top of page

సంపుటి 3  సంచిక 1

Website Designed &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

కథా మధురాలు

మేలుకో నేస్తం…

Oleti Sasikala

ప్రసూన రవీంద్రన్

madhuravani.com అంతర్జాల పత్రిక నిర్వహించిన కథలపోటీ లో ప్రశంసా  బహుమతి సాధించిన కథ.

“మా అమ్మని చూసి నేర్చుకో. గుట్టుగా ఎలా ఉండాలో. భర్త ఎలా ప్రవర్తించినా అది మనసులోనే ఎలా దాచుకోవాలో. “ 

వివేక్ మాటలకి ఇంతకు ముందులా చివ్వున తలెత్తలేదు రూప. బాబుకి బట్టలు మారుస్తూనే అతని మాటలు వింటోంది.

 

వెంటనే త్రాచుపాములా బుస కొడుతుందనుకున్న రూప నిదానంగా ఉంటడంతో మెల్లగా ఊపిరి పీల్చుకుంటూ తిరిగి చెప్పడం మొదలుపెట్టాడు వివేక్.

 

“భార్యా భర్తల మధ్య ఏమైనా జరగొచ్చు. నచ్చని ప్రతి విషయమూ తల్లితండ్రులకి చెప్పుకుంటే పోయేది నీ పరువే. “

రూప వివేక్ వైపు చూస్తూ అవునన్నట్టుగా తలాడించింది.

 

వివేక్ అయోమయంగా చూశాడు. ఈ రెండు సంవత్సరాల కాలంలో తను చెప్పే విషయం ఇంత సౌమ్యంగా రూప వినడం ఇదే మొదటి సారి.

“మా నాన్న అమ్మని కొట్టేవాడు కూడా కోపం వస్తే. ఒక్కసారి కూడా అమ్మ మా అమ్మమ్మా వాళ్ళకి ఈ విషయం చెప్పుకోలేదు. కనీసం అలా కొట్టినందుకు మా

నాన్న మీద కోపగించుకునేది కూడా కాదు.”

 

“నిజమా. ఎందుకలా?“ రూప ఆశ్చర్యంగా చూస్తూ నోరు విప్పింది.

 

“ఎందుకేమిటి? ఇంటి గుట్టు రట్టు చేసుకోకుండా గుట్టుగా బ్రతకడం ఎలాగో మా అమ్మకి తెలిసినట్టు మరెవరికీ తెలీదు. అందుకేగా మా అమ్మంటే నాకు అంత గౌరవం “

 

“అవునా. అంటే మీ నాన్న గారిలా పెళ్ళాల్ని కొట్టే మగవాళ్ళే ఇంతవరకూ పుట్టలేదంటావు. “

 

అమాయకంగా తన వైపు చూస్తున్న రూప వైపు అనుమానంగా చూశాడు వివేక్.

 

“అదేం లేదు. పెళ్ళాం తప్పు చేస్తే పెద్దవాడుగా మొగుడు కొట్టడంలో తప్పేముంది? ఇదివరకూ అలాగే దారిలో పెట్టేవాళ్ళు. ఇప్పుడంటే చదువు, ఉద్యోగం ఉన్నాయనే అహంతో మొగుడు మంచి మాట చెబితే కూడా ఇంతెత్తున లేచే ఆడవాళ్ళే అందరూ. “

 

“ఊ... దారిలో పెట్టేవాళ్ళు అంటే, ఆడవాళ్ళని తమ మనసుకి నచ్చినట్టు బ్రతకనివ్వకుండా తాము చెప్పినట్టే, తమకి నచ్చినట్టే, తమకి ఉపయోగపడేటట్లే ప్రవర్తించేలా చేసుకోవడం.. కదా? అంతో ఇంతో ఆత్మాభిమానం కలిగి కాస్త సొంతంగా ఆలోచించుకునే ఆడవాళ్ళుంటే ఇక ఇలా భర్తలకి చెయ్యెత్తాల్సి వచ్చేది. ఎందుకంటే .. ఆడవాళ్ళు తమ మెదడుతో, తమ మనసుతో ఆలోచించడం ప్రారంభిస్తే, మగవాడికి జీవితం కుంటుపడిపోతుంది.“ నెమ్మదిగానే అంది రూప.

 

వివేక్ అహం దెబ్బ తిన్నా కూడా అసలెప్పుడూ లేనంతగా రూప తనతో ఇంత సౌమ్యంగా మాట్లాడుతూ ఉండడంతో  కటువుగా ఏమీ అనలేకపోయాడు. తను ఇలా సౌమ్యంగా ఉన్నప్పుడే మంచి మాటలు చెప్పి మార్చుకోవాలి.

 

“ఇంతకీ నేను ఏ విషయం చెప్పి ఉండకూడదు అంటావు మా అమ్మకి? “ వివేక్ మొహంలోకి చాలా మామూలుగా చూస్తూ అడిగింది.

 

“అదే, నీ డెబిట్ కార్డుతో ఇంటి అద్దె నేను కడుతున్న సంగతి. ఎంత అవమానం చెప్పు. “మెల్లగా రూప పక్కనే కూర్చుంటూ అన్నాడు.

 

“అందులో అవమానపడేందుకు ఏముంది? “రూప నిజంగానే అడుగుతోందా అనుకుంటూ “అది కాదు రూపా, ‘మా అమ్మాయి ఖర్చుల కోసం మేము కొంత డబ్బు వేసి కార్డు ఇస్తే, ఐ.టి లో ఉంటూ నెలకి లక్ష దాకా సంపాదించే అల్లుడు మూడు నెలలుగా ఆ కార్డుతోనే ఇంటి అద్దె కడుతున్నాడుట ‘ అని నా గురించి చాలా తక్కువగా అనుకోరా మీ అమ్మా వాళ్ళు?

 

“అది నిజమే కదా మరి. అలా అనుకుంటారని తెలిసినప్పుడు ఎందుకు నా కార్డుతో ఇంటి అద్దె కట్టావు ఇన్నాళ్ళూ? లక్ష జీతం నెలకి వస్తుంది నీకు. పదివేలు అద్దెకి నా కార్డు ఎందుకు తీసుకున్నావు?“ చాలా నెమ్మదిగా అడుగుతున్న రూపకి వెంటనే సమాధానం చెప్పలేకపోయాడు వివేక్. కోపాన్ని అణచుకోవడం అతనికి కష్టంగా ఉంది. రూప ఇలా కోపం లేకుండా ఉన్నప్పుడే మంచి చెప్పి తనని అమ్మలా ప్రవర్తించేలా మార్చుకోవాలనిపిస్తోంది.

