MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
Website Designed & Maintained by Srinivas Pendyala www.facebook.com/madhuravanimagazine
వ్యాస మధురాలు
అది కథకి నా డ్యూటీ
మెడికో శ్యాం
నేనెరిగిన మునిపల్లె రాజు గారు.
నేను ఆయన గురించి ఎరిగింది స్వల్పం. అత్యంత స్వల్పం అన్నా అనవచ్చు. టిప్పాఫ్ ది ఐస్ బెర్గ్ అంటారే. అలాంటి టిప్ మాత్రమే నా జ్ఞానం. క్రిందనున్న ఆయన మంచుకొండ నాకు తెలీదు. అంత గోరంత పరిచయంలో కొండంత అవకాశం కలిగింది. దానికి కారణం ఆయన వున్నత వ్యక్తిత్వం.
చాలామంది నన్ను తరచుగా అడిగే ( అడిగిన) ఒక ప్రశ్న : నా పుస్తకానికి ఆయన ముందు మాట ఎలా రాసేరు? అని. నా స్వభావానికి ప్రత్యేకించి తాపత్రయ పడి రాయించుకోవడం కుదరని నాకు... అంచేత నన్నెరిగిన ఏ సమకాలీ(వయస్)కుడి చేతో రెండుముక్కలు రాయించి పనికానిచ్చేద్దామనుకున్నాను. కాని గణేశ్వర్రావుగారు దానికి ఒప్పుకోలేదు. ఎవరైనా ప్రముఖులచేత రాయిద్దాం అన్నారు. వారే రాజు(మునిపల్లె) గారి చేత రాయిద్దామన్నారు. శ్రీనివాసరావుగారు తన దగ్గిరున్న డీటీపీ రఫ్ కాపీ ఆయనకిస్తాననో, పంపిస్తాననో చెప్పేరు. ఆ తరువాత నేనా విషయం మర్చిపోయేను.
అవి నేను అమెరికాకి బయల్దేరుతున్న రోజులు. ఆ హడావిడిలో ఒకరోజు సాయంత్రం సుమారుగా 8 గంటల సమయంలో నేను తిలక్ నగర్ బజార్ నుండి రిక్షాలో వస్తుండగా నా సెల్ ఫోన్ రింగయింది.
తెలియని నంబరు. ఎత్తేను.
మెడికోశ్యామ్‌గారేనా ? అని ప్రశ్న.
అవునండీ. మీరెవరు? అన్నాను.
నేను మునిపల్లె రాజుని అన్నారు ఆయన.
ఒక క్షణం నాకేమీ అర్ధం కాలేదు. అర్ధమైన తరువాత నేను ఇబ్బందిలో, డిఫెన్సులో పడిపోయేను.
నేను ఆయన్ని కాంటాక్ట్ చెయ్యడం గానీ, కాల్ చెయ్యడం గానీ, కనీసం ఏదోవిధంగా రిక్వెస్ట్ చెయ్యడం గాని ఏమీ అంతవరకూ చెయ్యలేదు. ఇప్పుడాయనే ఫోన్ చేస్తే ఏం చెయ్యాలో నాకేమీ తోచలేదు.
‘నమస్కారమండీ’ అని ఎలాగో అలాగ అన్నాను.
ఇవాళ మధ్యాహ్నం కొరియర్లో మీ కథల పుస్తకం అందింది. ఇప్పటికి సగం పైగా చదివేసాను, అన్నారాయన. ఆ తరువాత
ప్రశ్నలమీద ప్రశ్నలు. ఆయన సందేహాలు.
నేను రిక్షాలో ఇబ్బందితో ఏమీ అనలేక, పక్కనున్న మా ఆవిడతో ఇదేమిటో ఏమీ చెప్పలేక , ఎనభైనాలుగేళ్ళ ఆ పెద్దాయన్ని, ప్రముఖ రచయితని, సాహిత్య అకాడెమీ విన్నర్ని, పొరపాట్న కూడా ఎప్రోచ్ కానివాణ్ణి, ఎంత హీనస్వరంలో ఆయన ప్రశ్నలకి జవాబిచ్చానో నాకే తెలీదు. ఎలాగో తేరుకుని క్షమించమన్నట్టుగ్గా ఏ పదాలూ వాడకుండా ఆ ధ్వనిలో గొణిగేను.
ఆయన అదేమీ పట్టించుకోకుండా తన ధోరణిలో తను అవన్నీ అనవసరం అన్నట్టుగ్గా మాట్లాడేరు. ఈ ఇబ్బందులవల్ల ఆయన మెచ్చుకున్న మెచ్చుకోలు కూడా సంతోషంగా, గర్వంగా స్వీకరించలేకపోయాను.
