top of page

Website Designed &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

కథా మధురాలు

లెక్క సరిపోయింది

Govinda Chintada

గోవింద చింతాడ

madhuravani.com అంతర్జాల పత్రిక నిర్వహించిన కథలపోటీ లో ప్రశంసా  బహుమతి సాధించిన కథ.

“ఎంత అవుతుంది బాబు” మళ్ళీ ఇంకొక సారి ఆడిగాడు సూరీడు తను విన్నది నిజమేనా అన్నట్లు.

“లక్ష” ఒక్క ముక్కలో చెప్పాడు ఆసుపత్రి బిల్ కౌంటర్ లో కూర్చొని వున్న వ్యక్తి కనీసం తల కూడా ఎత్తకుండా.

“ఆరోగ్యశ్రీ పధకం లో ఏమైనా కొంత తగ్గుతుందా బాబు” ఆశగా అడిగాడు సూరీడు.

“ఆరోగ్యశ్రీ పధకం ఉంది కనుకనే నువ్వు కట్టవలసిన ఆపరేషన్, గది అద్దె, మందులు అన్నీ కలిపి మొత్తం ఒక లక్ష. మిగిలినవి ప్రభుత్వ పధకాల ద్వారా సర్దు బాటు అవుతుంది. మూడు రోజులలో ఆపరేషన్ చెయ్యాలి.” అన్నాడు కౌంటర్ లోని వ్యక్తి.

“లక్ష” అన్న మాట తప్ప మిగిలినవి ఏవీ వినిపించలేదు. అవును, మనకు ఏది అవసరమో అది వినిపిస్తే చాలు. ఆసుపత్రి నుంచి భారంగా బయటకు నడిచాడు.

 

*****

 

కమలమ్మకు సూరీడుకు పెళ్లి అయి ఇప్పటికి ముప్పై సంవత్సరాలు అయ్యింది. ఇద్దరు కలిసి గుడి ముందు కొబ్బరి కాయలు అరటి పళ్ళు అమ్మే దుకాణంతో   జీవితాన్ని నెట్టుకొస్తున్నారు. వాళ్ళకు పిల్లలు ఎవరూ లేరు. వున్నది కేవలం ఒకరికి ఒకరు తోడు మాత్రమే. కొన్ని నెలలుగా కమలమ్మకు తరుచు గుండెల్లో నొప్పి రావడం, అది సాధారణంగా వచ్చే నొప్పి అని నిర్లక్ష్యం చేసేది. కానీ రెండు రోజుల క్రితం నొప్పి భరించ లేనంతగా రావడం తో అన్ని పరీక్షలు చేసిన తరువాత కమలమ్మకు రక్త ప్రసరణ చేసే నరాలకు స్టెంట్ వెయ్యాలి అని డాక్టర్స్ చెప్పారు. ఆ ఆపరేషన్ కు వెంటనే డబ్బు కావాలి.

ఆసుపత్రి నుంచి బయటకు వచ్చిన సూరీడు పక్కనే వున్న షాప్ లో ఒక సోడా కొనుక్కొని ఒక్క గుటక త్రాగి తల పైకి ఎత్తి చూసాడు.

పేపరులో హెడ్ లైన్లు, “వేయికోట్ల స్కాం పై ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు”. మరొక పేపర్లో “తొంభైకోట్లు లెక్క చూపని ఆస్తులు కలిగిన రాజకీయ నాయకుని పట్టుకున్న అధికారులు”.

అభివృద్ధి అన్ని రంగాలలో ఉంది. ఇరవై సంవత్సరాల క్రితం అవినీతి లక్షలు, లేదా పది కోట్లులో వుంటే ఇప్పుడు స్కాం కనీసం వందకోట్లు లేదా వేల కోట్లు వుంటేగాని వార్తలకు పేపర్  హెడ్ లైన్లలో రావడానికి అర్హత కూడా లేదు. అవినీతి కూడా తన స్థాయిని పెంచుకుంది. ఇది కూడా ఒక అభివృద్దే.

