top of page

Website Designed &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

వ్యాస​ మధురాలు

ప్రదర్శన కళలకి సంబంధించిన సాహిత్యం ( ప్రసంగం )

Kosuri Uma Bharathi

కోసూరి ఉమా భారతి

వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా మరియు రాజధాని ప్రాంతీయ తెలుగు సంఘం )CATS) వారి చే సంయుక్తం గా నిర్వహింపబడుతున్న ఈ పదవ అమెరికా తెలుగు సాహితీ సదస్సుని ఓ కల్పతరువుకి పోల్చి చూస్తే..... ఈ వేదిక నుండి అందించబడుతున్న కావ్యం, కవిత్వం, సాహిత్యాలని.. పుష్పాలుగా, సభాసదులని ఆ సాహిత్య మకరందాన్ని ఆస్వాదించే భ్రమరాలుగా అభివర్ణించవచ్చు...

అటువంటి ఈ వేదికపై ‘ప్రదర్శన కళలకి సంబంధించిన సాహిత్యం’ గురించి నా అభిప్రాయాలని మీతో పంచుకోబోతున్నాను. 

ఇక్కడ చెప్పే ప్రదర్శన కళలు నృత్యం, సంగీతం.  వాటికి సంబంధించిన సాహిత్యం ఆ కళలతో పాటుగా.. శాస్త్రీయ, జానపద, ఆధ్యాత్మక, పాశ్చాత్య రీతుల్లో... శాఖోపశాఖాలుగా విస్తరించి ఉంది..  

నాట్య రంగంలో కృషి చేసి ఉండడం వల్ల ఈ సాహిత్య సంపద గురించి తెలిసుకో గలిగాను.  

నృత్యం, సంగీతం... వంటి కళలని అభ్యసించే వారికి...వాటితో ఇమిడి ఉన్న సాహిత్యం నుండి అదనపు ప్రయోజనాలు ఉన్నాయని భావిస్తాను...తమ భాషాసాహిత్యాల పట్ల కొంత అవగాహనతో పాటు ఆసక్తి పెంపొందే  అవకాశం ఉంది.  పురాణకాలక్షేపాలకు వెళ్ళక్కరలేకుండానే రామాయణ భారత భాగవతాలోన్నుండి  కథలు, కావ్యాల గురించి తెలుసుకో గలుగుతారు.  ప్రాచీన సాంప్రదాయాలు, కట్టుబాట్లు, ఆచారవ్యవహారాలని అర్ధం చేసుకోగలుగుతారు.  పురాణాలలోని ఉన్నతమైన స్త్రీపురుషుల వ్యక్తిత్వాలను పరిశీలించ గలుగుతారు....

అనాదిగా.. కళలకి సంబంధించిన సాహిత్య సంపదని పెంపొందించిన  వారిలో....ఆ నాటి నారాయణ తీర్ధుల వారు, సిద్దేంద్రయోగులు..తరువాత దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు, మంగళంపల్లి బాలమురలీకృష్ణ గారు...డాక్టర్ సి నారాయణ రెడ్డి గార్ల వంటి ఎందరో మహానుభావులు, కవులు ప్రమఖులు ఉన్నారు..  వీరంతా తమ రచనల ద్వారా, తమ కృషి ద్వారా కళామతల్లికి తమ వంతు సేవలని అందించిన వారే...

ఇకపోతే నృత్యానికి సంబంధించిన అనంతమైన సాహిత్యంలో నేనైతే మునిగి తేలాననే అనుకుంటాను...ఐదేళ్ళ వయస్సు నుండి దానికి నేను ఆడాను పాడాను.. అందునుండి చక్కని తెలుగు పదాల కూర్పుతో ఆణిముత్యాలైన సాహిత్య అంశాలని మీకు వినిపిస్తాను. దాదాపు ౩౦౦౦ సంవత్సరాల క్రితం నుండి నేటి వరకు సాగిన రచనల నుండి నాకు తెలిసిన ఆణిముత్యాలుగా అనుకోవచ్చు..

ముందుగా అమ్మవారి గురించిన ఓ సీస పద్యం..  ఆదిశంకరాచార్యుల వారి సౌందర్యలహరి లోని కొన్ని కీర్తనలకి ఆరంభ పద్యంగా కూర్చారు మా గురువుగారు వేదాంతం జగన్నాధ శర్మ గారు.

