top of page

ఎన్నారై కాలమ్ - 7

7. మన సంస్కృతికి మనమే సమాధి కడుతున్నామా?

 

Satyam Mandapati Madhuravani.com

సత్యం మందపాటి

తరతరాలుగా ఘనకీర్తి సాధించిన మన సంస్కృతి రోజురోజుకీ దిగజారిపోతున్నదని వాపోతున్నవారు ఈరోజుల్లో మన సమాజంలో ఎందరో వున్నారు.

‘కాలానుగుణంగా చిన్న చిన్న మార్పులు రావటం అనేది ఏ సంస్కృతిలోనయినా సహజమేగానీ, ఇలా సామాజిక విలువలు క్రిందకి పడిపోకూడదు. మనమే మన సంస్కృతికి సమాధి కట్టటం ప్రమాదకరం’ అని హెచ్చరిస్తున్నారు కొందరు సామాజికవేత్తలు.

 

​ ‘ఎన్నో శతాబ్దాలుగా నిలదొక్కుకుపోయిన సమాజం ఎలా, ఎందుకు దిగజారిపోతుంది, మీ పిచ్చిగాని.’ అనేవారు కూడా ఉన్నారు. ఇది ఏదో కొద్ది మంది ద్వారా జరిగేది కాదు, జరగదు అని వారి వాదన.

 ‘సరే! మన సంస్కృతి దిగజారి పోతున్నది. సో వాట్?’ అంటాడు ఇంకొక వ్యక్తి.

‘ఎన్నో సంస్కృతులు చరిత్రలో మరుగున పడిపోయాయి. మానవ జీవితం ఆగిపోయిందా? లేదు కదా! ఇదీ అంతే!’ అనేదింకో వాదన.

 ఇలా ఎంతోమంది దగ్గరనించీ ఎన్నో రకాల మాటలు వింటూనే ఉన్నాము.

 ఇవన్నీ వింటుంటే, ‘అసలు సంస్కృతి అంటే ఏమిటి?’ అనే ఒక ప్రశ్న ఉదయిస్తుంది.

 అక్కడినించే ఈ పరిశీలన మొదలుపెడదాము.

***

ఏ సంస్కృతిలోనైనా, మానవుడు మంచి మనిషిగా బ్రతకటానికి అవసరమైనవి రెండు అని ఏ దేశచరిత్ర చూసినా తెలుస్తుంది. మరి ఏమిటి ఆ రెండు? ఒకటి చదువు. ఇంకొకటి సంస్కారం.

 

చదువు మనిషికి రకరకాలుగా వస్తుంది. కొన్ని చూసి నేర్చుకునేవి. కొన్ని తెలుసుకుని నేర్చుకునేవి. కొన్ని పుస్తకాలలో చదువుకొని నేర్చుకునేవి. ఆదిమానవుడినించీ ఇప్పటిదాకా మన చుట్టూ ఉన్న సమాజంలో రోజువారీ జరుగుతున్న ఎన్నో విషయాలు చూసి, ఇతరుల ద్వారా తెలుసుకుని సక్రమమైన మానవ జీవన విధానాన్ని తరతరాలుగా నేర్చుకుంటున్నాము. ఆశ్రమ ధర్మాల కాలంనించీ ఈనాటి దాకా మనకి చదువు పాఠశాలల్లో గురువుల ద్వారా వస్తున్నది. గురువులు ఎవరైనా సరే, అవి మనకి వేదాలు, ఉపనిషత్తులు, బైబిల్, ఖురాన్, గ్రంధ సాహిబ్, టోరా మొదలైన మత గ్రంధాలనించీ కావచ్చు, ఫిజిక్స్, మాథమాటిక్స్, సైన్స్, మెడిసిన్, ఇంజనీరింగ్, చరిత్ర మొదలైన పుస్తకాల ద్వారా కావచ్చు. ఇంకే ఇతర జీవన కథనాల ద్వారా అయినా కావచ్చు. డిగ్రీ అనేది ఉద్యోగాల్లో అవసరం కాబట్టి ఆ పట్టా తీసుకునేది కూడా చదువులో భాగమే. ఒక వృత్తికి అవసరమైన జ్ఞాన సముపార్జన కూడా చదువే అవుతుంది. అది కూడా ఆయారంగాల్లో గురువుల దగ్గరనించో, నిపుణుల దగ్గరో, తమ స్వీయ అనుభవాల ద్వారా కూడా రావచ్చు. అనుభవాల సారమే జీవితం కదూ!

