top of page

కథా​ మధురాలు

అమ్మ - అపోహ

 

ఆర్ శర్మ దంతుర్తి 

Madhuravani_Social

మెడికల్ కాలేజీలో క్లాసులు మొదలైన మూడో వారం. ఎండోక్రినాలజీ ప్రొఫెసర్ పాఠం ఎత్తుకుంటూ  థైరాయిడ్ సంగతి చెప్పడం మొదలుపెట్టాడు. క్లాసులో కూర్చున్న శ్రీకర్ కి గుర్తొచ్చింది జీవితంలో ఇప్పటికే ఎన్నోసార్లు చిన్నప్పటినుంచీ విన్నమాట – అమ్మ థైరాయిడ్ సమస్యతోనే పోయింది, తనకి మూడో ఏటనో, నాలుగో ఏటనో. తన తోటి పిల్లల అమ్మలు స్కూలు కొచ్చి వాళ్ళని తీసుకెళ్తున్నప్పుడూ, ఏవయినా ఆటలపోటీలు జరిగితే వాళ్లని దింపినప్పుడూ, ఆ ఆట జరిగినంతవరకూ అది పిల్లలు ఎలా ఆడినా గో, గో అంటూ అరుస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేసినపుడూ తనకి గుండె గొంతుకులోనే ఉండేది. తండ్రి వచ్చి ఎంత ఎంకరేజ్ చేసినా, అది సగం సంతోషం మాత్రమే. అమ్మ అనేది ఎలా ఉంటుందో తనకి ఫోటోలోనే తెలుసు. శ్రీకర్ ఆలోచనలు తెంచుతూ ప్రొఫెసర్ కంఠం వినిపించింది.

 

"... చిన్న సైజులో సీతాకోక చిలుక లాంటి ఆకారంలో ఈ థైరాయిడ్ ఉండేది కంఠం దగ్గిర ఆడమ్స్ ఏపిల్ అనే చోట. ఇది శరీరంలో ఉండే మెటాబోలిజం ని దాదాపు పూర్తిగా కంట్రోల్ చేస్తుందని చెప్పవచ్చు. ఇది ఉత్పత్తి చేసే హార్మోన్లు మూడు, టి-త్రీ, ట్-ఫోర్, కాల్సిటోనిన్ అనేవి. ఈ హార్మోన్లు హెచ్చుతగ్గుల వల్ల వచ్చే రోగాలని హైపో లేదా హైపర్ థైరాయిడిజం అని అనడం ముందు ముందు చదువుతాం.  థైరాయిడ్ హార్మోన్ల వల్ల శరీరంలో అనేకానేక అవయవాలు, అంగాలు సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా అని తెలుసుకోవచ్చు. ఈ హార్మోన్ల వల్లే ఆకలి, మెటాబోలిజం, శరీరంలో గ్లూకోజ్ కంట్రోల్ అన్నీ సరిగ్గా జరగేది. గుండె సరిగ్గా కొట్టుకోవడానికీ, పిల్లలు పుట్టాక వాళ్ళలో సరైన ఎదుగుదలకీ, అలా శరీరంలో అనేకానేక విషయాల్లో ఈ థైరాయిడ్ ప్రభావం ఉంటుంది. మీకు తెలిసే ఉండొచ్చు. ఈ థైరాయిడ్ గ్రంధి సరిగ్గా ఉండకపోతే బాగా ఎత్తు పెరగడం, పెరగక పోవడం వగైరాలు. థైరాయిడ్ సరిగ్గా పనిచేయకపోవడానికి అనేకానేక కారణాలు. కొంతమందికి పుట్టుకతో వచ్చే జబ్బులు కారణం కావొచ్చు, మరి కొంతమందికి తల్లి కడుపులో ఉండగానే తల్లికీ బిడ్డకీ కూడా థైరాయిడ్ సమస్య రావొచ్చు. అయితే ప్రసవం అయ్యాక కొంతమంది మహిళలకి ఈ సమస్య తగ్గుతుంది కానీ కొంతమందిలో తగ్గదు. అలా తగ్గని వారిలో ఈ హెచ్చుతగ్గులకి జీవితాంతం మందులు వాడుతూ ఉండాలి.” 

 

క్లాసులో ఎవరో అమ్మాయి ప్రశ్న అడగడానికి చేయి ఎత్తడంతో ప్రొఫెసర్ మాట్లాడ్డం ఆపి ఆ అమ్మాయికేసి చూశాడు. 

