top of page

వంగూరి పి.పా- 31

 

జంట వంట కథ 

 

Vanguri Chitten Raju

వంగూరి చిట్టెన్ రాజు


ఈ పేజీ తెరవగానే పేజీ కింద కనపడేవీ, అందరూ చూసేవీ ఫొటోలే కదా. ఇలాంటి ఫొటోలు ఇక్కడ ఎందుకు ఉన్నాయీ, ఏమా కథ అనుకుంటే- 


కాదేదీ కథకి, కవితకీ, వ్యాసానికీ, రాజకీయ ప్రసంగాలకీ, రోజువారీ వాగుడికీ, పిచ్చా పాటీకీ అనర్హం అయినప్పుడు మా వంటింటి తంతంగానికి కూడా కచ్చితంగా అర్హత ఉంది కాబట్టి మా రహస్యాలని బయటపెట్టేస్తున్నాను. ఇది పైకి అందరికీ అనుభవం అయే సర్వ సాధారణ విషయమే అయినా సమస్య అందరిదీ అయినా మా అమెరికా వారి వంటింట్లో మరి కొంత ప్రగాఢమైన సమస్యగా మారుతుంది అని నా అనుమానం. దానికి ముఖ్యమైన కారణం అమెరికా ఇళ్ళలో ఎవరు వంటింటి యజమాని, ఎవరు చాకలి, ఎవరు తోటమాలి, ఎవరు ఇంటి డ్రైవరు, ఎవరు పిల్లలని స్కూలుకి రోజూ దింపే డ్రైవర్, ఎవరు ఆర్ధిక మంత్రి, ఎవరు కూరలు కొనేవారు, ఎవరు ఏ పార్టీకి వెళ్ళాలో, ఏ పార్టీకి వెళ్ళకూడదో లాంటి కీలక నిర్ణయాలు తీసుకునే వారు, ఆయా చోట్లకి మొగుడూ పెళ్ళాలు ఎలాంటి మేచింగ్ బట్టలు వేసుకోవాలో నిర్ణయించేది ఎవరు...ఓరి నాయనోయ్..ఇలా చెప్పాలంటే పెద్ద లిస్టే ఉంది. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది వంటింటి తతంగం కాబట్టి ముందుగా ఆ 10 అడుగుల వెడల్పు, 14 అడుగుల పొడుగూ ఉన్న ఆ సామ్రాజ్యానికి మా ఇంట్లో ఎవరు అధిపతులు, ఎవరి మాట చెల్లుతుంది, ఎవరు ‘మూసుకోవాలి’ మొదలైన విషయాలు మాట్లాడుకుందాం. 


