top of page
Anchor 1

సంపుటి 3  సంచిక 1

Website Designed &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

వ్యాస​ మధురాలు

కవిత్వం కొన్ని ఆలోచనలు

Vaidehi Sashidhar

డా. వైదేహి శశిధర్

కవిత్వం హృదయసంబంధి.కవిత్వాన్నిఎన్నిరకాలుగా నిర్వచించినా సిద్దాంతీకరించి నా అవి ప్రతిపాదనలు/పరిశీలనలు మాత్రమే కానీ నిరూపిత సత్యాలు కావు. మంచి కవిత్వాన్ని నిర్వచించటం కష్టం కానీ తెలుసుకోవటం కష్టం కాదనే నా అభిప్రాయం. దానికి మేధాసంపత్తి ,భాషాపాండిత్యం అవసరం లేదు.ఒక గాఢమైన అనుభూతికి స్పందించే హృదయం చాలు.

 

నా ఉద్దేశ్యం లో కవిత్వం ఎప్పుడూ వైయుక్తికమే .వ్యక్తి  అనుభవం లో లేనిదేదీ సమాజం లో లేదు.సామాజిక వస్తు ప్రధాన కవిత్వం కూడా వైయుక్తిక కవిత్వం లాగా  తన  ప్రత్యక్ష లేదా పరోక్ష అనుభవం లోంచి కవి సారించిన దృష్టి .కవితా వస్తువు వైయుక్తికమైనా,సామాజికమైనా, ఏదైనా కవిత్వపు గమ్యం మాత్రం సార్వజనీనత.కవి అనుభవం పాఠకుడి అనుభవమవడమే సార్వజనీనత అది సాధించే ప్రక్రియే కవిత్వీకరణ.కవిత్వంలో స్థాయీ భేదాలు కవిత్వీకరణ లో భేదాల వల్లనే అని నా అభిప్రాయం. ఒకే భావాన్నిఅనేక కవితలు  చెప్పినా కొన్ని మాత్రమే మన హృదయాన్ని పట్టి బంధిస్తాయి,వెంటాడుతాయి,తలమునకలు చేస్తాయి . అటువంటి కొన్ని పద్యాలు,కవితల గురించి స్థూలంగా నా అభిప్రాయాలే ఈ ప్రసంగం .

 

మన పద్య కవితలను చూసినప్పుడల్లా  నాకు ఆశ్చర్యం కలుగుతుంది .యతి ప్రాసలను సూత్రీకరించి ఒక సౌష్టవమైన సౌధంలాగా పద్యాన్ని నిర్మించిన తీరు ఒక poetic architecture  లా అనిపిస్తుంది.అయితే  కొన్ని శతాబ్దాలుగా ప్రాచుర్యం లో ఉండటం వలన పద్యాన్ని పాతది గా భావించి నిరసించనక్కరలేదు.అలాగే ప్రతిభ లేని పద్యాలని తలకెత్తుకోనక్కర లేదు.ప్రతిభను గుర్తించగలగాలి 

 

నాకు నచ్చిన పద్యాలలో ,నన్నయ్య గారి ఆఖరి పద్యం అరణ్య పర్వం లో శరదృతువు వర్ణన.

 

శారద రాత్రులుజ్వల సత్తర తారక హారపంక్తులై

జారుతరంబులయ్యె, వికసన్నవ కైరవగంధ బంధు రో

దార సమీరసౌరభము దాల్చి సుధాంశు వికీర్యమాణ క

ర్పూర పరాగ పాండురుచి బూరములంబర బూరితంబులై 

 

వెలిగే నక్షత్ర మాలికలు,విచ్చిన కలువల సౌరభాల తో నిండిన గాలి ,కర్పూరపు వెన్నెలల నివర్ణించే ఈ పదాలలోనే ఎంతటి లాలిత్యం,చల్లదనం ఉందొ చూడవచ్చు .అర్ధం కాక మునుపే  ఆ పద సౌందర్యం  ఆ దృశ్యం తాలూకు అనుభూతిని ఆవిష్కరిస్తుంది-సంగీతం లో లాగా.

