top of page

సంపుటి 3  సంచిక 1

Website Designed &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

కథా మధురాలు

నేను సైతం

karra Nagalaxmi

కర్రా నాగలక్ష్మి

" మీ రిక్వైర్ మెంటు చెబితే దాన్ని బట్టి మా రేటు వుంటుంది సార్ " ఫోను లో అవతలకి వ్యక్తి మాటలు ఆగదిలో వున్న అందరికీ వినిపించేయి. రిక్వైర్ మెంటు అంటే యేం చెప్పలో యెవ్వరికీ అర్దం కాలేదు .

 

ఇవతల వైపునుంచి సమాధానం రాకపోయేసరికి అవతల వ్యక్తి  " రమేష్ గారూ చెప్పండి "

అన్నాడు .

 

కాస్త తటపటాయించి " నాకు యీ విషయాలు పెద్దగా తెలీవు , అందుకే .... " అంటూ నీళ్లు నమలసాగేడు .

 

" అందుకే కద సార్ మేమున్నది , మీరు నిశ్చింతగా వుండండి , మా టీం యిలాంటి యేర్పాట్లని చక్కగా నిర్వహించడానికి ప్రత్యేకంగా తర్ఫీదు పొందేరు సార్ , మీకు సంతృప్తికలిగేటట్లు కార్యం నిర్వహించడం మా బాధ్యత , నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను వాటికి జవాబులివ్వండి చాలు మిగతాది మా టీం చూసుకుంటుంది , మరో విషయం యిలా అడగడం సంస్కారం కాదు కాని మా వృత్తిలో యిది తప్పదు కాబట్టి మీ కులం..... యేదో చెపితే మా పని సులువవుతుంది , సొ మీ కులం " .

 

 ".......... " రమేష్ జవాబు .

 

 " ఓకే ..... వయసు " .

 

" ఆడా లేక మగా , పెళ్లయిందా ?, వారసులు వున్నారా ? లేక మేం అరేంజ్ చెయ్యాలా ? " . 

 

" యెత్తు ...... కరెక్టగా వుండాలి సార్ , కావాలంటే కొలిచి చెప్పండి సార్ లేకపోతే ఆఖరి నిముషం లో అనవసరమైన ఆలస్యం జరుగుతుంది . 

 

" పూల దండలు వుండాలా ? వుంటే యెన్ని , పూల విషయం లో యేమైనా స్పెసిఫికేషన్స్ వున్నాయా ? సీజనల్స్ ఫరవాలేదా ?

 

ప్రశ్నల పరంపర సాగుతోంది , ఆ గదిలో వున్న అందరూ మౌనంగా వింటూ యెవరి ఆలోచనలో వారున్నారు .

 

అకస్మాత్తుగా కొన్ని గంటల కిందట జరిగిన సంఘటన కలుగజేసిన షాక్ నుంచి బయటకు రాని  రమని ఫోను సంభాషణ మరింత అయోమయం లో పడేసింది .

 

' మీది ...... కులం కాబట్టి మంత్రం వుండాలి , అన్నీ శాస్త్రోక్తంగా చెయ్యాలి సార్ కాబట్టి రేటు పెరుగుతుంది , చీర పట్టు చీరా ? , లేక నూలు చీరా , మూడు రోజుల కార్యక్రమమా ? లేక పది రోజులా ? ' ప్రశ్నల పరంపర సాగుతూనే వుంది . వాళ్ల వృత్తి అది , వారందించే ప్రతీ సేవకు యింత అని ఓ రేటు వుంటుంది , ఆ రేటు వారికి ముట్టచెప్తే మొదటినుండి చివర వరకు యెటువంటి లోటు లేకుండా కార్యక్రమం కానిచ్చేస్తారు .

 

వింటున్న రమకి ఒంటికి కారం రాసుకున్నట్లు అనిపించింది . 

 

సరళ ఫీలింగ్స యెలావున్నాయో అని తలతిప్పి సరళ వైపు చూసింది , నిర్వికారంగా యెటో చూస్తోంది సరళ .

ఫోనులో బేరసారాలు కదిరినట్లు లేదు , మాటలు సా..........గుతూనే వున్నాయి .

అటువైపునుంచి ' యెలా చూసుకున్నా చీరే ఆరువందల దాకా అవుతుంది సార్ ' అంటున్నాడు .

చీర గురించి స్పీకరులో వినబడగానే అంతవరకు కళ్లు మూసుకొని వున్న సరళ అక్కరలేదన్నట్టు  రమేష్ వైపు చూస్తూ చేతులు తిప్పి  ' ఈ సారి పండగకి కనకాంబరం రంగు ఉప్పాడ పట్టు చీర కొనమందక్కా , కొన్నాను , చీర చూసి యెంత మురిసి పోయిందో నా పిచ్చి తల్లి , పండగ రాకముందే యిలా వెళ్లిపోయింది , ఆ చీరలోనే నా తల్లిని సాగనంపాలి ' రమ ఒడిలో తలపెట్టుకొని వెక్కిళ్లు పెట్టసాగింది .

