top of page

కథా​ మధురాలు

లేత గులాబీ వెన్నెల

 

అనన్య

Ananya.jpg

Website Published &  Maintained by  Srinivas Pendyala | Mobile version is under construction. Use big screen for better experience.

 పొగమంచు కమ్ముతుంటే, తప్పించుకుంటూ చూస్తోంది ప్రభావతి. "అమ్మా, ఈరోజు పెన్సిల్ పోగొట్టుకోకుండా తీసుకొచ్చాను. ఇదిగో" అంటోంది ఐదేళ్ళ మినీ.

 

గొంతు చాలా సన్నగా నూతిలోంచి వినిపించినట్టు వినిపిస్తోంది. "వేరీ గుడ్, మినీ" అనాలనుకుంది కానీ గొంతు పెగలలేదు.

 

వంటింట్లోకి గబగబా పరిగెత్తుకొచ్చింది మినీ. పోనీటెయిల్ వేసుకుంది, జీన్స్ కేప్రి, లేత నీలం రంగు టీషర్ట్ లో చాలా అందంగా ఉంది. తన కూతురికి అప్పుడే పదహారేళ్ళంటే నమ్మకం కలగట్లేదు. "అమ్మా, నీ పుట్టినరోజుకి కూడా నువ్వే వంట చేస్తావా? ఈరోజు నేనే చేస్తాను" అంది. తను ఏదో అనబోయే లోపే, "ఎలా వస్తే అలాగే చేస్తాను. అనుభవించు మదరిండియా!" అని చేతులోంచి గరిటె లాక్కుంది. "వద్దే, ఇది గిఫ్ట్ కాదు, పనిష్మెంటే తల్లీ" అంది ప్రభావతి. "అమ్మా!" అని బుంగమూతి పెట్టుకుంది మినీ. ఎంత ముద్దుగా ఉంది! చేతులతో దగ్గరకి తీసుకోవాలి అనిపించింది. కానీ ఈలోపే ఆవిరైనట్టు ఎక్కడా కనిపించలేదు మినీ.

 

"అమ్మా, నాకు ఎక్స్ట్రా క్లాస్ ఉంది. సాయంత్రం లేటవుతుంది. తినేసేయ్" అని తలుపు వేసి మినీ వెళ్లిపోయింది. "బాక్స్ లో స్నాక్స్ పెట్టి ఇస్తాను ఉండవే" అంటూ గుమ్మం దగ్గరకి వెళ్ళే లోపే బైక్ స్టార్ట్ చేసి వెళ్లిపోయింది.

 

ప్రభావతి రెండు కళ్ళనూ వెనుక నుంచి తన చేతులతో మూసి పెట్టింది మినీ. "అబ్బా, ఏమిటే అల్లరి?" అంటుంటే, తనని పక్క గదిలోకి తీసుకువెళ్లి కళ్ళు తెరిచింది. ఎదురుగా టేబుల్ మీద పెద్ద ల్యాప్ టాప్ ఉంది. "నా మదరిండియాకి నా తొలి జీతంతో నేను కొన్న గిఫ్ట్" అంది మినీ. "నాకెందుకే? నువ్వు కొనుక్కోరాదూ?" అంటుంటే, తన రెక్క పుచ్చుకొని లాక్కెళ్లి ఆ టేబుల్ ఎదురుగా ఉన్న కుర్చీలో కూలేసింది. ల్యాప్ టాప్ ని ఆన్ చేయమంది. కానీ నొక్కుదామంటే స్విచ్ అందట్లేదు. ప్రభావతి ప్రయత్నిస్తోంది. కానీ స్విచ్ తన చూపుడు వేలికి తగలట్లేదు. ఇంతలో పెద్ద శబ్దం. దబా దబా ఎవరో తలుపుని బాదుతున్నట్టు. మినీ వెనక్కి తిరిగి చూసింది. ల్యాప్ టాప్ స్విచ్ ఆన్ చేద్దామని మళ్లీ ప్రయత్నించింది ప్రభావతి. మళ్లీ దబా దబామని శబ్దం మరింత గట్టిగా వచ్చింది. పక్కన మినీ లేదు. "మినీ!" అని గట్టిగా పిలిచింది. మినీ పలకలేదు. కాలింగ్ బెల్ గట్టిగా వినపడింది.

