MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
కథా మధురాలు
సుజాత - చారిత్రక కథ
మధు చిత్తర్వు
తెల్లవారకముందే మేలుకుంది సుజాత. ఇంకా మసక చీకటి. కొంచెంగా పొగమంచు తెర కప్పిన ఊరిలోని గుడిసెలు, ఇళ్ళూ దూరాన కనిపిస్తున్నాయి.
అప్పుడే కొద్దిగా కదులుతున్న ఆవులు బర్రెల దూడల చప్పుళ్ళు, గొడ్ల చావిడి లో నుంచి అంబా అనే అరుపులు వినిపించడం మొదలైంది. బక్రూరు లో దూరాన కొండల వెనుక నుంచి సూర్యకిరణాలు పడే ముందే ఒక కోడి కూస్తుంది. చిలకలు కిల కిల మంటూ గాలిలోకి ఎగిరి పోతాయి. ఇంటి గూటిలో నివాసమున్న పావురాలు గువ్ గువ్ అంటూ ఉంటాయి.
సుజాత తలస్నానం చేసి తయారై ఒక్కొక్క ఆవు పొదుగు నుండి పాలు పితికి కుండలలో పోయటం వాటిని పొయ్యి మీద వేడి చేయడం జరిగిపోతోంది.
నందుడు ఆమె తండ్రి. ఆ ఊరికి పెద్ద. చల్లటి తలపాగా చుట్టూ కర్ర పట్టుకుని ఇంట్లో నుంచి బయటికి వచ్చాడు ఆయన.
"అమ్మా అప్పుడే పని అంతా అయిపోయిందా?"
"అవును నాన్నా, పన్నా వచ్చే లోపలే అంతా చేసేశాను .ఇంకా పూజ మాత్రమే మిగిలింది."
పన్నా వాళ్ళ దగ్గర పనిచేసే అమ్మాయి. గొడ్ల చావడిలో ఇంటి పనిలో సాయం చేస్తూ ఉంటుంది.
"బంగారు తల్లి!" మురిసిపోయాడు సుజాత తండ్రి. "నేను పొలం దాకా వెళ్లి వస్తా!
లోపల పూజ గది ఉంది. కృష్ణుడి బొమ్మ ఉంది. దీపం వెలిగించి పూజ చేసింది ఏమిటో తెలియకుండానే ప్రార్థన చేసింది.
మంచి భర్త కావాలి. సంతోషంగా ఉండాలి. "గోపాల కృష్ణా! నీ అనుగ్రహం కావాలి!"
రోజూ అలాగే ప్రార్థిస్తుంది సుజాత. చామనఛాయ చక్కని ముఖ కవళికలు. నిత్యం ఇంటి పనులు, గొడ్ల చావడిలో, అప్పుడప్పుడు పొలంలో పని చేసిన పరిశ్రమ వల్ల బలిష్టమైన దేహం. సుజాత సంతోషంగా ఉంటుంది ఎల్లప్పుడు. అందరూ సంతోషంగా ఉండాలని దేవుని ప్రార్థిస్తూ ఉంటుంది.
ఇప్పుడు బారెడు పొద్దెక్కి, ఎండ తళతళ మని గ్రామం పైన వెండి పళ్ళెం బోర్లించినట్లు మెరవ సాగింది.
భారతదేశంలో ఉత్తర భారతంలో ఇప్పుడు బీహార్ రాష్ట్రం ఉన్న ప్రాంతం. గయకు 20 కిలోమీటర్ల దూరంలో ఉంది ఆ గ్రామం. క్రీస్తు పూర్వం 4వ శతాబ్దం. గ్రామీణ జీవితం ఇప్పటి లాగానే ఉంది. వ్యవసాయం, పాడిపంటలతో సాగిపోతూనే ఉండే కాలం. ప్రాచీనంగా ప్రశాంతమైన నిశ్శబ్దం.
**
ఒకానొక మహాసమాధి లో చీకటి లోంచి వెలుగు కోసం అన్వేషిస్తూ అతను తిరుగుతున్నాడు అప్పటికి ఏడేళ్ల క్రితం కపిలవస్తు లో అర్ధరాత్రి రాజమందిరం నుంచి నుంచి బయటికి వచ్చేశాడు. నిద్రిస్తున్న భార్య యశోధర నెలలబాలుడు రాహుల్ ని వదిలి శాశ్వతంగా వచ్చేసాడు. సేవకుడు చెన్నుడు తోడుగా రాచ వీధిలోకి అందరికీ దూరంగా వచ్చేశాడు. ఆభరణాలని అన్నింటినీ త్యజించాడు. అందమైన జుట్టు కత్తిరించి వేసుకున్నాడు. శాక్య వంశంలో పుట్టిన సిద్ధార్ధుడు, యవ్వనంలో సుఖాల్లో మునిగిన గౌతముడు, శుద్ధోదన మహారాజు తర్వాత సింహాసనం అధిష్టించ వలసిన రాజకుమారుడు అతను. కానీ ఇప్పుడు ఒక సన్యాసి. శ్రమణకుడు. అన్వేషి.