మిగిలిన సోడా పూర్తిచేసి తనలో తాను నవ్వుకున్నాడు. ఒక్క లక్ష ఉంటే చాలు తనకి. కానీ ఆ లక్ష ఎలా దొరుకుతుంది. ఎవరి కష్టాలు వారివి. కోట్లు ఎలా దాచుకోవాలి అనే సమస్య కొందరిది. తనకు కావలిసిన వారిని ఎలా దక్కించుకోవాలి అనే సమస్య కొందరిది. డబున్న వాళ్ళకు కూడా జబ్బులుంటాయి కానీ అవి ఖరీదైన జబ్బులు. పేదవాడికి డబ్బు లేక పోవడమే పెద్దజబ్బు.

తెలిసిన వాళ్ళ అందరి దగ్గరా అడిగి చూసాడు. కానీ ఎవరు ఇస్తారు అంతమొత్తం. కనీసం పదివేలు, ఇరవై వేలు అయినా ముగ్గురు, నలుగురు సాయం చేస్తారేమో అని ప్రయత్నం చేసాడు. గుడి ముందు కొబ్బరి కాయలు అమ్మే తమకు ఏమి చూసి అంత డబ్బు ఇస్తారు.

సూరీడు ఆలోచించడం మొదలు పెట్టాడు “ఎలా అయినా కమలమ్మని బతికించుకోవాలి. ఎలా అయినా ఆపరేషన్ చేయించాలి. ఇవే ఆలోచనలు తో నడుస్తూ ముందుకు సాగాడు. తన దగ్గర లక్ష రూపాయలు ఖరీదు చేసీది ఏముంది? సొంత ఇల్లు లేదు. తాతలు, తండ్రుల భూమి లేదు. మావి చిల్లర బతుకులు. చిల్లి గవ్వ లేని చిల్లర బతుకులు”.

ఆరోగ్యశ్రీ పథకం ఉన్నా  పేదవాడికి ఎప్పుడు అనారోగ్యమే. ప్రభుత్వం ఎన్ని పథకాలు పెట్టినా దేవుడు ఎప్పుడు పథకాలకు మించి జబ్బులు ఇస్తుంటాడు. ఇది దేవుడి పథకం.

అలా ఆలోచిస్తూ గుడి ముందుకి వచ్చి నిలబడ్డాడు.

“ఏరా సూరీడు....కమలమ్మకు ఎలా వుంది” అడిగాడు రాజన్న. ఆ పలకరింపులో ఏదో కొంత సాంత్వన. రాజన్న కూడా తనలాగే  గుడి పక్కన కొబ్బరి కాయలు అమ్ముతుంటాడు.

“లక్ష రూపాయలు కావాలంట. ఆపరేషన్ చేయించాలి. మూడు రోజులలో డబ్బు కట్టాలంట.” గుడి గోపురం వైపు చూస్తూ చెప్పాడు. ఆ చెప్పడం, దేవుని చూసి చెబుతున్నట్లు ఉంది. అయినా వింటూ కూర్చుంటే ప్రతి రోజూ దేవునికి ఇలా ఎన్నో విన్నపాలు.

“ఇంకా మూడు రోజులు వుందిగా ఈలోగా ఏదో విధంగా సర్దుబాటు అవుతుంది. నువ్వు కాస్త కుదుటపడు.” అన్నాడు రాజన్న.

“లక్ష, ఒక్క లక్ష చాలు. అంతకన్నా ఒక్క రూపాయి ఎక్కువా వద్దు, తక్కువా వద్దు.” ఈసారి సూటిగా గుడి  ధ్వజస్తంభం వైపు చూస్తూ చెప్పాడు. అవును. మన శక్తి సామర్థ్యాలు సరిపోనప్పుడు అకస్మాత్తుగా దేవుడు గుర్తుకు వస్తాడు.

“ప్రతిరోజూ ఎక్కడ ఎక్కడ నుంచో ఇక్కడ గుడికి వచ్చి కోరికలు కోరే భక్తులు. ఆ భక్తుల కోర్కెలు తీర్చే దేవుడు. ఆ దేవుడు రోజు తన గుడి ముందు వుండే భక్తుల కష్టాలు చెప్పకపోయినా తెలుసుకుంటాడు. నువ్వు ఏమీ చింతించకు. జరిగేది ఏదో జరగనీ.” రాజన్న వేదాంతి లా చెప్పుకు పోతున్నాడు.