అందరి ఇళ్ళలో లాగానే మా కొంప లో కూడా వంట గదిలో నాలుగు భాగాలు ఉంటాయి. ఒకటేమో అన్ని దినుసులూ దాచుకునే అలమారాలు ఉండే చోటు. అనగా పేంట్రీ, స్టోర్ రూమ్. రెండోది కుంపట్లు. ఇవి పలురకములు గా ఉండును కదా  అనగా సహజ వాయువుతో మండే కుంపటి, వెలెక్ట్రిక్ కుంపటి...ఇలాగన మాట. మూడోది గిన్నెలు కడిగే సింకూ, తరిగిన కూరల తొక్కలనీ, తింటూనే తినలేక పారేసిన కర్వేపాకు ఆకులూ, మిరప కాయలూ, చింతపిక్కలూ, అప్పుడప్పుడు స్టీల్ మరియు ప్లాస్టిక్ చెంచాలని నుజ్జు నుజ్జుగా చేసి పారేసే గార్బేజ్ డిస్పోజరూ, మనం మనల్నే తిట్టుకుంటూ సగం సగం కడిగేసినన గిన్నెలని, మనకి కడగడం సాధ్యంకాని అడుగంటిన గిన్నెలని పూర్తిగా కడిగే డిష్ వాషర్ మొదలైనవి ఉండే ‘విసర్జన ప్రాతం', ఇక ఆఖరిది...పాపాల భైరవుడిలా తన మీద మైక్రోవేవ్ అవెన్, సుమీత్ వారి తిరగలి, పచ్చళ్ళు రుబ్బుకునే రుబ్బురోలు, ఈ మధ్య స్టేటస్ సింబల్ గా మారిన  ఇన్ స్టా పాట్, వేడి గాలితో వేపుడు వేయించే ఆ దిక్కుమాలిన ఎయిర్ ఫ్రయర్-  ఇలా మనం వంటింటి నగలని అందరికీ కనపడేలా పెట్టుకునే ఆ గ్రానైట్ కొంటర్ బల్లలు, వాటి కింద సరుకులు, దినుసులు, గిన్నెలు, పెద్ద గరిటెలు పెట్టుకునే సొరుగులు, అలాగే పైన ఏదో మూడడుగుల స్టూల్ కానీ కుర్చీ కానీ ఎక్కితే కానీ అందని పైగోడలో అలమారాలు-ప్రపంచం లో అందరి వంటిళ్ళూ అటో ఇటో ఇలాగే ఉంటాయి. భారతీయులకి ఉన్నదీ, ఇతర దేశాల వారికి లేనిదీ “పోపు వేయుట” అనే అద్భుతమైన ప్రక్రియ కదా! ఆ మాటకొస్తే అమెరికాలో మీరు ఎవరి వీధి తలుపు అయినా తీయగానే గుప్పున మసాలా వాసన వెయ్యక పోతే అది పాపం ఆ అమెరికన్ వాళ్ళో,  చైనీయులే, ఆఫ్రికన్ అమెరికన్ వాళ్ళదో అయిఉంటుంది. అప్పుడప్పుడు రోడ్డు మీదకి వచ్చే మసాలా వాసనన బట్టి ఆ ఇల్లు మన పవిత్ర భారతీయులదే అని చెప్పగలం. ఆ పోపు వేయు లేదా కొన్ని ప్రాంతాలలో తిరగ మోత వేయు సామగ్రి ని ఐదారు రోజుల వంటకి మాత్రమే సరిపడా నింపుకుని, పొయ్యి పక్కనే అందుబాటులో పెట్టుకునే పోపుల డబ్బా ప్రపంచ ప్రసిద్ధం. అందులోనే బామ్మలు చిల్లర నాణెములు దాచుకుని మనమలకీ, మనమరాళ్లకీ బిళ్ళలు కొనుక్కోమని ఇచ్చేవారు. ఈ రోజుల్లో బామ్మలకీ, బాపు బొమ్మలకీ వస్త్ర ధారణలో తేడా లేదు. కానీ పోపుల డబ్బా మటుకు తన రూపు రేఖలు మార్చుకోలేదు. అది స్టీలుది అయినా, అల్యూమినియంది అయినా గుండ్రంగా అంగుళంన్నర లోతున ఉంటుంది. ఆవాలు, జీలకర్ర, మెంతులు, ధనియాలు, ఎండు మిరపకాయలు, ఇంగువ, మిరియాలు, పసుపు, మినప్పప్పు- ఇలా పోపు సామాగ్రి ఒక్కొక్కటీ ఐదారు చెంచాలు పట్టే గుండ్రం గిన్నెలలో ఆ పోపు డబ్బాలో పెట్టుకుంటాం. 
కదా?

