top of page
adannamaata.png

సంపుటి  5   సంచిక  3

Website Published &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

కథా​ మధురాలు

కళ్ళు

 

గిరిజాహరి కరణం

Girija Hari Karanam.PNG

“కొత్తగా... రెక్కలొచ్చెనా... గూటిలోనీ గువ్వ పిల్లకీ... మెత్తగా...రేకు విప్పెనా ....”

 

ఏటి గాలిలో నీళ్ళల్లో ఇసకల్లో కలిసి మృదు మధురంగా సాగుతూంది పాట.

 

ఏటిపక్కనే వున్న ప్రెసి డెంటు గారి మామిడితోటలో ఏటి వారగా కొన్ని ముంతమామిడి చెట్లు, ఇసకమీదికి నేలబారుగా సాగిన ఓ కొమ్మమీద కూర్చుని పాడుతున్నాడు కాశీ. చాకలివాళ్ళు బట్టలు బండకేసి బాదుతూ చేస్తున్న ఇసో అసో శబ్దాలు, అడపాదడపా రోడ్డుమీదపోతున్న బస్సులూ లారీల శబ్దమూ తప్ప ఇంకే అలికిడీ లేదక్కడ .

పాట వింటూ “ఎవరా పాడేది ?”అంటూ ఆరా తీశాడు ప్రెసిడెంటు గారి పెద్దల్లుడు .

“మంగమ్మ కొడుకయ్యా, కళ్ళు కానరావు. చినిమా పాటలు పాడతా వుంటాడు,"అని చెప్పాడు నీళ్ళ బిందె దింపుతూ మునెప్ప .

“వాణ్ణిట్టా కేకేసుకు రారా "పురమాయించారు ప్రెసిడెంటుగారు.

 “ఒరేయ్ కాసిగా, అబ్బయ్య గోరు పిలత్తన్నారు రారా “అంటూ వచ్చాడు మునెప్ప.

”నేనేడకీ రాను“ అన్నాడు పాట ఆపి, కాశీ. 

"మంగమ్మా పెసిడెంటుగోరి కుటింబరమంతా వనబోజినాలకి తోపులోకొచ్చుండారు. ఈడి పాటిని పిల్చుకోని రమ్మని నన్నంపినారు. ఈడు రానంటుండాడు, నే బోతండా” అరిచి చెప్పాడు మునెప్ప “ఒరే! కాశిగా.  మన ప్రెసిడెంటు మంచి కోరే మడిసిరా. అట్టాంటోళ్ళు పిలిత్తే ఎళ్ళాల్రా. ఎళ్ళెళ్ళు. నాయన్నాయనా మునెప్పా.  ఆణ్ణట్టా చెయ్యి పట్టుకోని తీసుకెల్లు. ఇదిగో యీ ఆరేసిన గుడ్డలు మూటగట్టుకోనొచ్చేస్తా "బతిమాలింది మంగ.

 

ముందురోజే తోట మధ్యలో శుభ్రం చెయ్యించారు. తెల్లారకముందే అక్కడ జంఖాణాలు పరిచిరాళ్ళపొయ్యి మంచినీళ్ళు సిద్దం చేశారు. పిల్లలంతా వుప్పూ కారం పొట్లాలు పట్టుకుని మామిడిచెట్ల కొమ్మలమీదెక్కి ఆటలు మొదలు పెట్టారు. ప్రెసిడెంటుగారి ఇద్దరుకూతుర్లూ అల్లుళ్ళూ కొడుకూ కోడలూ పిల్లలతో శలవలకొచ్చారు . 

 

కాశీ నాలుగైదు పాటలు పాడాడు, అందరూ వాడి ఆకారానికీ గొంతులోని మాధుర్యానికీ పొంతన లేదని ఆశ్చర్య పోయారు. 