“ఇంటికి వెళతాను రాజన్న” అని రాజన్న కు చెప్పి బస్ డిపో కి బయలు దేరాడు సూరీడు.

*****

బస్సు వచ్చి డిపోలో ఆగింది. అదే చివరి స్టాప్ కావడంతో బస్ లోంచి అంతా దిగి పోయారు. సూరీడు బస్ ఎక్కి ఆఖరి సీట్లో కూర్చున్నాడు. అతను కూర్చున్న సీట్లో ఒక నల్ల లెదరు బ్యాగ్ కనిపింది. బసులో ఎవరూ లేరు. ఒక్కసారిగా  గుండె ఆగినంత పనయ్యింది. ఈ మధ్య పేపర్లో వార్తలలో చూస్తూ ఉన్నాము.కొంతమంది ఉగ్రవాదులు ఇలా జన సందోహం వున్న చోట బ్యాగ్ వదిలి అందరూ బస్ ఎక్కిన తరువాత రిమోట్ కంట్రోల్ తో దూరంగా వుండి బస్ ని పేల్చివేస్తారు. ఆ ఆలోచన రాగానే చెమటలు పట్టాయి. బస్ దిగిపోయి పారిపోదామనిపించింది.ఈ ఆలోచనలతో ఉండగానే బస్ పావు వంతు నిండిపోయింది.

“మాష్టారూ కొద్దిగా బ్యాగ్ తీసి ఒళ్లో పెట్టుకుంటారా?” పక్కనే నుంచున్న వ్యక్తి మాటలకు పక్కకు జరిగి బ్యాగ్ ని   పక్కకు తీసి కూర్చున్నాడు.

బ్యాగ్ అంత బరువుగా ఏమీ లేదు. అది ఉగ్రవాదులు పెట్టిన బాంబ్ వున్న బ్యాగ్ అయితే చాలా బరువుగా వుండేది. బ్యాగ్ లో బాంబు వుండే అవకాశం లేదు అని నిర్ణయించుకున్నాడు.

ఇప్పుడు భయం పోయింది కానీ అ స్థానములో ఉత్సుకత మొదలైయింది. బ్యాగ్ లో ఏముంది?  ఇప్పుడు ఈ ప్రశ్న  ప్రధానంగా ప్రశ్నిస్తుంది. పది నిమిషాలలో బస్ బయలు దేరింది.

కిటికీ లోంచి బయటకు చూస్తూ అలోచిస్తున్నాడు. మనది కానప్పుడు బ్యాగ్ లో ఏముంటే ఏమిటి?. బ్యాగ్ మనది కాదు అన్న ఆలోచన చాల ఉపశమనం ఇచ్చింది. కొన్ని నిమిషాలు బ్యాగ్ గురించి మర్చి పోయి ఆలోచనలు అన్నీ ఆసుపత్రి లో ఉన్న కమలమ్మ వైపు మళ్ళాయి.

తను దిగవలిసిన స్టాప్ రావడం తో సురీడు సీట్ లోంచి లేచి ముందుకు నడిచాడు.  

“మాస్టారూ... మీరు మీ బ్యాగ్ మరిచి పోయారు.” పక్క సీటులో కూర్చున్న అతను బ్యాగ్ తీసి ఇచ్చాడు. ఎందుకో సూరీడుకు ఈసారి ఆ బ్యాగ్ నాది కాదు అని అనాలనిపించలేదు. నెమ్మదిగా బ్యాగ్ తీసుకుని బస్ దిగిపోయాడు.

*****

ఇంటికి వచ్చి కొన్ని మంచినీళ్ళు త్రాగి కుర్చీలో కూర్చొన్నాడు. అది అద్దె ఇల్లు. కమలమ్మ లేని ఇల్లు అతనికి చాలా కళా విహీనంగా కనిపించింది. కొంతసేపు అలాగే ఆలోచిస్తూ ఉన్న సూరిడుకు అకస్మాత్తుగా తనకు బస్సు లో దొరికిన బ్యాగ్ గుర్తుకు వచ్చింది. బ్యాగ్ తెరిచి చూసాడు. ఒక్కసారిగా తన కళ్ళను తనే నమ్మలేక పోయాడు.

