top of page

మా వాణి ...

"ఒక మంచి పుస్తకం గొప్పదనం అందులో ఉండే విషయం మీద ఆధారపడి ఉండదు... అది మనకు అందించే ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది" అన్నారు గాంధీజీ. మధురవాణి పత్రిక పలు రకాల అంశాలతో ఓ మంచి పంచరంగుల పుస్తకంగా ఆ ఆలోచన కలిగిస్తుంది అని మాకు వస్తున్న ఉత్తరాల పరంపర ద్వారా తెలిసి కించిత్  గర్వంగానే ఉంది.

ఎన్నో మంచి పత్రికలు, మరెన్నో అంతర్జాల పత్రికలు, లబ్ధప్రతిష్టుల పుస్తకాలు, బ్లాగ్ ప్రపంచం... ఆఖరికి ఫేస్ బుక్, వాట్సప్ లాంటి వందలాది మాధ్యమాల్లోనూ విరివిగా విరబూస్తున్న సాహితీ సుమాలు... వీటన్నిటి మధ్యా madhuravani.com ని ఇంత తక్కువ కాలంలోనే ఎంతో గొప్పగా ఆదరిస్తున్న ముఫై వేలకి పైగా పాఠకులకి సహస్రాభివందనాలు. పాఠకులకి మరిన్ని మంచి రచనలు అందించవలిసిన బాధ్యతని మీ ఆత్మీయ స్పందనలు అనుక్షణమూ గుర్తు చేస్తున్నాయి. అలాంటి క్షణాలన్నీ... లక్షణంగా కలగలిసి... అక్షరాలా విలక్షణంగా ఉండే మంచి రచనల రూపంలో పాఠకులకి అందించి మరింత అలరించాలననీ మమల్ని ప్రేరేపిస్తున్నాయి. అందుకు మా ప్రత్యేక ధన్యవాదాలు.

 

అసాధారణ పాఠకాదరణ ఒక ఎత్తు అయితే దానికి ప్రధాన ఆలంబన మంచి రచనలే అని చెప్పకనే చెప్ప వచ్చును. పాఠకాదరణ ఇస్తున్న తృప్తి మాత్రమే అతి పెద్ద బహుమానంగా భావించే ఎందరో రచయితలు ఉన్నా, మా వంతుగా నగదు బహుమతుల ద్వారా సరి కొత్త రచనలని ప్రోత్సహించడానికీ ఈ ఏటి నుంచీ  దసరా దీపావళి సందర్భంగా ఉత్తమ రచనల పోటీ నిర్వహిస్తున్నాం. ఈ దసరా, దీపావళి రచనల పోటీ  వివరాలకై క్రింద ఉన్న లింక్ ని క్లిక్ చేయగలరు. హోంపేజీలోనూ లింక్ గమనించవచ్చు! 

http://www.madhuravani.com/#!contest/gw1gz

ఈ రచనల పోటీ లో పాల్గొని పాఠకచంద్రులకు పట్టుపోగులని అందించవలిసిందిగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరు రచయితలనీ ఆహ్వానిస్తున్నాము. 

రచనల పోటీ వివరాలే కాక,మన పత్రికకి సంబంధించిన ఏ విషయాలైనా వెనువెంటనే తెలుసుకోవటానికి వీలుగా...  ఫేస్ బుక్ పేజీ ని సిద్ధపరిచాము. https://www.facebook.com/madhuravanimagazine మీరు ఈ పేజీని ఇష్టపడితే... అనగా...లైక్ చేస్తే, సమాచారం చేరువలోకి వచ్చేస్తుంది. 

ఈ సంచికకై ఆహ్వానిత మధురాలు అందజేసిన గొల్లపూడి గారికి, నిర్మల కొండేపూడి గారికి, రామానుజరావు గారికీ, ఇన్నయ్య గారికీ ప్రత్యేక ధన్యవాదాలు. “సినీ మధురాలు” శీర్షికలో సుప్రసిద్ద చలన చిత్ర దర్శకులు వి.ఎన్.ఆదిత్య గారు తమ సినీ అనుభవాలని అందిస్తున్న ధారావాహిక ఈ సంచిక నుంచీ మొదలవుతోంది. ఇది “మధురవాణి” ప్రత్యేకం.  అడిగిన వెంటనే ఆత్మీయంగా స్పందించిన ఆదిత్య గారికి  మా ధన్య వాదాలు. madhuravani.com కి తన సహజ సరదా శైలిలో ముఖా ముఖి ఇచ్చిన ప్రముఖ సినీ గీత రచయిత భువనచంద్ర గారికి నిర్వాహక బృందం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు! 

 

ఈ సంచికలో కథలూ, కవితలూ, ఇతర శీర్షికలూ ఒక ఎత్తు అయితే వ్యాసమధురిమలన్నీ, వేటికవి సాహిత్యాభిలాషులందరూ తెలుసుకోగోరే విశిష్ట అంశాలే. ఆ శీర్షికలో గత ఏప్రిల్ 30, 2016  న హ్యూస్టన్ లో దిగ్విజయంగా జరిగిన ఉగాది సాహిత్యసమ్మేళనంలో తమ ప్రసంగ వ్యాసాలని అందించిన ఆ నాటి సిపి బ్రౌన్ పురస్కార గ్రహీత ముకుంద రామారావు గారికి, విన్నకోట రవి శంకర్ గారికి, సత్యం మందపాటి గారికి, భూషణ్ గారికి, జగదీశ్వరన్ గారికి, నాటా మహాసభలలో తమ ప్రసంగ వ్యాసాన్ని అందించిన మెడికో  శ్యాం గారికి మరోసారి ప్రత్యేక కృతజ్ఞతలు. 

ఈ madhuravani.com మూడవ సంచిక ఆసాంతం చదివి, మీ అభిప్రాయాలు, సలహాలు, సూచనలు మాకు తెలియజేయండి. మధురవాణిని మరింత మనోహరంగా తీర్చిదిడడానికి సహాయపడండి.

మధురవాణి నిర్వాహక బృందం

చిలుకూరి సత్యదేవ్ | మధు పెమ్మరాజు | శాయి రాచకొండ | సుదేష్ పిల్లుట్ల | దీప్తి పెండ్యాల | శ్రీనివాస్ పెండ్యాల |  వంగూరి చిట్టెన్ రాజు

bottom of page