top of page

“దీప్తి” ముచ్చట్లు

కిచిడీ కబుర్లు!

Deepthi Pendyala, madhuravani, Deepthi Pendyala madhuravani

దీప్తి పెండ్యాల

                                                 వేసవి సెలవుల్లో...  అలా అమ్మమ్మ వాళ్ళూరికి వెళ్ళినప్పుడు- వేకువనే... తాతయ్య చెప్పే వింతలు వింటూ వ్యాహ్యాళికి వెళ్ళటం చాలా సరదాగా ఉండేది.  ప్రభాత వేళలో మెత్తటి పచ్చిక బయళ్ళపై నడుస్తూ... దూరంగా గుడిలోంచి సుప్రభాతంతో పాటుగా తేలి వస్తున్న జేగంటల సుస్వరతరంగాలలో ఆరోహణలని ఆలకిస్తూ... రాత్రి కురిసిన వర్షం లో తడిసిన పూరెక్కలపై నిలిచిన నీటి బిందువులని అబ్బురంగా చూస్తూ... అదే వర్షంలో తడిసిన మట్టి వెదజల్లే పరిమళాలని ఆఘ్రాణిస్తూంటే..."  చెబుతూ మధ్యలో ఆపి చూసాను ... నా ఫ్రెండు శ్వేత ఈ సోదంతా వింటుందా లేదా అని. ఫర్లేదు. ఆ యప్పు టి.వి. లో వస్తున్న "మరమరాలు - మట్టిదిబ్బలూ" షో పై లేదు తన దృష్టి... నా మాటలే ఆసక్తిగా వింటోంది.

 

"ఆపేశావేంటి, చెప్పూ!" మోచేత్తో పొడిచేసరికి... నా  తరుణ్యావలోకనం... కంగారు పడకండి. అంటే… మరి... సింహం చేస్తే సింహావలోకనం అంటారు కదా... మరిక్కడ అవలోకించింది పదహారణాల తరుణీమణిని కదా! అదన్నమాట!... ఆ అవలోకనం ఆపేసి... మళ్ళీ కొనసాగించాను..

 

ఎక్కడున్నాను...? ఆ...  "ఆ మట్టి వాసన ఆఘ్రాణిస్తూంటే... అప్పుడప్పుడే లేచి పనుల్లోకెళ్ళేవారు... శ్రమైక జీవన సౌందర్యానికి అద్దంలా... అచ్చంగా... స్వచ్ఛంగా నవ్వుతూ ఏవో ముచ్చట్లు చెప్పుకుంటూ... పొలాల వైపు వస్తుండేవారు. ఆ నవ్వుల్లో సహజత్వం ఆకట్టుకొనేదేమో... కాస్త ఆసక్తిగా గమనించేదాన్ని... ఓ సారిలాగే పడుచమ్మాయిలు- పేడని గోడకేసి కొట్టటం చూశాను. ఇలా తీసి, అలా... , అలా... భలే లాఘవంగా వేసేవారులే! ఫాట్ ఫాట్ మని గోడకి వేసేవారు..."

                                               

                                                 మళ్ళీ అవలోకనం కోసం శ్వేత వైపు చూస్తే అది మొహం వికారంగా పెట్టింది. "ఏంటే, అలా పెట్టావు? ఆముదం తాగినట్టు? ప్రెసిడెన్షియల్ క్యాంపెయినింగ్-2016 చూస్తున్నట్టూ?" వెంటనే అందుకుంది... "మరేంటే...?  ఈ పిడకల గోలేంటి? ఎంచక్కా... ప్రభాత సమయం, గుడిలో జేగంటలు... ఇలా 'గుర్తుకొస్తున్నాయి '  మూడ్ లోకి తీసుకువెళ్ళి మంచి నాస్టాల్జిక్ ముచ్చట్లు చెబుతావని ఆసక్తిగా వింటూంటే...?!.."

