
MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
జనవరి-మార్చి 2023 సంచిక
Website Published & Maintained by Srinivas Pendyala | Mobile version is under construction. Use big screen for better experience.
Website Published & Maintained by Srinivas Pendyala | Mobile version is under construction. Use big screen for better experience.
వ్యాస మధురాలు
కాలానికి నిలిచిన కవిత్వం

విన్నకోట రవిశంకర్
కాలానికి నిలిచిన కవిత్వం అనేది తిలక్ కవిత్వానికి సరైన నిర్వచనం అని నేను అనుకుంటాను.
ఒక కవి కవిత్వాన్ని అతని తరం వాళ్ళే కాకుండా ఆ తరువాతి తరం వాళ్ళు ఇష్టంగా చదువు కోవటం గొప్ప గౌరవం. ఆ విధంగా కాలమే గీటురాయిగా పనిచేస్తుంది. మా తరమే కాదు ఇప్పటి యువతీ యువకులు కూడా తిలక్ కవిత్వాన్ని ఆస్వాదించటం చూస్తే నాకు చాలా ఆనందం కలుగుతుంది. ఒక కవి కవిత్వం, జీవితం సార్థకమని చెప్పటానికి ఇంతకంటే నిదర్శనం ఏమి కావాలి? అయితే అటువంటి కాల ప్రమాణాన్ని అంగీకరించని వారు కూడా ఉండవచ్చు. ఉదాహరణకి కొడవటిగంటి కుటుంబరావు గారు "నా రచనలు కలకాలం నిలిచిపోవాలనే ఆశ నాకు ఏ కోశానా లేదు" అని అంటారు. కానీ కుటుంబరావు సాహిత్యాన్ని అభిమానించే వాళ్ళు ఇప్పటికీ ఎంతోమంది ఉంటారు. తక్షణ సమస్యల గురించో, తాత్కాలికమైన పరిస్థితుల గురించో చెప్పిన ఒక గొప్ప కవి లేదా రచయిత రచనల్లో ఒక సార్వ కాలీనత చోటు చేసుకుంటుంది. అది కొన్నిసార్లు ఆ రచయిత కూడా గుర్తించలేక పోవచ్చు. ఒకసారి ప్రచురణ జరిగాక ఆ రచన తన బ్రతుకు తను బతుకుతుందని అనేది ఇందుకే.
మా మామగారు ఇంద్రగంటి సుబ్బరాయ శాస్త్రి గారు బ్యాచిలర్ గా ఉన్న రోజుల్లో కొంతకాలం ఉద్యోగరీత్యా తణుకులో ఉండేవారట. అప్పుడు తరచుగా తిలక్ ని కలిసేవాడినని చెబుతారు. తిలక్ ఆయనకి తన కవితలు వినిపించే వారట. " ఏమయ్యా శాస్త్రీ! ఈ కవితలు నా తరువాత ఎవరైనా చదువుతారంటావా?" అనేవారట. చదవటమే కాదు తరువాతి తరం వాళ్ళు ఆ కవితలు కొన్నిటిని కంఠస్థం చేసే పరిస్థితి ఉంటుందని ఆయన ఊహించి ఉండరు. నేనే "నువ్వు లేవు నీ పాట ఉంది" అనే మూడు పేజీల కవితను పూర్తిగా కంఠస్తం చేసాను ఒకసారి.
తిలక్ శతజయంతి సందర్భంగా శిఖామణి ఎంతో శ్రమపడి కూర్చిన నాలుగు వందల పేజీల పుస్తకం "అమృత వర్షిణి" చూస్తే ఎంత మంది సాహితీ మిత్రులు, కవులు, విమర్శకులు తిలక్ కవిత్వానికి స్పందించారో తెలుస్తుంది. తిలక్ కవిత్వాన్ని, వ్యక్తిత్వాన్ని తెలుసుకోవటానికి ఈ పుస్తకం ఎంతగానో ఉపయోగిస్తుంది.
