
MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
జనవరి-మార్చి 2023 సంచిక
Website Published & Maintained by Srinivas Pendyala | Mobile version is under construction. Use big screen for better experience.
కవితా వాణి
నిర్వహణ: చిలుకూరి సత్యదేవ్ | మధు పెమ్మరాజు

madhuravani.com అంతర్జాల పత్రిక నిర్వహించిన
కవితలపోటీ లో బహుమతి సాధించిన కవిత.
యుద్ధమూ నిజమే విజయమూ నిజమే
సైనిక శిబిరాల నిర్మాణం గురించే సందేహాలన్నీ
పేరుకే ప్లేస్కూలు
స్కూలు నిజం ప్లే అబద్ధం
తరగతి గదిలో తాండవమాడుతున్న అక్షరం
మైదానంలో పాదం మోపదు
జైలు నిజం మైదానం శుద్ధ అబద్ధం
గంతులు వేసే లోకం ఒకటుంటుంది
తనువు తీగలుసాగే లక్షణం ఒకటుంటుంది
పాదాలు పరుగును పిండుకునే పరుసవేది ఒకటుంటుంది
ఎలమీంచి వలమీంచి బంతులు సరిహద్దులు దాటే మెలకువ ఒకటుంటుంది
ఆ ఒక్కటీ అడక్కు
మార్కుల్లేని మాస్‌డ్రిల్ పీరియడ్ల గురించి అడక్కు
'ఆటాడుకుందా రా... అందగాడా...'
అభ్యంతరం లేదు పాటలు పాడుకో
గ్రాఫిక్స్‌తో కలిసి డాన్సులు కట్టుకో
స్వేదగ్రంధుల్ని తేజోవంతం చేసి
మనశ్శరీరాల్ని మధురోహల్లో ముంచెత్తే కసరత్తుల గురించి మాత్రం అడక్కు
కొన్ని విరామాల మధ్య
ఆటవిడుపుల్లో తలమునకలవుతుంటారు
విడుపు నిజం ఆట అబద్ధం
బుర్రను పరిగెత్తిస్తూ 'టెంపుల్ రన్'లోని దొంగను పట్టుకుంటారు
'సబ్‌వే సర్ఫర్స్'గా ట్రాక్‌లు బద్దలు కొడతారు
'క్యాండీక్రష్'లో రంగుల కలల్ని కౌగిలించుకుంటారు
'పోకెమ్యాన్'తో జట్టుకట్టి ఖండాలు దాటుతుంటారు
కృత్రిమ కొలనుల్లో నిలువీతలేనన్న తెలివిడి కొరవడుతుంది
డిజిటల్ ప్రాంగణంలో అలుపెరగని ఉచ్ఛ్వాస నిశ్వాసలేనన్న స్పృహ
దేహవ్యాప్తంగా ఎక్కడా వెలుగు చూడదు
విశ్వవేదిక మీద ఓ దీపం వెలిగినప్పుడో
ఓ బిందువు సింధువుగా ఆవిష్కృతమైనప్పుడో
మనకు అర్జెంటుగా ఒడలు పులకరిస్తాయి
మెళ్లో హారాలు పడ్డాక భుజాల మీద శాలువాలు కప్పుతాం
బంగారుపళ్లేల్లో తాయిలాలు సర్ది సమర్పిస్తాం
కార్యక్షేత్రాన్ని కలగనడం మానేస్తే
పగటినిద్రను మించిన సుఖం లేదు
ఇటుకలు పేర్చడం విస్మరిస్తే
బాకాలూదడాన్ని మించిన గౌరవం లేదు
కాలం వ్యాయామం లోపించిన రోగిష్టిలా ఉండిపోదు
మైదానం మన్నుతిన్న పాములా పడుకోదు
పాదాలు పాకుడుపట్టిన గోడల్లా పడి ఉండవు
ఊరవతలి బీడుభూమిలో వెలసిన కబడ్డీ కోర్టు నుంచీ
నగరంలో ఆధునికంగా అవతరించిన స్టేడియాల దాకా
చెమటచుక్కలకు ఆహ్వానలేఖలు పంపుతున్నాయి
క్రీడావనిలో హోరాహోరీ పోరుకు ఎదురొడ్డి
త్రివర్ణాలను రెపరెపలాడించగల దేహాల రూపకల్పనకు సిద్ధమవుతున్నాయి
సంకల్పమూ నిజమే సామర్థ్యమూ నిజమే
నిస్సందేహంగా తలపడబోయే యోధులపైనే ఆశలన్నీ
ఆకాశం మేఘాలతో
అదృశ్య గీతాలు ఆలపిస్తున్నప్పుడు
రాత్రి వేకువ గీతాలు పాడుతున్న
హృదయాల సంగమంలో
పాత కొత్తల వియోగ సంయోగ మనోహరంలో
మనసుకు నకలును వెతుకుతున్న
వర్తమానపు కాల ప్రవాహం
విధిరాతల ఆవిష్కరణల మధ్య
రేపటి వెలుతురు కోసం
చీకటిలోనే కొత్త రంగుల్ని అన్వేషిస్తూంటాము
ఆవల నుండి ఈవలకు ఈదుతూ
ప్రవహిస్తున్న జ్ఞాపకాల జలకంపంలో
ఎన్నటికీ తీరం చేరని మధుర స్మృతుల
సుమధుర గానామృతం జడివానై కురుస్తుంది
జాబిలి జల్లెడ నుంచి కారిన
వెన్నెల ద్రవంలో ఘనీభవించిన హృదయం
నవనీతమై రాగావిష్కరణ చేస్తుంది
సముద్రానికి నిధులిచ్చే నీరు
నదుల ప్రవాహ ప్రసాదమే కదా!
