top of page

Website Designed &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

కథా మధురాలు

స్పర్శ

Pajna Vadlamani

 ప్రజ్ఞ  వడ్లమాని

సస్య ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్ ఎక్కేందుకు సిద్ధంగా ఉంది. ఇంకొక గంట సమయం ఉంది.  వారం రోజుల ఇండియా ట్రిప్ ఇట్టే గడిచిపాయింది. చాలా సంతోషంగా, తేలిక మనసు తో ఉంది.  కానీ ఎందుకో వెళ్లాలని లేదు. అమెరికా లో ఉండే చాలా మందికి కలిగే భావమే ఇది-  తమ సొంత వాళ్ళని, ఊరిని చూసి మళ్లీ తిరిగి పరుగుల ప్రపంచంలోకి  వెనక్కి వెళ్లలేకపోవడం. ఇలా మదిలో ఎన్నో ఆలోచనలు మెదులుతూ ఉండగా, ఎదురుగా ఒక అతను కనిపించాడు. అతని వొళ్ళో ఒక చంటి పిల్ల. అతను ఆ చంటి పిల్ల పాదాలని తన బుగ్గ కి తాకించాడు. ఆ దృశ్యం ఎంతో చూడముచ్చటగా ఉంది. ఆలా చూస్తుండగా సస్య ఆలోచనలు నెమ్మదిగా తన చిన్నతనంలోకి జారుకున్నాయి.

“అమ్మా ఎందుకు నన్ను ఎత్తుకోవద్దు అంటున్నావు ?” అని అమాయకంగా అడిగింది సస్య.

“నువ్వు చిన్నపిల్లవి కదమ్మా , ఎత్తుకోలేవు. కింద పడేస్తావు!”  గట్టిగానే చెప్పింది సస్య కి వాళ్ళ అమ్మ.

“అదేమైనా బార్బీ డాల్ ఆ అమ్మా, జాగ్రత్తగా పట్టుకుంటాను లే నేను” హామీ ఇచ్చింది  సస్య.

“సరే తర్వాత తర్వాత” అంటూ సస్య ని లాక్కెళ్తూ తన తమ్ముడు, మరదలు వాళ్ళ దగ్గరికి పరిగెత్తింది.

 

సస్య వాళ్ళ మామయ్య వాళ్ళు అమెరికా నుండి అప్పుడే హైదరాబాద్ కి వచ్చారు. ఎయిర్పోర్ట్ లో మామయ్య భుజం మీద ఏడు నెలల చంటి పిల్లని చూసి ఆశ్చర్య పోయింది సస్య. “ఇంత బుజ్జిగా ఎలా ఉంటారబ్బా” అని ఆలోచిస్తోంది  మూడవ తరగతిలో ఉన్న సస్య. లగ్గేజ్ తీసుకొని టాక్సీ లో కూర్చుని, ఇంటికి బయలుదేరారు అందరూ. ముందు సీట్ లో తండ్రి వొళ్ళో కూర్చొని ఉంది సస్య. వెనకాల సీట్ లో అమ్మ, మామయ్య, అత్తయ్య వొళ్ళో చంటిది. కారులో వొస్తున్నంత సేపు చంటిది చేసే శబ్దాలు వింటూ థ్రిల్ అయింది. ఎపుడెపుడు ఎత్తుకుందామా చంటిదానిని అని ఎదురు చూస్తోంది.

 

ఒక వైపు మామయ్య వాళ్ళు తెచ్చిన పెట్టెల వైపు ఆశగా చూస్తూ, ఇంకొక వైపు చంటిదాని వైపు గా చూస్తోంది. ఏం బొమ్మలు ఏం చోక్లెట్లు తెచ్చారో అన్న ఆలోచనలు ఒక వైపైతే, మామయ్య కూతురుని ఎప్పుడెప్పుడు ఎత్తుకుంటానా అన్న కుతూహలం మరొక వైపు. చంటిదానికి పాలు పట్టించడానికి ప్రయత్నించింది అత్తయ్య .  కానీ చంటిది తాగలేదు. లాభం లేదని చంటిదానిని ఉయ్యాలలో పడుకోబెట్టేసి  అందరు భోజనాలకి కూర్చున్నారు. అన్నట్టు చంటిదాని కోసం తాతయ్య ప్రత్యేకంగా చెరీ వుడ్డు తో ఉయ్యాల చేయించారు. సస్య చిన్నది కాబట్టి ఎదో కొంత తొందరగా తినేసి, ఉయ్యాల వైపు చూస్తూ కూర్చుంది. ఒక్కసారిగా చంటిది ఏడవటం మొదలుపెట్టింది. అందరూ భోజనం మధ్యలో ఉన్నారు కాబట్టి చేతులు ఖాళీగా లేవు.