 

అంతటితో ప్రభావతికి పూర్తిగా మెలకువ వచ్చింది. మంచం దిగి వెళ్లి తలుపు తీసి పాలు పోయించుకుంది. "ఎంతసేపు తలుపు కొట్టాను మేడమ్? ఇంట్లో లేరేమో అని ఇప్పుడే వెళ్లిపోబోయాను" అన్నాడు. ఎప్పటిలాగే ఏమీ సమాధానం ఇవ్వకుండా తలుపు వేసి లోపలకి వచ్చింది ప్రభావతి. ఇల్లంతా నిశ్శబ్దం. కర్టెన్ చాటు నుంచి సూర్యకిరణాలు లోపలకి రావాలని విఫల ప్రయత్నం చేస్తున్నాయి. టీవీలో వార్తలు పెట్టుకొని వింటూ, ప్రభావతి కాఫీ తాగింది, చీర ఇస్త్రీ చేసుకుంది. స్నానం చేసింది. పొయ్యి మీద కుక్కర్ కూసింది. బాక్స్ లో లంచ్ సర్దుకొని, ఇస్త్రీ చేసుకున్న ఆర్గండి చీర కట్టుకొని, తల దువ్వి ముడి వేసుకొని, ఇంటికి తాళం పెట్టి, కార్ తీసుకొని బయల్దేరింది ప్రభావతి.

 

గత రెండేళ్ళుగా ఇదే వరస. ఎక్కువసేపు ఎక్కడా ఉండాలనిపించట్లేదు, ఎవరితోనూ మాట్లాడాలి అనిపించట్లేదు, ఎక్కడకీ వెళ్ళబుద్ధి అవ్వదు. ఉద్యోగానికి వెళ్లి రావటం తప్ప వేరే దేని మీదా ధ్యాస లేదు. మళ్లీ మళ్లీ తనని పలకరించే కలల నుంచి, శూన్యంలోకి చూస్తూ చేసే దీర్ఘాలోచనల నుంచి, కాస్తో కూస్తో తనకి విముక్తినిచ్చే తన ఉద్యోగ జీవితానికి దైనందిన శ్రీకారం చుడుతూ, హాంక్ చేస్తూ ప్రభావతి కార్ స్కూల్ ఆవరణలోకి వచ్చి ఆగింది రోజూలాగే.

 

ఎప్పుడూ గంభీరంగానే ఉండే ప్రిన్సిపాల్ కు వరండా దారిలో ఎదురవుతున్న టీచర్లు, పిల్లలు గుడ్ మార్నింగ్ చెప్తున్నారు. తల కొద్దిగా ఊపుతూ, కళ్ళతోనే వారందరికీ జవాబిస్తూ తన గదికి చేరింది ప్రభావతి. లంచ్ బాక్స్, హ్యాండ్ బ్యాగ్ అల్మరాలో పెట్టి, ఫోన్ ఒక్కటీ తన దగ్గర ఉంచుకుంది. ఈరోజు తాను నిర్వహించవలసిన ఇంటర్వ్యూ తాలూకు జాబితాను టేబుల్ పై పెట్టుకుంది. టేబుల్ పై అటెండర్ సిద్ధంగా ఉంచిన మంచినీళ్ళ సీసాలోంచి ఒక గుక్క తాగి, మూత పెట్టి, ఫోన్ అన్లాక్ చేసి, గ్యాలెరీ లోకి వెళ్లింది. మూడేళ్ళ క్రితం కూర్గ్ వెళ్లినప్పటి ఫోటోలు ఉన్నాయి. మినీకి ప్రకృతికి ఫోటోలు తీయటమంటే భలే సరదా. అందుకే తానున్న ఫోటోలు చాలా తక్కువ.

 

మధ్యలో ఒక వీడియో ఉంది. అమ్మకి వీడియో తీస్తూ, తనకి మాత్రం తీయద్దంటూ అల్లరి చేస్తోంది మినీ. అది చూస్తూ తనకి తెలియకుండానే నవ్వుకుంటోంది ప్రభావతి. ఆ వీడియో అవ్వగానే మళ్లీ ముఖమంతా విషాద మేఘాలు అలుముకున్నాయి. ఈలోపు ఫేస్ బుక్ నోటిఫికేషన్ ఏదో వస్తే, అసంకల్పితంగానే దాని మీద నొక్కింది ప్రభావతి. నిజానికి తనని ఫేస్ బుక్ ఎకౌంట్ వాడమని అప్పట్లో మినీయే బలవంతపెట్టేది. అప్పట్లో ఎకౌంట్ క్రియేట్ చేసినదీ మినీయే. తన పాత స్నేహితుల్లో కొందరిని ఫేస్ బుక్ ద్వారా జతకలిపింది. తనను తాను కూడా అమ్మ ఫ్రెండ్స్ జాబితాలో కలిపుకుంది. రోజుకి కొన్ని వందల సార్లు చేస్తున్న పని కనుక, అసంకల్పితంగానే తన చూపుడు వేలు ఆ పేరు దగ్గరకు వెళ్లింది.