 

                                                        "కదా! మరి నేనూ ఆసక్తిగా ఆ ఆస్కార్ పురస్కారాలకొచ్చిన స్టార్లలో ఎవరు అత్యంత చెత్తగా డ్రెస్సప్పు అయ్యారూ అని దీక్షగా చూస్తుంటే... ఠక్కున వచ్చి ఆ "మరమరాలు- మట్టిదిబ్బలూ" ప్రోగ్రామేదో పెట్టావా?! అందులో ఆంటీలు యాంకరమ్మ పరిచయం చేస్తుంటే... అడ్డమయిన పాటలకీ... ఏవో పిచ్చి స్టెప్పులు వేసుకుంటూ ... అందునా... ప్రతీ ఒక్కరూ...  ఒక్క స్టెప్పు మాత్రం... అస్సలు మిస్సవట్లేదు చూడు.  అరచెయ్యితో  ఎవరి చెంపో టెంపోలో పగలకొడుతున్నట్టుండే ఆ స్టెప్పు చూడు... ఎప్పుడో మన  చిన్నప్పుడు- చోటే మియా ‘గోవిందా’ కామెడీ కోసం చేసినట్టు గుర్తు... భూమి గుండ్రంగా ఉందని ఋజువేమో! తిరిగి అదే ఇప్పుడు మహా పాపులర్ పాప్ స్టెప్పు గా మారింది మన ప్రాణాలకి… అది చూస్తే అలా... అలా... ఫ్లాష్ బ్యాక్లో నా చిన్ననాట నా కోడి మెదడులో నిక్షిప్తమయిన ఆ అపురూపమయిన భంగిమలు గుర్తొచ్చాయి. నిజం! వాళ్ళు ఇదే స్టెప్పుని గ్రేస్-ఫుల్ గా... లాఘవంగా చేసేవారు పిడకలు వేసేప్పుడు! మళ్ళీ చూసి చెప్పు? నాదా తప్పు?!  అచ్చం పిడకలు కొడుతున్నట్టు లేదూ?" అమాయకంగా అడిగాను…

 

నన్ను కాస్త తేరిపార చూసి... అనుమాన నివృత్తి కోసం మా శ్వేత... వెనక్కి వెళ్ళింది... "వీడియో ఆన్ డిమాండ్ ఫీచర్ పుణ్యమాని ఇదో సౌలభ్యం. ఓపికుంటే ఒకే ప్రోగ్రాం మళ్ళీ మళ్ళీ చూసి తరించొచ్చు!  మునుపైతే టీ.వీ. లో వస్తుంటే రివైండు చేసుకోవటానికి అవకాశమెక్కడిదీ? అలా... రివైండు చేసి చూస్తూ... ఒక దగ్గర ఆపి! స్టెప్పు...ని మళ్ళీ, మళ్ళీ చూస్తూ... కడుపు పట్టుకుని నవ్వుతూ... తను కూడా ఆ స్టెప్పు వేసి చూస్తూ... శ్వేత నవ్వాపుకోలేకపోయింది. నానా ప్రయాస పడుతుంది... ఆ భంగిమ అచ్చు అలాగే అభినయించటానికి!

"ఈ స్టెప్పు గురించేనా నువ్వన్నది... ఇప్పుడు పేద్ద ఫ్యాషన్ తెలుసా... నీ పుణ్యమా అని... జన్మలో నేనిక ఏ డ్యాన్సులో కూడా ఈ స్టెప్పు వేయకుండా చూడాలేమో ఇప్పుడు..." ఆ భంగిమ చూపిస్తూనే అంది.  నిజం చెప్పొద్దూ.... శ్వేత ఏది అభినయించినా కామెడీ నవ్వు రాదు! మందహాసం చేరుతుంది పెదాలపై! అవును... శ్వేత మంచి డ్యాన్సరు, కొరియోగ్రాఫరు. శాస్త్రీయ నృత్యమే కాక  సినిమా పాటలకీ... చక్కగా డ్యాన్సు చేస్తుంది. ఎలిగెంటుగా, గ్రేస్ ఫుల్ గా... ముచ్చటగా చేస్తుంది. పాటలూ… అతి జాగ్రత్తగా ఎన్నుకుంటుందేమో... అసలు ఏ సినిమా పాటా... తను డ్యాన్స్ చేస్తుంటే ఎబ్బెట్టుగా అనిపించదు. ఎంతమంది అభిమానులో తన అభినయానికి! ఎన్ని ప్రశంసలో తన ప్రదర్శనలకి...! మరదీ... నాట్యమంటే...!