మరి సంస్కారం? ఆ సంస్క్రారం అనేది ముఖ్యంగా వచ్చేది తల్లిదండ్రులు, ఇతర కుటుంబ పెద్దల దగ్గరనించి. చదువులోనే కాక, సంస్కారంలో కూడా వలసిన జ్ఞానం ఇచ్చేది సమర్థులైన గురువులు. ఎంతో జీవితానుభవంగల మిత్రుల స్నేహం వల్ల కూడా మంచి సంస్కారం అలవడే అవకాశం ఉంది. అక్షరాలు చదవటం చదువు వల్ల ఎలాగూ వస్తుంది కనుక, మనకి ఎన్ని గొప్ప పుస్తకాలు చదివితే మన సంస్కారాన్ని జీవిత పాఠాలతో అంతగా సానబెట్టుకోవచ్చునని నమ్మేవారిలో నేనూ ఒకడిని. మంచి జీవన విధానానికి కావలసిన జ్ఞానాన్ని ఇచ్చేది మంచి పుస్తక పఠనం.

 

మరి ఇవన్నీ జరుగుతూనే వుంటాయిగదా… మరి ఆ చదువూ, సంస్కారం వున్న ఏ సంస్కృతైనా ఎందుకు, ఎలా చరిత్రలో మాయమైపోతుంది?

మంచి ప్రశ్న. అదీ చూద్దాము.

 

అసలు సంస్కృతి అంటే నిర్వచనం ఏమిటి?

 

సంస్కృతి అంటే ఒక ప్రాంతానికి సంబంధించిన నాగరికత. ఆ ప్రాంతం ఒక దేశం కావచ్చు. ఒక దేశంలో కూడా వివిధ ప్రాంతాలలో కొన్ని మార్పులతో వివిధ సంస్కృతులు ఉన్నప్పుడు, అక్కడ వివిధ సంస్కృతులు ఉండవచ్చు. దానికి ఒక మంచి ఉదాహరణ మన భారతదేశం. మనది భారతీయ సంస్కృతి అయినా, వివిధ రాష్ట్రాల్లో వారి భాషలు వేరు, వేషధారణలు వేరు. ఆచార వ్యవహారాల్లోనూ, కళలలోనూ కూడా తేడాలున్నాయి. ఆ తేడాలే వారి సంస్కృతిలో కూడా కనిపిస్తాయి.

 

అలాగే ఒక సంస్కృతికి ఇంకొక సంస్కృతి ప్రభావం వల్ల కూడా కొన్ని మార్పులు రావచ్చు. అయినా దానివల్ల ఆ సంస్కృతి విస్కృతమవుతుంది కానీ, వెనుక పడదు. నశించిపోదు.

 

 మరి నాగరికత అనే వృక్షంలో కొన్ని కొమ్మలు, ఆకులు, పువ్వులు, ఫలాలు ఉంటాయి కదా, అవేమిటి?

 

 ఎందుకు ఉండవు? ఉంటాయి. వాటిల్లో ముఖ్యమైనవి భాష, వేషధారణ, వివిధ కళలు (సాహిత్యం, సంగీతం, నృత్యం, రకరకాల జానపద కళలు గృహవృత్తులూ లాటివి), మతం, ఆచార సంప్రదాయ వ్యవహారాలు, ఆహార వైవిధ్యాలు మొదలైనవి. వీటన్నిటిలోనూ ఆనాటికీ ఈనాటికీ వున్న తేడాలు, మంచీచెడులూ చూద్దాము.

 

నాకు కొంచెం తక్కువగా ఎనిమిది దశాబ్దాల వయసున్నది కనుక, మరీ ఇక్ష్వాకుల కాలం దాకా పోకుండా, నా చిన్నప్పటినించీ ఇప్పటిదాకా నా కళ్ళారా చూసిన మార్పుల గురించే చెబుతాను. ఇంకా వెనక్కి వెళ్ళాలనుకుంటే, మీకు మీరే ఆ విశ్లేషణ చేసుకోవచ్చు.

