top of page

వ్యాస​ మధురాలు

ఉత్తర అమెరికా తెలుగు సాహిత్యం తొలి దశకం (1964-1974)

వంగూరి చిట్టెన్ రాజు

2016వ సంవత్సరం ఉత్తర అమెరికాలో తెలుగు కథ ఆవిర్భావం, తద్వారా తెలుగు సాహిత్య శుభారంభానికి 52వ వార్షికోత్సవం. ఈ సందర్భంగా ఆ తొలి తరం తెలుగు వారి సాహిత్య కృషిని క్లుప్తంగా సమీక్షించడమే ఈ వ్యాసం ముఖ్యోద్ధేశ్యం. అక్కడా, ఇక్కడా ఒక్కొక్క తెలుగు వారు మాత్రమే ఉండి, ఎక్కడా తెలుగు సంఘాలు లేని ఆ రోజుల్లో అటు కెనడా లోనూ, ఇటు అమెరికా సంయుక్త రాష్ట్రాలోనూ తెలుగు భాషకీ, సాహిత్యానికీ పెద్ద పీట వేసి విశేషమైన చారిత్రక సేవలు అందించిన ఇద్దరు స్ఫూర్తి ప్రదాతలని స్మరించుకోవడం మన కర్తవ్యం. ఆ ఇద్దరు కారణ జన్ములూ దివంగతులే!

ఉత్తర అమెరికా ఖండం నుండి మొట్ట మొదటి తెలుగు కథ ఏప్రిల్ 24, 1964 నాటి ఆంద్ర సచిత్ర వార పత్రికలో ప్రచురించబడి అక్కడ తెలుగు సాహిత్యానికి శ్రీకారం చుట్టి తెలుగు సాహిత్య చరిత్రని ఒక పెద్ద మలుపు తిప్పింది. ఆ కథ పేరు “వాహిని”. రచయిత కలం పేరు “ఆర్ఫియస్”. అసలు పేరు పులిగండ్ల మల్లికార్జున రావు గారు. కెనడాలో ఎడ్మంటన్ నగర నివాసి. ఆయనే “విజయ” అనే కలం పేరుతో కూడా కెనడా రాక  ముందు ‘రచన’, తదితర పత్రికలలోనూ, ఆంధ్ర సచిత్ర వార పత్రికలోనూ ‘వెన్నెల’, ‘భీరువు’, ‘పాఠశాల’, ‘ఆకులూ-ముళ్ళూ’, ‘పండుటాకు’ మొదలైన కథలు ప్రచురించారు. ఆ నాటి మొట్ట మొదటి అమెరికా తెలుగు కథ ఇందుతో జతపరుస్తున్నాం.

మల్లికార్జున రావు గారు 1938లో నెల్లూరు లో పుట్టారు. చిన్నప్పటి నుంచీ మంచి మేధస్సు, ఆశయాలు, ఆలోచనలతో నిరాడంబరంగా పెరిగారు. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుండి మాస్టర్స్ డిగ్రీ పొంది, కొన్నాళ్ళు హైదరాబాద్ లోనూ, పూనా లోనూ లెక్చరర్ గా పని చేసి 1963 లో పై చదువుల కోసం కెనడాలో  యూనివర్సిటీ ఆఫ్ సస్కటూన్ వెళ్లి, కెమిస్ట్రీలో డాక్టరేట్ పట్టా అందుకున్నారు. 1968లో లీల గారిని వివాహం చేసుకున్నారు. 1970లో ఎడ్మంటన్ నగరంలో యూనివర్సిటీ ఆఫ్ ఆల్బెర్టాలో పరిశోధనాచార్యుడిగా చేరారు. అక్కడ యావత్ ఉత్తర అమెరికా ఖండం లోనే మొట్టమొదటి తెలుగు సంఘం అయిన ఆంధ్ర సాంస్కృతిక సంఘం ప్రారంభించి మరో చరిత్ర సృష్టించారు. అంతే కాక ఆ సంఘం తరఫున “వాణి” అనే పేరిట ఉత్తర అమెరికాలోనే మొట్ట మొదటి తెలుగు పత్రిక ఆగస్ట్, 1970 లో ప్రారంభించి మరో సారి చరిత్ర సృష్టించారు. వై. మీనాక్షి, కె. దమయంతి, ఇ. నాగేశ్వర రావు తొలి సంచిక కి సంపాదకులుగా వ్రాత పత్రికగా రూపు దిద్దుకున్న ఆ పత్రిక మల్లికార్జున రావు గారి నేతృత్వంలో సుమారు మూడేళ్లకి పైగా  ప్రచురించబడింది. ఆ తొలి పత్రిక ముఖ చిత్రం ఇక్కడ పొందు పరిచాం. ఆ పత్రికలో స్థానిక వివరాలు, కథలు, కవితలు వగైరా విశేషాలతో ఆసక్తికరంగా ఉండేది. కవర్ డిజైన్ దగ్గర నుంచీ అన్నింటికీ రథ సారధి మల్లికార్జున రావు గారే! ‘వాణి’ పత్రికలో ఆయన ‘కెనడాలో కంది పచ్చడి’, ‘అభినవ భేతాళ పంచవింశతిక’, మొదలైన కథలు, కెనడా ప్రభుత్వ పరిపాలనా విధానాలు, వాతావరణ కాలుష్యం, ఇతర శాస్త్రీయ పరమైన వ్యాసాలూ వ్రాశారు. 

