top of page
bhuvanollasam.PNG

సంపుటి  6   సంచిక  3

Website Published &  Maintained by  Srinivas Pendyala | Mobile version is under construction. Use big screen for better experience.

కథా​ మధురాలు

తలుపు

 

అనన్య

Ananya.jpg

నూనె సలసలా కాగింది. గారెలు ఎర్రగా వేగుతున్నాయి. ఇంకొక్క వాయ వేస్తే, ఇవి కూడా అయిపోతాయి. ఆఖరున బూరెలు కూడా వేయించేస్తే, కాస్త ఫ్యాన్ కిందకి వెళ్లి కూర్చోవచ్చు… అనుకుంటూ తడి చేసుకున్న అరచేత్తో అరిటాకును తుడుస్తూ, మోచేత్తో నుదుటికంటిన చెమట తుడుచుకుంది సుబ్బలక్ష్మి. పప్పు సరైన పదునుగా రుబ్బుకుంటే గారెలు, బూరెలు కరకరలాడుతూ వస్తాయని తన నాన్నమ్మ దగ్గర నేర్చుకుంది. వాటి విషయంలో తను చేయి తిరిగిన వంటగత్తె. ఆఖరి వాయ గారెలు నూనెలో వేసేసి, అంతకుముందు వేసిన గారెలను చిల్లుల బుట్టలోంచి ఒక బేసిన్ లోకి కుమ్మరించింది. ఇక బూరెల సంగతి చూడాలని గ్రైండర్ లోంచి పిండి తీయబోతుండగా ధడ్ మని పెద్ద శబ్దం వినిపించింది. ఎవరో బెడ్ రూమ్ తలుపును గట్టిగా వేశారు. ఉన్నట్టుండి అంతా నిశ్శబ్దం. హాల్లో కూర్చున్న అతిథులందరూ ఆ తలుపు వైపుకి ఒక్క క్షణం చూసి, మళ్లీ ఎవరి కబుర్లలో, పనుల్లో వాళ్ళు పడ్డారు.

 

అలాగే సుబ్బలక్ష్మి కూడా హాలు వైపు తొంగి చూసినదల్లా వెనక్కి వచ్చి, గ్రైండర్ లోంచి పిండి తీస్తోంది. అంత ధబ్బున తలుపులు వేస్తే, పై అంతస్తులో ఉండే ఓనర్లు వీళ్ళని ఏమీ అనరా అనుకుంది. మళ్లీ తన ఆలోచనకి తనే నవ్వుకుంది. మూడు నెలల నుంచి అద్దె బకాయి పెడుతుంటే తన ఓనర్ ఏమనుకుంటున్నాడో అనిపించింది.

 

సుబ్బలక్ష్మి భర్తది చిరుద్యోగం. కరోనా పుణ్యమా అని అదీ పోయింది. తనకి చేతనైనది వంటే. వేన్నీళ్ళకి చన్నీళ్ళు అన్నట్టు, పిల్లలకి కనీసం పూటకి ఇంత పెట్టాలంటే తానూ ఏదో ఒకటి చేయాలని మధ్యాహ్నం భోజనాలు వండి పెట్టటానికి కుదిరింది. అంతకుముందు వరకు మూడు నాలుగు బేరాలు ఉండేవి. ఎన్నారై కొడుకులు, కూతుళ్ళు ఉన్న పెద్దవాళ్ళు తాము వంట చేసుకోలేక, సుబ్బలక్ష్మి వండి పెడితే తింటూ నెలకి ఇంతని ఇచ్చేవారు. కరోనా మొదలయ్యాక వాళ్ళూ భయంతో “కొన్నాళ్ళు వద్దులే అమ్మా” అనేశారు.

 

చాలా రోజుల తర్వాత ఈ నిశ్చయ తాంబూలాల కార్యక్రమానికి వంట చేయమంటూ వీళ్ళు పిలవగానే ఒప్పుకుంది. పూర్వం తన తల్లి వెనకాల ఇలా శుభకార్యాలకు వెళ్లి వండటం అలవాటే కనుక, అంత కష్టంగా అనిపించట్లేదు. ఈరోజు వచ్చే డబ్బుతో కనీసం ఒక్క నెల అద్దె బాకీ అయినా తీరుతుంది అనుకుంటూ ఉండగా, మళ్లీ తలుపు కొట్టిన శబ్దం. పెళ్లికూతురి తండ్రి “రా అమ్మా” అని పిలుస్తున్నాడు. అయితే, లోపలకి వెళ్లి తలుపులు వేసుకున్నది పెళ్లికూతురన్నమాట అనుకుంది సుబ్బలక్ష్మి. “ఉండు వస్తాను” అని విసుక్కుంది లోపల నుండి పెళ్లికూతురు.