“సస్య పండూ , ఒకసారి వెళ్లి… ” అత్తయ్య మాటలు ఇంకా పూర్తి అవకుండానే సస్య సర్రున పరిగెత్తుకుంటూ ఉయ్యాలా వైపు వెళ్ళింది. చంటిది గుక్కపట్టి  ఏడుస్తోంది. ముట్టుకోవాలా వద్దా అన్న సంధిగ్ధం లో ఉంది సస్య.

 

సస్య అప్పటివరకూ కోరుకుంటున్నది నెరవేరే సమయం వచ్చింది. మెల్లగా ఉయ్యాల లోకి వంగి, రెండు చేతులు చాచి చంటి దాని భుజాలని పట్టుకుంది. అప్పటివరకు పెద్దగా ఏడుస్తున్న చంటి దాని కళ్ళు, సస్య కళ్ళు కలిసాయి. చంటిది ఏడుపు ఆపేసింది. సస్య చంటి దానిని ఎత్తుకొని, ఉయ్యాలా నుండి పైకి లేచింది. అంత బరువును సస్య ఎప్పుడు మొయ్యలేదు. అప్పుడప్పుడు డాడీ తో పాటు నీళ్ల కాన్ పట్టుకోడానికి ప్రయత్నిస్తుంది. కానీ తనంతట తాను గా ఎప్పుడూ ఇంత బరువుని మోయలేదు. ఎదో మంత్రం వేసినట్లు, అప్పటిదాకా ఏడుస్తున్న చంటిది ఒక్కసారిగా నవ్వుతూ కేరింతలు పెట్టడం మొదలెట్టింది.

చంటి దాని ఏడుపు ఆగిపోయిందేంటబ్బా అనుకుంటూ అత్తయ్య వచ్చి చూసి ఆశ్చర్యపోయింది.  సస్య భుజం మీద చంటిది ఎంతో హాయిగా, కాళ్ళు చేతులు ఆడిస్తూ ఉంది. అంతే కాక ఎదో ఆనందంగా అరుపులు, శబ్దాలు.  సస్య చేతి నుండి అత్తయ్య చంటిదానిని తీసుకొనే ప్రయత్నం చేసింది. చంటిది ఏడుపు మొదలెట్టింది. “ఆమ్మో వొద్దులే, నీ దగ్గరే ఉండని , కానీ నువ్వు కూర్చో రా  సస్య పండూ , లేదంటే బరువుకి భుజాలు నొప్పులొస్తాయి” అనేసి అత్తయ్య వెళ్ళిపోయింది.

 

ఒక్కసారిగా ఇంత బాధ్యత తన మీద వచ్చేసరికి నిజంగానే సస్య కి కూర్చోవాలనిపించింది. చంటిదానిని గట్టిగా పట్టుకొని అలా మెల్లిగా మంచం మీద కూర్చొంది. చంటిది ఇంకా ఆడుకుంటూనే ఉంది. అప్పుడు చూసింది సస్య, చంటి దాని పాదాలని. ఎర్రగా ముద్దుగా ఉన్నాయి. మెల్లగా చంటిదాని ఎడమ పాదాన్ని తన చేతిలోకి తీసుకొని, కొంచెం వొంగి, తన బుగ్గకి ఆనించుకుంది. ఆ స్పర్శ కి సస్య కళ్ళలో నీళ్లు కదిలాయి. ఆ భావాన్ని అర్ధం చేసుకునేంత వయస్సు కానీ, తెలివి కానీ సస్య కి లేవు. కానీ ఆ స్పర్శ ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ఆ లేత పాదాలు తన నున్నటి బుగ్గకి రాసుకోవడం చంటిదానికి కూడా నచ్చినట్లుంది. అందుకే కాబోలు సస్య బుగ్గలని సుతారంగా తాకిస్తూనే ఉంది.

 

“ఎస్క్యూజ్ మీ” అని ఎవరో అనడంతో ప్రస్తుతంలోకి వచ్చింది సస్య.

“ఎస్ చెప్పండి” అని అంది, పిలిచిన పెద్దావిడ తెలుగావిడలాగే ఉందని.

