top of page

“దీప్తి” ముచ్చట్లు 

నడిచే దారుల్లో...

Deepthi Pendyala.jpg

దీప్తి పెండ్యాల

వంటగదిలో గరిట, మౌజ్ పక్కపక్కనే సమయానుకూలంగా తిప్పుతూ సగటు తెలుగమ్మాయిలా “వర్క్ ఫ్రమ్ కిచెన్” విజయవంతంగా నిర్వహిస్తూన్న ఓ ఉదయం వేళ -

 పొద్దుపొద్దున్నే జరిగే స్క్రమ్(మీటింగు)లో పేరుకి ఎనిమిది, నిజానికి పన్నెండుగంటలకు తక్కువకాకుండా చేసిన పనిని అప్పజెప్పి, చేయబోయే పనిలో ఆటంకాలన్నీ నాజూగ్గా జూమ్ టేబుల్ మీదకి ముందుగానే జరిపేసి, మ్యూటుకొట్టి, మిగతా వంటంతా అయ్యాక చివరన చేస్తున్న సాంబారుకని తరుక్కున్న ముక్కలలో ఎక్కువయ్యాయని అనిపించిన నాలుగు దొండముక్కలని రోటి పచ్చడికని అట్టేపెట్టేసి, తక్కువైన కరివేపాకుకని పెరట్లోకెళుతూ స్టవ్ మంట తగ్గించి, అంతలో వర్క్ ల్యాప్టాప్ నుంచి వచ్చిన కలీగ్ ప్రశ్నకి సమాధానమిచ్చి, విండోకి ఆవల “టైపింగ్” అన్న అక్షరాలు మెరిసే వ్యవధిలో కసబిసా ఉల్లికూర, కరివేపాకు, పుదీనా ఆకులు తెంపుకొచ్చేసి, అదృష్టంకొద్దీ అప్పటికీ మాడని పోపులో పడేసి, అందులోనే సాంబారుకని సిద్ధంగా పెట్టుకున్న దినుసులన్నీ పడేసి, మరిగేలోపల వర్క్ టేబుల్ వద్దకెళ్ళిపోయి, బుద్ధిగా, శ్రద్ధగా ఆఫీసుపని చేసుకుంటాము చూడండీ, అలాంటి వేళ-

 

టింగుమని వాట్సప్ చేసిన శబ్దానికి ఎప్పటిలా విసుక్కోలేకపోయాను. అది చూపించిన దృశ్యం కట్టిపడేసింది మరి. అపుడెపుడో చిన్ననాటి స్నేహితులందరూ ఓ పెళ్లిలో పట్టులంగాలలో ముద్దుగా, బొమ్మల్లా అమాయకమైన మొహాలతో నిల్చున్న ఫోటో అది. లేళ్ళలా గెంతే పిల్లలల్లా “ఫోటో” అనగానే బిడియంగా బిగుసుకుపోయి, మొహమాటంగా ఓ పావునవ్వునుంచిన తలకాయను సగం వంచి, అనిమిషుల్లా కెమెరావైపు చూస్తూ ముగ్ధల్లా నిలుచున్న ఫోటో.

ఒకే ఫోటోలో అలనాటి ఇష్టసఖులందరినీ చూసి ఉక్కిరిబిక్కిరయ్యాను. ఆడుకున్న ఆటలు, పాడుకున్న పాటలు, పోగుపోసుకున్న మాటలు అన్నీ గుర్తొచ్చాయి. మాటలంటే ప్రవాహంలా సాగేవంతే.