 

“ఈ థైరాయిడ్ సమస్య వల్ల మందులు వాడడం సరే కానీ ప్రసవం వల్ల వచ్చే థైరాయిడ్ హార్మోన్ హెచ్చుతగ్గుల వల్ల కేన్సర్ రావొచ్చా, లేదా మరో సమస్య ఏదైనా?”

 

“థైరాయిడ్ హార్మోన్ హెచ్చుతగ్గుల వల్ల అనేకానేక సమస్యలు రావచ్చు. అందులో మెటాబోలిజం ప్రోబ్లెం ఒకటి. వీటి వల్ల గుండె కొట్టుకునే వేగం, ఎంత బలంగా కొట్టుకుంటుందీ అనేవి హెచ్చవచ్చు. అలా గుండెలో మార్పు రాగానే ఆక్సిజన్ ఎక్కువగా కావాల్సి వచ్చి, ఎక్కువగా ఊపిరి తీసుకోవడం, అక్కడనుంచి మిగతా సమస్యలూ ఉత్పన్నమౌతాయి. అయితే కేన్సర్ రావొచ్చా? అనేదానికి ఇదమిద్ధంగా ఇదీ అని సమాధానం చెప్పలేం. కేవలం హార్మోన్ హెచ్చుతగ్గుల వల్లే కేన్సర్ రాకపోవచ్చు కానీ మిగతా కారణాలు ఉంటే కేన్సర్ రావొచ్చు.” 

 

“మా పిన్నిగారికి ఈ థైరాయిడ్ కేన్సర్ వచ్చింది అన్నారు. దానికి ఆపరేషన్ చేద్దామనుకునేలోపులే పోయారు. అందువల్ల అడిగాను, నిజానికి ఆవిడకు పెద్దగా మిగతా సమస్యలు ఉన్నట్టు మాకు తెలియదు.”

 

“మీ పిన్నిగారు పోయి ఎన్నాళ్ళయింది?” ప్రొఫెసర్ అడిగేడు. 

 

“ఓ పదిహేను సంవత్సరాలు అయిండొచ్చు,” ప్రశ్న వేసిన అమ్మాయి చెప్పింది. 

 

“అప్పట్లో మెడిసిన్ లో ఇప్పుడు ఉన్నన్ని మందులూ, అంతగా కేన్సర్ రీసేర్చ్ ఉండి ఉండకపోవచ్చు. ప్రస్తుతం ఫర్వాలేదు. ఈ థైరాయిడ్ సమస్యని కంట్రోల్ లో పెట్టే రేడియోఏక్టివ్ అయోడిన్ వంటి మందులూ, సర్జరీ అవీ ఉన్నాయి. అయినా ఆవిడకి కేన్సర్ మిగతా అవయవాలకి పాకి ఉండొచ్చు కదా? అందులో కేన్సర్ పాంక్రియాస్ కి పాకితే సాధారణంగా రెండు మూడు వారాల్లో ప్రాణం పోవచ్చు.”

 

ఇదంతా వింటున్న శ్రీకర్ చెప్పేడు, “మా అమ్మగారు కూడా థైరాయిడ్ సమస్య వల్ల పోయారని చెప్పారు. పోయినది నాకు మూడో ఏటో నాలుగో ఏటో. అసలు విషయాలు సరిగ్గా తెలియవు కానీ హార్మోన్ హెచ్చుతగ్గుల వల్ల వచ్చే సమస్యే. పోయినప్పుడు మాత్రం పోస్ట్ మార్టం చేసి కారణం అదీ విపులంగా చెప్తామన్నారుట. మా నాన్నగారు మాత్రం – చెట్టంత మనిషే పోయినప్పుడు కారణం ఎందుకని అక్కడే వదిలేసారు ఆ విషయాన్ని అని చెప్పారు.”

 

ప్రొఫెసర్ చెప్పాడు, “సారీ అబౌట్ దట్. సరే, ఈ థైరాయిడ్ ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది అనేవి మనం మళ్ళీ లేబ్ లో చూద్దాం. కొన్ని శరీరాల్లోంచి వేరు చేసి తీసేసిన థైరాయిడ్ గ్రంధులని కూడా చూసి బాగా పనిచేసే గ్రంధికీ రోగగ్రస్థమైన గ్రంధికీ తేడా కూడా మనం లేబ్ లో నేర్చుకుంటాం,” ప్రొఫెసర్ చెప్పాడు వాచ్ కేసి చూసుకుంటూ, “ఈ రోజుకి క్లాస్ టైమ్ అయిపోయింది కనక ఇక్కడ ఆపుదాం. పుస్తకంలో ఐదో చాప్టర్ చదివి రండి వచ్చే క్లాస్ కి.” 

