top of page
adannamaata.png

సంపుటి  5   సంచిక  3

Website Published &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

కథా​ మధురాలు

అల్గారిథం

 

అనిల్ ప్రసాద్ లింగం

Anil Prasad Lingam

"ఐయాం రియల్లీ సారీ బావా. నా వల్ల నువ్విలా ఇబ్బంది పడుతున్నావు." బేలగా మొహంపెట్టి చెప్పింది నైనిక.

 "ఛా.. అదేం పర్లేదు. నువ్వేం బాధపడకు" ఆమె వద్దకు నడిచొచ్చి అనునయంగా భుజం మీద చెయ్యి వేసి సముదాయించాడు క్షితిజ్.

"గాడిద ఎగ్గేం కాదూ?. నువ్విలా వేషాలు వేస్తావనే నీకు వార్నింగ్ ఇస్తున్నా." భుజంమీది చెయ్యిని విదిలించి కొట్టి దూరం జరిగి చెప్పింది.

 "వరసైన దాన్ని ఒంటరిగా దొరికానని పనికిమాలిన ఆలోచనలేం పెట్టుకోమాకు. నా కొడుకున్నాడు పక్కన వీడుకి కిస్సు, హగ్గు అంటే ఏంటో తెలుసు. నువ్వేం చేసినా వాడి బాబుకి ఫోన్ చేసి చెప్పేస్తాడు. ఆయన వెంటనే విమానం ఎక్కి వచ్చేస్తాడు - ఏమనుకుంటున్నావో. జాగ్రత్త !" సీరియస్ గానే చెప్పింది నైనిక.

ఈ వేరియేషన్కి అవాక్కయిన క్షితిజ్, వెనకడుగేసి తన బెడ్డు మీద కూర్చొని, "ఇప్పుడు నేనేం చేసానే బాబూ? అన్ని మాటలూ నీయేనా? అయినా మీ ఆయనంటే నాకేం భయమా, రమ్మను చూస్తా. ఎలా వస్తాడో, ఈ కరోనా దెబ్బకి విమానాలు కూడా ఆపేసారు" అన్నాడు.

"అబ్బా.. అంత మొనగాడివా? అయినా అమెరికా నుంచి మా ఆయననెందుకు, అక్కా, బావ పిచ్చి వేషాలు వేస్తున్నాడని మీ ఆవిడకు చెప్తాను, ఆవిడే చూసుకుంటది."

"అంత పని చెయ్యమాకే. నన్ను చంపేస్తది. అసలే దానికి మన మీద అనుమానం."

"అవునా. ఇంకేం మరీ మంచిది. గుర్తు పెట్టుకో మరి ఏ అర్థ రాత్రో మీద చెయ్యేసావో.."

 "ఆపవే. మనమేం టీనేజీ వాళ్ళం కాదు. నాకూ ఇద్దరు పిల్లలున్నారు."

"అయితే?  అయినా మనం అని నన్ను కూడా కలిపి మాటాడకు. నేనిప్పుడూ కుర్రదాన్నే. నీకులాగా బాణ పొట్ట, నెరిసిన గెడ్డం లేదు. చూడు. డెలివరీ తరవాత కడుపు ఎత్తుగా కనపడుతుందని జిమ్ కెళ్ళి తగ్గించుకున్నాను. " అంటూ పొట్ట దగ్గర టీ షర్టు సవరదీసుకుంటూ

 "అట్టా కళ్లప్పగించి చూడమాకు, నాకు మండుద్ది" అంది నైనిక.            

                                     

 "నీ నాజూకుతనం చూడమంది నువ్వే కదే" జవాబిచ్చాడు క్షితిజ్.

"అంటే...  అలా కొరుక్కుతినేలా చూడాలా? అసలు ఇంకో మాస్కు ఆ కళ్ళకి కూడా తగిలిస్తే సరిపోద్ది"

"నేను మామూలు గానే చూసానే" మూతికి కట్టిన మాస్కు సరిచేసుకుంటూ అన్నాడతను.

