MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
Website Designed & Maintained by Srinivas Pendyala www.facebook.com/madhuravanimagazine
వ్యాస మధురాలు
కధలు ఎందుకు రాస్తారు?
మెడికో శ్యాం
కధలు ఎందుకు రాస్తారు? నేనెందుకు రాసేను? ఎందుకు రాయటం లేదు?
ప్రశ్నలేమయినా సమాధానం ఒకటే.
"ఒరేయ్ ఒరేయ్ కవీ
నాదొక చిన్న మనవి
నువ్వెందుకు రాస్తున్నవ్?
నూకలివ్వక పోయినా భావాల
మేకలెందుకు కాస్తున్నవ్?"
అన్నాడు ఒకాయన.
నిజమే మనలో చాలామంది నూకలివ్వకపోయినా మేకలు కాసేరు. రూకలివ్వకపోయినా కధలు రాసేరు.
ఇవాళంటే బ్లాగులూ, ఫేస్బుక్కులూ,వాట్సప్పులూ వచ్చి సులభంగా చవగ్గా అచ్చేస్తున్నారు (పబ్లిష్ చేస్తున్నారు) కానీ మేమంతా ఒకప్పుడు రాసి పంపి, తిరిగి పంపి ... తిరిగి పంపి వున్న డబ్బులు తగలేసి లేని/రాని డబ్బులు ఆశించక రాస్తూ పోయేం.
ఎందుకు?
అచ్చులో పేరు చూసుకోవచ్చని. చూసుకుని ఎదో సాధించామని భ్రమసి .
దీన్ని కీర్తికాంక్ష అనవచ్చా?
వచ్చినా రాకపోయినా వస్తుందనే అర్ధాపేక్ష అనవచ్చా?
"శ్రీనివాసరావు రాస్తున్నది
మానిషాదగీతంలో వున్నది"
అన్నడాయన.
వాల్మీకి నుంచి ఇవాళరాస్తున్నవాళ్ళదాకా ఏదో వేదన ,రాయాలనే తపన, ఒక రకమైన భాద ఉన్నదో ఊహించుకున్నదో రాయిస్తుందేమో అందర్నీ. ఏం రాయాలో తెలియనితనం . కాని ఏదో రాయాలనే తహ తహ. ఎలరాయాలో తెలీని అయోమయం. అందరు రాతగాళ్ళనీ ముందుకు తీసుకుపోయేది ఈ సుస్పష్టమైన అస్పష్టతే.
చదివిన వెంటనే రాసెయ్యాలనే కాదు, రాసిపారెయ్యాలని లొపలినుంచి ఒక చలనం.ఇది రియాక్షనరీ కావచ్చును. ఎఫెక్టేషన్ కావచ్చును. సరిగ్గా ఇలాగే కాకపొయినా, ఇంచుమించు చాలామంది ఇలాగే మొదలుపెడతారేమో.
"మనస్సులలోనూ,హృదయాలలోనూ పేరుకున్న బరువుని దించుకోవడానికో, పంచుకోవడానికో కదా మనం రాస్తాం!" అంది ఒక సహజకవయిత్రి. వాటినే నేను రియాక్షనరీ అన్నాను.
కొంతమంది వాళ్ళకి లేని/వున్న తెలివి ప్రదర్శించడానికి రాస్తారు. నేను కూడా నన్నందరూ చాలా తెలివైనవాడు అని అంటూవుంటే నిజమేనేమో అనుకుని రాయడం మొదలుపెట్టి కాదని తెలుసుకుని మానేసాను.
ఇంతకీ రాయడానికి చాలా తెలివితేటలు కావాలా? అన్నది. దానికి నాకు సమాధానం దొరకలేదు, కధలు చక్కగా రాయడానికి ఒకరకమైన చురుదనం కావాలనే అభిప్రాయం తప్పిస్తే.
వయ్యారాలు పోవడానికి ఒంపుసొంపులూ , అందచందాలూ కావాలా?! అలాంటి సెల్ఫ్ ఇమేజ్ వుంటే చాలదూ?
పురాణం సుబ్రహ్మణ్య శర్మగారు ఒకసారి ఇలా అన్నారు : "నేను అందమైన వాడిని కాను. తెలివైనవాడిని కాను. చాలా చదువుకున్నవాడిని కాను. నాలోని ఈ ఇన్ ఫిరియారిటిని పోగొట్టుకోవడానికే నేను రాసేనేమో " అని.
అపుడు నేను చాలా ఆశ్చర్యపోయేను. నా దృష్టిలో ఆయన చాలా తెలివైనవాడు. బాగా చదివినమనిషి. కానీ ఆలోచిస్తే అందరూ కాకపోయినా కొందరు ఎక్కడో ఒకచోట పొందలేనివి మరొచోట సాధించే ప్రయత్నంలో రాస్తారేమో అన్ పిస్తుంది. వాస్తవ జీవితంలో కూయలేని, కోయలేని కూతలూ, కోతలూ రాతల్లో చూపిస్తారెమో అన్ పిస్తుంది. నేను కూడా అలాగే రాసేనా అని అలోచిస్తున్నాను.
