top of page

Website Designed &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

మధురవాణి ప్రత్యేకం

పాండి బజార్ కథలు - 4

మరో 'అంతం' లేని కథ

భువనచంద్ర

"దేఖ్ తేరి సంసార్‌కి హాలత్ క్యా హోగయి భగవాన్

కిత్‌నా బదల్ గయా ఇన్సాన్

సూరజ్ న బద్‌లా.. చాంద్ న బద్‌లా

నా బద్‌లారే ఆస్‌మాన్.. కిత్‌నా బదల్‌గయా ఇన్సాన్"

(సినిమా పేరు: నాస్తిక్. హీరో: అజిత్ (మన తెలుగువాడు). హీరోయిన్: నళినీ జయంత్

 

(అయ్యా  దేవుడుగారూ... కాస్త నువ్వు సృష్టించిన ప్రపంచం చూడు.. ఎంత మారిపోతోందో.. సూర్యుడు మారలా.. చంద్రుడూ మారలా. . ఆకాశం అంతకన్నా మారలేదు. మనిషి మాత్రం భయంకరంగా (అనూహ్యంగా.. నీ వూహకి కూడా అందనంతగా) మారిపోయాడు.

ఈ పాట నాకు చాలా ఇష్టమైన పాట. ఈ 'నాస్తిక్' సినిమా మీరు చూసి తీరాల్సిన సినిమా. Youtube మీ చేతుల్లోనే ఉంది మరి. అందుకే కథ చెప్పట్లేదు.  ప్రస్తుతం రాజన్ 'దేఖ్ తేరే ఇన్సాన్‌కి హాలత్' అంటూ కర్ణపేయంగా పాడుతున్నాడు.

'తివిరి' ఇసుకనుండి 'తైలం' తియ్యొచ్చు. (మిడిల్ యీస్ట్‌లో జరుగుతున్నది అదేగా, ఇసుక క్రింద వున్న పెట్రోలియంని తీస్తూనే వున్నారుగా) కానీ, తమిళ్‌వాడి చేత హిందీ పాట పాడించడం అంత సులువు కాదు. తమిళనాడు తమిళాన్ని తప్ప ఏ భాషనీ 'భాషగా' ఒప్పుకోదు. మన తెలుగువాడు తెలుగుని తప్ప అన్ని భాషల్నీ అనర్గళంగా మాట్లాడినట్టు.

రాజన్ నోటినే 'గుండెగా' మార్చుకుని హిందీ పాట పాడటం నా చెవులారా విన్నాను గనక, బ్రహ్మంగారి కాలజ్ఞానం నూటికి నూరుపాళ్ళూ కరెక్టే.

"హిందీపాట మీరు అద్భుతంగా పాడుతున్నారు!" వచ్చీరానీ తమిళ్‌లో అన్నాను. సమయం రాత్రి 12.30 నిముషాలు. ప్రదేశం పాండీ బజార్. మలర్‌కోడి మాన్షన్. "అంత కష్టపడి తమిళ్‌లో మాట్లాడక్కర్లా. నేను తెలుగువాడ్నే" పాట అయ్యాక నవ్వి అన్నాడు రాజన్. "మరి రాజన్ అంటారు గదా మిమ్మల్ని" అడిగేశాను.

“Be a Roman in Rome. అందుకే గోవిందరాజుని కాస్తా 'గోవిందరాజన్' అయ్యాను. మా వూరు తిరుపతి" అన్నాడు. నా సందేహం పటాపంచలయింది. చిత్తూరు తిరుపతి వాళ్లంతా తెలుగెంత ఘనంగా మాట్లాడతారో తమిళాన్నీ అంతే ఘనంగా పలుకుతారు. చిత్తూరు , తిరుపతి 'యాస' మరీ సొగసుగా వుంటుంది. భాషకి ప్రాణం 'యాసే'.

"ఇప్పుడేం చేస్తున్నారూ?' అడిగాను. నాది బుద్ధిలేని ప్రశ్న అని నాకు అతని నవ్వు చూశాక అర్ధమయింది.