పవిత్ర సంగమంలో
పోతపోసుకున్న మరకత మాణిక్యాల
తళ తళలు కెరటాలకు మెరుపునిస్తాయి
ఎక్కడో గోడలకంటుకున్న కిటికీ
తలుపు తెరుచుకుని
గది ప్రపంచాన్ని లోపలికి లాక్కుంటున్నప్పుడు
మదికి అన్ని వైపులా బంధువులైనట్లు
ఒక్కటొక్కటిగా నిశ్శబ్దంగా పలకరించి నవ్వుతుంటాయి
ప్రాకృతిక కిటికీ
~ర్యాలి ప్రసాద్
భువనేశ్వరి నా భక్తిని
నవవిధముల వ్యక్తపరతు నాదగు తీరున్
నవరాత్రులలో దినమొక
కవనమ్మును కాన్కనిత్తు గైకొనవమ్మా
నవరాత్రులయం దెన్నియొ
యవకాశమ్ములు లభించు ననువగు భక్తిన్
శివగామిని గాథలనే
శ్రవణమ్మును చేయగాను రాతిరిబవలున్
కావలసినదేమున్నది
నీవే నామదిని నెలవు నిండుగ నుండన్
కైవల్యమ్మును పొందగ
కేవలమిక నీదునామ కీర్తన చాలున్
పాపపు పనులను చేయుచు
పాపపు యోచనలయందు బ్రతుకుటకంటెన్
పాపనివారణ చేసెడి
కాపాలిని నే స్మరింతు కద్దగుతీరున్
పరికించగ బ్రతుకంతయు
దురితపు కర్మల నరులను దొరయనుచుంటిన్
తరియించెద నారాయణి
చరణమ్ముల సేవచేసి సరిమార్గమునన్
అందరు నావారే యను
కొందును భేదముల నెంచకుండ భవానీ
మందిరమౌ మదినే ఫల
మందరికిని దక్కగా సమర్చన చేతున్
అందరిలో కనిపించెద
వందును గలవిందు లేవటంచెటులందున్
వందన మెవరికి జేసిన
నందునదే నీకని వినయముతో చేయన్
దాసుడిగ నింద్రియములకు
కాసులకై ప్రాకులాడి ఘనకీర్తులకై
వేసారితినమ్మా యిక
దాసుడ నేనగుదు నీకు దయగలతల్లీ
సఖులంటే మదికంత
స్సుఖమును కలిగించువారు సుముఖులు కనగన్
సఖులెవ్వరు గలరీ యిల
నఖిలాండేశ్వరిని మించి యానందమిడన్
రాజును కాను కానుకగ రత్నపు రాసుల నిన్ను ముంచగన్
పూజలు సేయలే దెపుడు పొందగ నీ కరుణా కటాక్షమున్
రాజిలుచుందు వెల్లపుడు రమ్యముగన్ దరి చేరి నా మదిన్
ఓ జగదంబ గైకొనవె యున్నతమాత్మ నివేదనమ్మిదే
madhuravani.com అంతర్జాల పత్రిక నిర్వహించిన
కవితలపోటీ లో ఉత్తమ బహుమతి సాధించిన కవిత.
ఓ వర్షం కురవని రాత్రిలో
నదిలో కలుస్తున్న నీటి చుక్కలెక్కడివో
గమనించుకోలేని దిగులులో నేనున్నప్పుడు
దోసిలి పట్టకు, దోషిని చెయ్యకు
ఈ పడవలో ప్రయాణానికి
పరితపించకు.
పగిలిన ముక్కలు ఏరుకు
పారిపోతున్న దాన్ని.
నెత్తురోడేలా గుచ్చకుండా
(నిన్నైనా నన్నైనా)
వాటి పదును పోగొట్టేందుకు
ప్రయత్నిస్తున్నదాన్ని
ముక్కముక్కలో, ఇంతింతగా
తత్వాన్ని చదువుకోగలను కానీ
వరదొచ్చి ముంచేసే వేళల్లో
పొరలన్నీ కరగక తప్పని వేళల్లో
అంత నిజాన్నీ చూడలేను.
