top of page

Website Designed &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

అదన్నమాట సంగతి

మా రోజుల్లో.... షో  సమయం!

Jyothi Valaboju

జ్యోతి వలబోజు

ఆ రోజు శనివారం.

సాయంత్రం 7 అవుతోంది.

ఇంట్లో అంతా టెన్షన్ టెన్షన్.

 

అమ్మ తొందరగా వంట చేసేస్తోంది.

 

శనివారం కాబట్టి నో నాన్వెజ్ అయినా, రాత్రి పూట అయినా మళ్ళీ వంట చేయాల్సిందే. పప్పు, చారు కూర. నేను తమ్ముళ్లతో కలిసి నాన్న తొందరగా రావాలి దేవుడా , లేట్ కావొద్దు అని మనసులోనే అనుకుంటూ,  ఎప్పుడెప్పుడు తినేద్దామా , బట్టలు మార్చుకుందామా అని వెయిటింగ్.  నాన్న ఎప్పుడొస్తాడో ఏమో, లేట్ అయిపోతుందేమో?   తొందరగా వచ్చి తొందరగా తినేస్తే స్టార్ట్ కాకముందే వెళ్లొచ్చు అని మాకు టెన్షన్. అమ్మతో చెప్పి ఫోన్ చేయించి నాన్నఇంటికి రావడానికి ఎంత సేపు పడుతుందో తెలుసుకోవడం. దేవుడా ... దేవుడా.. నాన్నకు ఏ మీటింగూ ఉండకుండా చూడు, ఎవరూ రాకుండా చూడు. వచ్చినవాళ్లని తొందరగా పంపించేసి నాన్నను ఇంటికి వచ్చేట్టు చూడు అని మనసులో అనుకునేదాన్ని. అంతవరకు మనమన్నా తినేద్దాం నాన్న వస్తే ఒక్కడే తినాల్సి ఉంటుంది అని నేను, తమ్ముళ్ళు తినేసేవాళ్లం. అమ్మ ఎంత చెప్పినా నాన్న తిన్న తర్వాతే తింటుంది కదా. ఇక ఇంట్లోకి, బయటకి మా మార్చింగు. చూపులన్నీ గేటు మీదే. అదిగో కారు హారన్. హమ్మయ్యా! నాన్న వచ్చేసారు. ఇంకా అరగంట టైం ఉంది. స్టార్ట్ కాకముందే వెళ్లొచ్చు. ఇక మళ్లీ టెన్షన్. నాన్న తొందరగా తినాలి, అమ్మ కూడా తినేయాలి. ఎలాగైనేమి అందరం కారులో బయలుదేరాం. తొమ్మిది గంటలకు ఐదు నిమిషాల ముందు ఆబిడ్స్ లోని రామకృష్ణ థియేటర్ ముందున్నాం. టికెట్లు ముందే రిజర్వేషన్ చేయించాం కాబట్టి టెన్షన్ లేదు.  మొదటిసారి హిందీ సినీమా. షోలే. హైదరాబాదులో పుట్టి పెరిగాం, స్కూలులో హిందీ సెకండ్ లాంగ్వేజి కాబట్టి మాకు అర్ధమవుతుందిలే అని మమ్మల్ని కూడా తీసికెళ్లారు. అప్పుడు నాకు పన్నెండేళ్ళు . ఏడో క్లాసు. అప్పట్లో ఇంట్లో రేడియో తప్ప టీవీ లేదు.  సినిమా ఒక్కటే వినోద సాధనం. సినిమా అంటే అదొక అద్భుతం. అదొక వింత. అదొక అపూర్వలోకం. నిజంగా నిజజీవితంలో జరగని, ఊహించనివన్నీ సినిమాలో జరుగుతుంటాయి. అలా ఎలా అనే ఆలోచన, సందేహాలు అస్సలు లేవు.  అందుకే ప్రతీ శనివారం నాన్న తీసికెళ్ళే సినిమా కోసం అంత ఆరాటం . ఎదురుచూపులు. నాన్న రోజూ బిజీగా ఉంటాడు. శనివారం సెకండ్ షో వెళ్లినా  తెల్లారి ఆదివారం, సెలవు కాబట్టి లేట్ గా లేవొచ్చు అనే ఆలోచనతోనే అమ్మానాన్న మమ్మల్ని సినిమాకి తీసికెళ్ళేవారు.

