top of page

వ్యాస​ మధురాలు

  అప్పిచ్చివాడు వైద్యుడు-11
 

పరకాయప్రవేశం

girja sankar.JPG

 చింతపల్లి గిరిజా శంకర్

మనకందరికీ తెలిసిన అణిమాది అష్టసిద్ధుల్లో సంభవించే పరకాయప్రవేశం కాదు. కొన్ని భౌతిక బాధలు (Physical Illness) మానసికబాధల్లాగా పొడచూపి, అటు రోగికీ ఇటు వైద్యుడికీ గందరగోళం కలుగజేసే వ్యాధులు.

ఒకసారి నాకొక కన్సల్టేషన్ వచ్చిందిసర్జికల్ డిపార్టుమెంట్ నుంచి.  "పేషంట్ కి ఆ మధ్యనే ప్రొస్టేట్ గ్రంధి తీసెయ్యల్సివచ్చింది, కాన్సర్ కారణంగా. కొంచెం నెమ్మదిగా కోలుకున్నాడు. సంవత్సరమయినా, ఇంకా వయసుకి తగ్గిన శక్తి రాలేదని నిర్ణయించారు. అతను టెక్సాస్ లో కృషీవలుడు. పొలాల్లోనే ఇల్లు కట్టుకుని అతనూ(70 సం.) అతని భార్య ఇద్దరే ఉంటారు. వాళ్ళకి  పెళ్ళయ్యి 50 సంవత్సరాలు. ఇద్దరు పిల్లలు వేరే రాష్ట్రాల్లో  ఉంటారు. అందరిలాగే మదర్స్ డే కి పిలుస్తూంటారు. వాళ్ళని జాన్, డెబ్బీ అందాము. ప్రస్తుతం జాన్ కి నిద్దర సరిగ్గా పట్టదు. ఆకలి తగ్గింది, బరువు తగ్గాడు. హుషారు లేదు. ఏ పనీ చెయ్యబుద్ధికాదు. చిన్నప్పట్నించీ పొలంలో పని, కాయకష్టం చేస్తూ పెరిగిన అతనిలో భార్యా, మిత్రులూ చాలా తేడా కనబడుతున్నట్టుగా గమనించారు. చివరికి అందరూ కలిసి డిప్రెషన్ అని నిర్ణయించి నా దగ్గరికి తీసుకొచ్చారు.

అదీ ఉపోద్ఘాతం. ఇరవై యేళ్ళ కిందట నేను మొదటిగా చూసినప్పుడు, భార్యాభర్తలిద్దరూ  ఫార్మల్ బట్టలు, అతడు సూట్, ఆమె మంచి డ్రెస్స్లో కనబడ్డారు.

నా అనుభవంలో టెక్సాస్  లో చాలామంది old fashioned residents డాక్టర్ దగ్గరికి వచ్చేటప్పుడు, గవర్నర్ ఆఫీసుకు వచ్చినట్టు వస్తారు.

డిప్రెషన్ డయాగ్నసిస్ ని వాళ్ళు అంగీకరించారు. మందులు వాడటానికి ఒప్పుకున్నారు. నెలనెలా ఫాలో అప్ కి వచ్చేవాళ్ళు. వచ్చినప్పుడల్లా ఎంత ఓపిక లేకపోయినా, మర్యాద దుస్తులు వేసుకుని వచ్చేవారు. డాక్టరు బాధపడతాడని నాకు "అన్నీ బాగానే ఉన్నాయి" అని చెబుతున్నారని నాకు అనుమానం కలిగింది.

ఒకానొకరోజు, నేను ఆఫీసుకి వచ్చే టైం కే వాళ్ళూ వస్తున్నారు.  పార్కింగ్ లాట్ నించి హాస్పిటల్ బిల్డింగ్ దగ్గరికి కలిసి నడుస్తూ వచ్చాము.  అప్పుడు అతన్ని పరీక్షగా చూశాను. నడవడం చాలా నెమ్మది, చేతులు ఊపడం లేదు. అడుగులో అడుగు వేస్తున్నట్టు కనిపించింది. అడిగితే ఒక ఆరునెలల నించీ నడక ఇలా మారిందని చెప్పారు.

 

నాకు వెంటనే డయాగ్నోసిస్ స్ఫురించింది. ఆఫీసుకి వచ్చాక, ఇద్దరినీ కూచోబెట్టి చెప్పాను, "నీకు డిప్రెషన్ ఉండచ్చుగాక, కానీ నా వుద్దేశంలో ఇంకో జబ్బుందని అనుకుంటున్నాను. ఒక మందున్నది. అది వాడితే 3 రోజుల్లో నా వూహ తప్పో కాదో తెలిసిపోతుంది. ప్రయత్నిద్దామా?"

అని అడిగాను. ఇద్దరూ తడుముకోకుండా "తప్పనిసరిగా" అని వంతపాడారు.