"లేదు, నువ్వు అదోలా చూసావు. నాకు తెలుసు"

"హత విధీ. నాకు నిద్రొస్తుంది - పడుకుంటాను. ట్యూబు లైట్ ఆపి బెడ్ లైటు వెయ్యనా ?"

"వద్దు. పిల్లాడు భయపడతాడు"

"పిల్లాడికా భయం ? నీకా?"

 "ఇందాక చెప్పాగా జిమ్ కెళ్ళుతున్నానని.... "

***

అమెరికాలో ఉంటున్న నైనిక, ఓ పెళ్ళికని కొడుకుని తీసుకొని భారత దేశమొచ్చింది. కృష్ణా జిల్లాలోని తన ఇంటికెళ్లిన రెండో రోజు, అర్జెంటుగా విజయవాడ గవర్నమెంటు ఆసుపత్రిలో రిపోర్టు చెయ్యమని పోలీసులూ, కాన్సులేట్ వాళ్ళూ  కోరగా, అదే పెళ్ళికని  సొంత కారులో ఊరికొచ్చిన హైద్రాబాదులో ఉండే తన మేనల్లుడు క్షితిజ్ ని బతిమాలి  కూతురినీ, మనవుడినీ అతనితో పంపించాడు ఆమె తండ్రి.

తీరా ఆసుపత్రికొచ్చాక విదేశాలనుంచి వచ్చినవారికి కరోనా వ్యాధి లక్షణాలు ఉంటున్నాయని అందుకోసం వారిని 14 రోజులపాటు క్వారంటైన్లో  ఉంచాలని - తల్లీ, పిల్లాడనీ, అలాగే వారితో దగ్గరలో ఉన్న వారికి కూడా అది అంటుకుంటుందని - కారులో తీసుకొచ్చిన క్షితిజ్ ని కూడా అక్కడే హాస్పిటల్లోని  ఓక గదిలో నిర్బంధించేశారు. ఆ రోజురాత్రికే దేశవ్యాప్తి లాక్డౌన్ ప్రకటించడంతో, ఎక్కడివాళ్ళక్కడ చిక్కుకుపోయారు.

 ఊళ్లోని  తల్లీ తండ్రిని కూడా తమ ఇంట్లో స్వీయనిర్భంధాన ఉంచి వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. కాగా చిన్నపటినుంచి ఉన్న చనువూ, వరసైన వారిద్దరి మధ్య ఒకప్పుడున్న అనురాగం, వేరే పనేమీ లేకపోవడం, అన్నింటికీ మించి రెండు పడకల ఆ ఆసుపత్రి స్పెషల్  గదిలోకి మొహానికి గుడ్డ మాస్కులు, చేతులకి రబ్బరు గ్లౌసులు, వళ్ళంతా కప్పేసిన ప్లాస్టిక్ అంగీలతో మందులివ్వడానికొచ్చే నర్సు, రోజుకోసారి పరీక్షించడానికొచ్చే డాక్టరు, సమయానికి అల్పాహారం,  భోజనం అందించి గది శుభ్రం చెయ్యడానికొచ్చే వార్డుబాయి తప్ప ఇంకా కనపడని ప్రపంచం - సాని టైజర్, బ్లీచింగ్ పౌడర్ వాసనలతో తామేదో వేరే గ్రహంలోఉన్నామనిపించేటంతటి  ఏకాంతం,ఇవన్నీ కలిసి నైనికని కాస్త చిలిపిగా ఆలోచించి, కాలక్షేపం కోసం బావని ఆట పట్టించేలా చేశాయి.  అలా ఒక వారం గడిచింది.