మౌనంగా సరళ వెన్ను నిమరసాగింది రమ .

" చదువుకుంటానమ్మా అంటే పెద్ద చదువులు చదివించేను , కావాలి అని నోరు తెరిచి అడిగిన ప్రతీదీ  కొని పెట్టేను , ప్రోజెక్ట వర్క్ లో బీజీగా వున్నాను , నాకూతురు కి సాయంగా వుండవా ? అంటే అరవై యేళ్ల భర్తను , యింటిని వదిలి పరుగెత్తుకుంటూ వచ్చి తోడున్నాను , పండగకు పట్టుచీర కావాలి అంటే కొని తే గలిగేను కాని ' నా ఆయుష్షు తీరిపోయిందమ్మా , వెళ్లిపోతున్నాను ' అని వెళ్లిపోతుంటే యేమీ చెయ్యలేక చూస్తూ వుండి పోయేనక్కా " .

రమ కి ఆపుకోలేనంత దుఃఖం కలిగింది .

" ఊరుకో , సరళా మనచేతుల్లో యేం లేదుగా ? వుంటే ...... దాన్ని యిలా వదిలే వాళ్లమా ? " .

నిన్న మధ్యాహ్నం ' అక్కా సువర్చలకి ఒంట్లో బాగులేకపోతే హాస్పిటల్ కి తెచ్చేను , ఐ.సి.యు లో పెట్టేరు , మూసిన కన్ను తెరవలేదు భయంగా వుంది నువ్వురావా ? నాకు కాస్త ధైర్యంగా వుంటుంది '  అన్న సరళ పిలుపుతో తెల్లవారేసరికి యిక్కడకు చేరుకుంది రమ . సాయంత్రానికి సరైన కారణం చెప్పకుండానే పిల్ల శరీరాన్ని వొప్పజెప్పేరు .

మరునాడు జరుగవలసిన కార్యక్రమానికి యేర్పాట్లు జరుగుతున్నాయి .

అటూ యిటూ తిరుగుతున్న పదేళ్ల ధృతి లో  తనని తాను  చూసుకుంటోంది రమ .

తనకు అప్పుడు యెనిమిదేళ్లే , అమ్మమ్మని చుట్టుకొని వూరూవాడా యేకమయేటట్లు యేడ్వడం గుర్తుంది . ధృతి యేడవకపోవడం వింతగా వుంది , ధృతే కాదు సరళలో కూడా వుండవలసినంత బాధ లేదేమో అనిపించింది . బాధ పడడం అంటే గట్టిగా బయటకి యేడ్వడమనే భావన నాటుకు పోయింది రమలో . 

 

సువర్చలకి అత్తగారు , మావగారు , తోటికోడలు , ఆడబిడ్డ కూడా పొద్దన్నే వచ్చేరు . రేపటికి మొగవారు రావొచ్చు .

 

లోపలి గది లోంచి జరుగుతున్న గూడు పుఠాణి చిన్నగా రమ చెవులను తాకుతోంది , యీ సమయంలో చర్చించ వలసిన విషయమా యిది , నిన్నటి వరకు సజీవంగా తిరిగిన పిల్ల నట్టింట నిర్జీవంగా పడి వుంటే పగవారు కూడా మాట్లాడని మాటలు వీరు యెంత సులువుగా చర్చించుకుంటున్నారు . రమకి వుక్రోషంగా అనిపించింది , గదిలోకి వెళ్లి ఆ ముగ్గురినీ దులిపెయ్యలని అనిపించింది . 

రమ ని బాగా యెరిగిన సరళ రమచేతిని తన చేతుల్లోకి తీసుకొని గట్టిగా నొక్కుతూ ' శాంతం ...... శాంతం ........  ఆ జాగాలో మనమున్నా వీరిలాగే ప్రవర్తిస్తాం అక్కా , ప్రాక్టికల్ గా ఆలోచిస్తున్నారు , యిందులో కోపం తెచ్చుకోడానికేముంది ' .

సరళ మాటలు రమ గుండెలపై తగిలేయి . యేమీ లేదా ? , యిన్నేళ్లు కాపురం చేసిన కోడలు పరాయిదే , అర్దం చేసుకోగలం , కాని సరళకేమయింది , ముప్పై యేళ్ల కూతురు మరణిస్తే  పడవలసినంత బాధ పడటం లేదేమో అని అనిపించింది , సువర్చల మరణం తో నష్టపోయినది యెవరైనా వుంటే అది ధృతి మాత్రమే . శవం బూడిద అవడంతో అన్ని బంధాలు పోతాయనేవారు కాని యిక్కడ ఊపిరి ఆగిపోగానే  అన్ని బంధాలు పోయినట్లున్నాయి . 