 

నవ్వాపి సోఫాలో కూలబడ్డ శ్వేతతో అదే అనేసి..., “పాపం... ఈ ‘మట్టి దిబ్బలు’ ప్రోగ్రాంలో వీళ్ళు చేస్తేనేమో... ఇలా పిడకకొట్టుడు మరి!  ఇంతా చేస్తే... ఆ అతిథులకి అంతలా అవస్థ పడుతూ డ్యాన్సు చెయ్యాలనేమీ ఉండదు. కాకపోతే అదో సరదా చానళ్ళ వాళ్ళకి. అద్దెకు తెచ్చుకున్న సరదా...! వాళ్ళ సరదా కాస్తా వీళ్ళని తిప్పలు పెడుతుంది. పోనీ... కాస్త అందంగా, హుందాగా... వయసుకి తగినట్టు... వాళ్ళనీ ఇబ్బంది పెట్టకుండా చేయించొచ్చు కదా! అబ్బే! అలాంటి కర్టసీ ఉంటే కమర్షియల్ గా పెరగాల్సిన రేటింగులకి ఇబ్బందో... మరేంటో?!”

                                        కిచిడీ లోకి వెజెటబుల్స్ తరుగుతూ... నాపాటికి నేను  మాట్లాడుతూంటే... తలపై ఏదో వాలుతున్నట్టనిపించి, విదిలించి అవలోకనకై చూస్తే... శ్వేత సీరియస్ గా నా జుట్టుకేసే చూస్తుంది. వాలినట్టనిపించింది ఈ చూపులన్న మాట అనుకొని ... ఆ మాటే అన్నాను శ్వేతతో... 

“కౌశిక మహాముని లా అంత పవర్ఫుల్ చూపులేంటే తల్లీ?! నా జుట్టుపై నిజంగా ఏదో వాలినట్టయితే విదిలించుకున్నాను కూడా! తీరా చూస్తే నీ చూపులు అక్కడే ఉన్నాయి?” 

శ్వేత తమాషాగా తలెగరేసి.... “మరీ చెబుతావే నువ్వు...! నా చూపులకంత పవరేడ్చిందా?! అవునూ ఆ కౌశిక ముని స్టోరీ ఏంటీ? అది చెప్పు, మొదలు !” అంది.

“నీకు తెలిసే ఉండాలి. మర్చిపోయావేమో?! విను అయితే ... ఒకప్పుడు కౌశిక మహాముని చాలా పేద్ద తపస్సు చేసి దివ్య శక్తులు సంపాదించాడట. ఒకసారిలాగే నదీ స్నానం చేసి వస్తుంటే... ఒక పక్షి... అధికాచమనం చేసిందట. ఫ్రెష్షుగా స్నానం చేసాక అలా చేస్తే ఎవరికి మాత్రం కోపం రాదు?! అందుకే ఒక్క చూపు చూడగానే కంటి చూపుతో... ఆ పక్షి మల మలా మాడిపోయిందట. అంటే… దగ్ధమయ్యిందట. తన చూపుకు ఆ శక్తి ఉందని తెలుసుకున్నాక  కౌశికుడు...తాను చాలా గొప్పవాణ్ణని... అహంకారానికి లోనయ్యాడట. 

ఆ తర్వాత... ఒక ఇంటికి భోజనానికి అతిథిగా పిలిచారాయన్ని... వడ్డించటానికి ఆ గృహిణి ఎంతకీ రావట్లేదు. ఓ వైపు ఆకలవుతుంది... కానీ, ఆ అమ్మాయేమో  -- పాపం ఏదో జబ్బుతో బాధపడుతున్న భర్తకి సేవ చేస్తూ ఈ జాప్యం చేసింది. అది తెలీని... కౌశికుడు... ఆగ్రహించాడు. ఆ సాధ్వి రాగానే... కోపంగా ఆ అమ్మాయిని మాడ్చేలా చూశాడట. ఆ అమ్మాయి మాత్రం చిరునవ్వుతో కౌశికుడినే చూస్తుందట. అంతే కాకుండా... శాంతంగా...... " మీరు కంటిచూపుతో కాల్చేయటానికి నేను ఆ పక్షిని కాదు. పతిసేవలో జాప్యం జరిగింది." అంటూ వడ్డించటం మొదలుపెడితే... కౌశికుడు ఆ సాధ్వీమణి కి నమస్కరించి... ఎంత అజ్ఞానంగా, అహంకారంతో ప్రవర్తించానా అని పశ్చాత్తాపపడి....  అహంకారాన్ని, క్రోధాన్ని విడిచిపెట్టి సాత్వికంగా మారుతారన్నమాట.  ఇదీ స్టోరీ! 

