MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
Website Published & Maintained by Srinivas Pendyala www.facebook.com/madhuravanimagazine
కథా మధురాలు
సఫరింగు
డా. మూలా రవి కుమార్
సోమవారం ఉదయం ఆఫీసుకి రాగానే బాసు కాగితాల బొత్తి ఇచ్చి చెప్పారు,
“ఈ కాగితాలకి కావలసిన సమాచారం నింపి, అవసరమైన బిల్లులు జతచేసి, శుక్రవారం సాయంత్రానికి పూర్తిగా సిద్ధం చెయ్యి. శనివారం నేచారాముణ్ణి ఢిల్లీ పంపిద్దాం. అతడు సోమవారం ఉదయం ఢిల్లీ చేరుకొని, అక్కడ ఆఫీసులో సంతకాలు తీసుకొని మళ్ళీ సోమవారం మనకి సంతకాలు పూర్తయిన కాగితాలు తెస్తాడు. పేపర్లు ఢిల్లీ నుంచి రావటం ఆలస్యం అయినా పర్లేదు గానీ, వెళ్ళటం మాత్రం ఒక పూట కూడా ఆలస్యం అవకూడదు, సంతకాలు పెట్టాల్సిన పెద్దాయన ఆ తర్వాత పదిహేనురోజులు మనకి మళ్ళీ దొరకరు.”
ఇంతకీ నేను చేస్తున్న ఉద్యోగంచెప్పలేదు కదూ!? కళింగా కెమికల్స్ అనే పేద్ద ఎరువుల ఫేక్టరీలో చిన్ని కెమికల్ ఇంజనీరుని. ఈఫేక్టరీని రాష్ట్రప్రభుత్వం ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ భాగస్వామ్యంతో పెట్టింది. ఆ సంస్థ కార్యాలయమే ఢిల్లీలో ఉంది. మా ఫేక్టరీ నిర్మాణం, శ్రీకాకుళంకి పదిహేను కిలోమీటర్ల అవతల సముద్రం ఒడ్డున మొదలై ఏడాది అయింది. మరో ఏడాదికల్లా పూర్తయి ఉత్పత్తి ప్రారంభిస్తుంది. ఫేక్టరీ సైటులోనే ఆఫీసూ ఉంది. కుటుంబాలున్నవాళ్ళం శ్రీకాకుళంలో ఇళ్ళు అద్దెకి తీసుకుంటే, బ్రహ్మచారులూ, కుటుంబాలను వైజాగూ, లేదా అంతకన్నా దూరంలో ఉంచినవాళ్ళు ఈ ఫేక్టరీ ఆవరణలోనే కట్టిన గెస్టు హౌసుకి మారిపోయేరు. సంస్థకి కూడా నిర్మాణ దశలో ఎంతమంది ఉద్యోగులు సైట్లోనేబసచేస్తే అంత మంచిది. అందుకని ఫేక్టరీ ఆవరణలో తాత్కాలిక బసలల్లో ఉండేవారికి ఇంటి అద్దె భత్యం ఇస్తూనే ఉచిత బస ఏర్పాటూ చేసింది.
మాకు సాంకేతిక సహకారం, డిజైనులూ అందించే పరిజ్ఞానం అంతా ఢిల్లీ ఆఫీసుదే. నిర్మాణం పూర్తయ్యేవరకూ ఢిల్లీ ఆఫీసులతో చాలా పనులుంటాయి. రోజువారీ వ్యవహారాలు చాలావరకూ ఈమెయిల్ ద్వారా అయిపోయినా, భద్రతతో ముడిపడ్డవీ, అవినీతికి ఆస్కారం ఉండే ఆర్ధిక అనుమతులూ మాత్రం ఢిల్లీ వెళ్ళి సంతకాలు తీసుకోవాలి.
