top of page
bhuvanollasam.PNG

సంపుటి  6   సంచిక  3

Website Published &  Maintained by  Srinivas Pendyala | Mobile version is under construction. Use big screen for better experience.

వ్యాస​ మధురాలు

జ్ఞాపకాలు  మరోమారు

vadapalli.png

డా.వాడపల్లి శ్రీనాథ్

సీ.యెస్. శర్మ గారితో నా జ్ఞాపకాలు  మరోమారు:

 

ఆయన చెప్పింది: నేను చేయలేకపోయినది:

When I stop breathing

Keep a book in my hand

&  take me to the nearest burial ground. 

***

ఆ మధ్య ఒకసారి సింగపూర్ నుంచి రాధిక రాయమని బలవంతపెడితే అప్పటికప్పుడు శర్మగారికి ఇలాటి పనులు నచ్చవని అనుకొంటూ నా జ్ఞాపకాల్ని చెప్పేను. తర్వాత్తర్వాత వాళ్ళబ్బాయి మెడికో శ్యామ్ అందులో - ఆయన పుట్టిన తేదీ, చదువుకొన్న కాలేజీ లాటి విషయాల్ని మార్చాలి అన్నప్పుడు మాత్రమే నాకు శర్మగారి వయసు తెలిసింది. 

 

విచిత్రం కావొచ్చు కానీ నాకూ శర్మగారికీ పుస్తకాల గురించి తప్ప మరో వ్యాసంగం ఉండేది కాదు. 

కొత్త పుస్తకాలెప్పుడు వొస్తాయి అనే ధ్యాస తప్ప వాటిని పెట్టుకోడానికి జాగా ఎక్కడ అనే ఆలోచన కూడా ఎప్పుడూ ఉండేది కాదు.

 

ఆఖరికి సినిమాలూ మేము పుస్తకాల్లోనే చూసేవాళ్ళం.

 

అక్కడే నాకు సత్యజిత్ రాయ్, టాగోర్, పోలన్ స్కి, వేన్ గో, గాగిన్ ల పరిచయం. 

తాహితి ద్వీపాల్లో చిత్రించిన గాగిన్ - "Where do we come from, What are we, Where are we going" బొమ్మని టైం-లైఫ్ పబ్లికేషన్ పుస్తకాల్లో చూసి చాలా ఇష్టపడే వాళ్ళం. 

 

వేన్ గో అన్నయ్య థియో కి రాసిన ఉత్తరాలన్నా, Letter from an unknown woman అన్నా మా ఇద్దరికీ చాలా ఇష్టం. 

 

***

 

ఎనభై తొమ్మిదిలో  -  ఏ చదువుల కోసం ఎటు వెళ్లాలో తెలీక సతమత మవుతున్న రోజులు. 

 

అప్పారావు మాస్టారి ఆర్ట్ ఎగ్జిబిషన్ లో (లైబ్రరీ హాల్లో) నా బొమ్మలు కూడా ఒక టేబుల్ మీద పెట్టించేరు. 

అందులో  నా వొచ్ఛీ రాని డ్రాయింగ్ Mother & Child శర్మగారికి బాగా నచ్చి,   మీ బొమ్మలో/ల్లో loneliness ఎందుకు కనిపిస్తోంది అన్నారు. అదిగో అక్కడే సరిగ్గా ఆయనతో పరిచయం. 

ఆరోజు నాలో శర్మగారు ఏంచూసారో. తన చేతిలో లైబ్రరీ పుస్తకాల్లో "Letters to Theo" చూపిస్తూ -"ఈ పుస్తకం చదివేక మీకు అప్పిస్తాను, మా ఇల్లు కొత్తకోవెల పక్కన - వీలున్నప్పుడు రండి!" అంటుంటే - నాకు - పుస్తకం అప్పేమిటా? అంత విలువా? అన్నదే ధ్యాస.

మరో రెండ్రోజుల తర్వాత వారింటికి వెళ్ళేక పుస్తకం విలువ తెలిసింది.

మా నాన్న బీరువా నిండా పుస్తకాలున్నా అవన్నీ ఒక భాషకి, శాస్త్రానికీ సంబంధించినవి కావడంతో నాకు పెద్దగా చదవాలనే కుతూహలం ఉండేది కాదు.