ఎన్నో సంభాషణలు, ఆలోచనల్లో తిలక్ కవితా వాక్యాలు తరచుగా చోటు చేసుకొంటూ ఉంటాయి. "ఏ దేశ సంస్కృతి అయినా ఏనాడూ కాదొక స్థిర బిందువు. నైక నదీ నదాలు అదృశ్యంగా కలిసిన అంతస్సింధువు." " సాంప్రదాయ భీరువుకీ, అస్వతంత్ర వితంతువుకీ వసంతం లేదు. " "మార్క్స్, మహాత్ముడు పికాసో, సార్త్రే ఎవరైనా ఇది నిత్య నూతన పరిశోధన. సత్య సౌందర్యాన్వేషణ ఒక శిఖరారోహణ." " దేవుడు మానవుడు వీరిద్దరే ఈ అనంత విశ్వంలో మూర్ఖులు. ఏ కోణం నుంచి చూసినా వీరిద్దరూ మిజరబుల్ ఫెయిల్యూర్స్." "జీవితంలో నలువైపులా అంధకారం. మంచిగంధంలా పరిమళించే మానవత్వం మాకున్న ఒకే ఒకే అలంకారం" - ఇలా ఎన్నో. ఇక్కడ మనం ఒక విషయం గమనించవచ్చు ఇలాటి వాక్యాలలో చాలా వరకు పదచిత్రాలతోనో, పోలికలతతోనో ముడిపడినవి కావు. ఎక్కువగా స్టేట్మెంట్స్ లాంటివి. ఒక గొప్ప సత్యాన్ని వచనంగా చెప్పినా అది కవిత్వమై పోతుందనటానికి తిలక్ రాసిన ఈ వాక్యాలు ఉదాహరణగా నిలుస్తాయి.
దేశ నాయకుల్లో గాంధీ, నెహ్రూల పేర్లు జంట పదాలు చెప్పినట్టు ఆధునిక తెలుగు కవిత్వంలో శ్రీ శ్రీ, తిలక్ అని చెప్పటం దాదాపు వాడుకగా మారింది. "మహాప్రస్థానం" తరువాత ఎక్కువ సంఖ్యలో పునర్ముద్రణ పొందిన వచన కవితా సంపుటి "అమృతం కురిసిన రాత్రి" మాత్రమే అయి ఉంటుంది. అప్పట్లో తిలక్ ని అనుకరిస్తూ అనేకమంది రాసి ఉంటారు గానీ ఎవరూ ఎక్కువ సఫలం కాలేదని తేలికగా చెప్పవచ్చు. ఎందుకంటే తిలక్ వచన కవిత రాసే విధానంలో అనుకరణకు సాధ్యం కాని రహస్యం ఏదో ఉంది. ఆయన కవితా మార్గం ఒక సమ్యక్ దృష్టి, ఒక సంయోజన. పద్యంలోని లయ- వచనంలో ఉండే స్వేచ్ఛ, సాంప్రదాయికమైన కవి సమయాలు- ఆధునిక పద చిత్రాలు, సమాస భూయిష్టమైన వాక్యాలు- వాడుక భాషలో పదాలు ఇటువంటివన్నీ కలిసిన అనితర సాధ్యమైన శైలిని ఆయన సృష్టించుకున్నారు. అలాగే వచన కవిత పరిధుల్ని ఆయన విస్తరింప జేసారు. గాయకుల స్వరం గురించి చెప్పేటప్పుడు థ్రో అనే పదం వాడుతూ ఉంటారు. అటువంటిదే కవితా స్వరంలో ఆయన చూపించారు. ఉదాహరణకు "నువ్వు లేవు నీ పాట ఉంది" కవిత ముగింపులో వచ్చే ఈ వాక్యాలు - "నేను కూరుకుపోతున్న చేతకాని తనకు వాన కాలపు బురద మధ్య నీ పాట ఒక్కటే నిజంలాగ, నిర్మలమైన గాలిలాగ, నిశ్శబ్ద నదీ తీరాన్ని పలకరించే శుక్తిగత మౌక్తికం లాగ - ఇంటి ముందు జూకా మల్లె తీగల్లో అల్లుకొని లాంతరు సన్నని వెలుతురులో కమ్ముకొని నా గుండెల్లో చుట్టుకొని నీరవంగా నిజంగా ఉంది. జాలీగా హాయిగా వినపడుతూ ఉంది. శిశిర వసంతాల మధ్య వచ్చే చిత్ర మధురమైన మార్పుని గుర్తుకు తెలుస్తోంది ఇన్నేళ్ల తరువాత. " ఇటువంటి లిరికల్ బ్యూటీ ఉన్న వచన కవిత అంతకు ముందు గాని , ఆ తరువాత గాని ఎవరూ రాయలేదు. తెలుగు వచన కవితల్లో వచ్చిన అత్యుత్తమమైన కవితగా దీనిని నేను పరిగణిస్తాను. అలాగే అదృష్టాధ్వగమనం, కఠోపనిషత్ వంటి కవితలు హైస్కూలు రోజుల్లో నేను ఎన్నోసార్లు బిగ్గరగా చదువుతూ ఉండేవాడిని. అర్థమై కాదు, ఆ పదాలలో ఉన్న రమ్యత, గాంభీర్యతల కోసం.