అతను కడుపులో వున్నప్పుడు రాణీ మాయావతికి తెల్లటి ఏకదంతమున్న ఏనుగు కలలోకి వచ్చింది.
అతను పుట్టినప్పుడు జ్యోతిష్కులు అందరూ ఇతడు మహా చక్రవర్తి కానీ,లేక మహా సన్యాసి గాని అవటానికి ప్రపంచానికి గురువు అవటానికి సర్వసంగ పరిత్యాగి కావడానికి ఎక్కువ అవకాశం వుంటుంది అని జోస్యం చెప్పారు.
కాన్పు కోసం బయలుదేరిన మాయాదేవి అతనిని లుంబినీ వనంలో సాలవృక్షం కింద కన్నది పుట్టింటికి చేరకుండానే.
ఆ తర్వాత కొన్నాళ్ళకి ఆమె చనిపోయింది.
కుమారుడు సన్యాసి కారాదు. గొప్ప చక్రవర్తి కావాలి. రాజధర్మం నెరవేర్చాలి అని శుద్ధోధనుడు అతన్ని అతి సున్నితంగా గారాబంగా అన్ని సౌకర్యాలతో అపురూపంగా పెంచాడు. దుఃఖం అన్నది కష్టమన్నది తెలియకుండా పెరిగేటట్లు చూశాడు. అందమైన యువతులు సుందరమైన నాట్యాలు సంగీతం విలాసాల తో గౌతముడికి ఏ బాధా తెలియకుండా యవ్వనమంతా గడిచిపోయింది.
వివాహం కూడా అయింది యశోధరతో. పుత్ర జననమూ అయ్యింది. కానీ విజ్ఞుల జోస్యం ఫలించనే ఫలించింది!
నగరంలో కి వెళ్ళకుండా కాపాడమని ఎంత కట్టడి చేసినా గౌతముడు నగర విహారానికి బయలుదేరడం జరిగిపోయింది. అతనికి తోడు చెన్నుడు రథసారధి, గుర్రం కంటకం. కపిలవస్తు వీధులలో మొదటగా రోగంతో బాధ పడుతూ ఒక వ్యక్తి ఉండడం చూశాడు గౌతముడు.
"ఎవరు అతను? ఎందుకు అలా ఉన్నాడు? ఎందుకు బాధ పడుతున్నాడు?"
"వ్యాధిగ్రస్తుడు .వ్యాధులు వచ్చిన వాళ్ళకి బాధ తప్పదు!"
ఒక వృద్ధుడు నడుము వంగి నెరిసిన జుట్టుతో ముడతలు పడిన దేహంతో వణుకుతూ నడిచి వెళుతున్నాడు.
"అయ్యో ఏమిటిది? చెన్నా?"
"వృద్ధాప్యం. ముసలి వయస్సులో అంతే!"
"నేనూ అలా అయిపోతానా?"
"తప్పదు రాకుమారా! మీకు నాకు ప్రతి మనిషికి తప్పదు. అది కాల మహిమ!"
ఒక శవం చుట్టూ రోదిస్తూ నలుగురు పాడె మీద తీసుకు వెళుతున్నారు.
"ఇది ఏమిటి చెన్నా?"
"మరణం! ప్రతి జీవికి తప్పదు!"
ఆ క్షణాల్లోనే చక్రవర్తి భయపడినది జరిగి పోయింది.
కాషాయ బట్టలతో, గుండు చేసిన తలతో ఒక వ్యక్తి ఏదో ప్రార్ధన చేసుకుంటూ నడిచి వెళ్తున్నాడు.
"ఆయన ఎవరు?"
"ఆయన ఒక సన్యాసి. స్నేహ బంధాలన్నీ తెంచుకుని సత్యాన్వేషణ చేసే మనిషి."
అప్పుడే గౌతముడికి వైరాగ్యం ఒక్కసారి ఆవహించింది. మిట్టమధ్యాహ్నం చీకటి లాగా. పండు వెన్నెలలో గ్రహణం లాగా.
