bhuvanollasam.PNG

సంపుటి  6   సంచిక  3

Website Published &  Maintained by  Srinivas Pendyala | Mobile version is under construction. Use big screen for better experience.

కథా​ మధురాలు

శాంత

 

గిరిజా హరి కరణం

girija hari.PNG

సరయూనదీతీరాన వున్న కోసలదేశాన్ని అనాదిగా ఇక్ష్వాకు వంశీయులు పాలిస్తూ వున్నరోజులవి.

 

కోసల రాజధాని అయోధ్యను మనువు నిర్మించాడు.”అయోధ్య “అంటేనే యితరులెవ్వరికీ జయించుటకు  సాధ్యము కానిదని.

 

త్రేతాయుగం లో కోసల దేశపు చక్రవర్తి దశరథునికి పుత్రసంతతి కలుగలేదు. వారసులు లేకున్న రాజ్యము పరహస్తగతమై ఇక్ష్వాకు వంశపతనం జరుగుతుందని రాజు చాలా విచారముతో వున్నారు. పురోహితులైన వశిష్ఠ, వామదేవాదులతో తన దిగులు తెలుపగా వారు, సర్వశ్రేష్టమైన అశ్వమేధ యాగము చేయమని సూచించారు.

 

వారి సలహాకు రాజు సంతోషించి సుమంతుడు మొదలైన మంత్రులను పిలిచి అశ్వమేధ యాగమునకు ఏర్పాట్లు చేయమని ఆదేశించారు. భార్యలతో కలిసి రాజు యజ్ఞ  దీక్షను తీసుకున్నారు. వేదపారంగతులైన సుయగ్నుడు, వామదేవుడు, కాశ్యపుడు, వశిష్టుడు, జాబాలి పూనుకుని యజ్ఞమునకు  కావలసిన ఏర్పాట్లు చేస్తున్నారు.

 

నలుగురు ఋత్విజులు ముందు నడచుచుండగా నాలుగువందల మంది యోధుల రక్షణ లో యజ్ఞాశ్వమును ను విడిచినారు, సంవత్సరము గడిచింది.

     

యాగ స్థలమును నిర్ణయించి, దున్ని చదును చేసి కస్తూరిక లిపిన కలాపులు జల్లి ముత్యాల ముగ్గులు తీర్చారు, రంగవల్లుల నడుమ తామరలు, కలువపూలు అలంకరించారు. మామిడాకుతోరణాలు, చేమంతి మాలలు, మొగలిరేకులతోబాటు ముత్యాలసరాలు, బంగారు జలతారు పట్టుకుచ్చులతోనూ అలంకరించారు. గెలలువేసిన అరటి చెట్లు స్థంభాలకు కట్టారు. అరటి, మామిడి, పనస మొదలైన అనేక రకాల పండ్లు బండ్లతో వచ్చాయి.  

 

నేతపని వారు స్వర్ణకారులు అహోరాత్రులు శ్రమిస్తున్నారు. ఆకాశమంత పందిరి, భూదేవంత అరుగు అను నానుడికి సరితూగుతోంది అచటి వాతావరణం. ఆహ్వానములందుకున్న రాజులు ముగ్గురు రాణుల పుట్టిళ్ళవారు ఇతర బంధుజనులూ, ధార్మికులైన రాజ్య జనులందరూ వచ్చారు. పురోహితులు ప్రధాన ఋత్విజునిగ మహాతపశ్శాలియైన ఋష్య శృంగుని నిర్ణయించినందు వల్ల, మహారాజు స్వయముగా వెళ్ళి దంపతులైన ఋష్యశృంగ మహర్షి, శాంతలను సగౌరవంగా ఆహ్వానించి తీసుకునివచ్చారు.

            

**

 

వసంత ఋతువు, చైత్ర శుద్ధ పూర్ణిమ.

తూర్పుదిశన ఉషాబాల నాట్యమాడుతున్నది. ఆమె సింధూర వర్ణపు పరికిణీ   కుచ్చెళ్ళు కదలి దివి మనోహరంగా అలరారుతోంది. ఉదయభానుడు ఆ సుందరి నాట్యాన్ని చాటునుండి చూసి ఆనందిస్తున్నాడా అన్నట్టుగా ప్రకృతి మనోహరంగా వుంది.

 

 ఇంకొంత సేపటిలో అశ్వమేధ యాగం మొదలవబోతూంది.                         

 

యజ్ఞశాల ముందు పట్టపు రాణి, పరివారజనులతో కలిసి వేచియున్నారు దశరధ మహారాజుగారు.

