top of page

Website Designed &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

వ్యాస​ మధురాలు

బోయకొట్టములు పండ్రెండు చారిత్రక నవలలోని స్త్రీ పాత్రలు - విశ్లేషణ

sirisha idpuganti

డా. శిరీష ఈడ్పుగంటి

వ్యాస ఉద్దేశ్యం

కరణం బాలసుబ్రహ్మణ్యం పిళ్ళె రాసిన ''బోయకొట్టములు పండ్రెండు'' చారిత్రక నవలలో ఏడు తరాలవారి  (బోయవీరులు- వనితలు, రాజులు... తదితరులు) ప్రస్తావన కనిపిస్తుంది. ప్రస్తుత వ్యాసం కొరకు ఈనవలలోని  ఏడు తరాలలో కనిపించిన ప్రముఖ స్త్రీ పాత్రలను తీసుకుని విశ్లేషించాను. ముందుగా నవలను పరిచయం చేసి తదుపరి ఒక్కొక్క తరానికి చెందిన స్త్రీ పాత్రలను, వాళ్ళ మనస్తత్వాలను చర్చించడం జరిగింది.

చారిత్రక నవల

తెలుగులో చారిత్రక నవలకు నోరి నరసింహశాస్త్రిగారు ఇచ్చిన నిర్వచనం ''చరిత్రాత్మక నవల అనేది రెండు విరుద్ధ శబ్దాల సమ్మేళనమనే భ్రాంతి కలిగిస్తుంది. జరిగినదంతా వ్రాసుకుంటూ పోతే చరిత్ర కాదు. లోకానికో,  దేశానికో,  సంఘానికో, వ్యక్తికో, మంచికో, చెడుకో ప్రభావం కలిగించే సంఘటనలు వ్రాస్తేనే చరిత్ర. దానితో అనుగుణమైన కల్పన జోడిస్తే చరిత్రాత్మక నవల అవుతుంది. దానికి చరిత్ర బీజముంటే చాలును అంటారు.'' (నరసింహశాస్త్రి, నోరి. జూలై, 2012: 1)

నవల- పరిచయం  

ఒక చారిత్రక ఆధారాన్ని తీసుకుని, చరిత్రకు కొంత కల్పన జోడించి రాసిన చారిత్రక నవల ''బోయకొట్టములు పండ్రెండు''.  క్రీస్తుశకం 614 నుండి 848 వరకు ఆంధ్రదేశంలో వేంగీ చాళుక్యులు- పల్లవుల మధ్య జరిగిన సంఘర్షణలకు ప్రతిరూపం ఈనవల. ఆంధ్ర రాజ్యాల చరిత్రను ఇతివృత్తంగా రాసిన చారిత్రక నవల.

చరిత్రలో సాధారణంగా గెలిచిన వారి ప్రస్తావనే ఉంటుంది. కాని ఈ నవలలో గెలిచిన వారికంటే ఓడిపోయిన బోయ వీరుల ప్రస్తావన ఎక్కువగా కనిపిస్తుంది.  బోయల వలసతోనే ఈ నవల ప్రారంభమవుతుంది.  అంతేగాకుండా వారి పేరుతోనే ఈ రచన చేయబడింది. వారి జీవనవిధానాలను, ఆచారవ్యవహారాలను, సంప్రదాయాలను, కట్టుబాట్లను, మనస్తత్వాలను, ఆనాటి సాంఘిక, ఆర్ధిక, రాజకీయపరమైన అంశాలను గూర్చి ఈనవలలో రచయిత వివరించారు. అలాగే ఈనవలలో ఆసక్తికరమైన సంఘటనలు ఎన్నో కనిపిస్తాయి. ఏడు తరాలవారి చరిత్రను రచయిత వివరించారు. సాధారణంగా మనకు వివిధ సాహిత్య రచనలలోనూ, అలాగే సినిమాలలోనూ కూడా మూడు, నాలుగు తరాలవారి చరిత్ర కనిపిస్తుంది. అంతకుమించి ఎక్కువ కనిపించదు. కాని ఈ నవలలో ఏడు తరాలవారి చరిత్రను మనం తెలుసుకోవచ్చు.  ఈ ఏడు తరాలలోనూ విభిన్న మనస్తత్వాలను కలిగిన స్త్రీ పాత్రలను చూడవచ్చు. ఈ నవలలో చెప్పుకోదగిన మరొక అంశం ఆనాటి తెలుగుభాష, సాహిత్యం, దేశకవిత్వం చాళుక్యరాజుల సమక్షంలో రూపు దిద్దుకున్న విధానం ఎంతో ఆసక్తిదాయకంగా ఉంటుంది. ఛందస్సు రాజుల సమక్షంలో ఏవిధంగా రూపుదిద్దుకొందో ఈ నవలలో రచయిత చాలా చక్కగా వివరించారు.

ఉదాహరణకు ''తెనాలి కవి ''మహాప్రసాదము'' అని పద్యమును చదువ దొడగెను.

ధనదునకు నీసుగొల్పు నిందలి ధనాళి

దర్పకుని దర్పమడచు నిందలి జనాళి

నందన విడంబనంబు లిందళి వనాళి

మా సరస్వతీ వాహ్యాళి మా తెనాలి.

దీనికి ముందుగా స్పందించినది ప్రభువులే- సత్యాశ్రయ మహారాజు ''సాధుసాధు. తెలుగు పద్యము ఇట్లుండవలెననియే నేను కోరునది'' అనెను.

విష్ణువర్ధనుడు చేతులు చరచి ''కవిగారు చెప్పినట్లు ఈ గీతి చాల తేటగా, సొంపుగా ఉన్నది. దీనికి- దీనికి- తేటగీతి అని పేరు పెట్టవచ్చును.'' అనెను.'' (పుట- 47, 48) అలాగే మరికొన్ని పద్యాలకు సీసము, ఆటవెలది, తరువోజ... అని పేర్లు నిర్ణయించారు.

పండరంగని అద్దంకి శాసనం (నవలకు చారిత్రక ఆధారం)

తెలుగులో అత్యంత ప్రాచీనమైన పద్యశాసనం పండరంగని అద్దంకి శాసనం. గుణగ విజయాదిత్యుని సేనాని అయిన పండరంగడు సాధించిన విజయాలను ఈ శాసనంలో తెలుగు పద్యరూపంలో చెక్కించారు. ఈ విజయాలలో ఒకటి పన్నెండు బోయ కొట్టముల మీద దాడి చేసి వాటిని స్వాధీనం చేసుకుని, బోయ రాజ్యపు ప్రధాన కొట్టము కట్టెపుదుర్గాన్ని నేలమట్టం చేయడం. (కొట్టము అనగా మండలం లేదా ప్రాంతం.  బోయ కొట్టము - బోయవీరులు నివసించే ప్రాంతం.) 