“మీ దగ్గర సరిడాన్ లాంటిది ఏదైనా వుందా? మా ఆయనకి తలనొప్పిగా ఉందిట” అని ఎదురు వరసలో కూర్చొని వున్న తన భర్త వైపు చూపిస్తూ చెప్పింది

“అయ్యో నా దగ్గర లేదండి. కానీ మీరు కొద్దిగా ముందుకు వెళ్తే, అక్కడ రెస్ట్ రూమ్ పక్కనే ఒక మెడికల్ షాప్ ఉంది”

ఇంతలో ఆ భర్త అందుకొని, “ఇప్పుడు డబ్బులు తగలెయ్యకు. నీ వెచ్చటి చెయ్యి నా తల మీద పెట్టు. అదే తగ్గిపోద్ది” అని నుదురు పట్టుకొని అన్నాడు.

ఆవిడ ఇబ్బందిగా  “థాంక్స్ అమ్మా” అని అనేసి ఆయన దగ్గరకు వెళ్ళిపోయింది.

 

“ఏవిటీ తిడుతున్నావు” అని ఆయన అనటం, “ఆ పిల్ల ముందు ఏవిటా పాడు మాటలు” అని ఆవిడ అనటం, “నా పెళ్ళాం నే కదా అన్నదీ” అని మళ్ళీ ఆయన రాగాలు తీయటం విని “హౌ రొమాంటిక్” అని తనలో తానే అనుకుంటూ మళ్ళీ ఒకసారి గతంలో కి వెళ్ళింది సస్య.

 

అప్పుడు సస్య కి ఇరవై రెండేళ్లు. ఆఫీస్ నుండి ఇంటికి తలనొప్పితో వచ్చింది. అమ్మ చేతి కాఫీ తాగింది. ఊహూ, తగ్గలేదు. సస్య కి మందులు వేసుకోవటం ఇష్టం ఉండదు.

 

“జ్వరం ఏమైనా ఉందా” అని అమ్మ దగ్గరకొచ్చి నుదిటి మీద చేయి ఆంచింది.

సస్య అమ్మ చేతిని గబుక్కున పట్టేసుకొని “అమ్మా కాసేపు ఇలా వుంచు” అని చెప్పింది.

అమ్మ నవ్వి మెల్లగా సస్య నుదుటిని ఆ చివర నుండి ఈ చివర వరకు వత్తింది.

“ఆహ ఎంత బాగుందమ్మా, అమ్మ అంటే అమ్మే. ఎంత వెచ్చగా ఉందో ” అని సస్య సగం తెరిచిన కళ్ళతో చెప్తోంది.

“ఆగు నూనె తెస్తాను” అని కొద్దిగా నూనె వేడిచేసుకొని తెచ్చి రాసి, “తైల సంస్కారం చేయకపోతే ఇలాగే  వొస్తాయి నొప్పులు” అని తిడుతోంది.

“నువ్వు ఇలా తైల్ మాలిష్ చేస్తూ ఎన్ని తిట్టినా నాకు ఒకే నే అమ్మా” అంటూ ఎదో మైకంలో జారుకుంది సస్య.

 

“ఎటన్షన్ ప్లీజ్, ఫ్లైట్ నెంబర్ ….” అంటూ వచ్చిన బోర్డింగ్ అనౌన్స్మెంట్ కి ఉలిక్కిపడి ఆలోచనల నుండి వర్తమానంలోకి వచ్చింది సస్య. ఏంటో ఇవాళ ఇన్ని జ్ఞాపకాలు నన్ను నిద్రలేపుతున్నాయి అనుకుంటూ, లైన్ లో నించుని తన భర్త కి కాల్ చేసింది.

 

“హలో వైరవ్, బోర్డింగ్ స్టార్ట్ అయింది” సస్య చెప్పింది.

“ఓహ్ కూల్ బేబీ, అమ్మమ్మ ఇప్పుడు ఒకే కదా?”

“యా యా, ఒక వారం లో మళ్ళీ మామూలు గా అయిపోతుంది చూస్తూండు. ఎంత ఖంగారు పెట్టేసిందో అందరినీ ఒక వారం రోజుల పాటు. బట్ ఇప్పుడు అంతా ఫైన్”

“గుడ్.  లాండ్ అయ్యాక వెంటనే కాల్ చెయ్యి. హాయిగా పడుకో ఫ్లైట్ లో”

“ఓకే”

 

ఫ్లైట్ టేక్ ఆఫ్ అయింది. సస్య ఇందాక తన భర్త వైరవ్ తో మాట్లాడిన మాటలు గుర్తు చేసుకుంది. నిజంగానే అమ్మమ్మ ఎంత ఖంగారు పెట్టేసింది అందరినీ !