తన తల్లి పోయినపుడు పదిరోజులూ ఆపకుండా శోకాలు పెట్టిన అమ్మమ్మ పదోరోజున  సంచి పట్టుకు బయలుదేరితే తను కూడా చిన్న సంచిలో రెండు గౌనులు సర్ధుకొని వెంటపడడం గుర్తుంది .

' పిల్లని మీతో తీసుకు పొండి వదినగారు , యేదో నాలుగు మెతుకులు పడేస్తే పెద్దదవుతుంది , యిక్కడ సవితి తల్లి చేతిలో యేం బాధలు పడగలదు ' అన్న నాయనమ్మ మాటలకు అమ్మమ్మ సమధానం అప్పుడే కాదు యిప్పుడు తలుచుకున్నా  అమ్మమ్మ మీద కోపం రగులుతుంది రమ లో .

' నాపిల్లే నోట్లో మన్ను కొట్టుకు పోయిన తరువాత మిగిలిన వాళ్లతో  నాకేం పని  , యింక దీని సంగతంటారా ? నా పిల్లకు చేసినట్లే యే పండగకో పున్నానికో తీసుకు వెళ్లి నాలుగు రోజులు వుంచుకొని మాకు తోచినది చేతిలో పెట్టి పంపుతాం , యెన్ని పెళ్లిళ్లు చేసుకున్నా పిల్లల  బాధ్యత తండ్రి దే ' నిష్కర్షగా అని అమ్మమ్మా అని వెంటపడుతున్న తనని నిర్ధయగా విదిలించుకొని వెనుకకి తిరిగి చూడకుండా వెళ్లిపోయింది . 

ఇప్పుడు యిక్కడ అదే సీను రిపీట్ అవుతుందా ? , కాని తనకు తెలుసు సరళ మాత్రం అమ్మమ్మలా విదిలించుకొని పోదు , ధృతిని కన్నతల్లిలా అక్కున చేర్చుకుంటుంది . సరళ చేతిలో పెరిగి ధృతి మంచి వనితగా మారుతుంది .

ఆలోచనలలో పడి యెప్పుడు తెల్లవారినదీ గమనించలేదు రమ . సరళ కాఫీ కప్పులతో వచ్చింది , యిలాంటి సమయంలో బెడ్ కాఫీ లా అనిపించి వారిస్తూ సరళ వేపు చూసింది .

" మనం బతికున్నాంగా అక్కా " అంటూ కప్పు రమకి అందించింది .

' ఒకసారి యిలా వచ్చి పసుపు కుంకుమ పెట్టండి వదినగారు ' అంటూ వియ్యపరాలు పిలిచింది .

ఆమె చెయ్యమన్నవి  యాంత్రికంగా చేసి హాలులోకి వచ్చి కూర్చున్నారు . 

 సరళ భర్త , అన్న , తమ్ముడు బస్సులలో పడి తెల్లవారే సరికి దిగేరు . నీళ్లు నిండిన కళ్లతో  సువర్చలని చూస్తున్నారు .

అనుకున్న సమయానికి ' వైకుంఠ యాత్ర ' వారు సర్వ సరంజామా తో వచ్చి  అయిదు నిముషాలలో సువర్చల శరీరానికి సర్వాలంకారాలు చేసి  ' వైకుంఠ రధం ' లో చేర్చి  ' వైకుంఠ ధామం ' వైపు సాగిపోయేరు .

అలాంటి యేర్పాటు చెయ్యడం లో ఆరితేరినట్లున్నారు . ' యెక్కడా తడబాటు లేకుండా అన్నీ చకచకా చేసుకుంటూ పోతున్నారు , డబ్బుంటే చాలు యేపనైనా చిటికెలో జరిగిపోతాయన్నమాట , బాగుంది యిదోరకం జీవనోపాధి , యెవడు మొదలు పెట్టేడో గాని వాడికి నా జోహార్లు  ,   అనుకోకుండా వుండలేక పోయింది రమ .

' వైకుంఠ రధం ' కదిలేటప్పుడు మిన్నంటుతాయనుకున్న యేడ్పులు వినబడక పోయేసరికి కాస్త నిరాశ చెందింది రమ .

చెల్లెలి మొహంలో నిట్టూర్పు తప్ప మరేమీ కనబడలేదు , ధృతి కూడా కళ్లు తుడుచుకోక పోవడం రమలో ఆశ్చర్యాన్ని కలిగించింది .