ఒక సారి మా వంటింట్లో ఏమయిందీ అంటే...ఒక పొలి కేక వినిపించింది. ఆ కేక తాలూకు గొంతుక మామూలుగా మాట్లాడితే ఏ లతా మంగేష్కరో, సుశీలో అనుకుంటాం. కానీ ఈ కేక పెట్టే సందర్భం లోఅది తారాస్థాయికి చేరుకున్న సూర్యాకాంతం లా ఉంటుంది. అంచేత నేను చిన్నప్పుడు సైన్స్ పాఠం లో నేర్చుకున్నట్టుగా అసంకల్పిత ప్రతీకార చర్య సూత్రాన్ని పాటించి వంటింట్లోకి పరిగెట్టగానే...నా గెట్టుడు ఆగిపోయింది. “అర్జెంటు..మెంతులు...”..మా క్వీన్ విక్టోరియా ఒక చెయ్యి పొయ్యి మీద పోపు గరిటె పట్టుకునీ, మరొక చెయ్యి పోపు డబ్బాలో ఒక ఖాళీ గిన్నె వేపూ ఉండగా సొగసైన మెడ మటుకు నా వేపు చూస్తూ కెవ్వు కేక పెడుతున్న దృశ్యం నన్ను ఆకట్టుకుంది. “అలా వెర్రి మొహం పెట్టుకు చూస్తావేమ్, మొగుడూ...పోపు మాడిపోతోంది.  మెంతులు అయిపోయాయి. అర్జెంటుగా పట్రా”... ఆదేశించింది అ మహాతల్లి. అప్పుడు నాకు ముత్యాల ముగ్గు లో “ఆ మాట ముందు సెప్పాల” అనే రావు గోపాల రావు గుర్తుకు వచ్చి “అవన్నీ ముందు చూసుకో వద్దూ” అనబోయి సగం పోపు వేసి చిటపటలాడుతున్న వేడి నూనె గల పోపు గరిటె ని నా వేపు తిప్పుతున్న ఆవిడ దురుద్దేశ్యాన్ని గమనించి విరమించుకుని సదరు సరుకులు దాచుకునే అలమారాలు ఉండే గది, అనగా  పాంట్రీ కేసి పరిగెట్టాను. దాం దుంపతెగా- అందులో అన్నీ మూతలు పెట్టేసి ఉన్న యాభై డబ్బాలలో ఈ దిక్కుమాలిన మెంతుల డబ్బా ఏదో తెలియక ఒక సారి జీల కర్ర, మరొక సారి ఆవాలు-ఇలా పాంట్రీ నించి పోపు గరిటె దాకా ట్రిప్పులు వేసి అటు ఆ పోపు తో పాటు నా మొహం కూడా పూర్తిగా మాడ్చుకున్నాను.

పొయ్యి పక్కన ఉన్న పోపుల డబ్బాలో అన్ని సరుకులూ నిండుగా ఉన్నాయా లేదా అని వంట మొదలెట్టేముందే చూసుకోవడం ఆ రోజు నేర్చుకోవలసిన  నీతి కదా! “అబ్బే అలా అస్తమానూ కుదరదు. అలా చీటికీ మాటికీ ఆ పాంట్రీ కేసి పరిగెట్టి వెతుక్కోలేక చస్తున్నాం. ఇంకేమైనా అవిడియా చూడు, మొగుడూ” అని ఆదేశించింది మా క్వీన్ విక్టోరియా. అప్పుడు నా “మూడంచెల పథకం” అమలు లోకి తెచ్చాను. ఎంతయినా బ్రిలియంట్ ఫెలోని కదా!. అదేమిటంటే- ఇక్కడో చిన్న రామాయణం లో పిడకల వేట- ఆ మధ్య మా వంటింట్లో ఉన్న కింద సొరుగులు అన్నింటినీ “లాగే సొరుగులు” లాగా మార్చేశాం. అలాంటి ఒక సొరుగు ఫొటో ఇక్కడ పెట్టాను. అంటే లోపల మేకులు వేసి కొట్టేసిన చెక్కల బదులు ఈ సొరుగులు చక్రాల మీద ఉండి, మనం బయటకి లాగి, వస్తువులు తీసుకుని మళ్ళీ లోపలికి తోసెయ్యవచ్చును. ఇందులో అన్నీ ప్లాస్టిక్ డబ్బాలే ఉన్నాయి ఏమిటీ, ఇంట్లో స్టీలు గిన్నెలు, ఇనప మూకుడు లేకుండా అన్నీ తిన్నగా ఆ ఇన్ స్టా పాట్ లోనో, గాలి వేపుడు యంత్రం లోనో చేసి కంచం లో వేసేసుకుని తినేసేటంత నాగరికులం అనుకుంటారేమో మమ్మల్ని. అంత సీన్ లేదమ్మా. అలాంటి భారీ గిన్నెలు ఇలాంటి అర్భకం సొరుగులో పెడితే అది విరిగి చస్తుంది. వాటి చోటు వేరు. ఇక అమెరికాలో రోజూ తినేవి అన్నీ వారం కితం చేసి ఫ్రిజ్ లో దాచుకున్న లెఫ్ట్ ఓవర్ తిండి కదా! వాటి కోసం ఎన్ని ప్లాస్టిక్ డబ్బాలు ఎన్ని కొన్నా సరిపోదు. అదన్నమాట ఆ రంగు రంగుల సొరుగు సొగసు. సోకు ఎక్కువా, బరువు తక్కువా కాబట్టి బయటకీ లాగెయ్యడం, లోపలకి తోసెయ్యడం వీజీ! 

