top of page
Anchor 1

Website Designed &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

కథా మధురాలు

తడి ఆరని  బంధం

Radhika Bukka

మణి వడ్లమాని

ఉదయం తొమ్మిదిన్నర గంటలయింది. ప్రార్థన అయ్యి చాలాసేపు అయింది. క్లాసురూం లో పిల్లలంతా నిశ్శబ్దంగా కూర్చొని ఉన్నారు. గేటు దగ్గర  స్కూల్ బంట్రోతు నించొని, బయట ఐస్ ఫ్రూట్ బండి అబ్బాయి తో మాట్లాడుతున్నాడు. తలవంచుకొని గబగబా అడుగులు వేస్తూ లోపలికి వెళుతున్న సీనుగాడిని చూసి, “ఏయి, ఆగు ఇప్పుడు టైం ఎంతయిందో తెలుసా?” అన్నాడు.

“తొమ్మిది అయింది”

“తొమ్మిది కాదు, తొమ్మిదిన్నర అయింది. ఇంత లేట్ గా వచ్చావు, అసలు నిన్ను స్కూల్ లోపలికి పంపకూడదు తెలుసా, రోజు సమయానికి వచ్చే  కుర్రాడివి, ఎప్పుడూ లేట్ రావని ఈవాళ ఒక్కరోజు లోపలికి  పంపుతున్నాను. రేపటి నుండి ఆలస్యంగా వస్తే బయటే నించోబెడతాను. ఏంటి అర్ధమయిందా?” అని గదమాయించాడు.

అర్ధమయినట్లు గా భయంగా  తలాడించాడు సీను.

వాడి మొహంలో భయం చూసి జాలి వేసి  “ఫో, లోపలకి” అని గట్టిగా కసిరి పంపాడు.

సీనుగాడు నెమ్మదిగా కాళ్ళీడ్చుకుంటూ క్లాసు లోకి వెళుతున్నాడు. వెనకనుండి  బంట్రోతు అరిచాడు.

“అక్కడ కాదు, ఆ చివరన ఉన్న ఆ పెద్ద రూమ్ లోకి వెళ్ళు, ఇవాళ్ళ మీ క్లాసు అక్కడకి మారింది”

ఆ అరుపుతో  ముందుకు వెళ్ళాడు సీనుగాడు. శనివారం రోజున మొదటి పీరియడ్ తెలుగు క్లాసు. ఆ క్లాసు అంటేనే గండం వాడికి. పద్యాలూ అసలు చెప్పలేడు. ఐదవ క్లాసు చదువుతున్నాడు. అసలు అందుకే స్కూల్ కి ఆలస్యంగా బయలుదేరాడు. తెలుగు క్లాసు తప్పించుకోవచ్చునని.

వాడింటి నుంచి స్కూల్  కి వచ్చే దారి లో ఎన్నో వింతలూ, విశేషాలు చూసుకుంటూ వస్తాడు. ఒక పక్కగా కాలవ పారుతూ ఉంటుంది. అందులో బుడుకు బుడుకు మంటూ తుళ్ళే చిన్న చేప పిల్లలని చూడటం ఒక వింత, అలాగే కాలవ నిండా విచ్చిన తెల్లకలువలు, ఎర్ర తామరలను చూస్తూ ఉండటం మరో వింత, ఇంకో పక్క కొబ్బరి చెట్ల మధ్య నుండి తలలు ఊపుతున్న వరి కంకులను, వాటి మీద వాలే పిచ్చుకలను చూడటం మరో వింత.