***

"నిజంగా బావా, నువ్వు లేకపొతే చచ్చిపోయేదాన్ని. వీడితో  పోయినసారి చాలా ఇబ్బందైయింది. అమ్మ వండేది తినేవాడు కాదు. మన ఊళ్ళో దొరికే  బిస్కెట్లూ, చాకోలెట్లు వీడికి నచ్చేవి కావు. అసలిప్పుడు వీడికోసమే వచ్చినట్టుంది నువ్వు  - విజయవాడలో కూడా  డైట్ కోకులు, కాన్ ఫుడ్ దొరుకుతాయని నాకు తెలియదు.

నువ్వు కాబట్టి నీ ఫ్రెండ్స్ తో అవి హాస్పిటల్ కి తెప్పించగలిగావు. లేకపోతే జెట్ లాగ్, తిండి లేక వీడు శివాలెత్తేవాడు." రోజూలాగే మొదలెట్టింది మరదలు,

 ఓ నాటి అర్థ రాత్రి.

"ఇప్పుడు ఇక్కడ అన్నీ దొరుకుతున్నాయే. ఇన్ ఫాక్ట్  అన్నీ మల్టీనేషనల్స్ కీ  ఇండియా ఇప్పుడో మేజర్ డెస్టినేషన్. ఇక్కడ బంధిస్తే నీకు తెలీడంలేదుగానీ, మనం బయటకెళ్ళితే  కొత్త రాజధాని విజయవాడ మామూలుగా ఉండదు తెల్సా ?" చెప్పాడు బావ.

"అవునా బెజవాడలో ఎక్కడికి తీసుకెళ్ళేవాడివెంటీ? అయినా నేను నీతో ఎందుకొచ్చేదాన్ని?" కోపం నటించింది నైనిక.

 "అది కాదే. షాపింగ్ మాల్స్, కే.ఎఫ్.సీ, మక్ డొనాల్డ్స్, హోటల్స్ అన్నీ వచ్చేసాయి. నెక్స్ట్ టైం నువ్వొచ్చేప్పుడు డైరెక్టుగా గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగొచ్చు తెల్సా"

"అవునా, హైద్రాబాద్లో దిగి మీ ఇంటికొచ్చి నిన్ను పలకరించి వద్దామనుకున్నానే. రావద్దంటావా ?"

"వద్దనెందుకంటానే ? నువ్వెప్పుడైనా  రావచ్చు"

"అబ్బా ఛా. అంత లేదులే. నువ్విక్కడ నుంచీ ఇంటికెళ్ళాక నీకుంటది చూడు. నేను కావాలని ఫోను చేసి మరీ నీ పెళ్ళాం దగ్గర నిన్ను ఇరికిస్తాను."

 "ఆ పనిమాత్రం చెయ్యబాకే, నీకు దండం పెడతాను."

“ఆహా పెళ్ళామంటే అంత భయమా?"

 "భయం అని కాదు, చెప్పానుకదా దానికి మన మీద కొంచెం అనుమానం”

“ఎందుకో ?"

 "మనం పెళ్లి చేసుకోవాల్సిందని - కొన్ని కారణాల వల్ల అది తప్పిపోయిందని తనకు తెలుసు"

"నువ్వు చెప్పావా ?"

  "లేదు కానీ తెలిసు. నన్ను అడిగితే నిజమే అన్నాను. అప్పటినుంచీ.... "

"హూ.... ! ఇన్నాళ్ళూ నాకీ సంగతి తెలియదు బావా, ఇక చూడు నిన్నాడుకుంటాను"

"మరీ ఇంత శాడిస్టూవెంటే? మీ ఆయనకు తెలీదా ? నేనూ ఆడుకోగలను"

 "అబ్బా నీకంత సీనులేదులే. అయినా ఆయనకి తెలుసు. నేనన్నీ ముందే చెప్పాను. నీకులాగా కాదు. అవునూ మీ ఆవిడకి మన పెళ్లేందుకు ఆగిపోయిందో అసలు విషయం చెప్పావా ?" 

