top of page

Website Designed &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

“దీప్తి” ముచ్చట్లు

మాయావి’లాసం

Deepthi Pendyala, madhuravani, Deepthi Pendyala madhuravani

దీప్తి పెండ్యాల

"ఈ ఆదివారం నేనూ, హరిణి ఒక ముఖ్యవిషయం మాట్లాడేందుకు ‘విల్లోబ్రూక్ మాల్’ లో కలుస్తున్నాము. నువ్వూ రావాలి. వస్తావు కదా?" ఉరుము లేని పిడుగులా ఫోన్ చేసి, సీరియస్ గా అడిగింది శిరీష.

"ఏ సినిమా?" అంతకన్నా సీరియస్ గా అడిగాను, శిరీష సీరియస్ గొంతు ని సిన్సియర్ గా అనుకరిస్తూ.

"సినిమా కాదోయ్. అలాంటిదే అనుకో. చాలా మాట్లాడాలి. ఉదయం 9 కల్లా మాల్ లోని ఫుడ్ కోర్టు కి వచ్చేయ్. 12 లోపు ఇంటికెళ్ళిపోదాం."

మరేమీ చెప్పలేక, "సరే. కలుద్దాం." అన్నాను.

ఫోన్ అయితే డిస్కనెక్ట్ చేసాను కానీ, ఆలోచనలింకా కనెక్టెడ్ గానే తిరుగుతున్నాయి.

ఏంటో ఆ ముఖ్య విషయం? జాబేమయినా మారిందా? కొంపదీసి ఊరేమయినా మారుతుందా? ఆ ఆలోచనకే  బెంగొచ్చేసింది. కాకపోతే బావుండు. మరేముంటుందో, అంత ముఖ్య విషయం?

**

ఆదివారం చెప్పిన సమయానికంటే ముందే వెళదామనుకున్నప్పటికీ, నాలో మన భారతీయ విలువల పట్ల, సంస్కృతి, సంప్రదాయ పరిరక్షణ పట్ల ఉన్న అపరిమిత గౌరవం వల్ల, మన భారతీయ సమయపాలన సంప్రదాయాన్ని భంగపరచకుండా అయిదు నిమిషాలు ఆలస్యంగా పదీ:అయిదుకి నా మిత్రద్వయాన్ని కలిసాను.

అంత గంభీరంగా వాళ్ళు మాట్లాడుకోవటం ఎప్పుడూ చూడలేదేమో, ఆశ్చర్యపోతూ... 'ఏంటీ విషయం' అంటూ... ఓ కుర్చీ గట్టిగా లాక్కుని కూర్చుంటూ పలకరించాను.  

బదులుగా క్షణం మాటలాపి మౌనం పాటించారు. "ఎవరైనా పోతే కదా మౌనం పాటించాలి? వస్తే కాదేమో?” అంటూ వాతావరణం తేలిక పరిచేందుకు విఫల యత్నం చేసాను.

హరిణి  "లాభం లేదు. నేను దాన్ని వదిలించుకుంటే తప్ప నవ్వలేనే." అంది.

"దేన్నీ?" అయోమయంగా చూస్తూ అడిగాను.

శిరీష వంక చూస్తూ- "నువ్వు చెప్పవే." అంది.

శిరీష దీర్ఘంగా నిట్టూర్చి -"ఎక్కడని మొదలుపెట్టాలి? హరిణీ పతి - రాహుల్ లో చాలా మార్పులొచ్చాయట. ఎపుడూ ఏదో పరధ్యానంలో ఉన్నట్టుంటాడుట" అంది శిరీష.

"రాహుల్ తో సమస్యా?" కాసింత ఆశ్చర్యంగా అడిగాను.