ఇప్పుడంటే సినిమాలు మన ఇంట్లోకే వచ్చేసాయి. నలభై ఏళ్ల క్రితం సినిమా అంటే రేడియోలో ఆదివారం మద్యాహ్నం సంక్షిప్త శబ్ద చిత్రం వచ్చేది. నేను ఒక్కదాన్ని వినేదాన్ని. ఆ డైలాగులు, పాటలు వింటుంటే వింతగా ఉండేది. వింటుంటే, చూస్తుంటే అలా లీనమయి పోయేవాళ్లం. అసలా సంగీతం ఎక్కడినుండి వస్తోంది, ఆ పాటలు ఎలా పాడుతున్నారు, ఆ డాన్సులు అంత పర్ఫెక్టుగా ఎలా చేస్తున్నారు. మరీ ముఖ్యంగా వామ్మో ఫైటింగులు. ఎంత దెబ్బలు తాకుతాయి. వాళ్ల ఇంట్లో ఏమనరా? అంటూ నోరెళ్ల బెట్టుకుని చూసేవాళ్లం. పిల్లలమే సుమా. మళ్లీ ఇంటికొచ్చాక టవర్ భుజానికి కట్టుకుని చీపురు పుల్లలతో ఫైటింగ్ చేసేవాళ్లం. ఇప్పటి పిల్లలకు ఎనిమిదేళ్లకే సినిమా సంగతి తెలిసిపోతుంది. మాలా వింతగా చూడరు. అంతెందుకు. రెండేళ్లు కూడా లేని మా మనవడు మొబైల్ లో తనే యూట్యూబ్ వెతుక్కుని రైమ్స్ సెలెక్ట్ చేసుకుని ఎంజాయ్ చేస్తుంటాడు. ఏంటో కలికాలం పిల్లలు..

 

ఇక షోలే సినిమాలో మాత్రం చాలా భయపడ్డాను. తమ్ముళ్ల సంగతి తెలీదు. అమ్మో! ఆ గబ్బర్ సింగ్ ఎంత దారుణంగా  అరుస్తుంటాడు. మనుషులను, పిల్లలను, ముసలాళ్లను దారుణంగా చంపేస్తుంటాడు. ఆ సినిమాలోని గుర్రాల చప్పుడు చాలా ఏళ్ల వరకు నన్ను వదలలేదు. షోలే చూసొచ్చిన రోజు అయితే రాత్రి  పన్నెండున్నరకు ఆబిడ్స్ నుండి ఖైరతాబాదు వచ్చేవరకు భయమే. అస్సలు నిద్రపట్టలేదు. గబ్బర్ సింగ్ అరుపులు, ఆ చావు కేకలు, ఆ గుర్రాలు. తెల్లారగట్ల పడుకున్నా. నాకు ఇంకా గుర్తే.. ఎప్పుడైనా మేము కారులో రోడ్ ట్రిప్ మీద హైవేలమీద వెళుతుంటే అటు ఇటు దట్టమైన చెట్ల మధ్య చీకట్లో వెళ్తుంటే అమ్మో! ఎప్పుడు ఆ చెట్లవెనకాల నుండి షోలే సినిమాలో లాగా దొంగలు వచ్చేస్తారేమో అని భయపడి చచ్చేదాన్ని. కళ్లు గట్టిగా మూసుకుని బయటకు చూడకుండా పడుకునేదాన్ని. ఇలా చాలా సంవత్సరాలు జరిగింది.  ఇంకో సినిమా నన్ను చాలా కాలం భయపెట్టింది Evil Dead అనుకుంటా. పెళ్లయ్యాక చూసింది. ఇంట్లో హాల్లో టీవీలో క్యాసెట్ పెట్టుకుని మావారు, తమ్ముళ్లతో కలిసి చూసా. నావల్ల కాలేదు.  సగం కూడా చూడకుండా వెళ్లి  పడుకున్నా. అంత భయంకర. అందులో సడన్ గా చేతులు బయటకు రావడం, చంపెయ్యడం  వగైరా చూసి అసలు ఆ రాత్రంతా పడుకోలేదు. ఎటు చూసినా ఆ సినిమాలో జరిగినట్టుగానే లీలగా కనపడేది. మళ్లీ ఇఫ్పటివరకు  హారర్ సినిమాలు చూడలేదు. ఎందుకంటే ఇప్పుడు అంతగా లేకపోవచ్చేమో గాని అప్పట్లో అంటే ముప్పై నలభై ఏళ్ల క్రితం సినిమా ఒక వింత. అందులో చూపించినవన్నీ నిజంగా జరుగుతాయేమో అని నమ్మేసే అమాయకత్వం.

