top of page
Anchor 1

సంపుటి 3  సంచిక 1

Website Designed &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

వ్యాస​ మధురాలు

వ్యాకరణ శాస్త్ర౦ – ఆవశ్యకత

P V Laxman Rao

డా. పి.వి.లక్ష్మణరావు

భాష లక్ష్యం అయితే వ్యాకరణం లక్షణం. లక్షణమెప్పుడూ లక్ష్యాన్ని అనుసరిస్తుంది. లక్ష్యం లేనిదే లక్షణానికి అవకాశమే లేదు. కాలం మారుతోంది. అవసరాలు మారుతున్నాయి. వ్యాకరణమైనా, భాషా సాహిత్యాలైనా స్థలకాలాలకు అతీతమైన అమూర్త విషయాలు కావు. కాబట్టి ఈ రోజున వ్యాకరణ ప్రాభవం క్షీణించి భాషాశాస్త్ర వెలుగులో నూతనమార్గాలు అన్వేషిస్తున్న వర్తమానం ఇది. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నో ప్రయోజనాలు కలిగిన వ్యాకరణ శాస్త్ర ఆవశ్యకతని తెయజేయడమే ప్రస్తుతాంశం.

వ్యాకరణ శాస్త్ర ఆవిర్భావం ఎలా జరిగిందో పరిశీలించడం వల్ల ఎంతో ఉపయోగం ఉంది. పవిత్ర మైనవీ, దివ్యమైనవీ అయిన వేద మంత్రాల పఠనంలోనూ, వాటి ఉచ్చారణలోనూ, యజ్ఞాల నిర్వహణలోనూ తప్పు జరిగితే ప్రమాదం. అది ఉచ్చరించిన వారి మీదే ప్రతికూలంగా పనిచేసే అవకాశం ఉందని భయం ఉండేది. ఆ అవసరం నుంచి ఆరు వేదాంగాలు రూపొందాయి.

 ‘శిక్షా వ్యాకరణం ఛన్ద: నిరుక్తం జ్యోతిషం తథా

 కల్పశ్చేతి షడంగాని వేదస్యాహుర్మనీషిణ:’

 ‘వేదస్య ముఖమ్ వ్యాకరణం స్మృతమ్’ అనటం ద్వారా షడంగాల్లో వ్యాకరణం శిరస్థానీయమని చెప్పినట్లయింది. ‘వ్యాక్రియంతే శబ్దా:అనేనేతి వ్యాకరణమ్, నహి శబ్దేన కించిత్ వ్యాక్రియతే కేనతర్హి సూత్రేణ’ అని పతంజలి మహర్షిచే మహాభాష్యంలో వ్యాకరణ శబ్దానికి వ్యుత్పత్తి నిర్దేశింప బడింది. వ్యాకరణం ద్వారా భాష లోని శబ్దాలు వ్యాకరించబడుతున్నాయని దీని అర్థం. వ్యాకరించబడుట అంటే ఏమిటో అన్నంభట్టు తన ప్రతీపోద్ద్యోతంలో ‘ప్రకృతి ప్రత్యయాది విభాగేన వ్యుత్పాదనమ్, వ్యాకరణేన సాక్షాత్ క్రియతే’ అని తెలిపారు.  అంటే ప్రకృతి ప్రత్యయ విభాగం చేసి శబ్దాలకు వ్యుత్పత్తులను చూపడమే వ్యాకరించుట. వ్యాకరణ శాస్త్రం చాలా ప్రాచీనమైంది, ప్రసిద్ధమైందని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.

‘ప్రథమేహి విద్వాంసో వైయాకరణా: వ్యాకరణమూలత్వాత్ సర్వవిద్యానామ్’ అని ఆనందవర్ధనాచార్యులు వ్యాకరణ, వైయాకరణుల మహత్వాన్ని ‘ధ్వన్యాలోకం’ అనే లక్షణ గ్రంధంలో ప్రకటించారు.