 

...కనక రత్న కిరీట కమనీయ చంద్రరేఖా కాంతి వెన్నెల కరణి వెలయా

ఫాల భాగాంచిత భవ్య కుంకుమ చిహ్నముదయ భాస్కరు రుచి నొప్పు మీర

చెవుల దిద్దుల రుచి చిరునవ్వు జోడయి చెక్కుటద్దాల పై చిందులాడ

 

గళసీమ నింపుగా కరుణామృతము నిండ...భయహర శంఖమ్ము పగిది పలుక

రత్నహారములురమున రంగు లీన అమిత శుభములొసగు నాయుధముల దాల్చి

పదునెనిమిది కరంబులు పరగు దుర్గా సింహవాహిని మమ్ము రక్షింపు గాక...

 

తప్పనిసరిగా ప్రతి ప్రదర్శనలో ఈ పద్యానికి నృత్యం చేసేదాన్ని.  అమ్మవారి గురించిన సాహిత్యం అంటే ఉన్న అభిమానంతో ‘దేవి స్తోత్రమాలిక’ అనే ఓ ప్రత్యేకమైన కార్యక్రమాన్ని రూపొందించి, ఆలయాల నిధుల సేకరణకి చాలా కాలం నృత్య ప్రదర్శనలు చేసాను..

....................

రెండవ ఆణిముత్యంగా ప్రస్తావించే అంశంలోని సాహిత్యాన్ని మీరంతా గుర్తు పడతారనే అనుకుంటాను...

 

..రంగారు జిలుగు బంగారు వలువ సింగారముగా ధరించి

యురమందు తులసి సరులందు కలిసి మరి అందముగా వహించి

సిస్తైన నుదుట కస్తూరి బొట్టు ముస్తాబ్జుగాగ నుంచి

యలతమ్మి కనుల ఎలదేటి కొనల తులలేని నెనరునుంచి

జిలిబిల పడగల శేషాయి తెలిమల్లె శయ్య శయనించి

ముజ్జగములు మొహంబున తిలకింపగా పులకింపగా

శ్రీ రంగ మందిరా నవసుందరా పరాక్...

 

దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారి ఆ సాహిత్యం...ఆదితాళాన...రామప్రియ రాగంలో సాగితే...నృత్యానికి ప్రాణం పోసినట్టే...

మా నాన్నగారు నిర్మించిన కూచిపూడి డాక్యుమెంటరీలో ఈ నృత్యాన్ని పొందుపరచాలన్న ఉద్దేశంతో, దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారి వద్దకు వెళ్ళారు.  కూడా వెళ్ళిన నేను కృష్ణ శాస్త్రి గారిని కలవడం, ఆయన మాటలు వినగలగడం మంచి అనుభూతినిచ్చాయి....

........................

మూడవ ఆణిముత్యంగా ... తెలుగువారి సాంస్కృతిక సంపద ‘కూచిపూడి నృత్య సాంప్రదాయం’ గురించి. దాదాపు ౩౦౦౦ సంవత్సరాల క్రితం తెలుగునాట ఆదరణ పొందిన నృత్యకళ ‘భాగవత మేళ నాటకం’.  15 వ శతాబ్దంలో సిద్దేంద్రయోగుల వారు ఆ కళని పునరుద్దీకరించి ‘కూచిపుడి నృత్య సాంప్రదాయం’ గా రూపొందించారు.  అంటే ఆ కళకి సంబంధించిన సాహిత్యం కూడా అంతే ప్రాచీనమైనదని ‘నాట్య శాస్త్రం’ నుండి కూడా తెలియ వస్తుంది.   సిద్దేంద్రయోగులు రచించిన భామాకలాపం, పారిజాతాపహరణం వంటి అంశాలంటే తెలుగువారికి చాలా అభిమానం.  అందులోని  ‘సత్యభామ లేఖ’ ఓ చక్కని సన్నివేశం...

అందులో శ్రీ కృష్ణ స్వామి వారి నుండి ఎడబాసిన సత్యభామ దుఃఖంలో ఉంటుంది..ఆ సమయంలో ఓ లేఖ వ్రాసిచ్చి చెలికత్తెని  స్వామి వారి వద్దకు రాయబారంగా పంపిస్తుంది..

అందులోని సాహిత్యం ...ఈ విధంగా...

 

..శ్రీమత్ రత్నాకర పుత్రికా ..ముఖారవింద మరందపాన విలోల మిళిందాయమాన ..

నందనందన ముచికుంద వరదా...మందరోద్భర పరహసిత రాకా సుధాకరా ..