అప్పుడైనా, ఇప్పుడైనా సినిమాలకి, నిజజీవితాలకి చాలా అనుబంధం ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఫాషన్. బయట ఆడవాళ్లని చూసి సినిమావాళ్లు నేర్చుకున్నారో, సినిమాలోని హీరోయిన్లని చూసి బయట ఆడవాళ్లు ఫాలో అయ్యేవారో తెలీదు. సినిమాల్లోని నగలు, చీరలు, బ్లౌజుల డిజైన్లు, జుట్టు అన్నీ వింతగానే ఉండేవి. సాధనా కటింగ్, వాణిశ్రీ చీరలు, దసరాబుల్లోడు నగలు. ఇంకా గుర్తుంది అందరికీ. ముఖ్యంగా వాణిశ్రీ ఫాషన్ మాత్రం  లేడీస్ కి ఒక క్రేజ్,. ఎప్పుడెప్పుడు వాణిశ్రీ కొత్త సినిమా వస్తుందా. ఆ సినిమాలో ఆమె ఎలాటి చీరలు కట్టింది, ఎలాటి నగలు పెట్టింది అని ఎదురు చూసేవాళ్లు. సినిమావాళ్లేం తక్కువ తినలేదు. వాణిశ్రీని ప్రతీ సినిమాలో చాలా ప్రత్యేకంగా చూపించేవారు. సినిమా పేరు మీద చీరలు, నగలు చేసి సొమ్ము చేసుకునేవారు తయారీదారులు. ఆ చీరలు, నగలు కొని వేసుకోవడం ఒక గొప్పగా భావించేవారు లేడీస్.. మేమూ వాణిశ్రీలా తయారయ్యాం అని. మా అమ్మ కూడా కొనేదనుకోండి.  ఇక మగవాళ్లకైతే టైట్ షర్టులు, గొట్టం పాంటులు, తలమీద జుట్టుని ఒకవైపు పాపిట తీయడం లేదా ఒక పాయి రింగులుగా చుట్టి వదిలేయడం. (ఎవరో గుర్తొచ్చిందనుకుంటా). ఏదైనా సినిమాలో హీరో కుర్తా పైజామాలో అందంగా కనిపించాడంటే షాపుల్లో అవే బట్టలు లేదా బట్ట కొని కుట్టించుకోవడం. అఫ్పుడు రెడీమేడ్ బట్టలు కొనడం చాలా తక్కువ. టెయిలర్లకు ఫుల్ గిరాకీ.. తమ సినిమాలకోసం కొత్త కొత్త డిజైన్లు, ఫాషన్ల కోసం ఆయా డైరెక్టర్లు కాలేజీలకు, పెళ్లిళ్లలాంటి ఫంక్షన్లకు ఒక మనిషిని పంపేవారని తర్వాత తెలియవచ్చింది. ఫాషన్ డిజైనింగ్ , ఇంటర్నెట్ లాంటివి లేవు కదా ఆ రోజుల్లో..