 

“చెప్పు, పెళ్ళవగానే మన కోసం మంచి ఇల్లు చూడమంటే మూడు నాలుగు నెలలు ఆ వర్కింగ్ మెన్స్ హాస్టల్ లోనే ఉంటూ, వారాంతాల్లో మాత్రం మా ఊరొస్తూ నన్ను అక్కడే ఉంచావు మా అమ్మ ఇంట్లో. ఇల్లు ఇదిగో చూస్తున్నా, అదిగో చూస్తున్నా చాలా రెంట్ చెబుతున్నారు అంటూ నువ్వు దాటేసేలోపే నేను నెల తప్పడంతో నీకు ఓ సమస్య తీరినట్టయి నేను అడగకుండానే ‘నువ్వు ఈ సమయంలో ఆ సిటీకి వచ్చి కష్టపడలేవు. డెలివరీ దాకా హాయిగా మీ అమ్మ, నాన్న దగ్గరే ఉండు’ అంటూ నువ్వు హాస్టల్ లోనే కంటిన్యూ అయ్యావు. “

 

“రూపా, నీ మంచి కోసం, నీ మీద ప్రేమతో నువ్వు ఆ సమయంలో మీ అమ్మా, నాన్న దగ్గర ఉంటూ మీ అమ్మ చేతి వంట తింటూ ఆనందంగా ఉంటావని ఆలోచించడం తప్పు అంటున్నావా అయితే? “  రూప మాటలకి అడ్డు తగులుతూ అన్నాడు వివేక్. అతని అలవాటు ప్రకారం కోపంగా అహంకారంగా మాట్లాడకుండా ఉండటానికి చాలా కష్టపడుతున్నాడని ఎరుపెక్కిన అతని మొహం చూస్తూనే అర్థమయింది రూపకి.

 

అయినా తను శాంతంగానే అతని కళ్ళలోకి చూస్తూ అంది. “ప్రేమ… ఊ … మరి అంత ప్రేమ ఉన్నవాడికి నాకు ఎప్పుడెప్పుడు స్కాన్ ఉందో, చకప్ ఉందో అన్నీ ముందే తెలిసి కూడా తొమ్మిది నెలల్లో ఒక్కసారి కూడా ఆ సమయాల్లో రాలేదెందుకు? నువ్వు నాతో రావలని, స్కాన్లో లోపల బిడ్డని చూసే ఆనందం ఇద్దరం కలిసి పంచుకోవాలనే నేను ప్రతిసారీ శనివారమే ఎపాయింట్మెంట్ తీసుకునేదాన్ని. ఒక్కసారయినా వచ్చావా? ప్రతి సారీ ఏదో కారణం చెప్పి తప్పించుకోవడం, ‘అమ్మ రమ్మంది. అమ్మా, నాన్న దగ్గరికి వెళుతున్నా’ అనడం. కనీసం స్కాన్ , కన్సల్టేషన్ ఖర్చులకి నా చేతిలో ఎప్పుడైనా బాధ్యతగా డబ్బు అయినా పెట్టావా? ఎంతయింది అని అడిగావా? నేనే చెప్పేదాన్ని. ఎంతయిందో. అన్నిటికీ మా అమ్మే ఇస్తోంది. నా ఖర్చులకి కొంత డబ్బు ఇవ్వమని నేరుగానే అడిగాను. కనీసం తరువాత నువ్వు నన్ను చూడటానికి వచ్చినప్పుడు అయినా ఆ డబ్బు ఇచ్చావా? “

 

రూప మాటలకి వివేక్ ఒంట్లో రక్తమంతా ముఖంలోకొచ్చింది. అతని అవస్థ రూపకి నవ్వు తెప్పించింది. ఎంత బాగా ముసుగేసుకుంటున్నాడు.

 

“నీకు కోపం వస్తోందని నాకు తెలుసు వివేక్. కాస్త సామరస్యంగా మాట్లాడుకోవాల్సిందే మనం ఒక్కసారయినా. ఆవేశాన్ని కాసేపు అణచి పెట్టు. చాలా పెద్ద సమస్యలు కూడా కూర్చుని చర్చించుకుంటే ఓ కొలిక్కి వస్తాయి. చర్చించుకోకుండా ప్రతి సారీ నేనే కరెక్ట్ అనుకుంటూ అహంకారంగా సాగిపోతే ఎప్పటికీ బాంధవ్యాలు బాగుపడవు. “

 

చంటాడిని జోకొడుతూనే నిరాసక్తంగా అంది రూప.

 

క్రిందటి నెలలో డెబిట్ కార్డు విషయంలో అత్తగారింట్లో జరిగిన గొడవ గుర్తుచేసుకుని కోపాన్ని బలవంతంగా అణచుకున్నాడు వివేక్.

 

“బాబుకి పదినెలలు వచ్చేశాయి ఎప్పుడు ఒక ఇల్లు తీసుకుంటారు అని అమ్మా, నాన్నా గట్టిగా అడిగితే గానీ ఇక్కడ ఇల్లు చూడలేదు నువ్వు. అది కూడా ఇలా సింగిల్ బెడ్ రూం. పిల్లవాడి కోసం మీ అమ్మా, నాన్నా లేకపోతే మా అమ్మా, నాన్నా వస్తే ఎంత ఇబ్బంది పడతారు? అంత జీతముండి, మీ సొంత ఊరిలో నీకు సొంత ఇల్లు కూడా ఉండి, ఇంతగా సద్దుకోవాల్సిన అవసరం ఏముంది?  కనీసం ఒక సోఫా, డైనింగ్ టేబుల్ ఏవీ కొనవు. ఏమిటీ విపరీత ధోరణి? ఇటువంటి కనీస అవసరాలకి కూడా ఖర్చుపెట్టకుండా ఎవరైనా ఉంటారా ఈ రోజుల్లో. నిన్ను అడిగీ, విసిగిపోయి బాధపడితేనే నా అకౌంట్లో డబ్బు వేసి, ఇవన్నీ కొనుక్కోమని మా అమ్మా, నాన్నా కార్డు నాకు ఇస్తే అది తెలుసుకుని వెంటనే కార్డు తీసుకుని నువ్వు దాచుకున్నావ్. దాంట్లోంచే ఇప్పుడు ఇంటి అద్దె కడుతున్నావ్. “

 

“అవునే. నువ్వు మహారాణి వి కదా. ఇంత పెద్ద ఇల్లు కావాలి నీకు. నేనయితే రెండు గదులు ఉన్న ఇంట్లో కూడా ఉంటాను. మా అమ్మ అయితే పెళ్ళయిన తరువాత పదిహేనేళ్ళపాటు రెండు గదుల్లోనే సంసారం చేసింది. ఎంత మంది చుట్టాలు వచ్చినా ఏ రోజూ మా నాన్న దగ్గర పోరు పెట్టలేదు. డబ్బుంది కదా పెద్ద ఇల్లు కట్టండి అనో, పెద్ద ఇల్లు అద్దెకి తీసుకోండి అనో. ఇప్పుడు నువ్వు సుకుమారివని అమ్మే ‘కోడల్ని బాధపెట్టకురా . కనీసం సింగిల్ బెడ్ రూం అయినా తీసుకో’ అందని నీకోసమే ఇంత అద్దె కడుతూ ఈ ఇల్లు తీసుకున్నాను. మా అమ్మ ఎప్పుడూ టేబుల్ మీద కూర్చుని భోజనం చెయ్యలేదు. మోకాళ్ళు నొప్పులయినా ఇప్పటికీ నేల మీదే కూర్చుని తింటుంది. మా అందరికీ కూడా అలాగే నడుం వంచి వడ్డిస్తుంది. ఎప్పుడూ సోఫాల్లో పడుకుని సుఖపడలేదు. నేల మీదే పడుకుని విశ్రాంతి తీసుకునేది.  నీ కోసమే ఈ మంచమూ, పరుపూ నలభై వేలు పెట్టి కొనిపించింది. మా అమ్మ నిన్ను మా కంటే ఎక్కువగా ప్రేమిస్తోంది. అది తెలుసుకో. “ రూప మాటల్ని మధ్యలోనే ఆపేసి దాదాపు అరుస్తున్నట్టుగానే అన్నాడు వివేక్.