చెప్పలేదు కదూ,
నది చీలి నిలబడ్డ క్షణాల్లో
నే పారిపోని సంగతీ
నదిని ఎలాగైనా గెలవగలనని తెలిసీ
అది తెలీని వాళ్ళ కోసం
ఓడిపోయిన సంగతీ..
ఒక్క తుఫాను రాత్రికే
ఓటమినొప్పుకున్న ప్రాణమిది
కవ్వింపులెందుకు?
మునిగిపోవాల్సిన చిల్లుల పడవే ఇది.
నిబ్బరంగా ఊగిన నాలుగు రెక్కల
పూవొకటి
నిలబడాలని తపించిన నాలుగు పూవుల
మొక్కొకటి
ఏం చెప్పాయో తెలీదు కానీ,
గుప్పెడు గుండెను అడ్డంగా పెట్టి,
మళ్ళీ దిక్కులు వెదుక్కుంటున్నాను.
నీలా వెలుతుర్లో కాదయ్యా,
ఈ పగటి ప్రశాంతతలో కాదయ్యా,
తుఫాను రాత్రి చూశానీ లోకాన్ని.
అలాంటి రాత్రి, అలాంటి ప్రతి రాత్రీ,
నాతో ఉండాలనిపిస్తే చెప్పు
ఉండే వీలుంటేనే చెప్పు
మనం మాట్లాడుకుందాం!
తుఫాను రాత్రి
~మానస చామర్తి
madhuravani.com అంతర్జాల పత్రిక నిర్వహించిన
కవితలపోటీ లో ఉత్తమ బహుమతి సాధించిన కవిత.
madhuravani.com అంతర్జాల పత్రిక నిర్వహించిన
కవితలపోటీ లో బహుమతి సాధించిన కవిత.
స్పర్శ తెరలు
చూపులను ఆకర్షిస్తాయి
చరవాణి చెరలో
ప్రమేయం లేని బందీలై కనిపిస్తారు
చిత్రాలు సందేశాలే పలకరింపులై
ఉదయిస్తాయి అస్తమిస్తాయి
అతివృష్టి అనావృష్టి అనే
స్పందనల కుంభవృష్టి నడుమ
భావాలు మనసును జయించవు
ఎండమావి స్నేహాల్లోంచి
దిక్కుతోచని తపనలు
పురుడుపోసుకుంటూనే వుంటాయి
కలిసినవాళ్ళెవరో
ఏమి సాధించాలో తెలియదు
అంతలోనే క్రొత్త ఆహ్వానాలు
వింత నిష్క్రమణలు
అహపుమేఘాల నడుమ
శూన్యం లో వ్రేలాడుతూ
వెలతెలబోతూ కనిపిస్తున్నాయి
నేటి వాట్సప్ గ్రూపులు!
నీ నవ్వు
~పూండ్ల మహేష్
madhuravani.com అంతర్జాల పత్రిక నిర్వహించిన
కవితలపోటీ లో బహుమతి సాధించిన కవిత.
తాకకుండా వొదిలేస్తే
జాపిన చేతుల్లాంటి రెక్కలు వెనక్కి తీసుకోలేక,
వడలి రాలిపోయిన పూవుల్లాంటి నిముషాలేవో
నీలోపలా ఉండే ఉంటాయ్...
ఎప్పుడైనా లోపలికి చూసుకున్నావా...నేస్తం!
నేను ఇదీ అని చెప్పడానికి నీలో కాసిన్ని మాటలున్నా,
పోగేసుకోకుండా వొదిలేసిన
ఆ కాసిన్ని క్షణాల విలువ తెలిస్తే తప్ప
నీలో నువ్ నిధిలా దాచుకున్నదేదీ బతిమాలినా
నిన్ను భాగ్యవంతుడిగా ఒప్పుకోదుగా...
మనసనేది
స్వర్గ ద్వారాలకు దారులు తెలిసీ
మౌనవ్రతం చేస్తున్న ప్రియురాలు...
మనిషి మాటలు నేర్చీ
తనని గెలుచుకునే మంత్రం తెలీని అమాయక ఆరాధకుడు...
అప్పుడప్పుడూ అయినా సరే
కాలం రహదారి మీద
నిన్నల్ని మరిచి పరిగెత్తేప్పుడు
మైలురాళ్ల మధ్య నడిచిన ఖాళీల్ని
అనుభవంగా మలుచుకోవడం తెలిసుండాలి...
జ్ఞాపకాల మధ్య వొదిలేసిన మరుపు క్షణాల్ని
నీవి అని చెప్పుకోవాలంటే
కనీసం గుర్తుపట్టేందుకు
గతం దారి మధ్యలో ఆరిన దీపాల కోసం
నీదైన నవ్వు, పెదాలపై ఎప్పుడూ వెలుగుతూ ఉండాలి...