 

"యామినీ చంద్ర". మినీకి, ప్రభావతికి చంద్రశేఖర్ దూరమయ్యాక, మినీ కావాలని లీగల్ గా తన పేరులో "చంద్ర"ని కలిపించుకుంది. "యామిని అంటే వెన్నెల. చంద్రుడు లేకుండా వెన్నెల ఎలా ఉంటుంది?" అని నవ్వేది. చంద్ర లేక చీకటైన ప్రభావతి జీవితంలో ఆ నవ్వే మళ్లీ వెన్నెలను నింపింది. యామినీ చంద్రకి స్నేహితులు వందల సంఖ్యలో ఉంటారు. కబుర్ల పుట్ట. నిరంతరం నవ్వుతూ గలగలా మాట్లాడుతూ ఉండేది. స్కూల్ వయసు స్నేహితుల నుంచి సహోద్యోగుల దాకా అందరికీ యామినీ చంద్ర అంటే ఇష్టమే. కిందకి స్క్రోల్ చేసి చూసింది. రెండేళ్ళ క్రితం ఆ ఎకౌంట్ వాడకం ఆగిపోయింది. అయినా ఇప్పటికీ ఏటా రెండు సార్లు ఆ ఎకౌంట్ లో మెసేజెస్ వెల్లువ ఉంటూనే ఉంటుంది.

 

"వుయ్ మిస్ యూ, యామినీ."

"ఆర్ ఐ పీ, యామినీ."

"నువ్వింకా మా మనసులోనే ఉన్నావు."

"రోడ్ రూల్స్ కఠినం చేయకపోతే ఇంకా చాలా మంది యామిని లను కోల్పోతాము"

"డ్రింక్ & డ్రైవ్ కి శిక్ష పెంచాలి"

 

ఇంకా ఏవేవో మెసేజెస్ ఉన్నాయి. కన్నీళ్ళ మసకలో అవేమీ కనిపించటం లేదు. బయట అటెండర్ మూడో బెల్ కొట్టాడు. జేబురుమాలుతో కళ్ళు తుడుచుకొని, కళ్ళజోడు పెట్టుకొని, ఫోన్ లాక్ చేసి డ్రాలో పెట్టి, స్కూల్ అసెంబ్లీకి వెళ్ళటానికి బయల్దేరింది ప్రభావతి.

 

గది బయటకి వెళ్ళగానే, బిగ్గరగా ఎవరో "మినీ" అని పిలవటం వినిపించింది. వెంటనే ఆమె ఒళ్ళు జలదరించింది. ఒక్కసారిగా వెన్నుపూసలోంచి చలిగాలి జివ్వుమని వేగంగా ప్రవహించినట్టు అనిపించింది. రెండేళ్ళు అయ్యింది ఆ పిలుపు విని! నాలుగు అడుగులు వేగంగా వేసింది అటువైపు. వెయిటింగ్ ఏరియాలోకి నడిచి వెళ్లిన ఒక కుర్రాడు ఎవరికో ఒక ఫైల్ అందించి, వెనక్కి వస్తున్నాడు. అవతల వ్యక్తిని చూడాలని ప్రయత్నించింది కానీ స్తంభం అడ్డు వస్తోంది. ఫైల్ తీసుకున్నట్టుంది. మళ్లీ సోఫా మీద అటు తిరిగి కూర్చుంది ఆ వ్యక్తి. తెల్లటి కాటన్ చున్నీ మాత్రం కనిపించింది. అటు వెళ్లి చూడాలని అనిపించినా, మళ్లీ తన స్థానం గుర్తొచ్చి, తమాయించుకొని వెనుదిరిగి, అసెంబ్లీ ముగించుకొని తన గదికి వెళ్లింది ప్రభావతి. కానీ రోజూ లేనిది ఈ రోజు అసెంబ్లీ చాలా ఎక్కువసేపు జరిగినట్టుంది. క్షణమొక యుగంగా గడిచినట్టు అనిపించింది.