నవల -వస్తువు

వేంగీచాళుక్యులు, పల్లవుల మధ్య యుద్ధాలు జరుగుతున్న రోజులలో సామాన్య ప్రజలు ఎంతగానో నష్టపోయేవారు. ఆ యుద్ధాలలో తమ మనుషులను కోల్పోయి దిక్కులేక ఎంతోమంది ప్రజలు ఒకచోటు నుండి మరొక చోటుకు వలస వెళ్ళిపోయేవారు. ఆవిధంగా వలస వెళ్ళిపోయినవారిలో బోయలు కూడా ఉన్నారు. త్రిపురాంతకంలో నివసిస్తున్న బోయవీరులు ఆ యుద్ధాలలో నలుగుతూ అక్కడ ఉండలేక మరొకచోటికి వలస వెళ్ళిపోతారు. కొత్త ప్రాంతంలో తమదైన ప్రపంచాన్ని నిర్మించుకునేందుకు పల్లవుల సహాయం తీసుకుంటారు. గుండ్లకమ్మ, మూసీ నదుల మధ్య ప్రాంతంలో వారి ప్రయత్నాలు కొనసాగిస్తారు.  ముందుగా ఉండడానికి ఇండ్లు కట్టుకొని తదుపరి నెమ్మదిగా వ్యవసాయం, వ్యాపారాలు చేయడం మొదలుపెడతారు. తదనంతరం వాటిని అభివృద్ధి చేసుకొని పలు పరిపాలన విభాగాలను, ఒక పెద్ద కోటను నిర్మించుకుంటారు. కాలక్రమేణా పన్నెండు బోయ కొట్టములుగా (పన్నెండు ప్రాంతాలు) ఏర్పడతాయి. పల్లవ సామ్రాజ్యంలో ఈ పన్నెండు బోయకొట్టములు కొంతకాలానికి ఒక చిన్నపాటి సామంతరాజ్యంగా తయారవుతాయి. ఎంతోమంది బోయల పిల్లలు, మనుమలు విలువిద్యలో ఆరితేరి బోయ వీరులుగా తయారవుతారు. ఈవిధంగా ఆరు, ఏడు తరాల వరకు బోయ రాజ్యం సురక్షితంగా బాగానే ఉంటుంది. తదుపరి చాళుక్యులు పల్లవుల రాజ్యాధికారాన్ని కూలదోసేందుకు పల్లవ సామ్రాజ్యంలోని బోయ రాజ్యాన్ని పడదోసే ప్రయత్నం చేస్తారు.  సుమారు రెండువందల సంవత్సరాల వ్యవధిలో నిర్మించిన బోయ రాజ్యాన్ని చాళుక్య సేనాని పండరంగడు ఒక్క రోజులో కూలదోస్తాడు. బోయ రాజ్యాన్ని నేలమట్టం చేస్తాడు. బోయల పై సాధించిన ఈ విజయాన్ని గర్వంగా చెప్పుకుంటూ పండరంగడు శాసనం వేయిస్తాడు. ఈ శాసనాన్ని ఆధారంగా చేసుకుని అప్పటి స్థితిగతులను రచయిత పునర్నిర్మించి రాశారు. తొలి తెలుగు పద్యమైన పండరంగని తరువోజ పద్యం రూపుదిద్దుకోవడాన్ని కూడా చాలా ఆసక్తికరంగా వివరించారు.

నవలలోని స్త్రీ పాత్రలు

ఈ నవలలో ఏడు తరాలలోని స్త్రీలను, వారి మనస్తత్వాలను మనం గమనించవచ్చు. అలాగే ఒక్కొక్క తరంలోనూ విభిన్న మనస్తత్వాలను కలిగిన కొంతమంది స్త్రీలను చూడవచ్చు.

మంగసాని

ఈ నవలలో మొదటి తరం బోయ నాయకుని (కట్టెం వీరనబోయడు) భార్య మంగసాని. భర్త ఉన్నప్పుడు కేవలం కుటుంబ రక్షణ మాత్రమే చూసిన ఈమె అతను చనిపోయిన తర్వాత పన్నెండు బోయ కొట్టముల రక్షణ బాధ్యతను స్వీకరిస్తుంది. ఒక జాతి నాయకుని భార్యకు ఉండాల్సిన సంపూర్ణ లక్షణాలు ఈమెలో కనిపిస్తాయి.

ఈమె వయసు యాభైకి పైన ఉంటుంది. ''నల్లని శరీరచ్ఛాయ, విశాలమైన ముఖము. నొసటిపై పెద్ద కుంకుమబొట్టు, కుడిముక్కుకు రాయి పొదిగిన ముక్కర, ముక్కు నుండి పెదవి పైకి  వ్రేలాడుచున్న బులాకి, చెవులకు బంగారు బుగడలు. మెడలో బంగారు కంటె. చేతులలో గాజులతోబాటు వెండికడియాలు. కాళ్ళకు వెండిమురుగులు. తల నున్నగా దువ్వి నడిపాపట తీసి పెడతల కుడివైపున కొప్పు బిగించినది. వెడల్పంచు మట్టిరంగు చీర, అదేరంగు రవికె ధరించినది. మాటలలోను, చూపులలోను సౌమ్యతతో బాటు అధికార గాంభీర్యము స్పష్టముగా కనబడుచున్నవి.'' ( పుట- 55) ఈమె వస్త్రధారణ, అలంకారాలు మొదలైన వాటిద్వారా ఆ రోజులలోని బోయ వనితల వేషభాషలను కళ్ళకు కట్టినట్లు  రచయిత ఈ నవలలో చూపించారు.

          ''వీరనబోయడు ఉదయమే లేచి కాలకృత్యములు తీర్చుకొని గుండ్లకమ్మనదిలో మునిగి భార్య మంగసాని నలుగుపిండితో ఒడలు రుద్దగా గడియసేపు స్నానము చేసి ఒడ్డుకు వచ్చెను.'' (పుట- 8) ఆరోజులలో మగవాళ్ళు కూడా నలుగుపిండిని స్నాన సమయంలో (ప్రస్తుత రోజులలోని సబ్బులకు బదులుగా) వాడుకొనేవారని తెలుస్తుంది.    

 

          బహుభార్యత్వం ఆరోజుల్లో సర్వసామాన్యంగా ఉన్నట్లు తెలుస్తుంది. రాజ్యాన్ని పాలించే రాజుకు ఒకరికంటే ఎక్కువ రాణులు ఉన్నట్లే సామంతరాజులకు, అలాగే సామాన్య ప్రజానీకానికి కూడా బహుభార్యత్వం అనేది కనిపిస్తుంది. ఈ నవలలో మొదటితరం బోయ జాతి నాయకుడు కట్టెంవీరనబోయని పెద్దభార్యగా మంగసానిని చెప్పడం జరిగింది. తర్వాత ఈ నవలలో కనిపించే మిగిలిన తరాల వారికి కూడా బహుభార్యత్వం అనేది కనిపిస్తుంది. 

వీరనబోయని కుటుంబంలోని యువకులు వర్తకులతో గొడవపడినపుడు ఆ విషయం మంగసానికి తెలియకుండా బోయ యువకులు జాగ్రత్తపడతారు. ఎందుకంటే ఆమెకు తెలిసిన యెడల మంచిమాటలతో రాయబారాలు జరుపుతుందని వారి అభిప్రాయం. అది బోయ యువకులకు ఇష్టంలేదు. కాని మంగసానికి వెంటనే ఆ విషయం తెలియకపోయినా తర్వాత తెలుస్తుంది. వర్తకులకు, బోయయువకులకు మధ్య జరిగిన సంఘర్షణలో మంగసాని పాత్ర చాలాతక్కువే అయిన ఆమె తీసుకున్న నిర్ణయం వలన ఆ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ఎంతటి ఆపదనైనా యుద్ధం వరకు రానివ్వకుండా మాటలతోనే చక్కబెట్టగల నేర్పరి మంగసాని.

చాళుక్యరాజు జయసింహవల్లభుడు, మహాపండితుడు జ్యోతిష్యశాస్త్రవేత్త అయిన అర్కభట్టారకుడు వీరిద్దరి సంభాషణ ద్వారా బోయలపై వారికున్న అభిప్రాయం తెలుస్తుంది. ''ఇక్కడికి తూర్పుగా కొంతదూరమున క్రొత్తగా పండ్రెండు బోయకొట్టములు వెలసినవట. వారు పూర్వము మన సామ్రాజ్యములోనివారే. యుద్ధములలో బాగుగా చితికిపోయి ఇక్కడికి వచ్చి పండ్రెండు కొట్టములు నిర్మించుకొని బ్రతుకుచున్నారట.ఆ బోయలు మొన్న కొందరు  వర్తకులతో ఏదో గొడవ పడినారట. ఆబోయలెవరో, ఎటువంటివారో చూడవలె. 

ఇంతటి సైన్యముతోనా?

అవునుమరి. ఎంతోకొంత దెబ్బతగలనిదే బోయలు మనకు లోబడుదురా?

వారిని చతురుపాయములతో స్వాధీనము చేసికోవలె. వారు అనాగరికులు. స్వతంత్రులు. మొరటువారు. వారితో నెయ్యము కానీ కయ్యము కానీ అతిత్వరలో ఏర్పడును. మీ సైనికులు కూలికి, జీతమునకు యుద్ధము చేయువారు. బోయలు ఆత్మరక్షణకై యుద్ధము చేయువారు. వారి యెదుట మీ సైనికులు నిలుచుట కష్టము.'' (పుట-75) దీనినిబట్టి బోయలు మంచిశక్తియుక్తులు కలిగినవారని తెలుస్తుంది. శారీరక దృఢత్వంతో పాటు విలువిద్యలో ఆరితేరిన వారు. ఆకాలంలో ఏ రాజైన సరే శత్రురాజ్యాన్ని జయించాలంటే ముందుగా ఆ రాజ్యంలోని బోయ వీరులను తనవశం చేసుకోవాలి. ఇదేవిధంగా చాళుక్యులు పల్లవుల్ని ఓడించాలంటే ముందుగా పల్లవరాజ్యంలో ఉన్న పన్నెండు బోయ కొట్టాలను లోబరుచుకోవాలి.

