top of page

వంగూరి పి.పా.

ఎన్నికల పిచ్చా? – ఏ పాటీ ?

వంగూరి చిట్టెన్ రాజు

        మొన్న రాత్రి నాకూ మా క్వీన్ విక్టోరియాకీ ట్రంపు –క్లింటను యుద్ధం హోరాహోరీగా జరిగింది. అందులో ఆవిడ వేసిన తిరుగు లేని క్లిష్టమైన క్లింటనస్త్రశస్త్రాలకి  “హలో లచ్చనా” అంటూ నా జుట్టు మారీచుడు బంగారు లేడి బొచ్చు టైపు ట్రంపు రంగు లోకి మారిపోయింది. అప్పుడప్పుడు వయసులో ఉన్న అమ్మాయిలు వేసుకోవడం కద్దు కానీ అలాంటి నిమ్మ రంగు జుట్టు మగ వెధవలకి నేను ఎప్పుడూ చూడ లేదు. దాన్నుంచి తేరుకునే లోగానే ఇక నిన్నటికి నిన్న సాయంత్రం మా అమ్మాయికీ అబ్బాయికీ మధ్య బెర్నీ సేండర్స్ – హిలరీ క్లింటన్ యుద్దం జరిగి తీర్పు కోసం నా దగ్గరకి వచ్చి నా జులపాల రంగు మార్పిడి చూసి “డార్న్, డాడియో! యు లైక్ దట్ గాడిదా?” అనుకుంటూ మళ్ళీ మేడ మీదకి పారిపోయారు. “వాడేం గాడిద కాదు. గుర్రం పార్టీ”. ఆ మాట కొస్తే మీ బెర్నీ & హిలరీలే అడ్డ గాడిద పార్టీ” అనబోయి వంటింట్లోంచి “ఏమన్నావ్...మా హిలరీని ఏమంటున్నావ్?” అంటూ గుర్రు గుర్రు అని భారీ శబ్దాలు వినపడడంతో “ఆశ్వత్థామ హత: కుంజర:” అని ఆఖరి మాటలు ఠకీమని మింగేసి ధర్మరాజులా చాకచక్యంగా తప్పించుకున్నాను. ఎంతయినా బ్రిలియంట్ ఫెలో ని కదా!

      చెప్పొద్దూ, గత ఐదారు నెలల నుంచీ మా ఇంట్లో ఇదే తతంగం. ఉన్న నాలుగు టీవీలలోనూ ఒకరు సిఎన్ఎన్, మరొకరు ఫాక్స్,  ఇంకొకరు ఎమ్ఎస్ఎన్బిసి, మరొకరు ఎడా, పెడా అని చానెళ్లూ తిప్పుకుంటూ పోవడం....ఆ తరువాత అంతా “జీవించే గది”-అంటే లివింగ్ రూమ్ అనమాట ....అక్కడ కలుసుకుని గుర్రాలలో గుర్రాల్లాగా, గాడిదల్లో గాడిదల్లాగా “అమెరికొట్టుకు” చావడం.

        అసలు ఇన్నాళ్ళూ మా ఇంట్లో ఎవరి అమెరికా బతుకు వారే హాయిగా బతుకుతూ మా కుటుంబం అంతా ఏడాదికి ఒక సారో, రెండు సార్లో మాత్రమే కలుసుకున్నప్పుడు కామన్ గా ఏం మాట్లాడుకోవాలో తెలియక మాయా బజార్ చూసుకుంటూ పుణ్యం సంపాదించుకునే వాళ్ళం. ఇప్పుడు ఈ మ్లేచ్చుల ఎన్నికల ఉచ్చులో ఇరుక్కు పోయి రోజూ కలుసుకుంటున్నందుకు సంతోషించాలో, లేక క్లింటనూ, క్రూజూ అనుకుంటూ అమెరికొట్టుకు చస్తున్నందుకు విచారించాలో తెలియక విచారిస్తున్నాను. పోనీ ఈ సీజన్ లో ఆంధ్రా పారిపోదామా అనుకుంటే..ఓరి నాయనోయ్..అక్కడ ఎప్పుడూ ఇదే సీజన్ కదా! అస్తమానూ “కులకొట్టుడే” కదా! 
        ఏది ఏమైనా అచ్చు ఇండియా లాగే నోటికొచ్సినట్టు అరుచుకుంటూ, నువ్వు వెధవ్వి కాబట్టి నేను గొప్ప వాడిని అంటూ మొహం మీదే తిట్టుకుంటున్న ఇలాంటి అమెరికా ఎన్నికలు గత నలభై ఏళ్ళ లోనూ నేను చూడ లేదు. దీనికంతటికీ ట్రంపు కార్డు ట్రంపే....

