top of page

సంపుటి 3  సంచిక 1

Website Designed &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

కథా మధురాలు

కాలంలో పయనం

Oleti Sasikala

డా. మూలా రవికుమార్

"మరో అరగంటలో మురళీ వస్తున్నాడు, ఏమైనా పనులుంటే ఇప్పుడే చెప్పేయ్"

"ఇంటికొచ్చి పూర్తిగా పన్నెండు గంటలు కాలేదు. ఇరవై రోజులనుంచీ ఇంట్లో లేరు. సాయంత్రం పెళ్ళాన్ని బైటికి తీసుకెళ్ళడం కన్నా మీ టూరు విషయాలు ఫ్రెండుకి చెప్పెయ్యాలన్న తొందరేనా?"  ఊహించినట్టే మా ఆవిడ అడిగింది.

 

"అది కాదమ్మాయ్. ఆఫీసులో ఇరవైరోజులు లేనేమో, మా బాస్ కూడా నన్ను రేపు తేలిగ్గా వదలడు. ఎల్లుండి మురళీ పదిరోజుల టూరు వెళ్తున్నాడు కనుక మాట్లాడుకోవటానికి కుదిరే అవకాశం లేదు.  ఐనా మురళీ వాళ్ళావిడ కూడా వస్తోందిలే, నన్ను నువ్వూ, వాణ్ణి వాళ్ళావిడా తిట్టుకుంటూ ఉంటే మీకు గంటలు నిమిషాల్లా గడిచిపోతాయి."

 

మేమిద్దరం బాల్యమిత్రులం. ఒకటినుండీ పదివరకూ కలిసి చదువుకున్నాం. ఇంటరు తర్వాత నేను హైదరాబాదు వ్యవసాయ కళాశాలలో ఉద్యానవన శాస్త్రం లో బియ్యెస్సీ, డిల్లీలో ఎమ్మెస్సీ పీహెచ్ డీలు చదివితే, వాడు డిల్లీలో భౌతిక శాస్త్రం లో ఎమ్మెస్సీ పీహెచ్ డీలు చేసాడు.  ఆ విధంగా ఐదో ఏట మొదలైన మా స్నేహానికి పాతికేళ్ళలోపు మేము కలవలేకపోయినది నాలుగేళ్ళే. ఆ నాలుగేళ్ళూ కూడా వారానికో ఉత్తరం, వాణ్ణించి నాకూ, నానుంచి వాడికీ వెళ్ళేది. వాడి పీహెచ్ డీ పూర్తికాగానే, అంతరిక్ష భౌతిక శాస్త్రంలో తదుపరి పరిశోధనల కోసం జర్మనీ వెళ్ళి ఐదేళ్ళున్నాడు.

 

నేను శాస్త్రవేత్త అనే ముద్ర వేసుకొని, పదేళ్ళు అక్కడక్కడా తిరిగి ఈ మధ్యే హైదరాబాదుకి వచ్చాను. అదే సమయానికి వాడు కూడా హైదరాబాదులో శాస్త్రవేత్తగా సెటిల్ అయ్యాడు. మా భార్యలకూ స్నేహం కలియటంతో మేమిద్దరం హాల్లో మాటల్లో మునిగిపోతే, వాళ్ళిద్దరూ వంటింట్లోనో, టివీ ముందో కూర్చొని, ‘మా ఆయన తెలివి తక్కువవాడు’ అంటే, ‘కాదు, మా ఆయన తెలివి తక్కువ వాడు’ అని ఒకరికొకరు నచ్చచెప్పుకుంటూ, తగిన ఆధారాలు ఇచ్చుకుంటూ, వాళ్ళు ఇచ్చిపుచ్చుకున్న ఆధారాలలో కొన్ని మాకు చేరవేస్తూ, మా స్నేహాన్ని మరింత దృఢపరచేరు.

 

నేను ఇరవై రోజులక్రితం రాజస్తాన్ రాష్ట్రంలో మెట్టవ్యవసాయంపై ప్రత్యేక శిక్షణ తీసుకొనేందుకు వెళ్ళి, ఈరోజు ఉదయమే వచ్చాను.