సినిమాలంటే ఇంకో ముఖ్య  విషయం చెప్పాలి. సినిమా వెళ్లాలంటే   ముందుగా రిజర్వేషన్ చేయించుకోవాలి. కొత్త సినిమా శుక్రవారం వస్తుందంటే రిజర్వేషన్ ముందు సోమవారం స్టార్ట్ అవుతుంది. ఎన్.టి.ఆర్, ఏ. ఎన్. ఆర్, కృష్ణ, శోభన్ బాబులాంటివాళ్ల సినిమాలంటే రిజర్వేషన్ అప్పుడు కూడా లైన్లో నిలబడాల్సి వచ్చేది. ముప్పై నలభై ఏళ్ల క్రితం సినిమా టికెట్  మినిమం యాభై పైసలు , రూపాయిన్నర  నుండి 2  లేదా మూడు రూపాయిల వరకే ఉండేది. రిజర్వేషన్ రెండు , రెండు రూపాయిల పది పైసలు బాల్కనీ కే ఉండేది. ఫస్ట్ డే ఎలాగూ వీలు కాదు కాబట్టి రెండోరోజు అది కూడా సెకండ్ షో టికెట్లు మాత్రం తీసుకునేవాళ్లం. మగవాళ్లకి ఒకటే టికెట్టు, ఆడవాళ్లకు మాత్రం రెండు ఇచ్చేవారు. మాకు నాలుగు కావాలి కాబట్టి అమ్మ నన్ను తీసుకెళ్లేది. మేము నలుగురం అని చెప్పి దబాయించి నాలుగు టికెట్లు తీసుకునేది. ఆడవాళ్ల లైన్ తక్కువగా ఉండేది కాబట్టి చాలామంది మగవాళ్లు మాకో టికెట్ తీసిపెట్టండి  ప్లీజ్ అని బ్రతిమిలాడుకునేవారు. కొత్తసినిమాలంటే ఆడవాళ్ల లైన్ తక్కువే కాని మార్నింగ్ షో ల కి పాత సినిమాలు వేసినప్పుడు మాత్రం ముప్పావుమంది ఆడవాళ్లే . ఎక్కువగా మధ్య తరగతి వాళ్లు, అంతకంటే కాస్త తక్కువవాళ్లు వచ్చేవారు, టెకెట్టు నలభై లేదా యాభై పైసలు. ఇక పదకొండు గంటలకు బుకింగ్ మొదలు. దానికి రెండు గంటల ముందు వచ్చి లైన్లో కూర్చునేవాళ్లు. కాని గేటు మాత్రం తొమ్మిద్దిన్నరకే తీసేవాళ్లు. గేటు తీయగానే పోలోమని తోసుకుంటూ వెళ్లి  ఆ కౌంటర్ దగ్గర నిలబడేవాళ్లు. ఎక్కువ మంది చూడాలంటే అందరూ నిలబడరు. ఒక్కరు నిలబడితే మిగతావాళ్ల కోసం మనిషికో చెప్పు లెక్కన వాళ్ల చెప్పులు పెట్టేసి వెళ్లిపోయి పనంతా చూసుకుని టికెట్లు ఇచ్చేముందు అంటే పావుతక్కువ పదకొండు గంటలకు వచ్చి లైన్లో నిలబడేవారు. ఇక అప్పుడు మొదలయ్యేది అసలు జాతర. నేను రెండు గంటలనుండి నిలబడ్డాను, నువ్వు ఇప్పుడొచ్చు ముందు నిలబడతావా అంటే.. నా వాళ్లు వచ్చి లైన్లో ఉన్నారు. నేను చెప్పులు  పెట్టి వెళ్లాను కనపట్టం లేదా అని . ఇక చూస్కోండి. వాదం పెరిగి కుచ్చిళ్లు చెక్కి, కొంగు బిగించి  జుట్టు, జుట్టు  పట్టుకుని తిట్టుకుంటూ కొట్టుకునేవారు. కొద్దిసేపు అందరూ తమాషా చూసి విడదీసేవారు. అలాటి కొట్లాటలు నేను చూసాను. మా అమ్మావాళ్లింటికి దగ్గర్లో ఉన్న మీరా థియటర్లో  సైకిల్ స్టాండులో రెండు సవరాలు గోడకు వ్రేలాడదీసారు. ఎప్పుడో ఇలాటి గొడవలప్పుడు ఊడిపడినవంట. ఇప్పుడున్నాయో లేదో.