 

***

 

ఇంటికొచ్చిన శ్రీకర్ ని పలకరించాడు తండ్రి – “ఏరా ఈ రోజు ఎలా ఉంది స్కూల్లో? భోజనం చేస్తావా? అన్నీ వండి పెట్టాను.” భోజనం చేస్తూంటే అక్కడే కూర్చుని తండ్రి అడుగుతున్నాడు ఏవో విషయాలు.

 

ఒక్కసారి కన్నీళ్ళొచ్చాయి శ్రీకర్ కి. తల్లి పోయినప్పటినుండీ తనకున్నది తండ్రి ఒక్కడే. తనని స్కూల్ లో జేర్పించడం, తన బట్టలు ఉతకడం, వంట వండడం అన్నింటికీ ఆయనే. కంట్లో నీళ్లు కనబడకుండా గబుక్కున ఒక్కసారి బాత్రూంలోకి దూరి కాసేపటికి తమాయించుకుని బయటకొచ్చాడు, “కంట్లో ఏదో పడింది, కూరలో కారం ఎక్కువైంది కాబోలు,” నవ్వుతూ చెప్పాడు ఈసారి.

 

తండ్రి ఏమీ మాట్లాడలేదు.

 

మూడునాలుగు నిముషాలు ఆగి మళ్ళీ చెప్పాడు శ్రీకర్ – “ఈ రోజు క్లాసులో థైరాయిడ్ గురించి చెప్పారు. అమ్మ పోయినది ఈ థైరాయిడ్ సమస్య వల్లే అని నేను కూడా చెప్పాను. కానీ ఆయన చెప్పేదేమంటే థైరాయిడ్ వల్ల గుండె కీ మెటాబోలిజం కీ కూడా సమస్యలు వస్తాయిట. అమ్మకి ఏ సమస్యయుంటుందో అనిపించింది పాఠం వింటున్నప్పుడు.”

 

“అవునా? అమ్మ పోయి దాదాపు ఇరవై రెండేళ్ళు కదా? అప్పట్లో ఇంత తెలియదు థైరాయిడ్ గురించి మాకు. నువ్వు పుట్టాక కొన్నాళ్ళు వంట్లో నలతగా ఉంటే రక్తం తీసి చూసి చెప్పారు – ధైరాయిడ్ లో ఫలానా ఫలానా ఏవో సరిగ్గా లేవు మందులు వాడాలి అని. నాకు గుర్తే లేదు ఇప్పుడు అవేమిటో. ఆ తర్వాత మందులు వాడినా ఏదో ఒక సమస్య వస్తూ ఉండేది. జుట్టు ఊడిపోవడం, కారణం లేకుండా కోపం రావడం, బరువు పెరగడం, నిద్ర లేమి, ఒక్కోరోజు కడుపులో నెప్పి, మరో రోజుకి డయేరియా అలా సమస్యలు.  ఓ రోజు మాత్రం అర్జంట్ గా హాస్పిటల్ కి వెళ్ళాం. ఏమైందో తెలియదు – సారీ అని చెప్పారు. హార్ట్ ఎటాక్ కావొచ్చేమో, శరీరం కోసి అంతా వెతికి, పోస్ట్ మార్టంలో ఏమయి ఉంటుందో సరిగ్గా చెప్తాం, అన్నారు. నాకు అది సరైనదిగా అనిపించలేదు అప్పుడు. మనిషే పోయినపుడు ఇంక కారణం దేనికీ? శరీరం అంతా కోయడం దేనికీ? అని నేను వద్దని చెప్పాను.”

 

“నువ్వు అమ్మని మిస్ అవుతున్నావా ఇన్నాళ్ళూ?” 

 

“మొదట్లో చాలా కష్టంగా ఉండేది కానీ ఇప్పుడు కాదు. కాలం గాయాన్ని ఇలాగే మాన్పుతుందేమోలే.” 

 

“ఏమనుకోపొతే ఓ ప్రశ్న. అమ్మ శరీరం దహనం చేసారా? నువ్వు ఇండియా వెళ్ళి గంగలో కలిపావా ఆస్థికలు? మన హిందువులందరూ అలా చేస్తారుట కదా?” 