 

బూరెలు వేస్తూ ఆలోచనలో మునిగింది లక్ష్మి. తనకీ ఇద్దరు కూతుళ్ళున్నారు. వాళ్ళకీ పెళ్లిళ్ళు చేయాలి. ఒకొక్క ఏడాదీ గడుస్తుంటే, వాళ్ళకి ఒకొక్క ఏడూ వయసులు పెరుగుతుంటే, దుడుకుగా ఉంటోంది తనకి. పై చదువులు చెప్పించటం మాట, కట్నాల మాట దేవుడెరుగు, అసలు వాళ్ళని సరిగ్గా చూసుకోగలిగే మగపిల్లల్ని వెతకటం ఎలాగో కూడా తెలియదు.

 

ఆ పెళ్లికూతురు లోపలకి వెళ్లి అరగంట అవుతోంది. ఎందుకు అంతసేపు ఉండిపోయిందో! వాళ్ళ నాన్న తలుపు కొడుతుంటే అంత విసుక్కుంటుంది ఎందుకు? అనుకుంది. బూరెల పని కూడా చివరికొచ్చింది. అమ్మయ్య అనుకొని, స్టవ్ కట్టి, కాసేపు పెరట్లోకి వెళ్లి నుంచొని, చీర కొంగుతో చెమట తుడుచుకుంది.

 

ఇంట్లో కూతుళ్ళు వండుకు తిన్నారో లేదో అనుకుంటూనే, వడ్డన చేయాల్సిన సమయం అయ్యేవరకు కిటికీ పక్కన చతికిలబడింది.

 

***

 

పరమేశ్వర రావు స్కూల్ మాస్టారు. తన భార్య పారిజాతం కారు ప్రమాదంలో చనిపోయి పదేళ్ళు అవుతోంది. ఒక్కగానొక్క ఆడపిల్లను పెంచటం తనకొక ఛాలెంజ్. ఇంతవరకు పనిచేయటం, ఇంటికి జీతం తెచ్చివ్వటం తప్ప, తను ఏమీ పట్టించుకోలేదు. చివరకి తన కూతురు ఏ క్లాస్ లో చదువుతోందో కూడా తనకు తెలియదు. అలాంటిది ఇప్పుడు తాను వంట నేర్చుకుని, తనకూ కూతురికీ వండటం ఎలా? సాయంత్రం అయ్యేసరికి హోమ్ వర్క్ చేయించటం, ఎప్పుడైనా ఒకసారి కొత్త బట్టలు కొనటం, రేపో మాపో పెళ్లి చేయటం… చిన్న విషయం నుంచి పెద్ద విషయం దాక అన్నీ ఛాలెంజ్ లే. తన భార్య ఎన్నెన్ని పనులు చేసేదో తను దూరమయ్యాక గానీ తనకి తెలిసిరాలేదు. అసలు తనకే అర్థం కావట్లేదు ఆమె లేని లోటుని ఎలా అధిగమించాలో, ఇక పిల్లని పెంచటం అంటే మాటలా… అని బెంబేలెత్తుతూ ఉండగా, భార్య పుట్టింటివారు వచ్చి, పిల్లని మేము పెంచుకుంటామన్నారు.

 

సరే, ఆడపిల్ల ఆడ పెంపకంలో పెరిగితే మంచిదే అని వాళ్ళతో పంపాడు. కూతురికి ఇష్టమేనా అని కనుక్కున్నారు. ఆడుకునే వయసులో ఉన్న ఆడపిల్ల. ఏం తెలుస్తుంది? సెలవులకి, పండగలకి వెళ్లినట్టే వెళ్లింది.

 

తీరా కళ్ళు మూసి తెరిచే లోగా అప్పుడే దానికి పెళ్లి. సంబంధం అదే చూసుకుంది. దూరపు బంధువుల అబ్బాయి. ఏదో పెళ్లిలో కలిశామన్నారు. ఇన్నేళ్ళలో తనకీ కూతురికీ మధ్య మాటలు కూడా తగ్గిపోయాయి. ఎదిగే పిల్ల తండ్రితో ఎన్ని పంచుకుంటుంది? నిజంగా తల్లి అవసరం ఉన్న సమయంలోనే అలా జరిగింది.