"పడుకోవే, అర్ధరాత్రి ఈ గోలేంటి ? "

 "రోజంతా పడుకునే ఉన్నాం కదా బావా ..  ఇంకా నీకు నిద్రొస్తుందా? ఈ కిటికీలోంచి చూడు ఆ నిండు చందమామ ఎంత బావుందో. ఇలా వెన్నెల లోనికి పడుతుంటే భలే ఉంది కదా" లేచి ముందుకు కదిలిన క్షితిజ్ ఆగి,  "నేను రాను, వచ్చాక - ఎందుకొచ్చావ్ ? ఏం చేస్తావ్ అని మళ్ళీ  మొదలెడతావు" కోపం నటించాడు.

 "లేదులే బావా" అంటూ తానే ముందుకు వంగి, అతని చేయి పట్టి తన మంచం మరో వైపుకి నడిపించి, కిటికీ గోడమీద కుర్చోపెట్టి, తానూ బెడ్డు మీద కూర్చుని

ఇరువురి చేతులపైన సానిటైజెరు చిలకరించింది నైనిక.

"సారీ బావా. ఏదో కావాల్సినవాడివని కొంచెం ఎక్కువ మాట్లాడాను. ఏం అనుకోకు. నిజంగా యూ వేర్ వెరీ హెల్ప్ ఫుల్"

"భలే దానివే. నేనెందుకనుకుంటాను. అసలు నీ గురించి కాదు - ఇక్కడినుంచి వెళ్ళాక మా ఆవిడకి ఈ 14రోజుల డైలీ రొటీన్ గురించి ఏం చెప్పాలా అనే ఆలోచనతోనే నిద్ర పట్టడంలేదు నాకు"

"అంత స్ట్రిక్టా ?"  

"జోకు"

 "అబ్బా పర్లేదే. పదిరోజులు నాతో ఉండేసరికి నువ్వుకూడా జోకులేస్తున్నావు. జాగ్రత్త మీ ఆవిడ నన్ను తిట్టుకుంటది. అసలింతకీ మన పెళ్లి ఎందుకు జరగలేదని   చెప్పావ్ మీ ఆవిడకి ?" తన మాస్కు కిందకి దించి ఆసక్తిగా అడిగింది నైనిక.

 "మీ నాన్నే ఉద్యోగం లేనివాడికి కూతురిని ఇవ్వనన్నాడని చెప్పా.”

"మరి నీకు ఉద్యోగం వచ్చాక ?"

"అప్పటికే నీకు..."

 "ఆ పెళ్లి ఆగిపోయిందిగా ?”

"... " 

 "దుర్మార్గుడివి బావా  నువ్వు"

  "ఏంటో అప్పుడలా... "  

 " చేసిందంతా చేసి ఎంత తేలిగ్గా అనేసావు బావా ? ఏదో అప్పుడలా అని "

 "నేనేం చేసానే, ముందు పెళ్లి కుదుర్చుకుంది నువ్వు"  

  "అందుకేనా నా మీద కసి ?"

"అప్పుడు కోపం. జరిగిపోయిందాని గురించి ఇప్పుడెందుకు  పోనీ"

 "ఆ పెళ్లి క్యాన్సల్ అయ్యాకన్నా నన్ను చేసుకోవాలనిపించలేదా నీకు?" 

"నువ్వుకూడా నన్ను అడగలేదుగా?"

 "అడగాలా? నాకు తెలీలేదు బావా. అయినా అత్తా, మావలు మమల్ని ఎన్నేసి మాటలన్నారో నీకు తెలుసా - అలా జరగాల్సిందే, ఇంకా అనుభవిస్తారు అని" 

"ముందు మీ నాన్నా నన్ను ఎన్ని మాటలన్నాడో నీకు తెలియదా?  ఉద్యోగం లేదు, ఆస్థి పాస్తులు లేవని?"

"మరప్పుడు నువ్వు నన్నడిగావా బావా, చేసుకుంటావా అని ?"

"…." 