 

***

 

అవే రోజుల్లో, నాకు శాంతినికేతన్ పక్క నున్న విశాఖపట్నం యూనివర్సటీల్లో సీట్లు రాకపోయినప్పుడు దుర్గాప్రసాదరావు గారు వాళ్ళనీ వీళ్ళనీ కలవమని తాపత్రయం.

నేనేమో విజయనగరం - విశాఖల మధ్య రోజూ ఈసురోమని మూడు గిన్నెల క్యారేజీతో రైల్లో అసహనంగా అప్ & డౌన్లతో రౌండ్లు. ఓ పక్క - అంట్యాకుల పైడిరాజుగారి రోజుకి వొంద రూపాయల ఫీజు పీడ ఇంట్లో చెప్పుకోలేక - ఇంకో పక్క - డీన్ ని ప్రసన్నం చేసుకోడానికి -

నాకు తెలీని వాళ్లన్న రుక్మాంగదుడిని అడిగిందే తడవు బహుమానంగా గీసిచ్చి- ఆ ఆఫీస్ చుట్టూ వారాల తరబడి కాళ్ళరిగి, చేతకానితనంతో చేష్టలుడిగిపోయి, నాలో నేను తల వొంచుకొని నించొని  మౌనంగా “ఇక చాలు ఈ ఖరీదైన చదువులు” అనుకొంటూ మార్గం మార్చుకొని మా నాన్న చెప్పిన సంస్కృత కాలేజీ లో చేరడానికి అప్లికేషన్ తెచ్చుకొన్నాను. 

 

ఈ నా గోడు చూస్తోన్న శర్మగారు ఆ సాయంత్రం "మీరిక్కడ ఇమడలేరండీ, వీళ్ళకి మీ భాష అర్ధంకాడంలేదు. మీరు పారిస్, లండన్ లాటిచోట చదువుకోవాలి, ప్రదర్శనలివ్వాలి. సహనం ముఖ్యం. ఈ పుస్తకాలు రాసిన వాళ్ళెవరూ చదువుకొన్నవాళ్ళు కాదే, ఈ ఆర్టిస్టులంతా ఏ గురువూ లేకుండా గొప్పవాళ్ళైనవారే...." - అన్న సున్నితమైన ఓదార్పు నిజంగా నాలో పెద్ద మార్పు. 

 

నా మీద నాకు నమ్మకాన్ని పెంచింది. 

 

ఇప్పటివరకు వెనక్కు చూడలేదు. ఎవడినీ మొక్కలేదు.  ఆగకుండా ఎక్కిన మెట్లు దిగకుండా ఇంత దూరం వొచ్చేను.

అత్యంత ప్రతిష్ఠమైన గౌరవ పూర్వక ఆహ్వానాన్ని కుటుంబ సమేతంగా అమెరికా నుంచి అందుకున్నాను.

 

డైలాన్ థామస్ కూతురు కవిత్వానికి నా బొమ్మల్ని అచ్చువేసుకొంది. 

 

ఇంకా,  ఈ వ్యాసం మొదలు పెట్టిన (15, ఆగస్ట్ 2020) వేళా విశేషం, ఇప్పుడే బ్రూక్లిన్ గ్రాఫిక్ సెంటర్, న్యూయార్కులో పాఠాలు చెప్పమని ఉత్తరం అందుకున్నాను.

(శర్మగారికి, మా నాన్నకీ నా మాటలు వినిపిస్తున్నాయని అనుకొంటున్నా)

 

***

మొదటిసారి పారిస్ వెళ్ళినప్పుడు ఆయనకిష్టమైన శామ్యూల్ బెకెట్ ఆల్బం తీసుకొస్తే, "నన్నింతగా గుర్తుంచుకొన్నారా మీరు".. అన్న మాటలు తలచుకొన్న ప్రతీసారీ హృదయాంతరాలలో ఏదో కలచినట్టవుతుంది.

 

మా ఇద్దరి సావాసంలో నాకు తెలిసినంతవరకు శర్మగారికి నచ్చిన విషయాలు మూడు. 