 

రూప సడలని ప్రశాంత వదనంతోనే అతని వైపు చూసింది.

 

అంత చెప్పినా ఆమె అలా నిదానంగా, నిర్మలంగా చూడటం వివేక్ కి పిచ్చెక్కిస్తోంది. ‘ఏమిటిది? నిన్నటి దాకా అయితే ఈ పాటికి చుట్టు పక్కల వాళ్ళకి తెలిసిపోయేంత గొడవ అయ్యి ఉంటుంది. తనతో సమానంగా అరుస్తూ , ఏడుస్తూ, ఖర్మ అనుకుని నుదురు కొట్టుకుంటూ రూప వికారంగా ప్రవర్తించి ఉంటుంది. ‘ఆ కాలం వాళ్ళలాగే నేనూ ఈ కాలంలో ఉండాలని ఎందుకు శాసిస్తున్నావ్’ అని రంకెలేసి ఉంటుంది. ఇవాళేమిటి కనీసం ఆమె ముఖంలో కోప ఛయలు కూడా కనిపించడం లేదు? ‘

 

“దేవతలాంటి అత్తగారిని చూసి ఇల్లాలు ఎలా ఉండాలో నేర్చుకో ..” తనే అన్నాడు మళ్ళీ అమె ముఖంలోకి చూస్తూ.

ఆ మాటకి రూప పకపకా నవ్వింది.

 

“ఎందుకలా నవ్వుతావు? పిచ్చి పట్టిందా? “కోపంగా అన్నాడు వివేక్.

 

నవ్వు ఆపుకుని అతన్ని తీక్షణంగా చూసింది రూప.

 

“పిచ్చి వదుల్చుకుంటున్నాను. యుగ యుగాలుగా జీన్స్ లో వచ్చేసిన పిచ్చి వదుల్చుకోవాల్సిందే అని తెలుసుకుంటున్నాను. “

కోపంతో వికృతంగా మారిన అతని ముఖాన్ని సౌమ్యంగా చూస్తూ అంది రూప “ అత్తయ్యగారేం దేవత కాదు. ఆ మాటకొస్తే ఏ ఆడదీ దేవత కాదు. తనని తాను కోల్పోవడం, దేవుడిచ్చిన మానసిక, శారీరక బలాన్ని హత్య చేసేసి  మగవాడు ఎలాంటి వాడైనా వాడిని అధికుడిని చేస్తూ వాడి నీడలో “అపురూపమైనదమ్మ ఆడజన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా” అన్నట్టుగా బ్రతుకుతున్నాననుకుంటూ ఆత్మవంచన చేసుకుంటూ బ్రతకడం దైవత్వం అనిపించుకోదు. “

“పిచ్చి వదుల్చుకోవడమంటే … పొగరు పెంచుకోవడమనమాట“ ఆమె ముఖంలోకి చూస్తూ పళ్ళు నూరుతూ అనేసి అక్కడి నుంది విసురుగా బయటికి నడిచాడు వివేక్.

 

“ఆడవాళ్ళు ఆత్మాభిమానాన్ని చూపించడం మగవాడికి పొగరుగానే కనిపిస్తుంది. దురదృష్టం ఏంటంటే, ఈ విషయంలో ముందు తరాల ఆడవాళ్ళు కూడా మీ లాంటి మగవాళ్ళకి వత్తాసు పలకడం. ఇటువంటి మారని మనస్తత్వాలతో ఇప్పటికీ తమ జాతిని తామే ఎదగనివ్వకుండా కాళ్ళు పట్టి ఈడ్చేస్తున్నామని తెలుసుకోకపోవడం.“ అంటున్న రూప మాటలు అతనికి వినపడ్డాయో లేదో గానీ, బాల్కనీలోకి వెళిపోయి సిగరెట్ ముట్టించాడు వివేక్.

“ఎలా ఈ మార్పు రూపలో? నిన్నటి దాకా ఇన్ని మాటలుండేవి కావు. తల బాదుకుని ఏడుస్తూ నేను చచ్చిపోతాను. నీకు కొంచం కూడా నేనంటే విలువ లేదా అనే మాటలతో వెక్కి వెక్కి ఏడుతూ ఉండే రూప ఇంత సహనంగా ఎలా ప్రవర్తిస్తోంది. ఉద్యోగం కూడా లేదు ఆమెకి. ఏ ధైర్యం ఆమెనిలా మాట్లాడేలా చేస్తోంది? …”

 

సిగరెట్ పొగని రింగులుగా వదులుతూ ఆలోచిస్తున్నాడు.

 

ఒకవేళ ఆమె తల్లితండ్రుల అండ చూసుకుని విర్రవీగుతోందా? .. అవునులే కాలం మారిపోయిందిగా. ఇదివరకూ ఆడపిల్ల మొగుడితో దెబ్బలాడి ఇంటికి వచ్చిందంటే ప్రాణం పోయిందనిపించేలా భావించేవారు ఆ పిల్ల తల్లితండ్రులు. ఒకసారి తన తల్లి ఇలాగే అత్తగారు బాగా తిట్టిందని పుట్టింటికి వెళ్ళి చెబితే తన అమ్మమ్మ ‘సర్దుకుపోవాలమ్మా, పెద్దావిడ నిన్ను ఏమైనా అన్నా, అవన్నీ ఇక్కడికి వచ్చి చెప్పుకోకూడదు. ఎదురు చెప్పకూడదు” అని చెప్పిందిట. అప్పటి నుంచీ తన తల్లి భర్త కొడితే కూడా తల్లికి చెప్పుకోలేదుట. ఇప్పుడు ఎంత విపరీతంగా ఉంది. అల్లుడని కూడా చూడకుండా క్రిందటి నెలలో కూతురి డెబిట్ కార్డు మూడు నెలలుగా నేనే వాడుతున్నానని నిలదీసి అడుగుతారా తనని?

