top of page

Website Designed &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

కథా మధురాలు

భలే మలుపు

Rajes Yalla

రాజేష్ యాళ్ళ

madhuravani.com అంతర్జాల పత్రిక నిర్వహించిన కథలపోటీ లో ప్రశంసా  బహుమతి సాధించిన కథ.

"రాసింది చాలు కానీ కొంచెం ఇలా వచ్చి ఉల్లిపాయలు కోసిపెట్టండి!" వంటగదిలోనుంచి వినపడిన భార్య అలివేలు మాటకు తెగ కోపం వచ్చేసింది గోవిందానికి!

"ఉల్లిపాయలు కోయడం నాకేమీ కొత్త కాదు కదా! ఇక్కడ రాసుకుంటున్నానని తెలిసి కూడా ఆ పని చెప్పడం ఎందుకు? పైగా 'రాస్తున్నది చాలు కానీ' అంటూ ఆ ఎద్దేవా మాటలెందుకు?" ఉక్రోషంగా అడిగాడు గోవిందం లోపలికి వెళ్ళి.

"ఉల్లిపాయలు కోస్తే కూరైనా అవుతుంది. కానీ మీరు కథను రాస్తే అది ప్రచురణ మారం అవదు కదా?!" లాజికల్‌గా అడిగింది అలివేలు.

"అలా అపశకునం మాటలెందుకు, ఈ కథ అచ్చవ్వొచ్చేమో కదా?!" గోవిందం ఇంకా కుతకుతలాడిపోయాడు.

"గత అయిదారేళ్ళుగా మీరా మాట అంటూనే ఉన్నారు. నేను వింటూనే ఉన్నాను. నిజానికి కథ రాయడం అనేది ఓ మంచి కళండీ. అది అందరికీ అంత తేలికగా అబ్బదు. అలా జరిగితే ప్రతి పనికిమాలిన వెధవా రచయిత అయిపోతాడు కదా!" వివ్రంగా చెప్పింది అలివేలు.

"అంటే నీ ఉద్దేశం కథలు రాసే ప్రతివాడూ పనికిమాలిన వెధవనా? నేను కూడా రాస్తున్నా కాబట్టి నన్ను కూడా అలా ఇన్‌డైరెక్టుగా తిడుతున్నావా?!" ఉడుక్కుంటూ అడిగాడు గోవిందం.

"అలా ఉడుక్కుంటారెందుకు, నేను అంటున్నదొకటీ, మీరు అనుకుంటున్నదొకటీ!  పైగా మీరు రచయిత అవుదామని ప్రయత్నిస్తున్నప్పటినుండీ ఒక్కపని కూడా సరిగ్గా అవ్వడంలేదు. ఎప్పుడూ పేపర్లు ముందేసుకుని కూర్చుంటారు. ఆ ఆలోచనల్లో మునిగిపోయి వేడి వేడి కాఫీని తాగేయబోయి మూతి కూడా కాల్చేసుకుంటారు. సగం రాసిన కాగితాలను ఎక్కడెక్కడో పడేసి, ఇంట్లో ఉన్నంతసేపూ ఆ కాగితాలకోసం వెతుకులాడుతూ ఉంటారు. ఎలాగో కథ రాయడం పూర్తి చేస్తారా... ఆ కథను చదువుతాను, విను అంటూ నన్ను పిలుస్తారు. చదివి ఎలా ఉందో చెప్పమంటారు. నేనా చాలా మొహమాటస్తురాలిని. ఏమని చెప్పాలో అర్థం కాదు." ముఖం అదోలా పెట్టుకుని చెప్పింది అలివేలు.

"అంటే నేనిచ్చే ప్రతి కథనూ నువ్వు యాంత్రికంగా చదువుటున్నావు కానీ మనసు పెట్టి ఇష్టంగా చదవవన్నమాట!" మళ్ళీ ఉక్రోషం పొడుచుకొచ్చింది గోవిందానికి.

"మీ మీద ఇష్టం కొద్దీ మొదట్లో ఆసక్తి తెచ్చుకునే చదివేదాన్ని. కానీ ఆసక్తి అనేది కథను రాసే విధానాన్ని బట్టి ఉంటుందని నాకు త్వరగానే అర్థమయింది, మీ కథల వల్ల! పైగా ఏవైనా సలహాలు ఇస్తే, మీరేమో సాహిత్యం గురించి నీకేం తెలుసు అని నా మీద విరుచుకుని పడిపోయేవారు. ఎందుకొచ్చిన గొడవని మీ కథలను చదవడం పూర్తిగా మానేసాను." నిష్కర్షగా చెప్పింది అలివేలు.