ఆ మసకవెలుతురులో దూరంగా కలకలమని శబ్దం. ప్రధాన రిత్విజుడైన ఋష్య శృంగమహర్షి ముందు నడుస్తుండగా ఒకడుగు వెనుకగా శాంత అనుసరిస్తూంది.

 

వేదం పలుకుతూ వస్తున్నపండితులు నడచివస్తున్న హిమవత్పర్వత శిఖరములా అన్నట్లున్నారు. మహారాజు వారందరికీ ప్రణామములర్పించి స్వాగ తం పలికారు. శంఖ దుందుభి, మంగళవాద్యములూ మ్రోగినవి.

  

యజ్ఞశాలముందు ఒక్క నిమిషం నిలబడి తల్లిదండ్రులైన దశరధుడు, కౌసల్య లను సమీపించి నమస్కరించింది శాంత. తన తొలిచూలు బిడ్డ, ముద్దుల తనయ, ప్రతిష్టాకరమైన కోసల సామ్రాజ్యపు యువరాణి శాంతాదేవి, జటాఝూటము, నారచీరలు ధరించి తనముందు నిలువగా చూచిన తల్లి కౌసల్య హృదయం ద్రవించి, కన్నీరుబికి వచ్చింది. ప్రక్కనేవున్న సుమిత్ర హెచ్చరింపుతో వులిక్కిపడి కన్నీరు కళ్ళయందే ఇంకించ ప్రయత్నించిందామె. కన్నతల్లిని తొలిసారిగా చూచిన శాంత శరీరం పులకరించింది, తల్లి ఎదపై వాలి తనివితీరా ఏడవాలని ఆమె మనసు బలంగా కోరింది. అంతలోనే సంభాళించుకుని. ధీర గంభీరయై కళ్ళతోనే తల్లిని ఓదార్చి, అందరినీ దాటి త్వరత్వరగా ముందుకు వెళ్ళి యజ్ఞ సంభారములుంచిన చోట నిలబడి, యజ్ఞసమిధలూ, యూపపాత్రలని శ్రేష్ట మైన ఆవునేయితో నింపి వాసినకట్టిన కుండలూ ఇంకా వివిధములైన వస్తువులనూ పర్యవేక్షించి ఇంకా ఏమేమి అవసరమో అచటనున్నవారికి సూచనలిచ్చింది శాంత. అశ్వమేధయాగం మొదలైంది. యజ్ఞ కుండమునుండి నాల్కలు చాపుతూ తన ప్రతాపం చూపుతున్న హుతవహుడు నిలువెత్తు అగ్నిశిఖలా వున్న ఋష్య శ్రుంగుని చూచి కాస్తంత తగ్గుతున్నాడు.

      

వేదం ఘోషించింది, ఆకాశం హర్షించింది. నల్లనిమేఘాలు యాగశాలకు ఛత్రం పట్టాయి. దేవతలు తమ విమానాలపై ఆకాశమున వుండి పూలవాన కురిపించారు ఆశీర్వదించారు. అచటివారందరూ హర్షం ప్రకటించారు, పట్టపురాణి కౌసల్య మాత్రం తనకళ్ళను శాంత పైనుండి మరల్చలేకున్నది.

 

 అన్యమనస్కంగా వున్న భార్యను రెండు, మూడుసార్లు హెచ్చరించారు మహారాజు.

కౌసల్య మనసు చిత్రవధకు గురవుతున్నది, పరిచారికలు సేవించుచూ పట్టు పరుపులపైన నడిపించుచుండగా, తేనెలుగారు మోముతో, వెన్నెల వెలుగుల శరీరంతో వజ్ర వైడూర్యపు ఆభరణాలతో పట్టు, పీతాంబరాలు ధరించి యజ్ఞ శాలయందు సముచిత ఆసనమలంకరించి రాజసమొలకబోయవలసిన తన ముద్దులపట్టి దీనవదనయై శుష్కించిన దేహంతో నారచీరలు గట్టి జటాఝూటముతో మునిపత్నిగా తన ఎదుట తిరుగుచుండగా మహారాణి మనసు ఆజ్యం పోసిన అగ్నిగుండంలా మండుతోంది. ఆమె మనసు అప్రమేయంగా గతాన్ని స్పృషించింది.