 

తర్వాత సరళమైన, భాషాడంబరం లేని పద్యాలకు పెట్టింది పేరు తిక్కన గారు .అయితే సందర్భోచితంగా ఆయన ఎంతటి గంభీరమైన భాష వాడగలరో  చూపే పద్యం- విరాట పర్వం లో ఉత్తరకుమారుడు కురుసైన్యాన్ని చూసి భయభ్రాంతుడ య్యే  సందర్భం లోని పద్యం ఇది.

 

భీష్మద్రోణ కృపాది ధన్వినికరా భీలంబు దుర్యోధన

గ్రీష్మాదిత్య పటుప్రతాప విసరాకీర్ణంబు శస్త్రాస్త జా

లోష్మస్ఫార చతుర్విధోజ్వల బలత్యుగ్రం బుదగ్రధ్వజా

ర్చిష్మత్వాకలితంబుసైన్యమిదియే జేరంగ శక్తుండనే

 

మండే సూర్యుడిలాంటి ప్రతాపవంతులు ఉన్న సైన్యం గురించి ఎంత రాజసం తో చెప్పాలో ఈ పద్యం చూపిస్తుంది. శస్త్రాస్త జాలోష్మస్ఫార చతుర్విధోజ్వల బలత్యుగ్రం బు దగ్రధ్వజా ర్చిష్మత్వాకలితంబు అన్న ఆ ప్రౌఢ సమాసం వినగానే ఈ పద్యం తాలూకు మూల భావమైన అబ్బురం తో కూడిన భయం మనకి స్ఫురిస్తుంది. నా చిన్నప్పుడు పెద్ద స్వరం తో కొంచెం కళ్ళు పెద్దవి చేసి మా నాన్నగారు ఈ పద్యం పాడితే ఎక్కడో పిడుగు పడ్డట్లు భయపడేవారం .

 

ఇకపోతే ఎర్రన గారు అరణ్యపర్వం లోని నన్నయ్య గారి ఆఖరి పద్యానికి కొనసాగింపుగా శరత్కాలపు ఉదయాల గురించి ఒక చక్కని పద్యం వ్రాసారు .

 

 స్ఫురదరుణాం శురాగరుచి బొంపిరి వోయి నిరస్త నీరదా

వరణ ములై దళత్కమల వైభవ జృంభణ నుల్లసిల్ల ను

ద్ధరతర హంసారస మధువ్రత నిస్వనముల్ సెలంగగా

గరము వెలింగె వాసరముఖంబులు శారద వేళల జూడగన్

 

ఈ పద్యం నాకు ఇష్టమవడానికి రెండు కారణాలు .ఒకటి చాలా అందమైన వర్ణన. రెండు -ఎర్రన గారు ఈ కవితను పూర్తిగా నన్నయ్య గారి శైలిలో వ్రాసారు.ఇది  ఒక గొప్ప కవి మరొక గొప్ప కవి పట్ల చూపే స్పర్ధ లేని గౌరవం,అర్పించే నివాళి .

 

ఇక ఆధునిక పద్య కవిత్వంలో నాకు నచ్చిన కొన్ని  పద్యాలు

 

విశ్వనాధ – గోదావరీ పావనోదార వాపూర మఖిల భారతము మాదన్ననాడు

తుంగభద్రా సముత్తుంగ రావము తోడ కవుల గానము శృతి గలయునాడు

పెన్నానదీ సముత్పన్న కైరవ దశ శ్రేణిలో తెన్గు వాసించునాడు

కృష్ణా తరంగా నిర్నిద్ర గానము తోడ సశిల్పంబు  తొలి పూజ సేయునాడు

అక్షరజ్ఞాన మెరుగదో ఆంద్ర జాతి విమల కృష్ణానదీ సైకతముల యందు

కోకిలపుబాట పిచ్చుక గూళ్ళు కట్టి నేర్చుకున్నది పూర్ణిమా నిశల యందు  

 

ఈ పద్యం లో విశ్వనాధ వారికి తెలుగు జాతి పట్ల ఉన్న ప్రేమ,గర్వం అన్నీ హృదయంగమం గా వ్యక్తమవుతాయి

 

నాకు ఇష్టమైన మరో కవి జాషువా .పిరదౌసి లో ఒక పద్యం

 