 

అరగంటలో వాడు ఫామిలీతో వచ్చాడు. వాడి పిల్లలూ మా పిల్లలూ కేరంసులాంటివి ఆడుకునేందుకు ఒక గదిలోకెళితే, మా మహరాణులిద్దరూ వంటింట్లోకి దూరారు.

 

"రాజస్తాన్ విశేషాలేంట్రా?" అనడిగాడు మురళి

 "ఏముందిరా అదంతా పిచ్చి మారాజుల చరిత్ర" అన్నాను.

 "నువ్వు మాట్లాడేది ఏరాజులగురించి?"

 "మనం చరిత్రలో చదువుకున్న రాజులంతా పిచ్చి మారాజులే. ఆవిషయం నేననడంకాదు. రాజస్తాన్ వాళ్ళుకూడా అనుకుంటున్నారు"

"ఎందుకు?"

“ఒక శతృరాజు పదహారు సార్లు దండెత్తి ఓడిపోయి, పదిహేడోసారి గెలిచాట్ట. ఈ పదహారుసార్లూ పారిపోవాలనుకుంటున్నవాణ్ణి క్షమించటం రాజధర్మం అంటూ వదిలేసాడు. పదిహేడోసారికల్లా సదరు పరదేశిరాజు, ఈ రాజుని ఓడించి కళ్ళుపొడిపించేసాడు. ఆ ఓటమికి ఇంకో పిచ్చి చాదస్తం కారణం."

"అదేం చాదస్తం?"

"రాజపుత్ర యుద్ధనీతిప్రకారం డేటూ, టైమూ, ప్లేసూ పెట్టుకొని పోరాడటం ఆచారం. సూర్యోదయానికి ముందు యుద్ధం మొదలెట్టరు. పరదేశి సైనికులకు అలాంటి చాదస్తాలు లేని కారణంగా అర్ధరాత్రి వీళ్ళమీద దాడిచేసి ఓడించేసారు."

"వీళ్ళు ధర్మం కోసం నిలబడ్డారేమో?"

 

"గాడిదగుడ్డు. ధర్మం తప్పకుండా చచ్చిపోతే, మళ్ళీ ధర్మం బ్రతికించే రాజు ఎక్కడినించి రాగలడు? తాత్కాలికంగా ధర్మం ప్రక్కనబెట్టి రాజ్యం నిలబెట్టుకుంటే, కావలసినంత ధర్మం నిలబెట్టవచ్చు. ఐనా వీళ్ళు ఒకరకమైన పిచ్చి వల్ల పోలేదు. చాలా ఉన్నాయి."

"రెండురకాలు చెప్పేవు. మూడో రకం ఏంటీ?"

 

“నేను చూసిన ఒక పెద్ద కొండమీద కోటలో పదహారో శతాబ్దం నాటి ఒక రాజుగారికి రాణీ నందిని అని అందమైన మహరాణి ఉండేది. ఆవిడ అందాన్ని మా గైడు భలే వర్ణించేడులే. ఆవిడతోపాటు, మరికొందరు రాణులూ, రాణీవరసవాళ్ళూ ఉండేవారనుకో. ఆవిడ అందం గురించి ఒక పెద్ద నవాబుగారు విని, ఆవిడకోసం కోటని ఆర్నెల్లు ఇరవైవేలమంది సైన్యంతో ముట్టడిస్తాడు. నవాబుగారి సైన్యం కొండెక్కి యుద్ధం చేసి గెలవలేదు. అందుకని కొండమీదికి సరఫరాలన్నీ ఆపి కిందన కొండ చుట్టూ ఉండిపోయింది. రాణీనందిని గారి భర్త...”

