top of page
adannamaata.png

సంపుటి  5   సంచిక  3

Website Published &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

వ్యాస​ మధురాలు

ప్రాచీన భారతీయ వాఙ్మయానికి చారిత్రక స్పృహ తక్కువా

Madhuravani_Social

కర్లపాలెం హనుమంతరావు

మన ప్రాచీన భారతీయ వాఙ్మయానికి చారిత్రక స్పృహ తక్కువని పాశ్చాత్య విమర్శకుల పంథాలోనే  ఆధునిక సాహిత్య పరిశోధకులూ విమర్శిస్తున్నారు. ఆ  అభియోగంలో నిజమెంత?

గ్రీకులు తమ కావ్యాల(ఎపిక్స్)లో సాహిత్యంతో సరిసమానంగా చరిత్రకూ ప్రాధాన్యత కల్పించారు.  చరిత్ర అంటే పాశ్చాత్యుల దృష్టిలో రాజులు, రాణులు, వారి  వంశ చరిత్రలు, వ్యక్తిగత వివరాలు, రాజ్యాల కోసం  చేసిన యుద్ధాలు, వాటి జయాపజయాలు, సమకాలీన  రాజకీయ, సామాజికాది పరిస్థితులు ఉన్నవి ఉన్నట్లుగా తారీఖులు, దస్తావేజులతో సహా ఉట్టంకించడం! ఆ కోణంలో చూస్తే నేటి విమర్శకుల నిందలో కొంత నిజం లేకపోలేదు. 

మన ప్రాచీనుల చారిత్రక దృష్టి పాశ్చాత్యుల దృక్కోణంతో పోలిస్తే కొంత భిన్నంగా ఉంటుంది. మన వాఙ్మయకారులకు సృజన ప్రదాన లక్ష్యం ధర్మం, సత్యం, నీతి, శీలం వంటి ఉదాత్త మానవీయ విలువలను ప్రతిబింబించడం! ప్రాచీన వివేచనపరులు కావ్యనిర్మాణ సమయంలో అందుకే కావాలనే అపభ్రంశ చారిత్రకాంశాలను పక్కనపెట్టేవారు.  కుళ్లు, కుతంత్రాలు, కుత్సితం, దిగజారుడుతనం వంటి ప్రతికూల అంశాలకు  అధిక స్పందన  లభిస్తుంది  ఏ కాలంలో అయినా సమాజంలో. సమాజం మీద దుష్ప్రభావం చూపించే   చరిత్రను యథాతథంగా చిత్రీకరించేటందుకు మనకు భారతీయ విశిష్ట విలువల ప్రాధాన్యత ప్రధానమైన అడ్డంకిగా ఉండేది గతంలో.

 

అంత మాత్రాన మన వాఙ్మయంలో చరిత్రకు అసలు స్థానం కల్పించనేలేదనడం కూడా సబబు కాదు.  

వేదార్థాలకు  ఐతిహాసిక దృష్టితో వ్యాఖ్యానాలు  వచ్చిన  మన సంప్రదాయం మర్చిపోకూడదు. అభిప్రాయాలను చెప్పేటప్పుడు  నిరుక్తకారుడు యాస్కుడు 'ఇతి ఇతిహాసికాః' అని ముక్తాయించేవాడు. ప్రాచీనాచార్యులు పురాణాలలో చెప్పిన కథలను ప్రస్తావించే సందర్భంలో 'ఇతి ఇతిహాస సూచ్యతే'  అనడమూ గమనీయం.  కాకపోతే ప్రాచీన  కావ్యకర్తలు వాఙ్మయం సృష్టించే సందర్భాలలో చారిత్రకాంశాలు వారి విశేష కావ్యప్రజ్ఞల వెనుక  మరుగు పడుండేవి. 

 

గ్రీకు, జర్మనీ, లాటిన్ భాషలలో మాదిరి మనకు ప్రత్యేకమైన చారిత్రక వాఙ్మయం తక్కువన్న మాట నిజమే! కానీ మన వేదాలు, బ్రాహ్మణాలు, పురాణాలు, రామాయణ భారతాదులలో చారిత్రకాంశాలు విస్తృతంగా నిక్షిప్తమయి ఉన్నాయి. బౌద్ధ, జైన వాఙ్మయంలో అయితే అపారమైన చరిత్ర  మరుగున పడివుంది. 

పురాణాలు శ్రుతివాఙ్మయం కావడం వల్ల ఒకరి నుంచి ఒకరికి అందే క్రమంలో  చారిత్రిక వివరాలు  పరస్పర విరుద్ధంగా వినవచ్చేవి. ఆ కారణంగా పురాణేతిహాసాలు వక్కాణించే విషయాలకు అసలు విలువే ఇవ్వనవసరం లేదనడం సబబు కాదు. 