"అందుకే నీకు ఉద్యోగం వచ్చాక నేను నిన్ను అడగలేక పోయాను. కానీ నువొచ్చి అయిందేదో అయింది నేనే నైనీని చేసుకుంటానని అంటావనిమాత్రం చాలా ఎదురు చూసాను బావా. అసలు మన పెళ్లిజరగాలనే  ఆ ముందనుకున్న పెళ్లి ఆగిపోయిందేమో అనుకునేదాన్ని, నువ్వే కావాలని ఆపావని కూడా గట్టిగా అనిపించేది. కానీ నువ్వు మాత్రం రాలేదు"

 "ఏంటో అప్పుడు ఎవరి పంతాలు వాళ్ళవి. ఎవ్వరూ ఒక మెట్టు దిగి ఆలోచించలేదు. మనకా అంతటి మెచూరిటీ లేకపోయే"

"అందరి సంగతీ వదిలెయ్యి బావా, నువ్వెందుకు ముందుకు రాలేదు ?"

 "అదే చెప్పాగా,  అప్పడు మనకంత వయసూ లేదు, అనుభవం లేదు. అందుకే..."

"ఓ… సొమ్ము దొంగిలించే వయసూ, అనుభవాలుమాత్రం ఉన్నాయా బావా?" తీక్షణంగా అతన్నే చూస్తూ అడిగింది ఆమె.

" సొమ్మేంటీ?  దొంగిలించడమేంటీ? ఓహ్..! నీ పెళ్ళికని మీ ఇంట్లో  దాచిపెడితే దొంగలు కొట్టేసిన 75 వేల  గురించా? నేను ఎందుకు తీస్తాను చెప్పూ ?" రాని నవ్వు తెచ్చుకొని మొహానికి పులుముకున్నాడు క్షితిజ్.

"ఇన్నేళ్ల తరవాత కూడా లెక్క కరెక్టుగా  చెప్పావు బావా. నేను చూసాను బావా నువ్వు ఆ రోజు మా ఇంట్లోనుంచి రావడం”

 " హే...  మీ ఇంట్లోకొస్తే నేనే తీసినట్టా ? అంతకు ముందు రాలేదా, ఆ తరవాత రాలేదా? భలేదానివే నువ్వు"

 "నాకూ, మా అమ్మకే తెలుసు బావా,  ఆమె బియ్యం డబ్బాలో  డబ్బులు పెడుతుందని, మా నాన్నకు కూడా తెలియదు. నేనే నీకెప్పుడో ఓ సారి చెప్పాను ఆ సంగతి"

"అయితే అయ్యుండొచ్చు నైనీ, కానీ నేను తీసానని .... ఎలా ?.... " అసహనంగా లేచి నుంచున్నాడతను.

"అవును. నాకూ  అదే అనుమానంగా  ఉండేది, నువ్వు కాదేమోనని. అందుకే నేనెవరికీ చెప్పలేదు." కాస్త తెప్పరిల్లి కూర్చున్న క్షితిజ్ ఏదో చెప్పేంతలో,

"కానీ వీడి మొదటి పుట్టిన రోజు ఇండియాలో మా ఇంటి దగ్గర చేసాం కదా, నువ్వూ వచ్చావు ఆ వేడుక్కి - ఆనాటి ఫోటోలు చూసిన నా కొలీగ్ ఒకరు నిన్ను గుర్తుపట్టి, మీకు అప్పుడు అమీర్పేటలో  జాబ్ కోసం ఫేక్ సర్టిఫికెట్లు ఏర్పాటు చేసిన ఏజన్సీ గురించీ, అందుకు మీరు కంపెనీని బట్టి చెల్లించిన డబ్బుల గురించీ చెప్పాడు. తాను 50 వేలు కట్టి చిన్న కంపెనీలో చేరినట్టు చెప్పి, అప్పట్లోనే నువ్వు లక్ష కట్టి పెద్ద MNCలో చేరవని చెప్పాడు. అప్పడు కన్ఫర్మ్  చేసుకున్నా బావా – నువ్వే తీసుంటావని." మాటలాడకుండా చూస్తుండిపోయాడు క్షితిజ్.