దొరికిన ప్రతీ పుస్తకాన్నీ చదవడం

వీలైతే సొంతం చేసుకోడం

ఎప్పుడైనా రాస్తే గీస్తే చాలా  క్రిస్పీగా రాయడం. 

 

అయితే, వీటన్నిటిగురించీ నాతో(నే) మాటాడ్డం - నా అదృష్టం.  

సమయాన్ని నియమానుసారంగా పాటించడం ఆయనకు ఉద్యోగరీత్యా అబ్బిన అభ్యాసం. 

ఎవరైనా ఏదో సాహిత్య సభకో లేదా భోజనానికో రమ్మనమని పిలిస్తే ఖచ్చితంగా సూచించిన సమయానికి  ముందరి కుర్చీల్లో మేమిద్దరమే కూర్చునేవాళ్ళం.

ప్రతీ సభా సాయంకాలాల్లో లైబ్రరీ లోనే ఉండేవి.

వాటికి ఇద్దరం సినిమా హాళ్లని, ఇంగ్లీష్ కాలేజీ - సంగీత కాలేజీ దాటుకొంటూ,

ఆయన మాటల్తో

నేను చెవుల్తో 

నడుస్తూ ఉండేవాళ్ళం. 

ఇల్లుచేరగానే మళ్ళీ పుస్తకాల గదిలో

చిన్న నల్లా తెల్లా టీవీ వార్తల కోసం..

అపరాత్రి సమయంలో లలితమ్మ గారు పిలిస్తేనే   ఇంటిదగ్గిర అమ్మ ఇంకా తినదని గుర్తొచ్చి కొత్త అప్పు పుస్తకాలతో నడుస్తున్న మేఘాలతో ఇంటికెళ్ళేవాణ్ణి.

 

***

నేను శర్మగారింటికి వెళ్లడం మొదలైన తొలి రోజుల్లో డాబా మెట్లు ఇంటికి వెనక ఉండేవి.

సాయంకాలపు నీరెండలో చందమామ తలమీదుగా పేలగా కనిపిస్తుంటే - 

'అలాటి సమయాల్లో'  పైకి చదవాల్సిన కవిత్వాన్ని కానీ, కథల్ని కానీ శర్మగారు వొట్టి చాపమీద ఆకాశంలోకి పుస్తకాన్నిపెట్టి పైకి చదువుకునేవారు.

(సముద్రం ఒడ్డున చదవాల్సినవి, ఏకాంతంలో చదువుకోవాల్సినవి, ప్రయాణంలో చదూకోవాల్సినవీ... ఎన్నోరకాలు)

నా మొహమాటంతో మెట్లమీద కూచుని ఆయన్ని వింటూ ఉంటే మధ్యలో ఎప్పుడో లలితమ్మ గారు నవ్వుతో  "ఏవోయ్ ఇలా కూచుండిపోయావేమిటి? ఆయన్ని పిలవలే ? కొంచెం కాఫీ తాగుతావేమిటి?" అన్న మాటలతో మేమిద్దరం ఒకళ్ళనొకళ్ళు చూసుకొనే  వాళ్ళం. 

అప్పట్లో ఆయన చదివే Homer / Iliad గురించి తెలీదు. పికాసో, Van Gogh ల బొమ్మల్ని ఆయనగది లోంచి మొదట చూసినప్పుడు ఆశ్చర్యం.

ప్రతీ పుస్తకానికీ ఒక జీవమున్నట్టు ఎంతో ప్రేమగా భద్రంగా ఉంచేవారు.

కాయితం మీద అక్షరం కనిపిస్తే చాలు

టూత్ పేస్ట్ కవర్

పందార పొట్లం

బస్సు టిక్కెట్ ఏదైనా కావొచ్చు ..  

పలకరించి ఏదో పుస్తకంలో బుక్ మార్కు లాగా పెట్టి తనకున్న గౌరవాన్ని చాటుకొనేవారు.

లేలేత మనుమరాలు హైందవి వొచ్ఛీ రాని మాటలతో పుస్తకం పట్టుకొని 'ఐ కో కా కా కా' అంటుంటే చాల మురిసిపోయేవారు . ఇంత అబ్బురమైన వ్యక్తిత్వాన్ని ఇంకొకరిలో నేనింతవరకు  చూడలేదు.