 

చదువుః మా చిన్నప్పుడు స్కూలు రోజులనించీ, పెద్దయాక డిగ్రీ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్, ఆంధ్రా యూనివర్శిటీలలో మనసు పెట్టి పాఠాలు చెప్పే ఎంతో గొప్ప ఉపాధ్యాయులుండేవారు. ఏమైనా క్లాసులో అర్థం కాకపోతే, క్లాసు అయిన తర్వాత అక్కడే కొంచెంసేపో, వారి ఇంటికి రమ్మని ఉచితంగానో అవి ఇంకా వివరంగా చేప్పేవారు. నాకు చిన్నప్పటినించీ బట్టీ పట్టటం వచ్చేది కాదు. వాటికి చక్కటి కథనాలతో గుర్తు పెట్టుకోవటం నేర్పేవారు. ఉదాహరణకు, న్యూటన్ సూత్రాల్లో మొదటిది, “దాంట్లో ఏమీ లేదురా. బయటనించీ ఎవరో వచ్చి తీసే దాకా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే వుంటుంది” అని చెప్పారు మా ఫిజిక్స్ మాస్టారు. (A body at rest will stay at rest until an external force is applied to move it) అదే పధ్ధతిలో న్యూటన్ సూత్రాలే కాక, నాకిష్టమైన కథనాలతో, అప్పుడే కాదు ఇప్పుడు కూడా ఎన్నో విషయాలు, ఆ భావనలపరంగా (కాంసెప్ట్స్) నేను తయారు చేసుకున్నవే, ఎన్నటికీ మరచిపోలేను. 

 

నేను ఇండియా వెళ్ళినప్పుడూ, అక్కడ చదువుకుని ఈమధ్య అమెరికాకి వచ్చిన వారిలో కొందరితో మాట్లాడుతున్నప్పుడూ, వారు వట్టి బట్టీ విక్రమార్కులేగాని, విషయపరంగా జ్ఞానశూన్యులేనని అర్థమైపోయేది.

 

తెలుగుదేశంలో (పార్టీ సంబంధం లేదు) ఒక స్వాహా ముఖ్యమంత్రి కొన్ని వందల కాలేజీలు ప్రారంభించి, చదువుని అమ్మకానికి పెట్టి, విధ్యార్థులు పాఠశాలల్లో చదువుకోవటం బదులు చదువుకొనటం మొదలుపెట్టాక, ఏవో కొన్ని కాలేజీల్లో తప్ప ఎక్కువ కాలేజీల్లో చదువు చెప్పటం మానేశారనీ, క్లాసుల్లో పాఠాలు చెప్పకుండా, క్లాసులు అయాక అదే టీచర్ ద్వారా ట్యూషన్లతో ఇంకా ఎంతో డబ్బు సంపాదిస్తున్నారని వాళ్ళే చెబితే ఆశ్చ్రర్యపోయాను. అంతేకాక ఈ బట్టీ విక్రమార్కులే కాక, అక్రమార్కులు కూడా ఎక్కువయారుట. అదీకాక, ఏమాత్రం అర్థంపర్ధంలేని కారణాలు చూపించి ఇంగ్లీష్ మీడియం పెట్టి తెలుగు భాషకి తెగులు పట్టించిన స్కూళ్ళు కూడా ఎక్కువైపోయాయి.

 

సంస్కారంః భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తున్నఈ రోజుల్లో, పిల్లలతో తల్లిదండ్రులు గడుపుతున్న సమయం దాదాపుగా పూజ్యమయింది. తాతయ్య, అమ్మమ్మ, బామ్మ వృద్ధాశ్రమాలపాలవటంతో, పిల్లలకి కుటుంబ సంస్కారం అబ్బే బదులు, ఆయాలే అదీ చేస్తున్నారు. స్కూళ్ళల్లో పాఠాలు చెప్పటానికే సమయం లేని టీచర్లకు, అదే క్లాసులో కాసినో కూసినో మంచి మాటలు చెప్పే అవకాశమూ లేదు. పుస్తక పఠనం కూడా పూర్తిగా కనుమరుగైనందు వల్ల ఆ విజ్ఞానం కూడా వారికి దూరమయింది. నేను నా ‘ఉద్యోగ విజయాలు’ పుస్తకంలో సుమతీ శతకంలోని కొన్ని పద్యాలు ఈనాటి ఆఫీసుల్లోని మేనేజ్మెంట్ సూత్రాలకు ఎంత దగ్గరగా వున్నాయో పూర్తిగా ఒక అధ్యాయంలో చెప్పాను. అది తెలుగులోవుంది కనుక, మన తెలుగుదేశాల విద్యార్థులకు అది అర్థమయే అవకాశం కూడా లేదు. బహు కొద్దిమందికి తెలుగు చదవటం వచ్చినా, పుస్తక పఠనమే అటకెక్కింది కదా!