        నాకు తెలియక అడుగుతానూ, ఈ పసుపు జుట్టు డానల్ద్ ట్రంపు గారూ, ఈ మధ్యనే నలభై పడిలో పడిన టెడ్ క్రూజ్ మరియు మార్కో రూబియో అనబడే ఇద్దరు క్యూబా జాతి వారసులు, అమెరికాకుల్లో హంసలా ఓ వెలుగు వెలిగి ఆరిపోయిన బెన్ కార్సన్ అనే ఏకైక నల్ల డాక్టరు, కొన్నాళ్ళు పోటుగాడిలా పోటీ పడి, డీలా పడిపోయి, గూబ వాయించుకుని ఆ జబ్బుకి వైద్యం చేయించుకుంటున్న జబ్బు బుష్ లాంటి మరికొందరూ.. వీళ్ళందరూ ఒకే ఎర్ర రంగు “అమెరికంఠ లంగోటీ”  కట్టుకునే ఏనుగు పార్టీకి చెందిన వాళ్ళు కదా. అలా ఒకే పార్టీకి చెందిన వాళ్ళు పబ్లిక్ గా స్టేజ్ మీద నువ్వు పచ్చి అబద్దాల కోరువి అని ట్రంపు గారు క్రూజ్ గారినీ, నన్ను చూడగానే నీ పంట్లాం తడిసిపోతుంది అని రూబియో గారు ట్రంపు గారినీ అనడం ఏమన్నా బావుందా? అసలు స్టేజ్ మీద ఉండగా ట్రంపు గారి పంట్లాం కేసి రూబియో గారు ఎందుకు చూడాలీ అంట ? బహుశా అందుకే రూబియో గారిని ఆయన సొంత రాష్ట్రం అయిన ఫ్లారిడా లోనే చిత్తుగా ఓడించేసి మళ్ళీ జన్మలో ఎవరి పంట్లాం కేసీ చూడకుండా బుద్ది చెప్పారు. అదే ఆంధ్రాలో చంద్ర బాబు, నారాయణ, యనమల, రేవంతు వగైరాలు ఒకే వేదిక మీద ఉన్నప్పుడు అలా కట్టుకున్న పంచెల కేసీ, ముఫై ఏళ్ల నుంచీ నాయుడు బాబు వేసుకుంటున్న ఒకే ఒక్క ఆ పసుపు సఫారీ సూటు కేసీ, పంట్లాల కేసీ  చూసుకుంటారా? ఒక వేళ చూసినా, అది తడిసి ఉన్నా ఆయన అహర్నిశలూ “మనోళ్ళ కోసం” పడుతున్న కష్టానికి నిదర్శనంగా  పొగిడేసి, అమరావతిలో ఐదెకరాలు కేటాయించుకుంటారు కానీ ఇలా అవాకులూ, చెవాకులూ వాగుతారా? 
        ఈ డానల్ద్ ట్రంపు గారికి మరొక అలవాటు ఉంది. ఏ సభలో అయినా ఎవరైనా తనకి వ్యతిరేక నినాదాలు చెయ్యగానే “వాణ్ని మొహం మీద ఓ గుద్దు గుద్ది బైటకి గెంటి పారెయ్యండి” అని అందరినీ రెచ్చగొడతారు.  దానికి అందరూ హాయిగా నవ్వుతారు. అప్పుడప్పుడు సరదాకి ఓ దెబ్బ వేస్తారు. ఇదేదో బాగానే ఉంది అని ట్రంపు గారు ఇంకా రెచ్చి పొతే ముందు ముందు తలకాయలు లేచిపోయే పరిస్థితి రావచ్చును బాబోయ్ అని టీవీ వాళ్లూ, ప్రత్యర్థులూ, మొత్తం అమెరికా అంతా గగ్గోలు పెడుతోంది. అదే భారత దేశంలో అయితే ఈ మధ్య ఓటుకి నోటు సిద్దాంతం బాగా ప్రాచుర్యం పొంది తగ్గిపోయింది కానీ పూర్వం ఎన్నికల సమయంలో తలకాయలు మూకుమ్మడిగా లేచిపోవడం మామూలే! 
        ఆ మాట కొస్తే ఈ ఊక దంపుడు ట్రంపు గారి అమాయకత్వాన్ని చూసినా నాకు జాలి వేస్తుంది.  ఎంత అమాయకుడు కాకపొతే అర గంటకి ఒకసారి తను పది బిలియన్ల ఆస్తి సంపాదించాను అని బహిరంగంగానే గొప్పలు చెప్పుకుంటాడు చెప్పండి. మెడ మీద తల కాయ ఉన్న నాయకుడైతే  “నా దగ్గర నయా పైసా లేదు. కేవలం ప్రజా సేవ చెయ్యడం కోసమే నన్ను అమెరికా అధ్యక్షుణ్ణి చెయ్యండి” అని బీద అరుపులు అరవాలి కానీ అన్ని దేశాలలో ఉన్న కోటానుకోట్ల ఆస్తిపాస్తుల వివరాలు మైకులో చెప్పుకుంటారా? అదే ఇండియా లో డెమోక్రాటిక్ పద్దతిలో పాపం బీద వాళ్ళయిన గవర్నరుకి, ముఖ్య మంత్రికి, మంత్రులకీ, శాసన సభ్యులకీ, చప్రాసీలకి కాలనీలు, రెండు పడక గదుల ఇళ్ళు, ఫిల్మ్ నగరూ..ఒకటేమిటి.... అందరికీ ప్రభుత్వమే అద్దె పుచ్చుకోకుండా ఉత్తినే ఉండడానికి ఇళ్ళు ఇస్తుంది కదా. అదీ అసలు సిసలు ప్రజాస్వామ్యం అంటే. అదే అమెరికాలో ఒక్క అధ్యక్షుడికి తప్ప ఇంకెవరికీ కాలనీలు, ఇళ్ళ ఎలాట్ మెంటూ, అద్దె లేకుండా రాజ భవనాలూ ఉండవు. ఎవడి అద్దె వాడే కట్టుకోవాలి. ఎవడి కారు వాడే కడుక్కుని తోలుకోవాలి. ఎవడి తోలు వాడే ఉతుక్కోవాలి. అదేం డెమోక్రసీ..నా మొహం డెమోక్రసీ!