 

వెంటనే అటెండర్ ను పిలిచి, ఇంటర్వ్యూ మొదలుపెట్టేస్తాను, ఒకొక్కరినీ పంపమంటూ అభ్యర్థుల జాబితాను అతనికిచ్చింది ప్రభావతి. తన నోట్ బుక్, పెన్ సిద్ధం చేసుకుంది. ఇంకా టైమ్ నత్త నడక నడుస్తున్నట్టే ఉంది. ఒకొక్కరుగా అభ్యర్థులు వస్తున్నారు, ఇంటర్వ్యూ అయ్యి వెళ్తున్నారు. వనజ, మాధురి, లలిత, శాంతి, సంధ్య, వసుంధర. వీళ్ళంతా అయ్యాక అప్పుడు అటెండర్ పిలిచాడు."సౌదామినీ పరస్... పరస్..." అని నట్టుకుంటున్నాడు. ఇంతలో ఆ అమ్మాయే వచ్చింది. నోట్ బుక్ లోంచి తలెత్తి చూసింది ప్రభావతి. తెల్లటి కాటన్ చూడీదార్, తల చక్కగా దువ్వి వేసిన పొడవాటి జడ, పెద్ద పెద్ద కాటుక కళ్ళు, చిన్న నిలువుబొట్టు, దానిపైన అడ్డంగా విభూతి రేఖ. చుడీదార్ వేసుకున్న శారదాదేవిలా ఉంది.

 

"గుడ్ మార్నింగ్ మేమ్" అంది. గొంతులో సన్నటి బొంగురుతనం, మళయాళం యాస. లోపలకి వచ్చి కూర్చోమని సైగ చేసింది ప్రభావతి. "అయామ్ సౌదామినీ పరశురామన్, మేమ్" అంటూ సర్టిఫికేట్ల ఫైల్ అందించింది. ఫైన్ ఆర్ట్స్ లో ఎమ్మే చేసింది. ఆర్ట్ టీచర్ ఉద్యోగానికి అప్లై చేసిందట. మరో ఫైల్ ఇస్తూ, "ప్లీజ్ హేవె లుక్ ఎట్ దెమ్, మేమ్" అంది ఆ పిల్ల. తాను గీసిన బొమ్మలన్నీ ఉన్న ఫైల్ అది. ఈ ఫైల్ నే ఆ కుర్రాడు ఇందాక తెచ్చి అందించాడు. అతనెవరో! రకరకాల చిత్రపటాలు, ఇక్కడకి తెచ్చి చూపించలేని కొన్ని కళాఖండాల ఫోటోలు ఉన్నాయి అందులో.

 

అంతా బానే ఉంది. "మీ కుటుంబం అంతా ఇక్కడే ఉంటారా?" అని అడిగింది ప్రభావతి.

"లేదు మేమ్. అవరు కొట్టాయంలో ఉంది. నేను ఇవడ హాస్టల్ లో ఉంటుంది" అంది. "ఎందుకు ఇంత దూరం వచ్చారు? అక్కడ స్కూల్స్ ఉంటాయి కదా?" అని అడిగింది ప్రభావతి.

"నేను హైదరాబాద్ లో ఉంది చాలా ఇష్టం ఉంటుంది మేమ్. మంచి ఊరు" అంది ఆ అమ్మాయి.

 

చూడముచ్చటగా ఉంది ఈ అమ్మాయి. వచ్చీ రాని తెలుగు కష్టపడి మాట్లాడుతుంటే ముద్దుగా కూడా ఉంది. "ఒక డెమో క్లాస్ ఇవ్వాలి మీరు. అది బాగుంటే మిగిలిన విషయాలు మాట్లాడుకుందాం" అని ఎప్పటిలాగే చెప్పి పంపించింది.

**

 

    "అమ్మా, నాకెందుకిప్పుడు చీర? నేను చీరలు ఎప్పుడు కట్టుకుంటాను, మదరిండియా? అందులోనూ కాటన్ చీరా! మా అమ్మ కదూ? నువ్వే కట్టేసుకో" అని బ్రతిమాలుతోంది మినీ.

 

"అలా కాదు. ఒక్కసారి కట్టుకొని చూడవే. పెళ్లికైనా కట్టుకోవాలి కదా? చీరలే కట్టుకోకుండా ఎలా? ఒక్కసారి నాకోసం కట్టుకో. నీకిష్టమైన లేత గులాబీ రంగు చీరే తెప్పించాను. నా తల్లి కదూ?" అని బుజ్జగిస్తోంది ప్రభావతి.