హరిణి అందుకుంది- "పూర్తి స్థాయి సమస్య అనలేను కానీ, రాహుల్ లో మార్పు మాత్రం స్పష్టం. ఇంతకుముందులా ఇంట్లో వాళ్ళతో సరదాగా ఉండట్లేదు. నీకు తెలుసు కదా, రాహుల్ ఎపుడూ వంటింట్లోకి వచ్చి, నేను వంట చేస్తున్నంత సేపూ నాతో కబుర్లు చెప్పేవాడా? వీలయితే కూరగాయలు తరగటమో, ఫ్రిజ్ సర్దిపెట్టటమో చేస్తూండేవాడు కదా? ఇపుడలా వంటింటి ప్రాచ్యం లోకి అడుగుపెట్టక,  ఏడాది దాటింది. 'సర్లే, ఆఫీసు పనెక్కువై, ఇంట్లో రెస్టు కోరుకుంటున్నాడేమో' అని సర్దుకున్నాను. ఇంతకుముందు నేను పిల్లలతో సరదాగా గేమ్స్ ఆడుకుంటుంటే వచ్చి మాతో చేరేవాడా? పిల్లల హోంవర్కుల్లో ఎంతగా సాయపడేవాడనీ? ఇపుడేమో... ఉహూ. ఏ ఆసక్తీ లేదు కదా,ఏ పని చేసినా యాంత్రికంగా, డ్యూటీలా చేస్తున్నాడు. వీకెండ్స్ లో అందరం కలిసి ఎటయినా వెళ్ళినా, ధ్యాస మరెక్కడో ఉన్నట్టుగా ఉంటాడు. మాతో ఉన్నా, మాలో ఉండట్లేదు. తన లోకం లో తానుంటాడు. అంతవరకైతే ఫర్లేదు. తనకంటూ కొత్తగా మరో లోకాన్ని కోరుకుంటున్నాడు. ఏదో ఒకటి చేసి, రాహుల్ ని మునుపులా మార్చాలి.. "

హరిణి మాటలు వింటుంటే, ఆ మాటల్లో స్పష్టమైన  ఓ ఆవేదనేదో ధ్వనిస్తుంది.

హరిణి ఊహిస్తున్నది నిజమే అయితే, ఎలా పరిష్కరించటం?

అంతవరకూ మౌనంగా వింటూన్న శిరీష నెమ్మదిగా అంది. "నేను గమనించలేదు కానీ, కిషోర్ కూడా ఇలాగే ఉంటున్నాడీ మధ్య. హరిణి చెపుతుంటే ఒకటొకటే గుర్తొస్తున్నాయి. కిషోర్ కి కూడా ఈ మధ్య ఇంటి ధ్యాస తక్కువయింది. ఆఫీసు-వర్క్ అంటుంటే, పననుకున్నాను కానీ, ఖాళీ సమయాల్లోనూ మాతో ఇంతకుముందులా సరదాగా గడపట్లేదు.ఎన్ని ముచ్చట్లు చెప్పేవాడనీ? క్షణం నోరాపకుండా ఏదో ఒకటి మాట్లాడేవాడా? ఇపుడేంటో, ఒక్కోరోజయితే, మనిషి ఇంట్లో ఉన్న అలికిడే ఉండదు."

ఉలిక్కిపడ్డాను. ఎక్కడో సామ్యం కనబడుతుంది.

ఏదో తళుక్కుమన్నట్టుగా హరిణి అంది. " ఓ పని చేద్దాము. ఇంట్లో ఇంటర్నెట్ లేకుండా చేసి కమ్యూనికేషన్స్ కట్ చేస్తే…?"

శిరీష ఖండించింది- "మరి ఆఫీస్ పనో? మనకీ కుదరదుకదా, ఇంటికెళ్ళాకా, వెన్నంటే వచ్చే ఇష్యూస్, మెయిల్స్ సంగతో?"

హరిణి- "అలా అయితే,  ‘దాన్నే’ మాయం చేయాలి. అదే పరిష్కారం!" అంది. చాలా సింపుల్ గా.

అదిరిపడ్డాను.

మన భారతీయ టీ.వీ. డైలీ సీరియళ్ళ చరిత్ర& వర్తమానం లో ప్రతీ సీరియల్ నటీమణి తన కెరీర్లో కొన్ని వందలసార్లయినా చెప్పి ఉన్న డైలాగ్ అది. ఆ డైలాగ్ చెప్తున్నప్పుడు, వారి కళ్ళలో ఎర్రగా కనిపించే క్రోధం, పగ, ప్రతీకారం... ఉహూ... అవేవీ హరిణి కళ్ళలో లేవు. ప్రశాంతంగా ఆలోచించే అందా మాటలు.

"మాయం చేస్తావా? ఎలా? ఏం చేయబోతున్నావు?" ఆందోళనగా అడిగాను.

"ఏముంది, గొంతు నొక్కేసి, మళ్ళీ వినబడకుండా,  కనబడకుండా ఏ క్లోజెట్ లోనో, గరాజ్ లోనో దాచేస్తాను." నింపాదిగా అంది.

"అవునవును. ఐతే, నేనూ అలాగే చేస్తాను." మెరుస్తున్న కళ్ళతో అంది శిరీష.