 

                                         ************

 

“రూపా, ఎందుకే అతనితో అంత వాదన? నువ్వు చెబితే తెలుసుకునే మనుషులా వాళ్ళు? నీ చేతికి రూపాయి ఇవ్వకుండా అవమాన పరిచాడు. ఇప్పుడు నీ తల్లితండ్రులు నీకిచ్చిన డబ్బు కూడా నువ్వు వాడుకోలేకుండా చేస్తున్నాడు. దీన్ని బట్టి తెలియడం లేదా? అతనొక శాడిస్ట్ అని? శారీరకంగా , మానసికంగా నిన్ను కష్టపెట్టాలని చూస్తున్నాడు. అలాంటి వాడితో కలిసి బ్రతికే తీరాలి అన్న కాలం కాదే ఇది. ఎన్ని వార్తలు చదువుతున్నాం. పసి పిల్లలేమైపోతారో అని కూడా చూడకుండా భార్యల్ని చంపేస్తున్న భర్తల గురించి ప్రతి రోజూ ఒక వార్త తప్పకుండా ఉంటోంది ఈ కాలంలో కూడా. నిన్న పేపర్లో వార్త. ఉత్తరాదిన ఓ యువతి భర్త , అతని తరఫు వారూ వేధింపులు పడలేక ఏడాదిగా పుట్టింట్లో ఉంటోంది ఇద్దరు చిన్న పిల్లలతో. ఆ తల్లితండ్రులకి ఆ పిల్ల ఎంత బరువయిందో మరి నచ్చజెప్పి భర్త దగ్గరికి పంపిస్తే రెండో రోజే భర్తా, అత్తగారూ కలిసి ఆ అమ్మాయిని చంపేశారు. ఇక్కడ తప్పు ఎవరిది చెప్పు? అటువంటి వాడని తెలిసీ అతని దగ్గరకి ఆ పిల్లని పంపినవాళ్ళదే కదా? ఈ వార్త ఫేస్బుక్ లో కూడా చక్కర్లు కొడుతోంది. చదవలేదా? “

 

తన ప్రాణ స్నేహితురాలు పల్లవి చెప్పినదంతా ఓపికగా వింది రూప.

 

“పల్లవీ, అతనితో బ్రతకడం చాలా కష్టమే. కాదనను. వెంటనే వదిలేసి రావడం ఒక్కటే పరిష్కారమా? “

 

“కాదే. ఓటి కుండలో జీవితాంతం నీరు అలా పోస్తూనే ఉండటమే పరిష్కారం. కదా?“ వెటకారంగా అంది పల్లవి.

 

“ఓటి కుండ అని తెలుసుకుని ఒక్కసారైనా గుడ్డ దోపి వాడే ప్రయత్నం చెయ్యకుండానే పారవేయడం సరయిన పనేనా చెప్పు? మారాల్సింది అతను కాదు పల్లవీ. అతను మారడు. ఆ విషయం నాకు బాగా అర్థమయింది. నేను అతనితో బ్రతికినా, వదిలేసినా … మా అత్తగారిని మార్చే ప్రయత్నం మాత్రం మానను. ఇలా స్త్రీ జాతి తిరోగమనానికి కారణం అవుతున్న ఆడవాళ్ళకి అవగాహన కల్పించి, వాళ్ళ జీవితాన్ని వాళ్ళు గౌరవించుకునేలా చెయ్యాలని నిర్ణయించుకున్నాను.  ‘ఆవిడ మారితే నా జీవితం బాగుపడుతుందని’ తీసుకున్న నిర్ణయం కాదు పల్లవీ. మూర్ఖపు కట్టుబాట్లకి తలొంచి, స్వశక్తినీ, ఆత్మాభిమానాన్నీ చంపేసుకుని తన జీవితాన్ని కోల్పోయిందావిడ. అలా ఎందరో. వాళ్ళు కోల్పోయిందేమిటో వాళ్ళకి చెప్పగలగాలి. “

 

రూప నిర్ణయం విని ఆశ్చర్యపోయింది పల్లవి. రూపా, తనూ చిన్న నాటి నుండీ ప్రాణ స్నేహితులు. ఒకరినొకరు చూసుకోకుండా రెండు రోజులు కూడా ఉండలేనంత స్నేహం. ఇద్దరిలో రూపకే ముందు పెళ్ళయింది. రెండేళ్ళుగా రూప పడుతున్న మానసిక వేదన చూస్తుంటే తనకు పెళ్ళంటేనే విరక్తి కలిగిపోయింది. డబ్బు విషయం ఒక్కటే కాదు. ఇంకా చాలా విషయాల్లో రూపని బాధపెడుతున్నారు వివేక్, అతని తల్లితండ్రులు. అనకూడని మాటలు. పెళ్ళయిన మరునాడే వాళ్ళ ప్రవర్తన, అలవాట్లు అందరికీ తెలిసిపోయింది. వివేక్ కి అసలు పెళ్ళీ, పెళ్ళామూ, సంసారమూ, తమకొక ఇల్లు, ఏదీ అవసరమే లేదు అన్నట్టు ఉంటాడు. మరెందుకు పెళ్ళి చేసుకున్నాడో తెలీదు. రూప గర్భవతిగా ఉన్నన్నాళ్ళూ ఆమె పడుతున్న బాధ, అవమానాలు తను దగ్గరగా, కళ్ళారా చూసింది. ఓదార్చింది. బిడ్డ పుట్టాక కూడా ఆ బిడ్డకి కనీసం డాక్టరు ఖర్చులకి కూడా వివేక్ స్పందించటంలేదు. అతని ప్రవర్తనకు పూర్తిగా అతని తల్లితండ్రులే కారణమని తెలిసిపోతోంది. అతన్ని అలా పెంచారు. ఆడదంటే కేవలం మొగుడికి జీతం లేని సేవకురాలిగా ఉండాలి అంతే .. అన్నదే అతని అభిప్రాయం..అతనలా ఉగ్గుపాలతో ఇటువంటి భావనలతో పెరగడానికి కారణమైన అతని తల్లిని , తన అశాంతికి మూల కారణామైన తన అత్తగారిని ఆవిడ కోసం మారుస్తా అంటుందేవిటి రూప?

 “పల్లవీ … వింటున్నవా? ఇందుకు నాకు నీ సహాయం కావాలి. “

రూప అరుపుతో ఉలిక్కిపడుతూ ఈ లోకంలోకొచ్చింది పల్లవి.

                                  ***********

 

మిట్ట మధ్యాహ్నం వేళ ఈ సమయానికి కాలింగ్ బెల్ మోగించింది ఎవరా అనుకుంటూ వెళ్ళి తలుపు తీసింది రూప అత్తగారు సత్యవతి.

మంచి ఖరీదైన చీరలు కట్టుకుని, చాలా చక్కగా కనపడుతున్న ఆడవాళ్ళు నలుగురు గుమ్మంలోనే నవ్వుతూ నిలబడ్డారు. వారిలో ఒకావిడ సత్యవతిని చూస్తూ “నమస్తే అండీ. ఇక్కడ సత్యవతి గరంటే మీరేనా? “ అనడిగింది చెదరని చిరునవ్వుతో.

 

“అవునండీ. మీరెవరు?“ వారిని పోల్చుకోవడానికి ప్రయత్నిస్తూ అడిగింది సత్యవతి.

 

“మేము ‘మేలుకో నేస్తం’ అనే మహిళాభ్యుదయ సంస్థ నుండి వచ్చామండీ. మీతో కొంచం మాట్లాడాలి. లోపలికి రావొచ్చా”

 

“అయ్యో రండి…“ అంటూ వాళ్ళందరినీ లోపలికి పిలిచి చాప పరిచింది సత్యవతి.