 

థియేటర్లో మార్నింగ్ షో. ఇంకా బుకింగ్ మొదలుపెట్టలేదు.అందరూ లైన్లో నిలబడి ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. అందరిలో సినిమా చూడాలనే ఉత్సాహం. కధ ఎలా ఉంటుందో ?, పాటలెలా ఉన్నాయో?.. ఎప్పుడెప్పుడు లోపలికి వెళతామో అని ఒకటే ఆత్రుత. ఇంతలో ఒకబ్బాయి తన చేతిలో కొన్ని కాగితాల కట్టలు పట్టుకుని టికెట్ల కోసం లైన్లో నిలబడ్డవాళ్ల దగ్గరకు వచ్చాడు. అవి చూడడానికి మామూలు కాగితాలలాగే ఉన్నాయి. ఐనా కూడా చాలా మంది వాటిని కొనుక్కుంటున్నారు. ధర కూడా తక్కువే.. ఐదు పైసలు...సినిమా టికెట్టు అర్ధ రూపాయి. అదే రంగు రంగు కాగితాల పుస్తకాలు థియేటర్ క్యాంటీన్లో , కిళ్లీ కొట్లలో తోరణాల్లా వేలాడదీసి ఉన్నాయి. జనాలు వాటిని తీసుకుని లోపల ఏమున్నాయో చూసి కొంటున్నారు. ..ఇంతకీ ఏమిటా పుస్తకాలు?. ఎందుకా ఆత్రుత?... అవి తెలుగు సినిమా పాటల పుస్తకాలు. మరీ అంత తక్కువ ధరా? అంటే ఈ దృశ్యం ముప్పై, నలభై ఏళ్లక్రింది మాట.


ఇక ఆ పుస్తకాల ప్రత్యేకత ఏంటి? చూడడానికి మామూలు కాగితంలా ఉన్నా అందులో ఆసక్తికరమైన విశేషాలు ఉండేవి. ముందుగా సినిమా కథ సంగ్రహంగా ఇచ్చేవారు కాని క్లైమాక్స్ మాత్రం అస్సలు చెప్పేవాళ్లు కారు. మిగిలిన కథ వెండితెర మీద చూడండి అని టక్కున ఆపేసేవారు. తర్వాత పాటలు. ముఖ్య నటీనటుల వివరాలు, సంగీత దర్శకుడు, నిర్మాత , సంగీత దర్శకుడు మొదలైన వివరాల తర్వాత పాటల సాహిత్యం ఇచ్చేవాళ్లు. ఒకవేళ యుగల గీతమైతే అతడు .... ఆమె... అని ఇచ్చేవారు. సినిమా చూసేవరకు ఈ పాటలు ఒకసారి తిరగేస్తారు. థియేటర్ లోపల ఐతే పాటలు వింటూ చదవడం కష్టమే. తర్వాత రేడియోలో వచ్చినప్పుడు మాత్రం ఆ పాటల పుస్తకం ముందు పెట్టుకుని అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయో లేదో చూడడం ఎంతో సరదాగా ఉండేది. ఇక ఆ పాటలు నేర్చుకోవాలి అంటే మాత్రం ఈ పాటల పుస్తకాలు తప్పకుండా ఉండాల్సిందే.. ఫలానా పాట ఎవరు పాడారు?? ఎవరు రాసారు?? సంగీతం ఎవరు అనే సందేహాలను తీర్చే సరియైన సాధనం ఈ పాటల పుస్తకం. అసలు ధియేటర్లో సినిమాలో నటీనటులను చూడడం. పాటలు సంగీతంతో సహా వినడమే ఒక వింతగా ఉండేది ఆ కాలంలో. ఇక ఆ పాటల సాహిత్యం ప్రతీ పదంతో సహా చదువుతుంటే మాత్రం ఒక వింతను ఆవిష్కరించినట్టు ఉండేది. అబ్బో అనుకునేవాళ్లం. వెళ్లిన, అడిగిన ప్రతీ సినిమాకు ఈ పాటల పుస్తకాలు కొనిచ్చేది కాదు అమ్మ. అవి చదువుతూ క్లాసు పుస్తకాలు పట్టించుకోరని తన భయం. బతిమాలి , బామాలి అప్పుడోటి అప్పుడోటి కొనుకున్నేదాన్ని.