 

"చీర కట్టుకొనే కంటే, నేనసలు రిజిస్టర్డ్ మేరేజ్ చేసేసుకుంటాను" అంది మినీ.

 

"ఆ మాట అనకు. సరేలే, నాన్నకి చాలా ఇష్టం కదా అని, ఈ పుట్టినరోజుకైనా కట్టుకుంటావేమో అనుకున్నాను, సరే, వద్దులే" అని తనదైన పాచిక వాడింది ప్రభావతి.

 

"సరే, ఇప్పుడు కాదు. సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చాక కట్టుకుంటాను. సరేనా?" అంటూ ఎప్పటిలాగే ప్యాంట్, షర్ట్ వేసుకొని ఆఫీసుకి బయల్దేరింది మినీ. ఆరోజు సాయంత్రం గుడికి వెళ్లినప్పుడే తన చిన్ననాటి స్నేహితురాలు పుష్పలతని కూడా గుడికి రమ్మని పిలిచింది ప్రభావతి. లత తన భర్త, కొడుకుతో అక్కడకు వస్తే, అప్పుడే మినీకి ఆ కుర్రాడిని పరిచయం చేయచ్చని తన ప్లాన్. చీర కట్టటానికే గొడవ చేసే మినీ పెళ్లిచూపులంటే ఒప్పుకోదని తనకి తెలుసు. లేత గులాబీ రంగు చీరలో మినీ చాలా అందంగా, హుందాగా ఉంటుంది. బాగా చదువుకున్నది. మంచి ఉద్యోగం చేస్తోంది. అవతలి కుర్రాడు కూడా అందుకు తగిన గుణవంతుడనే అతను తన అల్లుడైతే బాగుంటుందని ప్రభావతి ఆశ. కానీ, ఆరోజు గుడికి వెళ్ళలేదు. వాళ్ళని కలవలేదు.

 

స్టవ్ మీద కాగిన పాలు పొంగటంతో జ్ఞాపకాల్లోంచి బయటకి వచ్చింది ప్రభావతి. స్కూల్ కి బయల్దేరాల్సిన టైమ్ అయ్యింది. మొన్న ఇంటర్వ్యూ చేసిన టీచర్లలో కొందరికి ఈరోజు డెమో క్లాస్ ఉంది. "ఆ కేరళ పిల్ల ఈరోజే అనుకుంటా వచ్చేది" అనుకుంది. తనకి సౌదామిని బాగా నచ్చింది. నిజానికి "మిని" అన్న రెండు అక్షరాలు తప్ప తన కూతురికీ ఆ మళయాళం పిల్లకీ ఎందులోనూ పోలిక లేదు. మినీకి ఓపిక తక్కువ. సౌదామినికి ఓపిక ఎక్కువే అని శ్రద్ధగా గంటలకొద్దీ వేసిన చిత్రపటాలు చూస్తేనే తెలుస్తోంది. ఆ కాటుక, కట్టు-బొట్టు, పెద్ద జడ. మినీని అలా ఊహించుకోవటం కూడా కష్టమే. జుట్టుకి ఒక క్లిప్ తగిలించాలన్నా టైమ్ వేస్ట్ అనుకుంటుంది మినీ. మినీ ఇంగ్లీష్ లోనే ఎక్కువ మాట్లాడుతుంది. సౌదామిని అంత అనర్గళంగా ఇంగ్లీష్ లో మాట్లాడలేకపోయింది, ఒకవేళ చిన్న చిన్న వాక్యాలు మాట్లాడినా, మళయాళం యాస బాగా తెలుస్తోంది. అయినా తన చేతిలోని కళను పిల్లలకి నేర్పటానికి ఆమాత్రం భాష సరిపోతుందిలే అనుకుంది ఆరోజు. డెమో క్లాస్ అనేది నామమాత్రమే. సౌదామినికి ఉద్యోగం ఇచ్చేయాలని ప్రభావతి ఆనాడే నిర్ణయించుకుంది.

 

కార్ నడుపుతూ ఆలోచిస్తోంది ప్రభావతి. ఎందుకు సౌదామిని తనకి అంతగా నచ్చింది? చూడముచ్చటగా ఉంది కాబట్టా, బొమ్మలు బాగా వేస్తోంది కాబట్టా, లేక నిజంగా "మినీ" అన్న రెండు అక్షరాల వల్లా? ఒకవేళ ఆఖరి కారణమే నిజమైతే, అలా ఉద్యోగం ఇవ్వటం నైతికంగా తప్పు కదా? సరే, డెమో క్లాస్ నచ్చకపోతే ఉద్యోగం ఇవ్వకూడదు అని నిర్ణయించుకుంది కారు దిగే లోపు. కానీ డెమో క్లాసులో కూడా తానొక ఉత్తమ టీచర్ కాగలదని సౌదామిని నిరూపించుకుంది. పై సోమవారమే ఉద్యోగంలో చేరింది.

