top of page

సంపుటి 3  సంచిక 1

Website Designed &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

కథా మధురాలు

దెయ్యాల వేళ

Oleti Sasikala

భవాని ఫణి

madhuravani.com అంతర్జాల పత్రిక నిర్వహించిన కథలపోటీ లో ప్రశంసా  బహుమతి సాధించిన కథ.

నాకెంతో ఇష్టమైన ఆ పుస్తకం పూర్తయ్యేసరికి అర్థరాత్రి పన్నెండు దాటింది.  'దెయ్యాలకి ఇష్టమైన సమయం' అనుకుని నవ్వుకున్నాను. నేనప్పటివరకూ చదివింది ఒక హారర్ నవల. దాన్ని నేను చదవడం ఇప్పటికి ఏ ఇరవయ్యోసారో!. నాకు హారర్ కథలంటే చాలా ఇష్టం. నిజానికి దెయ్యాలుంటాయని నేను నమ్మను. అంతే కాదు దేవుడ్ని కూడా పెద్దగా నమ్మను. ఇంకా సరిగ్గా చెప్పాలంటే నాకు కనిపించనివేవీ నిజాలని నేననుకోను. అవి అతీంద్రియ శక్తులు కానీయండి, మానవాతీత శక్తులు కానీయండి -  ఇవన్నీ కేవలం అభూత కల్పనలని నా అభిప్రాయం. కానీ నాకీ పై పదాలంటే చాలా ఇష్టం. అటువంటి కథలన్నీ నాకు గొప్ప ఆనందాన్నిస్తాయి. అందుకే ఇవన్నీ నమ్మేవారందరి కంటే నాకే ఈ విషయాలకు చెందిన పరిజ్ఞానం ఎక్కువ. 

 

సరే...ఇంకా నిద్ర రావడం లేదని - షర్ట్ వేసుకుని అలా రోడ్డు మీదకి వచ్చాను. దెయ్యాలు లేకపోయినా దొంగలుండచ్చు కదా అంటారా, నా దగ్గర దోచుకోవడానికేమీ లేదు కనుక నాకెటువంటి భయమూ లేదు. ఇంతలో దూరంగా ఒక ఆకారం కనిపించింది. చీకటి కారణంగా ఎవరన్నది స్పష్టంగా తెలీడం లేదు. దెయ్యాలుండవని నాకు తెలుసు కనుక భయం వెయ్యలేదు గానీ, నా స్థానంలో వేరే ఎవరైనా ఉంటే, ఆ దృశ్యాన్ని చూసి గుండాగి చచ్చుండేవారే!

 "ఎవరూ?" అన్నాను గట్టిగా. ఆ ఆకారం కొంచెం ముందుకు కదిలింది. ఈ సారి వీధి లైట్ వెలుగులోకి రావడం వలన ఆ ఆకారం ఒక పది పన్నెండేళ్ల పిల్లవాడిదిగా గుర్తించాను. నిద్రలో నడిచొచ్చాడో, లేక నాలానే నిద్ర పట్టక వచ్చాడో!

 

నేనేదో అడిగేలోపే ఆ కుర్రవాడు " ఇలా కూర్చుందామా?" అంటూ పక్కనున్న పెద్ద రాయి మీద కూర్చున్నాడు. నేనూ ఇంకేమీ మాట్లాడకుండా వాడి పక్కన కూలబడ్డాను. కాసేపు ఇద్దరం ఏమీ మాట్లాడలేదు. నేను స్వతహాగా మితభాషిని కావడం వల్ల  అలాగే మౌనంగా ఉండిపోయాను. 

 

"నేనోసారి మీ ఇంటికొచ్చాను" అన్నాడు కుర్రవాడు ఉన్నట్టుండి. 