సుందర వదనారవిందుండగు శ్రీమన్మంగళాద్రి మదనగోపాల స్వామి వారి చరణారవిందంబులకు..

సత్యభామ శిఖామణి నిటలతట ఘటిత కరకమలయై అనేక సాష్టాంగ దండప్రణామంబు లాచరించి చాయంగల విన్నపములు...

అని ఆరంభించి...

..మత్ జనకుండు సాత్రాజిత్తు నన్ను మీకిచ్చి వివాహంబొనరించిన ప్రభ్రుతి

వజ్ర వైడూర్య నీలగోమేదిక పుష్యరాగచ్చకిత పద్మరాగ మహా నానావిధ చిత్రవిచిత్ర జాంబూనదా

రత్న నిర్మితంబగు హంసతూలికా తల్పంబున దివ్యమంగళ విగ్రహాకారులైన తమ పర్యంకంబున

మస్తకము చేర్చి శయనించి యున్న నా యందు కినుక బూని విడనాడి తొలంగి యున్న నాట నుండి...

 

మారుండు క్రూరుండయ్యె..శుకపికనికరంబులు ఒక్కింత కరుణించుటకు మారు కూయందొడంగె

చంద్రుండు సాంద్రంబుగా వెన్నెల కురిపించె..మలయానిలుండు కాలానల తుల్యముగా మారుతంబు వీచె..

తుమ్మెదల నాదమ్ము తలదిమ్ము ఘటించే...

అని వాపోతూ..

..కావున ఇటకు విచ్చేసి మదీయ వాంచితంబగు సాఫల్యము నొందించి ..

నన్ను కరుణించి రక్షించి చిత్తగించ వలయును...

ఇట్లు సత్యభామా ..

అని లేఖని ముగిస్తూ...

..చిత్తజుని బారికోర్వగ తత్తరపడి వ్రాసినాను.. తప్పో ఒప్పో చిత్తమున నేరమెంచక

ఇత్తరి బ్రోవంగ రావే ఇవియే ప్రణతుల్..

 

అని రాసిన ఆ లేఖని చెలికత్తె చేతిలో పెట్టి వెళ్లి రమ్మంటుంది..అందుగ్గాను సత్యభామ ముక్కున ఉన్న ముంగెర కోరుతుంది ఆ చెలికత్తె.  అక్కడ కూడా ఓ చక్కని పద్యం...వ్రాసారాయన.

 

..అంగన లేని ఇల్లు, చతురంగ బలంబులు లేని రాజు,

నిస్సంగుడు కాని మౌని, జన సమ్మతి లేని ప్రధానినుంచగా

బంగారు లేని వజ్రము..స్త్రీలకున్ ముంగెర లేని భూషణము

మోదమటే భువనైక సుందరీ..

 

అని నొచ్చుకుంటూనే ముంగెర ఆ అమ్మాయి చేతనుంచి సాగనంపుతుంది.

సాహిత్య పరంగా కూడా సున్నితమైన ... ఓ చక్కని అంశం అది..

................

మరో ఆణిముత్యంగా...అన్నమయ్య కీర్తనల గురించి.  నృత్య పరంగా, సంగీత పరంగా ఎంతో ప్రసిద్ధి గాంచిన 15 వ శతాబ్దపు సాహిత్యం అది.  అందులోని భక్తి, శృంగారరస, ఆద్యాత్మక కీర్తనలకి తెలుగునాట ఎంతో ఆదరణ ఉంది.  కొన్నిటిని నృత్యాలుగా మలుచుకుంటాము కూడా ..

 

..కులికెడు మురిపెపు కుమ్మరింపు తన జిలుగు చూపులకు చాంగుభళా!

 ఉన్నతి పతిపై నొరగి నిలుచు తన సన్నపు నడిమికి చాంగుభళా

 చక్కని తల్లికి చాంగుభళా తన చెక్కెర మోవికి చాంగుభళా..

అది కాక

..అంతనింత గొర్రెతల అరచేతి మాణిక్యం పంతమాడే కంసుని పాలి వజ్రము

కాంతుల మూడులోకాల గరుడ పచ్చాపూస ...

చెంతల మాలోనున్న చిన్నికృష్ణుడు ...

ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు దిద్దరాని మహిమల దేవకీ సుతుడు...

 

అన్న కీర్తన ఎక్కువగా చేస్తుంటాము..