        ఇక ముసలాళ్ళ ఓట్ల కోసం ప్రతీ అభ్యర్థీ వాళ్లకి వ్యక్తిగతంగా అక్కర లేని సోషల్ సెక్యూరిటీ గురించీ, మెడికేర్ గురించీ తెగ మాట్లాడేసి, హామీలు గుప్పించెయ్యడమే. నిజానికి వీళ్ళు చెయ్యగలిగినది ఏమీ లేదు. ఎవరికైనా సోషల్ సెక్యూరిటీ ద్వారా నెలకి మహా అయితే 2500 దాటి రానే రావు. ఆ డబ్బుతో ఎలాగా బతక లేరు కాబట్టి  అమెరికాలో చచ్చే వరకూ చచ్చేటంత పని చేస్తూనే ఉండాలి. ఇక మొత్తం వైద్య సదుపాయాలూ, డాక్టర్లు..అన్నీ కూడా ఇన్స్యూరెన్స్ కంపెనీ గుమాస్తాలు, మందుల తయారీ కంపెనీల యజమానుల దయా దాక్షిణ్యాల మీదనే ఆధార పడి ఉన్నాయి. అంచేత అందరికీ నా సలహా ఏమిటంటే మంచి మెడికల్ ఇన్స్యూరెన్స్ ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకుని సుఖపడండి. ఎలాగో అలాగా 65 ఏళ్ళు వచ్చే దాకా గెంటుకొచ్చేస్తే చాలు. ఇక హాయిగా విడాకులు పుచ్చేసుకోవచ్చును. ఎందుకంటే అప్పుడు ఇన్స్యూరెన్స్ అక్కర లేకుండా గవర్నమెంట్ వారి మెడికేర్ అమలు లోకి వచ్చి, వాళ్ళు ప్రాణం తీసే దాకా బతికెయ్య వచ్చును.     