ఆ బ్యాగ్ లో వెయ్యి రూపాయల నోట్ల కట్టలు ఐదు ఉన్నాయి. మొత్తం ఐదు లక్షలు. అంత డబ్బు తను ఎప్పుడూ చూడలేదు. ఆనందం, ఆశ్చర్యం రెండు కలసిన ఒక స్థితి లో శరీరం కంపించసాగింది. కొన్ని నిమిషాలు అదే స్థితిలో మౌనంగా ఉండిపోయాడు. ఎన్నో ఆలోచనల పరంపర లో ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఇంక ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. బ్యాగ్ లోంచి లక్ష రూపాయలు తీసుకుని ఆసుపత్రికి బయలు దేరాడు.

*****

“మీ ఆవిడకు ఆపరేషన్ అయ్యింది. డాక్టర్ గారు అంతా బాగుంది అన్నారు. రెండు రోజులలో ఇంటికి తీసుకొని వెళ్ళవచ్చు. ఆపరేషన్ తరువాత వాడవలిసిన మందులు అన్ని ఇచ్చారు. మీరు వెళ్ళి ఆవిడను చూడొచ్చు. రూమ్ నెంబర్ 83”. నర్సు వచ్చి చెప్పింది. వెయిటింగ్ రూమ్ లో ఉన్న సూరీడు మౌనంగా నర్సు చెప్పిన రూమ్ వైపు నడిచాడు.

రూమ్ మద్య ఉన్న బెడ్ పైన కమలమ్మ పడుకొని ఉంది. సూరీడు ఆమె పక్కనే వచ్చి కూర్చొని చేయి పట్టుకొని “ఇప్పుడు ఎలా ఉంది. ఏమైనా తింటావా?” అని  నెమ్మదిగా అడిగాడు.

“కొద్దిగ నీరసంగా ఉంది. ఆకలిగా లేదు. డాక్టర్ ఏమన్నారు?” నెమ్మదిగా మాట్లాడింది కమలమ్మ.

“రెండు రోజులలో ఇంటికి తీసుకు వెళ్ళచ్చు అన్నారు.” కమలమ్మ కళ్ళల్లోకి చూస్తూ చెప్పాడు.

“అవునయ్యా ,మనకు ఆపరేషన్ కు కావలిసిన డబ్బులు ఎవరు ఇచ్చారు?” అడిగింది కమలమ్మ.

తనకు బస్సు లో బ్యాగ్ దొరికిందని దానిలో అయిదు లక్షలు ఉన్నాయని, జరిగిన విషయాలు అన్ని చెప్పాడు.

“అ దేవుడే మన ప్రార్ధనలు ఆలకించి, సమయానికి కావలిసిన డబ్బుని చూపించాడు. దేవుని మనసారా ప్రార్ధిస్తే మనకు తప్పకుండ సాయం చేస్తాడు.” సూరీడు ఎంతో నమ్మకం తో చెప్పసాగాడు.

కమలమ్మ ఆశ్చర్య పోయింది. దేవుడు ప్రార్ధనలు వింటాడని మొదటి సారి తెలుసుకుంది. కృతజ్ఞతా భావంతో ఒక్క సారి దేవుని తలచుకుంది.

కమలమ్మ మెల్లగా మాట్లాడసాగింది. “ మన ప్రార్ధనలు విని దేవుడు మనకు సాయ చేసాడు అని అనుకుంటున్నాము. కానీ ఆ డబ్బు పోగొట్టుకున్న వాళ్ళకు దేవుడు అన్యాయం చేసివుంటాడు కదా!”

అది విన్న సూరీడికి ఏమని సమాధానం చెప్పాలో తెలియలేదు. నిజమే తనకి ఈ ఆలోచనే రాలేదు. కమలమ్మకు ఆపరేషన్ చేయించి బ్రతికించు కోవాలి అనేది ఒక్కటే తను అనుకున్నది. ఇంతవరకు తనవైపే ఆలోచించే సూరీడుకు దేవుని నిర్ణయం సరియినదే అనిపించిది కానీ కమలమ్మ మాటలతో అ డబ్బు పోగొట్టు కున్న వారి వైపు కూడా కొంచెం ఆలోచించగలిగే విజ్ఞత కలిగింది.