**

        

ప్రిన్సిపాల్ గారిలో ఈమధ్య వచ్చిన మార్పు టీచర్లందరికీ స్పష్టంగా కనిపిస్తోంది. ఆ విషయం ప్రభావతికి కూడా అర్థమవుతోంది. నవ్వుతూ మాట్లాడుతోంది. ఒకటికి నాలుగు సార్లు స్కూల్ అంతా తిరిగి చూస్తోంది. చిన్నపిల్లల కేరింతల్లో ఆనందాన్ని చాలా కాలం తర్వాత మళ్లీ పొందగలుగుతోంది. కొన్నాళ్ళుగా నచ్చని రంగులు, రుచులు మళ్లీ ఎందుకో నచ్చటం మొదలుపెట్టాయి. స్కూల్ అయిపోయాక అప్పుడప్పుడూ పెద్ద క్లాసుల పిల్లలతో వాలీ బాల్ ఆడుతోంది. ఇంటికి వెళ్ళాక టీవీలో పాటలో, సినిమాలో చూడటం మళ్లీ మొదలుపెట్టింది. ఉదయం లేవగానే కిటికీ కర్టెన్లు తప్పుకోవటం వల్ల, సూర్యకిరణాలు విజయవంతంగా లోపలకి వచ్చి పడుతున్నాయి. స్టవ్ మీద పాలు పొంగటం తగ్గింది. కాఫీ రుచి చాలా బాగున్నట్టు అనిపిస్తోంది. వంటల్లో కొత్త ప్రయోగాలు జరుగుతున్నాయి. పాత స్నేహితులను, బంధువులను పలకరించి మాట్లాడుతోంది. ఈ మార్పుకు అందరూ ఆశ్చర్యంలో మునిగితేలుతున్నారు.

 

ప్రభావతి ఒక్కదానికే తెలుసు ఈ మార్పుకు కారణం. చంద్ర లేని లోటును మినీ చిరునవ్వు తీర్చినట్టే, మినీ లేని లోటును సౌదామిని పూడ్చింది. ఆమెతో కొంచెం సేపు మాట్లాడినా చాలు. "ఈ బొమ్మ ఎలా వేశావు?" అనో, "ఈ పెయింట్ నీటితో తుడిస్తే చెరుగుతుందా?" అనో, ఏదో ఒక చిన్న ప్రశ్నతో సంభాషణను మొదలుపెడితే చాలు. పొడవాటి జడను కాసేపు ముందుకి, కాసేపు వెనక్కి వేసుకుంటూ, విశాలమైన కాటుక కళ్ళను అటూ ఇటూ తిప్పుతూ మళయాళం యాసలో ముద్దుగా చెప్పే ఆ కబుర్లు, బొంగురు గొంతుతో నవ్వే ఆ నవ్వు, ఆ కళకళలాడే ముఖం కళ్ళు మూసినా తెరిచినా గుర్తుకొస్తోంది. ఫేస్ బుక్ లో "రెస్ట్ ఇన్ పీస్" మెసేజులు చూడటం ఈమధ్య తగ్గింది. శూన్యంలోకి చూస్తూ ఆలోచించటం దాదాపు మానేసింది. ఉదయం చిరునవ్వుతో లేస్తూ, ఒకసారి మినీవి నాలుగు ఫోటోలు చూడటం, తర్వాత తన దైనందిన జీవితంలోకి ఉత్సాహంగా దూకటం అలవాటుగా మారాయి.