"నువ్వేదో కొత్తగా వచ్చినట్టున్నావ్. అవునా.. లేకపోతే యీ మేన్షన్‌లో వుండేవాడెవడూ నువ్వడిగిన ప్రశ్న అడగడు. అయినా ఏం చెయ్యాలీ? ఏదో ఒకటి చేస్తేగానీ మనిషి మనిషి కాడా? ఎంత వెర్రివాళ్లయ్యా మీరూ? దిక్కుమాలిన లోకంలో బ్రతకడానికి మించిన గొప్ప పని మరోటి ఏదన్నా వుందా? మీ దృష్టిలో బతకడం 'పని' కిందకి రాదు. డబ్బు సంపాదించడమే 'పని'. అవునా? పో.. పోయి పడుకో. పొద్దున్నే లేచి బుద్ధిగా పని చేసుకుందుగానీ!" ఈసడింపుగా అన్నాడు రాజన్.

"ఫరవాలేదు. కొంచెం సేపు కూర్చుంటా" టెర్రస్ మీదే బాసింపట్టు వేసి కూర్చున్నా. "నేను వుండను. టీ తాగాలి. మందుకి డబ్బుల్లేవు. టీ తాగాలనుకుంటే నాతో రా" అన్నాడు.

"ఇప్పుడు టీ ఎక్కడ దొరుకుతుందీ?" ఆశ్చర్యపోయాను. 'లిబర్టీ కార్నర్'లో" సింపుల్‌గా అని బయల్దేరాడు.

వేసవి రాత్రి. గాలి కూడా లేదు. అయితే రూంలో కంటే బయట చల్లగా వుంది. పాండీబజారు, పానగల్ పార్కు, జివి చెట్టి రోడ్డు, వెంకటనారాయణ రోడ్డు అన్నీ రోడ్ల మీద 50 ఏళ్ళు దాటిన చెట్లే. వేపవి తక్కువా, నిద్రగన్నేరు , తురాయి ఎక్కువ. టి.నగర్‌లో మాత్రం నిర్భయంగా తిరగొచ్చు. నిద్రపట్టని ఎక్‌స్ట్రాలు, నటులూ సిగరెట్లు పీలుస్తూ అర్ధరాత్రిదాకా తిరుగుతూనే వుంటారు.

"ఇంతకీ మీరేం చేస్తారో చెప్పలేదు" అన్నాను మళ్లీ. ఎంత బుద్ధిలేని ప్రశ్నకయినా జవాబు దొరికించుకోవాలిగా. గట్టిగా, పొలమారేంతగా నవ్వాడు.

"పిచ్చోడిలా వున్నావోయ్. ముందు నువ్వేం చేస్తావో చెప్పు" దగ్గుతూ అన్నాడు.

"పాటలు వ్రాయడానికి వచ్చాను. రెండు సినిమాల్లో పాటలు వ్రాశాను" కొంచెం గర్వంగా చెప్పాను.

"మద్రాసు చుట్టూ ఎన్నేళ్ళు తిరిగావూ?"

"వచ్చిన నెలరోజుల్లోపే మొదటి పాట వ్రాశాను. విజయబాపినీడుగారు అవకాశం ఇచ్చారు." చెప్పాను.

"గుడ్. ఆయన్నాకు తెలుసులే."నడుస్తున్నాడు.

"మీరు చెప్పలేదేం?"నేనే మళ్లీ అడిగా.

"చెప్పేదాకా వొదిలేట్టు లేవు. నేను చేసే పని చాలా గొప్పది. ఏమి, అంటే ఏ పనీ చెయ్యకుండా వుండటమే నేను చేసే గొప్ప పని."మళ్ళీ పకపకా నవ్వాడు.

నేనేమీ మాట్లాడలేదు. అయినా 'కుతూహలం' అనేది చాలా చెడ్డది. ఇతరుల గతాల్లోకో, వర్తమానంలోకో మనం ఎందుకు పయనించడం?

"ఇవ్వాళ నాకు మూడ్ లేదు. రేపటికయినా నా కథ నీకు చెప్పే మూడ్ ఉంటుందో లేదో నాకు తెలీదు. మనకేమీ పెద్ద పరిచయం లేదు. దానివల్ల వచ్చిన నష్టమూ లేదు. అయినా అబ్బాయ్.. నది ఎన్ని మలుపులు తిరిగినా సముద్రంలోనే కలిసినట్టు, జీవితం ఎన్ని మలుపులు తిరిగినా మరణంలోనే లీనమవుతుంది. మధ్యలోవన్నీ సినిమాల్లాంటి భ్రాంతులే!" మరో సిగరెట్టు వెలిగిస్తూ అన్నాడు.