"వ్యాధులు ఎందుకు వస్తాయి? వృద్ధాప్యం ఎందుకు వస్తుంది? పుట్టుక చావు వీటి అర్థం ఏమిటి?"
"అవి అర్థం కావు ఆలోచించ వద్దు !రాజకుమారా!" అని చెన్నుడు వారించినా గౌతముడు తన అన్వేషణ ప్రారంభించాడు.
అర్ధరాత్రి భార్యని కుమారుని వదిలి రాజమందిరం బయటికి విశాల ప్రపంచం లోకి నడిచాడు నిజం తెలుసుకోవడం కోసం. సృష్టికి సమాధానం కోసం. బాధలకి పరిష్కారం కోసం.
బ్రాహ్మణులు నదులలో స్నానాలు చేస్తున్నారు. ఏవో మంత్రాలు చదువుతూ ప్రార్థన చేస్తున్నారు వాళ్లతో కలిసి నదిలో మునిగి మంత్రాలు చదివాడు. బురదలో మెడ దాకా నిల్చుని తపస్సు చేశాడు. ఒక్క కాలి మీద నిలిచి ధ్యానం చేశాడు.
ఊపిరి నిలిపి ప్రాణాయామం చేశాడు. రాజకుమారుడి పట్టు పీతాంబరాలు చించివేసి కాషాయరంగు బట్టలే కట్టా డు. జుట్టు కత్తిరించి శిరోముండనం చేసుకున్నాడు. అడవిలో ఎందరో శ్రమణకులని చూశాడు. వారు కందమూలాలు తప్ప ఏమీ తినటం లేదు. శుష్కించి ఉన్నారు.
మీరంతా ఏమిటి వెతుకుతున్నారు?
వారు ఏవో మంత్రాలు చదివారు. బ్రహ్మజ్ఞానం కోసం అన్నారు .తత్త్వమసి అన్నారు. చాలా రోజుల నుంచి వెతుకుతున్నాం అన్నారు.
సిద్ధార్థుడు కూడా వారిలాగానే కందమూలాలు తిన్నాడు. అడవులలో ముళ్లదారి ద్వారా నడిచాడు.
ఇతనెవరో మహర్షి లా ఉన్నాడని ఐదుగురు శ్రమణులు అని వెంటనే తిరిగసాగారు . ఇతను ఏం కనుక్కుంటాడో చూద్దాం!
కృంగి కృశించిన సిద్ధార్థుడు. నడిచి నడిచి బక్రూర్ గ్రామం అవతలికి వచ్చాడు. అక్కడ గ్రామం అవతల నిరంజనా నది ప్రవహిస్తుంది. దాని గట్టున పెద్ద మర్రి చెట్టు ఉంది. దాని కిందనే కూర్చున్నాడు. కళ్ళు మూసుకొని తపస్సు ధ్యానం మళ్లీ మొదలు పెట్టాడు. అతని శరీరం శుష్కించి, ఎముకలు కనబడేట్లు ఉంది . గడ్డాలు మీసాలు పెరిగి జుట్టు జడలు కట్టింది.
సత్యం కోసం సృష్టి రహస్యం కోసం వెతుకుతున్నాడు. కానీ అతని మనసుకు నిశ్చలత్వం లేదు.
చెట్టు నీడలో నల్లగా కలిసిపోయి దాని క్రింద కృశించిన అస్తిపంజరం లా ఉన్నాడు అతను.
**
సన్నగా పాట పాడుకుంటూ తల దువ్వు కుంటూ ఉంది సుజాత. సుజాతకి ఇప్పుడు వివాహమైంది. భర్త కూడా ఆ ఊరి వాడే. తనతోపాటు పన్నా కూడా అత్తింటికి వచ్చింది.
సుజాతకి సంతోషంగా ఉండటం ఇష్టం. పనులు చేసుకుంటూ సంగీతంలోని రాగాలు తీస్తూ గడుపుతూ ఉంటుంది.
కానీ ఒకే ఒక చింత. ఇంకా గర్భం రాలేదు.
ఎంత ఆశావాది అయినా పిల్లలు లేని జీవితం దుర్భరం అని అనిపిస్తుంది.
ఆమె ఆలోచన పరిచారికకు తెలుసు. కొండ పక్కన వున్న చెట్టు దేవుడికి మొక్కు. అందరూ అంటున్నారు అక్కడ దేవుడికి దండం పెట్టుకుంటే పిల్లలు కలుగుతారని.