 

ఇలా ఉండగా ఒకరోజు స్కూల్ అసెంబ్లీ జరుగుతుండగా సౌదామిని కోసం చూసింది. ఎక్కడా కనపడలేదు. స్టాఫ్ రిజిస్టర్లో సంతకం లేదు. ఒంట్లో నలతగా ఉందేమో అనుకుంది. కానీ ఇంకో మూడు రోజులు రాకపోయేసరికి, ఆఫీస్ డేటాబేస్ లోంచి నంబర్ తీసుకొని తానే ఫోన్ చేసింది. సౌదామిని గొంతు పూడుకుపోయి ఉంది. బాగా జలుబు భారం ఉన్నట్టుంది. "స్కూల్ కి రావట్లేదు? ఒంట్లో బాలేదా?" అని అడిగింది ప్రభావతి. "లేదు మేమ్. రేపు నేను ఊరు వెళ్లిపోతుంది. మీకు ఇన్ఫార్మ్ చేసలేదు. వెరీ సారీ మేమ్. మళ్లీ ఇవడ రావటం వీలు లేదు మేమ్" అంది గట్టిగా ఏడుస్తూ. ప్రభావతికి ఒక్కసారిగా కాళ్ళ కింద భూకంపం వచ్చినట్టు అనిపించింది. రెండేళ్ళ క్రితం మినీ తనకి దూరమైనప్పుడు ఇలాగే అనిపించింది. ఒంట్లో సత్తువ మొత్తం ఒక్కసారిగా ఎవరో తోడేసినట్టు.

 

సౌదామిని తన ఊరికి తను వెళ్తుంటే తనకెందుకు ఇంత బాధ కలుగుతోంది? తనకే తెలియకుండా మానసికంగా సౌదామినికి మినీ స్థానాన్ని ఇచ్చేసిందన్నమాట. సరే, ఊరే కదా వెళ్తానంటోంది? మరి ఎందుకు అంతగా ఏడుస్తోంది? ఇష్టం లేకుండా వెళ్తోందా? అక్కడ ఎవరికైనా బాగా లేదా? క్షణాల నిడివిలో ఈ ప్రశ్నలన్నీ వరుసగా ప్రభావతి బుర్రను తొలిచేస్తున్నాయి. "మేమ్?" అంది సౌదామిని. "మినీ! నువ్వు ఎక్కడున్నావు? ముందు ఒకసారి నిన్ను కలవాలి. నాకు నీ లొకేషన్ ఈ నంబర్ కి వాట్సాప్ లో పంపు" అంది. చకచకా చెప్పులు వేసుకొని కార్ ఎక్కింది. సౌదామినిని "మినీ!" అని పిలిచింది తను! అలా పిలవాలని తను అనుకోలేదు. రెండేళ్ళ తర్వాత తన నోటి లోంచి ఆ సంబోధన వచ్చింది.

 

వాట్సాప్ లో లొకేషన్ ప్రకారం బజార్లో ఒక సెంటరులో సౌదామినిని చేరుకుంది. పక్కనే ఒక కుర్రాడు ఉన్నాడు. ఆరోజు ఫైల్ ఇచ్చిన కుర్రాడు ఇతనే అని గుర్తుపట్టింది ప్రభావతి. సౌదామిని ముఖం ఏడవటం వల్ల ఉబ్బిపోయి ఉంది. ఆ కుర్రాడి ముఖం అయోమయంగా, హైరానా పడుతున్నట్టుగా ఉంది. ప్రభావతిని చూడగానే నమస్కారం పెట్టాడు అతను.

 

"మేమ్, ఇవరు ప్రవీణ్. నాకు... ఫ్రెండ్" అంది సౌదామిని. "నాకు" కి, "ఫ్రెండ్" కి మధ్య అంత దూరం ఎందుకు ఉందో ప్రభావతికి అర్థమయ్యింది. "ఏమిటా ఏడుపు ముఖాలు? ఇలా రోడ్డు మీద కాదు. మీకు అభ్యంతరం లేకపోతే మా ఇంటికి రండి. అక్కడ మాట్లాడుకుందాం" అంటూ కార్ దగ్గరకి తీసుకువెళ్లింది.

 

మంచినీళ్ళు తాగి, ఆ కుర్రాడు చెప్పటం మొదలుపెట్టాడు. "మేమ్, నా పేరు ప్రవీణ్. ఇక్కడే ఉద్యోగం చేస్తున్నాను. మినీని నేను ఏడాది క్రితం చెన్నై వెళ్లినప్పుడు ఒక ఆర్ట్ ఎగ్జిబిషన్లో కలిశాను. నిజానికి తను నాకోసమే ఈ ఊళ్ళో ఉద్యోగం చేస్తానని వచ్చింది. మా ఇంట్లో మినీ గురించి చెప్పాను. చాలా రోజులుగా సంఘర్షణ జరుగుతూనే ఉంది. కానీ ఏనాటికైనా ఒప్పుకుంటారు. వాళ్ళ ఆశీర్వాదంతోనే మా పెళ్లి జరుగుతుందని నాకు నమ్మకం ఉంది. కానీ ఇప్పుడు ఉన్నట్టుండి మినీకి వచ్చే వారం పెళ్ళంటూ వాళ్ళ ఇంట్లో వాళ్ళు పిలిచారు".

