారు. ఎదురుగా భార్య బసవతారకంగారు కూర్చుని ఉండేవారు. బహుశా ఆయన రద్దీ జీవితంలో వారిద్దరూ ఏకాంతంగా కూర్చునే సమయం అదేనేమో. మేం రాగానే ఆమె వెళ్ళిపోయేవారు లోపలికి. చక్కగా పట్టుపంచె కట్టుకుని, గదంతా ఊదొత్తుల పరిమళం వ్యాపిస్తూండగా పవిత్రంగా కూర్చునేవారు రామారావుగారు. కథని వినడం ఆషామాషీగా కాదు. ఆయన కెరీర్ కి సంబంధించిన విషయం. ఏ కారణం చేతనయినా మేం కథలో మార్పు చేస్తే - ఆరునెలల తర్వాతయినా ఇట్టే గుర్తుపట్టేవారు. "క్రితంసారి హీరో స్కూలు టీచరని చెప్పారు?" అని ఆపేవారు. అదీ ఆయన ఏకాగ్రత. రామాయణం తీసే రోజుల్లో స్క్రిప్టుని ఆయన తన సొంత చేతుల్తో రాసుకుని , స్క్రీన్ ప్లేనీ అంతే వివరంగా రాసుకునేవారు. మేం వెళ్ళాక మొదటి గంట సేపు రామాయణం కథ, వివరాలు, తప్పనిసరిగా ఆ డైలాగుల నటన ఉండేది. ఇది మాలాంటివారికి అరుదైన అవకాశం. తర్వాత మా కథ. ఆయనతో చర్చ ముగిసి బయటకి వచ్చేసరికి ఇంకా మద్రాసు నగరం నిద్రపోతూనే ఉండేది. మనిషి నూరేళ్ళు బతకడమంటే కాలాన్ని సాగదీయడం కాదు... కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం. ఆ విధంగా ఒక జీవితకాలంలో అనితర సాధ్యమైన కృషిని చేసి- రెండు రంగాలు- సినీ, రాజకీయ రంగాలలో ఉన్నత శిఖరాలని అధిరోహించిన వ్యక్తి రామారావుగారు. 


మొదటి రోజు 'వారాలబ్బాయి' కథని చెప్పాను. అది సెంటిమెంటు ముద్ద. చాంతాడంత కథ. దీక్షగా విన్నారు. మరునాడు ఒక క్రైం కథని చెప్పాను. అలాంటి కథకి చిన్న చిన్న మెలకువలనూ చెప్పుకు పోవాలి. నేనెప్పుడు కథ చెప్పినా- తన అభిప్రాయాన్ని వెంటనే చెప్పేవారుకాదాయన. చిన్న చిరునవ్వు నవ్వి ఊరుకునేవారు. అంత బాగా చెప్పాక- తన వివరణ క్రూరంగా ఉంటుందని భావించేవారు. నిర్మాతకి తన అభిప్రాయాన్ని వివరించేవారు. దరిమిలా-'వారాలబ్బాయి ' కథే భాస్కర చిత్ర వారి మొదటి చిత్రంగా రూపుదిద్దుకుని విజయదుందుభిని మోగించింది.- "మనుషుల్లో దేవుడు"గా! విచిత్రంగా క్రైం కథని ఎప్పుడూ ఎవరూ నిర్మించలేదు. విచిత్రమేమిటంటే రామారావుగారికి క్రైం కథ నచ్చింది. ఆయనకి నచ్చిన కథని తప్పనిసరిగా వారి తమ్ముడు త్రివిక్రమరావుగారు వినేవారు. ఆయనకి 'వారాలబ్బాయి ' నచ్చింది. ఎట్టకేలకు ' వారాలబ్బాయి ' పట్టాలెక్కింది. 


ఆ రోజు మధ్యాహ్నం మరొక మరుపురాని సంఘటన- రామారావుగారు స్వయంగా కారు నడిపి నన్ను తీసుకువెళ్ళగా జి.ఎన్.చెట్టి వీధిలో ఒక నర్సింగ్ హోం లో ఉన్న ప్రముఖ రచయిత పింగళి నాగేంద్రరావుగారిని చూడటానికి వెళ్ళాము. అదే నేను మొదటిసారీ, ఆఖరుసారీ నాగేంద్రరావు గారిని చూడడానికి వెళ్ళాం. ఆయన కేన్సర్ తో బాధపడుతున్నారనుకుంటాను. వారి సోదరి అక్కడ ఉన్న గుర్తు. రామారావుగారిని చూసి ఆయన మంచం దిగారు. కాస్సేపు మాట్లాడి బయటికి నడిచాం.