 

 భాషః యునెస్కో ఒకే ఒక భారతీయ భాష, తెలుగుని మృతభాష అవబోతున్నదని పేర్కొన్నది. ఇంకొక మూడు నాలుగు దశాబ్దాల్లో తెలుగు భాష ఎలా అంతరించిపోతుందో సోదాహరణంగా వివరించింది. ఒక సంస్కృతి తన సంస్కృతికి కనీసం ముఫై శాతం దూరమవుతున్నప్పుడు, ఆ సంస్కృతితో పాటు భాష కూడా అంతరించి పోతుంది. ఏ భాష అయినా మృతభాష అవటానికి ఉన్న అన్ని కారణాలూ ఈనాటి తెలుగు భాషకి వర్తిస్తాయి. ఉద్రేకపడి అలా జరగనే జరగదు అన్నవారే, ఇప్పుడు ఆలోచించి అవును నిజమే అనే పరిస్థితిలో ఉన్నది తెలుగు భాష. పైన చెప్పినట్టు చదువులని అమ్మకానికి పెట్టాక మొట్టమొదటగా దెబ్బ తిన్నది మన భాష. మా పిల్లలనందరినీ అమెరికా పంపిస్తాము కనుక, తెలుగు అనవసరం అనేది ఈనాటి తల్లిదండ్రుల వాదన. అంతే కాదు ఆ తల్లిదండ్రుల్లోనే తెలుగు వ్రాయటం, చదవటం వచ్చినవారు కూడా ఎంతో తక్కువ శాతం లేదా పూజ్యం.

 

ఆనాటి ఒక ‘తెలుగు ముఖ్యమంత్రి’ నిధులన్నీ ఆపేసి గ్రంధాలయాలని గోదావరిలో కలిపేశాక, తెలుగు పుస్తకం చచ్చిపోయింది. ‘ఇంతకు ముందు ఏ పుస్తకమయినా పదివేల కాపీలు వేసేవాళ్ళం. వాటిలో ఏడెనిమిది వేల కాపీలు లైబ్రరీలకు ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు మూడు వందల కాపీలు వేస్తే, లైబ్రరీలు ఇరవయ్యో, ముప్ఫైయ్యో మాత్రమే తీసుకుంటున్నాయి. అదీ ఎన్నో ప్రయాసలు పడితే, లంచాలు పెడితే!’ అని పదిహేనేళ్ళ క్రితమే నాతో రెండు మూడుసార్లు అన్నారు మిత్రులు నవోదయా రామ్మోహనరావుగారు. ఎన్నాళ్ళనించో నిలబడిన విపుల, చతుర, తెలుగు వెలుగు, ఆంధ్రభూమి మొదలైన ఎన్నో పత్రికలు కూడా మూతపడ్డాయి. తెలుగు భాష అంత్యక్రియలకు ప్రయత్నాలు ఆగకుండా ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఇలా వ్రాయటానికి ఎంతో బాధగా ఉన్నా మరి నిజమెప్పుడూ నిష్టూరంగానే ఉంటుంది కదా!

 

వేషధారణః ఎక్కడో కొన్ని పెళ్ళిళ్ళలోనూ, ఇతర కార్యక్రమాల్లోనూ, షాపుల్లోనూ తప్ప పెద్ద నగరాల్లో ఎక్కడా చీరలు కనపడటం మానేశాయి. మన తెలుగు సినిమాల పుణ్యమా అని వాళ్ళు ఏం చూపిస్తే అవే కట్టుకుంటున్నారు యువత. చీరలు, ఓణీలు, పంచెలు, కండువాలు, లాల్చీలు మ్యూజియంలలో పెట్టేసే సమయం వచ్చింది. ఈమధ్య చిరిగిపోయిన లేదా చింపేసిన దుస్తులు ఎంతో ఎక్కువ ధరకి కొని ధరించటం కూడా ఒక ఫాషన్ అయింది.