ఏం వింటున్నానో అర్థం కాక, మధ్యలో ఆపి- "పరిష్కారం ఆలోచించకుండా, ఈ జోకులేంటీ? టీ.వీ.సీరియల్స్ ఏమయినా ఫాలో అవుతున్నారా?" అసహనంగా అడిగాను.

హరిణి తెల్లబోతూ అడిగింది - "ఇంతకుమించి పరిష్కారం ఏముంటుందీ? పోనీ, నువ్వు చెప్పు మరేదయినా!"

శిరీష ఆదుకుంది. " ఇంకేముంటుందీ? వీళ్ళు ఆ ‘స్మార్ట్ ఫోన్’ మాయలోంచి బయటపడితే తప్ప మామూలవరు. దాన్ని దాచేయటమే సరి."

"స్మార్ట్ ఫోన్?! మాయ?" చప్పున వెలిగింది ట్యూబు లైటు. రాహుల్ నీ, కిషోర్ నీ  మాయచేసింది స్మార్ట్ ఫోనా?! వీరి బాధంతా డిజిటల్ రాక్షసి గురించా!

 

హమ్మయ్య. ఎంత కంగారు పడ్డాను? మనసులోనే నవ్వుకున్నాను.

 

శిరీషకి నా సంశయం మరోలా అర్థమయినట్టుంది. “ఓ, నీ అనుమానం అర్థమయింది. ‘స్మార్ట్ ఫోన్’ దాచేస్తే వాళ్ళకొచ్చే కాల్స్ ఎలాగనేగా?  దానికీ పరిష్కారముంది. ఎరుపు, పచ్చ బటన్లు మాత్రమే ఉన్న పాతకాలం సెల్ ఫోన్ కొని, కాల్ ఫార్వార్డింగ్ పెట్టాకే, మాయం చేయొచ్చు.” అంటూ వివరించింది.

బహుశా,  పెద్దగీత ముందు చిన్న గీతలా, ఏ ఉపద్రవాన్నో ఊహించుకున్న నాకు ఈ స్మార్ట్ ఫోన్ వారికి  సమస్యవటమే ఓ పరిష్కారంలా తోచినట్టుంది.

పెద్దగా ఆలోచించకుండానే-​

"అవును. అదే సరి.."    అంగీకారంగా అన్నాను.

హరిణి తేటపడింది. ఇంటికి బయల్దేరటానికి సిద్ధపడుతూ, "సరే అయితే. రాహుల్ తో మాట్లాడి, కన్విన్స్ చేసి ఫోన్ మాయం చేస్తాను. అనుకున్నంత ఈజీ కాదు కానీ.." అంటూ లేచింది.

నేనూ ఇద్దరికీ "ఆల్ ద బెస్ట్" చెప్పి బయల్దేరాను.

దారిలో కళ్ళకి కనబడుతున్న దృశ్యాలు వద్దన్నా మనసులో నిక్షిప్తమవటం మొదలయ్యాయి.

చుట్టుపక్కన ఎన్నో టేబుల్స్, కుర్చీలు. వాటినిండా మనుషులు. కానీ, ఎవరూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నట్టుగా లేదు. చురుగ్గా ఫోన్లలో దూరిన చూపులు స్క్రీన్లపై కదలాడే యాంత్రికమాటలని మౌనంగా చూస్తున్నాయి. చుట్టూ మనుషులున్నా అక్కడ రాజ్యమేలుతుంది మాత్రం నిశ్శబ్ధమే. ఈ నిశ్శబ్ధదృశ్యానికి అలవాటుపడ్డ విషయం కూడా గుర్తించలేనంత నిశ్శబ్ధంగా జీవితాల్లో పెనుమార్పు వచ్చిందా? మనల్ని మనం కోల్పోవటం సమస్యగా తోచనంతగా అలవాటుపడ్డామా?

మాల్ లో ప్లే గ్రౌండ్ లో పిల్లలు ఆడుకుంటుంటే, తల్లిదండ్రులు ఎవరికి వారే ఫోన్లు చూసుకోవటం, పక్కపక్కనే ఉన్నా, మాటల్లేకుండా మౌనంగా నవ్వుకోవటం చూసి కోపంగా ఉండేది. ఇపుడెందుకో బాధేసింది.

ఒకరికొకరిని 'స్మార్ట్' గా దూరం చేస్తున్న మాయని గుర్తించరే?