 

పిలిస్తే పలికేట్టు పుస్తకాలన్నిటినీ ఒక మంచి గదిలో అల్మారాలలో సద్దుకోవాలనే ఆయన కల మాత్రం మేమెవ్వరం తీర్చలేకపోయాం.

 

***

ఓ సాయంత్రం వారి ఇంట్లోకి అడుగుపెట్టగానే ఎదురుగా శర్మగారు ముందుగదిలో కూర్చొని ఉన్నారు. మంచంమీంచి టీవీ చూస్తూ లలితమ్మగారు..  

అలా ఊరికే కూచోడం చాల అరుదైన విషయం నాకు. ఇదేంటా అనుకొంటూ మెట్లకింద నుంచి ఇంకో కుర్చీ నేనూ తీసుకొన్నా. 

 

కొంచెం సేపు మా ముగ్గురి మధ్యా మౌనం. 

సరిగ్గా ఒక పక్షం ముందు ఆయనకు మొదటిసారి గుండెపోటు వొచ్చి మందులు వాడకం మొదలుపెట్టారు. ముందు రెండ్రోజులు మందులు వొద్దని వాడనని మొండికేసేక వాళ్ళబ్బాయి శ్యామ్ చెప్పారో లలితమ్మగారు బాధపడ్డం వల్లనో మొత్తానికి ఒప్పుకొన్నారు. 

 

ఇంతకూ విషయం ఏమంటే, బుక్ సెంటర్, గుప్తా బ్రదర్సు దగ్గిర కొత్త పుస్తకాలొచ్చాయని ఆయనకారోజు ఉత్తరం వొచ్చింది. అందుకొన్నదే తడవు విశాఖపట్నం వెళ్లాలని.

ముందుగా లలితమ్మ గారు మా మధ్య మౌనాన్ని ఛేదిస్తూ టీవీలోనుంచి చూస్తూ ఇప్పుడిప్పుడే ప్రయాణాలు చేయొద్దు అన్నానోయ్ అని నవ్వుతూ నావైపు చూసేరు.

నవ్వుతూ మాటాడ్డం ఆవిడ ప్రత్యేకత, అందులో అందం ఆప్యాయతా ఎక్కువ.  ఆవిడ ఆంతర్యం నాకు కొంచెం బోధపడుతుంటే, మాటలు వినపడనట్టు శర్మ గారు నన్ను మర్నాడు ఉదయం తీరిక ఉంటుందా అని అడిగేరు.

నాకేమో భయం.

నేను కూడా లలితమ్మగారి మాటల్నే నా మాటలుగా అంటే.. వెంటనే శర్మ గారు ఒకమారు డాక్టరు దగ్గిరకి వెళ్ళిరావాలని నన్ను తోడు తీసుకెళ్లారు.

ఆ డాక్టరు వాళ్ళబ్బాయికి బాగా స్నేహితుడు, ఆ చొరవ తీసుకొని రేపు ఉదయం ఈ అబ్బాయి తోడుతో  వైజాగ్ వెళ్లి వొస్తాను, అని ముందే అనేసరికి ఆ డాక్టరుకేమి పాలుపోలేదో ..ఫరవాలేదో ...లేక ఈయన ఎవరి మాట వినేరకం కాదని తెలిసో .. సరే అంటూ, సార్బిట్రేట్ మాత్రల్ని నాచేతికిచ్చేరు. 

ఇంకేముంది, మర్నాడు ఉదయం 8 గంటలకి బస్సులో కూర్చున్నాం.

గంటన్నర ప్రయాణం.

ఆ తొంభయి నిముషాలు నా మలి జీవితానికి ఒక ఆరంభం.

బస్సాగింది దిగండి అని కండక్టరు చెప్తుంటే, కానీ మా ఇద్దరికీ లోకం గుర్తు రాలేదు. 