దురదృష్టవశాత్తూ, 1978 లో, కేవలం 40 వ ఏట శ్రీ మల్లికార్జున రావు గారు గుండెపోటుతో హఠాత్తుగా మరణించారు. అప్పటికి ఆయన పెద్ద కుమారుడు ప్రమోద్ వయస్సు 9 ఏళ్ళు, రెండో కుమారుడు గిరి కేవలం రెండు వారాల పసి కందు. భార్య లీల గారు స్వశక్తి తో వారిని ఎంతో విద్యావంతులుగా పెంచి పెద్ద చేశారు. 2012 అక్టోబర్ లో వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా హ్యూస్టన్ లో నిర్వహించిన 9వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు & అమెరికా కథ 50వ వార్షికోత్సవాలకు శ్రీమతి లీల గారినీ, గిరి గారినీ ప్రత్యేక అతిథులు గా ఆహ్వానించి సత్కరించారు. ఆ ఫోటో ఇక్కడ జతపరుస్తున్నాం.

ఉత్తర అమెరికా ఖండంలో తొలి తెలుగు కథా రచయితగా, తొలి తెలుగు సంఘ వ్యవస్థాపకుడి గా, తొలి తెలుగు పత్రిక ప్రారంభకుడి గా చిరస్మరణీయులైన స్వర్గీయ పులిగండ్ల మల్లికార్జున రావు గారికి మరొక్క సారి నివాళులు అర్పిస్తున్నాం.     

ఇక అమెరికా సంయుక్త రాష్ట్రాలలో తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతులకి తొలి తరం నుండీ ఐదు  దశాబ్దాలు ఎనలేని కృషి చేసిన సవ్యసాచి డా. పెమ్మరాజు వేణుగోపాల రావు గారు. 1932 లో పశ్చిమ గోదావరి జిల్లా తిరుపతి పురంలో పుట్టిన ‘రావు’ గారు ఏలూరు, విశాఖపట్నంలోనూ విద్యాభ్యాసం తరువాత

1959 లో అమెరికా వచ్చి యూనివర్శిటీ ఆఫ్ ఆరెగాన్, యూజీన్ నుంచి 1964 లో ఫిజిక్స్ లో డాక్టరేట్ పట్టా తీసుకున్నారు. ఆ రోజుల్లో మొత్తం అమెరికా అంతా కలిపి బహుశా వంద మందిలోపునే తెలుగు వారు ఉండేవారు. ఆ తరువాత అట్లాంటా లోని ఎమొరీ యూనివర్శిటీ లో జీవితాంతం ప్రొఫెసర్ గా పనిచేశారు. భౌతిక శాస్త్రవేత్తగా ఆయన అంతర్జాతీయ ఖ్యాతి చెందడమే కాక శాస్త్రీయ సిద్ధాంతాలనీ, మతపరమైన సూత్రాలనీ ఆధ్యాత్మిక సిద్ధాంతాలనీ అనుసంధానం చేసి ఒక నిష్ణాతుడి గా పేరు తెచ్చుకున్నారు. ఆయన ప్రతిభని గుర్తించి దలైలామా పలు మార్లు ఆయనని భారత దేశంలో ఉన్న తమ ధర్మశాలకి పిలిపించి బౌధ్ధ సన్యాసుల కి పాఠ్యాంశాలు రూపొందించే అపురూపమైన అవకాశం ఇచ్చారు.  

ఇవన్నీ ఒక ఎత్తు అయితే పెమ్మరాజు గారు ఉత్తర అమెరికా తొలి తెలుగు కవిగా, తొలి తెలుగు పత్రికా సంస్థాపకులుగా, అత్యధిక సంఖ్యలో గ్రంధ సంపాదకులుగా, నటుడిగా, నాటక ప్రయోక్తగా, దర్శకుడిగా, కూచిపూడి శాస్త్రీయ నృత్య నాటికల రూప కర్తగా, నిర్మాతగా, దేవాలయాల నిర్మాత, మంచి చిత్రకారుడిగా, శిల్పిగా సుమారు ఐదు దశాబ్దాలు విశిష్టమైన సేవలు అందించారు.