         

               **

 

ప్రసూతి గృహం. మహారాణి కౌసల్యా దేవి ప్రసవవేదన పడుతున్నది, మంత్రసానులు, దాసీజనం హడావిడిగా తిరుగుతున్నారు, రాజుగారు కొంతదూరంలో జ్యోతిష్కులతో కలిసి వేచివున్నారు.

ఆయన పుత్రోదయవార్తకై నిరీక్షిస్తున్నారు, శీర్షోదయపు ఘడియలు లెక్కించి జాతక చక్రము వేయుటకై సిద్ధముగా వున్నారు పురోహితులు.

 మహారాణి పుట్టింటి దాది తెర తొలగించి, బయటికి వచ్చి పుత్రికాజననమైందని రాజుగారితో చెప్పింది.

 

ఆ మాటవినగానే రాజు ఆసనము నుండి లేచారు. ముందుకొక్క అడుగువేసి అంతలోనే వెనుదిరిగి తన మందిరం వైపు వెళ్ళిపోయారు.

 

దాది మాట వినగానే తర్జన భర్జనలు మొదలు పెట్టిన జ్యోతిష్కులు విస్తుపోయారు. రాజుగారి ప్రవర్తన అంతుపట్టక దాది లోనికి వెళ్ళి రాణికి వార్తనందించింది.

కౌసల్య కంట నీరు జలజల రాలింది.

“పురిటినొప్పులతో గాసిపడిన పచ్చిబాలెంతరాలిని ఓదార్చి, తల్లికడుపులోని చలువ చెమ్మలారని పసికూనను స్పర్షించి మురిసిపోయే తండ్రికంటె అదృష్టవంతులెవరు?  ఇదేమి చోద్యం తల్లీ? కన్నెత్తి చూడనైనా లేదు, పన్నెత్తి పలుకరించనైనాలేదు?” అటూ, ఇటూ తిరుగుతూ

దాసీలకు పనులు పురమాయిస్తూనే గొణుగుతోంది దాయమ్మ .

        

“ష్! వూరుకో దాసీలు వినగలరు.” వారించింది కౌసల్య. ఆడబిడ్డ పుట్టిందని భర్త చూపిన నిరాదరణకు చింతిస్తూ

 

పొత్తిళ్ళలోని బిడ్డను దగ్గరకు తీసుకుని పొగిలి పొగిలి ఏడ్చిందామె.

 

***

 

ప్రతిష్టాకరమైన సూర్య వంశమున రాజ్యపాలనకు వారసులుగా పుత్రులు పుట్టలేదేమని అతడి వేదన.  అయోధ్యా పతీ, సర్వం సహా చక్రవర్తీ ఐన దశరథ మహారాజు కడుపున తొలిచూలుగా ఆడబిడ్డ జన్మించడం ఆయన తలతీసినంత అవమానముగా భావిస్తున్నాడు. 

 

రాజు తన మందిరం విడిచి బయటకు రావటంలేదు. సభకు రాకపోవటం వలన ఎక్కడి రాచకార్యాలక్కడే నిలిచి పోయాయి. మంత్రులు సమావేశమై చర్చించుకుని ఒక నిర్ణయానికొచ్చారు. రాజుగారి అనుమతితో అంగరాజ్యమునకు వర్తమానం పంపారు.

 

అంగరాజైన రోమపాదుడు దశరథుని బంధువు, ఆప్తమిత్రుడు కూడా. వార్త అందగానే ఆయన తన రాణితో కలిసి అయోధ్యకు వచ్చాడు. మిత్రునితో కొన్నాళ్ళు గడిపి ఆయన మనసు శాంత పరిచాడు. ఒకనాడు రోమపాదుడు రాజుతో “మహారాజా! మీరు వేరు విధముగా తలవకున్నచో నాదొక ఆలోచన!" అన్నాడు.

 

అందుకు దశరథుడు "మిత్రమా ! నా మనసులోని ఆవేదననంతయూ మీకు తెలిపితిని, మీ ఆలోచన ఏమిటో నిస్సందేహముగా చెప్పండి!”అంటూ మిత్రుని చేయందుకున్నారు.

 

“మీ విచారము నాకు చాల బాధ కలిగించుచున్నది. పుత్రుడు జన్మించలేదను బాధ మీరు భరించలేకున్నారు, పుత్రికాజననము గురించిన వార్త దేశాంతరములకు ప్రాకినచో సామ్రాజ్యమున అల్లకల్లోలములు సృష్టించబడునను చింత మిమ్ము క్రుంగదీయుచున్నది. రాజా! ఈ విషయమై నేను బాగా ఆలోచించాను, నా మనసుకు తట్టినది మీ ముందుంచుచున్నాను, నాది తప్పైనచో మన్నింపుడు. ఇది నేను మీకిచ్చు సూచన మాత్రమే!”