(నేను హ్యూస్టన్ వచ్చినప్పుడు నా 'చామ్స్' సిగరెట్టు అయిపోతే, 'శివ'గారు ఓ పన్నెండు పేకెట్లు బహుమతిగా ఇచ్చారు. వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మరో విషయం నేను సిగరెట్లు మానేసి అయిదు సంవత్సరాలు దాటింది) సగం దూరం నిశ్శబ్దంగానే నడిచాం.

"సారీ.. నేను యీ రాత్రి అంతా రోడ్ల మీదే తిరగదల్చుకున్నాను." అన్నాడు. నేను నవ్వేసి వెనక్కి తిరిగి మేన్షన్‌కి బయలుదేరాను. మనసు గుర్రమురోరి మనిషీ!. 'గతాన్ని' గురించి తల్చుకున్నప్పుడల్లా, ఆ 'గతం' గొప్పదయితే మనం మహదానందపడటమేగాక ఇతరులతో ఆ ఆనందాన్ని పంచుకుంటాం. అదే 'గతం' బాధాకరమైనదైతే.. ఆలోచనల్లో కూరుకుపోతాం. ఏకాంతంగా వుండటానికే ఇష్టపడతాం. ఇప్పుడు ఆయన కోరుకుంటున్నదీ ఏకాంతమే.

 

 

"అతనికి 5 ఎం.ఏ డిగ్రీలున్నై. అదిగాక పదో పదకొండో డిప్లొమాలు ఉన్నై. చదవని పుస్తకం లేదు. కానీ, అతని జీవితమనే పుస్తకాన్ని మాత్రం అతను ఎవరి ముందూ ఎప్పుడూ తెరవలేదు" మరుసటి రోజున అసిస్టెంట్ డైరెక్టర్ బాబు అన్నాడు. బాబు కూడా మేన్షన్‌లోనే వుంటున్నాడు. మరో అంతస్థులో. ఆ తరవాత రాజన్ చాలాసార్లు ఎదురైనా విష్ చేసినట్టు నవ్వేవాడేగాని మాట్లాడేవాడు కాదు. ఆ మేన్షన్‌లోన్ మూడేళ్ళపాటు వున్నాను గానీ, ఒక్కరోజున కూడా మాట్లాడే అవకాశం దొరకలేదు. నేను బాగా బిజీ అయ్యాను.

ఇప్పుడు శివజ్ఞానం స్ట్రీట్‌కి మారాను. కాలంతో పరుగుపెట్టేంత బిజీ. అసలు మనిషి ఎందుకు పుడతాడూ?

లోకాన్ని, లోకంలోని అందాలనీ చూడడు. తనతోపాటు యీ లోకంలో ప్రభవించిన భూచర, ఖేచర, జలచరాల్ని చూడడు. పచ్చని ప్రకృతి, కోటానుకోట్ల రకాలు వుంటాయి లతలూ, మొక్కలూ, పక్షులూ దేన్నీ గమనించడు.

ఎంతసేపు భూమినించి తవ్వి తీసిన ఇనుము, కాంక్రీట్లతో పెద్ద పెద్ద జైళ్ళలాంటి భవనాల్ని నిర్మించాలనుకోవడం, అది పదిమందికి చూపిస్తూ, 'యీ టైల్స్ ఇటాలియన్‌వీ, ఆ పింగాణీ సామాను చైనాదీ' అంటూ మురుసుకోవడం లేదా రోజులో పదహారు గంటలు గాడిద చాకిరీ చేస్తూ "నా జీతం నెలకి రెండు లక్షలు !.. తెలుసా" అంటూ పొంగిపోవడం. ఇందుకా మనిషి జన్మ ఎత్తిందీ?

నాయనా, Why do you collect when you can't carry? తీసుకుపోలేనిదాన్ని పోగు చెయ్యడం ఎందుకూ? ఎన్నివేల కోట్లు ఇచ్చినా పోయినవాడు తిరిగి క్షణమైనా బ్రతకడు గదా.

ఈ మాట ఆలోచించి చారీ స్ట్రీట్‌కి మారాక రోజుకి రెండు పాటలకి మించి వ్రాయనని ఒట్టు పెట్టుకున్నా. అఫ్‌కోర్స్ ప్రతిరోజూ పాటలు రావు. అది వేరే విషయం. జీవితాన్ని జీవించాలిగానీ, ధనం తోటీ, వస్తువుల తోటీ కొలవకూడదు. హాయిగా బ్రతకడానికి నీకెంత కావాలో నిర్ణయించుకోవలసింది నువ్వే.