 

 వివిధ కళలుః సాహిత్యం, సంగీతం, నృత్యం, రకరకాల జానపద కళలు, గృహ వృత్తులూ లాటివన్నీ కనుమరుగవటమో, ఎంతో పెద్ద మార్పుతో మన సంస్కృతికి దూరమవటమో చూస్తున్నాము. తెలుగు భాష కనుమరుగవుతున్నప్పుడు, దానితోపాటు సాహిత్యం కూడా అదే దుస్థితిలో ఉంటుంది. పత్రికలు లేకపోవటం, పుస్తక పఠనం తగ్గిపోవటం, తెలుగు చదివేవారి సంఖ్య ఎనభై శాతం పడిపోవటం, తెలుగు సినిమా పాటల్లో సాహిత్యం మాయమైపోవటం మొదలైన కారణాల వల్ల, ఇప్పుడు తెలుగు సాహిత్యం కూడా అంతిమ దశలోనే ఉంది. సంగీతంలో సినిమా సంగీతం ఎంతో మధురంగా స్వర్ణయుగాన్ని కొన్ని దశాబ్దాలు ఏలినా, ఇప్పుడు పాతాళలోకంలో డబ్బాల మోతతో, కీచుగొంతు అరుపులతో, పరభాషా గాయకుల భరించలేని అక్షర అజ్ఞానంతో, భావ ప్రకటన పూర్తిగా కరువై భ్రష్టుపట్టింది. సంగీత సాహిత్యాలకు విలువలేకుండా పోయింది. ఈరోజుల్లో లలిత సంగీతం అసలే మనకి తలకెక్కదు. జానపద సంగీతంలోకి విదేశీ బాణీలు వచ్చేశాయి. మన త్యాగరాజు, అన్నమయ్య, క్షేత్రయ్య, రామదాసు మొదలైన వాగ్గేయకారుల సంగీతమే కాదు, వారి పేర్లే తెలిసినవారు ఈ రోజుల్లో తక్కువైపోయారు. గుంటూరులో రెండుసార్లు త్యాగరాజ ఉత్సవాలకి వెడితే, హాల్లో కన్నా స్టేజ్ మీదే ఎక్కువ మంది జనమున్నారు, మన శాస్త్రీయ సంగీతం తమిళనాడులో తలదాచుకుని, పెరిగి పెద్దదయింది. మన కూచిపూడి నృత్యానికి ఆశ్రయం ఇచ్చినవాళ్ళు కూడా తమిళులే. బాలమురళికృష్ణగారికి, బాలుగారికీ పద్మ పురస్కారాలు తెప్పించినది తమిళనాడు ప్రభుత్వమే! తెలుగు దేశం కాదు. మన హరికథలు వైకుంఠలో శ్రీహరి దగ్గరకు వెళ్ళిపోయాయి. బుర్రకథలంటే ఏమిటో ఈనాటి చాల బుర్రలకి తెలియదు. మన తోలుబొమ్మల ఆటలు తెలియవుగాని, విదేశీ టీవీల్లో పప్పెట్ షోలు తెలుసు. కార్లతో నిండిపోయిన వీధులు వీధి నాటకాలకి చోటు ఇవ్వలేకపోతున్నాయి. ఆరోజుల్లో ప్రతి రోడ్డు మీదా సంక్రాంతి పండుగకు కనపడే హరిదాసులు, సంక్రాంతి గొబ్బెమ్మలు, డూడూ బసవన్నలూ, దసరాకి ‘అయ్యవారికి చాలు ఐదు వరహాలు’ అంటూ బాణాలతో వచ్చే పిల్లలూ కరువైపోయారు. ఈమధ్య అమెరికా వచ్చిన తెలుగువారితో మాట్లాడుతున్నప్పుడు చాలమందికి బాలమురళికృష్ణ, వెంపటి సత్యం, నటరాజ రామకృష్ణ, గురజాడ అప్పారావు, పింగళి వెంకయ్య, శంకరంబాడి సుందరాచార్య, నన్నయ్స, తిక్కన, పోతన మొదలైన పేర్లేమీ తెలియకపోవటం చూసి బాధ వేసింది.

 

ఎన్నో గృహవృత్తులు మాయమై పోయాయి. దీపావళి టపాకాయలు శివకాశీనుంచీ, వినాయక చవితి విగ్రహాలు, ఇతర దేవుళ్ళ కంచు విగ్రహాలూ మొదలైనవి స్థానికంగానూ కాకుండా ఇప్పుడు చైనానించి వస్తున్నాయి. కొన్ని చేనేత, కంసాలి మొదలైన గృహవృత్తులతో జీవనం చేసేవారు, ఈరోజుల్లో జీవనోపాధి లేక ఇబ్బంది పడుతున్నారు. వ్యవసాయరంగంలో చిన్నపాటి రైతులకు ఆత్మహత్యలే శరణ్యం అయాయి.