ఆ రోజుల్లో అతి తరుచుగా రామారావుగారిని కలుస్తూండేవాడిని. అక్టోబరు 20న గుర్తుండిపోయే మరో సంఘటన. "తాతమ్మ కల" అనే ఇతివృత్తాన్ని సినీమాగా తీస్తున్నట్టు వివరించారు. మాటల్లో- నేను ఉద్యోగానికి రాజీనామా చెయ్యాలనుకుంటున్నట్టు చెప్పాను. ఒక్క క్షణం సూటిగా చూశారు."మీ జీతమెంత?" అని అడిగారు. చెప్పాను. ఒకనాడు ఆయనా ఉద్యోగాన్ని వదులుకుని సినీమా రంగానికి వచ్చినవారే. "కాస్త ఆలోచించి చెయ్యండి. ఇక్కడ ఎవరినీ నమ్మడానికి వీల్లేదు. అంతా గొర్రెదాటు వ్యవహారం" అన్నారు. 


ఇద్దరం ఆయన గది బయటకి వచ్చాం. మేకప్ మాన్ పీతాంబరం వచ్చారు. పక్కనే మేకప్ గది. అటు తర్వాత తిరుపతి ప్రయాణికుల రద్దీ. అది దైనందిన కార్యక్రమం. బయట వసారాలో ఇద్దరం నిలబడ్డాం. నేను వెళ్తే ఆయన మేకప్ కి కూర్చోవాలి. నేను వెళ్ళడం లేదు. ఆయన వెళ్ళమని చెప్పడం లేదు. చిరునవ్వులతో నిలబడ్డాం. ఎట్టకేలకు "పదండి. మళ్ళీ కలుద్దాం" అన్నారు. అప్పుడిక తప్పనిసరయి చెప్పాను- ఆయన నా చెప్పులు తొడుక్కుని నిలబడ్డారు. రామారావుగారు చూసుకున్నారు. నవ్వేశారు. ఎవరి చెప్పుల్లోకి వారు మారాం. After all, I can't afford to be in his shoes. 
 

*****

మీ అభిప్రాయాలు తెలుపుటకు క్లిక్ చేయండి...click here to post your comments...
 

Bio

గొల్లపూడి మారుతీ రావు

గొల్లపూడి మారుతీ రావు: గొల్లపూడి మారుతీ రావు గారి పేరు తెలియని తెలుగు వారు ఉండరు అనడం అతిశయోక్తి కాదు. గొల్లపూడి మారుతీరావు గారు సుప్రసిద్ధ రచయిత, నటుడు, సంపాదకుడు, వ్యాఖ్యాత, విలేఖరి.  తెలుగు సినిమా రంగంలో మాటల రచయితగాను నటుడిగానూ సుపరిచితులు. శతాధిక నాటకాలు, కథలు, నవలలు, వ్యాసాలు, కవితలూ రాశారు.  రేడియో ప్రయోక్తగానూ, అసిస్టెంట్ స్టేషను డైరెక్టరుగానూ, ఆంధ్రప్రభ (దినపత్రిక) ఉపసంపాదకుడిగానూ పనిచేశారు. సినిమా రంగంలో ఆయన మొట్టమొదటి రచన డాక్టర్ చక్రవర్తి కి ఉత్తమ రచయితగా నంది అవార్డుతో బాటు మరో మూడు నందులు అందుకున్నారు. తెలుగు సాహిత్యంపై ఆయన వ్రాసిన పరిశోధనాత్మక రచనలు, నాటకాలు ఆంధ్రప్రదేశ్ లోని విశ్వవిద్యాలయాల్లో పాఠ్యాంశాలుగా ఉపయోగపడుతున్నాయి. విజయనగరంలో జన్మించిన మారుతీ రావు గారి ప్రస్తుత నివాసం విశాఖపట్నం. ప్రపంచవ్యాప్తంగా శతాధిక పురస్కారాలు అందుకున్నారు.

***

Comments
bottom of page