 

“సత్యవతి గారూ, నా పేరు ప్రభావతి. నేరుగా విషయానికే వస్తాను. మేము మహిళలకి సంబంధించిన అన్ని విషయాల మీద పని చేసే సంస్థ నుంచి వచ్చాం. నేటి మహిళల అభ్యుదయానికి ఎదురవుతున్న అవాంతరాల్ని ఏరి పారేసేది మా సంస్థ  యొక్క అతి ముఖ్యమైన లక్ష్యం.  అతి దురదృష్టకరమైన విషయం ఏంటంటే సత్యవతి గారూ, తెలివితేటల్లో, చదువులో అన్నిట్లోనూ మగవాళ్ళని మించిపోతున్న మన ఆడవాళ్ళ ఎదుగుదలకి అవాంతరాలు కూడా ఆడవాళ్ళ నుంచే ఎక్కువగా వస్తున్నాయి”

 

అంటూ సత్యవతి ముఖంలోకి చూస్తూ ఆగింది ప్రభావతి.

 

సత్యవతి ఆశ్చర్యంగానూ, ఆసక్తి గానూ ఆవిడ చెప్పేది వింటోంది. ఆమెకు ఏం సమాధానం చెప్పాలో తెలీలేదు. ఇంట్లో ఈ సమయానికి భర్త లేడు కాబట్టి సరిపోయింది. ఉండి ఉంటే “ ఏమిటీ సంత? కూసే గాడిదొచ్చి మేసే గాడిదని చెడగొట్టే వ్యవహారాలివన్నీ. ఇవన్నీ నాకు ఇష్టం లేదండీ అని చెప్పి పంపించేసెయ్” అని అరిచి ఉంటాడు.

 

“ఇటువంటి కాలంలో మీరేమో… మీరు ఎదుర్కొన్న అణచివేత మీ కోడలికి జరగకూడదని, మీరు పడిన కష్టాలు మీ కోడలు పడకూడదని ప్రయత్నిస్తున్నారని విన్నాం. అటువంటి వారిని మేము నేరుగా కలిసి అభినందిస్తాం. మీ లాంటి వారిని అందరికీ ఆదర్శంగా చూపించి ఇంకా చీకట్లోనే మగ్గిపోతున్న పెద్ద వాళ్ళలో చైతన్యాన్ని కలిగిస్తాం. “ అంటూ మళ్ళీ ఆగింది ప్రభావతి.

 

ఈ సారి ఆవిడ మాటలు సత్యవతికి వెంటనే అర్థంకాలేదు. గుండెలో రాయి పడింది కోడలి ప్రస్తావన వింటూనే. ఎవరైనా మహిళా సంఘాల వాళ్ళకి పిలుపునిచ్చిందా కోడలు అని. కానీ, వీళ్ళేమిటి తనను అభినందిస్తున్నట్టుగా మాట్లాడుతున్నారు..

 

“మీరేం చెబుతున్నారో నాకు అర్థం కావట్లేదండీ. “అయోమయంగా ప్రభావతి వైపు చూస్తూ అంది సత్యవతి.

ఆమె వైపు చూస్తూ ప్రసన్నంగా నవ్వింది ప్రభావతి.

 

“సత్యవతి గారూ, ముందుగా మీ వ్యక్తిగతమైన విషయాలు ప్రస్తావిస్తున్నందుకు మన్నించండి. మీరు పెళ్ళయిన తరువాత సిధిలమైపోయిన అతి చిన్న ఇంట్లోనే పదిహేను సంవత్సరాలు నోరు మెదపకుండా కాపురం చేశారనీ, మీ నాన్నగారి దగ్గర ఉన్నప్పుడు పెద్ద పెద్ద బంగళా లాంటి ఇళ్ళలో, పందిరి మంచాలూ, దివానులూ ఇంటి నిండా నౌకర్లూ ఇలా పెరిగినా కూడా అత్తగారింట్లో అగ్గిపెట్టేల్లాంటి గదుల్లో, మంచమైనా లేకుండానే సర్దుకుపోయారనీ, స్థోమత ఉండీ కూడా అవన్నీ కొనకపోయినా మీరు నోరు తెరిచి ఏ కోరికా కోరకుండానే ఉండిపోయారనీ విన్నాము. నిజమేనా? “

 

సత్యవతికి వీళ్ళెవరో ముక్కూ మొహం తెలీని వాళ్ళు వచ్చి అకస్మాత్తుగా తను గడిపిన తన సంసార విషయాలు మాట్లాడుతున్నందుకు కోప్పడాలో, తను అంత గొప్ప ఇల్లాలని పొగుడుతున్నందుకు గర్వపడాలో అర్థం కాలేదు.

 

మౌనంగానే అన్నీ నిజమే అన్నట్టుగా తలూపింది ప్రభావతి వైపు చూస్తూ.

 

“ఊ.. అలా గడిపిన ఆడవాళ్ళు సాధారణంగా కోడలు రాగానే దేశ కాల పరిస్తితుల గురించి ఆలోచించకుండా ఆమె కూడా తమ లాగే కష్టపడాల్సిందే అనే మొండి తనంతో కొడుకు ఎదుట కోడల్ని అన్ని విషయాల్లో విమర్శిస్తూ తమ నిరాశల్ని కొంతవరకు చల్లార్చుకుంటున్నారు.

 

..కానీ మీరు ఈ చీకటి గూడులోంచి బయటికొచ్చి ఏం చేస్తే ముందు తరాల ఆడవాళ్ళు బాధపడకుండా ఉంటారో అదే చేస్తున్నారని విన్నాం”

“నేనేం చేశానండీ ..” చిరునవ్వుతో తనని చూస్తున్న ప్రభావతి వైపు ఆశ్చర్యంగా చూస్తూ అసంకల్పితంగానే అడిగేసింది ప్రభావతి భయం భయంగా.

ఆమెకు ఈ చర్చలు సాగే లోపే భర్త ఎక్కడ వచ్చేస్తాడో అని లోలోపల భయంగా ఉంది.

 

“భలే వారే సత్యవతి గారూ. స్త్రీ లోకానికి మీరు చేస్తున్న మేలు ఏమిటో మీకు తెలీకుండానే చేస్తున్నారు చూశారా? మీలా మీ కోడలు కష్టపడకూడదని మీ కొడుకు చాలా చిన్న ఇల్లు చూస్తుంటే కూడా గొడవ పెట్టి సింగిల్ బెడ్రూం ఫ్లాట్ తీసుకోమన్నారుట. మీరు మంచం లేకుండా కిందే పడుకుని కష్టపడ్డారని అలా చెయ్యొద్దని, మంచం మీద పడుకునే అలవాటు మీ కొడుకుకి లేకపోయినా కూడా కోడలి కోసం పెద్ద మంచం కొనిపించారుట. …. ఇవి చూస్తే తెలియడం లేదాండీ? మీదెంత మంచి మనసో.”

 

సూటిగా సత్యవతి ముఖంలోకి చూస్తూ ఒక్క క్షణం ఆగి “చెప్పండి సత్యవతి గారూ!” అంది ప్రభావతి గంభీరంగా.

“ఆ ...“ అని మాత్రం అనగలిగిందామె.