సాలిగ్రామంలో S.A. రాజ్‌కుమార్‌గారి థియేటర్లో రికార్డింగ్. S.మూర్తిగారు (చిన్న మూర్తిగారు) చెప్పారు."ఇక్కడో తోపుడు బండి వుంది. ఇడ్లీలు సూపర్, టేస్టు చేద్దామా?" అని . రాజ్‌కుమార్‌కి మూర్తిగారు అసిస్టెంట్ కాదు. బేక్‌బోన్. మూర్తిగారు మంచి రచయిత, సంగీత దర్శకుడూ కూడా.

ఆ తోపుడు బండి దగ్గర వేడి వేడి ఇడ్లీలు వేస్తున్నది రాజన్. "డాడీ.. అమ్మ మళ్లీ పడిపోయింది" ఓ చిన్న పిల్ల వచ్చి రాజన్‌తో అన్నది. మేం ఇడ్లీ తింటుండగా.

"సారీ.. ఇప్పుడే వస్తా" మాతో అని గబగబా ఆ పిల్లతో పక్క సందులోకి వెళ్ళాడు రాజన్.

"మీకు తెలుసా? అతని పేరు రాజన్. 'హిందూ'లో చాలా చాలా మంచి వ్యాసాలు రాస్తుంటాడు. అందమైన ఇంగ్లీష్ అతని సొంతం" చెట్నీ పాత్రలోంచి చెట్నీ వొడ్డించుకుంటూ అన్నారు చిన్నమూర్తిగారు.

"యీజిట్?" ఆశ్చర్యంగా అన్నాను.

"చాలా ఇంటలెక్చువల్. కానీ, మొండి మనిషి. ఎవర్నీ లెక్కచెయ్యడు. మీకో చిత్రం చెప్పనా? ఆ పిల్ల అతని కూతురు కాదు. ఆవిడ అతని భార్యా కాదు. కానీ" రాజన్ రాక చూసి మధ్యలో ఆపేశారు మూర్తిగారు. అతని చేతిలో ఓ పెద్ద గిన్నె.

"ఇవిగో.. వేడి వేడి వడలు.." మాంచి ఉల్లిగారెల్ని మా ప్లేట్స్‌లో వడ్డించాడు. 'గారె' గొప్పతనమంతా పిండిని రుబ్బే విధానంలో వుంది. సరైన పద్ధతిలో రుబ్బితే.. నోట్లో వేసుకోగానే 'వెన్న' కరిగినట్లు నోట్లో గారెలు కరిగిపోతాయి. చింతపండు,  పచ్చిమిర్చి పచ్చడి అయితే...  అబ్బా... తింటూనే వుంటాం. అల్లం పచ్చడి టేస్టే వేరు. అంతే కాదు. గారెను అందంగా ముక్కలుగా తుంచి, వాటిని వేడి సాంబార్‌లో కుంచేపు నాననిచ్చి, నానింతరవాత కొన్ని సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు తగిలించి, మరికాస్త సాంబార్ పైన పోసి తింటే.. పిచ్చి నిద్దర పోకపోతే నా మీదొట్టు.

లోకంలో బెస్ట్ 'కపుల్' ఎవరో తెలుసా? పొంగల్+వడ(గారె). రెండు మూడు రకాల చెట్నీలూ, మాంచి పొగరైన సాంబారూ చెలికత్తెలా పక్కనుంటే చాలు సృష్టిలో మరే 'ఐటమూ' వీటికి సాటిరావు.

ఇదంతా ఎందుకంటే...

తినిపించడం ఒక యోగం

తినడం ఒక భోగం

తినిపించలేకా, తినలేకా స్తబ్దుగా ఉండడం ఒక రోగం.

రాజన్ బ్రహ్మాండంగా చక్కని చెట్నీలతో గారెలు తినిపిస్తే నేనూ, మూర్తిగారూ సుష్టుగా తిన్నాం. ఆ తరవాత మేం రికార్డింగ్‌లో పడ్డ కునికిపాట్లు జీవితంలో ఎరగం.