వ్యాకరణ శాస్త్రప్రయోజనం: అనంతమైన శబ్దజాల స్వరూప స్వభావాల్ని తెలుసుకోవడానికీ, పదాలకున్న సాధ్వసాధుత్వాన్ని నిర్ణయించడానికి ప్రకృతి ప్రత్యయవిభాగాల ద్వారా అర్థసందేహాల్ని నివృత్తి చేసుకోవడానికీ వ్యాకరణం దోహదం చేస్తుంది. ఇట్టి గొప్ప ప్రయోజనాలు గల వ్యాకరణ శాస్త్రాన్ని సమగ్రంగా అర్థం చేసుకోవడం వల్ల భాషాస్థితిగతులపై అవగాహన ఏర్పడుతుంది. వ్యాకరణ శాస్త్రాధ్యయన ప్రాముఖ్యాన్ని తెలుపుతూ రెండు సంస్కృత శ్లోకాలు ప్రచారంలో ఉన్నాయి.

‘యద్యపి బహునాధీషే తథాపి పఠ పుత్ర వ్యాకరణమ్

స్వజన:శ్వజనోమాభూత్ సకలం శకలం సకృత్ శకృత్!’

అని సంస్కృతంలో ఒక శ్లోకం ఉంది. ఒక తండ్రి, తన కుమారునికి వ్యాకరణం చదవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పుతూ చెప్పిన శ్లోకం ఇది. నాయనా! నీవు గొప్ప చదువులేవి చదువకపోయినమానె! (ఫర్వాలేదు) వ్యాకరణం మాత్రం చదువుకో! ఎందుకంటే స్వజన శబ్దం (తనవారు)- శ్వజన (కుక్కలు) అనీ, సకల (సమస్తం) శబ్దం-శకల (భాగం) అనీ, సకృత్ (ఒకప్పుడు) శబ్దాన్ని-శకృత్ (మలం) అని పొరపాటుగా ఉచ్చరించకుండా ఉండటానికి అని దీని భావం. అంటే  వ్యాకరణం చదవకపోతే శబ్దస్వరూపం సరిగా తెలియదనీ అందువల్ల ఉచ్చారణాదుల్లో పొరపాట్లు చేసే అవకాశం ఉందనీ అలాంటి పొరపాట్లు చేయకుండా  ఉండటానికి ప్రతి విద్యార్ధి తప్పకుండా వ్యాకరణం చదవాలని దీని సారాంశం.

 “అవ్యాకరణమధీతం భిన్న ద్రోణ్యా తరంగిణీ తరణమ్

 ఔషధమపథ్యయుక్తం త్రయమిదమకృతం వరం న కృతమ్!”

ఈ శ్లోకం ద్వారా వ్యాకరణం లేకుండా భాషను నేర్చుకోవటం, చిల్లులు పడిన పుట్టిలో నదిని దాటడం, పథ్యం లేకుండా ఔషధాన్ని సేవించడం అనేవి మూడూ వ్యర్థప్రయత్నాలే అని తెలుస్తున్నది. దీనిని బట్టి భాషాధ్యయనంలో వ్యాకరణానికి ఎంత ప్రాధాన్యముందో తెలుస్తుంది.

శ్రీమద్రామాయణంలో వాల్మీకి మహర్షి హనుమ౦తుని వ్యాకరణ పాండిత్యప్రకర్షను వర్ణించాడు. “నూనం వ్యాకరణం కృత్స్నమనేన బహుధా శ్రుతమ్! బహువ్యవహారతానేన నా కించిదవభాషితమ్!!” (ఈ హనుమంతుడు వ్యాకరణాన్ని బాగా వినినట్లున్నాడు. ఎంత మాటలాడినప్పటికీ కొంచెం కూడా అపభాష మాట్లాడలేదు). దీనిని బట్టి వ్యాకరణ జ్ఞానం తెలిసినవాడు అపశబ్దాలను పలుకడనే విషయం స్పష్ట మవుతున్నది. ఇంకా “సర్వార్థానాం వ్యాకరణా ద్వైయాకరణ ఉచ్యతే తన్మూలతో వ్యాకరణం వ్యాకరో తీతి తత్తథా” అని మహాభారతంలోని ఉద్యోగపర్వంలో కూడా వ్యాకరణ ప్రశంస కన్పిస్తున్నది.