 

“సత్యవతి గారూ, ఈ విషయంలో పెద్దవాళ్ళలో ఒక అవగాహన కల్పించాలి. తరాలుగా నాటుకుపోయిన కొన్ని అర్థంలేని వాదాల్ని వదిలించాలని కొంత కాలంగా గట్టి ప్రయత్నమే చేస్తున్నాం మేము. అందుకు మీలాంటి వారి సహాయం మాకు చాలా అవసరం. రేపు మన సిటీ సెంటర్ హాల్లో ఒక మీటింగ్ ఉంది. అక్కడికి మీరు తప్పకుండా రావాలి. సాయంత్రం అయిదు గంటలకల్లా నేనే వచ్చి మిమ్మల్ని తీసుకువెళతాను. ఇక వస్తాం“ అంటూ తనతో వచ్చిన వారిని కూడా తీసుకుని ప్రభావతి బయటికి వెళిపోయింది.

 

సత్యవతి కలలో నడిచినట్టుగా వారిని సాగనంపాక, లోపలికి వచ్చి నేల మీద కూర్చుండిపోయింది ఆలోచిస్తూ. ఈవిడెవరో సుడిగాలిలా వచ్చింది కానీ, ఎక్కడో సత్యవతికి ఏదో తగిలినట్టుగా అనిపిస్తోంది.

 

అసలిదంతా ఎక్కడ మొదలైందో మాత్రం ఆమెకి అర్థం కాలేదు. కోడలికి ఫోన్ చేసి అడగాలంటే భయం వేసింది. కోడలితో తనకు సత్సంబంధాలుంటేగా? పైగా క్రితం వారమే ఫోన్ చేసి రూపతో “అల్లుడన్న మర్యాద కూడా లేకుండా మీ అమ్మా, నాన్నా నా బిడ్డ ని ఒక్కడినీ చేసి ఇష్టం వచ్చినట్టు క్రికెట్ ఆడుకుంటారా? బొత్తిగా మర్యాద తెలీని మనుషులు మీ వాళ్ళు. ఏదో వాడి కార్డు సరిగ్గా పని చెయ్యక నీ కార్డు వాడుకుని ఉంటాడు. అంతమాత్రానికే ఇంత రాధ్ధాంతం చెయ్యాలా” అంటూ నానా మాటలూ అంది తను. రూప ఏదో చెప్పాలని అనుకుంటుంది కానీ, ఆ పిల్ల చెప్పేది కనీసం విందామని కూడా ఎప్పుడూ అనుకోలేదు తను.

 

రేపు మీటింగుకి వెళ్ళాలని ఉంది తనకి. ప్రభావతి చెప్పిన ప్రతి మాటా ఏమిటో తిరిగి తన చెవిలో మారుమ్రోగుతోంది. యాభై ఏళ్ళలో ఇలా ఎప్పుడూ ఎవరూ తనను గుర్తించి , పొగిడి ఎరుగరు. ఎంత సర్దుకుపోయి బ్రతికినా ఏ నాడూ భర్త కూడా తనని పొగడలేదు. కానీ ఇప్పుడు రేపు ఇలాంటి మీటింగ్ అని తెలిస్తే ఇంకేమైనా ఉందా? ఉరుములూ, మెరుపులూ , తుఫాను…

 

                                     **********

 

“రూపా … నీకు అదేదో ‘మేలుకో నేస్తం’ అనే మహిళా అభ్యుదయ సంస్థట... అలాంటి వాళ్ళెవరైనా తెలుసా? “

 

వివేక్ గొంతులో మెత్తదనానికి ఏ మాత్రం మురిసిపోకుండా చూస్తూ “ఊ … ఆ సంస్థ ఈ మధ్య అన్ని ఊర్లల్లోనూ స్థాపిస్తున్నారు. ఇక్కడ నా స్నేహితులు కూడా అందులో ఏ లాభాపేక్షా లేకుండా పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు.” అంది రూప.

 

“ఓ … వాళ్ళతో నువ్వు అమ్మ గురించి ఏమైనా చెప్పావా? “

 

“ఊ... మొన్న నువ్వు చెప్పాక ఆలోచించాను. అత్తయ్య తను సుఖపడకపోయినా, మనసులో ఎటువంటి ఈర్ష్యా అసూయలూ లేకుండా నేను సుఖపడాలని నీకు హితబోధ చెయ్యడం నిజంగా మెచ్చుకోవాల్సిన విషయం. పాత కాలం అత్తగారయితే  చేసి ఉంటారు?‘ నలభై వేలు పెట్టి మంచమా? కింద పడుకోండి. ఎందుకు దండగ? మేము పడుకోవట్లా?‘ అని ఉండరూ? “

 

వివేక్ ముఖం రంగులు మారి, చివరికి చిరునవ్వుతో తన దగ్గరికి రావడాన్ని పట్టించుకోకుండా అంది.

 

“అదే రోజు అక్కడ పనిచేస్తున్న నా స్నేహితురాలు నాకు ఫోన్ చేసింది. చాలా కాలం అయింది మాట్లాడి అని. ఏదో మాటల్లో నాకు ఇంత మంచి అత్తగారు దొరికారని చెప్పుకున్నాను.“  వంటింట్లో పని కల్పించుకుని వెపోతూ అంది రూప.

“సరే సరే... చంటాడు పక్క తడిపినట్టున్నాడు. బట్టలు మార్చు త్వరగా వచ్చి”

 

“చెయ్యి బాలేదు. నువ్వు మార్చెయ్. ఎక్కువసేపు తడిలో నానితే మళ్ళీ డాక్టర్ల చుట్టూ తిరగాలి”

 

వంటింట్లోంచే గట్టిగా అంటున్న రూప మాట పూర్తవకుండానే అక్షరాలా ఆమె మాటను ఆచరించడం మొదలుపెట్టాడు.

                                                       ***********

 “ఎక్కడికి సత్యా? ఇంత బాగా తయారయ్యావు?“ టీ కప్పు ఆమె చేతికందిస్తూ అడిగాడు గుర్నాధం.

 

“నీలవేణి తరఫు వాళ్ళ అమ్మాయికి కొడుకు పుట్టాడుట. ఉయ్యాల పేరంటం ఉందిట ఎక్కడో. నీలవేణి వాళ్ళ వదిన వచ్చి తీసుకువెడతానంది.“ ఖంగారులో నోటికి వచ్చిన అబధ్ధం చెప్పేసి టీ కప్పు తీసుకుని సత్యవతి వంటింట్లోకి పరుగెత్తింది.

 

ఆమె అలా అంటూ ఉండగానే ప్రభావతి రావడం, సత్యవతి ఆలస్యం చెయ్యకుండా భర్తకి వెళ్ళొస్తానని చెప్పేసి ఆమె వెనుక వెళ్ళడం క్షణాల్లో జరిగిపోయాయి.

 

పెద్ద హాల్లో జనాలు నిండిపోయారు. పెద్ద డయాస్ చాలా సింపుల్ గా అలంకరించబడి ఉంది. ‘మేలుకో నేస్తం – మహిళాభ్యుదయ సంస్థ’ అని ఉన్న పెద్ద బేనర్ ని చూస్తూ ప్రభావతి వెనుకే ముందుకు నడిచిందామె. ఎక్కువ ఆలస్యం చెయ్యలేదు ఎవరూ. పది నిముషాల్లోనే డయాస్ మీద అందరూ వచ్చారు. ఎవరో గీతిక అనే ఆవిడ మొదటి ప్రసంగం చేసింది. కొత్తగా తమ సంస్థ చేపట్టిన కార్యక్రమాలు వాటి ద్వారా ఆడవారిలో ఏ రకంగా అవగాహన కల్పిస్తారు… ఇలా... ఆ తరువాత ప్రభావతి బలవంతంగా తన చెయ్యి పట్టుకుని తననూ డయాస్ మీదకి తీసుకువెళ్ళింది.