 

ప్రేమలో పడిందని, పెళ్లి చేసుకుంటానంటోందని పెంచినవారే కబురుపెట్టారు. ఈ పెళ్లి మాకు ఇష్టం లేదని, పెళ్లి జరిపిస్తే మీరే జరిపించుకోమని చేతులు దులుపుకున్నారు. కూతురు తనకి ఏమీ చెప్పలేదు, అడిగినా ఏమీ మాట్లాడలేదు. ఈరోజు ఇక్కడ కలిశాక కూడా ఏమీ మాట్లాడలేదు. ఫీజ్ కడతాను, చదువుకో అమ్మా అంటే “నాకు చదువు వద్దు, ఈ కుర్రాడు చాలు, పెళ్లి చేయ”మంది. తాంబూలాల తతంగం అయ్యాక, ఎందుకో రుసరుసలాడుతూ లోపలకి వెళ్లి తలుపు వేసుకుంది.

 

అరగంట అయ్యాక పిలిస్తే విసుక్కుంటోంది. తనేం చేయాలి? కాబోయే వియ్యంకుల కుటుంబం, ఇంకొంత మంది బంధుజనం. తను మళ్లీ మళ్లీ పిలిస్తే ఎవరైనా తన కూతురినే తప్పుగా అనుకుంటారు. వెనక్కి వచ్చి ఒక కుర్చీలో కూర్చున్నాడు.

 

తనని చూసి చేతకానివాడు అన్నవాళ్ళు ఉన్నారు. తప్పించుకు తిరుగువాడు, ధన్యుడు అని కూడా అన్నారు. జాలి పడ్డవాళ్ళు ఉన్నారు. తనేమిటో తనకే ఒక ప్రశ్న. కానీ తన కూతురికి మాత్రం తన పట్ల ఏహ్య భావం రాకూడదు అనుకొనేవాడు. తనకి అదంటే వల్లమాలిన ప్రేమ. చిట్టి పాదాలతో గుండెల మీద తన్నించుకున్న నాటి నుండి ఉన్న ప్రేమ. మొదటిసారి స్కూల్లో దింపినప్పుడు కన్నీటి జీర వల్ల మసకగా కనిపిస్తున్నా చేయి ఊపిన ఆనాటి ప్రేమ. మొన్నటి వారం “నాకు ఈ కుర్రాడే కావాలి, ఇంకేమీ వద్దు” అని కోపంగా అరుస్తూ చెప్తుంటే, నిష్టురాలాడుతున్న అత్తారిపై కోపం, తన బంగారు తల్లిని బుట్టలో వేసుకున్న ఆ కుర్రాడిపై కోపం వచ్చాయి కానీ, తన కూతురి మీద కోపం రాలేదు. ఇప్పటికీ దాన్ని చూస్తుంటే ఐస్ క్రీమ్ కావాలని అడుగుతున్న చిన్నపిల్లే కనిపిస్తోంది.

 

***

 

రామలక్ష్మికి మనసంతా గుబులుగా ఉంది. తన భర్త కృష్ణమూర్తిది, తనది చిన్న చిన్న గుమాస్తా ఉద్యోగాలు. ఒక్కడే కొడుకు కదా, వాడిని బాగా చదివిస్తే కనీసం వాడైనా మంచి ఉద్యోగం చేసుకొని వాళ్ళనీ చూసుకుంటాడేమో అని ఆశపడ్డారు. “మనల్ని చూసుకోకపోయినా కనీసం వాడి కాళ్ళపై వాడు నిలబడి పెళ్ళాం బిడ్డల్ని చూసుకుంటూ, దర్జాగా బ్రతికినా చాలు, మనలా అత్తెసరు బ్రతుకులు కాకుండా” అనుకొని, అప్పులు చేస్తూ, చీటీలు పాడుతూ, కొడుక్కి కాలేజీ ఫీజ్ కడుతున్నారు.

 

కాలేజీలో చేరిన నెల లోపే స్మార్ట్ ఫోన్ కావాలన్నాడు. కష్టమైనా కొనిచ్చారు. ఇంకా చదువు పూర్తవ్వనే లేదు, మొన్నటి నెల ఇంటికొచ్చి, ఒక పిల్లని ప్రేమించాను, పెళ్లి చేసుకుంటానన్నాడు. నాలుగు తగిలించాలి అనిపించినా, ఈడొచ్చిన కొడుకుని కొట్టలేక చీవాట్లు పెట్టారు ఇద్దరూ.