కాని రాను రాను వాటి ఊసే మరచిపోయి జీవన స్రవంతిలో కొట్టుకుపోయాను. తర్వాత ఎన్ని పాటల పుస్తకాలు కొన్నా కూడా ఆనాటి ఐదుపైసల కాగితపు పుస్తకాల భావన రాలేదు. మనం మరచిపోయాము అనుకుంటాము కాని మనసుపొరల్లో ఎక్కడో దాక్కుని ఉంటాయి ఎన్నో మధురస్మృతులు, జ్ఞాపకాలు. ఇలా అప్పుడప్పుడు మేమున్నామంటూ ఆ మనసు పొరల్లోనుండి తోసుకుని బయటకు వస్తాయి. ఇదేనేమో జీవితం...

 

ఇప్పుడు సినిమాల్లో ఎంత అద్భుతమైన సీనరీలు, ఫైట్లు, మాయాజాలాలు చూపించినా. అంతా గ్రాఫిక్స్ లే అని లైట్ తీసుకుంటున్నారు. కాని దాని వెనకాల ఉన్న కృషి మాత్రం అసమాన్యం. నాలాటివాళ్లకైతే  ఎంత లేటెస్ట్ టెక్నాలజీ, ఎంత అద్భుతంగా సినిమాలు తీసినా, ఆ పాత నలుపు తెలుపు సినిమాలే నచ్చుతాయి ఇప్పటికీ. అవి ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు. చాలామంది అభిప్రాయం ఇదేనేమో. అప్పటి సినిమాలు మంచి కుటుంబ కథా చిత్రాలు, జానపద కథలు, పురాణాలు మొదలైనవిగా ఉండేవి. అందుకే అమ్మ నన్ను ఎప్పుడూ సినిమా చూడొద్దనలేదు.  వేసవి సెలవుల్లో మా ఇంటికి వచ్చే నాన్నమ్మకు తోడుగా మార్నింగ్ షో సినిమాలకి పంపేది. జానపద కథలు, చందమామ కథలు చదవడం ఇష్టం కాబట్టి నేను ఈ రకపు సినిమాలు ఎక్కువగానే చూసా.

ఇక అమ్మతో కలిసి హిందీ సినిమాలు చూడడం సరదాగా ఉండేది. స్కూలులో ఉన్నప్పుడే అన్నమాట. నాకు హిందీ అంతగా మాట్లాడ్డం రాదు. అర్ధమవుతుంది. అమ్మకు కూడా అంతే. మేమున్న ఖైరతాబాదులో ముస్లీములు కూడా ఎక్కువగానే ఉన్నారు. అందుకే మంచి సినిమాలు వచ్చాయంటే అమ్మ, నేను కలిసి రిక్షాలో వెళ్లేవాళ్లం. ఈ విషయం ఇంట్లో నాన్నకు, తమ్ముళ్లకు అస్సలు చెప్పొద్దు. నాన్నకు కూడా.  అమోల్ పాలేకర్ సినిమాలు ఎక్కువగా వచ్చేవి. అలాటి సాఫ్ట్ పిక్చర్స్ నాన్నకు ఇష్టముండేవి కాదుగా. అందుకే మేమిద్దరమే. ఒకసారి  హై స్కూల్లో ఉన్నప్పుడే అనుకుంటా. నేను అమ్మా కలిసి లిబర్టీ థియేటర్లో మొదటిసారి బెన్‌హర్ ఇంగ్లీషు సినిమా చూసాం. నాకు ఇంగ్లీషు అర్ధమయ్యేది కాని ఆ సినిమాలో ఎంత ఫాస్ట్ గా మాట్లాడేవాళ్లో. పది మాటలకు, ఒక్క మాట అర్ధమయ్యేది. అదే అమ్మకు వివరించేదాన్ని. లేకుంటే అలా కళ్లు, నోరెళ్లబెట్టుకుని చూడడమే. నిజంగా అంత పెద్ద తెరమీద ఆ రాజమహలు, సైనికులు, యుద్ధం. .. అద్భుతం.