ఇప్పుడు బాసు చెప్పిన నేచారాం, మీరట్ దగ్గర ఏదో పల్లెటూరివాడు. ఢిల్లీ ఆఫీసులో వాచ్‌మేన్ గా పనిచేసేవాడు. డ్యూటీ టైములో తాగి ఎవరితోనో గొడవపడటంతో, దాదాపు ఉద్యోగంపోయేంత ఇబ్బంది అయితే, యూనియన్ వాళ్ళు కలుగజేసుకొని, రాజీ చేసారు. యాజమాన్యం మాత్రం ఢిల్లీలో పోస్టు ఇవ్వము అనేసరికి అప్పుడే కళింగా కెమికల్స్ జాయెంట్ వెంచర్ ఆఫీసుకి, పనిష్‌మెంటులో భాగంగా మూడు నెలల క్రితమే ఈ తెలుగుప్రాంతపు మారుమూలకి బదిలీ చేసారు.
నేచారాం ఇక్కడ ఒక్కడే ఉంటాడు. కుటుంబం ఢిల్లీలోనే. విశాఖపట్నం నేవీలో వాళ్ళ మేనల్లుడెవరో ఏదో ఉద్యోగం చేస్తున్నాడట. ఆదివారాలు అక్కడికి వెళ్ళి వస్తూ ఉంటాడు.
ఢిల్లీ ఉద్యోగం జాయినయ్యేవరకూ హిందీ తప్ప ఇంకో భాష ఉంటుందని కూడా తెలీనివాడు నేచారాం. ఇక్కడికి వచ్చిన కొత్తలో హిందీ రాకుండా ఇంతమంది భారతదేశంలో ఎలా బ్రతుకుతున్నారో అని ఆశ్చర్యపోయేవాడు. హిందూస్తాన్ అంటే హిందీ మాట్లాడేవాళ్ళ దేశం అని అతడి నమ్మిక. ఇతడు ఇంకా చాలా నయం. ‘హిందీ రానివాళ్ళని బంగాళాఖాతంలో తోసెయ్యాలి’ అని మనస్పూర్తిగా నమ్మే ఉత్తరాది వారిని కూడా నేను ఢిల్లీలో ఉండగా చూసేను. నేచారాం మాత్రం, తనని ఈ మారుమూలకి బదిలీ చేసినవాళ్లని రోజంతా తిట్టుకుంటూ, సాయంత్రాలు తాగినప్పుడు మాత్రం, తాను మరో ఐదేళ్ళలో రిటైరయ్యాకా, వాళ్ళని ఎలా కొట్టబోయేదీ వర్ణించుకుంటూ ఉంటాడు.
ఈ నేచారాముడి ప్రసక్తి వచ్చినప్పుడల్లా, మా బాసు, “హెడ్డాఫీసువాళ్ళు వాడికి పనిష్‌మెంటు అని చెప్పి మనల్ని శిక్షిస్తారేమిటయ్యా?” అంటారు, నవ్వుతూ. ఎందుకంటే ఈ నేచారాముడికి ఏపనీ చెప్పలేం. ఎప్పుడు కదిపినా, తిట్టేతిట్లు ఎవరినో తెలీక ఉలిక్కి పడతాం. ఎందుకంటే ఆ తిట్లు విని చలించకుండా ఉండాలంటే హిందీ తెలియకూడదు మరి. తిట్టేటప్పుడు వాడూ, వీడూ అంటూ పురుషులనే తిట్టినా, ఆయా పురుషుల కుటుంబ స్త్రీలని తిట్ల నిండా విరివిగా ప్రస్తావిస్తాడు. మా అందరికీ ఆ తిట్లు అర్ధమయ్యే పాటి బొట్లేరు హిందీ వచ్చు. పోనీ ఈ సమస్య గురించి పై వాళ్ళతో మాట్లాడుదామంటే, పై వాళ్ళకి అంత తీరికే ఉంటే సంస్థకి నెలనెలా కొన్ని లక్షల రూపాయలు ఆదా అయ్యే ప్రతిపాదనలు చాలా వివరించగలం.