 

బడిలో ఉన్నంతసేపూ క్లాసు, క్లాసుకీ మధ్య విరామంలో అట్టే సమయం దొరకకపోయేదేమో, బడి వదలగానే బడి బయట సైకిల్ స్టాండ్ దాకా వెళ్ళేవరకూ కోలాహలంగా మాటలు సాగేవి. అక్కడా ముచ్చట్లు మిగిలే ఉన్నట్టనిపించి మళ్ళీ సైకిళ్ళని నడిపించుకుంటూ, మాటలను పరిగెత్తించుకుంటూ ఇంటికెళ్ళే దారిలో పడేవారిమి. ఇల్లు ఓ అరమైలులోనే ఉందని తెలుస్తుంటే, ఆ పక్కనే ఉన్న గుడిలోకెళ్ళి దండం పెట్టుకున్నాక, అరుగులమీద అలాగే కూర్చుని మాట్లాడుతూనే ఉండేవారిమి. దారిపొడుగునా చెప్పుకున్న కబుర్లు చాలవన్నట్టు ఎవరి ఇల్లు మందుగా వస్తే ఆ ఇంటి ముందే “గేట్ మీటింగులు”. ఆ తరువాత ఆ మాటల్లో ఏ చేయాల్సిన హోం వర్కో గుర్తొచ్చి, అదయ్యాక మళ్ళీ ఎవరింట్లోనయినా కలిసి ఆడుకోవచ్చనీ, మాట్లాడుకోవచ్చని నిర్ణయించుకుని అప్పటికి ఇంట్లో అడుగు పెట్టేవారిమి. ఏం మాట్లాడేవారిమో అంతగా?

 

స్కూలు తరువాత చాలా మజిలీలు మారి చివరికి హ్యూస్టన్ లో తేలిన నేను మటుకూ వాట్సప్ సమూహంలో పడవేయబడేవరకూ నేనూ, మరికొందరు మాత్రమే అలా వేరుపడ్డారనీ, సాఫ్టువేర్ వాళ్ళు మినహా ఇతర డాక్టర్లు, ప్రభుత్వోద్యోగాల్లో కుదురుకున్నవారు, టీచర్లు అందరూ అపుడపుడూ కలుస్తూ, మాట్లాడుతూ స్నేహాన్ని అంతే పదిలంగా కాపాడుకుంటున్నారనీ అర్థమయింది. ఇప్పటి ఫోటోలవీ పంచుకుంటూంటే ఓ ఆనందం. చిన్నప్పటి ముఖకవళికలవీ పోలికపట్టి "హే, అది సుజా కదా? ఇది మంజూ కదా?" అంటూ.  నేనూ పెద్దయిపోయానన్న స్పృహ మొట్టమొదటిసారిగా కలిగిందీ ఆ సమూహంలో పడ్డాకే. దశాబ్దాల తరువాత చూడటంతో వాళ్ళలాగే నేనూ పెద్దయిపోయాను కదా అన్న స్పృహ అది. ఇండియాలో ఉండే కజిన్ల పిల్లలందరూ కాలేజీ చదువులకని అమెరికాకి వచ్చేస్తుంటే కలుగుతుందే పెద్దరికం లాంటి స్పృహ. అలాంటిదన్నమాట.

 

ఈ పెద్దఫోటోలు చూసీ చూసీ పెద్దరికాన్ని బలవంతంగా అంగీకరించేస్తున్న నన్ను ఈ చిన్ననాటి మిత్రులు కొలువుదీరిన ఫోటో భలే నోస్టాల్జియా లో ముంచేసింది. అబ్బురంగా అనిపించిన ఆ ఫోటోని చూసి స్పందించగానే వరుసగా మెసేజులు. 'ఎక్కడున్నావ్', 'ఏం చేస్తున్నావ్' అంటూ. కొత్తగా సమూహంలో చేరిన మిత్రురాళ్ళు వారంతా. చక చకా మెసేజులు కొడుతూ మొత్తానికి తరువాతి రోజు కాస్త తొందరగా లేచి, అందరితో మాట్లాడాలని నిశ్చయించుకున్నాకే తిరిగి పనిలో పడ్డాను.