 

ఆ పక్కనే ఉన్న రైలు కట్ట ఎక్కి పట్టాల మీద అర్ధరూపాయి గాని రూపాయి బిళ్ళ గాని పెట్టి రైలు వెళ్ళాక చూస్తే అది అణిగిపోయి, నొక్కుకుని ముడుచుకి పోతుంది. అది సీనుగాడి కి ఎంతో ఇష్టమైన ఆట. డబ్బులు అలా చేస్తే లక్ష్మి దేవి మనకు అసలు డబ్బులివ్వదని ఆ తరువాత వాళ్లమ్మ చెప్పినా నేను చిన్న పిల్ల వాడిని కదా నన్ను తిట్టదు  అని, వాడు ఆవిడకి దండం పెట్టుకుని మరీ చేస్తాడు ఆ పనిని.

అదే కాకుండా రైలు పట్టాల మీద చెవులానించి రైలు వచ్చేటప్పుడు చేసే  ధక్, ధక్  అనే చప్పుడు కూడా ఇష్టం, ఇవన్నీ చూస్తూ కాలక్షేపం చేసే వాడికి స్కూల్ కి వెళ్ళడం  మాత్రం నచ్చేది కాదు.

అదికాకుండా వాడి చేతిలో ఓ పిల్లనగ్రోవి ఉండేది… అది వాళ్ళ ఊరి అమ్మవారి  జాతర సమయం లో వాళ్ళ నాన్న కొని ఇచ్చాడు. ఇక అప్పటి నుండి వాడు దాన్ని అస్సలు వదిలిపెట్టేవాడు కాడు. నిజంగానే వాడు ఆ పిల్లనగ్రోవి వాయిస్తూ ఉంటే ఎంతో బావుండేది. అందులో శాస్త్రీయత లేదు.  రాగజ్ఞానం అంతకన్నా లేదు కాని. ఏదో సమ్మోహనం ఉండేది. వాడు వాయిస్తుంటే,  వాడి చుట్టురా ఆవులు గేదేలు,మేకలు వచ్చి గడ్డి మేస్తూ ఉండేవి.

“ఏరోయి, పెద్ద గోపాలక్రిష్ణ డు అనుకుంటున్నావా?ఎప్పుడూ దాన్ని పట్టుకొని  ఊదుతూ ఉంటావేమిటిరా? చదువు తక్కువ గాని ఇలాంటి విద్యలకు ఏమి తీసిపోవు!” అంటూ మాస్టారు గట్టిగా కేకలు వేసేవాడు.

అందుకే తెలుగు మాస్టారుని చూస్తే చాలు గడగడలాడిపోతాడు.

ఇక ఆయన “ ఏరా సీను, నిన్న చెప్పిన పద్యం వొప్పచేప్పరా” అంటే చాలు వాడి కాళ్ళలోంచి వణుకు వచ్చేస్తుంది, పెదాలు పెగలవు, నోటినుండి ఒక్క అక్షరం  ముక్క రాదు. అందుకే చదువంటేనే వాడికి  పెద్ద గండం. భయం భయంగా. క్లాస్ రూమ్ లోకి అడుగు పెట్టాడు. విచిత్రంగా ఆ రోజున మాస్టారు చేతి లో బెత్తం లేదు, ఆయన పులిలా గాండ్రించటమూ లేదు. కుర్చీలో కూర్చొని ఏదో  పేపర్  చూస్తూ ఉన్నాడు.

“మాస్టారండి, సీనుగాడు వచ్చాడండి” అన్నాడు ఇంతలో ఒకడు.

వెంటనే తలెత్తి “రా రా !ఇంత ఆలశ్యంగా వచ్చావేమిరా”  అన్నాడు  ఆయన, అయినా  అలాగే   బిత్తరపోయి నించుని వాడిని చూసి “రా  రా,  పర్వాలేదు లే , వెళ్లి నీ సీట్లో కూర్చో” అన్నాడు.

 

సీనుగాడికి ఆశ్చర్యం వేసింది. మాస్టారు రోజూలా, వట్టి లాల్చీ పైజామాలో కూడా  లేడు, అదే జెండా పండగ రోజున వేసుకునే  కోటు వేసుకొని ఉన్నాడు.  