 

          చాళుక్యరాజు సైన్యముతో పన్నెండు బోయ కొట్టాలను చుట్టుముట్టుటకు సిద్ధముగా నున్న సమయంలో మంగసాని  తన మనుమలతోనూ, అలాగే కొంతమంది బోయయువకులతోనూ రాజుకు ఎదురెళ్ళి నమస్కరించి ఈవిధంగా అన్నది. ''మా భాగ్యము. దేవరవారు మా కొట్టములను చూడవచ్చినారు. పేదవారము. మీ సైన్యమునకంతటికిని ఆతిథ్యమునిచ్చుటకు మేమెంతవారము. దేవరవారును, తమరి పరివారమును మా నగరుకు దయచేసి మా ఆతిథ్యమును స్వీకరించి మమ్ములను అనుగ్రహింపవలెనని ప్రార్థించుచున్నాము. మంగసాని చేతులు కట్టుకొని వినయముగా పలికెను.'' (పుట- 78)  చాళుక్యరాజు అవాక్కయ్యెను. ఆమె వాక్చాతుర్యము అతనిని అబ్బురపరచినది. మంగసాని ఏమి మాట్లాడినను రాజుకు విసుగుగానీ, కోపముగానీ కలుగుటలేదు. సంతోషముగానే ఉన్నది. ఆమె స్థిరచిత్తత, మాటలపొందిక, మాటలలో దాగియున్న నిశతత్వము, వినయము అతనికి ముచ్చట గొలుపుచున్నది. 'ఇట్టి బోయవారినా అనాగరికులు, మొరటువారు అనుచున్నారు! ఏమి? అన్నట్లు రాజు ఆమెవైపు చూచెను.' ఇంతటి యుక్తిశాలి మంగసాని. రాజు యుద్ధం మాని బోయలతో మైత్రిని కుదుర్చుకుంటాడు. ఈవిధంగా రాబోయే ప్రమాదానికి అడ్డుకట్ట వేసింది. అంతటి నేర్పు ఓర్పు కలిగిన నాయకురాలు.       

    మంగసాని తన మనుమడు వీరనబోయని పెళ్ళి విషయంలో కూడా చాలా ముందుచూపు కనబరుస్తుంది.  వినుకొండ రాజోద్యోగి కుమారుడు జయపాలుడు వీరనబోయనికి మంచిమిత్రుడు. అతని చెల్లెలు జయశ్రీ కూడా వీరనబోయనికి పరిచయం ఉంటుంది. జయపాలుడు తన చెల్లెలు జయశ్రీ గూర్చి పదే పదే మంగసాని దగ్గర చెప్పడం, వీరనబోయని పెళ్ళివిషయం గూర్చి అడగడం ఇవన్నీ పరోక్షంగా జరుగుతాయి. వీటన్నింటిని గమనించిన మంగసాని మనసులో ఈవిధంగా అనుకుంటుంది. ''ఈ నాగరికులు బహు టక్కరివారు. పండువంటి పిల్లవానిని  చూచుచు వదలిపెట్టరు. పట్టి బుట్టలో వేసికొందురు. తరువాత వగచి లాభము లేదు. ఈ మధ్య వీడు ఏదో ఒక నెపము మీద వినుకొండకు ఒకటి రెండుసార్లు వెళ్ళి వచ్చినాడు. తన వంశరక్తము నందు వేరే వంశ రక్తము కలియరాదు. తన బోయలలోనే తగిన పిల్లను ఎన్నుకొని కట్టబెట్టవలె.'' (పుట- 97) ఒక మంచిరోజు చూసి బోయ జాతిలోనే ఒక బోయపెద్ద కూతురు సంపంగితో వీరనబోయని వివాహం జరిపిస్తుంది. తదనంతరం ఒక పెద్ద పెను ప్రమాదం నుండి వీరనబోయన్ని కాపాడితినని తృప్తిగా ఊపిరి పీల్చుకొన్నది. ఈమె తీసుకున్న ఈ నిర్ణయం వెనుక ఉన్న దూరాలోచన నవలలో చివరికి తెలుస్తుంది.  కేవలం జాతి వేరనో లేదా నాగరికత తెలిసిన గడుసు అమ్మాయనో జయశ్రీని మంగసాని నిరాకరించలేదు. తనభర్త కట్టెంవీరనబోయడు, ఇతర బోయలు కలిసి  కొన్నేళ్ళ పాటు శ్రమించి నిర్మించుకున్న పన్నెండు బోయ కొట్టములకు ఎటువంటి హాని జరగకూడదని ముందు ఆలోచన చేసింది. భర్త చనిపోయిన తర్వాత బోయ కొట్టములకు రక్షణగా నిలిచింది. ఇప్పుడు తన మనుమడు వీరనబోయడు వినుకొండ నగరవాసియైన జయశ్రీని పెళ్ళాడితే, జయశ్రీ కుటుంబానికి బోయ కొట్టములకు రాకపోకలు ఉంటాయి. కాని వినుకొండను పరిపాలిస్తున్నది వేంగీచాళుక్యులు. బోయకొట్టములు ఉన్నది పల్లవుల చెంత.  చాళుక్యులకు, పల్లవులకు మధ్య సంఘర్షణ తెలిసిందే. వీరి యుద్ధాలలో బోయలు సర్వం కోల్పోయి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. మళ్ళీ బోయకొట్టములు వీరి నడుమ నలిగిపోవడం ఇష్టం లేని మంగసాని ఈ పెళ్ళిని  నిరాకరిస్తుంది.     కొంతకాలానికి ధీరవనిత మంగసాని చనిపోతుంది.

అన్నెమసాని

రెండవ తరానికి చెందిన బోయ వనిత. ఈమె మంగసాని చిన్నకోడలు. మంగసాని కొడుకుకు ఇద్దరు భార్యలు. పెద్దభార్య వీరనబోయని తల్లి. ఈమె చాలా అమాయకురాలు. రెండవ భార్య అన్నెమసాని. వీరనబోయన్ని పెంచి పెద్ద చేయడం అంతా ఈమె చూసింది. వీరనబోయడు ఈమె మాట జవదాటడు. మంగసాని బతికి ఉన్నప్పుడు బోయ కొట్టముల బాధ్యత చూస్తూ అన్నెమసానికి కుటుంబ బాధ్యతను అప్పగిస్తుంది. ఈమెకు ఇద్దరు కూతుళ్లు. వారిద్దరికీ వివాహం అయిపోయింది. వీరనబోయడు పినతల్లిని అడుగకుండా ఏమి చేయడు. అన్నెమసాని మంగసానిలా  ముందుచూపు ఉన్న మనిషి కాకపోయినప్పటకీ సందర్భానుకూలంగా నడుచుకోవడంలో ఈమెకు ఈమే సాటి.

బోయ కొట్టాలకు ఒక దేవాలయమును నిర్మిస్తున్నపుడు శిల్పులకు, పనివారికి కావలసిన సౌకర్యాలు, భోజనాలు, వారి చిన్నచిన్న అవసరాలన్నీకూడా తానే దగ్గరుండి చూసుకుంటుంది. అంతేగాకుండా వీరనబోయని రెండవ వివాహం జరిపించడంలో కీలకపాత్ర పోషిస్తుంది. దేవాలయంలో విగ్రహ ప్రతిష్ఠకు తెలిసిన వాళ్ళందరినీ పిలవడంతో జయశ్రీ కుటుంబం కూడా బోయకోట్టములకు వస్తుంది. అక్కడ ఇంకా పెళ్ళికాని జయశ్రీని చూచి  బోయవనితలు కొన్ని ప్రశ్నలు వేస్తారు. ఒకవేళ ఎవరినైనా ఇష్టపడితే అతన్నే పెళ్ళి చేసుకోవచ్చు అని బోయవనితలు సలహా కూడా ఇస్తారు. అంతేగాకుండా వీరనబోయని తల్లి, పినతల్లి ఇద్దరూ కూడా నీవు ఇష్టపడిన వ్యక్తికి వివాహం అయిపోయివుంటే అతన్నే రెండవ వివాహం చేసుకోవచ్చు అని ధ్రువీకరిస్తారు. దాంతో జయశ్రీ బోయప్రజలందరి ముందు నిర్భయంగా వీరనబోయన్ని  ఇష్టపడిన విషయాన్ని చెప్పడం జరుగుతుంది. ఆ సందర్భంలో ఏమి చేయాలో తోచని పరిస్థితిలో అందరూ ఉంటే వెంటనే అన్నెమసాని సందర్భానుగుణంగా వీరనబోయని, జయశ్రీ పెళ్ళికి అంగీకారం తెలుపుతుంది.