 

"నిస్సందేహంగా “అంటూ రాజు అనుమతివ్వగానే రోమపాదుడు "మిత్రమా మేము ఇచటికి వచ్చిన నాటి నుండీ నా దేవేరి, మహారాణిగారి మందిరమును వదలి వచ్చుటలేదు. వారిరువురునూ కలిసి చిన్నారి యువరాణి ముద్దు ముచ్చట్లతో కాలము గడుపుతూ సంతోషమున తేలియాడుచున్నారు. మేము మా రాజ్యమునకు తిరిగి వెళ్ళవలసిన సమయము దగ్గరకొచ్చినది కానీ నా భార్య ఇంకొంత కాలము చిన్న పాపతో గడపవలెనని కోరుతున్నది. మాకు సంతానము లేని విషయము మీకు తెలిసినదే. మీరు మనస్పూర్తిగా సమ్మతించినచో మీ బిడ్డను మేము కన్నబిడ్డవలె పెంచగలము.

మీకు పుత్రిక జన్మించినదను వార్త ఇతరదేశములకు వ్యాపించక మునుపే బిడ్డను మాకప్పగించినచో భగవత్ప్రసాదముగా భావించగలము.“ అని రోమపాదుడనగా. కన్నులనీరు నిండగా దశరధుడు మిత్రుని ఆలింగనము చేసుకొని,”జన్మ జన్మలకూ మీ ఋణము తీర్చుకోలేను. నన్ను, నారాజ్యమును కాపాడినవారైతిరి!“ అన్నాడు.

 

**

 

దత్త స్వీకారము పూర్తయింది. అంగరాజు దంపతులు బిడ్డతో తమ రాజ్యమునకు వెళ్ళుటకై ఏర్పాట్లు జరుగుతున్నవి.

 

కౌసల్య తన మందిరమున శోకించుచూ నేలబడియున్నది “అయ్యో ! నా ప్రారబ్దము, ముక్కుపచ్చలారని నాచిన్ని పాపను వదలి నేనెట్లు బ్రతుకగలను, చిన్ని చిన్ని అడుగులతో అందెలరవళితో ముద్దుముద్దు మాటలతో ఈ మందిరమున వెలుగులునింపుతూ తిరుగునని ఎదురుచూచు నాకు యింతటి ఆశాభంగమా? కర్కశపు తల్లి తనను పరాయి పంచలపాలు చేయుచున్నదని తెలియక నా అపరంజి బొమ్మ బోసినవ్వులు నవ్వుచున్నది.

కన్న బిడ్డ ముద్దు ముచ్చట్లకు నోచుకోని నాజీవితమెందుకు?" అంటూ హృదయవిదారకంగా  ఏడ్చుచున్నది.

 

“ఏడవకు తల్లీ! నీ భాగ్యమిట్లున్నది, ఏమి చేతుము. యుద్ధమున రక్తము ఏరులై పారుచుండగా హెచ్చిలి నవ్వెడి కరకు గుండెల మహారాజులకు కనికరము, కన్నపాశములెక్కడుండును. అమ్మా! యేడ్చుచూ బిడ్డను పంపుట శుభకరము కాదు. లేచి బిడ్డను ముద్దాడి, ఆశీర్వదించి పంపు తల్లీ! "ఓదారుస్తున్నది దాయమ్మ.

 

రాణి ఆమెను కౌగలించుకొని "దాయమ్మా! నేను వధువునై అయోధ్యకు వచ్చునపుడు, నా చిన్ననాటి నుండి నన్నుపెంచిన నిన్ను నా తోడుగా పంపినారు. నేనెన్నడూ నిన్ను మాతృ సమానంగా తలచినానెగానీ దాదిగా చూడలేదు. ఇప్పుడు నీవు నా కన్నబిడ్డకు తల్లివి కావలెను. నా చిన్నతల్లికి తోడుగా వెళ్లి ఆమెను అహర్నిశలూ కాపాడవలసిన బాధ్యత నీది.” అని దీనంగా అడిగింది.

 

"ఊరడిల్లు తల్లీ,నీ ఇష్ట ప్రకారమే బిడ్డవెంట వెళ్ళగలను ఆమెను నా కనుపాపవలె కాపాడగలను, కానీ మహారాజుగారు రోమపాదులూ యిందుకు  సమ్మతించవలె గదా?” అన్నది దాయమ్మ.