“ఆ రాజుగారి పేరు?” మురళీ మధ్యలో ఆపాడు

“గైడు చెప్పేడుగానీ నాకు రాణిగారి పేరొక్కటే గుర్తుంది”

అలా చెప్పేటప్పటికి మా ఆవిడా, మురళీ వాళ్ళావిడా, మా నలుగురికీ సరిపడా పకోడీప్లేట్లూ, కాఫీ కప్పులూ తెచ్చారు. అవి టీపాయ్ మీదపెడుతూ, మా ఆవిడంది. “గైడు కూడా రాణీగారి పేరే ఎక్కువసార్లు చెప్పి ఉంటాడు. అంచేత రాజుగారి పేరు మరిచిపోయి ఉంటారు” అంది నన్ను ఓదారుస్తూ. ఓహో. అంటే రాజుగారిపేరు మరిచిపోడానికి నేనివ్వాల్సిన సంజాయిషీ తనే ఇచ్చేసిందంటే, ఇక మురళీ వాళ్ళూ వెళ్ళిపోయాకా నాకు సంజాయిషీ ఇచ్చుకొనే అవకాశం కూడా లేదు.

 

“నందినీపతి ఆ పరిస్థితిని ఎలా ఎదుర్కొన్నాడో చెప్పండి” మా ఆవిడ అంది.

 “నువ్వుమొదటినుంచీ వినలేదుకదా?”

 “మీరు నెమ్మదిగా చెప్పేరనుకుంటున్న విశేషాలన్నీ మూడు, నాలుగిళ్ళ వాళ్ళు కూడా స్పష్టంగా వినగలరు గానీ, చెప్పండి.”

“కొండ మీద కోటలో ఉన్న రాజు గారు కిందకి కబురు పెట్టాడుట, చిన్నరాణులను నలుగురైదురిని అప్పగించగలనని. అది విన్న నవాబుగారు, నేనొక్కణ్ణీ నిరాయుధుడిగా కొండ మీద కోటలోకొస్తాను. రాణీ నందినిని ఒకసారి చూపించాలని, ఆవిడ దర్శనం కాగానే ముట్టడి ముగించి తన రాజ్యానికి తిరిగి వెళ్ళిపోతాననీ కబురుపెట్టాడు. నందినీపతి ఒప్పుకొని కోటసింహద్వారం దగ్గర స్వాగతం పలికి స్వయంగా రాణిగారిమహల్ మొదటిగదికి తీసుకెళ్ళాడు. ఆ మహలంతా గైడు మమ్మల్ని కలియతిప్పాడులే. ఏ ద్వారమూ, ఇంకో ద్వారానికి తిన్నగా ఉండదు. అలాంటి ఏడు గదుల అవతల రాణీనందిని నిలబడితే, ప్రతీ ద్వారం దగ్గరా ఒక నిలువుటద్దం పెట్టి ఏడుగదులివతల నిలుచున్న నవాబుగారికి రాణీగారి ఏడోప్రతిబింబం చూపించారు.

నవాబుగారు రాణిగారి అందాన్ని పర్షియన్ కవితలతో పొగిడి, ‘షుక్రియా’ అంటూ వెనుదిరగడానికి సిద్ధపడ్డాడు. అప్పుడు, మళ్ళీ ఈపిచ్చిమహారాజు, అదే, రాణీ నందినిగారి భర్త, తమ రాచమర్యాదలు గుర్తు తెచ్చుకున్నాడు. రాజపుత్ర మర్యాదల ప్రకారం నవాబుగారిని కోటసింహద్వారం దగ్గరకు కాకుండా, కొండక్రిందివరకూ సాగనంపుదామనుకున్నాడు. ప్రమాదం ఊహించిన రాజగురువూ, మంత్రీ లౌక్యంగా వేరే రాచకార్యాలు గుర్తు చేసి అడ్డు పడబోయినా వినలేదు.

రాజుగారు కొండక్రిందివరకూ వస్తే, నవాబుగారు, ‘మహారాజా, మా సైన్యాధికారి వారి ప్రణామం స్వీకరించండి’ అంటూ మరో నాలుగు ఫర్లాంగులు తమ సైనిక డేరాలమధ్యకి తీసుకెళ్ళి సైన్యాధికారి ప్రణామం రాజు గారు స్వీకరించేలోపే రాజుగారిని బంధించి చంపేసాడు. అప్పుడు రాణీ నందిని తన సవతులతోటీ, వందలాది దాసీలతోటీ జౌహార్ చేసింది.”