సంపంగి

మూడవ తరానికి చెందిన బోయ వనిత. వీరనబోయని పెద్దభార్య. పన్నెండు బోయకొట్టాలలో ఒకటైన బేతకొట్టము పెద్దదొర చెన్నుబోయని కుమార్తె. మంగసాని తన మనుమడు వీరనబోయనికి సంపంగికి దగ్గరుండి వివాహం జరిపిస్తుంది. వీరికి ఒక కుమారుడు (కసవనబోయడు) ఇద్దరు కుమార్తెలు కలుగుతారు. మంగసాని మరణించిన తర్వాత తన భర్త వీరనబోయనికి జయశ్రీ నిచ్చి రెండవ వివాహం జరిపిస్తున్నప్పుడు ఏమి మాట్లాడలేక మౌనంగా  ఉండిపోతుంది. పెళ్ళిపనుల్లో ముభావంగా ఉన్నప్పటికినీ పెళ్ళి తర్వాత జయశ్రీతో కలిసిపోతుంది. సహనం, సర్దుకుపోయే తత్వం ఉన్న మనిషి.

 

జయశ్రీ

ఈమె కూడా మూడవ తరానికి చెందిన వీరనబోయని రెండవ భార్య. వినుకొండ నగర వాసి అయిన జయపాలుని చెల్లెలు. వీరనబోయడు జయపాలుడు మంచిమిత్రులు. ఈమె గూర్చి రచయిత మాటల్లో ''జయశ్రీ పదునారు పదునేడేండ్ల పడుచు. నాగరికముగా, నాణ్యముగా పెరిగినది. తండ్రి మంచి ఆదాయము గల కొలువులో ఉన్నాడు. కనుక అనేక విధములైన ఉడుపులును, తగుపాటి నగలును కొని పెట్టినాడు. వివిధములైన అలంకార ద్రవ్యములను, పరిమళ ద్రవ్యములను వాడుట అలవాటైనది.'' (పుట-92) నాగరికత తెలిసిన అమ్మాయిగానూ చిత్రించారు.  జయశ్రీకి తన అన్న ద్వారా వీరనబోయడు పరిచయం అవుతాడు. ఆ పరిచయం ప్రేమగా మారుతుంది. ఆ ప్రేమను పెళ్ళిగా మలచుకుంటుంది. ఆవిధంగా మలచుకోవడంలో జయశ్రీ చూపిన చొరవ, సమయస్ఫూర్తికి బోయప్రజలందరు ఆశ్చర్యపోతారు. ఈమె బోయప్రజలందరి ముందు నిర్భయంగా వీరనబోయణ్ని ఇష్టపడిన విషయం చెబుతుంది. అప్పటికే వీరనబోయనికి సంపంగితో వివాహం అయివుంటుంది.

వీరనబోయడు జయశ్రీ వివాహానంతరం బోయజాతి వారి వంటలు, ఆహారం ఇతర పద్ధతులు అన్నింటిలలోనూ ఆమెకు భిన్నత్వం కనిపించింది. వారిపద్ధతులు ఆచారాలు ఆమెకు చాలాకష్టముగా ఉండేది.  ''జయపాలుని కుటుంబానికి బోయ కొట్టముల వారి ఆదరము, ఆత్మీయతము అన్నియు బాగుగానే యున్నవి కాని వారి అనాగరికత వీరికి బొత్తిగా నచ్చలేదు. జయశ్రీకి కూడ నచ్చలేదు. ఇది ఏమి చనువు? తన భర్త పండ్రెండు బోయకొట్టములకు రాజు. తాను రాణి. ఈ బోయజనులు దీనిని గుర్తించుట లేదే.'' (పుట- 109) నెమ్మది నెమ్మదిగా  జయశ్రీ ద్వారా వీరనబోయడు, ఇతర బోయయువకుల వేషధారణలో మార్పువస్తుంది. కాని ఇది తాత్కాలికమే అవుతుంది. తిరిగి వారు బోయ సంప్రదాయములోనే దుస్తులు ధరించడం జరుగుతుంది. కొంతకాలానికి జయశ్రీకి నలుగురు సంతానం కలుగుతారు. వారిలో పెద్దవానికి వీరనబోయని పినతల్లి పులిరాజు అని పేరుపెడుతుంది.  కాని ఆపేరును జయశ్రీ పృధ్వీవ్యాఘ్రరాజుగా మారుస్తుంది. పిల్లల అక్షరాభ్యాసము, చదువు వారి పెంపకం తదితర విషయాలన్నింటిలోనూ తన అభిరుచికి అనుగుణంగా బోయల సంప్రదాయానికి విరుద్ధంగా జరిపిస్తుంది. పులిరాజును పన్నెండు బొయకొట్టాలకు ప్రభువుగా చూస్తుంది. అందరినీ అలాగే పిలువమంటుంది. బోయజాతి అనేది ఒక ప్రత్యేక రాజ్యంగానూ, పులిరాజు ఈ రాజ్యానికి రాజుగానూ ఉండాలని ఆమె ఆశ. ఈవిధంగా జయశ్రీ రాకతో బోయజాతిలో పెనుమార్పులు సంభవిస్తాయి.   

అక్కమ

నాల్గవతరం బోయ వనిత. ఈమె పన్నెండు బోయకొట్టాలలో ఒకకొట్టం యొక్క పెద్దదొర కూతురు. ఈమెను సంపంగి కుమారుడైన కసవన బోయనకిచ్చి పెళ్ళి చేస్తారు. ఈమె కుటుంబ వ్యవహారములు చక్కబెట్టుటలో మేటి. పులిరాజు  రెండవ వివాహంలో సమస్త పనులన్నింటిని ఈమె చేస్తుంది. అందరితో కలిసిపోయి పనిచేసే తత్వం కలిగిన మనిషి. ఈమెకు ఒక కొడుకు ఇద్దరు కూతుళ్లు. కొడుకు పల్లవులు చేసిన యుద్ధములో మరణిస్తాడు. (జయశ్రీ కొడుకు పులిరాజు కారణంగా పల్లవులు బోయ కొట్టాలపై దాడి చేస్తారు.) అప్పటికే అతనికి ముగ్గురు కొడుకులు. కొడుకు పోయిన తర్వాత కోడలు, మనుమళ్లు (వీరభద్ర బోయడు, నన్ని, పొన్ని ) కసవన బోయని, అక్కమల దగ్గరే ఉంటారు. 

మల్లిక

నాల్గవతరానికి చెందిన అమ్మాయి. ఈమె జయశ్రీ అన్న జయపాలుని కూతురు. జయశ్రీ తన కొడుకు పులిరాజుకు మేనకోడలుని చేసుకుంటుంది. ఇది బోయప్రజలకు నచ్చదు. ఎందుకంటే మల్లికది బోయరక్తం కాదు. నాగరికత తెలిసిన వినుకొండవాసి. జయపాలుని రక్తం. అంతేగాకుండా జయశ్రీని వీరనబోయడు పెళ్ళి చేసుకున్న తర్వాత  జరిగిన పరిణామాలు అందరికి తెలుసు. ఇప్పుడు మరొకమనిషి బయటినుంచి బోయజాతిలోనికి రావడం బోయ ప్రజలకు ఇష్టంలేదు.

జయశ్రీ మాత్రం తన కొడుకు పులిరాజును బోయ సంస్కృతి నుంచి బయటకు లాగే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగమే ఈ పెళ్ళి. పులిరాజుకు, మల్లికకు ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్ళు కలుగుతారు. ఈ నవలలో మల్లిక పాత్ర పెద్దగా ఏమీ ఉండదు. అంతా మేనత్త జయశ్రీ చెప్పినట్లే నడుచుకుంటుంది.

నాగసాని      

ఈమె కూడా నాల్గవ తరానికి చెందిన బోయవనిత. పన్నెండు బోయకొట్టాలలో ఒక కొట్టం పెద్దదొర మాచన బోయని కూతురు. ఈమెను పులిరాజుకిచ్చి రెండవ వివాహం జరిపిస్తారు. వీరికి ముగ్గురు కొడుకులు. వీరిలో ఇద్దరు అనారోగంతో చనిపోతారు.