అదే కాకుండా వాడికి ఇంకో అనుమానం కూడా  వచ్చింది. మాస్టారు మొహం లో కోపం లేదు. ఏదో పోగొట్టుకున్న వాడిలా ఉన్నారు. ఎందుకు?

అనుకుంటాం కానీ, చిన్నపిల్లలో పరిశీలనా శక్తి అమోఘం.

‘ఏమైంది? నాకు తెలియ లేదే ? కానీ మాస్టారు  ఏదో బాధ పడుతున్న మాట మటుకు నిజం’ అని వాడికి అర్దమయింది. అప్పుడే వాడి పేరు చదివాడు క్లాసు లీడర్.

సీను ఎంతకూ పలకకపోయేసరికి మాస్టారు  గట్టిగా పిలిచి  నిన్న నేర్చుకున్న పద్యం చెప్పమన్నాడు.

వాడి కాళ్ళు వణుకుతున్నాయి. బెంచి మీద చేతులు అదిమిపెట్టి పొడారి పోయిన గొంతుతో  పద్యం లో  మొదటి పాదం చదివాడు. ఆ చదవడం కూడా తత్తరపడుతూ చదివాడు.

మాస్టారు ఎక్కడ  తిడతాడో, అనే భయం తో తలపైకి ఎత్తలేదు.

ఆ లోపలే “నేను నిన్నేమి అనను రా, కాని ఒక్క మాట చెప్పు, చూసావా, ఎంత తడబడుతూ   చదివావో? ఇదేనా నేర్చుకునే విధానం? ఇలా అయితే పై క్లాసు లకి ఎలా వెళతావు, అసలు చదువు విలువ తెలుస్తోందా? ముందు తెలుగు శుభ్రంగా నేర్చుకొండిరా, అయినా ఎన్ని సార్లు చెప్పాలిరా, ముందు మన మాతృ బాష పూర్తిగా నేర్చుకోవాలని, చూసావా రేపు, ఎల్లుండి అని వాయిదాలు వేస్తే ఇదిగో ఇలానే అవుతుంది.

“మిమ్మల్ని చూస్తుంటే బాధగా ఉందిరా, కారణం- మీ తల్లితండ్రులకి నేను పాఠాలు చెప్పడం ఇష్టం లేదు. ఎందుకో తెలుసా, ఏదో మిమ్మల్ని పనులలో పెడితే డబ్బు సంపాదిస్తారని వాళ్ళ ఆశ. మీకు చదువు విలువ తెలియటం లేదు. అందుకే మీకు బలవంతంగా అయినా చదువు చెప్పాలని నిర్ణయించుకొన్నా. కాని మీలో కొందరు అస్సలు చెప్పిన మాట వినకుండా ఉన్నారు. చదువుకుంటే బతుకు ఉంటుంది రా, చదువు వల్ల చెడిపోయిన వాళ్ళు ఎవ్వరూ ఉండరు.

అది గాక ఇవాళ నాది చివరి పాఠం.  రేపటి తో నా గొడవ మీకు వదిలిపోతుంది. ఇక మిమ్మల్ని చదువుకోమని ఎవ్వరూ నిర్భంధించరు. హాయిగా, సంతోషంగా ఉండండి”. అనగానే శీను గాడి తో సహా అందరూ “మాస్టారు మీరు మాకు కావాలి. ఎక్కడకి వెళ్ళద్దు. పాఠం  చెప్పండి మాకు” అని గట్టిగా అరిచారు.

“సరే సరే! ముందు  మహాత్మాగాంధీ గారు ప్రభావితమైన శ్రవణకుమారుని  గురించిన పాఠం చెబుతాను. వినండి!” అంటూ చెప్పడం మొదలుపెట్టారు.