కారు నడుపుతూ సిగ్నల్ వద్దకి రాగానే, ఫోన్ ని ఆత్రంగా చెక్ చేసుకునే మనుషులని చూస్తూంటే ఎపుడూ విసుగ్గా ఉండేది. ఈ రోజెందుకో సానుభూతి కలుగుతుంది. అడిక్షన్- ఏదయినా ప్రమాదమేగా. అక్కడికీ, ఎక్కడ చూసినా హెచ్చరిక బోర్డులెన్నో.. "Buzzed Driving is Drunk Driving." చూడరా ఏ? చిత్తం సెల్లు మీద, డ్రైవింగ్ రోడ్దు మీదా? ఎంత ప్రమాదం?

మన చేతుల్లో ఇమిడిపోయే స్మార్ట్ డివైజెస్ మన జీవితాలని, తన చేతుల్లోకి తీసుకోబోతున్నాయి. గమనించరే?

ఈ స్కూల్స్ అన్నీ  ‘డ్రగ్ అడిక్షన్’  మీద ఎవేర్నెస్ ప్రోగ్రాములు పెట్టినట్టే, ఇకపై ఈ ‘డిజిటల్ డ్రగ్ అడిక్షన్’ మీదా క్లాసులివ్వాలేమో. కానీ, ఎలెమెంటరీ నుంచే క్లాసులనీ స్మార్టు చేస్తూ, డివైజులుని అనుమతించే స్కూల్సు ఈ అడిక్షన్ చిహ్నాలని ఎప్పటికి గుర్తుపట్టేను?

వేలి కొసల్లో మనం బుల్లి ఫోన్లనుంచి ఎన్నిటినో నియంత్రిస్తున్నామని భ్రమిస్తున్నాము. మన వేలితో మన కన్నులనే పొడిచుకుంటూ జీవితాన్ని రంగుల అంధకారం లో ముంచుతున్నామని తెలీట్లేదు.

ఆలోచనలతో ఇంటికి చేరేసరికి లంచ్ సమయమూ దాటింది. బయటకి వెళ్ళేముందే వండిన వంటకాలన్నీ, సర్దినవి సర్దినట్టుగా అలాగే ఉన్నాయి. ఇంట్లో ఎవరూ ఇంకా లంచ్ చేయలేదు. తమ, తమ డివైజుల్లో  పనిచేసుకుంటున్నారు. ఒకరు స్కూల్ హోం వర్క్ కోసం, మరొకరు ఆఫీస్ వర్క్ కోసం, ఇంకొకరు ఆటలకోసం. ఎవరి కారణం వారికుంది. అన్నీ సరైనవే. అయితేనేం? వర్క్ స్పేస్ మొత్తంగా పర్సనల్ స్పేస్ ని ఆక్రమించటమూ ‘స్మార్ట్ అడిక్షన్” కి మొదటి చిహ్నమే.

హరిణి, శిరీష చెప్తుంటే సన్నగా స్ఫురించిన సామ్యం ఇదేనేమో. ఇంట్లో ఎవరూ మారకముందే ఈ డిజిటల్ రాక్షసిని తరిమేయాలి.​

 

అందర్నీ లంచ్ కి రమ్మని కేకేసాను. భోజనాలు ముగిసాక, వంటకాలే కాదు, డివైజులన్నీ మాయం! అందరి మొహాల్లో కంగారు, వెదుకులాట, ఆరాటం. ఏదేదని ఆరాలు… మెల్లిగా నవ్వాను.  “గాయబ్. పోయిందే? ఇట్స్ గాన్!”!

మొదట ఉక్రోషంగా, తర్వాత బింకంగా... "మరి నువ్వూ ఫోన్ వాడొద్దు."

అంతకన్నానా?!  

"థ్యాంక్యూ, ఫ్రెండ్స్!" అని మనస్పూర్తిగా మిత్రద్వయానికి ధన్యవాదాలు చెప్పుకుని, నా ఫోన్ పిల్లలకందించాను. మెసేజ్ అలర్టులు కూడా వినబడకుండా దాని నోటిఫికేషన్ గొంతు నొక్కేసి మరీ ఇచ్చాను. దాచేయమని.   ఫోన్ తెరపై  అక్షరాలు మెరుస్తున్నాయి.

 

SLIDE TO POWER OFF...

****

 

Tags Deepthi Pendyala madhuravani telugu magazine  Deepthi MuchaTlu  madhuravani January 2018

bottom of page