ప్రస్తుత విషయానికి వస్తే- అలాంటి సొరుగు మా వంటింట్లో కుంపట్లు ఉండే చోటికి పక్కనే ఒహటి ఉంది. నా మూడంచెల పథకం లో ఇది రెండోది అనమాట. ఆవాలు, మెంతులు వగైరాలు కొట్లో కొనుక్కున్నప్పుడు వచ్చే పెద్ద పెద్ద పొట్లాలని చింపేసి డబ్బున్న వాళ్ళు తళ తళలాడే స్టైన్ లెస్ స్టీలు, నాబోటి వాళ్ళు సత్తు లోహం డబ్బాలు, అల్యూమినియం డబ్బాలు, గాజు సీసాలలో పోసి పెట్టుకునే పేంట్రీ అనే చోటు ఆ అంచెలలో మొదటిది కదా. ఇక ఆఖరిది పోపు డబ్బాలో చిన్న గిన్నెలలో వేసుకునేది. ఇప్పుడు ఆ రెండు సైజులకీ మధ్యే మధ్యే ఉండే ప్లాస్టిక్ డబ్బాలలో పోసి అవి కూడా వంట చేయునప్పుడు ఇందాకటి ఎమర్జెన్సీ లో కూడా అందుకోగలిగే అంత దూరం లో మాత్రమే పెట్టుకోవడం నేను సృష్టించిన రెండో అంచె. దాని తాలూకు ఫొటో ఇక్కడ పెట్టాను. ఇది చూడగానే విషయం అర్ధం అవుతుంది. అనగా ఈ రెండవ అంచెల అవిడియా అద్భుతంగానే ఉండి, అన్ని పోపు దినుసులూ అందుబాటులోకి వచ్చేశాయి కానీ మొదటి రోజు ఏ ప్లాస్టిక్ డబ్బాలో ఆవాలు ఉండెనో, మెంతులు లేవో తెలియక ఇబ్బంది వచ్చి మరొక చిన్న సైజు పొలి కేక పెట్టింది. అప్పుడు నేను నా అవిడియాకి మెరుగులు దిద్ది ఆయా సీసాల మూతల మీద అందులో ఉండే సరుకు పేరు మన మాతృభాష లోనూ, కొండొకచో ఆంగ్లములోనూ వ్రాసిన కాగితపు ముక్కలపై వ్రాసి అతికించాను. ఆంగ్లం లో వ్రాయడానికి కారణం ఏమిటంటే కొన్ని కొన్ని మసాలా దినుసుల పేర్లు తెలుగులో రాస్తే తిన బుద్ధి వెయ్యదు. ఉదాహరణకి చాట్ మసాలా పొడి ని తెలుగులో రాయాలంటే చెత్త మసాలా అని రాసే ప్రమాదం ఉంది కదా! కానీ మా క్వీన్ విక్టోరియా ధర్మమా అని ఇక్కడ కూడా దెబ్బ తినేశాను. అనగా- ఈ రెండో అంచెల పథకం ఆచరణ లో పెట్టిన కొన్నాళ్ళకి ఒక రోజు ఒక విధంగానూ, మరొక రోజు మరొక విధంగానూ కొంప ములిగే సంగతులు జరిగాయి. ఇక్కడ రెండు రోజులు కానీ రెండు కొంపలు కాదు. 