అలాగే అనుకుంది ఒకసారి చెట్టు దగ్గరికి వెళ్లి పసుపు కుంకుమ వేసి దీపం వెలిగించి నమస్కారం చేసి అనుకుంది. "తరు దేవా! నాకు మంచి పుత్రుడు పుడితే నీకు క్షీరాన్నం తినిపిస్తాను!"
రోజులు గడిచాయి.
నిజంగానే ఆమెకు గర్భం వచ్చింది . నవమాసాలు నిండాయి. అందమైన పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది సుజాత. ఇంటిల్లిపాదీ సంతోష సముద్రంలో మునిగిపోయారు.
పిల్లవాడికి నెలరోజులు నిండిన తర్వాత పన్న పరిచారిక అన్నది. అమ్మా, చెట్టు దేవుడికి మొక్కు తీర్చాలి. క్షీరాన్నం ఇయ్యాలి. మర్చిపోయావా ?
"నిజమే! రేపు పున్నమినాడు వెళ్దాం!"
ఆరోజు పన్నా పరిగెత్తుకుంటూ వచ్చింది.
"సుజాతమ్మా! చెట్టు దేవుడు నిజంగానే భూమి మీదికి వచ్చాడు. అక్కడే కూర్చుని తపస్సు చేస్తూ ఉన్నాడు."
సుజాత పట్టు చీర కట్టుకుని మేలి ముసుగు వేసుకుని పూలతో అలంకరించుకుని , వెండి గిన్నె లో పాయసం పెట్టుకుని చెట్టు దగ్గరికి వచ్చింది.
చెట్టు ఆకులు గల గల చప్పుడు చేస్తున్నాయి.దూరాన నది వెన్నెల్లో చంద్రుడి కిరణాలతో మెరిసిపోతోంది.
చెట్టు కింద నల్లటి నీడలా కూర్చున్నాడు బక్క చిక్కి శల్యమై ఎముకలు కనిపిస్తూ ఉన్న సిద్ధార్ధుడు. ఇవాళో రేపో ప్రాణం పోయేటట్లు ఉంది.
"నీ అనుగ్రహం వల్ల బిడ్డ కలిగాడు. ఈ పాయసం నీకు తెచ్చాను స్వీకరించు!"
అతడు స్త్రీ కంఠ స్వరం విని మెల్లగా కళ్ళు తెరిచాడు.
"నేను చెట్టు దేవుడిని కాను . సిద్ధార్థుడి ని. సత్యశోధన కోసం ధర్మ మార్గం కోసం తపస్సు చేస్తున్నాను ఏమీ భుజించడం లేదు.గాలి నీరు తప్ప."
సుజాత అన్నది.
"దేవా శరీరాన్ని కృశింప జేసుకోవద్దు. తపస్సుకీ సత్యశోధనకీ కూడా శక్తి ఉండవద్దా? ఈ క్షీరాన్నం తిను. బలం సత్తువ వస్తుంది. నాకు నీ దయ వల్ల పుత్రోదయం అయ్యింది. నీ మహిమ నీకు తెలియదు అయ్యా తీసుకో తిను! ఎంతో బలహీనంగా ఉన్నావు." ప్రేమగా దీనంగా ప్రార్ధించింది.
అతను ఒక క్షణం ఆలోచించాడు. ఆకలిగా ఉంది. కళ్ళ ముందు నల్లటి చీకటి వలయంలో వెన్నెల కూడా అంధకారం అవుతోంది.
గబగబా వెండి గిన్నె తీసుకుని పాయసం అంతా తాగేశాడు. మధురంగా ఉంది. ఒక్క క్షణం లో పోయిన బలం అంతా తిరిగి వచ్చినట్లు అనిపించింది. ప్రపంచం అంధకారం నుంచి వెలుతురులో కి వచ్చినట్టు అనిపించింది.
ఆ క్షణంలోనే అతనికి సత్యం గోచరించింది. శరీరాన్ని కృశింపచేయటం, ఉపవాసం బలహీన పడటం అన్వేషణ కి మార్గం కాదు.
అలాగే సుఖాల్లో ఓలలాడి మూడు పూటలా పంచభక్ష్య పరమాన్నాలు తినటం శరీరాన్ని సుఖపెట్టడం కూడా మార్గం కాదు.
ఈ రెంటికీ మధ్య ఒక మార్గం ఉంది. అదే మధ్యేమార్గం.
సుజాత సన్నగా ఆమె భాషలో పాట పాడుతోంది నమస్కరిస్తూ. ఆమె వెనకనే పన్నా కూడా.
"ఓ వీణా వాదకుడా, వీణ తీగలు తెగి దాకా లాగి తెంపి వేయవద్దు. పాట రాదు.