“జౌహార్ అంటే ఏంటి?”

“సహగమనం మనకి తెలుసు. కానీ, భర్త యుద్ధంలో, మరణిస్తే, మరణవార్త తెలిసిన రాణులు చేసే అగ్నిప్రవేశాన్ని జౌహార్ అంటారు.” “మధ్యలో దాసీలెందుకు?”

“రాణీమహల్లో దాసీలంతా రాజుగారిని తమ భర్తగా భావించి సహగమనం చేస్తారు. ఇలాంటి వర్ణనలు ఇతిహాసాల్లో కూడా ఉన్నాయి. ఫలానా మహరాజు చితిపై రాణీగారూ, ఇన్నివేలమంది దాసీలు సహగమనం చేసారంటూ.”

అంతలో “ఇంక నేను వెళ్ళి బజార్లో పని చూసుకోవాలి” మురళీ లేచాడు.

“సరే గానీ, ఎల్లుండి నుండీ నీ టూరు ఎందుకూ?”

“కాంతికన్నా వేగంగా ప్రయాణించే కిరణ పుంజాలని పరీక్షించమని, నెలక్రితం నాకో జర్మనీ పరికరం పంపారు. నాలాగే ఐదారు దేశాల్లో పరీక్షించిన సైంటిస్టులం అందరం ముంబైలో బాబా అటామిక్ రిసెర్చ్ సెంటర్లో ఓ పదిరోజులపాటు ఫలితాలు కలబోసుకోవాలి. కాలంలో ప్రయాణించే అవకాశాలమీద పరిశోధనల్లో ఇది ఒక భాగం” ఛెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. 

ఆరోజు రాత్రి మా ఆవిడ అడిగింది. “ఇందాక మీ ఫ్రెండూవాళ్ళూ ఉన్నారని అడగలేదు. రాణీనందినిగారి గురించి వివరాలు సెన్సారు చెయ్యకుండా చెప్పండి” అంది.

ఇలాంటి ప్రశ్నలు అడిగినప్పుడు మా ఆవిణ్ణి నమ్మను. నమ్మని విషయం ఆవిడకి తెలియనివ్వను. అందుకని నిద్రకు ఉపక్రమిస్తూ, లౌక్యంగా, రాణినందిని గారి భవన వర్ణనతో మొదలెట్టాను. భవన వర్ణన పూర్తయ్యేసరికి నెమ్మదిగా ఊ కొడుతూ మా ఆవిడ నిద్రపోయింది. రాణీ నందిని గురించి ఇతర విషయాలు నిర్భయంగా ఆలోచించుకుంటూ నిద్రపోయాను.

* * *

అనుకోకుండా మర్నాడు ఎయిర్‌పోర్టుకి వెళుతూ, మధ్యలో గంట సమయం మిగలటం వల్ల మురళి లేబుకి వెళ్ళేను. వాడు తన లేబులో రూళ్ళకర్ర లా ఉన్న గాజు పరికరం తీసుకొని నా దగ్గరకొచ్చి, “ఇదేంటో తెలుసా?” అన్నాడు.

“గాజుతో చేసిన రూళ్ళకర్ర”

“కాదు! టైం మెషీన్”

“కొయ్ కొయ్ కొయ్, కోతలు కొయ్ కొయ్” అంటూ ఓ సినిమా పాట అందుకున్నాను.

“కోతలు అనడానికి నీ ఆధారాలేంటి?” సీరియస్ గా అన్నాడు.

“కాలంలో ప్రయాణించడానికి ఎక్కడ కూర్చుంటాం?”

“తెలుగుసినిమాలో టైం మిషన్ చూసి జ్ఞానాన్ని సమకూర్చుకున్న వాళ్ళు ఇంతకన్న బాగా ఆలోచించలేరు”

“ఈ రూళ్ళకర్ర పట్టుకొని, దాని మీద బటన్ నొక్కితే గతకాలంలోకి వెళ్ళిపోతామంటావు?”  వెటకారంగా అడిగాను.