'ములుగుత' నా ఒక్కడిదే! ఆ రోజు మా క్వీన్ విక్టోరియా ఎప్పటి లాగానే వంట చేయుచూ, పోపుల డబ్బా గిన్నెలలో సరుకు నిండుకోగానే తర్వాత నింపుకుందాం లే అనేసుకుని,  ఎమర్జెన్సీ కోసం నేను ఏర్పాటు చేసిన ఈ బయటకి లాగే డ్రాయర్ బయటకే లాగి ఆయా ప్లాస్టిక్ డబ్బాల మూతలు తీసి పోపు వేసి వంట పూర్తి చేసెను కానీ, తన మతి మరపు వలన ఆవాలు అని వ్రాసి ఉన్న మూతని మెంతుల డబ్బా మీదా, మెంతులు అని వ్రాసి ఉన్న మూతని అదిగో ఆ చెత్త మసాలా డబ్బా కీ బిగించి ఆ బయటకి లాగే డ్రాయర్ ని లోపలికి తోసేసింది. అనగా ఆ తర్వాత కతిపయ దినములకి నేను, అవును- నేనే వంట చేస్తూండగా నిఝంగానే పోపు గిన్నెలు ఖాళీ అయినప్పుడు ఎమర్జెన్సీ పోపు కోసం ఆయా మూతల మీధ వ్రాసి ఉన్న విధంగా ముందు ఆవాలు వేస్తే అవి చిట పట లాడడం మాట దేవుడెరుగు. అర క్షణం లో నల్లగా మాడి చచ్చాయి. ఎందుకనగా అవి ఆవాలు కాదు. మెంతులు. అలాగే మిరపకాయల డబ్బా మూత తీసి నూనె లో వేసేస్తే అది కటిక ఉప్పు. అలా కటిక ఉప్పు నూనె లో వేసిన మొదటి వంటవాడిని నేనే. దానికి మా మహారాణికి ధన్యవాదాలు మరి! మూత మీద పేరు ఒకటి ఉంటే మూత తెరచి తరచి చూస్తే ఆ సరుకు వేరు. ఈ తతంగం తర్వాత మరొక బ్రిలియంట్ అవిడియా వచ్చి ఆ సొరుగులో పెట్టే ప్లాస్టిక్ డబ్బాల సైజులు రకరకాలుగానూ, కొన్ని గాజు సీసాలు ఇలా ఒక దాని మూత మరొక దానికి పట్టకుండా జాగ్రత్త పడ్డాను.

ఇలా మా వంటింట్లో ఏవేవో తతంగాలు జరుగుతూనే ఉంటాయి. 


ఇంతకీ మా ఇంట్లో వంటింటికి అధిపతి ఎవరూ అనే అనుమానాలు ఎవరికీ అక్కర లేదు. ఎందుకంటే మా వంటింటికి ఒక రాణీ, ఒక రాజూ ఇద్దరూ సమాన స్థాయి పరిపాలకులే. ఒకరి బాధ్యత వండుట, మరొకరి బాధ్యత తినుట! 

 

*****
 

bottom of page