"మరి కథ చదివి ఎలా ఉందో చెప్పు అని నీకిచ్చినప్పుడల్లా, కాసేపటికి భలే రాసారండీ అంటూ చెప్పినవన్నీ అబద్ధాలేనా?!" గోవిందం కన్నుల్లో నీళ్ళు నిండాయి. ఈ టైంలో ఉల్లిపాయలు కోస్తూ ఉండటం మంచిదయింది అనుకున్నాడు మనసులో.

"అలా చెప్పకపోతే మీకు ఎంకరేజింగ్‌గా ఉండదని."

"అంటే కొంచెం కూడా నా కథలు నీకు నచ్చవా?" హతాశుడై ప్రశ్నించాడు గోవిందం.

"ఊహూ!" అని చెప్పి గోవిందం కోసిన ఉల్లిపాయ ముక్కల్ని మూకుడులో వేసి చిటపటలాడించడం మొదలుపెట్టింది అలివేలు.

తన మనసులో కలుగుతున్న అలజడికి ఆ ఉల్లిపాయల చిటపటలు సింబాలిక్‌గా అనిపించి తన మీద తనే తెగ జాలిపడిపోయాడు గోవిందం. అయినా తనో రచయిత. రాస్తూనే ఉండాలి! తన రచనలపైన తనకే నమ్మకం లేకపోతే ఎలా? అందుకే గుండె నిబ్బరించుకున్నాడు. గొంతు సవరించుకున్నాడు!

"ఎప్పుడైనా సరే, గొప్పరచయితలుగా పేరు పొందినవాళ్ళందరూ ఒకప్పుడు ఎదుటివారి చేత పెదవి విరిపించుకున్నవాళ్ళే! ఇలాంటి చిన్నా చితకా విమర్శలను నేనసలు పట్టించుకోను!" దిగ్గుమని లేచి హాల్లో ఉన్న తన కుర్చీ వైపు వెళ్ళబోయాడు గోవిందం.

"మీరలా వెళ్ళిపోతే ఈ కేరెట్లు ఎవరు కోస్తారు?" పదునుగా ప్రశ్నిచింది అలివేలు.

"కథ మధ్యలో ఆగిపోయిందే అలివేలూ! దాన్ని పూర్తి చెయ్యనీ." కోపాన్ని దిగమింగుకుంటూ చెప్పాడు గోవిందం.

"ఈరోజు రెండో శనివారం. సెలవే కాబట్టి మీరూ ఎక్కడికీ పోరు, మీ కథ ఎక్కడికీ పోదు! అన్నట్టు సమసమాజం, మహిళాజనోద్ధరణలాంటివి మీ కథల్లోనే కాదు మేష్టారూ, కొంచెం ఇంట్లో కూడా చూపించండి. అప్పుడే మీరు నిజమైన రచయిత అవుతారు." నవ్వుతూ చెప్పింది అలివేలు.

కిలకిలా నవ్విన ఆ అలివేలు నవ్వులో కోటి వెక్కిరింతలు కనబడ్డాయి గోవిందానికి. "నీ పనులు చేసిపెట్టాలనుకున్నప్పుడల్లా నా కథల ఊసెత్తి నన్ను లొంగదీసేస్తావ్!" తన అక్కసును అణచుకుంటూ అన్నాడు గోవిందం.

"నీ పనులూ నా పనులో ఏంటీ? ఇద్దరి పనులూ ఇవి! అదేగా మీరు కథల్లో చూపెడతారు?" ఎదురుబాణమేసింది అలివేలు.

ఆ బాణానికి మారుగా ఇంకేం మాట్లాడాలో తోచక పటపటా పళ్ళు నూరుతూ తన ప్రతాపాన్నంతా కేరెట్ల మీద ప్రయోగించసాగాడు గోవిందం.

"పాపం ఆ కట్టరేం చేసింది, కేరెట్లేం చేసాయి? నెమ్మదిగా కొయ్యండి మహానుభావా, లేకపోతే వేలు కోసుకోగలరు!" ముసిముసిగా నవ్వుకుంటూ చెప్పింది అలివేలు.