 

ఉక్రోషంగా బయటకి వెళ్లిన కొడుకు అర్థరాత్రి వరకు ఇంటికి రాకపోయేసరికి చాలా కంగారు పడ్డారు. తీరా ఇంటికి వచ్చినా మూడు రోజుల వరకు ఏమీ మాట్లాడకుండా, ఏమీ తినకుండా గదిలో కూర్చొనేవాడు. నాలుగో రోజుకి తల్లిదండ్రులే తగ్గి, “చదువు అయిపోయి, ఉద్యోగం రానీ నాన్నా, పెళ్లి చేస్తాములే” అన్నారు. కాదు, కూడదు అన్నాడు. ఎన్ని విధాలుగా నచ్చచెప్పినా లాభం లేకపోయింది. సామ దాన భేద దండోపాయాలన్నీ బూడిదలో పోసిన పన్నీరే.

 

చివరకి “కంగారు పడకండి, మళ్లీ వస్తా”నంటూ ఉత్తరం రాసి పెట్టి వెళ్లి, మళ్లీ వారం రోజుల తర్వాత ఈ పిల్లతో సహా ఇల్లు చేరాడు. “తను నా భార్య, ఇక్కడే ఉంటుంది” అన్నాడు. ఇద్దరూ నిర్ఘాంతపోయారు. ఆ పిల్లను పెంచిన వారితో మాట్లాడాలని ప్రయత్నించారు. వీళ్ళ మాటలు వినకపోగా, “డబ్బున్న పిల్లకి ఎర వేశారం”టూ వీళ్ళని ఆడిపోసుకున్నారు. పిల్ల తండ్రితో మాట్లాడారు. అతనూ నిస్సహాయుడే అని అర్థమయ్యింది. బయటకి చెప్పుకోలేని బాధ, గుబులు. ఏం చేస్తే ఈ పిల్లాడు ఏమైపోతాడో అని. ఒప్పుకుంటే చదువు పూర్తవకుండానే సంసారంలో పడి, ఎలా జీవితంలో నిలదొక్కుకుంటాడు? ఒప్పుకోకపోతే మొదటికే మోసం రావచ్చు.

 

తీరికగా ఆలోచించే అవకాశం, లాభ నష్టాలు బేరీజు వేసే సమయం కూడా పుత్రరత్నం తమకు ఇవ్వలేదు. “సరే, మనకే ఇంకో కూతురు పుట్టి ఉంటే ఏం చేసేవాళ్ళం? ఇద్దరినీ మన పిల్లలే అనుకొని చూసుకుందాం” అనే నిర్ణయానికి వచ్చారు.

 

కొడుకు పెళ్లి చేసుకొని ఇంటికి వచ్చాడని చెప్పుకోలేక, జనం కోసం తాంబూలాలని, పెళ్ళని తతంగాలు నడిపిస్తున్నారు. ఈరోజు అదే హడావిడి. పిల్ల వైపు తండ్రి, ఇంకో కుటుంబం తప్ప ఎవ్వరూ రాలేదు. అంతా బాగుంటే, ప్రయోజకుడైన కొడుకుని గర్వంగా చూసుకుంటూ వరుడి తల్లిదండ్రుల హోదాలో హుందాగా కూర్చోవలసినవారు. తమ ఇంట్లోనే ఇలా ఇబ్బందికర వాతావరణంలో సిగ్గుపడుతూ కూర్చొనేవారు కాదు.

 

తాంబూలాలు మార్చుకున్నాక, భోజనాలకి ఇంకో గంట టైముందని అందరూ ఫ్యాన్ల కింద కూర్చొని కూడా, వేసంకాలం ఎండ తాకిడి, వంటింట్లోంచి వస్తున్న వేడి కలిసి ప్రతాపం చూపిస్తూ ఉండటంతో, విసినికర్రలతోను, చీర కొంగులతోను విసురుకుంటున్నారు మధ్యమధ్యలో నిట్టూరుస్తూ. చిన్న సౌండ్ తో టీవీ ఆడుతోంది. బంధువుల్లో ఒక్కరోజు కూడా సీరియల్ మిస్ అవ్వకూడదనుకున్న ఇద్దరు పెద్దవాళ్ళు దానికి దగ్గరగా కూర్చొని చూసేస్తున్నారు. కొడుకు, కోడలు ఇంకో మూల టేబుల్ దగ్గర కూర్చొని ఉన్నారు. పిల్ల మెడలో దాచాలన్నా దాగని పసుపు తాడు. ఏవో గుసగుసలాడుకుంటున్నారు. ఉన్నట్టుండి ఆ పిల్ల రయ్యని లేచి, సరసరా నడుచుకుంటూ వెళ్లి ధబ్ మని తలుపు వేసుకొని గదిలోకి వెళ్లింది.