పులిరాజు కారణంగా పల్లవులు బోయకొట్టములపై చేసిన దాడి అనంతరం కసవనబోయని మనుమడు ఏడేళ్ళ వీరభద్రబోయన్ని  బోయకొట్టాలకు నాయకుణ్నిగా నియమించుకుంటారు. నాగసాని గూర్చి రచయిత మాటల్లో ''తన కుమారునికి కట్టెపుదుర్గపు నాయకత్వము వెండ్రుకవాసిలో తప్పిపోవుటయు, ఇంతవరకు అనామకుడుగ నుండిన కసవన బోయని  మనుమడు వీరభద్రునికి అధికారము దక్కుటయు నాగసానికి కడుపున అగ్గిపోసినట్లయ్యెను. కసవనబోయని ప్రక్కన వీరభద్రుడు ఆసనముపై కూర్చున్నప్పుడు ఆమె కండ్లలో నిప్పులు రాలుచుండెను.'' (పుట- 163) ఈర్ష్య అసూయలతో రగిలిపోతుండేది. ఇది భరించలేని నాగసాని వీరభద్రునికి విషం కలిపిన పొంగలి పెడుతుంది. అది తిని వీరభద్రుడు చనిపోవడం జరుగుతుంది. అమాయకంగా మొరటుతనంతో ఉండే బోయజాతిలో కూడా నాగసాని వంటి నీచురాలు ఉంటుందని ఈ పాత్ర ద్వారా తెలుస్తుంది.

ఈ విషయం తెలిసిన బోయజాతి నాగసానిని ''సున్నపురాళ్ళలో విడగబోయవలె'' అని తీర్పునిచ్చారు. అంటే ''కామాటి పనివారు ఇటుకలు మన్ను కలిపి క్షణములో ఒక తొట్టి కట్టిరి. నాలుగు గంపల సున్నపురాళ్లు, కొన్ని బిందెల నీరు తెచ్చిపెట్టుకొనిరి. నలుగురు మగవారు ఆమె కాలు చేతులు కట్టి తొట్టిలో పడవైచిరి. ఆమె పైన సున్నపురాళ్ళు కుమ్మరించిరి. నలుగురు నాలుగు ప్రక్కల నిలబడి గబగబ తొట్టి నిండుగా నీరు పోసి బండను మూసివేసిరి. రెండు నిమిషములు కుతకుత శబ్దములును ఘోరమైన అరుపులును వినబడినవి. తరువాత నిశ్శబ్దము.  కొంతసమయము గడచిన తరువాత కాటికాపరులు వచ్చి తొట్టిని వాల్చి శవమును కట్టెలతో కదలించిరి. ఆ శరీరములోని ముప్పాతిక భాగము కండలు, మాంసము దులదులమని రాలిపోగా అస్థిపంజరము కనబడుచుండెను. కాటికాపరులు అంతయు ఊడ్చుకొని గంపలలో వేసుకొని పోయి దూరముగా శ్మశానములో పూడ్చిపెట్టిరి.'' (పుట- 168) ఇంత  ఘోరమైన మరణం నాగసాని పొందుతుంది. ఆ రోజులలో నేరం చేసిన వారికి శిక్షలు ఎంతో కఠినంగా ఉండేవి. రాజులు నేరస్థులకు ''కొరత'' విధించేవారు. ఇది ఒకరకమైన శిక్ష. (గునపపు మొన మీద కూర్చోబెట్టడం)

కసవనబోయని కోడలు (వీరభద్ర బోయని తల్లి)

ఈమె ఐదవతరానికి చెందిన బోయవనిత. ఈమె పేరు ఈ నవలలో రచయిత చెప్పలేదు. కసవనబోయని కోడలు,  వీరభద్రబోయని తల్లిగా మాత్రమే చెప్పడం జరిగింది. కాని ఈమె పాత్ర గూర్చి కొంతవరకు చెప్పకోవలసిన అవసరముంది. కసవనబోయడు వైరాగ్యంతో ఉన్నప్పుడు (పల్లవుల దాడిలో కొడుకు, నాగసాని కారణంగా మనుమడు చనిపోయాక) పన్నెండు బోయకొట్టములు నాయకుడు లేక దిక్కులేనివి అయిపోతాయి. అటువంటి సమయంలో  కసవనబోయణ్ని మేల్కొలిపి మిగిలిన తన ఇద్దరిబిడ్డలను (నన్ని, పొన్ని) అతని కళ్ళముందు ఉంచుతుంది. వాళ్ళనూ, బోయ కొట్టాలను సంరక్షించాల్సిన బాధ్యతను కసవనబోయనికి గుర్తుచేస్తుంది.

పెమ్మసాని

ఆరవ తరానికి చెందిన బోయవనిత. కొండబోయని కొట్టపు పెద్దదొర మనుమరాలు. నన్నిబోయని భార్య. పన్నెండు బోయకొట్టాలకు సమర్ధుడైన నాయకుడు నన్నిదొర. చిన్నప్పటి నుంచి నాయకత్వ లక్షణాలు అలవర్చుకున్నాడు. అతనికి తగిన భార్య ఈమె.

వకుళ 

ఈమె కూడా ఆరవ తరానికి చెందిన రాజ వనిత. ఈతరంలోని పల్లవుల మహారాణికి పిల్లలు ఉండరు. మహారాణి అన్న జయవర్మ కూతురే వకుళ. ఈమెను మహారాణియే పెంచి పెద్ద చేస్తుంది. వకుళ పొన్నిదొరను ఇష్టపడి వివాహం చేసుకుంటుంది. ఈ నవలలో పాత్రకు తగిన పేరుగా వకుళ కనిపిస్తుంది. వకుళ పొన్నిదొర వీరిద్దరి మధ్య జరిగిన పరిచయ సంభాషణ తదితర విషయాలు ఎంతో ఆసక్తిదాయకంగా ఉంటాయి. వకుళను ధైర్యశాలిగానూ, వీరవనితగానూ రచయిత ఈనవలలో చిత్రించారు. మంచినేర్పు సమయస్ఫూర్తి కలిగిన అమ్మాయి.

 

          వకుళ పొన్నిదొరల పరిచయ సంభాషణ ఈవిధంగా జరుగుతుంది.''జయవర్మ కుమార్తె డోలిక ఎక్కలేదు. చీరను కాసే పోసి వెనుకకు బిగించి కట్టి, ఉత్తరీయమును వల్లెవాటుగా వేసికొని చెంగులు నడుముచుట్టును బిగించి గుర్రమెక్కి మార్గదర్శకుల వెంట పోసాగెను. గుర్రమునకు ఒక ప్రక్క బల్లెమును, మరియొక ప్రక్క విల్లమ్ములును వ్రేలాడుచున్నవి.

వకుళ తన గుర్రము ముందు పోవుచున్న ఆశ్వికుల నొక్కొక్కని దాటుకొని ముందుకు పోసాగెను. ఆమె తల్లిదండ్రులను, మహారాణిగారును ''వకుళా. వెళ్ళవద్దు. ముందుకు వెళ్ళవద్దు,''అని అరచుచున్నను లెక్కచేయకుండా  అందరికంటె ముందుకు వెళ్ళిపోయెను. 

పోను పోనూ అరణ్యము దట్టమైపోవుచున్నది. దారి ప్రక్కన దట్టమైన పొదలున్నవి. ఏ పొద వెనుక ఏ మున్నదో - ఏ సమయమున ఏ ఆపద ముంచుకొని వచ్చునో.

పొన్నిదొర అంతవరకు ఆమె పోకడను వేడుకగా చూచుచుండినవాడు. వెంటనే తన గుర్రమును వేగముగా పోనిచ్చెను. ముందున్న బోయ అశ్వికభటులు తమ నాయకునికి దారియిచ్చిరి. పొన్నిదొర పదినిమిషములలో  వకుళను దాటి అడ్డముగా నిలిచెను. ''ఆడువారికి ఇంత సాహసము శోభాకరము కాదు. ఇది కంచిలోని సహకార వనమో, సంపంగివనమో కాదు. మహారణ్యము. ఒంటరిగా ముందు వెళ్ళుట క్షేమము కాదు. మాతో బాటు వచ్చుట మంచిది.'' అని గుర్రమును నెమ్మదిగా నడిపించెను.