' పిదపకాలం , పిదపబుద్దులు అనీ , చెట్టంత కూతురు పోతే యేడ్వలేని ఫాల్స్ ప్రిష్టేజ్ యెందుకూ , దుంపతెగ ' అనుకోకుండా వుండలేక పోయింది రమ .

 

మగవాళ్లంతా రెండు కార్లలో వైకుంఠ ధామానికి బయలు దేరేరు .

ఆడవాళ్లు ఒకళ్ల తరవాత ఒకళ్లుగా స్నానాలు చేసి వచ్చేరు .

రమ , సరళ స్నానాలు చేసి హాలులో కూర్చున్నారు . 

' అక్కా  నేను గట్టిగా యేడ్వలేదని ఆశ్చర్య పోతున్నావా ? , యేడవాలనే అనుకున్నానక్కా , నేను గట్టిగా యేడిస్తే నా పిల్ల బతుకుతుందంటే  యేడ్చేవుందును , కాని పిల్ల తిరిగి రాదు సరికదా యేడ్చి యేడ్చి సొమ్మసిల్లి పోతే నా పిల్ల అంతిమయాత్ర సవ్యంగా జరిగినదీలేనిదీ చూసుకోలేనుకదా ?అందుకే దుఃఖాన్ని మింగేశాను . అలాగని దుఃఖం లేదని కాదు , నా బిడ్డపోయిన బాధ నా కంఠం లో ప్రాణమున్నంత వరకు నాతోనే వుంటుంది . ఇది మనస్సుతో కాక బుర్రతో ఆలోచించ వలసిన సమయం , క్షణికావేశం లో సెంటిమెంట్స్ లో పడితే శ్లేష్మం లో పడ్డ ఈగ బతుకవుతుంది ' యింకా యేమి చెప్పేదో గాని వియ్యపరాలు వచ్చి పక్కనున్న సోఫాలో కూర్చోవడంతో మౌనం వహించింది సరళ .

వంటింట్లో వంటయేర్పాట్లు సాగుతున్నాయి . శవం లేచిన యింట్లో అప్పుడే వంటలు మొదలుపెట్టేసారా ? , యేది మానేసారు కనక యిది మానేయడానికి , యింట్లో శవం వుండగానే రెండో పెళ్లికి సన్నాహాలు మొదలు పెట్టిన వాళ్ల ప్రాక్టికాలిటీకి జోహార్లు అనుకుంది రమ .

వంటింటిలో పని అయిపోయినట్టుంది సువర్చల ఆడబిడ్డ , తోటికోడలు , పెద్దత్తగారు కూడా వచ్చి కూర్చున్నారు .

 

ముందుగా పెద్దవియ్యపురాలు " మనసు రాయచేసుకో సరళా , దాని కాలం తీరిపోయింది వెళ్లిపోయింది . నాలుగు రోజులు పోతే యెవరి దారిన వారు వెళ్లిపోతాం , అందుకే అందరం వుండగానే కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి . రమేష్ కా నిండా ముప్పైఅయిదు యేళ్లుకూడా లేవు , వాడికి అంటూ ఓ సంసారం  మనమే యేర్పాటు చెయ్యాలి , యిలా జరగాలని వుందనేనేమో ధృతిని నీకు దగ్గర చేసేడు దేముడు , దానికి నీ దగ్గర అలవాటే కాబట్టి తల్లిని తొందరగానే మరిచిపోతుంది , నువ్వూ ధృతిని చూసుకుంటూ సువర్చలని మరచిపోవచ్చు .......... '

రమ లో వుద్వేగం చోటుచేసుకుంది , యాభైయేళ్లకిందట తనున్న స్థితిలో ధృతి వుంది , అమ్మమ్మ స్థానంలో సరళ వుంది , సరళ అమ్మమ్మ లా స్వార్ధపరురాలుకాదు , ధృతిని రెండుచేతులతోనూ అక్కున చేర్చుకుని మంచి అమ్మమ్మగా ధృతి దృష్టిలో నిలిచిపోతుంది . తనని తిరస్కరించిన అమ్మమ్మని యివాల్టికి కూడా తాను క్షమించలేక పోయింది . అందుకే సరళ  యీ ప్రతిపాదనని తిరస్కరించినా తాను సరళను ఒప్పించాలని నిర్ణయించుకుంది . అక్కడ వున్నవారందరికన్నా యెక్కువగా సరళ జవాబు కోసం యెదురు చూడసాగింది రమ .

ఆలోచిస్తున్నట్లుగా కళ్లుమూసుకుంది సరళ , గట్టిగా ఓ నిట్టూర్పు విడిచి  మెల్లగా స్పష్టంగా మట్లాడ సాగింది .