*****

“అయినా అంత పరధ్యానం అయితే ఎలా? పోయిన డబ్బు ఏమైనా తక్కువా, అయిదు లక్షలు!!” జానకమ్మ తన భర్తను డబ్బులు పోగొట్టినందుకు నిన్నటి నుంచి సందర్భం దొరికినప్పుడల్లా ఏదో విధంగా నిలదీస్తూనే ఉంది.

డబ్బు పోయినందుకు ఆ ఇంటిలో అందరూ నిన్నటినుంచి ఏంతో విచారంగా వున్నారు. ఇప్పటికిప్పుడు అంత డబ్బు ఎలా సమకూరుతుంది.

“మనం తీర్చాలి అనుకున్న మొక్కులు దేవునికి తీర్చలేక పోవడం వలెనే ఇలా జరిగింది. దేవుడు ఈ విధంగా గుణపాఠం చెప్పాడు. మనం ద్రాక్షారామం, శ్రీశైలం, బదరీనాథ్, కాశి వెళ్ళాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాము. కానీ ఒక్క సారి అయినా మీరు మమ్మల్ని ఏ పుణ్య క్షేత్రానికైన తీసుకోని వెళ్ళారా? ఎంతసేపూ ప్రయాణాలకు అయ్యే ఖర్చులనే లెక్కలు వేసి, అయ్యో ఇంత ఖర్చా అని వాయిదా వేస్తూ వచ్చారు. ఇప్పుడు చూడండి, దేవునికి అనుకున్న మ్రొక్కు తీర్చకపోతే ఏమవుతుందో” జానకమ్మ భర్తతో డబ్బు పోవడానికి అసలు కారణం ఏమయి ఉంటుందో తనకు తట్టినట్టుగా ఊహించింది.

జానకమ్మ మాటలలో కొంత నిజం లేకపోలేదు. ఎన్నిసార్లు పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలని చెప్పినా ప్రయాణానికి అయ్యే ఖర్చులు అన్ని కలిపి లెక్క కట్టి అడిగిన ప్రతీ సారి ఏదో కారణం చెపుతూ వాయిదా వేస్తూ వచ్చాడు. పుణ్యక్షేత్రాలకనే కాదు, ఎక్కడయినా పైసా ఖర్చు గిట్టదు అతనికి. ఎవరికయినా ఒక రూపాయి సాయం చేయటమంటేనే లెక్క చూసుకుంటాడు.

“దేవుడు అప్పులిచ్చే కాబులీ వాలా కాదుకదా తను కూడా లెక్కలు చూసుకుని భక్తుల నుండి రావలిసిన ధనాన్ని ఈ విధంగా వసూలు చేయడానికి.” పైకి  అనేశాడు కానీ, ధర్మారావు తన బ్యాగ్ పోవడానికి నిజంగా అనుకున్న దేవుని పుణ్యక్షేత్రాలు వెళ్ళక పోవడమేనా అన్న సందిగ్ధంలో పడ్డాడు.

“ఈ సారి అయినా మీరు దేవుని దగ్గర పిసినారితనం చూపించవద్దు. మన జీవితం లో చూడాలి అనుకున్నవి మాత్రం చూసి తీరాలి. ఇప్పటికి నాలుగు సంవత్సరాలు నుంచి వాయిదా వేస్తూ వస్తున్నారు. అన్ని అనుకున్నట్లు జరిగి ఉంటే మనం ఇప్పటికి నాలుగు పుణ్యక్షేత్రాలను దర్శించుకునేవాళ్లము. డబ్బు ఖర్చు పెట్టినా దానికి అర్ధం, పరమార్ధం వుండాలి.” మనసులో డబ్బు పోయిన దిగులు ఉన్నా తను చెప్పాలనుకున్నది చెప్పింది జానకమ్మ.