 

పురాణేతిహాసాలను పంచమ వేదాలుగా పేర్కొన్నాడు నారద మహర్షి.  ‘వేదార్థాలు అవగాహన కావాలంటే  పురాణేతిహాసాల  అధ్యయనం అవసరమ’న్నాడు కౌటిల్యుడు అర్థశాస్త్రంలో. రుషులు, జ్ఞానులూ ఇంతలా వత్తిచెప్పినా మన ప్రాచీన కావ్యాల చారిత్రకాంశాల పాలు మీద ఇప్పటికీ పలు సందేహాలు మిగులుండటానికి కారణాలు లేకపోలేదు.   

     

ఆశ్రిత కవులు తమ తమ పోషకుల చరిత్రలను కావ్య వస్తువుగా స్వీకరించిన సందర్భాలలో వారి  ప్రాభవానికి విరుద్ధంగా వెళ్లే  చారిత్రక సత్యాలను ప్రస్తావించేటందుకు  ఇష్టపడేవారు కాదు. చాలా సందర్భాలలో కృతిభర్త మెప్పు కోసం చరిత్రను వక్రీకరించడమో, వాస్తవానికి విరుద్ధంగా ఉన్నప్పటికీ  అతిశయోక్తులతో నింపడమో సర్వసాధారణంగా జరుగుతుండే మెహర్బానీ చర్య. అప్రధానమైన వ్యక్తులను గూర్చి కావ్యాలు వల్లించే సమయాల్లోనూ, వ్యక్తి ప్రముఖుడే అయినా అతని జీవితంలోని అప్రధాన అంశాలకు ప్రాముఖ్యత పెంచి రాయవలసిన సందర్భాలలోనూ కావ్యాలలో చారిత్రక అంశాల మెరుపులు మసకబారేవి. అన్నిటికన్న ప్రధాన కారణం కవి కావ్య రచనకు శ్రీకారం చుట్టీ చుట్టగానే తన సృజనా పాటవాన్ని బహుముఖీనంగా ప్రకటించుకోవాలనుకునే  ఉత్సుకత ముప్పిరిగొనడం! కావ్యాలంకారాలు, ఛందోబంధాలు, భాషావిన్యాసాలు, చిత్రకవిత్వాలు వంటి ఎన్నో చమత్కారాలు ప్రదర్శించే అత్యుత్సాహంలో ముఖ్యమైన చారిత్రకాంశాల ప్రస్తావన సైతం  మరుగున పడటమో, అరకొరగా సాగడమో, అర్థాంతరంగా ముగియడమో, వక్రీకరణ పాలబడటమో  జరుగుతుండేది.  అభ్యుదయం, విజయం, పరిణయం వంటి పదాలు శీర్షికలలో కనిపించే కావ్యాలలో సాధారణంగా చారిత్రకాంశాల వెదుకులాట  'గడ్డివాములో సూది' సామెతే! బిల్హణుడి 'విక్రమదేవచరిత్ర'  ఇందుకు ఒక ఉదాహరణ.

 

ఇన్ని పరిమితుల మధ్యా మన ప్రాచీన సాహిత్యంలో చారిత్రకాంశాలకు ప్రాముఖ్యత కల్పించిన పురాణాలు, కావ్యాలు కొన్ని రాకపోలేదు.  అలంకార శాస్త్రాలు రచించిన విద్యానాథుడు తానాశ్రయించిన రాజు  కీర్తి ప్రతిష్టలను, చరిత్రను లక్ష్యపద్యాలుగా ప్రతాప రుద్రీయం, యశోభూషణాలలో చొప్పించాడు.  'లలితవిస్తారం' అనే ధార్మిక గ్రంథం నుంచి స్వీకరించిన  అంశాన్ని కాళిదాసు తరహాలో రఘువంశ నిర్మాణ శైలిలో రాసినా  అశ్వఘోషుడు 'బుద్ధ చరిత్ర'లో విలువైన  చారిత్రక అంశాలను సందర్భశుద్ధిగా అందించాడు. స్వచ్చమైన కావ్యశైలిలో రచించినప్పటికీ కల్హణుడి  రాజతరంగిణి మోస్తరు అచ్చమైన చారిత్రిక అంశాలను చర్చించిన గ్రంథాలు మన ప్రాచీన సాహిత్యంలోనూ లేకపోలేదు.  గంగాదేవి  తన భర్త విజయనగర సామ్ర్రాజ్య యువరాజు కంపనరాయుడు మధురపై సాధించిన విజయం కావ్యవస్తువుగా స్వీకరించి 'మధుర విజయం'  రచిస్తూనే ఆనాటి విజయనగర సామ్రాజ్య వాస్తవ పరిస్థితులను సమయానుకూలంగా విశదీకరిండంలో శ్రద్ధ చూపించింది. బాణుడి 'హర్షచరిత్ర'కావ్యంలో విస్తారమైన చారిత్రక సమాచారం  మసకలో ఉండేది.