"ఎలా కొయ్యాలో నాకు తెలుసులే!" అంటూ ఆమెపై హుంకరిస్తూ తిరిగి పనిలో పడ్డాడు గోవిందం.

ఆ తరవాత బట్టలుతకడంలో అలివేలుకు సాయపడ్డాడు. కిరాణాసామాన్లు కావాలంటే మధ్యలో బజారుకెళ్ళొచ్చాడు.

"వంట లేటుగా చేసావ్, ఇవాళ పిల్లలకు కేరేజిలు లేవా?" మధ్యాహ్నం భోజనం చేస్తూ అడిగాడు గోవిందం.

"లేదు. ఇవాళ పిక్నిక్ కదా, స్కూల్ వాళ్ళే భోజనం ఏర్పాటు చేస్తామన్నారు. పోనీలెండి సెలవు రోజు కదా, వాళ్ళనలా ఎంజాయ్ చెయ్యనివ్వండి. లేకపోతే మీ కథలు చెప్పి వాళ్ళ బుర్రలు తినేస్తారు మీరు." కూర వడ్డిస్తూ చెప్పింది అలివేలు.

"బుర్ర తినడం ఏంటీ, నా కథలు బుర్రకు పదును పెట్టేవిగానే ఉంటాయ్!" అన్నంలో కూర కలుపుకోవడం మానేసి మరీ కోపంగా చెప్పాడు గోవిందం.

"అని మీ ఫీలింగ్ మేష్టారూ! కానీ అందరూ అలా అనుకోవద్దూ? పైగా మన పిల్లల వయసెంతని చెప్పండీ? బుజ్జితల్లికి ఎనిమిదేళ్ళు, నానిగాడికి ఆరేళ్ళు. అంత చిన్నపిల్లలే మీ కథలు బుర్ర తింటున్నట్టుగా ఉంటున్నాయని చెబుతోంటే అర్థం చేసుకోరేంటీ?!" సాగదీసింది అలివేలు.

"చిన్నపిల్లలని నువ్వేగా అంటున్నావ్! వాళ్ళకు నా కథలు అర్థం కాకపోయి ఉండొచ్చు కదా?!" లాపాయింట్ లాగాడు గోవిందం.

"అందుకే అంత పసికూనలపై మీ కథలను రుద్దకండి. జడుపు జ్వరాలొస్తే ఆనక డాక్టర్ల దగ్గరకు పరుగు పెట్టాలి." చెయ్యి కడుక్కోవడానికి లేస్తూ చెప్పింది అలివేలు.

"వాళ్ళకు తగిన విధంగా ఎలా రాయాలో నాకు బాగా తెలుసులే, పెద్ద చెప్పొచ్చావ్!" తనూ చెయ్యి కడుక్కోవడానికి వాష్‌బేసిన్ దగ్గరకు నడుస్తూ చెప్పాడు గోవిందం.

"ఈ పూట పనిమనిషి రాదు. ఈ నాలుగు ప్లేట్లనూ కాస్త కడిగేస్తే రాత్రి భోజనాలకు ఇబ్బంది ఉండదు." సింకులో కనిపిస్తున్న గిన్నెల వైపు చూపిస్తూ చెప్పింది అలివేలు.

"నువ్వేం చేస్తావు?" చిరాకుగా ప్రశ్నించాడు గోవిందం.

"తమరికి రుచికరమైన వంటలుంటే తప్ప ముద్ద దిగదు కదా మేష్టారూ! ఆ 'పోస్కోల్'టీవీ ఛానెల్లో 'తిండి-చిరుతిండి్' ప్రోగ్రాంలో కొత్త వంటేదైనా వస్తే రాసుకుని సాయంత్రం ట్రై చెయ్యాలి. మీరు గబగబా అంట్లు తోమేసుకుంటే మిగిలిన టైమంతా కథ రాసేసుకోవచ్చు!" భర్త అంగీకారంతో తనకు పనిలేదన్నట్టుగా హాల్లోకి వెళ్ళిపోయింది అలివేలు.

ఇక చేసేదేమీ లేక గబగబా సింక్‌లోని అంట్లన్నీ తోమేసుకుని, 'పోస్కోల్’ ఛానెల్ ఇల్లంతా అదరగొట్టేస్తూ ఉండటంతో తన సరంజామా అంతా బెడ్‌రూంలోకి తెచ్చుకుని తలుపులు గట్టిగా బిగించి కథ పూర్తి చేసేందుకు పూనుకున్నాడు గోవిందం.