జానకమ్మ చెప్పినవి విని ధర్మారావు తనలో తను ఆలోచించుకో సాగాడు. భార్య అడిగిన పుణ్యక్షేత్రాలకు అప్పుడే వెళ్లి ఉంటే ఇంత కష్టం వచ్చి ఉండేది కాదేమో? మానసికంగా కొంత ఉరట కలిగేది. కనీసం ఆ పుణ్యక్షేత్రాలను దర్శించుకునే భాగ్యం కలిగేది. ఒకవేళ అనుకున్న పుణ్య క్షేత్రాలకు వెళ్లి ఉంటే తనకు అన్ని కలిపి లక్ష పైనే అయ్యిది కానీ ఇప్పుడు పోయినది అయిదు లక్షలు. ఎంత తనకు తానూ సర్ది చెప్పుకున్నా ఇంకా ఏంతో దిగులుగా ఉంది. ఈసారి తప్పకుండా జానకమ్మ అనుకున్నట్లు ఆ పుణ్యక్షేత్రాలకు వెళ్లి ఇంకెప్పుడూ దేవుని విషయంలో అశ్రద్ద చేయకూడదని మనసులో నిర్ణయించుకున్నాడు.

ఒక్కసారిగా కాలింగ్ బెల్ మ్రోగడం తో ఉలిక్కి పడి ఆలోచనలోంచి బయటకు వచ్చాడు ధర్మారావు. అసలే దొంగల భయం. భయపడుతూనే కిటికీ లోంచి బయటకు చూసాడు. చీకటిగా ఉండడం తో ఎవరూ కనిపించలేదు. “ఈ వేళప్పుడు ఎవరై ఉంటారో?” అని బయట వచ్చి లైట్ వేసి చూసాడు. బయట గుమ్మం ముందు ఎవరు కనిపించలేదు. “మరి డోర్ బెల్ ఎవరు కొట్టి ఉంటారు?” అని ఆలోచిస్తూనే గేటు  పక్కనే ఉన్న గోడ వైపు చూసి ఆశ్చర్యపోయాడు.

“ఎవరండీ ఈ వేళప్పుడు?” అంటూ బయటకు వచ్చిన జానకమ్మ కూడా ఆశ్చర్యపోయింది. గోడ పక్కనే భర్త పోగొట్టుకున్న నల్ల లెదర్ బ్యాగ్ కనిపించిది. ఆ ఇద్దరి ఆశ్చర్యం ఆనందంగా మారడానికి ఎంతో సమయం పట్టలేదు.

వెంటనే బ్యాగ్ ని లోపలకి తీసుకుని వెళ్లి తెరిచి చూసాడు. అందులో వెయ్యి నోట్లకట్టలు నాలుగే ఉన్నాయి. బ్యాగ్ లో మిగిలిన అరలు కూడా వెతికాడు. అప్పుడు అర్ధం అయ్యింది. ఒక లక్ష పోయిందని. నాలుగు లక్షలైనా తిరిగి దొరికినందుకు సంతోషించాలో లేక లక్ష పోయినందుకు బాధ పడాలో అర్ధం కాలేదు.

ఇంతక ముందు బ్యాగ్ కనిపించిన సంతోషం ఏమాత్రం ధర్మారావు ముఖం లో కనిపించ లేదు. “అయ్యో ఇందులో నాలుగు లక్షలే ఉన్నాయి. ఒక లక్ష పోయింది.” అంటూ దిగులు గా చెప్పాడు.

“ఎందుకండీ దిగులు పడతారు. ఎవరికో మన బ్యాగ్ దొరికింది. తిరిగి అది మనకు దొరికింది. అయినా ఈ రోజులలో పోయిన బ్యాగ్ దొరకడం అంటే అది దైవలీల కాక మరి ఏమిటి?. పోయిన దాని గురించి ఆలోచించకుండా దొరికిన దానికి సంతోషపడండి. అయినా ఆ డబ్బు దొరికిన వాళ్ళు మొత్తం ఉంచుకొని ఉంటే మనం ఏమి చేయగలిగే వాళ్ళము. అ బ్యాగ్ దొరికిన వారికి మొత్తం డబ్బు ఉంచుకునే అవకాశము ఉండి కూడా వారికి కావలిసినంత మాత్రమే తీసుకొని మిగిలిన సొమ్ము మనకు ఇవ్వాడమే గొప్ప. జరిగినది ఏదో జరిగినది. ఇదే దేవుని నిర్ణయం”. జానకమ్మ డబ్బు దొరికినందుకు సంతోషంగా తనదైన మాటను చెప్పింది.