సౌరిస్ గారి గురించి చాసో కథల గురించి మొదలుపెట్టి ఎక్కడో ఉన్న ఆడెన్  మరింకెక్కడో కవి ఇ.ఇ.కమ్మింగ్సు, డిలన్ థామస్ .. నేనప్పుడే మొదటిసారి విన్నాను.  

***

 

హైద్రాబాద్ JNTU హాస్టల్ లో గొడవ పడలేక ఒక ఇరవై చదరపు అడుగుల రూంలో ఖైరతాబాద్ లో అద్దెకు సర్దుకొనేవాణ్ణి.

 

చాలా ఇరుకైన జీవితమది. శర్మగారి ఉత్తరాలు తరచుగా వొచ్చేవి.

నా జవాబు ఉత్తరాల్లోంచి మాటల్ని తికమక పరుస్తూ అందంగా ఇన్స్పిరేషన్ ఇచ్చేవారు. 

 

అకస్మాత్తుగా ఒకసారి పైన ఒక్క డేట్ మాత్రంతో : "మీ ఊరొస్తున్నాను, పై ఆదివారం మొత్తం మీతో ! మీరూ నేనూ అబిడ్ సెంటర్ లో పుస్తకాలు చూద్దాం" అని ఓ పోస్ట్ కార్డు. 

 

విషయాన్ని రాతలో చెప్పడంలో ఎంతో పొదుపరి. 

అన్నట్టుగానే ఆ ఆదివారం పొద్దున్నే ఎక్కడో సైదాబాద్ కాలనీలో వాళ్ళమ్మాయి ఇంటి నుంచి ఖైరతాబాద్ లో నా రూం వరకు వొచ్చేరు.

ఇంకా తొమ్మిది. పదకొండు దాటాక కానీ మార్కెట్ తెరవరంటూ (తర్వాత పుస్తకాల వేట - మోయలేనన్ని కొనడం మాట మామూలే ) ఉప్మా చేసిచ్చాను.

కావాలని వేయని ఉప్పుని వేయించుకొని తినడం కాదు కానీ, ఒక వారం తర్వాత ఒక ఇన్లాండ్ ఉత్తరంలో ఎఱుపు, నీలం రంగుల రెండు పెన్నులతో ఒకటేసారి

"మీ ఉప్మా ఉప్పులేకుండానే బావుంది. ఈవేళ నా ఆలోచనల్లో మీ ఉప్మా" అన్నారు. 

చాలారోజుల తర్వాత వాళింట్లో లలితమ్మగారు మా ఇద్దరికీ ఉప్మాప్లేట్లు చేతికందిస్తూ -

"ఏవోయ్! మా ఆయనకి నీ గదీ, నీ వంటలు బాగా నచ్చేసేయిట,  ఇహనేం అక్కడికే తీసుకెళ్ళు"

హాస్యం కన్నా నిరంతరం శర్మగారి ఆలోచనలు నామీద ఎంత గాఢంగా ఉండేవో ఇప్పుడర్ధమై  నాలో ఒక మౌనం. 

శర్మగారు-లలితమ్మ గార్లది అందమైన నిరాడంబరమైన జీవితం. దాంపత్యంలో గౌరవం ఇచ్చి పుచ్చుకోడం ఆ ఇంటి నుండి నేను నేర్చుకొన్న రెండో పాఠం.

శర్మగారు వెళ్లిపోయిన తర్వాత ఆ ఇంట్లో చాలా అంటే చాలా.. భరించలేనంత నిశ్శబ్దం.

పాపం ఆవిడొక్కరూ ఎంతో కాలం భరించలేకపోయారు. 

 

ఇప్పటికీ విజయనగరం వెళ్లిన ప్రతీసారీ ఆ ఇంటి గుమ్మంముందు లలితమ్మ గారిని పలకరించి లోపలి గదిలోని శర్మగారిని పుస్తకాల మధ్య మరోమారు కలవాలని నా కాళ్ళు ఆ వీధిలోకి తీసుకెళ్తూనే ఉంటాయి.

ఇరుకైన ఆ వీధి అలానే

ఇంటి పక్కన కోవెల కూడా అలానే.

***

ఇప్పటికీ మా నాన్నగారిని, శర్మ గారిని తలచుకొని రోజు ఉండదు. 