రాడాన్‌వారి (నటి రాధిక గారిది) 'గాయత్రి్' సీరియల్‌కి టైటిల్ సాంగ్  వ్రాశాను. దానికి మ్యూజిక్ డైరెక్టర్ 'అగ్ని'. అతని అసలు పేరు విజయ్ ఆంటోనీ. మ్యూజిక్ డైరెక్టరుగా ఎంత పేరు పొందాడో, నటుడిగా (బిచ్చగాడు, సలీం ఫేం) అంతకంటే ఎక్కువ పేరు తెచ్చుకున్నాడు. రికార్డింగ్ అయ్యాక బయటికి వచ్చాను. నాతో వచ్చిన మనిషి ఇప్పుడే వస్తానని కారేసుకుపోయాడు. నేను బయటికొచ్చి ఆటో కోసం నడవడం మొదలెట్టాను. కోడంబాకందాకా సరదాగా నడిచాక కాఫీ తాగుదామనిపించింది. 'చంద్ర భవన్'లోకి అడుగెట్టా. ఎదురుగుండా టేబుల్ మీద రాజన్. చిక్కిశల్యమయ్యాడు. గడ్డం పెరిగి వుంది. కళ్లల్లో మాత్రం వెలుగు అలాగే వుంది.

"ఏమయింది?" ఎదురుగా కూర్చుని అడిగాను.

"ఏమవుతుందీ? అన్ని అనుభవాలూ కలిగితే 'జీవిత'మవుతుంది."నవ్వి అన్నాడు. 'కొటేషన్'నాకు అద్భుతంగా నచ్చింది.

"కయ్యేంది ధీవన్ (చక్రాల బండి మీద వుండే హోటల్.. తమిళనాడులో వాటినిలా పిలుస్తారు) మూసేశారా?"

"మూయించబడింది. అంతేగామరీ.. హోటల్లో యాభై రూపాయలకి అమ్మే ప్లేటు ఇడ్లీని పది రూపాయలకి, 20 రూపాయల వడని అయిదు రూపాయలకీ అమ్మితే మరి సర్కారువారికి కోపం రాదూ?" పకపకా నవ్వాడు.

"జనాల సపోర్టు వుంటుందిగా?" వెర్రి ప్రశ్న వేసానని, వేశాక నాకే తెలిసింది.

"జనాలా? వెధవల్ని అరెస్టు చేస్తే, వాడు బయటకొచ్చేదాకా నిరాహార దీక్షలూ, హర్తాళ్లూ, రాస్తారోకోలూ, కిరసనాయిలు పోసుకుని ఆత్మాహుతులూ చేసుకుంటారుగానీ, మరో సామాన్యుడికోసం ఎందుకు నిలబడతారూ? నిలబడితే అసలిన్ని అరాచకాలు ఎందుకు జరుగుతై?" కాఫీ తాగుతూ అన్నాడు.

"మీ భావాల్ని కథల రూపంలోనో, నవలల రూపంలోనో ఎందుకు వ్రాయరూ?"

"హ..హ..హా..." పగలబడి నవ్వాడతను. "కథలగానో, నవలలుగానో నా?" ప్రశ్నించి, మళ్లీ నవ్వుతూనే బిల్లు చెల్లించి వెళ్లిపోయాడు. నివ్వెరపోయాను.

 

*****

"సారీ గురూగారు. నా మనసు బాగోలేదు"

'కన్నెమెరా' హోటల్లో కూర్చుని వుండగా అన్నాడు అసోసియేట్ డైరెక్టర్ బాబు. అతను అసిస్టెంట్ నించి అసోసియేట్‌గా ప్రమోటయ్యాడు. మధ్యకాలంలో చాలా సినిమాలు చేశాడు. న్యాయంగా యీపాటికతను డైరెక్టరవ్వాలి. కానీ కాలేదు. కారణం, అతని కులంవాళ్లు వాళ్ల ఇండస్ట్రీలో తక్కువమంది వుండటం.

'సినీఫీల్డులో కూడా ఇలాంటివి వుంటాయా?' అని మీరడగొచ్చు. ఎప్పుడూ ఉంటై. అయితే అదివరకు టాలెంట్‌కి ప్రధమ తాంబూలం ఇచ్చేవారు. కులం నెక్స్ట్.

ఇవ్వాళ కులం ఫస్టు. "టాలెంటుదేముందండీ. పది సినిమాలు చేస్తేనే గదా అనుభవం వచ్చేది. మనోడీకి మనం సపోర్టిచ్చుకోకపోతే వేరేవాడెవడిస్తాడు?" అనే రోజులివి. కొంతమంది(అతి కొద్దిమంది మాత్రమే) సినిమాని సినిమాగా చూసి, తగినవారిని మాత్రమే ఎన్నుకుంటారు. టాలెంట్ ప్రాతిపదికమీద.