వాడు మరింత కోపంతో, “ఐతే ఓసారి బటన్ నొక్కిచూడు” అన్నాడు, రూళ్ళకర్ర నాకేసి చూపి ఊపుతూ.

వాడి చేతిలో ఊగుతున్న రూళ్ళకర్ర అందుకుంటూ, “నాకేం భయమా?” అంటూ, బటన్ మీదకి వేలు వెళ్ళేసరికి వాడు గాబరాగా నా చెయ్యి తొలగించే ప్రయత్నంచేస్తూ, “ఇది రూళ్ళకర్రేనని నేనూ ఒప్పుకుంటానురా, బటన్ మాత్రం నొక్కకు, ప్లీజ్” అన్నాడు. వాడిమాటలు పూర్తికాకముందే అంతా చీకటి. ఎక్కడికో అగాధంలోకి జర్ ర్ ర్రుమంటూ జారిపోతున్న అనుభవం. ఇద్దరం కెవ్వుమని కేకలేసుకుంటూ, ఒకచేత్తో రూళ్ళకర్రా, కాదు కాదు, టైం మిషనూ, ఇంకో చేత్తో ఒకరినొకరం పట్టుకొన్నాం. కొంతసేపటికి మేం జారటంలో ఒడిదుడుకులు తగ్గి సమవేగంతో జారుతున్నట్టు అర్ధంఅయింది. కేకలు ఆపాం. శాస్త్రవేత్తలకి భావోద్వేగాల నియంత్రణ ఎంత అవసరమో తెలిసేసరికే చేతులు కాలాయి.

పూర్తిగా ఆగేసరికి నెమ్మదిగా వెలుగు కనపడటం మొదలెట్టింది.

చూస్తే, నీరెండ ఉంది. చుట్టూ చూస్తే, వందలాది మనుషులు కనపడుతున్నారు. పెదాల కదలిక, హడావుడి చూస్తే చాలా గట్టిగా అరుస్తున్నట్టున్నా, ఏమీ వినబడటం లేదు. “ఏం జరుగుతోందిరా?”, కొంచెం భయం భయంగా అడిగాను.

 

“మనం కాంతికన్న వేగంగా ప్రయాణించాం కనుక, ఏదో కాలంలో మనుషుల నుండి వెళ్ళిన కాంతికిరణాల సమూహం దగ్గరున్నాం. అంటే మనకి కనపడుతున్నవి అప్పటి మనుషుల నీడలు. ధ్వని తరంగాలు అక్కడికక్కడే గాలిలో కలిసిపోతాయి కనుక, వాళ్ళ మాటలు గానీ అప్పటి శబ్ధాలు గానీ ఏమీ వినపడటంలేదు. వాళ్ళు నిజమైన మనుషులు కాదు కనుక, వాళ్ళు మనల్ని గుర్తించటం జరగదు.”

“ఇప్పుడు మనం ఏంచెయ్యాలి?”

“నువ్వు నోరుమూసుకొని, నా ప్రయత్నాలు నన్ను చెయ్యనివ్వాలి. లేకపోతే మనం తిరిగి మన కాలానికి, మన లేబ్ లోకి వెళ్ళలేం.”

“నిజమే, మా బాసు ఎయిర్ పోర్టులో వెయిట్ చేస్తూ ఉంటాడు.”

నామాటలు విని నావేపు కొరకొరా చూసి, మళ్ళీ రూళ్ళ..., టైం మెషీన్ చూడ్డం మొదలెట్టాడు.

“చచ్చేంరా” అన్నాడు

ఇప్పటికే చచ్చినట్టు మనసులో అనుకున్నా, బయటికి మాత్రం, “ఏమైందిరా?” అన్నాను.

“ఇందులో బేటరీ ఐపోయింది.”

“ఇప్పుడెలా?”

“సోలార్ చార్జ్ అవుతుంది.” అని చెప్పి టైం మిషన్ వదలమని నాకు చెప్పి, దాని బాగా ఎండ తగిలేచోట పెట్టేడు.