అలాగే తీగలని శృతి చేయక వదులుగా ఉంచకు. అప్పుడు కూడా పాట రాదు.
వీణ తీగలను సమస్థితిలో నిలుపు. శరీరాన్ని మరీ బాధ పెట్టకు. మరీ సుఖపెట్టకు."
లేచి నిల్చున్నాడు. ఈ మధ్యేమార్గం, అష్టాంగ మార్గం అవగతం అవుతున్నాయి. తాను చేసే పని మంచిదేనా కాదా అది సందిగ్ధావస్థలో పడ్డాడు. సత్యం అవగతమవుతోంది. శ్రమణకులు ఐదుగురు దూరం నుంచి వస్తుంటే కనబడనే కనబడింది ఆ దృశ్యం.
"సిద్ధార్థుడు మోసగాడు. అతని వ్రతం చెడింది. ఫలితం మాత్రం లేదు." అనుకుని వారు వెళ్లిపోయారు కోపంతో.
ఇప్పుడు నీరసంగా వెండి గిన్నె పట్టుకుని నిరంజనా నది వైపు నడిచాడు. నది పరవళ్లు తొక్కుతూ పడమల నుంచి తూర్పు దిక్కుగా ప్రవహిస్తోంది. చంద్రుడి కిరణాలు పడి నది అలలు మెరిసిపోతున్నాయి.
"గిన్నె ప్రవాహానికి ఎదురుగా విసిరి ఇది ప్రవాహానికి వ్యతిరేకదిశలో వెళితే నేను నా ఉపవాస దీక్ష మాని మధ్యే మార్గంలో ఆత్మచింతన మొదలుపెడతాను. అది ప్రవాహం వెళ్లే వైపు వెళితే నేను అనుకున్నది సక్రమమైనది కాదు అని గ్రహిస్తాను."
తళతళ మెరిసే వెండి గిన్నె ను నదిలో విసిరేశాడు. మెరుస్తూ మెరుస్తూ అది ప్రవాహానికి ఎదురుగా వ్యతిరేక దిశలో తేలుతూ వెళ్ళిపోసాగింది.
ఆకాశంలో చంద్రుడేకాక ఇంద్రుడు అనబడే శకుడూ అతని పరివారం బ్రహ్మాది దేవతలు ఈ ఈ విస్మయం కలిగించే విషయం చూస్తూనే ఉన్నారు. ఆకాశం నుంచి కనిపించని పూలవాన కురిసింది. భూమి పులకించింది. ఈ భూమిపై ఒక మహాజ్ఞాని బోధకుడు అవతరించ బోతున్నాడు. ఆ ప్రాంతమంతా మల్లెల సుగంధం, పద్మాల పరిమళం వ్యాపించింది.
సిద్ధార్థుడు మార్గం మార్చుకుని తన పయనం కొన సాగించాడు. దగ్గరలోని బోధివృక్షం దగ్గరికి. ధ్యానంలోకి.
అతని శరీరం మళ్లీ కొత్త బలంతో ప్రకాశించింది.
అతని తల చుట్టూ ఒక కాంతి వలయం ఏర్పడింది.
బోధి వృక్షం కింద ధ్యానంలో ప్రపంచానికి ఒక కొత్త జ్ఞాని బుద్ధుడు జగద్గురువు ఆవిర్భవించాడు.
ఎక్కడో బక్రూర్ గ్రామంలో సుజాత సన్నగా పాట పాడుతూ బిడ్డని నిద్ర పుచ్చుతోంది.
ఒక గొప్ప శకం ప్రారంభమైంది.ఆ తర్వాత మారుడి దాడిని ఎదుర్కొని గెలిచి, 45రోజులు బోధి వృక్షం క్రింద తపస్సు చేసి మహాజ్ఞాని గా మారి బోధిసత్వుడు ప్రపంచానికి, సమాజానికి, అష్టాంగమార్గం, మధ్యే మార్గం బోధించబోతున్నాడు. ఒక గొప్ప కొత్త మతానికి, చింతనకీ నాంది మొదలైంది.
**
(సుజాత ఆతర్వాత బుద్దుని శిష్యురాలైందని బుద్ధ చరితం చెబుతోంది. సుజాత జ్ఞాపకం తో ఒక స్థూపం ఇప్పటికీ బీహార్లోని గయ కు 25 కి.మీ దూరం లో బక్రూర్ గ్రామం దగ్గర నిరంజనా నది ఒడ్డున ఉంది . చక్రవర్తి అశోకుడు కట్టించిన స్థూపం.)