 

మతం, ఆచార సంప్రదాయాలుః ఏమతమైనా సమాజంలో క్రమశిక్షణ కోసం మనిషి సృష్టించుకున్నదే.

 

తాము సృష్టించుకున్న మతాలకి తామే బానిసలై, తమ మత గ్రంధాల్ని చదివి అర్ధం చేసుకోకుండానే, రాజకీయ నాయకుల పదవీ వ్యామోహాలనూ, అత్యాశను సమర్ధిస్తూ ఇతర మతాల మీద మారణహోమం సృష్టిస్తున్నారు. ఇది ఏదో ఒక మతానికి మాత్రమే సంబంధించిన విషయం కాదు, అన్ని మతాలకీ ఒకే స్థాయిలో వర్తిస్తుంది.

మతం అనేది ఏ సంస్కృతిలోనైనా ఒక చిన్న భాగమే. ఒకే సంస్కృతిలో ఎన్నో మతాలుంటాయి. కొన్ని ఆచారాలు మత పరిధి దాటి అక్కడి సంస్కృతిలోకి వెళ్ళటంకూడా జరుగుతుంది. అమెరికాలోనూ, యూరప్లోనూ హిందువులు క్రిస్మస్ చెట్లు, దీపాలు పెట్టుకుని ఘనంగా క్రిస్మస్ పండుగ జరుపుకోవటం, బారతదేశంలో ఇతర మతస్థులు దీపావళికి టపాకాయలు కాల్చుకొని ఆనందించటం ఉదాహరణలు. ఇవి మతపరంగా కావు, సంస్కృతిపరంగా మాత్రమే. ప్రపంచంలో ఏ మతానికీ చెందని ఎన్నో కొట్లమంది మంచి ప్రవర్తనతో, విలువలతో ఉండటం చూస్తుంటే, మతం మనిషి మనుగడకు అసలు అవసరమా? అవసరం అయితే ఎంతవరకూ అవసరం? అనే ప్రశ్న కూడా ఉదయిస్తుంది.  

ఈరోజుల్లో మతానికీ, ఆ మతస్థులకీ మధ్య ఎంతో అగాధం కూడా చూస్తున్నాం. మత గ్రంధాలను చదవకుండా, ఏవో కాకమ్మ కథలను చూచాయగా విని అదే మతమనుకుని తప్పుదారి పట్టి, ఏహ్య భావంతో మిగతా మతాల మీద యుధ్ధం చేసే వారినీ చూస్తున్నాం. ఇది కూడా దాదాపు అన్ని మతాలకీ వర్తిస్తుంది. బైబిల్, ఖురాన్, గీత, వేదాలు, ఉపనిషత్తులు ఎంతమంది పూర్తిగా అర్ధం చేసుకుని చదివి పాటిస్తున్నారో ఒక్కసారి ఆలోచిస్తే, మతం పేరుతో ఒక మనిషి ఇంకొక మనిషిని ఎలా పీక్కుతింటున్నాడో, వారి జీవితాలతో ఎలా ఆడుకుంటున్నాడో అర్ధమవుతుంది. మనిషిగా పుట్టినందుకు మనిషిగా జీవించలేని జీవితం వ్యర్థం.