“ఇన్ని రోజులు శ్రద్ధగా వినలేదు. అందుకే పాఠాలు అర్ధం అవలేదు. కాని ఈవాళ పాఠం వింటుంటే, ఎంత బాగా అర్ధమయిందో! నిజంగా కళ్ళకి కట్టినట్లు చెప్పారు మాస్టారు!  శ్రవణ కుమారుడి కధని!  పాపం  శ్రవణ కుమారుడు, నాకు ఏడుపొస్తోంది” అనుకున్నాడు సీను .

మొత్తం పాఠం అంతా చెప్పటం అయిపోయాక అప్పుడు చెప్పారు మాస్టారు,  “పిల్లలూ, రేపటి నుంచి నేను స్కూల్ కి రావటం లేదు. ఈ ఊరుని, స్కూల్ ని మిమ్మల్నందరిని విడిచి వెళ్ళిపోతున్నాను.   నన్ను ఇక్కడ నుంచి మా ఊరుకి బదిలీ  చేసారు” అని  చెబుతూ  దుఃఖంతో గొంతు  పూడుకుపోగా, కళ్ళనీళ్ళ పర్యంతం అయింది ఆయనకి .

పులిలా ఉండే మాస్టారు అలా బేల లా అయిపోవడం చూసేసరికి, పిల్లలందరికి  కూడా ఏడుపు వచ్చింది.

“అందరూ బాగా చదువుకొని పేరు తెచ్చుకోవాలి. ఎవ్వరూ మానేయద్దు. ఒరే, సీనూ! ఎప్పుడు ఆ పొలాలగంట్లంట తిరగడం కాదు. బాగా చదువుకొని పేరుతెచ్చుకోవాలి, సరేనా!”.

“సరే మాస్టారు, అయినా మీరు ఎందుకు వెళ్ళిపోతున్నారు?”  ధైర్యంగా సీనుగాడు అడిగాడు. వాడికి మాస్టారు అంటే ఎంత భయం ఉన్నా ఆయన వెళ్ళి పోతున్నారంటే మటుకు తట్టుకోలేకపోతున్నాడు.

“నేను వెళ్ళాల్సిన సమయం వచ్చిందిరా.  అయినా మీకు  కొత్త మాస్టారు వస్తున్నారు. చక్కగా ,శ్రద్ధగా చదువుకోండి” అని అన్నారు.

“మరి మీరు ఎక్కడకి వెళుతున్నారు” అని ఆరాగా అడిగాడు.

“నేను మా ఊరికి వెళ్ళి పోతున్నాను” అని బాధగా చెప్పారు.

“ఆయన వస్తే మీరు ఎందుకు వెళ్ళిపోవడం? అని అడిగాడు.

వాడు అడిగిన అమాయకపు ప్రశ్న వెనుక ఎన్నో తీర్చలేని సందేహాలు.

“అది కాదు మాస్టారు, మీరు ఇన్ని రోజులు మాతో నేఉన్నారు కదా ! ఇక్కడే ఉండి పాఠాలు చెబుతున్నారు కదా! మరి ఎందుకు వెళ్ళిపోవడం, ఇద్దరూ ఇక్కడే ఉండి చెప్పవచ్చు  కదా ” అని సీనుగాడు  లాజికల్  గా అడిగాడు

“అలా కుదరదు రా” అని  అన్నాడు మాస్టారు

ఆ రాత్రి ఎంతకీ నిద్దురపట్టలేదు మాస్టారు కి.  చిన్నప్పడు అమ్మ తన ఊరు గురుంచి ఎంతో గొప్పగా వర్ణించి చెప్పేది. అది మనసులో నాటుకుపోయింది. అనుకోకుండా ఆ ఊరికే  టీచర్ గా ఉద్యోగం రావడం ఓ అద్భుతంగా అనిపించింది. కానీ ఆ సంతోషాన్ని పంచుకోవటానికి అమ్మ  ఈ లోకం లో లేకపోయినా,  ఈ నేలనే అమ్మగా భావించి  వచ్చాడు. అందుకే  ఈ ఊరు అన్నా,ఇక్కడి మనుషులన్నా అంతులేని ప్రేమ, అభిమానం.