సాధారణంగా మా ఇంటికి పెద్దగా ఎవరూ రారు. ఈ అబ్బాయి ఎప్పుడొచ్చాడబ్బా! అనుకుంటూ కాసేపు ఆలోచించాకా గుర్తొచ్చింది. మొన్నో రోజు  ఏదో చప్పుడైతే బెడ్ రూమ్ లోంచి బయటకి వచ్చి చూసాను. అప్పటికే  ముందుగదిలో నిలబడి ఉన్న చిన్న కుర్రవాడు, నన్ను చూడగానే బయటకి పారిపోయాడు. ముఖం సరిగా కనబడలేదు. ఈ అబ్బాయేనేమో అనిపించినా నేనేమీ సమాధానం చెప్పలేదు.

  

"ఏదైనా కథ చెప్పండి" అన్నాడా అబ్బాయే మళ్ళీ.  నేను ఆశ్చర్యంగా చూసాను. నిజానికి నాకు చాలా కథలే తెలుసు. కానీ అటువంటి భయం గొలిపే కథలు చిన్న పిల్లవాడికి చెప్పడం సరి కాదు కదా. 

"నాకు పెద్దగా కథలేమీ రావు" అన్నాను. ఆ అబ్బాయి నిరాశ చెందినట్టుగా కనిపించాడు. ఏదో ఒకటి చెబితే నయమనిపించింది. 

"సరే, చెబుతా విను:" అని మొదలుపెట్టాను. 

"చాలా ఏళ్ళ క్రిందట ఒక ఊళ్ళో నీలానే ఒకబ్బాయి ఉండేవాడు. వాళ్ళ నాన్న వాడి చిన్నప్పుడే చనిపోవడం వలన, వాళ్ళమ్మే వాడిని కష్టపడి పెంచేది. వాడికి కథలంటే చాలా ఇష్టం. అందుకని ఆవిడే వాడికి ఏవో నీతి కథలు చెబుతూ ఉండేది. ఓ రోజు వాడికి రోడ్డు మీద ఒక కాగితం దొరికింది. ఏమిటా అని చూస్తే అది ఒక కథ. ఏదో పత్రికలోని పేజీ అన్నమాట. వాడెంతో ఆసక్తిగా ఆ కథ చదివాడు. అది ఒక సూపర్ పవర్స్  కలిగిన వ్యక్తి కథ. అప్పటివరకూ వాడటువంటి కథల్ని విని ఉండకపోవడం వలన వాడికది కొత్తగా అనిపించింది. బాగా నచ్చేసింది కూడా. అనుకోకుండా ఒక చెట్టు తొర్రలోకి ప్రవేశించిన ఒక వ్యక్తి, నేరుగా వేరే వింత లోకానికి చేరుకోవడం, తనకు అద్భుత శక్తులున్నాయన్న విషయాన్ని అప్పుడే తెలుసుకోవడం, ఆ శక్తుల సహాయంతో అక్కడి దుష్ట మాంత్రికులతో పోరాడి గెలిచి, అక్కడి ప్రజల్ని వారి బారినుండి కాపాడి, తిరిగి భూమికి చేరుకోవడం కథాంశం. 

 

ఇక అప్పటినించీ ఆ కుర్రవాడికి వాళ్ళమ్మ చెప్పే కథలు నచ్చడం మానేశాయి. ఆ కాగితంలో కథల్లాంటి కథలు ఎక్కడ దొరుకుతాయోనని వెతకడం ప్రారంభించాడు. వాడి తెలుగు మాస్టారిని వెంటాడి వేధించి అటువంటి కథల పుస్తకాలు మరిన్ని సంపాదించాడు. అవన్నీ వాడెంతో ఆసక్తితో చదివేవాడు. అప్పటినించీ వాడికి తన జీవితంలో కూడా అటువంటి సంఘటనలు జరిగితే బాగుండుననే కోరిక మొదలైంది. ఖాళీగా ఉన్నప్పుడు అటువంటి వింత ఊహలు చేస్తూ ఉండేవాడు. వాడు చదివిన ఇంకో కథలో ఒక సూపర్ హీరో, కుక్క రూపంలో భూమ్మీద నివసిస్తూ ఉంటాడు. అప్పటినించీ వాడు కుక్కల్ని ఆసక్తితో గమనిస్తూ ఉండేవాడు. మెల్లగా వాడికి ఆ విషయాలకి చెందిన పిచ్చి ముదిరిపోతూ వచ్చింది. వివిధ భాషల్లో దొరికే వివిధ రకాలైన ఫాంటసీ కథల్ని వెతికి వెతికి సంపాదించి మరీ చదివేవాడు. అందుకోసం వాడు అనేక రకాల భాషల్ని కూడా నేర్చుకున్నాడు.   