పెమ్మరాజు గారు ఆగస్ట్, 1970 లో అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ‘తెలుగు భాషా పత్రిక’ అనే పేరిట మొట్టమొదటి తెలుగు పత్రిక స్థాపించి చరిత్ర సృష్టించారు. ఆ పత్రిక ముఖ చిత్రం, విషయ సూచిక పేజీలు  ఇక్కడ జతపరిచాం. డా. గవరసాన సత్యనారాయణ, పరిమి కృష్ణయ్య, రావిపూడి సుబ్బారావు ఆ పత్రిక సహ సంపాదకులు. తెలుగులో శాస్త్రీయ వ్యాసాలూ, కథలు, కవితలు, తదితర అంశాలతో ముందు కొన్నేళ్ళు వ్రాత ప్రతిగానూ, ఆ తరువాత ఎమెస్కో వారి సహాయంతో అచ్చు లోనూ 1974 దాకా అమెరికాలో ఏకైక తెలుగు పత్రిక గా వెలువడింది. 1982 లో స్వయంగా కన్యాశుల్కం నాటకాన్ని కుదించి గంటన్నర వ్యవధి లో తానే గిరీశం పాత్ర ధరించి స్వీయ దర్శకత్వంలో అమెరికాలో తొలి సారి ఆ నాటకాన్ని ప్రదర్శించారు. ఒక సుప్రసిద్ద కవిగా, కథకుడిగా, వ్యాస రచయితగా, వక్త గా పేరు పొందిన ఆయన తానా, టామా మరియు ఇతర సంస్థల ప్రచురణ లకీ, వంగూరి ఫౌండేషన్ వారి జీవిత కాల గౌరవ సంపాదకుడిగా సుమారు 50 పుస్తకాలకీ సంపాదకుడిగా సేవలు అందించారు.

తెలుగు భాషా, సాహిత్య, సాంస్కృతిక రంగాలలో అమెరికా ‘భీష్మాచార్యులు’ గా గుర్తింపు పొందిన పెమ్మరాజు వేణుగోపాల రావు గారు 2012 లో క్రిస్మస్ పర్వదినాన తమ 81 ఏట పరమపదించారు. ఆయన భార్య స్వరాజ్య లక్ష్మి అట్లాంటా నివాసి. కుమార్తెలు నళిని, సలీనా.

1964 లో ఉత్తర అమెరికా నుండి తొలి తెలుగు కథ ప్రచురించబడి, 1974 లో అమెరికా తొలి పత్రిక ఆఖరి సంచిక వెలువడిన కారణంగా ఆ దశకాన్ని ఉత్తర అమెరికాలో తెలుగు సాహిత్యానికి తొలి దశకంగా పరిగణించవచ్చును. దానికి పునాదులు వేసిన వారు కెనడాలో పులిగండ్ల మల్లికార్జున రావు గారు, అమెరికాలో సంయుక్త రాష్ట్రాలలో పెమ్మరాజు వేణు గోపాల రావు గారూ అయితే ఆ అమెరికాలో సాహిత్య సౌధం’ నిర్మాణానికి ‘రాళ్లెత్తిన కూలీలెందరో’... ఎందరో మహానుభావులు. ముఖ్యంగా ఈ దశకం లో ప్రధానంగా చెప్పుకోదగ్గ వారిలో కొందరు వేమూరి వెంకట రామనాధంగారు, అమెరికా సంయుక్త రాష్ట్రాల తొలి కథకులు చెరుకూరి రమాదేవి, శతాధిక రచయిత వేమూరి వేంకటేశ్వర రావు, వేలూరి వేంకటేశ్వర రావు, కందుల సీతారామ శాస్త్రి, యడవల్లి పురుషోత్తమ సోమయాజులు, కోట సుందర రామ శర్మ, దువ్వూరి అనంత అచ్యుత నారాయణ రావు, గవరసాన సత్యనారాయణ, తమ్మర శేషగిరి రావు, ఆకుండి నరసింహ మూర్తి, విజయలక్ష్మీ రామకృష్ణన్, పి. నరసింహా రావు, కస్తూరి రామకృష్ణా రావు మొదలైన వారు. వీరందరూ ఏ సాంస్కృతిక సంస్థ అండదండలూ, ఆర్భాటాలూ, ఆయా అవసరాలు లేకుండా కేవలం తెలుగు భాషా, సాహిత్యాల పై ఉన్న మక్కువ తోనే తమ సేవలు అందించిన నిస్వార్థ సాహితీవేత్తలు.

ఈనాడు ప్రపంచవ్యాప్తంగా అమెరికా తెలుగు కథకీ, సాహిత్యానికీ తనదైన గుర్తింపు రావడానికీ, అమెరికా డయాస్పోరా కథ తెలుగు కథా క్రమంలో ఒక విశిష్టమైన పాయ గా వెలుగొందడానికీ ఆనాడు పునాదులు వేసిన పెద్దలందరికీ  అమెరికా తెలుగు కథ 52 వ వార్షికోత్సవ సందర్భంగా మా ‘మధుర వాణి ‘ నిర్వాహక బృందం శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాం.

*****

మీ అభిప్రాయాలు తెలుపుటకు క్లిక్ చేయండి...click here to post your comments...

శ్రీ పులిగండ్ల మల్లికార్జున రావు​

1938-1978

శ్రీ పెమ్మరాజు వేణుగోపాల రావు​

1932-2012

comments
bottom of page