 

“లేదురా. అమెరికా రాగానే మొదట మేము చేసిన పనేమిటంటే – ఇద్దరం తలో వీలునామా రాసి పెట్టుకున్నాం. భయం అనుకో, మరోటి అనుకో ఏదైతేనేం ఆ కాయితాలు మాత్రం రాసాం. మేము పోతే అవయవాలు దానం చేయాలని, శరీరం మెడికల్ కాలేజీకి ఇవ్వాలనీను. అలా నేను అమ్మకి హిందూ ధర్మం ప్రకారం ఏమీ చేయలేదు. ఏడాదికోసారి మాత్రం – నీకు తెల్సిందే కదా, ఇక్కడ గుడిలో భోజనాలు, ఊళ్ళో ఉన్న సూప్ కిచెన్ కి విరాళం ఇస్తాను. అంతకన్నా ఇంకేమీ చేయలేదు. ఏమి చేయాలో తెలియలేదు కూడా.” 

 

“అమ్మ గురించి నీకు బాగా గుర్తున్న విషయం ఏదైనా ఉందా?” ఈ సారి నవ్వుతూ అడిగాడు శ్రీకర్, వాతావరణం వేడెక్కకుండా చూడటం కోసమా అన్నట్టూ. 

 

కాసేపు అలోచించి చెప్పాడు తండ్రి, “ఉంది. అమ్మకి కుడి మోకాలిమీద, ఎడమచేతి మీదా రెండు పెద్ద పుట్టుమచ్చలు ఉండేవి.  గమ్మత్తు ఏమిటంటే ఆ రెండు పుట్టుమచ్చలలోనూ స్పష్టంగా కనిపించే ఒక తెల్లటి చుక్క ఉండేది మధ్యలో. అలా ఎక్కడా నేను చూడలేదు. అవి మొదట్లో కేన్సర్ అని భయపడ్డాం కాని కేన్సర్ కాదని చెప్పారు.”

 

అక్కడితో ఆగింది సంభాషణ. కుర్రాడు భోజనం కానిచ్చి తన గదిలోకి వెళ్ళాడు చదువుకోవడానికి. తండ్రి డిష్ వాషర్ మీద పడ్డాడు మిగతా పనికి. అరవై దాటిన శ్రీకర్ తండ్రికి ఇప్పుడు ఉన్న ఒకే ఒక సమస్య ఈ కుర్రాడి మెడికల్ స్కూలు అయ్యేదాకా తాను బతికి ఉంటే చాలు. తర్వాత ఎవరి దారి వారిదే. 

 

***

 

మూడు వారాలు పోయాక ఎండోక్రినాలజీ లాబ్ లో అడుగుపెట్టాడు శ్రీకర్. ముగ్గురేసి స్టూడెంట్స్ కి ఒక్కొక్క శరీరం. శ్రీకర్ తో పాటు టీములో మరో ఇండియన్ కుర్రాడు నవీన్, మరో అమ్మాయి రేచల్. శరీరం ఎఫ్-1829927 టాగ్ ఉన్నచోటకి వెళ్ళి మొదటగా చూడాల్సింది కంఠం కేసి, అక్కడ ఉన్న థైరాయిడ్ గ్రంధి కేసి. శరీరం ఉన్న టేబిల్ దగ్గిరకి వెళ్ళాక చూసారు ముగ్గురూ. నల్లగా అయిపోయి కళావిహీనంగా ఉంది మహిళా శరీరం. థైరాయిడ్ గ్రంధికేసి చూద్దాం అనుకునేలోపున ప్రొఫెసర్ కంఠం వినిపించింది – “స్కాల్ పెల్ తీసుకుని మెల్లిగా కంఠం దగ్గిర కోయండి. అంతకు ముందు కోయబడి ఉంటే అది అప్పటికే తెరుచుకుని ఉంటుంది. మరీ లోతుగా కోయకూడదు, గ్రంధి లోపలకి దిగకుండా కోయండి. అప్పుడు లోపలకి చూస్తే కనిపిస్తుంది థైరాయిడ్ గ్రంధి.”