 

ప్రభావతి మైకు తీసుకుని ముందుగా సత్యవతిని పరిచయం చేసింది. ఆమె చేసిన పని ఆమె మనస్తత్వంగా చక్కటి భాషతో అందరి మనసుల్లోనూ నాటుకునేలా చెప్పింది. ..” ఇవి మీకు చాలా సాధారణ విషయాల్లాగే అనిపించొచ్చు. కానీ, చిన్న విత్తనం నుంచే మహా వృక్షాలు మొలకెత్తినట్టు ఈ చిన్న చిన్న సవరణలు జీవితాల్లో మొదలైతేనే అనూహ్యమైన మార్పులు ఆడవారి జీవితాల్లో చోటుచేసుకుంటాయి. ఆడదానికి తన ఆత్మాభిమానం ఎంత ముఖ్యమో పెళ్ళయ్యాక సాటి ఆడదానిగా అత్తగారు చూపే స్నేహం, తన భార్య మనసునీ, ఆలోచనల్నీ ఎలా గౌరవించాలో తన మాట గౌరవించే కొడుకుకి అర్థమయ్యేలా ఆమె చెప్పడం కూడా అంతే ముఖ్యం. ఒక పెళ్ళయిన స్త్రీ తన జీవితాన్ని తనకిష్టమైనట్టు తృప్తిగా గడపడంలో అత్తగారి పాత్ర కూడా ఉంటుంది. ‘సాటి స్త్రీ’ అనే ఎరుకతో స్నేహాన్నీ పెంచుకోవడమా? ‘కోడల్ని’ ఏ దృష్టితో చూడాలో పాత తరాల్ని అనుసరిస్తూ లోపాల్ని ఎత్తడమే ధ్యేయంగా, ఆ లోపాల్ని కొడుకు ముందు ఏకరవు పెట్టి వారి మధ్యన ఉన్న బంధాన్ని, బాంధవ్యాన్నీ అక్షింతలేసి ఆశీర్వదించిన చేతులతోనే తెంచెయ్యడమా? ఏది చెయ్యాలి?  బంధనాల్ని తెంచుకుని వెలుగు వైపు నడవాలని ప్రయత్నిస్తున్న ఈ కాలం ఆడవాళ్ళకి అమ్మలుగా, అత్తగార్లుగా మనం ఏ రకంగా సహాయం చెయ్యాలి? ఆలోచించండి. “

అంతలోపులోనే ప్రభావతి చేతిలోంచి అక్కడే వేదిక మీదున్న మరో అవిడ మైకు తీసుకుని “మీలో చాలా మంది అనుకోవచ్చు, ఈ కాలం ఆడపిల్లలు... కోడళ్ళుగా వచ్చిన వాళ్ళు అత్తగారిని ఆదరించకుండా, వేరు కుటుంబాలంటూ విడదియ్యకుండా ఎంత మంది ఉంటున్నారు? అని. ఏది సాధించాలన్నా ముందు ఎక్కడ మొదలుపెట్టాలో తెలుసుకోవాలి. తరాలుగా కోడలంటే ఎదురయ్యే ఆంక్షలు, అణచివేతలు వీటికి భయపడిపోయి ఈ కాలం పిల్లలు అలా ప్రవర్తిస్తున్నారు. వాళ్ళలో పెళ్ళంటే, అత్త మామలంటే పేరుకుపోయిన విముఖత పోవాలంటే ముందు అత్తగారు అనే పాత్ర యొక్క ఆలోచనలు, ప్రవర్తన , మనసు మారాలి. ఆ తరువాత కోడలి పాత్రలో రావల్సిన మార్పులు మనం ఎదురుచూడకుండానే వస్తాయి. ఈ నాటి కోడళ్ళు కొంత మంది అలా ప్రవర్తించడానికి కారణం తరతరాలుగా పెళ్ళయిన ఆడదాన్ని కట్టుబాట్ల పేరు చెప్పి ఆణచివెయ్యడమే కదా. స్వేఛ్చని తుంచేసి, కొడుకు , కోడల్ని స్వేఛ్చగా ఎగరనివ్వకుండా తాము చెప్పినట్టే చెయ్యాలి అనుకోవడమే కదా.  అది ఇప్పటికీ మనం తర్కంతో పని లేకుండా కొనసాగించడమే కదా.“ ఇలా సాగింది ఆవిడ ప్రసంగం.

 

ఆ తరువాత చాలా సేపటికి ఇంకా చాలా మందితో పరిచయం ఏర్పరుచుకుని సత్యవతి ఇంటికి వచ్చింది.

 

“ఏమిటి సత్యవతీ… ఉయ్యాల పేరంటం ఇంతసేపా? ఇల్లంతా ఎలా ఉందో చూడు. ఇంకా వంట పని కూడా అవలేదు. “

 

ఉరిమినట్టుగా ఉన్న గుర్నాధం గొంతుకి జడిసిపోతూ సత్యవతి వంటింటివైపు పరుగెత్తింది కానీ, ఆమె మెదడులో ఏదో అసంతృప్తి.

 

“పేరంటం అని అబధ్ధం చెప్పాల్సిన అవసరం ఏమిటి? “ ఇదివరకెప్పుడూ లేనిది ఆమె మనసే ఆమెను ప్రశ్నించడం మొదలుపెట్టింది.

 

ఆ రాత్రి నడుముకి నొప్పుల నూనే వ్రాసుకుంటుంటే మరో సారి ఆమె మనసామెను అడిగింది. “భర్తకు వచ్చే పింఛను కాక, తనకూ తండ్రి వల్ల కాస్త డబ్బు ముడుతోంది. తండ్రి తనకు పసుపు కుంకుమల కింద రాసిచ్చిన కొంత భూమి కౌలుకిచ్చిన రైతు నుంచి ప్రతి సంవత్సరమూ డబ్బు తన పేరు మీద బాంక్ లో జమ అవుతుంది. ఇప్పటికి అది ఎన్నో లక్షలు అయి ఉంటుంది. అవన్నీ భర్తే చూసుకుంటాడు. కనీసం తనకు ఒక్క మాట కూడా చెప్పడు. తెలుసుకోవాలని తను అడిగినా చెప్పేవాడు కాదు. విసిగి పోయి తనూ అడగడం మానేసింది. పిల్లలిద్దరికీ పెళ్ళిళ్ళు కూడా అయిపోయాయి. ఇక ఆరోగ్యాల్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన సమయం. ఇప్పుడు కూడా సుఖపడకుండా, శరీరాన్నిలా కష్టపెడుతూ... ఏం పొందడం కోసం. ఆ లక్షలు తరువాత ఏం చెయ్యడానికి? “

 

ఆ తరువాత చాలా రోజులు సత్యవతి కి నిద్ర రాలేదు.