”పాటకు పైసా తీసుకుంటాడయ్యా యీడు. గొడ్లకాడ గొర్లకాడ వుండే పిల్లకాయలంతా మద్దినాల పూట ఈడిచేత పాడించు కుంటారయ్యా “అని మునెప్పచెప్తూంటే "ఇప్పుడు పైసాకు పాట్టంలేదన్నా“వారించాడు కాశీ.

 

“ఐతే రేటు పెంచేశావన్నమాట “పార్వతమ్మ మాటలకు అందరూ నవ్వారు. 

 

“పుట్టినప్పుడే కళ్ళులేవా" అడిగాడు పెద్దల్లుడు ప్రసాదరావు,అతను డాక్టరు.

 

”పుట్టినప్పుడు బాగుండెనయ్యా. ఆరేడేళ్ళ ఒయిసులో పిల్లగాండ్లతో ఆడతా పందాలు పెట్టుకున్నారంట మానుమీదెక్కి ఎవురు కొసాకొమ్మన కూచుంటే ఆల్లు గెలస్తారని. ఆణ్ణించి పడ్డాడు“ అంది మంగ.

 

“డాక్టర్లకు చూపెట్టలేదా?” కమల అడిగింది. 

 

“అయ్యో, తల్లీ. ఏంపెట్టి చూపెట్టేదమ్మా, కడుపునిండా తిండే పెట్టలేకపోతుంటి. అప్పుటికీ పేటకు గవర్మెంటాసుపత్రికి 

ఒక్కేడాది తిప్పీ తిప్పీ కాల్లరిగినాయి కల్లు రాలా తల్లీ“ అంది మంగ.

 

"మన వూర్లో బ్లైండ్ బాయ్స్ స్కూల్ వుందికదా అక్కడి మానెజ్ మెంట్ వాళ్ళు నాకు తెలుసు. అక్కడేవుండి 

చదువుకోవచ్చు, అంతా ఫ్రీనే సంగీతం కూడా నేర్పుతారు "ప్రసాదరావు భార్యతో చెప్పాడు .

 

అది విని ప్రెసిడెంటుగారు “ఏమే మంగీ నీ కొడుకుని పంపుతావా ?"అన్నారు. 

“అయ్యా! మీకు తెలవందేముండాది  సామీ, మొగుడుపోయె యిద్దరాడ పిల్లలూ  పోయిరి. ఈణ్ణి గూడా కళ్ళజూడక 

నేను బతగ్గలనాయ్యా“ అంది మంగ కళ్ళుతుడుచుకుంటూ.

 

“అమ్మా, మా యింట్లో  పనిమనుషులు నిలబడ్డంలేదు.  మంగొస్తుందేమో కనుక్కో, అక్కడేవుండి పిల్లాణ్ణి చూసుకుంటూ వుండొచ్చు” చెప్పింది కమల వాళ్ళమ్మతో. వాళ్ళది పెద్ద కుటుంబం. ఇద్దరుపిల్లలు, అత్తమామ, కాలేజిలో చదువుకొనే మరిది ఆడపడుచూ,ప్రసాదరావు పెద్దకొడుకు, లంకంత పాతకాలపు మేడ, చుట్టూ పెద్దస్థలం తోట.

 

“ఏమే మంగా నీవుకూడా వెళ్ళు, ఇక్కడ మాత్రం ఏం బాముకుంటావే నువ్వున్నన్నాళ్ళూ ఎలాగో పోషిస్తావు 

నీ తరవాత వాడి గతేమిటో ఆలోచించు.“ అంటూ హితవు చెప్పింది  పార్వతమ్మ. 

 

**

     

కాశీ స్కూల్లో చేరాడు. మంగమ్మ డాక్టరు గారింట్లో వెనకున్న పనివాళ్ళగదిలో వుంటుంది. వారానికోసారి మూడుమైళ్ళు నడిచెళ్ళి కాశీని వెంటబెట్టుకొచ్చి మళ్ళీ తీసుకెళ్ళి దింపొస్తుంది. ఆ టైంలో కమల పిల్లలకు పాటనేర్పుతాడు కాశి .