వాసుదేవశరణ్ అగ్రవాల్ పూనుకొని 'హర్ష చరిత్- ఏక్ సాంస్కృతిక్ అధ్యయన్' పేరుతో  వ్యాఖ్యానంగా   వెలికితీయకపోయుంటే హర్షుని కాలంనాటి ఎంతో విలువైన రాజకీయ, సామాజిక సమాచారం అంధకారంలోనే అణిగిపోయేది. జైన, బౌద్ధ సాహిత్యాలలో హిందువుల ఆరాధ్య పాత్రల పవిత్రతను గురించి, వారికి సంబంధించిన సంఘటనల ప్రామాణికతను గురించి  కక్షగట్టినట్లు  కావాలని వక్రీకరించి రాసిన  సందర్భాలే అధికమని  హిందువుల అభియోగం. నిరాధారమైన నిందలుగా వాటిని కొట్టిపారేయలేము. కానీ ఆ కారణంగా  వాటిలో నిక్షిప్తమై ఉన్న విలువైన  చరిత్ర నిర్లక్ష్యానికి గురికావడమూ భావ్యం కాదు కదా! 

 

ఆర్.పి. మజుందార్, రాధాకుముద్ ముఖర్జీ వంటి ఆధునిక సాహిత్య పరిశోధకులు ఇప్పుడు ఈ తరహా  వాఙ్మయంలోని చారిత్రకాంశాలను  ‘సీరియస్ ‘ గా తీసుకుని పరిశోధనలు సాగిస్తున్నారు. కొంతలో కొంత మేలే!

 

భారతీయ వాఙ్మయం కేవలం వేదాలు, పురాణేతిహాసాలు, కావ్యాలు, ప్రబంధాల రూపాలలోనే లేదు. అలంకార, అర్థ శాస్త్రాదులు, ఆఖ్యాయికలు, వ్యాకరణాలు వంటి విభాగాలలో  సైతం  చారిత్రక అంశాలు నిక్షిప్తంగా పొందుపరచి ఉన్నాయి. బిల్హణుడి ‘విక్రమదేవచరిత్ర’ వంటి కొన్ని కావ్యాలు చరిత్ర ప్రధానమైన కావ్యాలని శీర్షికలని బట్టి సూచితమయివుండీ  చరిత్రకు ప్రాముఖ్యత ఇచ్చివుండకపోవచ్చు. కానీ ఇతివృత్తంతో నిమిత్తం లేకుండా సందర్భశుద్ధిగా నిర్దిష్ట  చరిత్రను నమోదు చేసిన  కావ్య సంపదకూ భారతీయ వాఙ్మయం తరుగు పోలేదు. 

 

సూక్ష్మాంశాలను సైతం పరిశీలించి నిర్ధారించుకొనే ఆధునిక పరికరాలు, పరిజ్ఞానం పుష్కలంగా  అభివృద్ధి చెందిన అధునాతన కాలం ఇది.  సమాచార సేకరణ, క్రోడీకరణ, సత్య నిర్ధారణ ఏమంత క్లిష్టం కాని కాలంలో అభిజ్ఞులు అభియోగాల వరకే పరిమితం కావడం సమంజసంగా లేదు. కేవలం కొన్ని  కావ్య ప్రక్రియలను మాత్రమే పరిగణకు తీసుకొని చరిత్ర మీద దృష్టి తక్కువన్న అపవాదు మోపడం ధర్మం కాదు. 

 

ఇతిహాసాల నుంచే వస్తువులు స్వీకరించి  కావ్యశైలి అనుసారం కావ్యాలు సాగించినప్పటికీ నాటి  సమకాలీన చారిత్రక అంశాలు మరుగున పడకుండా శ్రద్ధవహించిన మరెంతో  పురావాఙ్మయం ఇంకా  చీకటిలోనే మగ్గుతోంది. కల్హణుని ‘రాజతరంగిణి’ వంటి అచ్చమైన చారిత్రక కావ్యాలలో చరిత్రకు సంబంధించిన అపారమైన సమాచారం అలాగే పడివుంది. వెలికితీసేందుకు  ఆధునిక పరిశోధకులకు  కావల్సింది కేవలం ప్రాచీన సంప్రదాయల పట్ల ఒకింత అనురక్తి. మన పురావాఙ్మయ చారిత్రక వైభవాన్ని  ప్రపంచం ముందు నిలబెట్టాలన్న ఆసక్తి! అంతే!

***

bottom of page