 

రామలక్ష్మి, కృష్ణమూర్తి ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. వియ్యంకుడి వైపు చూశారు. ఆయనా వీళ్ళని చూశాడు. ముగ్గురూ ఇబ్బందిగానే ఉన్నారు. కొడుకు వంక చూశారు. వాడు ఏమీ ఎరగనట్టు చేతిలోని ఫోన్ వైపే చూస్తున్నాడు. ఏం చేయాలో తెలియలేదు. మళ్లీ ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు. తల దించుకొని పేపర్ చదువుతున్నట్టు నటిస్తున్నాడు కృష్ణమూర్తి. ఇక లాభం లేదని తనే లేచి కొడుకు దగ్గరకు వెళ్లి, “ఏమయ్యిందిరా?” అంది రామలక్ష్మి. “ఏమీ లేదే!” అని భుజాలు ఎగరేశాడు కొడుకు.

 

ఇంకా రెట్టించటం ఎందుకులే అని వంట ఎంతవరకు అయ్యిందో చూద్దామని వెళ్లింది. బూరెలు వేస్తే వంట అయిపోయినట్లే. ముందు పెద్దవాళ్ళకి, మగవాళ్ళకి భోజనం పెట్టేస్తే సరి అనుకుంది. ఇరుకైన అద్దింట్లో అరిటాకుల్లో బంతి భోజనం పెడితే, ఒకొక్క వాయకి ఎనిమిది విస్తర్లు కూడా లేవకపోవచ్చు. ఆ పిల్ల బయటకి వస్తే ఆ గదిలోనూ ఒక ముగ్గురికి పెట్టే జాగా ఉంది. వచ్చేస్తుందిలే అని చూస్తోంది. ఇంతలో వియ్యంకుడు వెళ్లి తలుపు తట్టాడు. “ఉండు వస్తాను” అని విసుక్కుంది లోపల నుండి ఆ పిల్ల.

 

రామలక్ష్మి భారంగా నిట్టూర్చింది. మనవాడే ఇంకా చిన్నవాడంటే, ఆ పిల్ల ఇంకాను. ఈ ఇద్దరు పిల్లలని ఇకపై ఎలా పెంచాలి? ఇద్దరూ సఖ్యంగా ఉంటే పర్వాలేదు. ఇంకా తెలిసీ తెలియని వయసులో ఉన్నారు. చీటికీ మాటికీ వాదులాడుకుంటే? మన సంసార భారమే మనం మోయలేకుండా ఉంటే, ఇప్పుడీ చింత ఒకటా? కొత్తగా పెంపకానికి ఎదిగిన చంటిపిల్లని తెచ్చుకున్నట్టుంది రామలక్ష్మికి. గుమ్మం పైన వేలాడుతున్న కళ్యాణ వెంకటేశ్వరుడి ఫోటో చూస్తూ గట్టిగా దణ్ణం పెట్టుకుంది.

**

 

ప్రకాశ్ అసహనంగా వాచీ చూసుకున్నాడు. కరోనా సమయంలో ఇల్లే దాటకూడదని జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఎన్నో నెలలుగా. మాస్కులు పెట్టుకోకుండా తిరిగేస్తున్నవాళ్ళు, వద్దురా బాబూ అంటున్నా పార్టీలకి, ఫంక్షన్లకి వెళ్లిపోతున్నవాళ్ళు తనకి తెలిసినవాళ్ళలో ఉంటున్నారు. అయినా తన కుటుంబం మాత్రం చాలా జాగ్రత్తలు వహిస్తున్నారు ఇంట్లో చంటిపిల్లలు ఉండటంతో. అతనిది పట్నంలో ఉద్యోగం. చదువవ్వగానే అప్పుడే వద్దంటున్నా పెళ్లి చేసేశారు తల్లిదండ్రులు. వెంటవెంటనే పిల్లలు. కాలేజీ కుర్రాడిగా ఉన్నవాడు, భర్తగా, తండ్రిగా ఎలా పరివర్తన చెందుతూ వచ్చాడో తనకే తెలియకుండా జరిగిపోయింది. కష్టపడి పెంచిన తల్లిదండ్రులంటే ప్రకాశ్ కి ఎంతో గౌరవం. వాళ్ళ శ్రమకి న్యాయం చేయాలని, ఉద్యోగం కూడా కష్టపడి కాదు, ఇష్టపడి చేస్తుంటాడు.