ఓ సుల్తాను మహామ్మదూ  కృతక విద్యుద్దీపముల్ నమ్మి

యాశా సౌధంబును గట్టికొంటి  యది నిస్సారంపుటాకాసమై

నా సర్వస్వము ద్రోచి నరకానం గూలిపోయే వృధా

యాస ప్రాప్తిగా నిల్చినాడనొక దుఖాక్రాంత లోకంబునన్

 

ఈ పద్యం లోని భావానికి ప్రాణమైన పదం నిస్సారంపుటాకాశం.ఆ ఒక్క పదం లో మనకు పిరదౌసి హృదయం లోని నైరాశ్యం ,నిస్పృహ,ఆశాభంగం ,అన్నీ మనకు స్ఫురిస్తాయి .ఆ భావాన్ని బలోపేతం చేసే మరో వాక్యం - నిల్చినాడనొక దుఖాక్రాంత లోకంబునన్.

బలమైన కవిత్వం ఎలా వ్రాయాలో తెలిపే ఉదాహరణలు ఇవి.

 

నాకు చాలా ఇష్టమైన మరో పద్యం -తుమ్మల సీతారామమూర్తి గారిది

ఎత్తినకత్తి కాత్మ బలియిచ్చెడు మేకల పాలు ద్రావు నీ

మెత్తని చిత్తమందు కుసుమించిన కమ్మని సన్నజాజి పూ

గుత్తి పరీమళంబులనుకుందును సత్యమహింస నేడు నీ

వొత్తి గిలన్ మహాత్మ భరతోర్విని వానికి దిక్కు కల్గునే

 

గాంధీ గారు మేక పాలు త్రాగేవారనే విషయాన్ని ,మేకల సాదు ప్రవృత్తిని ,ఆయన జీవన విధానమైన అహింసా సిద్ధాంతాన్ని ఎంత గొప్ప భావుకతతో ఆర్ద్రతతో  అనుసంధానం చేసారో,ఎంతటి poetic extension  ఇచ్చారో చూడండి.

 

సుకుమారమైన పద్యాలు వ్రాసే మరో కవి కరుణశ్రీ –

 

సంజ వెలుంగు లో పసిడి చాయల ఖద్దరు చీర గట్టి నారింజ కు నీరు వోయు శశిరేఖవే నీవు అంటారు

 

సంజవెలుగు-పసిడి ఛాయలు-నారింజ ఈ పదాలలో ఉన్న వర్ణ సాదృశ్యం చూస్తె ఈయన కవిత్వం లో ఒక  చిత్రకారుడు లా అనిపిస్తాడు

 

అయితే ప్రాచీన పద్య రీతుల్లోంచి కవిత్వాన్ని దేశిచందస్సు ముత్యాలసరాల వైపు మళ్లించిన కవి గురజాడ.

 

కన్నుల కాంతులు కలువల జేరెను / మేలిమి జేరెను మేని పసల్

హంసల జేరెను నడకల బెడగులు/దుర్గను జేరెను పూర్ణమ్మ

చిన్న పదాలలో బరువైన భావాన్ని  పొదిగి మనల్ని కదిలింపజేస్తారు

 

తెలుగుకవిత గురించి మాట్లాడినపుడు తప్పనిసరిగా తలచుకోవాల్సిన మరో  కవి కృష్ణశాస్త్రి గారు.భావకవిగా తన సుకుమారమైన భావాలతో ,అందమైన భాషా పాటవం,మాధుర్యం  తో తన సమకాలికులకూ ,ఎందఱో ముందుతరం కవులకు ఆయన స్ఫూర్తి గా నిలిచారు .కవిత్వం  వారి లానే రాయాలి అని మాత్రమే కాదు,వేషభాషలు ,ఆహార్యం లో కూడా ఆయనలా  ఉండాలని చాలామంది వర్ధమానకవులు ప్రయత్నించేవారట .ఆయన విస్తృతంగా కవిత్వం తో పాటు సినీ గీతాలు కూడా వ్రాసారు. ఆయన ఊర్వశి  నుంచి ఒక చిన్న కవిత

 

ఆమె కన్నులలో ననంతాంబరపు నీలి నీడలు కలవు/వినిర్మలాంబు పూర గంభీర శాంతకాసార చిత్ర హృదయములలోని గాటంపు నిదుర చాయలందు నెడ నెడ గ్రమ్ము