అయినా ధర్మారావు పోయిన లక్ష కోసం ఇంకా విచారంగా ఆలోచించసాగాడు. పోయిన లక్ష బాధ ముందు  దొరికిన నాలుగు లక్షల ఆనందం చిన్నదైపోయింది.

జానకమ్మ అది గమనించి దగ్గరగా వచ్చి భర్త చేయి పట్టుకుని నెమ్మదిగా చెప్పింది. “చూడండి మనం నాలుగు సంవత్సరాలుగా ప్రతి సంత్సరం ఒక్కొక్క పుణ్యక్షేత్రానికి వెళ్ళాలని వెళ్ళ లేక పోయాము. ఒకవేళ వెళ్లి వుంటే ప్రతీ సంవత్సరం  ట్రైన్ టిక్కెట్లుకు, అక్కడ ఉండడానికి, ఇతర ఖర్చులకు, భోజనాలకు, అక్కడ ఏమైనా వస్తువులు కొనడానికి అన్ని కలిపి కనీసం పాతిక వేలు అయిఉండేది. అంటే నాలుగు సంవత్సరాలకు కలిపి మొత్తం లక్ష రూపాయలు ఖర్చు అయ్యేది. అంటే ఆ దేవుడు అనుకున్నట్లు తనకు రావలిసిన మొత్తాన్ని ఏదో రూపంలో, ఎవరి ద్వారానో తీసుకున్నాడు. లెక్క సరిపోయింది కదా!”

ఇప్పుడు ధర్మారావు మనసు తెలికపడింది. తను దేవుని దర్శనానికి ఖర్చు ఎంత లెక్క కట్టాడో అంతే  మొత్తం ఇప్పుడు ఇలా ఖర్చు అయిపోయింది. లేదు లేదు దేవుడు లెక్క కట్టి మరీ వసూలు చేసాడు.

ఇప్పుడు ధర్మారావుకు పోయిన లక్ష గురించి ఏమాత్రం దిగులు లేదు. తిరిగి దొరికిన ధనంలో కొంత తీసి జానకమ్మకు ఇచ్చి “ఇది నీ దగ్గర ఉంచు.” నువ్వు ఎప్పటినుంచో అనుకుంటున్న శ్రీశైలం వెళ్ళడానికి. రేపే వెళ్లి నేను టికెట్స్ రిజర్వేషన్ చేయిస్తాను”. నవ్వుతూ చెప్పాడు.

జానకమ్మ చిరునవ్వుతో ఆ డబ్బుని తీసి దేవుని పూజ గదిలో ఉంచింది. బయట గుమ్మం ముందు లైట్ స్విచ్ ఆఫ్ చేసి వచ్చి భర్త పక్కనే పడుకొంది.

ధర్మారావు కళ్ళు మూసుకొని మనసులో అనుకున్నాడు. “వచ్చే నాలుగేళ్ళలో అనుకున్న నాలుగు పుణ్యక్షేత్రాలు దర్శించాలి. తన భార్య కోరుకున్న కోరిక అదే”. అలా ఆలోచిస్తూ నిద్రలోకి వెళ్లి పోయాడు.

*****

చీకటిలో దూరంగా ఇదే ఇంటిని కొంత సేపటిగా గమనిస్తున్న చెట్టుకింద ఒక వ్యక్తి మాత్రం మనసులో “దేవుడు కమలమ్మ ఆపరేషన్ కు అవసారానికి ఇచ్చిన ఈ ఋణం ఎలాగైనా తీర్చుకోవాలి.

వచ్చే నాలుగేళ్ళలో నేను తీసుకున్న లక్ష రూపాయలు తిరిగి వారికి చేరవేయాలి. తన భార్య కోరుకున్న కోరిక అదే” అలా ఆలోచిస్తూ ముందుకు కదిలాడు.

OOO

bottom of page