 

"నాప్రమేయము లేకయే దత్తత జరిగిపోయింది. నా ఈ కనీసపు కోరికనైన మన్నింపనిచో ప్రాణత్యాగము చేసెదనని నీవే రాజుగారితో చెప్పు, నేనిప్పుడాయన ఎదటికి రాలేను” అంటూ రాణి కళ్లెర్రబడి వళ్లంతా వణుకుచుండగా పలికింది.

 

బిడ్డతో వెళ్లుటకు అనుమతి లభించింది దాయమ్మకు. "నీవు తెలిపెడి నా బిడ్డ క్షేమములు వినుట కొరకే బ్రతికెదను, రహస్యచారులను నీవద్దకు

పంపుచుందును, చిన్నితల్లి  జాగ్రత్త“ పదే పదే అవే మాటలంటూ మూర్చిల్లింది రాణి.

పురోహితుడు వశిష్ట మహర్షి ఆమె త్యాగనిరతికి తగినట్లుగా “శాంత” అని నామకరణం చేశారు.

 

ఆ నామకరణ సమయములో దశరథుని మనసు కలత చెందింది. కన్నపేగు కదిలింది. కంటనీరు నిండింది. ఒక్కసారి బిడ్డను తడిమి “శాంతా” అని పలికాడాయన.

 

ఇక్ష్వాకు వంశ ప్రతిష్ట కొరకనుకొనుచు, కోసలరాజ్య క్షేమమనుకొనుచు తల్లడిల్లు తండ్రి మనసుకు శాంతిని కలిగిస్తూ పాలు మరవని శాంత పరాయింటికి బయలుదేరింది.

 

**

చారుల ద్వారా దాయమ్మ తెలిపెడి శాంతాదేవి యోగక్షేమములూ, ముద్దు ముచ్చట్లూ, నెలనెలకూ ఎదుగుతూ ఆమె ఆడే ఆటలూ నేర్చిన మాటలూ మరీ మరీ వింటూ కాలం గడుపుతున్నది రాణి.

తనకు తల్లిగారిచ్చిన ఏడు వారాల నగలూ కరిగించి బంగారుబొమ్మను తయారుచేయించి, చారులు తెలిపెడి శాంత కబుర్లను ఆ బంగారు బొమ్మలో ఊహించుకొని శాంతా అని పిలిచి ముచ్చట్లాడుతూ కాలం గడుపుతున్నది కౌసల్య.

 

అంగదేశమున దాయమ్మ చెప్పెడి తన తల్లి తండ్రుల కబుర్లు వింటూ ఆమె వొడిలో పెరుగుతూంది శాంత.

 

ఆమెకు వూహ తెలిసే వయసొచ్చేసరికి తన జన్మ వృత్తాంతమూ వంశచరిత్రా పూర్తిగా తెలుసుకుందామె.

 

యుక్తవయసువచ్చింది, సునిశితమతియై అన్నివిద్యలలోనూ ఆరితేరింది శాంత. ఏ దేశపు యువరాజో వచ్చి శాంతను వివాహమాడునని అటు కన్నతల్లీ యిటు పెంచిన తల్లితో బాటు దాయమ్మ కూడా కలలు కంటున్నది.

 

ముగ్గురు తల్లుల బంగారు కలలకు స్వస్తిపలుకుతూ విభాండక మునిపుత్రుడూ నాగరిక ప్రపంచమే ఎరుగనివాడు, స్త్రీ లనెరుగని వాడు అడవి, అందుండు మృగములూ పక్షులూ అక్కడ దొరకు పండ్లు కాయలు దుంపలు పువ్వులు తప్ప ఇంక ఏమీ ఎరుగని వనవాసికి భార్య అయింది. అరణ్యమునకు కాపురానికి వెళ్ళింది, ఐనా ఆమె చింతించలేదు తన భర్త చేసిన తపస్సు, కృషి,  కావలసినప్పుడు వర్షములు పడునట్లు చేయగల ప్రతిభ, భూమిని సస్యశ్యామలము గావించి జీవులకాహారమిచ్చి కాపాడు శాస్త్ర పరిశోధన చేసిన ఘనుడు తనకు పతిగా లభించినందుకు పొంగిపోయింది.  అంతటి వరుని తనకు గూర్చిన తండ్రికి కృతజ్ఞతలులు చెప్పింది.