 

మొన్న భోజనాలు చేస్తుంటే పరమేశ్వర్రావు బాబాయ్ ఫోన్ చేశాడు. చెల్లికి తాంబూలాలని, రావాలని అడిగాడు. కరోనా సమయంలో ఎందుకు బాబాయ్, తర్వాత చేద్దాం అన్నాడు. కానీ తప్పదులే అని బాబాయ్ అంటుంటే, ఏదో నిర్వేదం వినిపించింది. తనకి చిన్నప్పటి నుంచి బాబాయంటే చాలా ఇష్టం. చాలా మంచివాడు. చాలా సరదాగా ఉండేవాడు. పదేళ్ళ క్రితం పిన్ని వెళ్లిపోయాక ఉన్నట్టుండి మౌనంగా మారిపోయాడు. చెల్లిని తనతోనే ఉంచుకున్నా, కొన్నాళ్ళకి మామూలు మనిషి అయ్యేవాడేమో. అనవసరంగా ఒంటరివాడై, ఒంటరి వాడిగానే మిగిలిపోయాడు. తమ కుటుంబంతో కూడా మాటలు క్రమేణా తగ్గిపోయాయి.

 

తన కూతురిని పెద్ద డాక్టర్ గా చూడాలని బాబాయ్ కి, పిన్నికి మొదటి నుంచి కోరిక. అది కాదంటే కాదని ఇంటర్ లో మాథ్స్ చదివి, డిగ్రీలో చేరింది. ఇప్పుడు అది కూడా చదవనని, పెళ్లి చేసుకుంటానని చెప్తోందట. కనీసం తాంబూలాలు అయిపోయాక ఒకసారి చెల్లితో మాట్లాడి నచ్చచెపుదామనుకొని వచ్చాడు.

 

ఇక్కడకి వచ్చాక బాబాయ్ చెప్తే మిగతా కథంతా తెలిసింది. అయినా సరే, ఒక్కసారి చెల్లితో మాట్లాడాలని చూస్తున్నాడు. కానీ అది ఆ అవకాశం ఇస్తేగా? ఉదయం ముస్తాబు, తర్వాత తాంబూలాలు, ఆ తర్వాత ఆ కుర్రాడితో గుసగుసలు. తను వాళ్ళ దగ్గరకి వెళ్లి మాట్లాడదామని అనుకుంటుండగా, ఎందుకో ఉన్నట్టుండి రుసరుసలాడుతూ వెళ్లి ధబీమని తలుపు వేసుకుంది.

అరగంటైనా రాలేదు. బాబాయ్ వెళ్లి పిలిస్తే, లోపల నుండి గట్టిగా విసుక్కుంది. అది బయటకి రాగానే ఒక్క లెంపకాయ ఇవ్వాలనిపించింది.

 

అసలు దాన్ని కాదు. దాన్ని బుట్టలో వేసుకున్న ఆ కుర్రాణ్ణి పట్టుకొని నాలుగు పీకాలి. వాళ్ళ ఇల్లయిపోయింది. తనకే అవకాశం ఉండి ఉంటే కాలర్ పట్టుకొని, చెడామడా వాయించేసేవాడు. “ఏం చూసుకొని మా చెల్లిని ప్రేమించావు?”, “ఎలా పోషించాలని నీ ప్లాన్?”, “మా బాబాయికి అన్యాయం చేస్తావా?” అంటూ ప్రశ్నకో నాలుగు తన్నులు తన్నాలని ఉంది.

**

 

రంగమ్మకి, సీతమ్మకి చాలా ఆనందంగా ఉంది. రంగమ్మ తన అక్క సీతమ్మతో ఫోన్లో మాటలే తప్ప ఎన్నో నెలలుగా కలవటమే లేదు. ఇప్పుడు కృష్ణం గాడి కొడుకు తాంబూలాల పేరు చెప్పి ఇద్దరూ కలిశారు. సీతమ్మ ఊళ్ళో ఎప్పుడూ కరెంటు కోతే. తనకి నచ్చిన సీరియల్ చూద్దామంటే వారంలో సగం రోజులు కుదరట్లేదు. రంగమ్మకి ఫోన్ చేసి కథ అడుగుతుంది రోజూ. దానితో పాటే మిగతా పిచ్చాపాటీ. ఆ వంకన ఈ వయసులో కూడా అక్కచెల్లెళ్లిద్దరూ రోజూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఈరోజు ఇక్కడ కరెంటుంది. ఇద్దరూ కలిసి సీరియల్ చూస్తున్నారు. హీరోయిన్ కి పాలలో మాత్ర కలిపేసింది విలన్. ఆ పాలు హీరోయిన్ తాగుతుందో లేదో అని గత శుక్రవారం నుండి ఉత్కంఠతో ఉన్నారిద్దరూ. ఈరోజు సోమవారం. కరెంటు కూడా ఉంది. సీరియల్ వేళకు తాంబూలాలు అవ్వవేమో అని చాలా టెన్షన్ పడ్డారు.