అందుకని, నేచారాముడికి ఎవరం ఏ పనీ చెప్పం. అందుకు ప్రతిఫలంగా అతడు కూడా ఆఫీసు వేళల్లో తాగడు. మా బాసు దృష్టిలో అతడికిచ్చే జీతం నాన్‌డిస్టర్బింగ్ ఎలవెన్సు. అనగా మమ్మల్ని ఇబ్బంది పెట్టనందుకుగానూ ఇచ్చేప్రతిఫలం.
ఈ పేపర్లు నేచారాముడితో పంపితే, సంస్థ ఖర్చుతో వాడు తన ఫేమిలీని చూసినట్టు ఉంటుంది. మనకి ఒక వారం రోజులు వాడి హిందీబూతులు వినే బాధ తప్పుతుంది. అలా పంపిన కృతజ్ఞతతో అటునుంచి వచ్చాకా, వాడి బూతుల్లో తీవ్రత తగ్గొచ్చు. నేచారాంకాక ఇంక ఎవరు వెళ్ళినా ఇక్కడ వాళ్ళు చెయ్యవలసిన పని ఆ మేరకు నెమ్మదిస్తుంది. ఇలా అనేక కారణాలతో, పేపర్లు ఇచ్చి శనివారం ఉదయం శ్రీకాకుళంలో బస్సెక్కించాం. మధ్యాహ్నం విశాఖపట్నంలో రైలెక్కాలి. ఆదివారమంతా ప్రయాణంచేసి సోమవారం తెల్లవారుఝామున ఢిల్లీలో దిగి, ఉదయం ఆఫీసులో సంతకాలు తీసుకొని, శనివారం వరకూ ఆఫీసు ఖాతాలోనే ఢిల్లీలో కుటుంబంతో గడిపి, మళ్ళీ సోమవారం నాటికి మా ఆఫీసుకి రావాలి. ఇదీ నేచారాముడి టూరుప్లాను. మా సియ్యీవోగారు చెప్పగానే ఎగిరిగంతేసి, ఆయన కాళ్ళకి దణ్ణం పెట్టెయ్యబోయాడు. స్వంతడబ్బులు గాని సెలవులు గాని ఖర్చు అవకుండా వారం రోజులు కుటుంబం తో గడపటం అంటే ఉబ్బి తబ్బిబైపోయాడు. ఇందుకు ప్రతిఫలంగా మా బాసు పెట్టిన ఒకే ఒక్క షరతు, తను ఢిల్లీ ఆఫీసులో తలవంచుకొని వెళ్ళిన పని చూసుకొని వచ్చేయాలి కానీ పాత కోపాలతో ఎవరినీ కవ్వించకూడదు. అలాగే అంటూ, తనకు తెలిసిన అందరి దేవుళ్లమీదా, కుటుంబ సభ్యులమీదా ప్రమాణాలు చేసాడు.
నేచారాముడు తిరిగొచ్చేదాకా పర్యవేక్షణ బాద్యత నాది. అందుకని, శనివారం పంపించాకా, ఆదివారం ఉదయం నేను నేచారముడికి ఫోను చేసాను. ట్రైను ఆలస్యం అయితే ఆ విషయం బాసుకి చెప్పాలి కదా!
ఫోనులో అంతా గందరగోళంగా ఉంది. ఏదీ వినిపించటంలేదు. నాకు స్పష్టంగా వినిపించిన ఒకే ఒక్క వాక్యం, “సార్ అయాం సఫరింగ్ సార్.” ఏమయిందో కనుక్కునేలోపు ఫోను కట్టయింది. గంట ప్రయత్నించినా మరి కలవలేదు.
నా గుండెల్లో రైళ్ళు పరిగెట్టగా, బాసు దగ్గరకు పరుగెత్తి, “సార్ నేచారాం కి వంట్లో బాగులేదు. రైలెక్కినట్టు లేదు” అన్నాను గాబరాగా.