"ఎందుకు బాగోలేదూ?" అడిగాను. నాతోపాటు నా పక్కనున్నది బప్పీలహరిగారి రెగ్యులర్ మ్యూజిక్ అసిస్టెంట్. ఓ చిన్న పార్టీ ఇస్తున్నా, అతని పుట్టినరోజని తెలిసి.

"సారీ.. నేను పర్మీషన్ లేకుండా వచ్చాను."అన్నాడు. బాబు.

"డోంట్ వర్రీ.. హాయిగా మీరు జాయిన్ అవ్వొచ్చు. మనం మాట్లాడుకున్నా ఇబ్బందేమీ లేదు. మరో నాలుగు నిముషాల్లో ఇంకో మ్యూజీషియనూ పార్టీలో జాయిన్ అవుతాడు. వాళ్లిద్దరూ బెంగాలీలే గనక వాళ్ల భాషలో వాళ్లు, మన భాషలో మనమూ హాయిగా మాట్లాడుకోవచ్చు. మాట్లాడుతూనే ఓ పెగ్ ఓ ఖాళీ గ్లాసులో పోసి, తగిన నీరు కలిపి, బాబు ముందు పెట్టాను.

"సారీ గురూగారూ.. మీ ముందు.. "అంటూనే ఒక్క గుక్కలో ఫుల్ పెగ్ తాగేశాడు బాబు.

సినిమాఫీల్డు అంటేనే టేన్షన్ ఫీల్డు. ప్రతివారికీ, BSC  డిగ్రీ వొస్తుంది. (B S C  అంటే బ్లడ్‌ప్రెషర్, షుగర్ ఎండ్ కొలస్ట్రాల్ అని) అదే కాదు FTW కూడా వస్తుంది. (Follow The Wife). కారణం ఇంట్లో ఎక్కువ సమయం గడిపే అవకాశం లేనందువల్ల. మరో పెగ్గు అతను పూర్తి చేశాక అడిగా."ఏమయిందీ?" అని.

"నేను చాలా తప్పుడు పని చేశాను సార్. రాజన్ తన పెట్టే నాకు ఇచ్చి, 'ఇది తెరవొద్దు' అని చెప్పినా, దాన్ని తెరిచి మిత్రద్రోహం చేశాను సార్" అన్నాడు.

"జరిగిందేదో జరిగిపోయింది. దాన్ని గురించిన చింత ఎందుకు?" అతని బాధని తగ్గించే ప్రయత్నంగా అన్నాను.

"డైరీ చదవకూడదు గదండీ! కుతూహలాన్ని ఆపుకోలేక చదివాను" తలదించుకుని అన్నాడు.

"చదవడం అయిపోయిందిగా. చదివింది మాత్రం ఎవరికీ చెప్పకండి. అతని జీవితాన్ని పబ్లిక్ చెయ్యొద్దు" స్క్ట్రిక్టుగానే అన్నాను.

న్యాయంగా చూస్తే ఎవరి జీవితాలూ వారివి కాదు. ప్రతీ జీవితం అనేక జీవితాలతో ముడిపడి వున్నది. హాఫ్‌బాటిల్  పూర్తి చేశాడు గానీ బాబు మూడ్ మారలెదు. బహుశా రాజన్ జీవితం బాబుని బాగా కలవరపెట్టి ఉండొచ్చు.

 

*****

 

కొందరు విశిష్ట వ్యక్తులు వుంటారు. వారి చుట్టూ ఎప్పుడూ మనుషులు వుండాలని కోరుకుంటారు. ఎందుకంటే అటువంటి వ్యక్తులు వారి స్వరాన్ని వారే వినడానికి ఇష్టపడతారు. They Love to Listen to their Own Voice . ఫ్లైట్ లేటవడంతో అటువంటి 'విశిష్ట వ్యక్తి'తో రెండుగంటలపాటు విమానశ్రయంలో కూర్చోవలసి వచ్చింది. నేను నిజంగా కృతార్ధుడినైన రోజది. ఆయన ఇండస్ట్రీని మధించిన వ్యక్తి. నేనో తామరాకు మీద నీటిబొట్టుని. ఎందరో సినీజీవుల జీవితాల్ని ఆయన అరటిపండు వొలిచినట్టు చూపించారో! అందులో ఒకటి రాజన్ జీవితం..