 

అయిపోయేసరికి చాలా హుషారుగా టీవీ పెట్టేసుకుని, చకచకా వాళ్ళని కావలసిన ఛానల్ నొక్కేశారు. అప్పటికే ఒక బిట్ అయిపోయింది. కానీ అదృష్టవశాత్తు ఇంకా హీరోయిన్ పాలు తాగుతూనే ఉంది. యాడ్స్ వచ్చాయి. వంటింట్లోంచి గారెల వాసనలు వచ్చి కడుపులో ఆకలి పెంచుతున్నాయి. ఈ యాడ్స్ వచ్చి ఉత్కంఠ రేపుతున్నాయి.

 

ఈలోపు మళ్లీ సీరియల్ రానే వచ్చింది. ఎవరో ఇంతలో తలుపుని ఢభేల్ మని వేశారు. ఆ గుమ్మం పైనుంచి లాగిన కేబుల్ వైరు జారి పడింది. టీవీలో సీరియల్ ఆగి తెల్లటి-నల్లటి చుక్కలు వచ్చేశాయి. అసహనంగా వెనక్కి చూశారు అక్కచెల్లెళ్ళు. లోపలకి వెళ్లిన వాళ్ళు తలుపు గడియ పెట్టుకొని ఎంతకీ రావట్లేదు. వైరు ఆ తలుపు సందులో ఉండిపోయింది. హీరోయిన్ ఆ పాలు తాగేసిందో ఏమో!

 

**

 

వీరేంద్ర ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. రూప ఈ ఏడాదే డిగ్రీలో చేరింది. రెండేళ్ళ క్రితం ఒక పెళ్లిలో కలిశారు. వరసకి బావామరదళ్ళు అవుతారని తెలిసింది. పెళ్లికి వచ్చిన మిగతా యువతీ యువకులతో కొన్ని ఆటలు, కొన్ని పాటలు, కొన్ని జోక్స్, కొన్ని నవ్వులు, కొన్ని వెక్కిరింతలు, కొన్ని సిగ్గులు. ఆ పెళ్లి అయ్యేలోగా “మనిద్దరం ఒకరి కోసమే ఒకరం పుట్టామ”ని నిర్ధారణకి వచ్చేశారు.

 

ఫోన్ నంబర్లు ఇచ్చి పుచ్చుకున్నారు. ఫోన్లో గడిపే సమయం నిముషాలు దాటి గంటలయ్యింది. సరదా కబుర్లు చెప్పుకొనే దశ దాటేసి, కష్టం-సుఖం చెప్పుకొనే దశకి త్వరగానే వచ్చేశారు.

 

తన ఏడేళ్ళ వయసులోనే రూప తల్లి కార్ యాక్సిడెంట్ లో చనిపోయింది. “మంచిది కనుక దేవుడు తీసుకువెళ్ళాడు” అన్నారు. అమ్మమ్మ వాళ్ళు “మా ఇంటికి రా అమ్మా” అన్నారు. అంతే కదా అని వెళ్లిపోయింది. మళ్లీ ఎందుకో నాన్న వెనక్కి రమ్మని పిలవలేదు. వచ్చి తనని తీసుకువెళ్ళలేదు. అమ్మమ్మ, తాతగారు, మావయ్యలు, అత్తలు, వదినలు, బావలు అందరూ బాగా చూసుకొనేవారు. కానీ ఏదో వెలితి. కొన్ని విషయాలు అమ్మతోనే పంచుకోవాలి అనిపించేది. అమ్మ ఉండేది కాదు. నాన్న గుర్తొచ్చేవాడు. కానీ వచ్చేవాడు కాదు. వచ్చినా అందరితోనూ కబుర్లు చెప్పి వెళ్లిపోయేవాడు. ఇదివరకటిలా తనని ఎత్తుకొని, కితకితలు పెట్టి ఆడించేవాడు కాదు. కథలు చెప్పేవాడు కాదు. బాగా మారిపోయాడు. కాసేపు ఉండి వెళ్లిపోయేవాడు. చాలా కోపం వచ్చేది. తనకి కోపం వస్తే అమ్మ బెల్లం ముక్క పెట్టి తగ్గించేది. ఇక్కడ ఎవరూ పెట్టేవారు కాదు.