ఉదయం అసంపూర్తిగా మిగిలిపోయిన కథను మళ్ళీ ఒకసారి చదువుకున్నాడు. చదవగానే అతనికే అదోలా అనిపించి సర్రుమని పెన్నుతో ఏటవాలుగా గీత గీసేసాడు. ఆ కాగితాన్ని ఉండ చుట్టి కింద పడేసాడు. మరో తెల్లకాగితాన్ని తీసుకుని కాసేపు ఏం రాద్దామా అని తీవ్రంగా ఆలోచించాడు.

అలా ఆలోచిస్తుండగా తనకు పిల్లల కథలు రాయడం రాదని అలివేలు ఎగతాళి చేయడం గుర్తుకొచ్చింది. పటపటా పళ్ళు కొరుకుతూ కోపంగా రాయడం మొదలుపెట్టాడు. ఒక కాగితం నిండగానే దాన్ని ఒకసారి మళ్ళీ చదువుకున్నాడు. గోవిందం మనసు మళ్ళీ చికాకుగా తయారయింది. అలా మరో మూడుసార్లు ప్రయత్నించి తను రాసింది తనకే భయంకరంగా తోచి, ఆలోచిస్తూ కళ్ళు మూసుకున్నాడు.

"ఇలా బెడ్‌రూం అంతా మీ కాగితం ఉండలతో చెత్త చేసేస్తే అస్తమానూ ఎవరు క్లీన్ చేస్తారు మేష్టారూ?" రెండు చేతులూ నడుం పైన వేసుకుని గుడ్లురిమి చూస్తున్న అలివేలు కనిపించింది గోవిందానికి.

'గడియ పెట్టుకోకుండా కూర్చోవడం తన తప్పే' అని మనసులో అనుకుంటూ, "తీసేస్తాలే అలివేలూ. ముందు నన్ను రాసుకోనీ!" అన్నాడు పైకి మాత్రం.

అలివేలు కోపంగా ఏదో చెప్పబోతుండగా కాలింగ్ బెల్ మ్రోగింది. పోస్టు వచ్చే టైం కావడంతో, ఉత్సాహంగా లేచి, అలివేలును తప్పించుకుంటూ అమెకూ, గోడకూ ఉన్న సందులోనుంచి అతికష్టం మీద దారి చేసుకుని ముందుగదిలోకి పరుగు పెట్టాడు గోవిందం.

పోస్ట్‌మేన్ నవ్వుతూ గోవిందం వైపే చూస్తూ నిలబడి ఉన్నాడు. అతను అలా నవ్వాడాంటే అది తిరిగొచ్చిన తన కథ గురించే అని గోవిందానికి బాగా తెలుసు. అందుకే ఆ నవ్వు చూస్తే చిర్రెత్తుకొస్తూ ఉంటుందతనికి. కానీ తన కథ అచ్చవుతుందో లేదో తెలియాలంటే ఈ పోస్ట్‌మేనే గతి అన్న విషయం కూడా గుర్తుకొచ్చి ఆ చిరాకునంతా చిరునవ్వుతో కవర్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు గోవిందం. ఈసారి కూడా అదే పని చేస్తూ, "కవర్ పడేసి వెళ్ళిపోవలసింది. డెలివరీకి చాలా పోస్టుండిపోయినట్టుంది కదా పాపం, టైం వేస్ట్ కదా నీకు?!" అన్నాడు.

"మీరు చెప్పింది నిజమే కానీ, కవరుకు సరిపడా స్టాంపులు అంటించకపోతే డ్యూ పడుతుంది. అది కట్టాలి కదా గురువుగారూ?!" నెమ్మదిగా అంటున్నట్టుగా ఉన్నా ఆ మాటల్లోని ఎగతాళికి హృదయంలో సూటిగా గునపం దిగినట్టనిపించింది గోవిందానికి.

ఆగ్రహాన్ని వెళ్ళగక్కడానికిది సమయం కాదని వివేకం హెచ్చరించడంతో, "ఎంత?" అని ముక్తసరిగా అడిగాడు గోవిందం.

"టెన్ రుపీస్ సర్. అయిదు రూపాయలు తక్కువ అంటించారు."

"ఇంద." అంటూ లోపలికి వెళ్ళి తీసుకొచ్చిన పదిరూపాయల నోటును అతని చేతిలో ఉంచాడు గోవిందం.