కాని ఒక వాక్యం మాత్రం నన్ను కదిపి కుదిపి నిలబెట్టింది. అది : “అది నా డ్యూటీ. కథకి/ కథకోసం చెయ్యడం నా డ్యూటీ “ అన్నారు. సుమారుగా ఈ అర్ధం వచ్చే మాటలన్నారు.
అదీ ఆయన నిబద్దత. కథపట్ల ఆయన కమిట్ మెంట్.
నేను పరిచయాలూ, ముందుమాటలూ రాయకుండావుండే ప్రయత్నాలు చూసేను. దాటవేసే వ్యవహారాలూ, వేషాలూ చూసేను. కనీసం మొహం కూడా తెలియని, తనకైతను అడగని మనిషికి, కథపట్ల తనకున్న నిబద్దత వలన ముందు మాటలు రాయడానికి సిద్దపడిన పెద్దమనిషిని చూడటం అదే ప్రధమం.
మన తెలుగు సాహిత్యానికి అనేకానేక మిలిటరీ లిటరరీ మ్యాన్లు వున్నారు. వారిలో వీరొకరు. దానిగురించే ఆయన, మిలిటరీ దేశదిమ్మరి వుద్యోగంలో పడి మీ రచనల్ని అవి వచ్చిన సమయంలో మిస్ అయాను అని సంజాయిషీ చెప్పినట్టుగా చెప్పేరు. వాటిమీద కొంత పరిశోధన చేసి రాయాలనివుందనీ, కాని తన వయసుని దృష్టిలో పెట్టుకొని, వీలయినంత తొందరలో రాస్తాననీ, రాసిపంపిస్తాననీ అన్నారు.
నేనింక నేను పెట్టుకొన్న ప్రయాణ ప్రయత్నాల్లో, ప్రయాసల్లో పడిపోయేను. చివరికి బయల్దేరే రోజు ఆఖరి క్షణంలో ఆయన్నించి నాకో కవరు వచ్చినా, అది విప్పి చదవాలన్న తీవ్రమైన కోరికవున్నా, తీరికలేక తోసుకుంటూ పోయేను. ఆ కవర్ని పెట్టెలోనో, బ్యాగ్ లోనో పడేసాను.
తరువాత చాన్నాళ్ళకిగానీ ఆ కవర్ని చింపి చదవలేకపోయాను. దాంట్లో చిన్నచిన్న అక్షరాల్లో రాసిన ఒక దీర్ఘమైన లేఖా, ఒక సుదీర్ఘమైన పరిచయం ఉన్నాయి. అందులో మళ్ళీ నన్ను చిత్తుచేసే వాక్యాలు.
“ఈ పరిచయం తొందర్లో రాసినది, ఇంకా పరిశోధించి రాయాలన్పించినా నా వయసు రీత్యా తొందరలో రాసినది. మీకేదన్నా నచ్చకపోయినా, మరేవిధమైన మార్పులు కోరినా, నిస్సందేహంగా నాకు రాయండి. నేను ఆవిధంగా మార్చి మళ్ళీ రాస్తాను” అని.
మళ్ళీ కొన్ని మెచ్చుకోళ్ళు ! ముందు మాటలెపుడూ మంచిమాటలే అనే ఉద్దేశ్యంవల్ల నేను వాటిని పట్టించుకోలేదు. కాని ఆయన హ్యుమిలిటీ, మోడెస్టీ మాత్రం మిస్ కాలేదు. ఎవరూ కాలేరేమో అన్పిస్తుంది .
ఏదో ఫోన్ చేసి రెండు ముక్కలు థేంక్స్ చెబుతూ మాట్లాడినా, ఆయన్ని కలవడానికి రెండేళ్ళు పట్టింది. సైనిక్ పురిలో వాళ్ళింటికి వెళ్ళి ఆయనకి పెర్సనల్ గా నా కృతజ్ఞతలు చెప్పుకుందామని ఉద్దేశం. కాని ఆయనవేవి స్వీకరించలేదు. మళ్ళీ కథకి ఇది నా డ్యూటీ అన్నారు. ఈ పరిచయవ్యాసాన్ని తన సాహిత్య వ్యాసాల్లో ప్రచురిస్తానన్నారు. ఆ సరికి నా పుస్తకం వచ్చింది. దానిమీద టీవీలో ఒక ప్రొగ్రాం చేస్తానన్నారు. మంచి పుస్తకాలకీ, రచనలకీ, రచయితలకీ ప్రొజెక్షనూ, ప్రమోషనూ అవసరమనీ, తను ఈ పుస్తకానికి అదే చేస్తాననీ అన్నారు. చేసేరా, చెయ్యగలిగేరా లేదా అన్నది అప్రస్తుతం. అసంగతం. అనవసరం. ఆయన సదుద్దేశ్యం, ధోరణి, మంచితనం, సాహిత్యంపట్ల ఆయనకి వున్న శ్రద్ధా నా అన్ లిమిటెడ్ పాసివ్ ఒకాబ్యులరీలో ఇంప్రెసివ్ గా చెప్పడం మాత్రం కష్టసాధ్యం!