        ఇక ఈ ట్రంపు గారు “ఇస్లాం మతం లో ఏదో తేడా ఉంది. అదేదో కనిపెట్టి విజయం సాధిస్తాను” అనీ “ఉన్న మెక్సికన్ వాళ్ళని వెనక్కి తరిమేసి, సరిహద్దులో పెద్ద గోడ కట్టేసి మెక్సికన్ వాళ్ళని అమెరికా రాకుండా చేస్తాను” అనీ “నా వ్యాపారంలో H1B వీసా గాళ్ళని వాడుకున్నాను కానీ, ఓ రెండేళ్ళ పాటు ఆ పద్దతి రద్దు చేస్తాను” అనీ ఆయన పదే, పదే చెప్పడం నాకు భలే చికాకు కలిగిస్తోంది. నిజం’గా ఆ వీరుడు అమెరికా అధ్యక్షుడిగా ఎన్నిక అయితే నేనూ, ఫెర్నాండేజ్ గాడూ ఒకే జైల్లో ఉండడం ఖాయం. లేదా మొహం వాయగొట్టుకో వచ్చును. ఎందుకంటే ముందుగా మా ఇంటి ముందు గడ్డి కోసే ఆ ఇల్లీగల్ ఫెర్నాడెంజ్ దొరికిపోయి జైలుకి పోతాడు. మనకేమో కోతలే కానీ గడ్డి కోయుటలో అనుభవం లేదు కాబట్టి ఆ గడ్డి ఎడా, పెడా పెరిగిపోతుంది.  మా సబ్ డివిజన్ యాజమాన్యం వారికి కోపం వచ్చి నన్ను కూడా అదే జైలుకి పంపించే అవకాశం ఉంది. ఆ గండం నుంచి తప్పించుకోడానికి నేను ప్రత్యేక పూజ చేయించుకోడానికి మా పూజారి గారిని అడిగి హిందూ మతంలో ఉన్న కోట్లాది దేవతలలో గడ్డి దేవుడు ఎవరో కనుక్కుని, ఆ సదరు దేవుడు లేదా దేవతకి స్పెషల్ డీలక్స్ పూజ మరియు పూజ, వ్రతం చేయించడానికి గుడికి వెళ్ళాలి. ఈ ట్రంపు గారి హింసావచనాలు విని ఆవేశపడి, గుడికీ, మసీదుకీ తేడా తెలీక,  నా లాంటి పవిత్ర కాకినాడ తెలుగు వాడికీ, సిరియా నుంచి ఐసిస్ కుర్రాడికీ తేడా తెలియకా నేను గడ్డి దేవుడి వ్రతంలో ఉన్న నాడే ఒకానొక మామూలు అమెరికా రౌడీ మూక వెకిలి చేష్టలు చెయ్యవచ్చును...అనగా నా మొహం వాయగొట్ట వచ్చును.

        అన్నింటికన్నా విచారకరం ఇక అమెరికాలో అన్ని తెలుగు సంఘాలూ నడిపే H1B కులస్థులు వెనక్కి వెళ్లిపోవడంతో అవి మూత పడి పోయి మన సంకర తెలుగు సంస్కృతి ముందు తరాలకి మనం అందించ లేక పోవచ్చును. నా ప్రాణాలకి ట్రంపు గారు కనక నెగ్గితే మామూలు మనుషులకి కూడా ఇన్ని అనర్థాలు చుట్టుకుంటాయి. ఏది ఏమైనా ట్రంపు గారి బహిరంగ హింసా ప్రేరణలు ఇటీవలి అమెరికా రాజకీయాలలో ఇంటా, బయటా కూడా నూతన అధ్యాయానికి తెర లేపడం ఖాయం. ఇప్పుడే బ్రస్సెల్స్ విమానాశ్రయం లో ఐసిస్ ఉగ్రవాదుల దురాగతం లో 30 మంది పైగా చచ్చిపోవడంతో ట్రంపు గారు, క్రూజ్ గారు రెచ్చి పోయి అమెరికాలో ముస్లిములు ఉండే ప్రాంతాలలో పోలీసు గస్తీ పెడతాం అని బెదిరిస్తున్నారు. ఇక నుండీ మా పేటలో పోలీసులు కనపడితే ఇల్లు అమ్మకానికి పెట్టుకోవాలేమో మా ఆస్థాన హిందూ జ్యోతిష్కుడు గారిని కనుక్కోవాలి.

       వీటన్నిటి మాటా దేవుడెరుగు....మా అబ్బాయి చదువుకి చేసిన తొంభై వేల అప్పు ట్రంపు తీరుస్తాడా, హిలరీ తీరుస్తుందా అని నేను అన్ని డిబేట్లూ, టౌన్ హాల్ మీటింగులూ ఒక్కటి కూడా తప్పకుండా అన్నీ వింటున్నాను. అది చూసి మా అబ్బాయి...”డోన్ట్ వర్రీ, నాన్నా....ఐ నో హు ఈజ్ పేయింగ్ ఆఫ్ మై లక్ష డాలర్ల అప్పులూ” అని నాకు అభయ హస్తం చూపించాడు. “హమ్మయ్య” అనుకుని వాడి అభయ హస్తం కేసి చూశాను....అది నా కేసే చూపిస్తోంది...ఏం అనుమానం లేదు. ఎవరు నెగ్గినా, ఓడినా మన అప్పులు మనవే. మన వీసా కష్టాలు మనవే. ఈ ఎన్నికలు అయ్యే లోగా నాకు పిచ్చి ముదర కుండా ఉంటే చాలు. అందుకే కాబోలు మా క్వీన్ విక్టోరియా ఇంట్లో రోకలి తీసుకెళ్ళి బేంక్ లో దాచెయ్యడానికి ఓ పెద్ద భోషాణం అద్దెకి తీసుకుంది.

*****

మీ అభిప్రాయాలు తెలుపుటకు క్లిక్ చేయండి...click here to post your comments...

1
2
comments
bottom of page