 

శ్రీకర్ కళ్ళు ప్రొఫెసర్ మీద నుంచి టేబిల్ మీద ఉన్న మహిళ శరీరం మీదకి తిప్పాడు – మూడో నిముషంలో  లేబ్ లో ధభ్ మని చప్పుడు. కింద స్పృహ తప్పి పడిపోయిన శ్రీకర్ ని నవీన్, రేచల్ పట్టుకుని అక్కడే ఖాళీగా ఉన్న టేబిల్ మీదకి చేర్చారు. ప్రొఫెసర్ వచ్చి చూసాడు, నాడి, శ్వాస మిగతా విషయాలు స్టెత్ పెట్టి. పక్కనే ఉన్న మరో రూమ్ లోకి తీసుకెళ్ళారు శ్రీకర్ ని. మరో సీనియర్ కుర్రాణ్ణి శ్రీకర్ కి తోడుగా పెట్టి మళ్ళీ లేబ్ లోకి వచ్చాక ప్రొఫెసర్ చెప్పేడు నవ్వుతూ – “కొత్త స్టూడెంట్స్ కి ఇలా కళ్ళు తిరిగిపడిపోవడం మామూలే – కుర్రాడికేమీ ఫర్వాలేదు. ఒక్కొక్కసారి ప్రాణం లేని శరీరాలని చూసినప్పుడు ఇలా పడతారు కొంతమంది. అలవాటు అవడానికి రెండు మూడేళ్ళు పడుతుంది. ఏమీ కంగారు లేదు, మీరు కానివ్వండి. ఆ కుర్రాడు లేచాక అతనితో మాట్లాడదాం మరోసారి.” 

 

రెండు మూడు గంటలకి కోలుకున్న శ్రీకర్ ఆ వారం క్లాసులకి రాలేదు. పై వారం వచ్చాడు అదే ప్రొఫెసర్ ఎండోక్రినాలజీ పాఠానికి.  క్లాసులోకి వచ్చిన ప్రొఫెసర్ శ్రీకర్ ని చూసి నవ్వుతూ అడిగాడు, “ఇప్పుడు బాగానే ఉన్నారుగా?” 

 

శ్రీకర్ కూడా నవ్వుతూ చెప్పాడు, “అవునండి, ఆ రోజు లేబ్ లో అలా అయినందుకు సారీ.” 

 

“అబ్బే అదేమీ మనసులో పెట్టుకోవద్దు. నేను కూడా అలా రెండు మూడు సార్లు లేబ్ లో పడినవాడినే. అదంతా సర్వ సాధారణం. ఇంతకీ ఏమైందో గుర్తుందా మీకు?”

 

ఉందన్నట్టు తల ఊపి చెప్పాడు శ్రీకర్, “మీరు శరీరాన్ని స్కాల్ పెల్ తో కోయాలని చెప్పగానే తల తిప్పాను శరీరం మీదకి. వంటిమీదకి చూడగానే వళ్ళు జలదరించింది.”

 

“ఔనా? ఏ కారణం అయి ఉండొచ్చు? మిగతా స్టూడెంట్స్ కి పనికొస్తుందని అడుగుతున్నాను కానీ మీకు ఇష్టం లేకపోతే చెప్పవద్దు.” 

 

“మీరు మొదటి రోజు థైరాయిడ్ గురించి క్లాసులో వివరించినప్పుడు, ఇంటికెళ్ళాక మా నాన్నగారితో మాట్లాడాను. మా అమ్మగారి శరీరాన్ని మెడికల్ కాలేజ్ కి దానం ఇచ్చారని చెప్పారు. అమ్మకి కుడి మోకాలిమీద, ఎడమచేతి మీదా రెండు పెద్ద పుట్టుమచ్చలు ఉండేవిట.  ఆ రెండు పుట్టుమచ్చలలోనూ స్పష్టంగా కనిపించే ఒక తెల్లటి చుక్క ఉండేది మధ్యలో. అలా ఎక్కడా నేను చూడలేదు, అన్నారు. మొన్న లేబ్ లో నాకు కనిపించిన శరీరం అమ్మదే – నాన్న చెప్పిన పుట్టుమచ్చల ప్రకారం. నా మూడో, నాలుగో ఏట పోయిన అమ్మని నేనెప్పుడూ అసలు చూసిన గుర్తే లేదు. ఎప్పుడో మిడిల్, హై స్కూల్లో ఉన్నప్పుడు బాగా మిస్ అయ్యేవాణ్ణి అమ్మ లేకపోవడం. కానీ ఒక్కసారి అమ్మ పుట్టుమచ్చలతో అలా లేబ్ లో కనపడగానే కళ్ళు తిరిగాయి; స్పహ తప్పింది.  