అహోబల పండితుడు తన వ్యాఖ్యానారంభంలో దేవతాస్తుతి పిమ్మట “యద్వ్యాకరణవైద్యేన హృతా లోకాప వాగ్రుజా!, విద్వత్సహస్ర నేత్రం తం దాక్షీసూనుముపాస్మహే!! ప్రజలలో ఉండే అప శబ్దాలను ఉచ్చరించ డమనే రోగాన్ని, ఏ వ్యాకరణ వైద్యుడు హరించెనో ఆ విద్వత్సహస్రనేత్రుడైన పాణిని మహర్షిని ఉపాసించు చున్నాను అనటం ద్వారా వ్యాకరణ శాస్త్ర విద్వాంసులకు సహస్ర నేత్రములని అవగతమగుచున్నది.“ఏక: శబ్ద : సమ్యగ్ జ్ఞాత: సుష్టు ప్రయుక్త: స్వర్గ లోకే కామదుగ్భవతి” సుశబ్దం తెలిసి ప్రయోగించినచో స్వర్గలోకంలో కోరికలను తీర్చును, పుణ్యపాదకం అది.

భాషకు సంబంధించిన మార్పులను నియమాలను సాధ్వసాధుత్వాలను నిర్ణయించేదే వ్యాకరణం. భాషలో ఉన్న మూల శబ్దాల్ని వివేచన చేసి,తద్వారా ఆయా పదాలు ఏవి సాధువులో ఏవి అసాధువులో తెలుసుకోవాలంటే అది కేవలం వ్యాకరణం వల్లనే సాధ్యం. ఇకపోతే మహాభాష్యకారుడైన పతంజలి మహర్షి వ్యాకరణ ప్రయోజనాన్ని ఈ విధంగా ఉట్టంకించారు.

‘కాని పునశ్శబ్దానుశాసనస్య ప్రయోజనాని?

రక్షోహాగమ లఘ్వసందేహా: ప్రయోజనమ్ [1]’

పతంజలి మతానుసారంగా వ్యాకరణ పరమప్రయోజనాలు ఐదు. 1. రక్ష, 2.ఊహ, 3.ఆగమం, 4. లఘు, 5.అసందేహం. ఈ వ్యాకరణ ప్రయోజనాల్ని భాష్యకారులు వివరించిన విధాన్ని పరిశీలించుట ద్వారా ఇవి తెలుగు వ్యాకరణాలకు ఎంతవరకు అన్వయమవుతాయో గమనించవచ్చు.

1. రక్ష: వ్యాకరణ ప్రయోజనాల్లో మొదటిది రక్ష. ‘రక్షార్థం వేదానామధ్యేయం వ్యాకరణమ్, లోపాగమ వర్ణ వికారజ్ఞోహి సమ్యగ్వేదాన్ పరిపాలయిష్యతీతి [2]’. వేదాల్ని యథాతథంగా రక్షించుకోవాలంటే తప్పనిసరిగా వ్యాకరణాల్ని అధ్యయనం చేయాలి. లోప, ఆగమ, వర్ణ వికారాలను చక్కగా తెలుసుకొన్నపుడే వేదాల్ని రక్షించుకోవడం సాధ్యమౌతుంది.

వేదాలు తెలుగు భాషలో వినియోగంలో లేవు కాబట్టి ఆ విషయం అలా ఉంచితే సాధారణంగా భాష లోని పదాలను ప్రాచీనులు ఏయే సందర్భాలలో ఏ విధంగా వాడారో తెలియాలంటే వ్యాకరణ శాస్త్ర పరిచయం ఉండాలి. ఆనాటి ప్రయోగాలు నేటి భాషతో అన్వయించి చూస్తే అవి వేరే విధంగా గోచరిస్తాయి. కాబట్టి ఈ ‘రక్ష’ అనే ప్రయోజనం తెలుగు వ్యాకరణాలకు కూడా అన్వయిస్తుంది

2. ఊహ:  రక్ష తర్వాతి వ్యాకరణ ప్రయోజనం ఇది. ‘ఊహ:ఖల్వపి నసర్వైర్లింగైర్నసర్వాభిర్విభక్తిభిర్వేదేమంత్రా ని గదితా: [3]’ యజ్ఞాలలో,మంత్రాలలో ఉన్న విభక్తుల్ని సందర్భానుగుణంగా మార్చగలిగే సామర్థ్యాన్ని పొందాలంటే వ్యాకరణశాస్త్ర అధ్యయనం తప్పనిసరి. ఈ ఊహ అనే ప్రయోజనం వైదిక భాషకే కాదు లౌకిక భాషకు కూడా వర్తిస్తుంది.