 

            ..అరవిరి సొబగుల అతివలు మెచ్చగా అరతెర మరగున ఆడినదే

అలకల కులుకుల అలిమేలు మంగ

అలరులు కురియగ ఆడినదే అలకలకులుకుల అలిమేలు మంగా..

 

అమ్మవారి సౌందర్యాన్ని కొనియాడుతూ అదో చక్కని కీర్తన..

 

కొన్ని కీర్తనలు జానపద రీతిలో కూడా సాగుతాయి...

 

          ..చిరుతనవ్వుల వాడు సిన్నక్కా

వెరపెరుగడు చూడవే సిన్నక్కా

గొలుసుల వంకల కోరలతో

భూమి వెలసినాడు చూడవే సిన్నక్కా..

 

ఇలా అన్నమయ్య కీర్తనలు పాడేవారికి, వినేవారికి, ఆడేవారికి కూడా ఓ అందమైన అనుభూతినిస్తాయి..

...........

ప్రసంగంలోని ఆఖరి ఆణిముత్యంగా డా. సి. నారాయణ రెడ్డి గారి రచన.   మేము నిర్మించిన టెలిఫిలిం ‘ఆలయనాదాలు’ కోసం ఆయన రాసిన  ఓ చక్కని పాట... ఆ ఫిలింని తెలుగు సీరియల్ గా జెమినీ టివీ వారు 1997 లో ధారావాహికగా ప్రసారం చేసారు.

 

..మబ్బుల ఆలాపనలో మయూరాల భంగిమలు

తరుణ పవన లాలనలో తరుశాఖల తరుళిమలు..

పరికించే కనులున్నా స్పందించే మనసున్నా ప్రతి దృశ్యం లయనిలయం

ఈ జగమే నాట్యమయం నటరాజ పాద నీరాజిత నవరసాభినయం...

 

ఆ సాహిత్యానికి, నృత్యానికి కూడా మంచి స్పందన వచ్చింది...

 

భావ రాగ తాళ సమ్మేళనమే నాట్యం...సాహిత్యం నుండి భావం, సంగీతం నుండి రాగం... లయగతులతో మేళవింపజేస్తే అందమైన నృత్యం..అవుతుంది..అయితే.. ఈ మూడింటిలోకి సుస్థిరమైనది, శాశ్వతత ఉన్నది మాత్రం సాహిత్య కళ మాత్రమే.  ఎందుకంటే ..నృత్యం ఆగితే దృశ్యం ఉండదు... పాట ఆగితే సంగీతం ఉండదు.. కాని కవిత్వం ద్వారా ఓ కవి ..అందమైన దృశ్యాన్ని, నృత్యాన్ని కూడా ఆవిష్కరింపజేయ గలడు.

అందుకే సాహిత్య కళ అద్బుతమైనది, అనంతమైనది..ఆ కళ పట్ల నాకున్న అభిమానం కూడా అంతే అనంతమైనది...అందువల్లనే ఈ వేదిక పై మీ ముందు ఈ ప్రసంగం చేసే అవకాశం దక్కింది. అయితే నాకీ ఆహ్వానం పలికి, ఈ వేదిక మీద ఈ అవకాశాన్ని అందించింది మాత్రం వంగూరు ఫౌండేషన్ వారు..సంస్థాపకులు వంగూరి చిట్టెన్రాజు గారు.. వారికి నమస్సులు పలుకుతూ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.

... సాహిత్యం పట్ల ఆసక్తి ఉన్న నాబోటి వారికి ఈ దేశంలో ఓ మార్గాన్ని ఏర్పరిచి, సాహిత్య సభలని ఏర్పాటు చేసి మరెన్నో అవకాశాలని కల్పిస్తున్న వంగూరి ఫౌండేషన్ వారికి మా అందరి తరఫున కూడా మరోమారు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను... ఆ సంస్థని ఉత్సాహంగా ముందుకు తీసుకువెళుతున్న వారి కార్యవర్గంలో హేమాహేమీలు ఉన్నారు.. గొప్ప రచయితలు ఉన్నారు.  వారికి కూడా అభినందనలు, కృతజ్ఞతలు..

అలాగే ‘రాజధాని ప్రాంతీయ తెలుగు సంఘం’ (Washington CATS) అధ్యక్షులు భాస్కర్ రెడ్డి, వారి కార్యవర్గానికి కూడా కృతజ్ఞతలు... నన్ను మన్నించి నా ప్రసంగాన్ని ఇంతసేపూ విన్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు....

OOO

Bio
bottom of page