 

శ్మశాన నిశ్శబ్దం క్లాసులో. ఇద్దరు ముగ్గురు ‘ఓ మై గాడ్’ అనడం వినిపించింది. పక్కనే కూర్చున్న నవీన్ ఓదార్పుగా శ్రీకర్ భుజం తట్టాడు. కాసేపటికి ప్రొఫెసర్ చెప్పాడు, “అయామ్ సో సారీ. ఇది చాలా విచిత్రమైన సంఘటన. ఇంట్లో మీ నాన్నగారితో గానీ చెప్పారా?” అదో రకమైన చిలిపి నవ్వు ప్రొఫెసర్ మొహంలో. 

 

“మా నాన్నగారితో చెప్పలేదు ఈ విషయం. ఆయనకి అరవై దాటాయి, ఈ వయసులో చెప్తే ఆయనకి ఎలా ఉంటుందో, ఏమౌతుందో అని ఊరుకున్నాను.”

 

ఈ సారి నవ్వుతూ అన్నాడు ప్రొఫెసర్, “మీకు నిజానిజాలు తెలియక అలా ఆపోహ పడ్డారు కానీ ఆ శరీరం మీ అమ్మగారిది కాదని గారంటీగా చెప్పగలను.”

 

తలమీదనుంచి పెద్ద బరువు దిగిపోయినట్టై శ్రీకర్ అడిగాడు, “అవునా, ఎలా చెప్పగలరు?” క్లాసంతా కుతూహలంగా చూసారు ప్రొఫెసర్ కేసి.  

 

“మెడికల్ కాలేజ్ కి ఇచ్చిన శరీరాలని ముందు ఎంబామింగ్ అనే ప్రక్రియతో తయారు చేస్తారు లేబ్ కోసం. ఆ తర్వాత స్టూడెంట్స్ అందరూ కోస్తూ ఉంటారు. ఒక్కో భాగం కోసి తీసేసాక చివరకి మిగిలే ఎముకలని ఆర్థోపెడిక్స్ వారు ఉపయోగించుకుంటారు లేబ్ లో – అవి ఎలా విరుగుతాయి కట్లు ఎలా కడతారు, ఎలా బాగవుతాయి అనేవి లోపల  చూడ్డానికి. ఆ తర్వాత ఆ శరీరం వాడడం కుదరనే కుదరదు. మిగిలిన ఆ శరీరాన్ని ముప్పాతిక మూడొంతులు దహనం చేసి ఆ భస్మాన్ని శారీరం తాలూకు కుటుంబానికి కావలిస్తే – కావలిస్తే మాత్రమే - అందిస్తారు. ఇదంతా దాదాపు నాలుగైదేళ్ళు పడుతుంది. మీరు చెప్పడం ప్రకారం మీ అమ్మగారు మీ మూడో, నాలుగో ఏటే పోయారు, అంటే దాదాపు ఇరవై ఏళ్ళ పైన. అంతకాలం శరీరం లేబ్ లో ఉండడం అసంభవం.” 

 

“నిజమేనా? కానీ నేను ఆ శరీరం మీద మా నాన్నగారు చెప్పిన మోకాలి మీద పుట్టుమచ్చ స్ఫష్టంగా చూసానే?” ఇంకా పూర్తిగా నమ్మలేనట్టూ అడిగాడు శ్రీకర్.

 

“చెప్పాను గదా, లేబ్ లో ఉన్న శరీరాన్ని చాలా మంది మెడికల్ కాలేజ్ కుర్రాళ్ళు వాడుతూ ఉంటారు. మరో లేబ్ కుర్రాళ్ళు మోకాలి గురించి నేర్చుకుంటూ మర్చిపోకుండా ఉండడానికో, సరదాకో పెర్మనెంట్ మార్కర్ తో గుర్తు అలా పెట్టి ఉండొచ్చు. మేం పాఠం చెప్తూంటే వినడానికి బోరుకొట్టినప్పుడు, శ్రద్ధగా నోట్స్ రాసుకుంటున్నట్టూ నటిస్తూ మీరు నోట్ పుస్తకాల్లో మా బొమ్మలు వేస్తారు చూడండి, అలాగే లేబ్ లో కుర్రాళ్ళు ఇటువంటి తిక్క పనులు చేస్తూ ఉంటారు సరదాకి. ఇట్ ఈజ్ ఆల్ పార్ట్ అండ్ పార్సెల్ ఆఫ్ మెడికల్ స్కూల్. నేనూ అలా చేసి డిగ్రీ పుచ్చుకున్నవాణ్ణే.” 

 

ప్రొఫెసర్ చెప్పిన మాట వినగానే క్లాసులో స్టూడెంట్స్ అందరి మొహాలమీదా  చిరునవ్వులు విరిసాయి. 

*****

bottom of page