సమఉ జ్జీగా, స్నేహితుడిగా శర్మగారు నాతో మాటాడుతూ ఉంటే సమయం తెలిసేది కాదు. 

ఇప్పటికీ ఓ కొత్త పుస్తకం చేతిలోకి రాగానే శర్మగారి చల్లటి చేతులు

నా చేతుల్ని స్పర్శిస్తాయి. 

ఆయన నిర్మలమైన నవ్వు లాగా నా చేతుల్లో ప్రతీ పుస్తకం

తెరిచీ తెరవగానే - 

"ఇది చాలా బావుందండీ, మరోమారు చదవాల్సిన పుస్తకం"

అనే ఆయన మాటలు వినిపిస్తూనే ఉన్నాయి.

సమయం తెలీకుండా కొత్త పుస్తకాలు, పేజీలు మారుతున్నా 

మరోమారు శర్మగారి గది తెరుచుకోదు. 

ఎప్పుడూ చదవడమే అలవాటైంది. 

శర్మగారి నుంచి రాయడం నేర్చుకోలేదు.

ఈయన నూరు వర్షాల కాలం మూడో క్వార్టర్ల తోనే వెలిసిపోడం నాకింకా అర్ధంకాదు. 

***

ఈ నా జ్ఞాపకాల పేరాల్లో "మరోమారు" ఎక్కువగా వినిపిస్తుంది.   

 

శర్మగారు ఎప్పుడూ మరోమారు అక్షరాల్ని కానీ పదాల్ని కానీ రాసేవారు కాదు. ఎవరైనా రాసినా అచ్చయిన పుస్తకాల్లో కనిపించినా పెన్సిల్తో సున్నాలు,ఈజ్ ఈక్వల్టు లు పెట్టేవారు. అది సుతరామూ ఆయనకి నచ్చని విషయం.

అయితే నన్నుమాత్రం మెట్లుదిగుతున్న ప్రతీసారీ "మరోమారు కలిసినప్పుడు అలా చేద్దాం, ఇలా వెళ్దాం..." అంటూ లోపలికి వెళ్లేవారు. 

నిజానికి  రెండువేల రెండు వేసంగిలో మా ఇద్దరి ఆఖరి మాటలు:  

శర్మగారు: "మరోమారు కలిసినప్పుడు పుస్తకాల్ని సద్దుకొందాం"

నేను: "హాఁ, ఈ సారికి కూడా మన కూడికలు సరిపోలేదండి, సారీ.. మరోమారు..వొచ్చే వేసంగిలో కొత్త పుస్తకాలతో.. " 

*****

వ్యాస కర్త : డా.వాడపల్లి శ్రీనాథ్. విజయనగరంలో పుట్టి పెరిగి హైద్రాబాదు, బరోడా, ఫ్రాన్సు, లండన్ లలో చదువు. 

అస్మారా ,అస్సాం, ఫ్రాన్సు , అడ్డిస్,లండన్, ఇటలీ దేశాల విశ్వవిద్యాలయాల్లో ఆర్ట్ అండ్ ఆర్ట్ హిస్టరీ, బ్రాడ్ కాస్ట్ జర్నలిజం విభాగాల్లో ఒక పదిహేను సంవత్సరాలు అసోసియేట్ ప్రొఫెసరు. హైదరాబాదులోని ట్రిపుల్ ఐటి; ఇ.ఇఫ్.ఎల్.; ఎన్ .ఐ.ఎఫ్.టి., తెలుగు విశ్వవిద్యాలయాలలో అతిథి బోధకుడు. న్యూ మీడియా స్టడీస్ లో  పరిశోధనకు డాక్టరేటు. అమెరికాలో  కుటుంబంతో  శాశ్వతంగా  నివసించమని 2015 లో  ప్రత్యేక గౌరవ హోదా లో  పిలిచినప్పట్నుంచీ న్యూజెర్సీ లో నివాసం. ప్రస్తుతము న్యూ జెర్సీ విద్యా శాఖలో పని. కొత్తగా మన్హట్టన్ గ్రాఫిక్ సెంటర్ నుంచి బోధకుడిగా ఆహ్వానం. 

bottom of page