 

ఉదయాన్నే వాకింగ్ కని బయల్దేరి ఫోన్ చేతిలో పట్టుకున్నాను. అనితతో మాట కలపగానే గల గలా మాట్లాడుతూంటే పావు మైలు నడిచినన్ని నిమిషాలు గడిచాయి. చిన్నప్పటి ఉత్సాహం గొంతు వినగానే. అది చిన్నప్పుడెపుడో పెట్టుకున్న లక్ష్యం చేరి, ఓ మంచి డాక్టరయింది. ప్రశ్నలూ, వివరాలూ అన్నీ అయ్యాక మళ్ళీ గతంలోకెళ్ళి వాళ్ళ ముచ్చట్లూ, వీళ్ళ ముచ్చట్లూ మాట్లాడుకునేసరికి వాటితో పాటే సాగిన నా నడక మూడు మైళ్ళకి చేరింది. నడక వల్ల కాస్త అలసట చేరింది గొంతులో. అది పట్టేసిందేమో- “నీ నడక పూర్తయ్యాక, ఖాళీగా ఉన్నప్పుడు మాట్లాడుకుందాంలే, నువ్వు కానివ్వవే" అంది. ఏదో ఓ పని చేస్తూ తప్ప, కుదురుగా కూర్చుని ఫోన్ మాట్లాడటం నేరమేమో అన్నట్టుగా ట్యూన్ అయిపోతున్నానని నాకు తెలిసిందప్పుడే.  ఎక్కువగా ఇష్టంగా మాట్లాడుతోంది గతం గురించేనని గమనింపుకి రాకముందే అన్నాను. "మనం లైబ్రరీకెళ్ళి గంటలు గంటలు చదివేవారిమి గుర్తుందా?" అన్నాను ఉత్సాహంగా - "కదా. ఏమీ తోచని పనులు చేసేవాళ్ళమేంటో కదా. పనికిమాలిన పనులన్నీ?" నవ్వుకుంటూ అంది. నేను అన్నిటిలోకీ ఇష్టంగా భద్రపరుచుకున్న జ్ఞాపకమది. నడకకి అడ్డం పడుతూ ఓ కొమ్మ కనబడింది. విస్టేరియా పూల కొమ్మ. గుత్తిగా ఉండే పూవుని తెంపగానే వేటికవిగా రాలిపోయే చిత్రమైన పత్తిలాంటి పూలవి. కానీ భలే సుకుమారంగా, అందంగా ఉంటాయి. పూలు కదా. ఆ కొమ్మని  అలాగే జాగ్రత్తగా తీసి నడిచేదోవకి పక్కగా పెట్టి, నడక సాగించాను. మరో మైలు నడిచాను గతంలోనే.

 

వంటపని చూసుకుని లాగిన్ అయే సమయం అవుతూంటే అప్పటికి మాటలాపి, ఇంట్లోకొచ్చి పడ్డాను. ఇపుడూ హోం వర్క్ చేయాల్సి ఉంది కనుకే మాటలాగిపోయాయి. ఇపుడూ మళ్ళీ మాట్లాడుకునే ప్రమాణాలయ్యాకే మాటలాపాము. కానీ, గతంలోని కబుర్లన్నిటిలోనూ ఒక్కటిగా ఉన్న మేము ప్రస్తుతానికి వచ్చి పడుతూంటే వేర్వేరు ప్రపంచాల్లోంచి మాట్లాడుకుంటున్నట్టుగా అనిపిస్తూంటే, ‘ఇంకా, ఇంకా’ లు పొడిపొడిగా మారుతుంటే, తెగిపడుతున్న మాటలని ఒక్కతాటిపైకి తెచ్చుకొనేందుకు మళ్ళీ గతంలోకి జారిపడి, ఇప్పటికీ అక్కడక్కడే నడిచామనిపించి ఎక్కడో చిన్న బెంగ. నన్ను చిన్ననాటి నెచ్చెళ్ళతో పట్టి ఉంచేది నా పాత నేనే కానీ, ఇప్పటి నేను కాదన్న ఎరుక వల్ల కలిగిన బెంగ.