 

నెమ్మదిగా ఏళ్ళు గడిచాయి. నాన్న రాకపోకలు తగ్గాయి. నాన్నకి ఫోన్ చేయాలని తనకీ అనిపించటం మానేసింది. స్కూల్లో ఎవరితోనూ స్నేహం చేయాలని అనిపించేది కాదు. ఎవరితో మాట్లాడినా ఇంట్లో “మా అమ్మ అలా అంది, మా నాన్న ఇది కొనిచ్చారు” అంటూ చెప్పేవారు. చాలా చాలా కోపం వచ్చేసేది.

 

ఇంటికి వచ్చాక, అత్త వాళ్ళు హోమ్ వర్క్ చేయకపోతే, మార్కులు తక్కువ వస్తే తిట్టేవారు. అమ్మ ఉంటే తిట్టకుండా చెప్పేదేమో అనిపించేది. నెమ్మదిగా వాళ్ళు నాకు బట్టలు కొంటే, అమ్మయితే నాకిష్టమైన రంగు కొనేదేమో అనిపించేది. ఏదైనా వండి పెడితే, అమ్మయితే నాకిష్టమైనదే వండేది అనిపించేది. వాళ్ళు పనులు చెప్తే, అమ్మయితే చెప్పేది కాదేమో అనిపించేది. నెమ్మదిగా ఎవ్వరూ నచ్చటం మానేశారు.

 

అప్పుడే బావ కనిపించాడు. తనతో తీయగా మాట్లాడాడు. తనని ప్రేమగా చూశాడు. తనని దేవతలా చూశాడు. తను “ఏమైనా తిన్నావా?” అని అడుగుతాడని తినబుద్ధి అయ్యేది. తనకిష్టమైనవే తనకి ఇష్టాలుగా మారాయి. రెండేళ్ళలో తను లేక నేను లేను అనే స్థితికి వచ్చేసింది. ఈలోగా వదినలకి అర్థమయిపోయింది తన సంగతి. పెద్దవాళ్ళకి చెప్పేశారు. వాళ్ళు అత్త వైపు ఎవరో అమెరికా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలని మాట్లాడుకోవటం మొదలుపెట్టారు.

ఉన్న పళాన మర్నాడు బావ కాలేజీకి వెళ్లిపోయింది. “నన్ను పెళ్లి చేసేసుకో. లేకపోతే ఇక నీకు కనపడను” అనేసింది.

 

వీరేంద్రకి ఏమీ పాలుపోలేదు. పెళ్లి చేసుకోవచ్చు. కానీ తర్వాత ఎలా? భార్యగా తన దగ్గరకి వచ్చాక పోషించాలి కదా? కానీ ఈ పిచ్చిది ఇక కనపడను అంటోంది. ఏమైనా చేసుకుంటుందో ఏమో. అసలే చిన్న విషయాన్ని కూడా పెద్దగా చూసి బాధపడుతుంది. ఇక లాభం లేదు. అమ్మ, నాన్న ఏమైనా అంటే నచ్చచెప్పచ్చులే… అనుకున్నాడు. ఒక చిన్న గుడిలో పసుపు తాడు కట్టేసి ఇంటికి తీసుకువెళ్ళాడు. రెండు రోజులు పెద్దవాళ్ళు ఏమీ మాట్లాడలేదు. తర్వాత “మళ్లీ పెళ్లి చేస్తాం. చేసుకోండి. బుద్ధిగా చదువుకోండి” అన్నారు. వాళ్ళంటే అందుకే తనకి వల్లమాలిన ప్రేమ, పైకి చెప్పకపోయినా.

 

ఈరోజు తాంబూలాలు కూడా వాళ్ళే ఏర్పాటు చేశారు, మళ్లీ ఖర్చు, శ్రమ ఎందుకన్నా వినకుండా. ఎలాగైనా బాగా చదివి, ఉద్యోగం సంపాదించి, రూపని, అమ్మని, నాన్నని బాగా చూసుకోవాలి. ఆ మాటే తను రూపతో అంటున్నాడు.

 

ఈలోగా చీరకట్టు అలవాటు లేక కుర్చీ కోడు కింద రూప చీర కుచ్చిళ్ళు సడలాయి. తను సిగ్గుగా కుచ్చిళ్ళు చేత్తో పట్టుకొని లోపలకి పరుగుపెట్టింది. ఆ కంగారులో తలుపు గట్టిగా వేస్తే "ధడాల్" మని పడింది!

*****

bottom of page