''ఆహా అటులనా? ఇది అరణ్యమా? నేనింకను ఇది సహకారవనమో, సంపంగివనమో అనుకొంటినే'' అని వకుళ కొంటెగా సమాధానమిచ్చి నవ్వెను.

ఔరా! ఏమిది? దేవకన్య వరమిచ్చినను ఈ మూర్ఖపు వృక్షములు సహకారవృక్షములుగానో, సంపంగి చెట్లుగానో మారకున్నవే. ఏమీ వీని అహంకారము?''

పొన్నిదొర మాటలకు వకుళ కలకల నవ్వినది. ఇతడు చమత్కారిగానే ఉన్నాడు.'' (పుట- 190, 191) అనుకుంటుంది. కొంతసమయం తర్వాత వారికి ఒక కొండచిలువ ఎదురవుతుంది. వెంటనే వకుళ తటాలున విల్లును బాణాలను తీసుకొని రయ్యిరయిమని నాలుగైదు బాణాలు కొండచిలువపై ప్రయోగిస్తుంది. బాణాలు కొండచిలువకు లోతుగా గుచ్చుకొని రెండవవైపు తిరిగి బోయ దొరలు ఉన్నవైపుకు తిరుగుతుంది. బోయ దొరలు కుంతములు తీసుకొను లోపల పొన్నిదొర తన కుంతమును చిలువ నోటిలో దిగునట్లు బలముగా విసురుతాడు.  తర్వాత అది చనిపోతుంది. పొన్నిదొర సాహసము చూసి అబ్బురపడుతుంది వకుళ. వకుళ బాణప్రయోగము చూసి నివ్వెరపోతాడు పొన్నిదొర. ఈవిధంగా వీరి పరిచయం స్నేహంగానూ తర్వాత ప్రేమగానూ మారుతుంది. ఇటు వకుళను పెంచి పెద్దచేసిన మహారాణి, అటు పొన్నిబోయని అన్న నన్నిబోయడు, బోయజాతి ఒప్పుకొనడంతో వీరిద్దరి వివాహం జరుగుతుంది. కాని  బోయ పెద్దలు మాత్రం ఏమి జరుగుతుందో అని లోలోపల భయపడుతుంటారు. ఎందుకంటే ముందుతరం చాళుక్య వనిత జయశ్రీ మూలంగా బోయకొట్టములు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నది. ఇప్పుడు పల్లవ వంశపు రాణి. కాకపోతే రాణి కాబట్టి కొంత ధైర్యం కూడా ఉంది. వకుళను పెళ్ళి చేసుకున్న తర్వాత పొన్నిదొరను కూడా బోయ ప్రజలు యువరాజుగా చూడటం మొదలుపెడతారు.

వకుళ అతికొద్ది కాలంలోనే బోయ ప్రజల అలవాట్లు, సంస్కృతి సంప్రదాయాలను అలవరచుకొంటుంది.  రాణిస్థానము నుండి బోయవనితగా మారడానికి ప్రయత్నము చేస్తుంది. దీనికి కారణము లేకపోనూ లేదు. నన్నిదొర (పొన్నిదొర అన్న) వకుళ మంచి విలువిద్యాకారిణి అని తెలుసుకొని ఆమెకు ఒక పరీక్ష పెడతాడు. 'దూరంగా కొబ్బరిచెట్టు పై ఉన్న గెలకు గురి చూసి బాణం వేయడం ఇది పరీక్ష. వకుళ గురి చూసి బాణం వదలగానే నన్నిబోయడు కూర్చొన్న చోటునుండే ఒక బాణాన్ని వదలి వకుళ బాణాన్ని అడ్డుకుంటాడు. వకుళ బాణం గెలను తాకే లోపే నన్నిబోయని బాణం అడ్డుకుంటుంది. వకుళ దీన్ని ప్రశ్నిస్తుంది. బాణం వేయమనడం ఎందుకు? దాన్ని మళ్ళీ మీరే అడ్డుకోవడం ఎందుకు? దానికి నన్నిబోయడు ఈవిధంగా అంటాడు. 'నీ బాణానికి గురి ఉంది. కాని వేగం లేదు. అది ఉంటే మరొకబాణం తగిలి కిందపడిపోదు.' దాంతో వకుళ కొంతకాలంగా చాలించిన గుర్రపు స్వారీ, విలువిద్య సాధన మరల ప్రారంభిస్తుంది. అంతేగాకుండా బోయ వనితలలో సౌష్టవమున్నది తనలో సౌకుమార్యమున్నది ఇది గమనించుకుంటుంది వకుళ. వెంటనే తన సౌకుమార్య ఆహారపు అలవాట్లు మాని శరీర సౌష్టవమును పెంచే ఆహారాన్ని అలవాటు చేసుకొంటుంది. ఈవిధంగా కొంతకాలానికి వకుళ సంపూర్ణ బోయవనితగా మారుతుంది.

ఒకప్పుడు చాళుక్య వనిత జయశ్రీ బోయయువకున్ని పెళ్ళి చేసుకొని అతన్ని చాళుక్యునిగా మార్చాలని  ప్రయత్నిస్తుంది. బోయజాతి నాశనానికి తోడ్పడింది. ఇప్పుడు పల్లవ రాణి వకుళ బోయయువకున్ని పెళ్ళి చేసుకొని బోయవనితగా మారుతుంది. బోయజాతి అభివృద్ధికి సహకరిస్తుంది.

 బోయవనితలను వకుళ యుద్ధనారీమణులుగానూ తీర్చిదిద్దుతుంది. బోయ స్త్రీలు కష్టజీవులు, దృఢకాయులు. వ్యవసాయం అంతా కూడా వీరే చేస్తారు. మేడిపట్టి మడక దున్నుట, నాగలిపై కూర్చొండి బండి తోలుట తదితర పనులు కూడా స్త్రీలు చేస్తారు. అంతేగాకుండా ఖాళీ సమయాలలో వీరు కొన్ని ఆటలు కూడా ఆడతారు. ఆ ఆటలు ఆడేటప్పుడు స్త్రీలలోని వేగము, శక్తి, లాఘవము చూసి వకుళ ఆశ్చర్యపోతుంది. కంచిలోని రాణివాసమున పెరిగిన తనకు ఇదంతయు అద్భుతంగా అనిపించి ఈ విధంగా అనుకుంటుంది. ''కంచిలో ఏమున్నది. అంతయు నాగరికత - సారములేని నాగరికత - స్త్రీలు సుకుమారులు - పురుషులు విలాస పురుషులు. వారిలో ఈ వేగము, ఈ లాఘవము కాగడా వేసి వెదకినను కనబడదు. ఈ బోయ పడుచులు పురుషులకెంత మాత్రము తీసిపోరు.'' (పుట-                        231) ఈ సంఘటన అనంతరం వకుళ ఆలోచనలో పడుతుంది. ఈ పడుచుల శక్తియుక్తులు ఉపయోగించుకొను మార్గము వెతుకుతుంది. వెంటనే బరువైన కొన్ని నల్లరాతి పలకలు తెప్పిస్తుంది. వాటిని స్త్రీలకిచ్చి దూరంగా గురి చూసి విసరమంటుంది. ఆ పనిలో వారికి శిక్షణ ఇస్తుంది. ఎందుకంటే తామున్న బోయకొట్టాలకు అటు చాళుక్యుల నుండి ఇటు తన పుట్టింటి వారైన పల్లవుల నుండి ప్రమాదం ఉండవచ్చని గ్రహిస్తుంది. ఏవైనా విభేదాలు వస్తే రాజులు బంధుత్వాలను కూడా చూడరని తనకి తెలుసు. ప్రమాదాలు సంభవించినపుడు పురుషులతో పాటుగా స్త్రీలు కూడా వాటిని ఎదుర్కునే విధంగా ఉండాలని ఆమె ఉద్దేశ్యం.

కొంతకాలం తర్వాత చాళుక్యులు కడియరాజు (పండరంగని తండ్రి) సమక్షంలో కొంత సైన్యంతో బోయలపై దండెత్తుతారు. యుద్ధ సమయంలో బోయ పురుషులతో పాటుగా స్త్రీలు కూడా వారికి సహకరించుట వలన చాళుక్య సైన్యాన్ని ఓడిస్తారు. (ఇదంతయు కూడా వకుళ స్త్రీలకు ఇచ్చిన శిక్షణ కారణంగానే జరుగుతుంది) కడియరాజుకు తగిన బుద్ధిచెప్పి నన్ని, పొన్ని దొరలు అతన్ని ప్రాణాలతో విడిచిపెడతారు.