**

ఆ రోజు డాక్టరుగారింట్లో డిన్నరు పార్టీ జరుగుతోంది. వూర్లో డాక్టర్లూ బంధువులూ ఫ్రెండ్స్ తో నిండిపోయింది తోట. పార్టీ మద్యలో కాశీని పిలిచి పాటలు పాడించాడు ప్రసాదరావు. ఆ రాత్రి చాలా పొద్దు పోయేదాకా అందరూ తమకిష్టమైన పాటలడిగి పాడించుకున్నారు. స్కూల్లో చేరి రెండు సంవత్సరాలు గడిచేసరికి పాటల్లోని సాహిత్యం తప్పులు లేకుండా పాడగలుగుతున్నాడు ,స్కూల్లో సంగీతం టీచరు కాశీ గొంతు, పాడే తీరు చూసి శాస్త్రీయ సంగీతం కూడా నేర్పుతున్నాడు.

పార్టీకొచ్చిన డాక్టరొకాయన కాశీని మెచ్చుకుని తనకు తెలిసిన మ్యూజిక్ డైరెక్టరుకు పరిచయం చేస్తానన్నాడు.

            

**

చూస్తూంటే యింకో రెండేళ్ళు గడిచాయి.

ఇప్పుడు కాశీ టీవీ ల్లోనూ స్టేజీలమీదా పాడుతున్నాడు. ఒకటి రెండు సినిమాల్లోకూడా ఒకటీ రెండూ పాటలు పాడాడు. అయితే అతన్నిపాటలు పాడే చోట్లకు తీసుకెళ్ళటానికి మంగమ్మ  వల్ల కావటంలేదు.

కమలవాళ్ళింట్లో వంటామె కూతురు కావేరి కాశీని తీసుకెళ్ళటానికి ఒప్పుకుంది.

కన్నమ్మది కర్నాటకాలో వో పల్లెటూరు. భర్త పోయాక ముగ్గురు పిల్లలతో యీ ఊరొచ్చింది.

దూరబ్బంధువుల సాయంతో వంటపనికి కుదిరింది. మెల్లిగా నాలుగిళ్ళయ్యాయి. ఆడపిల్లలచేత కూడా ఊరికే కూచోకుండా ఇంట్లోనుండే ఏవో పనులు చేయించి డబ్బుకూడబెట్టి పెద్దమ్మాయి పెళ్ళిచేసింది. కొడుకు మీద ఆశలు పెట్టుకుని చదివించింది, కానీ ప్రేమించానంటూ ఓ అమ్మాయిని పెళ్ళిచేసుకుని, పెళ్ళానికి నచ్చలేదని వేరెళ్ళిపోయాడు. కావేరి డిగ్రీ పాసయ్యి సాయంత్రాలు ట్యూషన్లు చెబుతూ అమ్మకి ఆసరాగా ఉండేది.

 

కాశీని బస్సుల్లో ఆటోల్లో ఎక్కించి చేయి పట్టుకుని తీసుకెళ్ళి, పనయ్యాక ఇంటికి తీసుకొస్తూంది కావేరి. ఆమెతో  స్నేహం యేర్పడింది కాశీకి. ఇద్దరూ ఒకరికి ఒకరయ్యారు. తన మనసులోనివన్నీ ఆమెతో పంచుకుంటున్నాడు అతను చెప్పేవన్నీ వింటుంది, అతడిని జాగ్రత్తగా చూసుకుంటుంది కావేరి.

 

ఇద్దరూ పెళ్ళిచేసుకున్నారు. కాశీ బిజీ అయిపోయాడు. 

 

 నాలుగేళ్ళు గడిచాయి.

డాక్టర్లు కాశీకి ఆపరేషన్ చేస్తే కళ్ళు వస్తాయన్నారు. తీరిక చేసుకుని హాస్పిటల్లో చేరాడు. 

ఆపరేషన్  సక్సెస్ అయింది. “రేపు పొద్దుటే కట్లు విప్పుతారు. మొదటఎవర్నిచూస్తావని అడిగాడు డాక్టరు.