 

 మెట్టినింటి వారందరినీ ఆదరించింది. పెద్దలను గౌరవించింది. భర్తకు తలలో నాలుకవలె మసలింది. సర్వవేళలా అతని అడుగు జాడలలో నడుస్తూ ప్రశాంత జీవనం గడుపుతున్నది. కన్నతండ్రి తనకన్యాయం చేసినాడనీ, పసికందుగా వున్నప్పుడే తల్లినుండి విడదీసి దూరం చేసినాడనీ ఏనాడూ తూలనాడలేదు. మనసులోనైనా  యేనాడయినా అట్లు తలిచినదీ సందేహమే.

        

**

యజ్ఞ వాటిక ముందు కూర్చున్నకౌసల్యకు కళ్ళను శాంతపైనుండి మరల్చుట కష్టముగా వున్నది. యజ్ఞ గుండము నుండి వచ్చు పొగకు కంటినీరు కారుచున్నట్లు సాకు పెట్టి తుడుచుకొంటున్నదామె.

       

అశ్వమేధము పరిసమాప్తమైనది. తరువాత "పుత్రకామేష్టి “అను ఒక యిష్టిని ఋష్యశృంగ మహర్షి దశరధమహారాజు చేత చేయించెను. దేవతలు సంతుష్టులైనారు.

 

ఒక దివ్యపురుషుడు ప్రత్యక్షమై "దివ్యపాయసము"ను మహారాజుకు యివ్వగా ఆయన ఆ పాయసమును తన ముగ్గురు భార్యలకూ పంచెను.

     

యాగనిర్వహణమున అలసిన భర్త నుదుటి చెమటలు తుడిచి,  తన తండ్రి వ్యాకులత తీర్చు కార్యమును ఫలవంతముగా నెరవేర్చిన పతిదేవుని కరుణ నిండిన చూపులతో సేద తీర్చింది శాంత!

  

     రాజరాజేశ్వరి!  రామ సహోదరి!!

 

*****

 

రచయిత మాటల్లో కథ నేపథ్యం:   సహనము, త్యాగము, తల్లి తండ్రి గురువుల ఎడ అపారమైన గౌరవ మర్యాదలు, సోదరులపై ఎనలేని ప్రేమ, బంధు జనులపై అభిమానము, ప్రజలయందు వాత్సల్యము. జీవకారుణ్యము కలిగి నీతినియమములు సకల ధర్మములూ తాను ముందు పాటించి, ముందుతరాలకు తరగని నిధులుగా అందించి ఏకపత్నీ వ్రతుడూ, మర్యాదాపురుషొ త్తముడైనిలిచి, యుగములు గడిచినా భగవత్స్వరూపుడుగా పూజింప బడుచున్నాడు శ్రీ రామచంద్ర ప్రభువు. ఆ రఘువీరుని సుగుణములు అతనికంటె ముందుగా కౌసల్య గర్భమున జన్మించినవా అన్నట్లు శాంత సుగుణాలరాశిగా, కోసలరామునికి అక్కగా జన్మించింది.  శ్రీమద్రామాయణమున, ఆదికవి వాల్మీకిమహర్షి శాంత గురించి ఎక్కువగా చెప్పకయే ఆమె వ్యక్తిత్వమును, సుగుణములను అన్యాపదేశముగనే తెలిపారు.కన్నతండ్రయిన దశరధుడు తనను పసికందుగావున్నప్పుడే తల్లినుండిదూరంచేసి పరాయివారికప్పగించినాడని తెలిసి కూడా కోపగించుకొనక, మహారాజు అశ్వమేధమును నిర్వహించమని స్వయముగావచ్చి ఋష్య శృంగుని  పిలవగానే, పుట్టినింటి సౌభాగ్యముకోరి భర్తతో కలిసి వెళ్ళి తండ్రికార్యము నెరవేర్చినది శాంత. ఆమెను పెంచిన తండ్రి రోమపాదుడు. ఆయన తన స్వార్దమునకై శాంతను ఋష్య శృంగునకిచ్చి వివాహము చేయగా, పెంచిన తండ్రి నిర్ణయము తలదాల్చి అతనితో అడవికివెళ్ళి మునిపత్నియై కాపురం చేసింది ఇటువంటి కొన్ని సంఘటనలను బట్టి నేనూహించుకున్న శాంతకథ. నేను చదివిన కొన్ని రామాయణ కథలు, జానపద పాటలూ,చూసిన పాతసినిమాల వలన నేను శాంతని దశరధుని కుమార్తెగా భావించి యిలా రాశాను.