"ఆ సో అండ్ సో హీరోయిన్ ఎవరనుకుంటున్నారు? రాజన్ పీకలదాకా ప్రేమించిన మనిషి. అసలు రాజన్ ఏం చేసేవాడో మీకు తెలుసా? చేతిలో కలం , కాయితం లేకుండా అరగంటలో కథ చెప్పి ప్రొడ్యూసర్‌ని వొప్పించగల దిట్ట. ఒకప్పుడు అతనితో పరిచయమే జనాలకి మహా భాగ్యం" అంటూ రాజన్ జీవిత చిత్రాన్ని మొదలెట్టారు.

రాజన్‌ని చాలామంది ప్రేమించారు(?) అది 'అవసర ప్రేమ'. అంతే రాజన్ స్టోరీ డైలాగ్ రాసే సినిమాల్లో అవకాశం కోసం పుట్టిన అద్భుత అవసరపు ప్రేమ అది. సరే.. అవన్నీ ఆకాశంలో మబ్బులు. వస్తాయి పోతాయి గానీ స్థిరంగా నిలవ్వు.

అప్పుడతనికి పరిచయమయింది 'స్వర్ణ' (అసలు పేరు కాదు). స్వర్ణ రంగు నిజంగా పసిడి రంగే. మహా అమాయకురాలు. కానీ అద్భుతమైన అందగత్తె. ఆమె సినిమాల్లోకి వచ్చిన క్షణంలోనే రాజన్ ఆమెని చూడటం జరిగింది.

'ప్రేమ' అనేది ఎప్పుడు ఎలా పుడుతుందో ఎవ్వరూ చెప్పలేరు. ఎంత గొప్ప రచయిత అయినా, 'ప్రేమ' అనే తాపాన్ని తట్టుకుని నిలబడలేడు. రాజన్ విషయంలో అదే జరిగింది. హీరోయిన్‌గా  స్వర్ణని ప్రతిపాదించిందీ, ఆమె మీది ప్రేమతోటి ఆమె పాత్రని అద్భుతంగా మలిచిందీ రాజనే. హీరోయిన్ స్వర్ణ తల్లి ఆవలించకుండానే పేగులు లెక్కబెట్టే రకం. రాజన్ వీక్‌నెస్‌ని కాదు అతని  గ్రేట్‌నెస్‌ని కూడా క్షణాల్లో పట్టేసింది.

"బయట భోజనం అనారోగ్య కారణం అబ్బాయిగారూ, మీరు మమ్మల్ని మీ కుటుంబ సభ్యుల్లానే చూసుకోండి. నేనే స్వయంగా వండిపెడతా. కాదంటే నా మీద ఒట్టే" అన్నది. స్వర్ణ నటించిన ఫస్ట్ పిక్చర్ యావరేజ్. కానీ రైటర్‌గా పది మెట్లు ఎక్కాడు రాజన్. కన్నడ, తమిళ, తెలుగు సినిమాలకి ఆయువుపట్టయ్యాడు. బ్రహ్మాండమైన బంగళా, కారూ, నగలూ అన్నీ స్వర్ణ పేరు మీదే కొన్నాడు. అసలు కొన్నట్టు కూడా స్వర్ణకీ, వాళ్లమ్మకీ తప్ప ఎవరికీ చెప్పలేదు.

"మీ అమ్మాయి ఆ రైటర్‌నే నమ్ముకుంటే మాకెటువంటి అభ్యంతరమూ లేదు. మీ అమ్మాయి ఏవరేజి నటి అని మీకూ, మాకూ కూడా తెలుసు. మరి దీపం వుండగానే ఇల్లు చక్కదిద్దుకొవాలి. వయసున్నప్పుడే వగలు వొలకబొయ్యాలి. మాది పెద్ద పిక్చరు. టాప్ హీరో మోజు పడుతున్నాడు. ఆ పైన మీ ఇష్టం" అని కబురెట్టాడు ఓ గ్రేట్ ప్రొడక్షన్ మేనేజర్ అతనికి ఇతర వ్యాపకాలు చాలా వున్నై.

"OK” అంది స్వర్ణ తల్లి. ఏ కూరకి ఏ 'మసాలా' వాడాలో తెలిసిన మనిషాయె!

ఫలానా హీరోగారితో స్వర్ణ 'డిన్నర్' కెళ్ళిందన్న వార్త గుప్పుమంది. ఇక్కడ 'డిన్నర్' అంటే, 'అదే'.