 

సరిగ్గా పది రోజుల క్రితం అమ్మ తో స్కైప్ చేస్తున్నపుడు చెప్పింది అమ్మమ్మ కి వొంట్లో బాగోలేదని, హాస్పిటల్ లో చేర్చారని. అప్పటి నుండి సస్య మనసు మనసులో లేదు. ఒక్కసారి అమ్మమ్మ ని చూడాలి అని అనిపించింది. కానీ అప్పటికప్పుడు ఇండియా కి టికెట్ దొరకడం చాలా కష్టము. పైగా టికెట్ రేట్ లు డబుల్ ఉంటాయి. అయినా సరే అవేమి పట్టించుకోవద్దని, వెళ్లాలని ఉంటే  చెప్పమని వైరవ్ చాలా సపోర్ట్ చేసాడు. వైరవ్ లాంటి భర్త దొరకడం వల్ల తాను చాలా లక్కీ అని సస్య ఆనందించింది. వైరవ్ మోరల్ సపోర్ట్ తో, అమెరికా లో నే ఉండే తన చిన్నత్తయ్య టికెట్ బుక్ చేయడంతో ఎలాగో అలా ఇండియా కి బయలుదేరి హైదరాబాద్ చేరుకుంది. చేరుకున్నప్పటినుండి ఎపుడెపుడు అమ్మమ్మ ని చూస్తానా అని తహ తహలాడింది.

 

దిగిన రోజున పొద్దునే హాస్పిటల్ కి వెళ్ళింది. అప్పటికి అమ్మమ్మ ఇంకా సీరియస్ గానే ఉంది, ఐసీయూ లో. కానీ అవేమీ ఆలోచించకుండా, ఒక చిన్న నవ్వు మొహం వేసుకొని అమ్మమ్మ బుగ్గ ని నిమిరింది. అమ్మమ్మ ఏదో మూలిగింది, మళ్ళీ వెంటనే నిద్రలోకి జారుకుంది. సస్య కాసేపు అలా అమ్మమ్మ బుగ్గని తాకుతూనే ఉంది. ఆ స్పర్శ చిరస్మరణీయం. తరువాత అయిదు రోజులు హాస్పిటల్ కి వెళ్లడం, అమ్మమ్మ ని చూడటం తో సాగిపోయింది. అమ్మమ్మ కోలుకుంటోంది అని డాక్టర్స్ చెప్పారు. కానీ అమ్మమ్మ ఇంకా మాట్లాడట్లేదు.

 

అయిదవ రోజున అమ్మమ్మ చెయ్యి పట్టుకొని, “ఇంక చాలు లేవాలి. నీ సీరియల్స్ చూడాలి. అన్ని మిస్ అయిపోతున్నావు” అని సస్య అంది. చుట్టూ ఉన్న నర్సులు నవ్వుతున్నారు.

అమ్మమ్మ మూలిగింది.

“ఏంటి? అమ్మమ్మ ఏమంటున్నావు?” సస్య కొద్దిగా గట్టిగానే అడిగింది.

“నాకు.....  ఇక్కడ........  కాఫీ ఇచ్చారు ఇందాక. నచ్చలేదు. ........ మంచి కాఫీ ......... తాగాలి” అని నెమ్మదిగా, మాట కి మాట కి మజ్జన చాలా గాప్ తో కష్టపడి చెప్పింది.

అప్పుడు సస్య కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఆనందం తో ఊపిరి పీల్చుకుంది. అమ్మమ్మ ఐస్ బాక్ అనుకుంది. ఆ మరునాడే అమ్మమ్మ ని డిశార్జి చేశారు. ఇంకో రెండు రోజులు ఇండియా లో ఉండి , తిరుగు ప్రయాణం పట్టింది సస్య.

 

తనకి ఊహ తెలియని వయస్సులో మామయ్య కూతురి చిట్టి పాదాల స్పర్శ, తనకి ఊహ తెలిసాక అమ్మ చేతి మృదువు స్పర్శ అండ్ తనకి ఎంతో ఇష్టమయిన అమ్మమ్మ లేత బుగ్గ స్పర్శ - ఈ మూడు తరాల వారి స్పర్శలు  తనకి ఒక స్వచ్ఛమైన భావాన్ని కలిగించాయి. ఆ స్పర్శ క్షణికమయినా కూడా, ఆ టచ్ యొక్క మెమరీ మాత్రం శాశ్వతం.

 

ఇవన్నీ ఆలోచిస్తూ సస్య మొహం మీద ఒక చిరునవ్వు వచ్చింది. హెడ్ ఫోన్స్ పెట్టుకొని, సీట్ వెనక్కి ఆన్చుకొని,  స్లీప్ మ్యూజిక్ వింటూ హాయిగా నిద్రలోకి జారుకుంది.

OOO

bottom of page