తాత్వికంగా చూసినా తిలక్ది సమ్యక్ దృష్టి గానే తోస్తుంది. కవిత్వం రాయటానికి నిబద్ధత ఒక ముఖ్యావసరంగా భావించే రోజుల్లో అన్ని రకాల అనుభవాలకు స్పందించి కలవరించే కవిత్వం తిలక్ రాసారు. ఇటీవల ఒక వ్యాసంలో కొప్పర్తి వెంకట రమణ దీనిని 'బహుళ తాత్వికత' అని నిర్వచించారు. పేదల గురించి, నిర్భాగ్యుల గురించి, గతించిన రోజుల గురించి, ప్రపంచ శాంతి గురించి - ఇలా ఏది రాసినా అందులో ఒక నిజాయితీ ధ్వని స్తుంది. అంతేగాని ఎవరిని సంతృప్తి పరచటానికో, పొలిటికల్ కరెక్ట్‌నెస్ కోసమో రాసినట్టుగా ఉండదు. అప్పట్లో వరవరరావు గారు ఆయనకి ఉత్తరాలు రాసేవారట. అద్భుతమైన ప్రతిభ ఉన్నా విప్లవం ఒక పాలు తక్కువ కావడం వల్ల రావలసి నంత వెలుగులోకి రాలేక పోతున్నాడని రాసినా, వివేకానందుడి మీద పద్యాలు రాసినందుకు నిరసన తెలుపుతూ ఉత్తరం రాసినా తిలక్ సమాధానం ఒక్కటే - "నాకంత భేషజాలు లేవు. నాకు అనుభూతి ప్రధానం. ఎట్లా లోపల్నించి పలికితే అట్లా రాస్తాను" అని. తన స్వీయ అనుభవం పట్ల, అనుభూతి పట్ల ఆయనకున్న నిబద్ధత మనకు దీనిని బట్టి తెలుస్తుంది.
తాత్వికంగా చూస్తే తిలక్ నా వరకు నాకు బహుశా నెహ్రూ ఆలోచనలకి దగ్గరి వాడని అనిపిస్తుంది. అది ఆ తరంలో సహజమే. కొంత హేతువాదం, జాలి, తటస్థత, ఉదార సామ్యవాద విధానం వంటివి ఆయనకు కూడా ఉన్నాయని అనిపిస్తుంది. నెహ్రూ గురించి రాసిన కొన్ని వాక్యాలు ఇదే భావన కలగజేస్తాయి. "సమ్యక్ సిద్ధాంత రధ్య మీద రధాన్ని నడిపిస్తాడు. చరన్మౌఢ్య క్రూర మృగాల సంకులారణ్యంలో సహేతుక సాహసం కవచంగా ధరించిన ఆఖేటకుడు. చలజ్జీవన దైనందిన పాసు పరాగంలో తనలో తానొక ఏకాంత సౌందర్యం రచించుకున్న స్వాప్నికుడు." ఈ కవితలో తనలో ఉన్న గుణాలనే తిలక్ నెహ్రూకి ఆపాదించారని రారా తన సమీక్షా వ్యాసంలో అంటారు. ఎవరి గుణాలు ఎవరిలో నిక్షేపమయాయనే చర్చ కంటే ఇద్దరి భావాల లోనూ ఒక సారూప్యత, సామీప్యత ఉన్నాయని గుర్తించటం సమంజసంగా ఉంటుంది. ప్రారంభ యౌవనంలో ఉన్న యువతీ యువకులకి ఇటువంటి భావాలు, అంటే ప్రేమ, జాలి, ఏదో మార్పు రావాలన్నతపన, మధ్యతరగతి విలువల మీద ఒక నిరసన భావం వంటివి కలగలసి ఉంటాయి. అందుకే వారిని తిలక్ కవిత్వం ప్రధానంగా ఆకర్షిస్తుంది. ఇన్ని తరాలుగా ఆ కవితలు ఆదరణ పొందుతూ ఉండటానికి అది కూడా ఒక కారణం.