' ఇక్కడ పోయింది నా కూతురే కాదు ఓ భార్య , ఓ కోడలు , ఓ తల్లి , దాని లోటును యెవరూ తీర్చలేరు , ఒకరి జాగాని మరొకరు నింపలేరు , అందరూ ఆ లోటుని అనుభవించాలి , యెవరైనా యెందుకు మరిచిపోవాలి , ధృతికి తల్లిని భగవంతుడు దూరం చేసేడు , మనమందరం కలిసి  వున్న తండ్రిని దూరం చెయ్యడం యెంతవరకు సబబు చెప్పండి ' .

" దూరం చెయ్యడం యేంటి ? ప్రతీ శలవులకు యిక్కడకి వస్తుంది కదా " వియ్యపరాలి సమాధానం .

 

" దానింటికి అది చుట్టంగా మారుతుందన్నమాట  " .

 

" యే ఆడపిల్లైనా రెండో పెళ్లంటే ఒప్పుకుంటుందేమో కాని పిల్లలున్న వాడిని పెళ్లాడేందుకు వప్పుకుంటుందా ? , మీరే చెప్పండి , ఒకవేళ వొప్పుకున్నా సవితి తల్లి నీడలో ధృతి ని విడిచి పెట్టగలమా ? " తోటికోడలి సందేహం .

 

" అమ్మా మా పిన్నత్తగారి కూతురుని రెండో పెళ్లికి యెలాగో వొప్పించ గలను కాని ధృతి కూడా యీ యింట్లోనే వుంటుందంటే మాత్రం ఆ అమ్మాయి చచ్చినా వొప్పుకోదు " సువర్చల ఆడబిడ్డ అంది .

 

" వదినగారూ మీరు పెద్ద మనసు చేసుకోవాలి , మీ అమ్మాయి పోయింది కదా అని మీరు మా వాడి మీద కక్ష కట్టడం యేం బాగులేదు , పోయిన భార్యతో వాడూ పోలేడు కదా , కాటికి కాళ్లు చాచుకున్న ముసలాడు కూడా పెళ్లాం చావగానే రెండో పెళ్లికి సిధ్ద పడుతూ వుంటే నా కొడుకు పెళ్లీ పెటాకులూ లేకుండా ముక్కుమూసుకొని వుండాలా ? చెప్పండి , పోయిన సువర్చలని మరిచిపోయి మీ సమయాన్ని  ధృతి పెంపకం లో వెళ్ల బుచ్చండి , అది కూడా తల్లిని మరిచిపోయి మిమ్మల్ని అమ్మమ్మలా కాక అమ్మలాప్రేమిస్తుంది , యేమంటారు ? " . సరళను ఒప్పించే ప్రయత్నంలో అంది సువర్చల అత్తగారు .

 

" సువర్చలని యెవరైనా యెందుకు మరిచిపోవాలి ? , మరిచి పోవడానికి అదేమీ మసి బొట్టుకాదే ? , ప్రతీ గడ్డిపరకా యేరి పేర్చి అది అల్లుకున్న పొదరింట్లో యెప్పటికీ అది సజీవంగా నే వుంటుంది వుండాలి  కూడా " .

 

" ఓస్ అంతేకదా , రేపే నిలువెత్తు ఫోటో హాల్ లో పెట్టిస్తాం లెండి , అమ్మా మా పిన్నత్తగారి కూతురుతో మాట్లాడతాను మంచిరోజు చూడూ " .

సువర్చల అత్తవారి వంకవారిలో పెద్ద బరువు దిగిన అనుభూతి కనిపించింది .

 

సరళ ఓసారి గంతు సవరించుకొని " నా వుద్దేశం మీకు బోధపడ్డట్టులేదు , ధృతి యిదే యింట్లో తండ్రి దగ్గరే వుంటుంది , ఆ వచ్చే ఆమె రమేష్ తో పాటు ధృతిని కూడా చూసుకోవాలి , ధృతిని తండ్రి ప్రేమ నుంచి దూరం చెయ్యకూడదు మనం . ఎదిగే మొక్కకి గాలి వెలుతురు సమ పాళ్లలో లభించి నప్పుడే అదిపుష్పించి మంచి ఫలాలను అందిస్తుంది , తల్లి తండ్రుల ప్రేమ లో పెరిగిన పిల్లలుకూడా అంతే , అందుకే ధృతి యిక్కడే వుండాలి " .

 

రమకి సరళ తీరు అర్దం కాలేదు , అమ్మమ్మ చేసిన తప్పే సరళ చేస్తున్నట్లు అనిపించింది  , ధృతిని చేరదియ్యక పోతే జీవితాంతం దాని దృష్టిలో యిది పెద్ద విలన్ గా మిగిలిపోతుంది , ఆ విషయం తనకు కాక యెవరికి తెలుసు , యాభైయేళ్లకిందట జరిగినదానికి యిప్పటికీ అమ్మమ్మని క్షమించలేదు తను , తెలిసో తెలియకో మరో అమ్మమ్మ అదే తప్పు చెయ్యబోతోంది వారించాలి .