 

అలా అలా వాడు పెరిగి పెద్దవాడై రైల్వే శాఖలో టీసీగా చేరాడు. అయినప్పటికీ తన జీవితంలో ఏదో విచిత్రం జరిగి తీరుతుందనే నమ్మకం మాత్రం అతనికి పోలేదు. వృత్తిలో భాగంగా కలిసే రైలు ప్రయాణికులందరినీ అతనెంతో ఆసక్తిగా గమనించేవాడు. 'మానవాతీత శక్తులు కలిగిన వారెవరైనా మనుషుల రూపంలో తిరుగుతున్నారేమోననీ, వారు మానవ జాతికి మేలుచేస్తారో, కీడు చేస్తారోననీ ఆలోచిస్తూ ఉండేవాడు. అంతేకాక, తను అందరిలాంటి వాడూ కాదనీ, ఏదో ఒక ముఖ్యమైన పని కోసమే ఈ భూమ్మీద పుట్టి ఉంటాడనీ, ఆ మాట చెప్పడానికి ఎవరో ఒకరు, ఏదో ఒక రోజు వస్తారనీ అతని ప్రగాఢ విశ్వాసం. 

 

ఒక రోజు అలా రైల్లో ప్రయాణిస్తున్న ఒక యువతి ప్రవర్తన అతనికి వింతగా అనిపించింది. ఆమె తప్పక అతీంద్రియ శక్తులను కలిగి ఉందని అతనికి నమ్మకం కలిగింది. తన జీవితాన్ని మలుపు తిప్పబోయే సంఘటన ఆ రోజే జరగబోతోందని అతనికి బలంగా అనిపించింది. ఇక అతడు ఏదో వంకతో ఆ బోగీలోనే తిరుగుతూ ఆ యువతినే గమనించడం మొదలుపెట్టాడు. రాత్రయ్యాక కూడా ఆమెకు దగ్గరలోనే ఖాళీగా ఉన్న సీట్లో కూర్చుని ఆమెనే దొంగతనంగా పరిశీలించసాగాడు. అతను ఊహించినట్టుగానే మిగిలిన ప్రయాణీకులంతా నిద్రలోకి జారుకున్నాక ఆమె మెల్లగా లేచి తలుపు దగ్గరకి వెళ్ళింది. 'ఇప్పుడామె ట్రైన్ ని మాయం చేసి వారి లోకానికి తీసుకుపోతుందో లేక పట్టాలు తప్పుతుంటే తన శక్తితో ఆపి రక్షిస్తుందో, ఈ మిషన్ లో తన పాత్ర ఏమిటో' అనుకుంటూ, రకరకాల ఊహలతో ఉబ్బి తబ్బిబ్బవుతూ అతను ఆ యువతిని వెంబడించాడు. కానీ హఠాత్తుగా ఆమె ట్రైన్ లోనుండి దూకేసే ప్రయత్నం చేయడంతో కంగారుగా వెళ్లి ఆమెను ఆపబోయాడు. కానీ అప్పటికే ఆలస్యమై, ఆమెతో పాటుగా అతను కూడా క్రింద పడిపోయాడు. పాపం, ఆ యువతిని రక్షించలేకపోయాడు సరికదా, అతని కుడికాలు కూడా రైలు క్రింద పడి తెగిపోయింది. అసలతను బ్రతకడమే పెద్ద విచిత్రం." అంటూ చెప్పడం ఆపి, నా పెట్టుడు కాలుని ఆ కుర్రవాడు గమనిస్తాడేమో అన్నట్టుగా ఓసారి సర్దుకుని కూర్చున్నాను. 