 తెలుగు భాషకు యజ్ఞాలలో వినియోగం లేదు. కాబట్టి ఇది తెలుగు వ్యాకరణాలకు అన్వయింపదని చెప్పవచ్చు. కానీ ఇట్టి విభక్తి పరిణామం ఆంధ్రభాషలో ఏ పదాల మీద ఎలా జరుగుతుందో వ్యాకరణం వల్లనే తెలుస్తుంది. ‘కొన్ని యెడల విభక్తి పరిణామంబు గ్రాహ్యంబు[4]’ అనే ప్రౌఢ వ్యాకరణ లక్షణం విభక్తి పరిణామం గురించి తెల్పుతున్నది.బహుజనపల్లి వారు ఈ విషయంలో ‘ఈతనితో సాటి యనంగ మేలన’ అను నిర్వచనోత్తర రామాయణంలోని ఉదాహరణని ఇవ్వడమైంది.

3. ఆగమం: ఆగమం అంటే ధర్మ శాస్త్రమని అర్థం. ‘బ్రాహ్మణేన నిష్కారణో ధర్మష్షడంఙ్గో వేదోధ్యేయో ఙ్ఞేయశ్చ’ ధర్మశాస్త్రములు బ్రాహ్మణుడెట్టి ఫలము నపేక్షించకయే ధర్మమును షడంగ సహితమైన వేదమును అధ్యయ నము చేయవలయుననియు వానినెఱింగి ఉండవలెననియు బోధించుచున్నవి’. ఈ వాక్యాలు పై మహా భాష్యవాక్యాలకి అనువాదాలు. దీనిని బట్టి వేదాంగాలలో అతి ముఖ్యమైన వ్యాకరణాన్ని అధ్యయనం చేయడం ఫలవంతమే అవుతుంది గానీ నిష్పలం కాదని తెలుస్తుంది. కేవలం వేదార్థాల్ని సమర్థంగా తెలుసు కోవడానికే కాకుండా లౌకిక భాషా స్వరూపాన్ని తెలుసుకోవడానికి కూడా వ్యాకరణం ఉపకరిస్తుంది. ఏ శాస్త్ర రచననైనా భాషకు లోబడి ఉంటుంది. కాబట్టి భాషను, భాషాస్థితిగతులను వివరించే వ్యాకరణ శాస్త్రం మిగిలిన అన్ని శాస్త్రాలకు అవసరమని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు[5]”.

4. లఘు: ఇది వ్యాకరణానికి నాల్గవ ప్రయోజనం ‘లఘ్వర్థం చాధ్యేయం వ్యాకరణం బ్రాహ్మణేనావశ్యం శబ్దఙ్ఞేయా ఇతి నచాంతరేణ వ్యాకరణం లఘు నోపా యేన శబ్దాశ్శక్యా జ్ఞాతుమ్[6]’ శబ్దాలను లఘు విధానంలో అంటే సులభంగా తెలుసుకోవడం అత్యంతావశ్యకం. శబ్ధాలను ప్రకృతి ప్రత్యయ విభాగం ద్వారా తత్ స్వరూపాన్ని సులభంగా అర్థం చేసుకోవాలి గానీ ఇది సాధు శబ్దమని ఇది కాదనీ పఠించడం వ్యర్థం. సులభమైన ఉపాయం ద్వారా భాషాధ్యయనం చేయవలెనన్న దానికి వ్యాకరణాధ్యయనమే లఘూపాయం.