ఈవిధంగా వకుళ అతికొద్దికాలంలోనే బోయప్రజలకు ఆరాధ్య దేవత అయిపోతుంది. బోయవనితలు అందరూ కూడా ఆమె పట్ల ప్రేమ, భక్తి, ఆరాధన భావం కలిగివుంటారు. వకుళకు ఒక కొడుకు (మలయప్ప) , కూతురు పుడతారు. 

కొన్ని సంవత్సరాల పాటు ఏ రాజు కూడా వారి వైపు కన్నెత్తి చూడరు.  బోయల పిల్లలు పెరిగి పెద్దవారవుతారు. చాళుక్యులలో గుణగ విజయాదిత్యుడు రాజవుతాడు. కడియరాజు కొడుకు పండరంగడు సేనానిగా ఉంటాడు. తండ్రి కి బోయల వలన జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాడు. చాళుక్య సైన్యానంతటిని తీసుకుని బోయ కొట్టాలపై దండెత్తుతాడు. బోయకొట్టాలకు పునాది అయిన నన్ని దొర, పొన్నిదొరలను వాళ్ళ పుత్రులను  (మలయప్ప, కొమరప్ప...) ఒక్కొక్కరిని వెనుకపాటుగా దెబ్బతీసి మరీ చంపుతారు. ఇదంతయు గమనిస్తున్న వకుళకు ఒక్కక్షణం ఆగిపోయినట్టై వెంటనే ఆవేశంతో చాళుక్య సైన్యములోని ప్రధాన సైనికులను తన బాణాలు, కుంతలాలతో మట్టుపెడుతుంది. అనంతరం ఆమె చూపు పండరంగని పై పడుతుంది. గుర్రాన్ని వేగంగా పోనిస్తుంది. ''పండరంగడు  కోట వద్ద జరుగుచుండిన విధ్వంసకాండను చూచుచుండినవాడు ఒక క్షణము ఇటు చూచెను. కాళికాదేవి వలె తనపైకి దూసుకొని వచ్చుచున్న వకుళను చూచి త్రిభువనాంకుశమును సవరించుకొను లోపల వకుళ కుడిచేతిలోని  కుంతము పండరంగని కుడిభుజము దిగువన ప్రక్కటెముకల మధ్య దూరి వెనుక వైపున వీపులో ఒక జేనెడు  బయటికి పొడుచుకొని వచ్చెను. ఆ వ్రేటునకు పండరంగడు ఆ కుంతముతో బాటు గుర్రముపై నుండి కిందపడి పోయెను. వకుళ గుర్రము ఆగలేదు. అదే వేగముతో యుద్ధరంగమును వదలి దక్షిణదిశగా వెళ్ళిపోయినది.'' (పుట- 267)

పండరంగడు వకుళ చేతిలో చావు దెబ్బ తింటాడు. కాని ఒక వైద్యుని సహాయంతో ప్రాణాలు దక్కించుకుంటాడు.  అతనికి తన జాతకంలో ప్రాణాలు పోయే స్థితి ఏర్పడి తిరిగి బతుకుతాడని ముందుగానే తెలుసు. అందుకే బోయలపై యుద్ధానికి వచ్చేటప్పుడే కూడా వైద్యున్ని తెచ్చుకుంటాడు. వైద్యుని సహాయంతో కొంతకాలానికి కోలుకుంటాడు.  కాని బోయ కొట్టాలన్నీ  సర్వనాశనమై పోయి ఉంటాయి. బోయిలందరూ కూడా యుద్ధములో మరణించివుంటారు.   ఎవరైనా గాయాలతో బతికి వుంటే వేరే చోటుకు వెళ్ళి తలదాచుకుంటారు. అంత ఘోరమైన యుద్ధం జరుగుతుంది. రెండు వందల సంవత్సరాల కాలంపాటు ఏడు తరాల బోయజాతి పన్నెండు బోయకొట్టాలను ఏర్పరచుకుని నివసిస్తారు. ఇదంతయు కూడా పండరంగని వలన సర్వనాశనమై పోతుంది.  

వకుళ చివరికి తిరువేంగడ క్షేత్రమునకు వెళ్ళి అక్కడ మలయప్ప దేవుని సేవలో నిమగ్నమైపోతుంది. ఆ విగ్రహములోనే తన కొడుకును (మలయప్ప) చూసుకుంటుంది. అక్కడి జనులందరికి పద్మావతి, శ్రీనివాసుల కథను చెబుతూ కొంతకాలం జీవిస్తుంది. ఈమె పూర్వ జన్మలో వకుళ మాత అని జనుల నమ్మకం. ఆ కథే నేడు స్థల పురాణంగా మారింది. ఒకరోజు వకుళ, మలయప్ప విగ్రహం రెండూ కనిపించవు. చాలా రోజుల తర్వాత విగ్రహం ఎక్కడో కనిపిస్తుంది.

అల్లెమసాని

ఈమె కూడా ఆరవ తరానికి చెందిన బోయ మహిళ. నన్ని, పొన్ని బోయలకు మరదలు వరుస అవుతుంది. ఈమె పుట్టినప్పటి నుండి పొన్నిదొరకు భార్య అనుకుంటారు. పెరిగి పెద్దయిన తర్వాత ఈమెలో కూడా ఇదే ఆలోచన    ఉంటుంది. అందుకోసమే ఈమె కూడా విలువిద్య, గుర్రపు స్వారీ మొదలైనవి నేర్చుకుంటుంది. కాని పొన్నిదొర వకుళను పెళ్ళి చేసుకోవడం ఈమెకు, ఈమె కుటుంబసభ్యులకు ఇష్టముండదు. వకుళ అంటే చాలాకోపంగా   ఉంటారు. కాని బోయకొట్టాలలో వకుళ ప్రవర్తనను చూసిన అల్లెమసానికి వకుళ మీద కోపం పోయి ఇష్టం ఏర్పడుతుంది. వకుళకు కూడా అల్లెమసాని గూర్చి తెలిసి తన భర్త పొన్నిదొరకు మరదల్ని ఇచ్చి రెండో పెళ్ళి జరిపిస్తుంది. వీరిద్దరికి ఒక కొడుకు. అల్లెమసాని వకుళకు అన్ని విషయాలలోనూ తోడుగా ఉంటుంది.  వకుళ బోయ వనితలకు ఇచ్చే శిక్షణ నుండి కుటుంబ వ్యవహారాలు తదితర విషయాలన్నింటిలోనూ సహకరిస్తుంది.

నరసాసాని 

ఈమె నవలలో ఏడవ తరానికి చెందిన బోయవనిత.  ఈతరంతో బోయజాతి అంతమయిపోతుంది. ఈమె గండబోయని కొట్టముదొర పోతనబోయని కుమార్తె.  ఈమెను నన్నిబోయని పెద్దకుమారుడు కొమ్మనబోయనికి ఇచ్చి వివాహం జరిపిస్తారు. వకుళే  పెళ్ళిపనులన్ని దగ్గరుండి చూసుకుంటుంది.  కాని పండరంగని యుద్ధానంతరం వీరంతా ఏమై పోయినది తెలియదు. కొంతమంది చనిపోవడం, మరికొంతమంది గాయాలతో వేరే చోటుకు వెళ్ళిపోవటం జరిగింది.