“కావేరి“ అన్నాడు  కాశీ.

”అదేమిటీ మీ అమ్మను చూడవా “నవ్వుతూ అన్నాడు డాక్టరు. 

“చిన్నప్పుడు చూశాగా, కావేరినసలు చూడలేదు.” కావేరి భుజమ్మీదున్న చేతిని గట్టిగా అదిమాడు.

ఒక్కసారి కావేరి కళ్ళు నిండుకున్నాయి. రేపటి కోసం తను కన్నకలలన్నీ పొద్దుపోయే దాకా చెప్తూనే వున్నాడు కాశీ. కాసేపటికి హాయిగా నిద్రపోయాడు .

అతని ప్రక్కనే బెంచీ మీద కూర్చుంది కావేరి. రేపటి గురించిన ఆలోచనలూ గత స్మృతులూ కలగాపులగంగా చుట్టుముడుతున్నాయి ఆమెను.

**

 

 ఆ రోజు డాక్టరుగారి అమ్మాయికి పాట నేర్పుతున్నాడు కాశీ. కావేరి అప్పుడే తొలిసారిగా చూసిందతన్ని. అతని గొంతు విన్న కావేరి కాశీపాటనే ప్రేమించింది, ఆరాధించింది, జీవితాంతం అతనికి చేయూతగావుండి  ప్రముఖ గాయకుడైతే చూడాలి అనుకునేది ప్రోగ్రాంస్ కు తీసుకెళ్ళేటప్పుడు.

 

 ఎన్నెన్నోకబుర్లుచెప్పేవాడు కాశీ .తన మనసులోవన్నీ చెప్పేవాడు “నాకు ఏడేళ్ళవరకూ కళ్ళుండేవి, సినిమాలంటే పిచ్చినాకు. మా వూరికీ పేటకూ మధ్యలో సినిమా టెంటుండేది.  అమ్మనేడిపించి డబ్బులు తీసుకెళ్ళి  సినిమాలు చూసేవాణ్ణి. కళ్ళుపోయాక నేను చూసిన సినిమాలను మనసులోనే మళ్ళీమళ్ళీ చూసుకుంటూ వుండేవాణ్ణి. మావూళ్ళోవాళ్ళు ఎవరు సినిమాకెళ్తున్నా బతిమాలి, వాళ్ళచెయ్యి పట్టుకుని  వెళ్ళి టెంటు బయటే కూర్చుని పాటలూ, డయిలాగులూ వినేవాణ్ణి. టెంటుకి పాతసినిమాలే వచ్చేవి, కళ్ళున్నప్పుడు చూసిన సినిమాల్లోని యాక్టర్లు నా ముందు తిరుగుతున్నట్టే వుండేది. నేను పెళ్ళి చేసుకుంటే పాత సినిమాల్లోని బి సరోజలాంటమ్మాయినే చేసుకోవాలని కలలు కనేవాణ్ణి. ఆమె అందం యిప్పటికీ నా మనసులో ముద్ర పడిపోయి ఫ్రెష్ గా నా యెదురుగా నిలబడినట్టే వుంటుంది. యేమైనాసరే నాకలల రాణి సరోజ లాంటి సౌందర్యాన్నిసొంతం చేసుకోవాలనుకున్నాను. నా అదృష్టం కొద్దీ నీవు కలిశావు. నీ మాటలూ గొంతూ అలాగే వుంటాయి కాబట్టి ముమ్మూర్తులా ఆమెలాగే వుంటావనిపిస్తుంది నాకు. అందుకే నువ్వంటే నాకిష్టం” ఇలా ఎంతసేపైనా మాట్లాడేవాడు కాశీ. ఓపిగ్గా వినేది కావేరి.

 

గతంలో అతను చెప్పిన మాటలు గుర్తొస్తుంటే, ఒక్కసారి తనని తాను అద్దంలో చూసుకుంది కావేరి. ఎప్పుడూ సరిగ్గా చూసుకోని రూపం. అమ్మకి ఎంతో అందంగా కనబడే రూపం. తనెప్పుడూ పెద్దగా పట్టించుకోని రూపం.