5. అసందేహం: భాష్యకారుని మతంలో చివరిది అయిదవది అయిన వ్యాకరణ ప్రయోజనం ఇది. ‘అసందేహార్థం చాధ్యేయం వ్యాకరణమ్[7]’ వేద మంత్రాలు స్వర ప్రధానాలు బహువ్రీహి తత్పురుష సమాసాలకు స్వర భేదం ఉంది.దానిచే సమాసం యొక్క అర్థం మారి పోతుంది.కాబట్టి నిస్సందేహమైన భాషా జ్ఞానం వ్యాకరణం వలన సిద్ధిస్తుంది. ఏది ఏమైన వ్యాకరణం భాషా పరిజ్ఞానాన్ని పెంపొందించడంలో సర్వసమర్థమైన శాస్త్రమని చెప్పడంలో సందేహం లేదు. వ్యాకరణం వల్ల వాక్పటుత్వం ఏర్పడుతుంది. వాక్ శుద్ధి కలిగినప్పుడే భాషా వ్యవహారం ఏ ఇబ్బంది లేకుండా సులభంగా సాగిపోతుంది. వ్యాకరణం వల్ల ఏవి సుశబ్దాలో, ఏవి అపశబ్దాలో తెలుసుకొనే వివేచన ఏర్పడుతుంది.

పైన పేర్కొన్నవ్యాకరణ శాస్త్ర ప్రయోజనాలలోని పిండితార్ధమేమంటే ఒక భాషలో ఉన్న శబ్దాల్నీ,అప శబ్దాల్నీ గుర్తించి వాగ్వ్యవహారంలో విషయబోధనను సమర్థంగా నిర్వహించడానికి వ్యాకరణం ఉపకరిస్తుంది. ‘ప్రవాహినీ దేశ్యా[8]’ భాష అనేది దేశ కాల ప్రాంతాది ప్రభావాలకు లోనవుతూ తదనుగుణమైన రూపాన్ని పొందుతూనే ఉంటుంది. ఈ మార్పుకి ఒక నియతి గానీ, పరిమితి గానీ లేదు. వాగ్వ్యవహారంలో ఉన్న భాష ఇలా ఉంటుందని తెలుసుకోవాలే తప్ప ఇలా ఉండాలని ఎవరూ నిర్దేశించలేరు.

‘భాషేయమమితా తత్ర దేశ్యా చిత్ర స్వభావయుక్’. పరిమితి లేని నిత్యపరిణామశీలమైన ఈ భాషా స్వరూపాన్ని సంగ్రహంగా నిరూపించాలంటే సాధ్యం కాదు. భాషాగతమైన శబ్దార్థాలు ఎన్నో వైచిత్ర్యాలను పొందుతాయి. అందువల్ల భాషలో కూడా చెప్పలేనంత మార్పు వస్తుంది. ఈ మార్పుల్ని శాస్త్రీయ పద్ధతుల ద్వారా వైయాకరణులు వివేచన చేసి భాషా స్వరూపాన్ని జాగ్రత్తగా అధ్యయనం చేసి వ్యాకరణాల్ని నిర్మిస్తారు. వారు వ్యాకరణ రచన చేసే కాలానికి స్థిరపడిన భాషాస్వరూపాన్ని దృష్టిలో ఉంచుకొని వ్యాకరణాల్ని రచిస్తారు.

పాద సూచికలు:

1. పాతంజల మహాభాష్యం - పతంజలి. (శబ్దానుశాసన ప్రయోజనాధికరణము). పుట -7

2. పాతంజల మహాభాష్యం - పతంజలి (శబ్దానుశాసన ప్రయోజనాధికరణము). పుట -14

3. పాతంజల మహాభాష్యం - పతంజలి (శబ్దానుశాసన ప్రయోజనాధికరణము). పుట -16

4. ప్రౌఢ వ్యాకరణం - బహుజనపల్లి సీతారామాచార్యులు - కారక.ప.సూ. -26

5. ఆంధ్ర వ్యాకరణ వికాసము - (సిద్ధాంత గ్రంధము) రాజేశ్వరశర్మ, అమరేశం.ప్ర. భా.పుట -8

6. పాతంజల మహాభాష్యం -పతంజలి. పుట-10

7. పాతంజల మహాభాష్యం -పతంజలి. పుట -10

8. ఆంధ్రశబ్ద చింతామణి - నన్నయ. పుట -46

9. వికృతి వివేకము - అధర్వణుడు. క్రియా ప .పుట -46

OOO

Bio
bottom of page