చలం గారిని ఒక ఇంటర్వ్యూలో ఎందుకు రాసేరని అడిగితే, 'బుద్ధి లేక ' అన్నారు. మరో సందర్భంలో రాయకుండా వుండలేక అని అన్నరు. రాయకుండా ఉండలేక పోవడమనేది చాలామంది కధకులకి అనుభవమే. ఎది చూసినా, ఎవరికధ చదివినా, ఏ వాక్యం చదివినా నేనెలా రాస్తాను దీన్నే అని ఆలోచించడం, ఇది నాకు కూడా కొంతకాలం జరిగిందని అనుకుంటున్నాను. ఇప్పుడుకూడా అంటే రాయటం లేనపుడు కూడా, నేనైతే ఎలా రాస్తాను దీన్ని అని ఆలోచిస్తూవుంటానేమో అన్ పిస్తోంది.
చలం గారి భావాలు నవనవ అవయవాలు. జర్జెట్ చీర, వదులు జడా వేసుకుంటాయి అన్నాడొకాయన. అలాటి నవనవ యౌవనంలో ఆలోచనల్తో వున్న యువకు(తు)లే రాయాలి కధలు. తరువాత కావలిస్తే వ్యాసాల్రాసుకోవచ్చు. ఇది కొంతలో కొంత బుచ్చిబాబు గారి వుద్దేశం కూడా. నేనూ అలాగే అనుకోవడమే కాకుండా, నేను చేసిన 'కధలు రాయడం ఎలా?' అన్న రేడియో ప్రసంగంలోనూ అన్నాను.అప్పుడు యువకుడిగా రాస్తే మరి ఇప్పుడు? సం ఆర్ యంగ్ అదర్స్ ఆర్ యంగ్ ఎట్ హార్ట్ అని సరిపెట్టుకుందాం.
ఒకసారి మన కవులూ, కధకులూ 'పింపినాహా' అన్నను. అంటే ఎప్పుడూ ఏడ్చే పిల్లవాడు అనీ.
రచయితలూ, కవులూ సదా బాలకులు. అంటే ఆకుపచ్చని అమాయకత్వం లాంటి చైల్డ్ లైక్. చైల్డిష్ అనబడే అల్లరి చిల్లరి జులాయితనం. నే రాసిన ఒక చిన్న కధ పేరు నాలుగు 'వె ' లు. వె.. వె.. వే.. వెయ్యకు. అంటే వెర్రివెధవవేషాలు వెయ్యకు అని. అంటే వేసామనేగా అర్ధం.
కధలంటే జీవన శకలాలు, జీవితదృశ్యాలు. ఒక కోణం. ఒక దృక్కోణం. ఒక భంగిమ. ఒకకధనకుతూహలం. ఇలా అనుకుని కధ, కధానిక, మినీకధ, మరీ మినీకధ, ఒకేవాక్యం వున్నవీ రాసేను, ఫ్లాష్ ఫిక్షన్ అనే టెర్మ్ తెలియకపోయినా.
రాస్తున్న రచయిత ఆక్షణంలో ఆకాశంలో వుంటాడు. ఆత్మవిశ్వాసంలోనూ, ఆలోచనల్లోనూ, అభ్యుదయభావాల్లోనూ. అన్నీ తనకేసాధ్యమనుకుంటాదు. తనమాటే ' ఫైనల్ వర్డ్ ' అనుకుంటాడు. ఆ భ్రమే రాయిస్తుంది. నిజం నిష్టూరంగా వుంటుంది. భ్రమలు ఎల్లకాలం వుండవు కదా. నేర్చుకోవడానికెవరూ చదవరు అన్నారు ఒకాయన. కాని చదవడం వలన నేర్చుకుంటారెమో అన్న భ్రమలో సందేహాలూ, సందేశాలూ కూడా రాసేరు నాలాంటి వాళ్ళు.
"ఒకడొస్తాడు
ఆడతాడు
పాడుతాడు
బలే బాగా !
ఆలోచించమంటాదు
అదే మాకు కష్టం"
అని రాసేనొకసారి.
ఇటీవలి కొన్ని కధలూ, కొందరు కధకుల్నీ చూస్తూంటే నాకీ విషయాలు గుర్తొస్తున్నాయి: షాకింగ్ గా చెప్పాలనీ, కొత్తగా వుండాలనీ, విశిష్టత కావాలనీ, ఔన్ స్మీ అన్ పించాలని ప్రయత్నించిన రోజులు గుర్తొస్తున్నాయి.
ఎంతమంది కధకులో అన్ని శిల్పాలూ ,శైలులూ (అని కుటుంబరవు గారు) అన్నట్టుగా, ఎన్ని కధలో అన్ని రూపవిన్యాసాలూ , ప్రయోగాలూ అని అశించేవాడిని.
ఆఖరిగా, నా రచన పై ఓ రచన
ముందు గాలి వాటంలో రాసేను
తరువాత
రాయాలని రాసేను
పిదప
రాయలేక ఆగేను
ఆగి సగం వగచేను
అసలు రాసేనా?!
OOO