 

" సరళా మొండిగా వాదించకు ,  ఆ పసిమొహం చూడు దానిని సవితి తల్లి బారిన పడనివ్వకు ......... " రమ మాటను పూర్తి చెయ్యనివ్వలేదు సరళ .

 

" ప్లీజ్ అక్కా , నువ్వేనా సవితి తల్లి అనే పదప్రయోగాన్ని మాను  . పెద్దమ్మ పోయిన తరవాత అమ్మమ్మ నిన్ను తనతో తీసుకు వెళ్లకుండా వుంచేసింది కాబట్టి నీకు మరో అమ్మ దొరికింది , యివాళ నాకు , తమ్ముడికి నీలాంటి మంచి అక్క , తండ్రిలా చూసుకొనే అన్న దొరికేరు  కాదంటావా ? , అందరికీ  అమ్మమ్మ యిల్లు ఒకటుంటే మనకి రెండుండేవి , ఔనా ? మన మధ్య యెప్పుడూ యెక్కువ తక్కువ అనే భావన రాకుండా పెంచింది అమ్మ ఔనా , అయినా నువ్వుకూడా నన్నర్దం చేసుకోవటం లేదు " .

 

" నేనదృష్టవంతురాలని సరళా అందుకే భగవంతుడు నాకు యింతమంచి కుటుంబాన్నిచ్చేడు , అందరూ మా మమ్మీ అంత గొప్ప మనసున్నవాళ్లు వుండరు " .

 

" అప్పట్లో అమ్మమ్మ తన భావాలను సరిగ్గా వ్యక్త పరచలేక పోయిందెమో అని నాకనిపిస్తూ వుంటుందక్కా అందుకే నేను కాస్త విపులంగా  నా మనస్సు మీ ముందుంచుతాను , ఇప్పుడిప్పుడే పరుగులు పెట్టే వయసులోకి అడుగు పెడుతున్న ధృతి ని పరుగుల మాట దేముడెరుగు నిలబడడానికి కూడా సహకరించని వయసులో అడుగు పెట్టిన నేను దాన్నెలా పెంచగలను ? , పెంపకం అంటే యేదో యింత ముద్ద పడేస్తే అయిపోదు , యీ కాలానికి తగ్గట్టు మానసికంగానూ , శారీరికంగానూ దాన్ని పెంచాలి . మన తరానికి దానితరానికి యెంతతేడా , వీళ్లది4జి యుగం , పోనుపోను యీ యుగం వేగం యెలా పెరుగుతుందో మనతరానికి ఊహకి కూడా అందదు . నాకా యెనభైలు దాటిన అత్తమామలున్నారు , వారి బాధ్యత కూడా నాదే , మలి సంధ్య లోకి అడుగు పెట్టిన మేం కూడా అడపాదడపా  హాస్పిటల్ తలుపు తట్టవలసిన వస్తూవుంటుంది . ధృతి కి యీ వయసులో యెన్నో సందేహాలు , ప్రతీ చిన్న విషయానికి తోటి వారితో  పోల్చుకోడం , తను కోరుకున్నది చేతికి అందకపోతే మాఅమ్మ వుంటే యిలా జరగకపోను అనే ఆలోచన దాని తలలో ప్రవేశిస్తుంది దానితో నిస్పృహ కి లోనవడం , యివన్నీ యీ వయసు పిల్లలని కృంగతీస్తాయి . తల్లితండ్రుల తో మాత్రమే పంచుకునే యెన్నో విషయాలు అది యెవరితో పంచుకుంటుంది ? , అదీకాక పిల్లలందరూ. అమ్మానాన్నల దగ్గర పెరుగుతూ వుంటే తనుమాత్రం అమ్మమ్మ యింట్లో వుండవలసి వచ్చిందే  , తండ్రికూడా తనని విదిలించు కున్నాడు , తనకి కుటుంబం లేదనే భావన దానిలో యేదోనాడు ప్రవేశించక మానదు . తను యెవ్వరికీ అఖ్కరలేదనే భావన మనిషిని కృంగదీస్తుంది . ఆస్థితిలో మనమందరం శతృవులలాగే కనిపిస్తాం . ఎవరిమాటా వినక మొండిగా తయారవుతారు . అలాంటి నిస్పృహకు లోనైనవారే మత్తు పదార్ధాలకు బానిసలై సంఘవిద్రోహులుగా  తయారవుతారు . 