Amantadine 100mg  రోజుకు మూడుసార్లు వేసుకుని వారం తరవాత రమ్మని చెప్పాను. 

వారమయిన తరవాత ఇద్దరూ వచ్చి ఆఫీస్ వయిటింగ్ రూం లో కూర్చున్నారు. 10 గంటల అప్త్ కి 8 గంటలకే వచ్చి కూర్చున్నారు. నన్ను చూడగానే అతడు, 'డాక్టర్,  ఇది చూడు' అని నన్ను బయట వసారాలోకి తీసుకెళ్ళి, ఈ చివరి నుంచి ఆ చివరిదాకా గబగబా నడుస్తూ విక్టరీ సైన్ చేస్తూ ఆకర్ణాంతం నవ్వుతూ సెల్యూట్ కొట్టాడు. అతని భార్య నన్ను కావలించుకుని నాకు ఫ్లవర్స్ బొకే టేబిల్ మీద పెట్టింది.

అతనికున్న జబ్బు Parkinsons Desease. అది ముఖ్యంగా మూడు రకాలుగా కనబడుతుంది. 1. Tremor [అంటే "వణుకుడు" ముఖ్యంగా అరిచేతుల్లో  వేళ్ళు. దానికి  pill rolling movements అని పేరుపెట్టారు దొరలు. అంటే చేత్తో చిన్న మాత్రలని నలుపుతున్నట్టన్నమాట.  2. కాళ్ళూ చేతులూ కండరాలు గొట్టాల్లాగా అయి మామూలుగా ఉండే మెత్తదనం ఉండదు దీన్ని దొరలు Rigidity అన్నారు.  3. మొత్తం శరీరమంతా స్లో మోషన్ లోకి వెళ్ళిపోతుంది. మామూలుగా 100 మైళ్ళ స్పీడు కాస్తా, 20 మైళ్ళకొస్తుంది. దీన్ని Dyskinesia అన్నారు. మన జాన్ కి మూడో రకంగా బయట పడ్డది.

మామూలుగా ఈ జబ్బున్నవాళ్ళని న్యూరాలజిస్ట్ ట్రీట్ చేస్తారు. మన జాన్ కి కూడా డయాగ్నోసిస్ అయినతరవాత న్యూరాలజిస్ట్ దగ్గరికే పంపించాను.

కథ సుఖాంతం.

మన చుట్టాల్లో, స్నేహితుల్లోగానీ వాళ్ళ స్పీడు తగ్గిపోతే, ముఖ్యంగా వాళ్ళు "పెళ్ళి" నడకలతో నడిస్తే, నడిచేటప్పుడు, "చేతులు ఊపకుండా" నడుస్తుంటే, డాక్టర్ కి చూపించండి. గోటితో పోతుంది.

 

ఈ జబ్బు 1920 లో వచ్చిన Flu epidemic తరవాత  20 సంవత్సరాలకి ఆ జబ్బు వచ్చిన చాలామందికి parkinsons disease వచ్చింది. ఆ ఫ్లూ బ్రెయిన్ లో ఆ సెంటర్స్ లో మార్పు  తెచ్చింది అన్నమాట. ఆ సెంటర్ ని   Corpus striatum అంటారు.

పక్షవాతం వచ్చినవాళ్ళకి, డిమెన్షియా వచ్చినవాళ్ళకీ, బ్రెయిన్ లో ట్యూమర్స్ ఇత్యాది జబ్బుల్లో ఈ బాధ కలగవచ్చు.

లాంగ్ టర్మ్ ఇన్స్యూరెన్స్ తీసుకోవాలనుకునేవాళ్ళు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం. వాళ్ళ నో లిస్ట్ లో మొట్టమొదటి జబ్బు ఈ పార్కిన్సన్స్ డిసీస్, 2. ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటిస్.

*****

 

ఒకానొక 25 ఏళ్ళ యువతిని అప్పటికే ఒక కార్డియాలజిస్ట్, ఒక న్యూరాలజిస్ట్, ఒక పల్మనాలజిస్ట్ చూశారు. ముగ్గురూ మూడు వ్యాధుల పేరుచెప్పి మందులిచ్చారు. నాలగవసారి ఆ యువతి ER కి వస్తే నేను చూసి కరెక్ట్ డయాగ్నసిస్ చేసి మందులిచ్చాను. "వాళ్ళకంటే నువ్వు పెద్ద మొగాడివా " అన్నట్టున్నాయి ఆ అమ్మాయి చూపులు, నా ఆఫీస్ నించి బయటికి వెళుతూ. వారం రోజుల తరవాత  ఆ కళ్ళే కృతజ్ఞతాభావంతో సంతోషంగా కనిపించాయి. ఈ మాయ తెలుసుకోవాలంటే, వచ్చే సంచికదాకా ఆగండి.  

*****

bottom of page