 

ప్రభావతి తరచుగా ఆమెని ఉపన్యాసాలకి తీసుకు వెళుతూనే ఉంది. అభ్యుదయ వాదిగా వాళ్ళు తనకిస్తున్న గౌరవం మనస్ఫుర్తిగా అంగీకరించలేకపోతోంది సత్యవతి.

 

ప్రభావతి తో కలిసి తనూ చాలా చోట్లకి వెళుతోంది. కోడళ్ళని బాధపెడుతున్న అత్తగార్లనే కాదు, భర్తకు తెలీకుండానో, తెలిసీ తల్లిని పట్టించుకోని భర్తని చూసుకునో అత్తగార్లని హింస పెడుతున్న కోడళ్ళనీ కలిసింది. ప్రభావతితో పాటు వాళ్ళని కౌన్సిలింగ్ చేసేటప్పుడు తనూ అక్కడే కూర్చుంటోంది. అన్నీ వింటోంది. అన్నీ చూస్తోంది. మారే వాళ్ళనీ, మారని వాళ్ళనీ, ఎవరో వచ్చి తమను మార్చాలని ప్రయత్నిస్తున్నారని మరింతగా రెచ్చిపోతున్న వాళ్ళనీ. ఈ ఏడాది కాలంలోనే తనలాగే మరి కొంత మంది ఈ సంస్థకు చేయూతనిస్తూ చేరడం చూస్తోంది. ఇదంతా దేనికోసం?

ఏం సాధించింది?

 

ఏడాదిలో దాదాపు పది సార్లు ఇలాంటి కార్యక్రమాలకి తన అనుమతి లేకుండా వెళుతోందని భర్త కొట్టబోతే అతన్ని తీక్షణంగా చూసి అడ్డుకోగలిగింది ఇన్నేళ్ళ తరువాత. ఒకసారి ఎత్తిన చేతిని అతని కళ్ళలోకి చూస్తూ తను నెమ్మదిగా పట్టుకుని దించింది. తన కళ్ళు అతనికి ఏం చెప్పాయో తెలీదు కానీ, ఆ తరువాత గుర్నాధం తనను కొట్టే ప్రయత్నం ఇంతవరకూ చెయ్యలేదు. చాలా రకాలుగా తనను ఆపాలని చూశాడు. ఈ మధ్య ఆ ప్రయత్నాన్ని విరమించుకుంటున్నాడల్లే ఉంది. దీని వల్ల తను కోల్పోయినదేమిటి? పొందినదేమిటి?

 

అది తన మనసుకి తెలుసు. పుట్టినప్పటి నుంచీ ఎప్పుడూ పొందనిదేదో కొత్తగా లభిస్తోంది. పుట్టుకతోనే వచ్చాయనుకున్న సంకెళ్ళేవో తెంచుకునే బలం తన దగ్గరే ఉన్నట్టు అర్థమవుతోంది. ఎన్నో సంవత్సరాలు టీచరుగా పనిచేసిన తనకు ‘బ్రతకడం’ అనే మాటకి కొత్త అర్థం తెలుస్తోంది.

చాలా రోజుల సంఘర్షణ తరువాత మనస్ఫూర్తిగా రూపతో మాట్లాడాలని ఫోన్ చేసింది సత్యవతి.

 

“చెప్పండత్తయ్యా. ఎలా ఉన్నారు? “

 

“బావున్నానమ్మా. నువ్వెలా ఉన్నావు? చంటివాడు ఎలా ఉన్నాడు? “

 

“అందరం బావున్నాం. వచ్చేవారం నుంచీ ఉద్యోగంలో చేరుతున్నాను. దగ్గరలోనే ఒక స్కూల్లో. అక్కడే వీడిని ప్లే గ్రూప్ లో చేరుస్తున్నాను. ఉదయం ఎనిమిది నుంచీ మధ్యాహ్నం మూడు వరకూ. ఆ స్కూల్ లో టీచర్లకీ, పిల్లలకీ ఫలహారాలూ, మధ్యాహ్నం భోజనాలూ కూడా అక్కడే వండి పెడతారు. “

“బావుందమ్మా. నీ మనసుకెలా నచ్చితే అలా చెయ్యి”

 

ఆవిడ ప్రతి మాటా మనసులోంచే వచ్చిందని అర్థమయింది రూపకి.

 

మొబైల్ లో సేవ్ చేసి పెట్టుకున్న ఆ కొటేషన్ మరో సారి చూసుకోవాలనిపించింది ఆమెకి. “జీవితంలో ఎవరితోనైనా సరే కలిసి నడిచే సమయం చాలా చిన్నది. ఎవరి మీద కోపం పెట్టుకోకు. అలాగే ఎవరి మీదా ఆంక్షలు పెట్టి వారి స్వేఛ్చను హరించకు. నీ విలువ తెలుసుకోని వారి కోసం నీ విలువైన కన్నీటినీ, విలువైన సమయాన్నీ వృధా చేసుకోకు. ఎవరినైనా క్షమించెయ్. నీ కోసం. నీ మనశ్శాంతి కోసం. కడదాకా ఖచ్చితంగా నీతో నడిచేది నువ్వు మాత్రమే. ఆ నువ్వుని నీకుగా ఎప్పుడూ బాధపెట్టుకోకు. నిన్ను నువ్వు ఇతరుల కోసం కోల్పోకు. ఎందుకంటే ఇతరులతో కలిసి నడిచే సమయం అతి తక్కువ. “

 

కొన్నిసార్లు మనకు తెలిసిన విషయమే అయినా, అది సరయిన సమయంలో సరయిన మనుషుల నుంచి తెలుసుకున్నప్పుడు మెదడు లోపల ఏవో ద్వారాలు తెరుచుకుంటాయి. 

 

తను వెర్రిదానిలా వివేక్ ప్రవర్తనకి నిరాశా నిస్పృహలతో తనను తానే శిక్షించుకుంటున్న సమయంలో పల్లవి తనకు పంపిన కోట్. ఎన్ని చోట్ల ఎన్ని కోట్లు చదివినా ఎందుకో తనకి ఈ కోట్ పనిచేసింది. కాదు, బహుశా అప్పుడు ఆ కోట్ మెదడులోకి చేరడానికి తను అవకాశం ఇచ్చింది.

ఆ కొటేషన్ ప్రింట్ తీసి తెచ్చుకుని తన మంచం పక్కనే గోడకి అతికించుకుంది రూప.

 

రూపలో మార్పుకి కారణమేమిటో అది చూశాక వివేక్ కి అర్థమైంది కానీ, తల్లి తనను పిలిచి ఇంట్లో చిన్నప్పటి నుంచీ తాను చూసిన దానికి వ్యతిరేకంగా కుటుంబమంటే ఏమిటో, కుటుంబ సభ్యులతో ఎవరితో ఎలా మెలగాలో మెల్ల మెల్లగా తనకు ఇప్పుడెందుకు చెబుతోందో  మాత్రం వివేక్ కి ఇంకా అర్థం కాలేదు.

 

బహుశా … తల్లి ఇప్పుడు కొత్తగా చెబుతున్న మాటలు అర్థం చేసుకోవడానికి మెదడుకీ, మనసుకీ అతనింకా అవకాశం ఇవ్వడంలేదు ….

OOO

bottom of page