కాశీకి కళ్ళువచ్చాక యిన్నాళ్ళూ తన సర్వస్వంగా అనుకున్నఆ తేనెలూరే గొంతు తనకు దూరమవుతుందా?

ఆలోచల్లో వుండగానే తెల్లారిపోయింది.

 

 నర్స్ వచ్చి కాశీని ప్రిపేర్ చేస్తోంది. యింతలో కన్నమ్మ, మంగమ్మ కూడా వచ్చారు.

కాశీని కుర్చీలో కూర్చో బెట్టి కట్లు విప్పారు. కావేరిని తీసుకెళ్ళి ఎదురుగా నిలబెట్టింది నర్స్ కాశీని మెల్లిగా కళ్ళుతెరవమని చెప్పారు. కాశీ కళ్ళు తెరుస్తున్నాడు. కావేరి కాశీకేసే చూస్తోంది. మెల్లమెల్లగా కావేరి రూపం స్పష్ట మైంది. ఒక్కనిమిషం అయోమయంగా చూశాడు కాశీ.

ఒక్కసారిగా “నో, నో” అని అరుస్తూ వెనక్కి విరుచుకు పడిపోయాడు. కావేరి  “కుబ్జ”. వీపు వంగిపోయి ఉంటుంది. కావేరిని తెలీనివాళ్ళు అనాకారి అనే అంటారు.

 

 కాశీకి ఫిట్స్ వస్తున్నాయి. మంచమ్మీద నిలవటంలేదు. ఏదేదో మాట్లాడుతున్నాడు. నలుగురు పట్టుకున్నా ఆగటంలేదు. డాక్టరు యింజక్షన్ ఇచ్చాడు. కాసేపటికి నెమ్మదించి నిద్రపోయాడు. ఇదంతా నిర్లిప్తంగా చూసిన కావేరి, కాసేపటి తర్వాత లేచి, మంగమ్మను అక్కడే వుండమని చెప్పి వాళ్ళమ్మను వెంటబెట్టుకుని యింటికొచ్చింది.

 

సాయంత్రం దాకా మౌనంగా ఏవో పనులు చేసుకుంది. బట్టలు సర్దుకుని అమ్మను తీసుకుని బయలుదేరింది. ఎక్కడికీ, ఎందుకూ అని అడిగే వాళ్ళమ్మకు జవాబు చెప్పకుండా రైల్వేస్టేషన్ కి వచ్చి టిక్కెట్లు కొని వాళ్ళవూరి రైలెక్కింది కావేరి.

 

 “ఏదో షాకయినాడేమో కానీ, కాశీ మంచివాడేనే కావేరీ, ఈ పాటికి సర్దుకుని వుంటాడేమో. ఎందుకే తొందరపడుతున్నావు? రైలు దిగి పోదాం పద”. అంది కన్నమ్మ ఏడుస్తూ.


"లేదమ్మా, నాకు కాశీ గురించి బాగా తెలుసు, అతని సుందర ప్రపంచం అంతా భౌతికమే. కళ్ళు వస్తాయన్నప్పుడే నేను కొంచెంగా ఊహించానిది. కానీ, నన్ను నన్నుగా చూడగలుగుతాడేమోనని ఎక్కడో ఆశ ఉండేది. అందాన్ని కళ్ళతో మాత్రమే చూసే కాశీ నాకు వద్దు. మన పల్లె కెళ్దాం, ముగ్గురు చిన్నపిల్లలతో ఈ వూరొచ్చావు. ధయిర్యంగా మమ్మల్నింత వాళ్ళను చేశావు. నీ పెంపకంలో పెరిగిన నేను, నన్ను నేను ఎప్పటికీ కోల్పోనమ్మా!” తల్లి చెయ్యి పట్టుకుని స్థిరంగా చెప్పింది కావేరి.

*****

bottom of page