 

అదే మనం మరో ఆమెని  తెచ్చి యివాళటినుండి యిది మీఅమ్మ , మీ అమ్మని నొప్పించకుండా మసలుకోవాలి అని , ఆ వచ్చే ఆమెకి యీ యింటితో పాటు దీని బాధ్యత కూడా నీదే అని చెప్పి మనం యెక్కువగా కల్పించు కోకుండా వుంటే వారి మధ్య కొత్తలో చిన్న చిన్న పొరపొచ్చాలు వచ్చినా వారే సర్ధుకొంటారు ".

" నువ్వు అనుకొంటున్నట్టు పొరపొచ్చాలు సర్ధుమణగక  పెరిగి పెద్దవయితే , అన్నీ మనం అనుకున్నట్లుగా జరగవు కదా , ఒక్కో సమస్య వచ్చినపుడు ఒక్కోమనిషి ఒక్కో విధంగా ప్రవర్తిస్తాడు కదా ? " .

 

" అలాంటి సమస్యలు వచ్చినపుడు ఆ యింటి యజమాని అంటే యిక్కడ రమేష్ పరిష్కరించుకుంటాడు . సమస్య అతను పరిష్కరించలేనంత పెద్దదయినపుడు  మనమెలాగూ వున్నాం కదా , యిద్దరికీ సర్దిచెప్తాం " .

 

" ఒదినగారూ మీరు చెప్పినంత  సులువు కాదండి .  సవితి తల్లి , సవితి పిల్లా సామరస్యంగా వుండడం యెప్పుడైనా విన్నామా ? కన్నామా ? , వచ్చినదానికి పిల్లలు పుట్టనంతవరకు సరే , దానికో నలుసు పుట్టిన తరువాత యిల్లు రణరంగమే ? పోనీ మా వాడిని. ఆపరేషను చేయించుకోమంటే సరి , కొన్ని గొడవలనైనా ఆపిన వారమౌతాం యేమంటారు ? " .

 

" అయ్యో యెంతమాటన్నారు , ఓ ఆడపిల్ల  జన్మహక్కుని మన స్వార్ధం కోసం లాక్కుంటామా ? , ఆమె తల్లయినప్పుడే కదా ఆమెలో వుండే అమ్మతనం మేల్కొనేది . ఆమె పిల్లలని కనాలి వారు ధృతికి తోబుట్టువులు కావాలి " .

 

 " మీరన్న మాటలు వినడానికి బావున్నాయి , సవితి తల్లి కన్నతల్లి ప్రేమను యివ్వడం , సవితి తోబుట్టువులు కలిసిమెలిసి వుండడం జరిగే పనేనా ?  "

 

" నేను మీకు సమంగా బోధపరచలేకపోతున్నానేమో ?  , సవితి తల్లి , సవితి పిల్ల అని తల్లీ పిల్లల సంబంధాన్ని మనమే  విషం తో నింపుతున్నాం . ఆ వచ్చే ఆవిడ యే దెయ్యమో భూతమో అన్నట్లుగా వూహించుకొనే పిల్లలు మనస్పూర్తిగా కొత్త తల్లిని ఆహ్వానించలేరు , అలాగే ఆ రాబోయే అమ్మాయి మనసులో రెండో పెళ్లి వాడా ? మొదటి సంబంధ పిల్ల వుందటగా , ఆ యింట్లో నీకేం ముద్దూ ముచ్చట తీరుతుందే , ఆ పిల్ల నీమీద చాడీలు చెప్పి నీ భర్త మనసు విరిచేస్తుంది  , ముందే ఆ పిల్ల వుండ కోడదనే షరతు పెట్టు  లేదూ ఆ యింట్లో అడుగు పెట్టగానే పిల్లకి వీధి గుమ్మం చూపించు , అనే మాటలు మనలాంటి అమ్మలక్కలే నూరిపోస్తున్నారు . కాదంటారా ?   కజిన్స్ తోను , యిరుగు పొరుగు పిల్లలతో కలిసిమెలిసి వుండాలని చెప్పేమనం   సవితి తమ్ముడు అనగానే తేడా యెందుకు చూపిస్తున్నాం . సవితి అనే పదం తీసేసి చూడండి , పిలుపులో యెంత ఆప్యాయత వుంటుందో ? .

 

నా వుద్దేశ్యం ప్రకారం భార్య బ్రతికి వుండగా మరో పెళ్లి చేసుకుని యింకో భార్యను తీసుకు వస్తే , ఆమె మొదటామెకి సవితి అవుతుంది , ఆమెకు పుట్టిన పిల్లలు  సవితి పిల్లలు కాని భార్య పోయి మరో పెళ్లి చేసుకొని వచ్చినామె యెవ్వరికీ సవితి కాదు . సవితి తల్లి అనే ప్రయోగం సరికాదేమో , మరోతల్లి అనే ప్రయోగం సరిగ్గా వుంటుందేమో ? ఒకే తండ్రికి పుట్టిన పిల్లల మధ్య '  సవితి ' అనే పదప్రయోగమే తప్పు " .