 

ఆలోచిస్తూనే ఆ రోజటి ‘వర్క్ ఫ్రం హోం’ అవధానానికి సిద్ధమవుతూ, ముందురోజు పచ్చడికని దాచుకున్న దొండకాయ ముక్కలని పోపులో వేస్తూ, మీటింగులోకి జాయినయ్యాను. నాలాగే అవధానం చేస్తున్న మరో దేశీ కలీగ్ క్రాంతి, తాను మ్యూట్ లో లేనిది చూసుకోకుండా "ఆదిత్య హృదయం" చదువుతుంది. పూజ చివర్లో ఉన్నట్టుంది. నేను మెసేజ్ చేసేలోపే గమనించుకుని ఠక్కున మ్యూటు చేసుకుంది. అప్పటికే "నైస్ మ్యూజిక్" అని జూం చాటులో పెట్టారెవరో. ప్రస్తుతంలో ఉంటూ వేరే ప్రపంచంలో ఉండే దేశీ కాని ఓ మానవుడే కానీ, కలిసి చేసే పని కలిపే ఉంచుతుంది మమ్మల్ని. నయమేగా మరి? హిందూ మతాన్ని, పద్ధతులని సూచించే ఒక్క పదం కనబడగానే వారి ఇతర ఏ రాతలనీ భరించలేక దూరమయిపోయే సాటి అసహన హిందూ ముఖపుస్తక మిత్రుల అపరిపక్వత కంటే ఈ విశ్వమానవుడు నయమే కదా. అతని కామెంటుకి లైకైకాను కొట్టే అవకాశమీయని జూము చాటుబాక్సుని నిరుత్సాహంగా వదిలి, ఉదయపు బెంగని సగం మరిచాను.

 

ఏ మిగిలిపోయిన బెంగలనూ ఏమంతసేపు నిలవనీయనిదే జీవితం. మీటింగ్  అవగానే క్రాంతి ఫోను. "హే వినబడిందా?" "హా, అరసెకండే అయినా బ్రహ్మాండంగా! ఆదిత్యహృదయమేగా?" మొదలయింది మా మాటల ధార.

 

"అవును, అన్నట్టు వాట్సప్ లో ఈరోజు పూచిన గులాబీలు పెట్టాను చూడు. మల్లెపూలు కూడా మాల కట్టి అమ్మవారికి వేసాను. అదీ పెట్టాను చూడు. అవునూ, రేపు మెక్సికన్ రెస్ట్రాంట్ లో టీం లంచ్ కి కలిసినప్పుడు అందరం ఒకేలా  జంపర్ సూట్స్ వేసుకుందామంది ప్రజ్వల. గ్రూప్ చాట్ చూసి రెస్పాండవ్వు. లోరీ చూపించిన కొత్త డెడ్లైన్ తేదీలు చూసావా? అసలెలా సాధ్యం?" ఇప్పటి 'నేను' తో కలిసే స్నేహితురాలి మాటలు నన్ను వర్తమానంలోకి తెచ్చి నిలబెట్టాయి. "అరే, పని చాలా ఉంది, సాయంత్రం మాట్లాడుకుందాము" అనుకుంటూ అయిష్టంగానే ఆపాము మాటలను. సాయంత్రం మళ్ళీ మాట్లాడుకునే ప్రమాణాలయ్యాకే. 

ఇపుడే బెంగా లేదు. గతమైతేనేం, వర్తమానమయితేనేం. అన్ని దశల్లోని ' నన్ను' ఏదోలా అంటిపెట్టుకునే స్నేహాలపై ఇష్టం తప్ప.

 

Each friend represents a world in us, a world not born until they arrive, and it is only by this meeting that a new world is born. -Anais Nin

*****

bottom of page