"కొంచెం బుర్ర పెట్టి రాయండి సర్. ఇంతింత బరువు పెట్టి కాదు." అంటూ లావుగా, ఉబ్బెత్తుగా ఉన్న కవర్ని అతని చేతిలో పెట్టాడు పోస్ట్‌మేన్.

"అంత బుర్ర లేకుండానే రాస్తున్నాననుకున్నావా? అయినా ఈ కవర్లో కథే ఉందని నీకు నమ్మకం ఏంటి?" ఈసారి తన కోపాన్ని కొంచెం విడుదల చేసాడు గోవిందం.

"ఫ్రం అడ్రస్ దగ్గర పత్రిక వాళ్ళ స్టాంపుంది కదా సర్. అయినా ఇలాంటి కవర్లు ఎందరికో అందిస్తూ ఉంటాం. ఇది తిరిగొచ్చిన కథ అని మేము ఆ మాత్రం కనిపెట్టలేమా?!" గోవిందం కోపాన్ని కొంచెం కూడా లెక్క చెయ్యకుండా పకాలున నవ్వి మరీ చెప్పాడు పోస్ట్‌మేన్. మాడిపోయిన ముఖంతో అతని వైపు చూసాడు గోవిందం.

"నెక్స్ట్ టైం బెటర్ లక్ సర్! ఈసారి బాగా రాయండి. డబ్బులేవైనా వస్తే నాకు టిప్ ఇద్దురుగాని. దసరాకు ఎలాగూ మామూలు ఇస్తారనుకోండి కానీ ఇది స్పెషల్ అకేషన్ కదా!" మళ్ళీ నవ్వాడు పోస్ట్‌మేన్.

ఆ నవ్వును చూస్తుంటే తన మీద గొంగళిపురుగులు పాకినట్టుగా తోచింది గోవిందానికి. ఉసూరుమంటూ ఇంట్లోకొచ్చాడు. సోఫాలో కూలబడి కవర్ని చింపి తన కథను తనే మళ్లీ చదువుకున్నాడు. అద్భుతంగా ఉందనిపించింది. అంతలోనే అది తిరిగొచ్చిన కథ అని గుర్తుకొచ్చి తోటకూర కాడలా మళ్ళీ సోఫాలో వెనక్కి వాలిపోయాడు!

"ఏంటీ... ఏమంటున్నాడు పోస్ట్‌మేన్? కథ బాగా రాయమని క్లాసు పీకాడా?!" నవ్వుతో కూడిన అలివేలు మాటలకు మళ్ళీ మరిన్ని గొంగళ్ళు పాకాయి గోవిందం ఒంటిపై.

"ఆఫ్టరాల్ పోస్ట్‌మేన్ గాడు ఎలా చెబితే అలా రాయాల్సిన విధంగా దిగజారలేదు నా కథలు! నీ ఎకసెక్కాలు ఆపు!" పెద్దగా అరిచాడు గోవిందం.

"కూల్‌డౌన్ మేష్టారూ, ఇదిగో ఈ టీ తాగండి. కొంచెం మీ బుర్రకు ఫ్రెష్‌గా ఉంటుంది. ఆ తర్వాత ఫ్రెష్ ఐడియా ఏదైనా వస్తుందేమో చూద్దాం." అంటూ టీకప్పును భర్త చేతికి అందించింది అలివేలు.

గిల్లి జోలపాడినట్టు టీ తెచ్చి అందించిన అలివేలు తీరుకు ఆమెను ఎలా కోప్పడాలో తెలియక అయోమయంగా చూస్తూ ఓ చేత్తో కప్పును అందుకుని, మరో చేత్తో బుర్ర గోక్కోసాగాడు గోవిందం.

"అన్నట్టు ఈవారం వీక్లీలో మీ కొలీగ్ మనోజ్ రాసిన కామెడీ కథ చదివారా? భలే నవ్వొచ్చిందండీ! కామెడీ కథ అంటే అలా ఉండాలి! మీరు కూడా చదవాల్సిన గొప్ప సరదాకథ! హహ్హహ్హ!" అలివేలు నవ్వులకు చిరాకేసి మళ్ళీ పొలమారిపోయింది గోవిందానికి.