మేఘాలతో మూసుకుపోయే ఎత్తైన కొండల కింద ఉన్న అందమైన లోయలో ఉంది ఊరు.

ఊర్లోకి వెళుతుంటే, ఓ పక్కగా ఉంది. స్కూల్ కొంచెం పాత బడిన గేటు,నాలుగు వైపులా గదులు,మధ్యలో ఖాళీస్థలం, వెనకవైపు ప్లే గ్రౌండ్.  చుట్టురా పహారా కాస్తున్నట్లు  పొడవాటి చెట్లు శుభ్రమైన పరిసరాలతో గురుకులం లా ఉంది.

బడి ఉన్నా కూడా టీచర్స్  సరిగ్గా రాక ఉన్న ఆ  మారుమూల అడవి కి చదువు చెప్పటానికి వెళ్ళాడు.  వాళ్ళలో ఒకడిగా  కలిసి మెలిసి తిరుగుతూ వాళ్ళకు  ఆప్తుడయ్యాడు, అందరిలాగా వాళ్ళకు చదువుకొని ఉద్యోగాలు చేయాలనీ, తమ బ్రతుకులు బాగు చేసుకుంటూ తమ వాళ్ళలో విజ్ఞాన దీపం వెలిగించుకోవాలని  వాళ్లలో  కొందరు  ఆశ పడుతున్నారని  తెలిసి తన వంతు కర్తవ్యం పాటించాలని అనుకున్నాడు.  కానీ, ఇంతలో పులి మీద  పుట్రలా ఎవరి  ప్రాంతాలకి  వాళ్ళు వెళ్ళిపోవాలని ఆదేశాలు వచ్చాయి.

అందుకే  సీను గాడి ప్రశ్నల పరంపరకి తట్టుకోలేక, జవాబులు చెప్పలేక అక్కడ నుండి వచ్చేసాడు.

 

మరునాడు సీను గాడు  బడి తోటలో పెంచుతున్న మొక్కలు దగ్గరకు వెళ్లి వాటిని నిమురుతూ  ‘మీరు  ఏడుస్తున్నారా” అని అమాయకంగా అన్నాడు.

ఆ తరువాత  వాళ్ళ అమ్మ పిలుస్తున్నా  తిండి కూడా తినకుండా మాస్టారు రైలు ఎక్కేంతవరకు, అతని చెయ్యి పట్టుకుని వెంబడే ఉన్నాడు. రైలు కదలడానికి కూత వేసింది. మాస్టారు, సీనుకి మరోసారి బాగా చదువుకో మని చెప్పి భుజం తట్టి బండిలోకి ఎక్కారు. రైలు కదిలింది. అది కొంత దూరం వెళ్ళాక  “మాస్టారు  మీరు చెప్పినట్లే  మన  తోటని  బాగా పెంచుతాము” అని రైలు తో పాటే  పరిగెత్తుతూ, ఒగరస్తూ చెప్పాడు.

అది విన్న మాస్టారు“ అలాగే జాగ్రత్త, పడి పోతావు,ఇంకా ఆగి పో” అంటూ వాడి అభిమానానికి పొంగిపోయారు

సీనుగాడు రైలు మలుపు తిరిగే వరకు చూస్తూనే ఉన్నాడు. వాడి కళ్ళలోంచి నీళ్ళు బుగ్గల మీదగా జలజలా  జారుతున్నాయి

“ఆరేయ్, మాస్టారు మళ్ళీ తిరిగి ఎప్పుడు వస్తారురా మన స్కూల్ కి?” అన్నాడు సీనుగాడి బెస్ట్ ఫ్రెండ్ చిన్నయ్య.