“చచ్చేమయ్యా. ఆ పేపర్లు చూడవలిసిన మనిషి సోమవారం సాయంత్రమే టూరు వెళుతున్నాడు. ఇంతకీ ఈ మహానుభావుడు ఇప్పుడెక్కడున్నాడు?”
“ఏమోసార్, ఇంటిదగ్గర లేడు. శ్రీకాకుళంలో వైజాగ్ బస్సెక్కించడంవరకే నాకు తెలుసు. తన మేనల్లుడి దగ్గరకి ప్రతీ వారం వైజాగ్ వెళ్ళి వస్తాడు. ఇప్పుడు కూడా వొంట్లో బాగులేకపోయేసరికి వైజాగ్ లో ఆగిపోయేడేమో! వైజాగ్ లో వాళ్ళ మేనల్లుడి ఫోను నెంబరూ లేదు.”
చివరగా, బాసు అప్పటికప్పుడు, నన్ను సోమవారం ఉదయం వైజాగ్ నుండి ఢిల్లీ ఫ్లైటుకి విమానం టికెట్టు తీసుకోమని చెప్పి, ఆదివారమైనా ఆఫీసు తెరిపించి, మరో సెట్టు పేపర్లు తయారు చేయించి ఇచ్చారు.
తీరా ఢిల్లీలో నేను ఆఫీసుకి వెళ్ళేసరికి, అక్కడ నేచారాం కనిపించాడు. “మీరెందుకు వచ్చారు సార్?” అన్నాడు ఆశ్చర్యపోయి.
“నీకు వొంట్లో బావులేదు అన్నావు కదా? మీ మేనల్లుడి దగ్గరకి వెళ్ళిపోయేవు అనుకుని నేనొచ్చేను” అన్నాను.
“వొంట్లో బావులేదని నేనెప్పుడు చెప్పేను సార్?” మరింత ఆశ్చర్యపోయాడు.
“అదేంటీ? నువ్వే కదా, అయాం సఫరింగ్ సార్ అన్నావు?”
“అవును సార్, ‘మేయ్ సఫర్ కర్ రహా హూం’ అని నా ఉద్దేశ్యం సార్.”
అప్పుడు అర్ధం అయింది. హిందీలో ‘సఫర్’అంటే ప్రయాణం. అదేదో మనవాడు హిందీలో చెప్పకుండా, ఇంగ్లీషులో సఫర్ అనే పదానికి ఇంత తప్పుదోవ పట్టించే అర్ధం ఉందని తెలీక హిందీ పదానికి ఇంగ్లీషులో ఇంగ్ అనేపదం జోడించి, అయాం సఫరింగ్, అంటే, నేను ప్రయాణం చేస్తున్నాను అనే ఉద్దేశ్యంలో చెప్పేసాడు. చాలా మంది ఉత్తరాదివారు, “ఐ నో ఇంగ్లీషు” అనటం నాకు తెలుసు. వాళ్ళ ఉద్దేశ్యం, నాకు ఇంగ్లీషు రాదు అని. కానీ వినేవాళ్ళకి సరిగ్గా వ్యతిరేకార్ధం వెళ్ళదూ? సరే, అనుకొని, ఢిల్లీలో నా ప్లాను ప్రకారం రెండు రోజులుండి, నేచారాం దగ్గర పేపర్లు కూడా నేనే తీసుకొని, పని పూర్తి చేసుకొని, తనని మాత్రం ముందు అనుకున్నట్టే సోమవారానికి తాపీగా రమ్మని చెప్పి వచ్చాను.
అటునుంచి రాగానే విషయం తెలిసిన బాసు, “నేచారాం హిందీలో సఫర్ చేసాడు. మనం ఇంగ్లీషులో సఫర్ అయ్యాం.” అన్నాడు, విషాదాన్ని హాస్యంగా మార్చి నవ్వుతూ.
*****