అంతా విని సాలోచనగా అంది శ్వేత..." మన బాలయ్య బాబు కంటిచూపు డైలాగ్ ఇన్స్పిరేషను కౌశికుడన్నమాట"  చిత్రంగా కళ్ళు తిప్పుతూంటే నవ్వాగలేదు. 

“అది డైలాగ్-రైటర్ రాసింది కదా! ఐతే అయ్యుండొచ్చు! కానీ ఈమధ్య... బాలయ్య సొంత వదులు గొంతుక నుంచి… ఏ ఇన్స్పిరేషన్ లేకుండా వచ్చే డైలాగులకి మాత్రం  ఆగ్రహంతో బి.పి.అమాంతం పెరిగిపోయి... పెరిస్పిరేషనూ వస్తుందని టాక్!... “ స్టవ్ ఆన్ చేస్తూ అన్నాను!

శ్వేత మధ్యలో ఆపి..."పోనీలేవే... మన వానర సేనలు మాల్ నుంచి వచ్చేలోపు ప్రశాంతంగా మరేదయినా మాట్లాడుకుందాము... ఈ టాపిక్స్ వద్దులే!...” అంది! 

                                 “ఇంతకీ… నీ చూపులెందుకు నా తలపై వాల్చావో చెప్పనే లేదు...?“ అసలు ప్రశ్న గుర్తొచ్చి… కుతూహలంగా అడిగాను...
“ఓ అదా?! నీకీమధ్య ఇన్ టాలరెన్సు పెరుగుతుంటే ఎందుకలా అని... కొంపదీసి తెలివేమయినా పెరుగుతుందేమో అని... మెదడు సైజు పెరిగిందా అని చూస్తున్నానంతే!” అంది కొంటెగా నవ్వుతూ…! 

"ఏంటీ... ఇన్ టాలరెన్సా!" అని  అనగానే ...

అనుమానంగా చూస్తూ … “అవునే, ఇన్ టాలరెన్స్ అన్నాను కానీ... ఇప్పుడు... ఇండియాలో జరుగుతున్న, ఇన్ టాలరెన్స్ మీద నువ్వు బాధపడ్డం మొదలుపెట్టి మూడ్ ఆఫ్ చేసుకోవు కదా!?" అలర్టయిపోయింది... శ్వేత!

            

                                                “లేదు లేవే! మనం చాలా టాలరెంట్. అలాంటి వందల ఇష్యూలు వస్తాయి, పోతాయి... . అలాంటి చిన్న విషయాలు పట్టించుకుంటామా?! అసలే… మనం సెక్యులర్ వాదులము!  సెక్యులర్ వాదులంటే... ఎలా ఉండాలి? ఆ ఒక్క మతం తక్క... ఏదీ...? మనదే... ఆ ఒక్క మన మతం తప్ప... మిగతా మతాలన్నిటినీ గౌరవించాలి. మరి, సడన్ గా... అన్నిటినీ గౌరవించినట్టే... అచ్చంగా అలాగే...ఫర్ ఏ చేంజ్, ... మన దేశాన్ని, మతాన్ని... గౌరవిస్తామంటే... ఊరుకుంటారా? ‘ఠాఠ్! మీరిలా ఇన్ టాలరెంట్ అవటానికి వీల్లేదంతే!’ అనేస్తారు. 