ఈ నవలలోని విశిష్టాంశాలు

పేర్లలో ప్రత్యేకత

ఈ నవలలో బోయలకు పుట్టిన కూతుళ్ల గూర్చి వివరాలు ఏమి ఉండవు. బోయ దొరల్ని చేసుకున్న స్త్రీల గూర్చి మాత్రమే ప్రస్తావన కనిపిస్తుంది. బోయ స్త్రీల పేర్లు చివర సాని అనే పదం కనిపిస్తుంది.(మంగసాని, అన్నెమసాని,  నాగసాని, పెమ్మసాని, అల్లెమసాని, నరసాసాని) సాని అనే పదం నేడు నీచార్థంలో వాడబడుతుంది. కాని ఒకప్పుడు  ఈ పదం దేవాలయాలలో పనిచేసే పెళ్ళి కాని అమ్మాయిలకు వాడేవారు. తదనంతరం కొన్ని అగ్రకులాలవారు  వాళ్ళ పేర్లకు చివర ఈ పదాన్ని చేర్చుకునేవారు (కమ్మసాని, కాపుసాని).  అలాగే బోయ యువకులు వాళ్ళ పేర్ల చివర దొర, బోయడు (నన్నిదొర, పొన్నిదొర, వీరనబోయడు, కసవన బోయడు) ఇట్లాంటి పదాలతో పిలుచుకునేవారు. ఆరు, ఏడు తరాలలో అప్ప అనే పదం కూడా కనిపిస్తుంది. (మలయప్ప, కొమరప్ప) వీరనబోయడు అనే పేరు మూడు తరాలలో కనిపిస్తుంది. బోయలే కాక ఆరోజులలో రాజులు పేర్లు కూడా విచిత్రంగా అనిపిస్తాయి. యువరాజుగా ఉన్నప్పుడు ఏ పేరు పెట్టుకున్నప్పటికీ రాజైన తర్వాత విష్ణువర్ధనుడు అనే పేరు ఖచ్చితంగా పెట్టుకునేవారు. (విష్ణువర్ధనుడు, రెండవ విష్ణువర్ధనుడు, మూడవ విష్ణువర్ధనుడు ...)

విలువిద్య పోటీలు, శిక్షణ - శిక్షలు

విలువిద్యకు సంబంధించిన పోటీలు చాలా ఆసక్తిదాయకంగా ఉంటాయి. ఉదాహరణకు దూర లక్ష్య భేదనము,- (దూరంగా ఉన్న చెట్లను బాణాలతో కొట్టుట) చల లక్ష్య భేదనము,- (జామపండును పైకి విసిరి దాన్ని బాణంతో కొట్టడం), ఒక గోడపై సమాన ఎత్తులో వెదురు చువ్వలు పాతి వాటిపై నిమ్మకాయలు పెట్టి, కొంతదూరంలో నిల్చుని నిమ్మకాయలను కొట్టి బాణం ముందుకు వెళ్ళడం మొదలైన పోటీలు ఎంతో ఆసక్తిని గొల్పుతున్నాయి. బోయ స్త్రీలు బరువైన నల్లరాతి ఫలకాలను దూరంగా ఉన్న శత్రువుపై గురిచూసి విసరడం మొదలైనవి అద్భుతంగా ఈ నవలలో చిత్రించారు.  శిక్షలు అత్యంత కఠినంగానూ, ఊహించని రీతిలోనూ ఉంటాయి. ఉరి, కొరత, సున్నపురాళ్ళల్లో విడగబోయడం  మొదలైనవి.

బహుభార్యత్వం- సహగమనము 

ఒక వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ వివాహలు ఆరోజులలో చాలా సామాన్యంగా ఉన్నట్లు తెలుస్తుంది. సామాన్య ప్రజల నుండి రాజుల వరకు కూడా ఈ విధానం కనిపిస్తుంది. నవల ద్వారా సతీసహగమనము అనేది కూడా అప్పట్లో ఉన్నట్లు తెలుస్తుంది. అది ఒక ఆచారంగా చాలా సామాన్యంగా జరిగిపోతుంది. భర్త చనిపోయిన తర్వాత ఎవరయిన సహగమనము ఒప్పుకోని యెడల వారిని బలవంతంగా మంటలలో వేయుదురు. మంటలలో పడిన వారి అరుపులు వినబడకుండాను, అలాగే చితిపై నుంచి లేచి రాకుండానూ  తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. బలవంతంగా వాళ్ళను చంపేస్తారు. ఇది మరొక ఘోరమైన శిక్ష. 

వివిధ అంశాలు

ఈ నవలలో ఛందస్సు, జ్యోతిష్యం, ఖగోళశాస్త్రం, దేవాలయాలు మొదలైన వాటిపై చాలా ఆసక్తికరమైన పరిశోధన  జరుగుతుంది. (భీమేశ్వరాలయం, తెలుగు ఛందస్సు, కవిత్వం సాహిత్య రచనలు) అలాగే కుల, మత, రాజకీయ ప్రాధాన్యత కూడా కనిపిస్తుంది. రాజులు- రాచరికాలు, కుట్రలు కుతంత్రాలు, మంత్రులు - సామంతులు, సైనికులు - అరాచకత్వాలు, వర్తకులు- వాణిజ్యం- పన్నులు, వివిధ వృత్తులవారు మొదలైన వివిధ అంశాల గూర్చి చాలా విపులంగా ఈ నవలలో రచయిత విశదపరిచారు. అంతేగాకుండా యుద్ధానంతరం సామాన్య ప్రజల పరిస్థితి ఏవిధంగా ఉంటుందో వివరించారు. ఓడిన రాజ్యంలోని ప్రజలు గెలిచిన రాజ్యం క్రిందకి వచ్చినపుడు వారిని  గెలిచిన రాజ్యపు సైనికులు ఆదరించరు. శత్రు రాజ్య ప్రజలగానే చూస్తారు. వారికి ఎవరి నుండి ఎటువంటి సహకారం లభించదు. వారు ఆరాజ్యంలో దోషులుగానే చూడబడతారు. వీరి దయనీయ స్థితిని రచయిత ఈ నవలలో కళ్ళకు కట్టినట్లు  చూపించారు.

నవలకు ప్రధానమైన అంశం ఏడు తరాల బోయజాతి. వీళ్ళ వేషధారణ, సంస్కృతి, ఆహారపు అలవాట్లు, నియమాలు, కట్టుబాట్లు, పెళ్ళిళ్ళు, సంప్రదాయాలు, ఆటపాటలు, యుద్ధవిద్యలు ముఖ్యంగా విలువిద్య, గుర్రపు స్వారీ మొదలైన అంశాలను పాఠకులకు కుతూహలం కలిగేవిధంగా వర్ణించారు.

పల్లవుల- చాళుక్యుల మధ్య జరిగిన యుద్ధంలో సర్వం కోల్పోయి, మనుషుల్ని పొగొట్టుకొని  ఉన్న చోటును వదలి బోయజాతి కొత్త ప్రాంతానికి వలస వెళ్ళిపోతారు. అక్కడ తమకష్టంతో బీడుభూములను ఇళ్ళగానూ, వ్యవసాయభూమిగానూ మార్చుకుంటారు. నెమ్మది నెమ్మదిగా పన్నెండు బోయ కొట్టాలుగా ఏర్పడతాయి. వారి చుట్టూ  ఇతర వృత్తులవారు కూడా చేరతారు. దేవాలయం నిర్మించుకుంటారు. ఎత్తైన కోటగోడ కట్టుకుంటారు. ఏనుగులు, గుర్రాలు మొదలైన బలగాన్ని పెంచుకుంటారు. బోయలలో కొంతమంది చదువుల నిమిత్తం బయట ప్రాంతాలకు కూడా వెళ్ళి అక్కడ చదువుకొని, తిరిగి తమ ప్రాంతపు అభివృద్ధికి తోడ్పడతారు. ఈవిధంగా రెండువందల సంవత్సరాల కాలంలో ఏడుతరాల బోయలు అచట సుఖసంతోషాలతో జీవనం సాగిస్తారు. ఇలా బోయజాతి కొంతకాలంపాటు నిర్విరామంగా కృషిచేసి ఏర్పరుచుకున్న పన్నెండు బోయకొట్టాలను పండరంగడు ఒక్కరోజులో నేలమట్టం చేస్తాడు. బోయ జాతిని సమూలంగా నాశనం చేస్తాడు.    

ఏది ఏమైనప్పటికి ఒక జాతి చరిత్రను సంపూర్ణంగా తెలియజేసే చారిత్రక నవల ఇది. పాఠకులను మళ్ళీ మళ్ళీ చదివింపజేసే ఏడు తరాలవారి అద్భుత రచన ''బోయకొట్టములు పండ్రెండు'' .      

 

ఉపయుక్త గ్రంథాలు

నరసింహశాస్త్రి, నోరి. జూలై, 2012. ''ఆంధ్రభాషలో చరిత్రాత్మక నవల'' (వ్యాసం). ఈమాట. కామ్‌. 

బాల సుబ్రహ్మణ్యం పిళ్ళై, కరణం. డిసెంబర్‌, 2013. ''బోయకొట్టములు పండ్రెండు'' (చారిత్రక నవల). అమర్‌  ఆఫ్‌ సెట్‌ ప్రింటర్స్‌. మదనపల్లె.

....

OOO

Bio
bottom of page