రాజన్ స్వర్ణ చెంప పగిలేట్టు కొట్టాడు. మరోసారి అలా జరిగితే పళ్లు రాల్తాయని బెదిరించాడు. బస్. స్వర్ణ తల్లి 'రాఘవి' ఎదురుచూస్తున్నదీ ఇటువంటి సిచ్యుయేషన్ కోసమే. భోరుమంటూ పరిశ్రమ పెద్దలకి చెప్పుకోవడమే కాక, రాజన్‌ని గూర్ఖాతో గెంటించింది. మంచి గొడ్డుకో దెబ్బ చాలుగా!

తలెత్తుకోలేని రాజన్ సైలెంటైపోయాడు. ఆస్తి, డబ్బు, ఇల్లు , సర్వం స్వర్ణ పేరు మీదున్నై. అతని దగ్గర మిగిలింది ఆరు ఉంగరాలు, మెళ్ళో గొలుసూ.

అప్పుడే సరిగ్గా ఆ సమయంలోనే ఓ అప్‌కమింగ్ డైరెక్టర్ రాజన్‌కి తన అపార్ట్‌మెంట్‌లో చోటిచ్చాడు. "డోంట్ వర్రీ బ్రదర్. ప్రస్తుతం నీది బాడ్ పీరియడ్. నాకో సినిమా ఆఫరొచ్చింది. కథ ,మాటలూ నువ్వే రాయి. పేరు మాత్రం నా మీదుంటుంది. రెమ్యూనరేషన్ చెరి సగం" అన్నాడు. రాజన్ వొప్పుకున్నాడు. మూడేళ్ళ పాటు ఆరు పిక్చర్లకి కథ, స్క్రీన్‌ప్లే మాటలు వ్రాసినా, సదరు డైరెక్టర్ మాత్రం అవసరానికి మించి చేయి విదల్చలేదు. ఆరు పిక్చర్లూ సదరు డైరెక్టర్ పేరు మీదే  చలామణి అయి అద్భుతమైన పేరుని ఆయనకి తెచ్చిపెట్టాయి. ఓ రోజున "సారీ రాజన్, నాకేదీ రాదనీ, ఘోస్టు రైటర్‌వీ, డైరెక్టర్‌వీ నువ్వేననీ గిట్టనివాళ్ళు ప్రచారం చేస్తున్నారు.  అది నా కెరీర్‌కే డేంజర్" అన్నాడు రాజన్‌తో ఆ డైరెక్టర్. అంటే ఇన్‌డైరెక్టుగా 'నీ దారి నువ్వు చూసుకో' అనడమేనని రాజన్‌కి అర్ధమైంది.

మరో ముగ్గురు ఏవరేజి డైరెక్టర్లు రాజన్ కథలతో , డైలాగ్స్‌తో సూపర్‌హిట్టయ్యారు. రాజన్ పరిస్థితి మాత్రం 'ఘోస్టు'గానే మిగిలిపోయింది. సడన్‌గా 'స్వర్ణ' మంచం పట్టింది. అర్ధంకాని జబ్బుతో అర్ధాంతరంగా మరణించింది. ఆమె మరణం అతని హృదయానికి నిజమైన సుత్తిదెబ్బగా మారింది. విరక్తి. సినిమాల మీద విరక్తి. మనుషులమీద విరక్తి. అన్నీ కలిపి అతన్ని పట్టాలు కలవని చోటుకి పంపేశాయి.

ఇదీ విమానాశ్రయంలో నేను విన్న రాజన్ జీవితచరిత్ర. నాకు తెలుసు, రాజన్ కథ వ్రాయవలసిన విధానం ఇది కాదని. అంతే కాదు. అతని జీవితాన్ని అతని మాటల్లోనే (సారీ.. డైరీలోని అతని రాతలలోనే) వినిపించాలని వుంది. కానీ బాబు ఇక్కడ లేడు. ఒకామె ( ఓ సెకండ్ హీరోయిన్) అతన్ని అతిగాఢంగా ప్రేమించి మోసం చేస్తే, అన్నీ వదిలేసి వాళ్ల వూరు వెళ్ళిపోయాడు. ఇప్పుడు రాజన్ పెట్టె, డైరీలూ ఎక్కడున్నాయో తెలిసింది బాబు ఒక్కడికే. కానీ వాళ్ల  వాళ్లనడిగితే ఎక్కడో నార్త్‌లో వుంటున్నాడని చెప్పారు.

ఈ కథ అసలు ఎప్పటికయినా పూర్తిగా వెలుగు చూస్తుందా?

మీ

భువనచంద్ర

 

Tags, Bhuvana Chandra, Pandey Bazaar Kathalu, madhuravani telugu magazine, Telugu Film Industry, TFI

bottom of page