 

తర్వాతర్వాత నేను అమ్మ కలిసి అప్పుడప్పుడు తమ్ముళ్లు కలిసి చాలా సినిమాలు చూసాం కాని వయసు  పెరుగుతున్న కొద్దీ ఆలోచనలు, అభిరుచులు మారసాగాయి. సినిమాల్లో చూపించేదంతా నిజం కాదు. అన్న మాట అర్ధమైంది. ఇదివరకు సినిమాలు చాలానే చూసాను. ఒకరోజైతే ఒకేరోజు మార్నింగ్ షో, మాట్నీ రెండూ చూసాం పెళ్లయ్యాక లెండి. నేను, మావారు, పిల్లలు. చిన్నగా ఉండేవారు. మధ్యలో లైట్ గా సమోసాల్లాంటివి తినేసి పక్క థియేటర్లో ఇంకో సినిమా టికెట్లు తీసుకుని వెళ్లి చూసేసాం. డబ్బులు  పెట్టి చూసాం. బావుంటుంది. బావుండదు అని కాకుండా మనసుతో ఫీలయి, ఆలోచించి, ఆవేదన కాని ఆవేశం కాని, సంతోషం కాని వచ్చినప్పుడు సినిమా హిట్. అది పల్లెటూరులో కాని సెట్టింగ్ లో కాని చిత్రీకరించినా ప్రేక్షకులు వాటిని పట్టించుకోరు. కాని ఆ సమయంలో అంటే నేను స్కూలులో ఉన్నప్పుడు తెలుగులో ఎన్.టి.ఆర్, ఏ.ఎన్.ఆర్. కృష్ణ, శోభన్ బాబు అంటేనే హీరోలు. అందంగా ఉంటారు. మిగతావాళ్లు వేస్ట్ అనుకునేదాన్ని. తర్వాతర్వాత వీళ్లే ఎక్కువకాలం రాజ్యమేలారు. టీవీలో సినిమాలు వచ్చినప్పుడు మాత్రం మా ఇంటి దగ్గర పెద్ద జాతరలా జనం వచ్చేవారు. ఆ చుట్టుపక్కల టీవి రాగానే కొన్నది మా నాన్నగారే. శనాదివారాలు సినిమాలు వేసేవారు. శనివారం హిందీ సినిమా కాబట్టి ఒకరిద్దరే వచ్చేవారు. లేదంటే కనీసం యాభై మంది మా ఇంటి ముందు. మా నాన్నగారు పోనీలే పాపం అని వాళ్లని మా హాల్లో సినిమా చూడనిచ్చేవారు. కాని వాళ్లు వెళ్లిన తర్వాత హాలు శుభ్రం చేయడం పెద్ద గండంలా ఉండడంతో అమ్మ కట్ చేయించింది.

అంతే కాదు. మా నాన్నగారి స్నేహితుడు ఒకాయన సినిమా ఫీల్డులో కాస్త పరిచయాలు ఉండడంతో హీరోలని, హీరోయిన్లను మా ఇంటికి పార్టీకి పిలిచేవాడు. అలా శోభన్ బాబు, చంద్రకళ, ప్రభాకరరావు, బేబి సులక్షణ, వచ్చారు. అఫ్పుడ కూడా ఇంటి ముందు పెద్ద గుంపు. వాళ్లని చూడాలని.. అదో సరదాగా ఉండేది మాకు.  ఎన్ని సినిమాలు చూసినా ఇది బాలేదు. లేచి వెళ్లిపోదామన్నంత విసుగు రాలేదు ఒక్క సినిమా తప్ప. ఇప్పుడా సరదా లేదు. ఆసక్తి లేదు. థియేటర్లో రెండు గంటలు కూర్చునే ఓపికా లేదు. టీవీలో లేదా యూట్యూబ్ లో కాని ప్రైమ్ లో చూసేద్దాం లే అనిపిస్తుంది.

ఇప్పటివాళ్లకు సినిమాలతో ఇలాటి అనుభూతులున్నాయో లేదో మరి.

*****

bottom of page