నడి రేయి, లొక్డౌన్  వల్ల ఖాళీ అయిన రోడ్లు,  అక్కడ వారిరువురి మనస్సులోని అలజడేగానీ మరే సడీ లేదు.

 

**

"మా నాయనమ్మ భూలోకమ్మ నీకూ తెలుసుకదా బావా? ఎప్పుడూ ఓ మాట అంటా ఉండేది. మన సొమ్ము గట్టిదైతే, అది ఎప్పటికైనా మనకో, మన వాళ్ళకో  చేరుతుందని. మా  ముత్తాత ఒకాయన అప్పట్లో రంగూన్ వెళ్లి బాగా సంపాదించి కొన్నాళ్లకి ఓడలో తిరిగి వస్తున్నాడంట, మార్గ మధ్యంలో కలరా తగిలి చనిపోతే – శవానికి రాయి కట్టి సంద్రంలో పడేసేశారంట. అదే ఒడిలో ఉన్నా చల్లపల్లి సంస్థానంలోని ఒక వ్యక్తికి మా తాతకి  సంబందించిన వస్తువులన్నీ ఇచ్చి మా  ఇంటివాళ్ళకి అప్పచెప్పమన్నారంట ఓడలోని వారు. ఆయన మొత్తం నొక్కేసి, కేవలం కొంత బంగారం, ఇంకొన్ని చీని చీనాంబరాలు మాత్రం మా జేజమ్మకి  అప్పగించాడట. వాటితోనే ఆవిడ బందరులో ఇల్లు కట్టి,  నలుగురు  మగ పిల్లల్ని చదివించి, వాళ్ళని ప్రయోజకుల్ని చేసి  ఇంకా ఇద్దరు అమ్మాయిలకి పెళ్లిళ్లుకూడా చేసిందట. ఇక మా ముత్తాత రంగం నుంచీ తీసుకు బయలుదేరిన మొత్తం సంపదా  మా ఇంటికొస్తే మేము ఎంత ఆస్థిపరులం అయ్యేవాళ్ళమో కదా ? ఎప్పటికైనా ఆ మా సొమ్ము మాకు చేరుతుందని మా నాయనమ్మకి ఆవిడ అత్తగారు చెప్పేదంట. ఆవిడ బ్రతికున్నపుడెప్పుడూ ఇదే మాట మాకూ చెప్తా ఉండేది." తనను నిందించకుండా ఏదో చెప్పుతుండటంతో, వింటుండిపోయాడు క్షితిజ్.

"ఇస్తామన్న కట్నం ఇవ్వలేకపోవడంతో  పెళ్లి ఆగిపోయాక,  నేనూ ఏదో ఉద్యోగం చేసుకుందామని హైదరాబాద్ చేరుకున్నా. ఎన్నో కోర్సులు నేర్చుకున్నా, ఓ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. అక్కడే ఈయన పరిచయం అయ్యారు. అన్ని విషయాలూ ముందే చెప్పాను. ఇష్టపడి చేసుకున్నారు. అయితే బావా, పెళ్లి తరవాత వాళ్ళ సొంతూరు, అవనిగడ్డ  దగ్గర ఏదో పల్లెటూరు వెళ్ళాం. పాత పెంకుటిల్లు వాళ్ళది, ఆ ఇంట్లో ఒక పాత పెయింటింగ్ ఉంది, వాళ్ళ ముత్తాతదంట

'ఆయన రంగూన్ వెళ్లి సంపాదించుకొచ్చాడ'ని చెప్పగానే  వెంటనే మా భూలోకం నాయనమ్మ గుర్తుకొచ్చింది." కళ్ళు తుడుచుకుని చెప్పుకు పోయింది నైనిక.