 

సంధ్యావసాన సమయమున నీపపాదప శాఖికాగ్ర పత్ర కుటిల మార్గముల లోపల వసించు ఇరుల గుసగుసల్ వానిలో నిపుడు నపుడు వినబడుచునుండు

కృష్ణశాస్త్రితో పాటు రాయప్రోలు,వేదుల వంటి ప్రతిభావంతులైన కవుల ఒరవడిలో,భావకవిత్వపు ప్రవాహంలో తల మునకలవుతున్నతెలుగు కవితకు విభిన్న దిశా నిర్దేశం చేసిన కవిగా శ్రీశ్రీ కి ఒక ప్రత్యెక స్థానం ఉంటుంది . చందోసర్ప పరిష్వంగాన్ని వదిలించుకోవాలన్న శ్రీశ్రీ మాత్రాచందస్సులో మాత్రం అద్భుతమైన కవిత్వం వ్రాసారు .తన కవిత్వం లో శబ్ద సౌందర్యాన్ని,లయను ,గొప్ప ధారను సాధించారు

 

1.పొలాల నన్నీ హలాల దున్నీ

 ఇలాతలంలో హేమం పండగ

 జగత్తుకంతా సౌఖ్యం నిండగ – అన్నా

2.త్రాచుల వలెనూ/రేచులవలెనూ /ధనంజయునిలా సాగండి

కనబడలేదా మరో ప్రపంచపు అగ్నికిరీటపు ధగధగలు

 

హోమజ్వాలల భుగభుగలు అన్నా  -  ఆయన భావాల్లానే ఆయన  కవితలు  కూడా కదను తొక్కుతున్న యుద్దాశ్వల్లా సాగుతాయి .

శ్రీశ్రీ కి సమకాలికుడు అయిన దేవరకొండ బాలగంగాధర తిలక్ కి  వచన కవి గా ప్రత్యేకస్థానం ఉంది .ఈయన కవిత్వం ఒక సైద్ధాంతిక నిబద్ధత లోంచి కాక సహజమైన ఆర్ద్రమైన మానవీయ స్పందన లోంచి వచ్చినట్లు అనిపిస్తుంది. ఈయన ప్రత్యేకత అద్వితీయమైన కవిత్వీకరణ మాత్రమే కాదు,భావ సాంద్రత,వస్తు వైవిధ్యం,అందమైన పదచిత్రాలు ,మెటఫర్లు.ఈయన కవిత్వం జీవితంలోని సౌందర్యాన్ని,సంతోషాన్ని,సౌకుమార్యాన్ని ఎంత ప్రతిఫలిస్తుందో  వేదనని వైఫల్యాన్ని సమాజపు అసమానతలను కూడా అంతగా ప్రతిఫలిస్తుంది .

 

ఉదా  -నలుపు చారలు లేని తెల్లని సూర్యకాంతి

పడిన పాలరాతి గచ్చులా ప్రతిఫలించి

నీ వడిలో నా తల పెట్టుకుని అభ్యంగనావిష్కృత

త్వదీయ వినీల శిరోజ తమస్సముద్రాలు పొంగి

నీ భుజాలు దాటి నా ముఖాన్ని కప్పి

ఒక్కటే ఒక్క స్వప్నాన్ని కంటున్నవేళ.....

ఆయనే మరో కవిత లో –

ఊరవతల సందులలో దుమ్ము కొట్టుకుపోయిన పిల్లల కళ్లలో

ఆరిపోతున్న వెలుగులో /కాలవ వడ్డున వంకర తిరిగిన

తుమ్మచెట్టు కొమ్మ లోంచి కాలి  మసయి పోతున్న పశ్చిమ దిశా గగనం లో

ఒక భయంకర సృష్టి క్రమాన్ని మానవ యత్న వైఫల్యాన్ని ఊహించుకుని

వణికి పోయేవాణ్ణి- అంటారు

 

ఇదే కవితలో మరో చోట -నిరంతర పరిణామ పరిణాహ జగత్కటాహం లో

సలసల కాగే మానవాశ్రుజలాలు అంటారు

 -ఎంతటి కరుణామయ ఆవిష్కరణ!!!