 

సౌదామిని వెక్కి వెక్కి ఏడుస్తూ చెప్తోంది. "ప్రవీణ్ పేరెంట్స్ ఓకే అంటారు, అప్పుడు మా పేరెంట్స్ ని అడగటం అనుకున్నాను మేమ్. కానీ 4 రోజులు అయ్యింది, సడన్ ఫోన్ చేసింది అమ్మ, నాన్న. కోవెలలో  కళ్యాణం అంటుంది. నాకు చాలా భయం ఉంది మేమ్. నేను ఇప్పుడు కొట్టాయం వెళ్తే, ఇంక ఇవడకు రావటం ఇంపాజిబుల్. కళ్యాణం, కొచిన్ లో మణవాలన్ ఫేమిలీ. మళ్లీ ప్రవీణ్ ముఖం కూడా చూస్కోలేదు. అంతకంటే నేను సూసైడ్ చేస్తే అయిపోతుంది అనుకుంది మేమ్" అంటూ పెద్దగా ఏడ్చింది. వెంటనే ప్రవీణ్ అందుకున్నాడు. "చూశారా మేమ్? ఇలాగే పిచ్చిపిచ్చిగా మాట్లాడుతోంది నాలుగు రోజుల నుంచి. ఇంక పేరెంట్స్ ని పక్కనపెట్టి ఎక్కడికైనా వెళ్లి పెళ్లి చేసుకుందాం అంటున్నాను. దానికీ ఏడుస్తోంది. అన్నిటికీ భయపడుతోంది. అదీ కావాలి, ఇదీ కావాలి అంటే కుదురుతుందా మేమ్, అసలే టైమ్ లేనప్పుడు?" అన్నాడు.

 

ప్రభావతి పెద్దగా ఊపిరి విడిచింది. రెండు నిముషాలు మౌనంగా ఉండిపోయింది. "ముందు ముఖాలు కడుక్కుని కాస్త కాఫీ తాగండి" అంటూ వాష్ బేసిన్ చూపించింది. వాళ్ళు ముఖాలు కడుక్కున్నాక కాఫీ తెచ్చి ఇచ్చింది. "మినీ, మీ పేరెంట్స్ తో నేను మాట్లాడతాను. అర్థం చేసుకునేలా మాట్లాడతాను. ప్రవీణ్ తో నీ పెళ్లి జరిగేలా చూసే బాధ్యత నాది. కొట్టాయానికి నీకే కాదు, నాకు, ప్రవీణ్ కి, వాళ్ళ తల్లిదండ్రులకి కూడా టికెట్లు తియ్యి. కేరళ చూడాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. నీ పెళ్లి అయ్యాక మా అందరికీ మీ ఊరు చూపించు. ఇప్పుడు ముందు ప్రవీణ్ ఇంటికి వెళ్దాం" అంది. ఆ గొంతులో విశ్వాసం ఆ జంటకి చాలా ధైర్యాన్ని ఇచ్చినట్టయింది. "చాలా థాంక్స్ మేమ్. ఈ పిచ్చి పిల్ల అన్నంత పనీ చేస్తుందేమో అని భయపడి వాళ్ళ హాస్టల్ చుట్టూ తిరుగుతున్నాను మొన్నటి నుంచి. మీ మాటలతో ముందు నాకు ధైర్యం వచ్చింది" అంటూ నవ్వాడు ప్రవీణ్.

 

"ఒక్క నిముషం" అంటూ లోపలకి వెళ్లి బీరువా లోంచి లేత గులాబీ రంగు చీర తెచ్చి సౌదామినికి ఇచ్చింది ప్రభావతి. "ఇది నా నుంచి నీకు పెళ్లి కానుక" అంటూ సౌదామిని భుజం మీద వేసింది. "గులాబీ పువ్వులా ఉన్నావు. ఎప్పటిలాగా కళకళలాడుతూ తయారవ్వు. నీ అత్తారింటికి వెళ్తున్నాం" అంది ప్రభావతి. ఆవిడ కాళ్ళకి దండం పెట్టి, "అమ్మా, థాంక్యూ అమ్మా" అంది మినీ.

******

bottom of page