 

" మీ పిన్నత్తగారి కూతురుని వొప్పించ వలసిన అవుసరం లేదు ,  పెళ్లి అనేది షరతులతో రాసుకొనే వొప్పందంకాదు , వంద అబద్దాలు ఆడైనా ఒక పెళ్లి చెయ్యాలనే పాత సామెతను పట్టుకొని వున్నవి దాచి , లేనివి కల్పించి పెళ్లిళ్లు చెయ్యడం , పెళ్లి జరిగిన తరువాత నిజాలు బయటకి రాగానే యిద్దరూ యెడమొహం పెడమొహం , ఈ లోగా ఓ పిల్లో పిల్లాడో పుట్టడం , వారిలో పేరుకు పోయిన నిరాశ పిల్లలమీద చూపించి వారిని సంఘవిద్రోహులుగా మార్చడం అవసరమా ? , సరైన అవగాహన లేకుండా తొందరపాటు నిర్ణయాలవల్ల యెంత హాని జరుగుతుందో తెలిసిన మనం కూడా యిలా తొందరపడితే యెలా చెప్పండి . పిల్లా పిల్లాడు చర్చించుకున్న తరువాత యిద్దరికీ సమ్మతమైతేనే వివాహబంధంలోకి అడుగు పెట్టాలి , నువ్వు కావాలి గాని నీ వాళ్లు వద్దు అని అన్నారు అంటే ' దే ఆర్ సిక్  ' అని వాళ్లని వదిలి పెట్టెయ్యాలి అంతేగాని వాళ్లని వొప్పించే ప్రయత్నం చెయ్యడం యెంతవరకు సబబు . పరిస్థితిని అర్దం చేసుకొనే పిల్లకోసం వెతుకుదాం , అవసరం అనుకుంటే పేపర్లో ప్రకటన వేయిద్దాం , కాస్త ఆలస్యం కావొచ్చు అంతవరకు మీరు కొన్నాళ్లు నేను కొన్నాళ్లు వుండి యిల్లు చూసుకుంటే సరిపోతుంది , యేమంటారు ."

 

అంతా సరళ మాటలలోని నిజాలను జీర్ణించుకోడానికి ప్రయత్నిస్తున్నారు .

 

" రెండు తరవాల ముందు పుట్టిన అమ్మమ్మ సమాజానికి యెదురీది , మా అక్కయ్యకు , అన్నయ్యకు ఓ అమ్మనివ్వ గలిగింది , రెండు తరాల తరవాత పుట్టిన నేను ధృతి కి మరో అమ్మని యివ్వాలను కోవడం న్యాయం కాదా ? "

 

రమ కళ్లల్లోంచి కన్నీరు ధారగా కారసాగింది , సరళకు అంతబాగా అర్దమైన అమ్మమ్మ తనకెందుకు అర్దం కాలేదు ,  తనెప్పుడూ అర్దం చేసుకునే ప్రయత్నం కూడా చెయ్యలేదా ? అనే అపరాధ భావం కరిగి నీరై కన్నీరుగా మారిందా ? .

 

మనసులోని మబ్బులు కరిగి నీరై పోగానే రమ మనసులో కలిగిన మొదటి ఆలోచన వెంటనే బయటపెట్టింది , " సరళా నువ్వు చెప్పింది చాలా నిజం , పేపర్లో విడాకులు తీసుకున్నవారు , భర్త పోయినవారు , పిల్లలున్నవారు కూడా సంప్రదించవచ్చు అని  వేయిద్దాం , తల్లి ప్రేమకు దూరమైన ధృతికి తల్లిని యివ్వగలిగినట్లే తండ్రి ప్రేమను కోల్పోయిన పిల్లలకి  రమేష్ ద్వారా తండ్రి ప్రేమను అందించగలిగితే రేపటి తరానికి మనం సైతం చిన్న సహాయం సేసిన వాళ్లమౌతాం కదా ! .

 

సరళ అక్కడవున్న వారిని పరికించి చూసింది , రమ లో వచ్చినంత త్వరగా మార్పు అందరిలోనూ రాకపోవచ్చు , రావాలని అనుకోడం కూడా అవివేకమే , కాని అక్కడవున్న వారి మౌనం వారు  ఆలోచనలలో వున్నట్లుగా అనిపించింది .

 

ఆలోచన కలిగింది అంటే ఆచరణకు యెంతో సమయం పట్టదు , ఆచరణ సాధ్య మయినప్పుడు సమాజం మారడానికి యెంతో సమయం పట్టదనే సత్యం తెలిసిన సరళ తృప్తి గా కళ్లు మూసుకుంది .

OOO

Bio
bottom of page