అయినా ఆయన గొప్ప ఆశావాది.అందుకే  -

ఇప్పటికీ  మధుమాసం లో సహకార తరువుల క్రింద

పవళించిన వేళ నా గళాన సౌందర్య మధూళి చిందుతుంది

దిగులునీరు నిండిన కోటి మనస్సరస్తీరాల నా కవిత

కోరికల కోణాకారపు కొత్త చెట్లను నాటుతుంది -అంటారు 

 

 ఇకపోతే ,శ్రీశ్రే ప్రభావం వల్ల  రాజకీయ సామాజిక విప్లవరీతులవైపు మొగ్గు చూపుతున్నతెలుగు కవితను -నినాద కవిత్వం నుండి జీవితానుభవాల ఆవిష్కరణ వైపు కొంతవరకూ మళ్లించిన కవిగా ఇస్మాయిల్ గారిని గుర్తించాలి కవిత్వం లో క్లుప్తతను,హైకూ లను పాపులర్ చేసింద కూడా ఆయన.ఆయన లో నాకు నచ్చే గుణం  కవిత్వం ఎక్కడ ఉన్నా ,తన పంధాలో వ్రాయబడని కవిత్వంలో కూడా ప్రతిభను చూడగల సహృదయత. ఈ లక్షణం మనకు అంతగా మన తెలుగుదేశం లో కనబడదు .ఈయన కవిత్వం వ్రాయడమే కాడు కవిత్వం గురించి,కవిత్వీకరణ గురించి ,తత్త్వం గురించి కొన్ని మౌలికమై ఆలోచనలు కూడా చేసిన వారు.బహుశా  వర్ధమాన కవులను ఆయన ప్రోత్సహించినంతగా మరెవరూ చేయడం నాకు తెలియదు.

 

1.పురాతన కావ్యాల /శిలాతల గర్భాల్లో

సీతంగళం తో రవళించిన పాటే

వెచ్చని కోరికలతో /పచ్చిక బయళ్ళమ్మట గంతులేస్తుంది

2.ఇరుచెంపలని  తాకి /ఒరుసుకుంటూ పారే

ప్రియురాలి కురుల సెలయేరులా

కృష్ణశాస్త్రి ! నీ పాట ప్రపంచపు అందాల్ని /పొదివిపడుతుంది

౩.ఎగిరి ఎగిరి అలసిపోయి /దినాలు రెక్కలు ముడిచే వేళ

పాట నావలో కూర్చుని/ నీ కనురెప్పల తెరచాపనెత్తి

నీ కళ్లలోఅస్తమానం అస్తమించే /నల్లటి సూర్యబింబం కేసి సాగి పోనీ

 

వచన కవితలతో పాటు మనకి మంచి గేయకవిత్వం,గీతాలు కూడా ఉన్నాయి .దాశరధి వ్రాసిన ఒక గీతం -మాట్లాడని మల్లెమొగ్గ మాదిరిగా నడచిరా ..అనే గీతం లో -ఆకు లేని మోదుగు పై కాకలెత్తు పూ మంటలు అంటారు.మోదుగ చెట్టు చూస్తె నిజంగానే మండే దివిటీల్లా ఉంటాయి ఆ పూవులు.చక్కటి వ్యక్తీకరణ!!

 

 ఆ పాట లోనే మరో అందమైన వాక్యం-మెట్లులేని మెడ పైన మేలి నీలి ముసుగు తీసి నవ్వే అందాల తరుణి నవ శారద నిశా శశి .

 

రీతి ఏదైనా ,పద్యం,వచన కవిత, గేయం ,గీతం ,జానపదం -దేనికైనా హృదయాన్ని  తాకడమే ప్రధానం .అయితే ఒక గొప్ప కవి వ్రాసిన ప్రతి కవితా గొప్ప కవితగా అంగీకరించాల్సిన అవసరం లేదు .స్థాయినిబట్టే ప్రశంస ఉండాలి .చివరగా సాహిత్య విమర్శ కు కావలసింది రస హృదయం,వివేచన,నిజాయితీ,సాహిత్యం పట్ల, సత్యం పట్ల నిబద్ధత .సాహిత్య విమర్శని ఇవి తప్ప మరేమీ ప్రభావితం చేయకూడదని నా ఉద్దేశ్యం .

 

OOO

bottom of page