“మరో గంటలో సూర్యాస్తమయం అయిపోతుంది. చార్జింగ్ చాలదేమో?” తిడితే తిట్టేడులే అని నా సందేహం అడిగేను.

“లేదు లేరా. దీనికి అరగంట చార్జింగ్ చాలు. పౌర్ణమి ఐతే రాత్రి వెలుగుతో రెండుగంటల్లో చార్జ్ అవుతుంది.”

సరే అనుకొని, ఇది ఏ ప్రాంతమో, ఏ కాలమో తెలుసుకుందామని చుట్టూతిరుగుతున్నాను.

తెలుగు సినిమాలో దెయ్యంలాగ, నేనెవరికీ కనపడను. వాళ్ళు నాకు కనపడినా, వాళ్ళమాటలు వినపడవు. అంచేత మూకీ సినిమా అర్ధం చేసుకున్నట్టు చూడాలి. మూకీసినిమాలలో నటీనటులు, ప్రేక్షకుల్ని దృష్టిలో పెట్టుకొని హావభావాలు పలికిస్తారు. వీళ్ళు అలా కాదే. నా బాధ మురళికి చెప్పాలంటే, ఆ టైం మిషన్ తో నన్ను కొడతాడు. ఆ దెబ్బ కన్నా, టైం మిషన్ చెడిపోతుందనే భయమే ఎక్కువ.

సరే అనుకొని, అక్కడున్న పెద్ద మర్రిచెట్టు క్రింద ఒక పండితుడి ప్రక్క కూర్చున్నాను.  ఆ పండితుడు తామ్రపత్రం పై సిరాలో ముంచిన ఘంటంతో ఏదో రాస్తున్నాడు. రాస్తూ రాస్తూ ఉంటే పండితుడి కళ్ళనీళ్ళు తామ్రపత్రం పై పడుతున్నాయి. కష్టపడి చదివిన సారాంశం.

“డిల్లీ సుల్తాను గారి కామాంధత నుండి పట్టపురాణి శీలం కాపాడు పవిత్ర రాజపుత్ర కర్తవ్యనిర్వహణలో అమరుడైన గజేంద్ర ప్రతాప్ సింగ్...” చదవటం ఆపి ఆలోచించాను. ఆ... గుర్తొచ్చింది. గజేంద్ర ప్రతాప్ సింగ్ అంటే, రాణీ నందినీ మొగుడు. అంటే ఇప్పుడు నేను వారం క్రితం చూసిన కోటలో ఐదొందల ఏళ్ళ క్రితం కాలం లో ఉన్నానన్నమాట.  తామ్రపత్రం మళ్ళీచూసా,  “... సింగ్ మహారాజా వారి వీరపత్ని, మహారాణీ నందినీదేవి తన పాతివ్రత్య కర్తవ్యం నెరవేరుస్తూ ఈ దినము అనగా విక్రమాదిత్యశక (అంకెలూ, తిథులూ వగైరాలు అర్ధం కాలేదు) రోజున తన ఏడుగురు సవతి రాణులతోనూ, పదహారువందల అంతఃపుర దాసీజనం తోనూ జౌహార్ ద్వారా వీరస్వర్గంలో నున్న మహరాజుగారివద్దకు ప్రయాణిస్తున్నారు. నేను చదవటం అవగానే తామ్రపత్రాన్ని ఇంకో పెద్దాయన తీసుకొని (ఆయన నాకోసం ఆగలేదు. అసలాయనకి నేను కనపడట్లేదు కదా. అదీ కాకతాళీయమే) బిగ్గరగా చదువుతున్నాడు కాబోలు... వినబడట్లేదు... చదువుతూ ఉంటే చుట్టూ డజనుకి పైగా జూనియర్ పండితులు తిరగరాస్తున్నారు.