అలాగే మన హిందూమతంలో మను సిధ్ధాంతంలో కులాల ప్రసక్తి లేనే లేదు. అవి వారి వృత్తిపరమైన చుతుర్వర్ణాలు. ఒక దేశాన్నిగానీ, ప్రాంతాన్నిగానీ పరిపాలించే క్షత్రియులు, వారికి తమ విజ్ఞానంతో, రాజనీతితో సలహాలిచ్చే బ్రాహ్మణులు, వారిలకి కావలసిన నిత్యావసారాలు అందించే వైశ్యులు, తమ శ్రమతో పనిచేసి సమాజ జీవనాన్ని ముందుకు నడిపించే శూద్రులు.ఇవే మనుసిద్ధాంతంలోని చతుర్వర్ణాలు. మిడిమిడి జ్ఞానంతో వాటినే కులాలుగా చేసుకుని, తమ కుల అభిమానాన్ని, ఇతర కుల దురభిమానంగా మార్చుకుని, ఈరోజుల్లో దాన్ని కులద్వేషంగా మార్చుకున్న ‘గొప్ప’ జాతి మనది. ఇక్కడ విశేషమేమంటే, ఆనాటి మను సిధ్ధాంతం ఈరోజుల్లోనూ అన్ని దేశాల్లోనూ ఉన్నది. ఒక పెద్ద కంపెనీ ఉన్నదనుకోండి. అది మైక్రోసాఫ్ట్, టొయోటా, సోనీ, ఏదయినా కావచ్చు, అక్కడా మను చతుర్వర్ణ సిధ్ధాంతం అక్షరాల పాటిస్తున్నారు. ఆయా కంపెనీలకు ఒక సీయీవో (Chief Executive Officer), సీఎఫ్వో (Chief Financial Officer), లేదా స్వంతంగా ఒక వ్యాపారం చేసుకుంటున్న వ్యక్తి, ఇలాటివారు మను సిధ్ధాంతం ప్రకారం క్షత్రియులవుతారు. సీటీవో (Chief Technology Officer) లేదా కంపెనీలో పనిచేసే ఇంజనీర్లు, సైంటిస్టులు తమ విజ్ఞానం అందించే బ్రాహ్మణులవుతారు. అలాటి ప్రతి సంస్థలోనూ సప్లై చైన్ అంటే కావాలసిన ముడి సరుకులు, ఇతర భాగాలు కొనుగోలు చేసేవారూ, అలాటివి ఈ కంపెనీలకు అమ్మటానికి ఎన్నో ఇతర కంపెనీలు అవసరం. వారే వైశ్యులు. మరి కొన్ని భాగాలు అసెంబ్లీ చేయటానికీ, వెల్డింగ్, మెషీనింగ్, పాకేజింగ్, షిప్పింగ్ చేయటానికి కావల్సిన వారే శూద్రులు. అంటే ఇంగ్లీషులో బ్లూ కాలర్ వర్కర్స్. ఈ నాలుగు వర్ణాలూ ఒక కంపెనీకిగానీ, సంస్థకుగానీ, సమాజానికిగానీ, దేశానికిగానీ ఎంతో అవసరమే. ఒకటి తక్కువా కాదు, ఇంకొకటి ఎక్కువా కాదు. ఈ నాలుగు చక్రాలూ లేనిదే ఏ బండీ నడవదు. కాకపోతే, కాలక్రమేణా ఈ ప్రపంచవ్యాప్తమైన మను సిద్ధంతానికి మీసాలు పెట్టి, కులాలు అంటగట్టి, అదేదో సమాజానికి అనర్థ కారణమంటూ ఆ అల్లావుద్దీన్ దీపానికి బిరడా పెట్టి, దానిలో కులమనే పెద్ద భూతాన్ని చూపించి భయపెట్టారు మన స్వప్రయోజకులు.

 

ఇప్పుడు మతంతో పాటు కులం కూడా జీవితంలో ప్రధాన భాగం అయింది. వివిధ కళారంగాల్లోనే కాక, సమాజంలోని ప్రతి విషయానికీ కూడా కులం అంటగట్టే కులభూషణులు, కులదూషణులు ఎక్కువైపోయారు. సన్మార్గంలో వెడుతున్న సమాజానికి పట్టిన పెద్ద దరిద్రం ఈ కులం అనేది. ఈ రోజుల్లో ప్రతిదానికీ కులం అంటగట్టి మంట పెట్టేయటం మానత్వానికి పట్టిన పెద్ద ముసలం.

 

మరి మన సంస్కృతికి పట్టిన ఈ దౌర్భాగ్యాన్ని ఆపటం ఎలా? మరి మనుషుల్లో ఆ చదువూ సంస్కారం ఏమయాయి?

 

మహాత్మా గాంధీగారేమన్నారో తెలుసుగదా, “నువ్వు ఏదన్నా మార్పు చూడాలనుకుంటే, అది నీ దగ్గరే మొదలవాలి” అని.

 

అందుకనే అలా మళ్ళీ మన సంస్కృతికి పట్టాభిషేకం జరగాలనీ, కొన్ని వేల సంవత్స్రరాలు ఘనంగా వర్ధిల్లాలనీ కోరిక ఊన్నవాళ్ళు, ఒకసారి తమలోకి తామే తొంగి చూసుకునే అత్యవసరం ఇప్పుడు వచ్చింది.

 

ఆ మంచి మార్పు కూడా మన దగ్గరనించే రావాలి కదూ!

 

మరి ఇంకా ఆలస్యమెందుకు?

*****

bottom of page