తిలక్ కవితలలో మరొక ప్రత్యేకత వాటిలో గుర్తుండిపోయే పాత్రలు. ఇది కొంత విచిత్రంగా అనిపించవచ్చు సాధారణంగా కథల్లోనూ నాటకాల్లోనూ పాత్రల గురించి మాట్లాడతారు గానీ ఖండ కవితల్లో పాత్రలేమిటి అనుకోవచ్చు. తిలక్ కవితలలో కొన్ని పేర్ల ప్రస్తావన ఉంటుంది. ఉదాహరణకి "నీడలు" కవితలో చిన్నమ్మ ఎవరు? ఆమె సంబోధన లేకుండా కూడా ఆ కవిత రాయవచ్చు కానీ దానివల్ల కవిత ప్రత్యేకమైన రూపం తీసుకుని ప్రభావ వంతంగా మారింది. అలాగే "సిఐడి రిపోర్ట్" లో అయినాపురం కోటేశ్వరరావు ఇంటి పేరుతో సహా రాసినా అది ఎవరో ఒక వ్యక్తి గురించి రాసింది కాకపోవచ్చు. సగటు మధ్యతరగతి జీవికిి ప్రతీకగా ఆ పాత్ర సృష్టించి ఉంటారు. కానీ ఆ పేరు మాత్రం గుర్తుంటుంది. "తపాలా బంట్రోతు" లో సుబ్బారావు తంగిరాల వెంకట సుబ్బారావు గారన్న విషయం అందరికీ తెలిసినదే. అయితే నాకు అన్నిటికంటే క్యూరియస్ గా అనిపించేది "కాస్మోపాలిటన్ బోర్" ఎవరన్నది. ఇందులో ప్రస్తావించిన అంశాల పట్టిక చూస్తే అప్పటి ప్రపంచ పరిస్థితుల మీద ఆయన కెంత అవగాహన ఉండేదో మనకు అర్థమవుతుంది. ఏలూరులో కాస్మో పాలిటన్ క్లబ్ ఉండేదని వేలూరు వెంకటేశ్వరరావు గారు చెప్పారు. అది ఒక క్లూ. ఆ వ్యక్తి ఎవరో తిలక్ గారి కుటుంబ సభ్యులకెవరికైనా తెలుస్తుందేమో!
కవిత్వం గురించి దాదాపు ప్రతి కవి ఎప్పుడో ఒకప్పుడు కవిత రాసే ఉంటారు. అయితే కొన్ని వాక్యాలు జన బాహుళ్యంలో నిలుస్తాయి. శ్రీ శ్రీ "కాదేదీ కవితకవితనర్హం" అన్నది దాదాపు జర్నలిస్టు కథనాల్లో నిత్య భాగమై పోయింది. సాహిత్య లోకంలో బాగా ప్రసిద్ధి పొందినది మాత్రం "కవిత్వం ఒక ఆల్కెమీ, దాని రహస్యం కవికే తెలుసు" అన్నది. అది బాగానే ఉంది గాని "అగ్ని చల్లినా అమృతం కురిసినా అందం ఆనందం దాని పరమావధి" అన్నది కొంత చిన్న ఫ్రేమ్ అని నాకనిపిస్తుంది. ఆయన కవిత్వమే దానికన్నా ఎన్నో రెట్లు పెద్దది. నా ఉద్దేశంలో కవిత్వం ఒక ఈ విధమైన స్వాంతన కలిగిస్తుంది. బాధలో, ఒంటరితనంలో తోడుగా నిలుస్తుంది. వందల సార్లు చదివిన తిలక్ కవితలనే మళ్లీ మళ్లీ ఎందుకు చదువుతున్నామంటే దీనికోసమే. ఇజ్రాయిల్ వారికి అరవైలలో అరబ్బులతో యుద్ధం వచ్చినప్పుడు, యుద్ధానికి వెళ్ళే సైనికులు యహూదా అమిచై కవితల పుస్తకాన్ని తోడుగా తీసుకు వెళ్లేవారట. నిజం యుద్ధం కాకపోయినా జీవిత సమరంలో తిలక్ కవిత్వం తోడుగా నిలుస్తుంది. సుబ్బరాయ శాస్త్రి గారికి తిలక్ ఒకసారి ఒక సామాన్య స్త్రీ రాసిన ఉత్తరం చూపించారట. అందులో ఆమె తను మనోవ్యధ ఎదుర్కోలేక ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నానని, అంతలో తన మిత్రురాలు బల్లమీద పెట్టిన "అమృతం కురిసిన రాత్రి" కటింగ్ చూసి చదివానని, అది తనలో బతుకు మీద ఆశని, బతకాలనే ఉత్సాహాన్ని పెంచిందని రాస్తుంది. ఇటువంటి స్వాంతన, ఓదార్పుల అవసరం మనిషి ఉన్నంతవరకు ఉంటుంది. అందువల్ల మనిషి ఉన్నంతవరకు తిలక్ కవిత్వం కూడా నిలుస్తుంది. సతత హరితమైన ఉద్యాన వనంలా ఆశ్రయం ఇస్తూనే ఉంటుంది.
*****