ఓహో! అనుకుంటూ చుట్టూ చూసా. వారం క్రితం గైడ్ మాకుచూపించిన ప్రతీ కట్టడమూ కనిపిస్తోంది. అప్రయత్నంగా, నాకాళ్ళు జౌహార్ గుండం వేపు వెళ్ళాయి. అది నాలుగడుగుల ఎత్తు రెండడుగుల వెడల్పున్న రాతిగోడకు అటువైపు నలభై అడుగుల దిగువనన ఉంది. అక్కడ ఏనుగుల సాయంతో పెద్దపెద్ద దుంగలిని పేరుస్తూ చాలామంది రాజభటులు కనిపించారు. అంతలో, “ఒరేయ్. టైం మిషన్ చార్జింగ్ అయింది, రారా” అని అరుపు వినపడింది. ఈ మూకీ సినిమాలో వినపడే ఏకైక గొంతు మురళిగాడిదే కనుక అటువైపు పరుగెట్టాను. సగం దూరంలో ఉండగానే, “ఒరేయ్. ఇది ఆటోమెటిగ్గా, బటన్ నొక్కకుండా ఆన్ అయిపోయింది. పరిగెట్టుకొచ్చి పట్టుకోరా,” అన్న అరుపు మళ్ళీ వినిపించింది. వాడికి నాలుగుబారల దూరంలో ఉండగానే, “ఒరేయ్ నేను మళ్ళీ వచ్చినిన్ను తీసుకెళతా” అన్న అరుపు బలహీనంగా వినపడి, వాడు మాయమైపోయాడు.

గుండె గుభేల్మంది. ఏడ్చినా ఎవరికీ వినపడదు. సరేలే అనుకుంటూ ఇల్లుకాలిపోయినా బొగ్గులేరుకొనేవాడిలా రాణీనందిని దర్శనం అవుతుందేమోనని, జౌహార్  గుండం వైపు వెళ్ళేను. ఇంకేముంది. గుండం అంతా మూణ్ణాలుగు వాలీబాల్ కోర్టులు పట్టేంత విస్తీర్ణంలో బోగీ మంటలంత మంటలు. జోహార్ చుట్టూ ఉన్న రాతిగోడనిండా దాసీలు. పురోహితులు మంత్రాలు చదువుతూ ఉండగా నమస్కారం పెడుతూ మూకుమ్మడిగా దూకేసారు. ఆ తర్వాత ఏడుగురు రాతిగోడ ఎక్కారు. వీళ్ళు రాణీ నందిని గారి సవతులు అని అర్ధం అయ్యింది. వాళ్ళుకూడా దూకాక, అప్పటివరకూ గోడచుట్టూ నిలుచుని ఉన్న పురోహితులంతా, నేను నిలుచున్న చోటికి వచ్చారు. వారి మధ్య నుండి మేలిముసుగులో వంటినిడా నగలతో - డౌట్ లేదు, రాణీ నందినీదేవే అయుండాలి. - వచ్చి జాహౌర్ గుండం గోడ ఎక్కింది. కిందనుండి వస్తున్న అగ్నికీలల సెగకి ఆవిడ ధరించిన పట్టుబట్టల అంచులు మాడుతున్నాయి. మొహం చూద్దామని కుతూహలంగా ఉంది. ముసుగు తియ్యదు. అంత దగ్గరగా రాణీ నందినీదేవిని చూడటం నాకు సాధ్యమవటం నమ్మలేకపోయాను… వొళ్ళంతా నగలే. నడుముని పూర్తిగా కప్పేసిన బంగారు వడ్డాణం ధగధగమని మెరుస్తుంది. గైడు చరిత్ర ఆధారంగా చేసిన వర్ణన గుర్తొచ్చింది.  బంగారురంగుని మించిన వర్ణంతో మెరిసే సౌందర్యమట. ఎలా ఉంటుందో అన్న కుతూహలం. నన్ను ఎవరూ చూడలేరన్న ధీమా.  ఒక్కసారి రాణీగారి సౌందర్యం చూడాలనుకుని మేలిముసుగు చటుక్కున తీయబోయాను. వెంటనే బేర్ మన్న అరుపూ, నా వీపుమీద చెళ్ళుమన్న దెబ్బా పడ్డాయి. ఆ పరిస్థితుల్లోనూ నా మెదడు చురుగ్గా పనిచేసి కొన్ని అనుమానాలు వ్యక్తం చేసింది. రాణీ నందిని గోడమీద నిలుచుంది. నేను నా చేతిని ఎంతో పైకెత్తితేగాని ఆవిడ మేలిముసుగు అందలేదు. ఆవిడ చెయ్యి ఎంత కిందికి దింపినా నన్ను మొట్టికాయో, ఒకవేళ వొంగి కొడితే లెంపకాయో తప్ప, ఇలా వీపుమీద చెళ్ళున వెయ్యలేదు. ఇంకోటి. నేను బనీనూ, షర్టూ వేసుకునే కదా మురళిగాడి లేబ్ కీ అక్కణ్ణించి ఇక్కడికీ వచ్చింది, కానీ నన్ను కొట్టిన చేతివేళ్ళూ నేరుగా నా వీపుని తాకాయి. ఐనా రాణి నందిని ఐతే నాలాంటి వాడిని బొడ్డులో దాచుకున్న ఏ కత్తితోనో డీల్ చేస్తుంది గానీ, ఇలా సాధారణ గృహిణిలా వీపుమీద చెళ్ళున వెయ్యదు అదీకాక, రాజ్యం మొత్తం ముట్టడించబడ్డా, ఏడు అద్దాల అవతలగాని దర్శనం ఇవ్వని రాణిగారి పాతివ్రత్యాన్ని చివర క్షణంలో భంగపరచబోయినవాణ్ణి, వీలైతే, “నిన్ను రాజు గారు శిక్షించాలి” అంటూ జౌహార్ గుండంలో తోసేస్తుంది కదా. పోనీ పురోహితుల్లో ఒకడు కొట్టేడనుకుంటే, వాళ్ళు డజనుకి పైగా ఉన్నారు. ఒక దెబ్బతోనో ఒక తన్నుతోనే ఆగేది కాదు. ఎవరు కొట్టారో చూద్దామని కళ్ళు తెరిస్తే చుట్టూ చీకటి. పోనీ సూర్యాస్తమయం వల్ల చీకటి పడిందనుకున్నా జౌహార్ మంటలూ కనపట్టంలేదు.