తరువాత ఆయన మనస్సులోకి అడపాతడపా వస్తూనేవున్నారు. మొన్న ఈ మధ్యనే ఒకరోజు రాత్రి ఆయనప్పుడెప్పుడో ఆంధ్రపత్రికలో రాసిన ఒక వ్యాసం చదివేను, మునిపల్లెరాజు (పూనా) అని రాసేరు. వ్యాసం పేరు : "మరాఠీ చిత్రాల పోకడలు". అప్పటికింకా ఆంధ్ర రాష్ట్రమూ రాలేదు. మహారాష్ట్రా ఏర్పడలేదు. రెండురాష్ట్రాల గురించీ, ప్రజల గురించీ, చిత్రాల గురించీ పోలికలూ, తేడాలూ, ఆయన రాసిన విధమూ, వివరణా, విశ్లేషణా నాకు ఆశ్చర్యం కలిగించేయి. ఎంతమంది మనవాళ్ళు 'పూనా' (పూనే) లో లేరు? కాని దాంట్లో ఆయన రాసినంత విశదంగా రాయడానికి చాలా ప్రయత్నముండాలి. కృషి వుండాలి. స్టడీ చేసి వుండాలి పెద్దాయన (అప్పటికి ఆయన చిన్నాయనే) అనుకున్నాను. ఆయన గురించి ఆలోచిస్తూ ఎలావున్నారో పెద్దాయన అని తలుచుకున్నాను. మర్నాడు ఈ వార్త! పరిపూర్ణజీవితం గొప్పవిలువలతో, ఆదర్శాలతో గడిపిన ధన్యజీవికి కూడా మృత్యువు సహజమే కనుక నాకు అందుగురించి ఏ విచారమూలేదు, ఎలాగో మళ్ళీ ఎపుడో అయన్ని కలుస్తాములే అన్న అభిప్రాయం తప్ప!
సుధీర్ఘమైన జీవనయానంలో సాహిత్య సృష్టిలో సహజంగానే మనిషి ఆలోచనలూ , అభిప్రాయాలూ, నమ్మకాలూ, ధోరణులూ, మారుతూవుంటాయి. అభ్యుదయ (వామపక్ష ధోరణి) రచనల నుండి సాంప్రదాయ ఆధ్యాత్మిక భావాలవైపు సుమారుగా ఆయన ప్రయాణం జరిగింది. మధ్యలో లేక చివర్లో ఆయనికి సంభవించిన మ్యాజిక్ రియలిజం, నిజానికి, నా దృష్టిలో ఎక్కడనుంచో వచ్చింది కాదు. బహుశా ఆయన దృష్టిలోనూ. బహుశా అది మనదే. మనకి మాత్రమే సంభవించదగినదీనూ. ఒకటి మాత్రం నిజం. ఆయన ఏం రాసినా, ఏం చెప్పినా మానవీయ కోణం, మానవత్వపు విలువలూ ఆయన అన్ని రచనల నిండా వున్నాయి. "హ్యూమనిస్టిక్ వేల్యూస్" అనవచ్చా? అవే ఆయన్ని ఆకర్షించాయి. అవే ఆయన ఆశించాడు.
ఇప్పుడీ "మాతృదర్శనమ్" (ఈ సంచికలోనే "అలనాటి మధురాలు" లో ప్రచురించబడిన కథ) అనే ఈ కథలో అంతా మంచివాళ్ళే. అంతా మంచికే జరుగుతుంది. కొంత ఆయనన్నట్టుగానే సినిమాటిక్ గా వున్నా, మరో ముగింపు సాధ్యం కాదనిపిస్తుంది. ఎంత బాగా రాసేడీయన? ఏ విషయంలోంచైనా హేమం పిండగలడనిపించింది. నన్ను నేనే కోట్ చేస్తే, "రచన గొప్పతనం రచయిత శక్తిపై ఆధారపడినంతగా రాస్తున్న విషయం పై ఆధారపడదు".
ఆయనకి బాగా నచ్చిన కథ మాదిరి కథ "కస్తూరి తాంబూలం" కథనంలోనూ, "వేరేలోకపు స్వగతాలు", "నిష్క్రమణ ద్వారం" వంటి ఆత్మ చరిత్రాత్మక ఊహాత్మక కథనాల్లోనూ, అన్నింటిలోనూ ఆయన దృష్టి మాననీయ మానవుడిపైనే. ఆయన ఆలాపన మానవతా గీతమే.
madhuravani.com అలనాటి మధురాలు పాఠకులకై మునిపల్లె రాజు గారి కథ- మాతృదర్శనం ప్రత్యేకంగా పంపినందుకు మెడికో శ్యాం గారికి ధన్యవాదాలు.
-సంపాదకులు.....
OOO