అందునా... ఇలాంటి ఇష్యూలు కూడా మంచివే! ఎంచక్కా...కొత్త విషయాలు నేర్చుకోవచ్చు! ఇప్పుడు చూడు... ఇన్నాళ్ళూ మనం... మన మతం మాత్రమే గౌరవించబడనిది- సెక్యులరిజం అనుకున్నామా? కాదట... మన మతంతో పాటు దేశాన్ని, జెండానీ... గౌరవించడమూ తప్పేనట! అది తగని పని అట! ఇన్నాళ్ళూ...లౌకికవాదంలోని ఓట్లలౌక్యం పట్టేసినవారికి మనలాంటి మాలోకాలు ఎంత లోకువో అనుకున్నామా? మనమే కాదు తీరి తింటున్న దేశమూ తెగ లోకువనీ తెలిసింది!-. ఐతేనేమి?! అబ్బే! ఇలాంటివి వస్తూంటాయి, పోతూంటాయి. మన మూడ్ పాడు చేసుకోవటమెందుకూ... మనం ఏదయినా మూవీ చూద్దాము. మన వాళ్ళు వచ్చేలోపు." 

శ్వేతకి నవ్వొచ్చింది..." అదే మరి!... మూవీ చూడటం కాదు కానీ… మనం మార్చడానికి లేదు కదా సిస్టం ని!... ఎందుకీ చర్చ...అని నా ఫీలింగు. అంతే! "

“నిజమే లేవే! ఇలా వాపోతే వచ్చేదేముందీ... ఆలోచిస్తే మెదడూ,  వ్రాయటం మొదలెడితే చేతులూ వాచిపోవటం తప్ప!!  

ఇంతలో, డోర్ బెల్ మోగితే తీయటానికి వెళుతూ... చెప్పాను...

ఒక పెద్దాయన చెప్తారు- మన జాతికి చర్య మీద కన్నా చర్చ మీదే ఆసక్తి ఎక్కువ! అని! మనమూ అంతే కదూ! ఈ చర్చా చాదస్తమూ…అంతే... పెద్దగా సాధించేదేమీ లేదు!”

 

                                                     తలుపు తీయగానే… మా వానర సేనల చేతుల్లో షాపింగ్ బ్యాగులు, ఉన్నవి చాలనట్టు మళ్ళీ కొన్న...కొంగొత్త యాపిల్ డివైజులు చూసి షాకవకుండా చాలా టాలరెంటుగా సంభాళించుకుంటూంటే… శ్వేత వాళ్ళాయన రాహుల్, కెమెరామన్ లేని రిపోర్టర్ లా..."శ్వేతా... అర్జంటుగా ఆ ఛానల్ మార్చి న్యూస్ పెట్టండి… డౌన్ టౌన్లో... ఒక గన్ షాప్ లో దొంగలు జొరబడి 500 గన్స్ ఎత్తుకెళ్ళారట... ఈ గన్ లైసెన్సులు, స్టోర్లూ ఇంత విరివిగా ఎక్కడా చూళ్ళేదు!... బొత్తిగా బొమ్మలకీ, తుపాకులకీ తేడా లేకుండా పోతుంది...“ ! అంటూ లోపలికొచ్చాడు...

మేము "నిజమా?!" అని అడగటంతో… “మరి? అరె, అవతల అంత పెద్ద చోరీ జరిగి ఎఫ్.ఎం లు, ఛానళ్ళూ అన్నీ అలర్టులు పంపుతుంటే... మీరు తీరిగ్గా కూర్చుని... నానా గాసిప్ కబుర్లూ, నయా ఫ్యాషన్ ఖబర్లూ చెప్పుకుంటున్నారా...?" అంటూంటే... ట్రంపు సపోర్టర్ కంటే అన్యాయంగా మావారు కూడా…" మరే! మడిసన్నాక కాసింతయినా సివిక్ సెన్స్ ఉండాలి కదా!!" అంటూ వంత పాడుతూంటే... శ్వేత అదోలా వాళ్ళ వైపు

చూసి...'ఇదేలా? అని నా వైపూ ఓ చూపు విసిరింది... కనుబొమ్మలని వీలయినంత పైకి ఎగరేస్తూ...

"ఫలశ్రుతి! … విని తరించు!" నవ్వుతూ వంటింట్లోకి నడిచాను... స్టవ్ మీదున్న కిచిడీ వార్చటానికి!  

 

******

మీ అభిప్రాయాలు తెలుపుటకు క్లిక్ చేయండి...click here to post your comments...


 

comments
bottom of page