"బుధ్ధుందా" అన్న అరుపుతో నా గందరగోళం మరింత పెరిగింది. ఆ అరుపు రాణీ నందినిది కాదు. ఆవిడకి తెలుగు రాదు. నేను కలలో కూడ గుర్తించగలిగే గొంతు వినపడగానే… ‘హమ్మయ్య’ అనుకున్నాను. మురళీగాడు వెళ్ళి టైం మిషన్ మీద మా ఆవిణ్ణి పంపినట్టున్నాడు. ఆవిడ వచ్చి, రాణిగారి మేలిముసుగు తీయబోవటం చూసి చెళ్ళున ఒక్కటివేసి ఉంటుంది. స్పష్టత రాగానే, అడిగాను. “టైం మిషన్ తెచ్చావా?”

“టైం మిషన్ ఏంటి. కలొచ్చిందా?” అంటూ మా ఆవిడ  భుజం పట్టుకొని కుదిపింది. కళ్ళుతెరిస్తే ఏముంది? మా పడగ్గదిలో మా మంచం మీద, మా ఆవిడెదురుగా నేను.  “నా దుప్పటి గట్టిగా లాగేసి, బంగారం లాంటి నిద్ర పాడుచేసారు. పైగా టైం మిషనూ, గాడిద గుడ్డు మిషనూ అంటూ కలవరింతలు” అంది.

“దుప్పటి కాదు, రాణీ నందినీగారి ముసుగు కదా, లాగాను? …” అన్నాను. నాకు పూర్తిగా మెలకువ వచ్చుంటే అంత పొరపాటు చేసేవాణ్ణి కాదు. సగం నిద్రా సగం మెలకువా వల్ల జరిగిన పొరపాటది.  కానీ ఆ పొరపాటే, మరో  చెళ్ళుమన్న శబ్దంతో, అంతకు మించి వీపు మీద చుర్రుమన్న నొప్పితో, పూర్తి మెలకువ తెప్పించింది.

OOO

Bio
bottom of page