“అది తెలియదు గాని, మాస్టారు చెప్పినట్లు ముందు మనం బాగా చదువుకుందాము. అప్పుడు మన మాట వింటారు. వెంటనే  వెళ్ళి  మాస్టారుని మన ఊరి స్కూల్  కే  తెచ్చేసుకుందాము” అని కళ్ళు తుడుచుకుంటూ గట్టిగా నమ్మకంగా చెప్పాడు పట్టాల మీద నుంచి నడుస్తూ సీనుగాడు.

చిన్నయ్య కూడా కళ్ళు తుడుచుకుంటూ సీను గాడి  వెనకాలే నడిచాడు.

రైలు ప్లాట్ ఫారం దాటేవరకూ తలుపు దగ్గరున్న మాస్టారు, వేగం పుంజుకున్నాక  సీట్ లోకి వెళ్లి  కూర్చొని  కళ్ళుమూసుకొని ఒక్కసారి ఆ ఊరుతో ఉన్న అనుబంధాన్ని  గుర్తుతెచ్చుకున్నాడు.

ఈ  ప్రాంతం, మనుషులు, అలవాట్లు పద్దతులతో మమేకమైన జీవితాన్ని బలవంతంగా పెకిలించవలసి వచ్చింది. ఎక్కడనుంచి మొదలయిందో మళ్ళీ అక్కడికే వెళ్ళడం, ఊహించని విధంగా జీవితం ఒక వృత్తం పూర్తి చేసుకుంటోంది.

చుట్టురా ఎత్తైన కొండలు, వాటిని ఆనుకుని మధ్యలో లోయలు. ఆకుపచ్చటి తివాచీ పరచినట్లున్న వొంపుసొంపుల మైదానాలు, కొండలపై ఎటు చూసినా చిక్కటి వనాలు… ఏదో పెయింటింగు గీసినట్టు ఉండే సుందర ప్రకృతి.  వాటి మధ్యన ఉండే ఎన్నో గూడేలు, కల్లాకపటం తెలియని అమాయకపు మనుష్యుల మధ్య గడిపిన జీవితం అంతా కళ్ళముందు మెదిలింది. నేను నాటిన ఈ  మొక్కలు, పదిమందికీ నీడ నిచ్చే మహా వృక్షాలుగా ఎదగాలి అనుకుంటూ మాస్టారు కళ్ళు తుడుచుకున్నారు.

ఇజాలు, కులాలు, మతాలు, ప్రాంతీయతలు లేని సార్వజనీనమైన గురు శిష్య బంధం యొక్క ముడి భౌతికంగా వీడింది. కానీ  మనసు  బంధం మాత్రం చిక్కటి అల్లిక తో అల్లుకుని ఉండటం వల్ల మరింత గట్టిగా బిగిసింది.

ఆ అనుబంధం తాలూకు తడి మాత్రం ఎప్పటికీ ఎండిపోదు, వాడిపోదు’ అని దృఢంగా అనుకున్నారు”.

***

Bio

మణి వడ్లమాని

గత మూడేళ్ళుగా కధలు రాస్తున్నారు. 35 ఏళ్ళనుండి హైదరాబాద్ లోనే నివాసం.

ఇప్పటి దాకా దాదాపు  ఒక ముప్పయి కధలు  రాసాను, తొలి కధ కౌముది అంతర్జాల మాసపత్రికలో ప్రచురించారు. ఆ తరువాత వరుసగా  నవ్య, ఆంధ్రభూమి స్వాతి, తెలుగు వెలుగు, విపుల, రచన, జాగృతి వంటి వార, మాస పత్రికలలోను, ఆంధ్రప్రభ, సాక్షి, నమస్తే తెలంగాణా, మనతెలంగాణ వంటి దినపత్రికలలో వీరి కధలు ప్రచురింపబడ్డాయి. చతుర సంపాదక  వర్గం వీరి తొలి నవలికను ప్రచురణకు ఎంపిక చేసారు.

***

Mani Vadlamani
Comments
bottom of page