"అయ్యో నెమ్మది...నెమ్మదిగా తాగండి మేష్టారూ! పోనీ మనోజ్ మీ ఫ్రెండే కదా, అసలు కథ ఎలా రాయాలి, దాని బేసిక్స్ ఏంటీ అని అతన్నే అడిగి తెలుసుకోవచ్చు కదా మీరు?!" నెత్తి మీద తడుతూ భార్య చెప్పిన ఒక్కొక్క మాటా ఒక్కొక్క తూటా పేలినట్టుగా అనిపించాయి గోవిందానికి.

"ఆ మాత్రం కథ రాయడం నాకూ చేతనవును. ఆ మనోజ్ గాడు కథలు రాయడం మొదలు పెట్టి పట్టుమని పదినెలలైనా కాలేదు. నేనెంత సీనియర్నో నీకు తెలుసు కదా, నన్నలా అవమానిస్తూ మాట్లాడతావేంటీ?" అంతెత్తున ఎగిరిపడాడు గోవిందం.

"అబ్బే మనోజ్ బాగా రాసాడు కదా, అతని సలహా తీసుకుంటే మీకేమైనా ఉపయోగపడుతుందని అలా చెప్పాను మేష్టారూ! సరే, తమరికి నాపై బాగా కోపం వచ్చినట్టుంది... ఈ కప్పులు కడిగి పెడతారనుకున్నా... సర్లెండి నా తంటాలేవో నేను పడతాను." అంటూ లోపలికి వెళ్ళింది అలివేలు. వెళుతూ వెళుతూ ఆమె కిసుక్కుమనడం మనసులో కసుక్కుమని దిగిన తుమ్మముల్లులా అనిపించింది గోవిందానికి. బాధగా మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు.

అలా ఓ పావుగంట గడిచాక కాలింగ్ బెల్ మ్రోగింది. గోవిందం, అలివేలు ఒకేసారి తలుపు తెరిచేందుకు వెళ్ళారు. పిక్నిక్‌నుంచి పిల్లలు తిరిగి వచ్చేసారు. కాసేపు వాళ్ళు చెప్పిన పిక్నిక్ విశేషాలతో కాలక్షేపమైపోయింది.

"మీరిద్దరూ ఫ్రెషప్ అవ్వండి. తినడానికేమైనా తెస్తాను." అంటూ లేచింది అలివేలు.

"ఓ యెస్!" అనుకుంటూ లోపలికి పరుగులు తీసారు బుజ్జితల్లీ, నానిగాడూ.

మరో అయిదు నిమిషాలకు ఒక్కసారిగా వాతావరణం మారిపోయి భోరుమంటూ వర్షం కురవడం ప్రారంభించింది. ప్లేట్లలో ఫలహారం తీసుకుని వచ్చిన అలివేలు గోవిందాన్ని అడిగింది, "లోపలెక్కడా కనపడలేదు? పిల్లలిద్దరూ ఏరి?"

"నేనూ చూడలేదు." నిర్లిప్తంగా సమాధానం ఇచ్చాడు గోవిందం. కథ తిరిగి వచ్చిందన్న బాధ అతని ముఖంలో లాగిపెట్టి కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.

"బైటకెళ్ళారేమో చూద్దాం రండి!" అంటూ వరండాలోకి నడిచింది అలివేలు. భార్య వెంట బైటకు దారితీసాడు గోవిందం.

అంతలోనే అలివేలు గట్టిగా నవ్వడంతో, ఏమయిందా అనుకుంటూ రోడ్డు మీదకు తొంగి చూసాడు. బుజ్జితల్లీ, నానిగాడూ కాగితాల పడవలను పారుతున్న వాననీటిలో వేసి అవి జోరున కురుస్తున్న వర్షానికి వేగంగా ముందుకు వెళుతుంటే ఆనందంతో కేరింతలు పెడుతున్నారు.

అప్పటికే పడవలన్నీ చెయ్యడం పూర్తయినట్టుంది. మెట్ల మీద కూర్చుని ఉన్న వాళ్ల పక్కనే అంతకు ముందే పోస్ట్‌మేన్ తెచ్చి ఇచ్చిన తిరిగొచ్చిన కవర్ ఖాళీగా వెక్కిరిస్తూ కనిపించింది గోవిందానికి!

 

"తిరిగొచ్చినా మీ కథ భలే మలుపు తిరిగినట్టుంది!!" అంటూ పకపకా నవ్వింది అలివేలు! గోవిందం మాత్రం కోపంగా పిల్లల్నీ, జాలిగా కవర్నీ  చూస్తూ ఉండిపోయాడు!!

OOO

bottom of page