"మావారి ముత్తాతే అప్పట్లో మా ముత్తాత దగ్గర వస్తువులు కొట్టేసారనడానికి ఏ ఋజువూ లేదు కానీ నా మనస్సెందుకో ఆయన మా కుటుంబానికి ఎప్పుడో రుణపడి ఉంటాడని అనిపించింది. లేకపోతే మేనరికం చెడీ, పైన అనుకున్న పెళ్ళీ ఆగిపోయిన పిల్లని పేరుబడుతుందని అమ్మ బెంగపట్టుకున్న సమయంలో ఈయన నన్నే చేసుకుంటానంటూ రావటం, పెళ్ళి జరగటం. ఇదంతా అలాగే అనిపించట్లేదూ? తర్వాత అమెరికా వెళ్ళాం - సెటిల్ అయ్యాం. నౌ అయాం హ్యాపీ. అప్పటినుండి నేనూ  నమ్మకం పెట్టుకున్నా 'మన సొమ్ము గట్టిదైతే - ఎప్పటికైనా, ఎట్లైనా మన వాళ్ళకి చేరుతుంది. ఎవ్వడినీ మోసం చేసి సంపాదించాల్సిన పని లేదని." ఇప్పుడు చాలా సీరియస్ గా  చెప్పింది.

అంతా విన్న క్షితిజ్ మౌనంగా ఉండి పోయాడు.

"నువ్వు లేకపోతే నేనొక్కదాన్నే ఈ పసివాడితో ఎంత ఇబ్బంది పడిపోయేదాన్నో, కానీ నువ్వు నాకు సాయ పడాలనే హైద్రాబాదు నుంచీ వచ్చినట్టుగా ఉంది కదూ.

అందుకే పిల్లలకి పరీక్షలని మీ ఆవిడా వాళ్ళూ లేకుండా నువ్వొక్కడివే ఊరు రావడం, అలా వచ్చిన నిన్ను మా నాన్న సాయమడగడం,  అంతే బావ - నాకు తెలుసు, అది నీ ప్రారబ్దం"

 "నే డబ్బు నీకు తిరిగిచ్చేస్తాను. మామయ్యకు ఏమీ చెప్పకు. ఇప్పుడిప్పుడే మన వాళ్ళు కాస్త దగ్గరవుతున్నారు" మాట మాట కూడా బలుక్కుని, మొహం అటు తిప్పుకొని కిటికీ వద్దకు నడచి చెప్పాడు  క్షితిజ్.

 "నువ్వు మళ్ళీ డబ్బు మాటెత్తితే నేను రోజూ ఫోన్ చేసి మీ ఆవిడతో నిన్ను తిట్టిస్తాను. అసలు నేనదెప్పుడో మర్చిపోయాను బావ. ఏదో అంటారు కదా 'ధర్మరాజు శాపం' అని అలా నోట్లోనుంచి బయటకొచ్చేసింది, అంతే. డబ్బు నాకొద్దు బావ - మన మధ్య ఈ ఋణానుబంధం ఇలాగే ఉండి పోనియ్యి. ఏమో ఎప్పుడు, ఏ పరిస్థితులలో నా కుటుంబసభ్యులకు నువ్వో, నీ వారసులో సాయపడి  ఈ ఋణం తీర్చుకుంటారో చూద్దాం. అది కాలానికే వదిలేద్దాం.  నువ్వు మాత్రం  ఎప్పటిలాగే నాతో ఇలాగే ఉండాలి, ఫేసుబుక్లో  మా ఫోటోలు చూసినా లైక్ కొట్టకుండా, వాట్సాప్లో స్టేటస్ మీద కామెంట్ చెయ్యకుండా అసలు నేనెవరో నీకు తెలీనట్టుగా... ఇప్పట్లాగే… ! అంతే గానీ ఓవర్ యాక్షన్ చేసావో... నీకుంటది చూడూ... " అంటూ తానూ మంచం దిగి నడచి వచ్చి అతని  చేతిని అనునయంగా చరుస్తూ, మాస్కు పైని  కన్ను తన స్టైల్లో కొంటెగా  కొట్టి చెప్పింది మరదలు.

*****

bottom of page