 

ఆసక్తిగా వింటున్న కుర్రవాడు, " తర్వాతేమైంది?" అనడిగాడు. 

"ఏమవుతుంది, కొడుక్కి జరిగిన ప్రమాదం గురించి తెల్సుకున్న అతని తల్లి, షాక్ తో చనిపోయింది. కాలు పోవడంతో అతన్ని ఉద్యోగంలోంచి తొలగించారు. 

అప్పటితో అతనికి మానవాతీత శక్తులకూ, మాంత్రికులకూ సంబంధించిన మూఢ నమ్మకాలూ, పిచ్చి కోరికలూ  పూర్తిగా వదిలిపోయాయి. అలా అతనిప్పుడు ఒంటరిగా తన ఇంట్లోనే ఉంటున్నాడు." అని చెప్పి బాధగా నా ఇంటి వైపు చూసుకున్నాను. ఎటువంటి మరమ్మత్తులకూ నోచుకోకుండా శిధిలావస్థలో ఉన్న ఆ పాత ఇల్లు మాత్రమే ఇప్పుడు నాకు మిగిలింది. 

"ఓహో" అన్నాడు ఆ కుర్రాడు సాలోచనగా. 

"అంటే మాంత్రిక శక్తులూ, సూపర్ పవర్స్ లాంటివేవీ నిజంగా ఉండవంటారా అయితే?" అన్నాడు మళ్ళీ. 

"ఉండనే ఉండవు, అవన్నీ సరదా కోసం రాసే కథలు" అన్నాన్నేను. 

"మరి దెయ్యాలు?" అన్నాడా కుర్రవాడు. 

" దెయ్యాలూ, భూతాలూ ఏమీ ఉండవు. మనకి కనిపించని విషయాలేవీ అసలు మనం నమ్మకూడదు" 

ఎందుకో కుర్రవాడు విచిత్రంగా నవ్వాడు." ఒకవేళ అవి మనకి కనిపిస్తే?"

"లేనివి ఎలా కనిపిస్తాయి? అలా కనిపించినట్టుగా అనిపిస్తే, అది మన భ్రమ మాత్రమే. ఎక్కడో ఏదో చదివో, వినో - ఆ భయం చేత మనం అలా వాటిని చూసినట్టుగా  భ్రమిస్తాం." అని చెప్పాను. 

హఠాత్తుగా ఆ కుర్రవాడు లేచి నిలబడ్డాడు.

"హమ్మో, చాలా సేపయిపోయింది. మా అమ్మకి గానీ మెలకువ వస్తే, నేనిటువైపుగా వచ్చానని తెలిస్తే బాగా కోప్పడుతుంది. మొన్న మీ ఇంటికి వచ్చినప్పుడు కూడా బాగా తిట్టింది. గుడికి తీసుకెళ్లి పూజ చేయించి తాడు కూడా కట్టించింది. నే మళ్ళీ  కలుస్తాను. ఎప్పుడైనా పన్నెండు దాటాకే వస్తా లెండి. మీరప్పుడేగా బయటికొస్తారు " అంటూ వేగంగా కదిలి వెళ్ళిపోయాడు. 

నాకేమీ అర్థం కాలేదు. అర్థరాత్రుళ్లు అలా చిన్నపిల్లలు రోడ్ల మీద తిరుగుతుంటే ఏ తల్లి మాత్రం కంగారు పడదు! అయితే మాత్రం, మా ఇంటికి వచ్చినందుకు తాడు కట్టించడం ఏమిటో విచిత్రంగా!" అనుకుంటూ మెల్లగా ఇంటి వైపుకు నడక సాగించాను.

OOO

bottom of page