top of page

వ్యాస​ మధురాలు

అమెరికా తెలుగు కథకు 52 ఏళ్ళు

డాక్టర్ తన్నీరు కళ్యాణ్ కుమార్డి

కథలు వ్యక్తుల జీవితానుభవాల్లోంచి పుట్టి, ఆ జీవితాలనే ప్రతిబింబిస్తుంటాయి. అమెరికాంధ్రుల జీవితాలలో తరచుగా తారసపడే పరిస్థితులను, సమస్యలను వాటి పరిష్కారాలను కథలుగా మలచి మనకు అందిస్తున్న అమెరికా తెలుగు కథా రచయితలు అభినందనీయులు. వేరు వేరు కాలాలలో అమెరికాలోని తెలుగువారి జీవనవిధానం ఎలా కొనసాగిందో తెలుసుకోవడం ఈ కథల ద్వారానే సాధ్యమవుతుంది. అమెరికాలోని తెలుగు కథా రచయితలు - రచయిత్రులు అక్కడి సమాజంలోని తమ వారి జీవితాలను శోధించి, ఆ అంశాలనే ఇతివృత్తాలుగా తీసుకొని కథలను సృష్టిస్తున్నారు. అమెరికా లాంటి భిన్న సంస్కృతుల వ్యవస్థలో తమ సంస్కృతిని, తమ భాషను, తమ ప్రత్యేకతను నిలబెట్టుకోవాలనే తాపత్రయంతోను - ఉత్సాహంతోను అక్కడి కథా రచయితలు - రచయిత్రులు కథలను వ్రాస్తున్నారు. సాహిత్యం కూడా సంస్కృతిలో భాగం కావున అమెరికాలో స్థిరపడినప్పటికీ మాతృభాషలో కథలు, కవితలు వ్రాస్తున్న రచయితలు కూడా అక్కడి తెలుగు సంస్కృతికి ఇతోధికసాయం చేస్తున్నాయని చెప్పవచ్చు.

         

అమెరికా తెలుగు సాహిత్యంలోని  కథలన్నీ అక్కడి తెలుగువారి జ్ఞాపకాల నుండి, ఆరాటాల నుండి, బెంగల నుంచి, స్పృశించిపోయే అనుభవాల నుండి పుట్టుకొచ్చాయి. అక్షరాలా ఈ కథలు ప్రస్తుతం తెలుగు గడ్డపై వెలువడుతున్న కథలకు ఇవి భౌతికంగాను, మానసికంగాను భిన్నమైనవి. ఈ కథలలో అధిక భాగం స్త్రీ దృక్పథం నుండి కష్ట సుఖాలను విశదం చేస్తాయి. అమెరికాలోని తెలుగు కథా రచయితలందరూ రచనే వృత్తిగా కలిగినవారు కాదు. అక్కడి రచయితలకిది ప్రవృత్తి మాత్రమే. ఈ రచయితలకు వారు చేసే ఉద్యోగాల ద్వారా రకరకాల వ్యక్తులు పరిచయమవుతుంటారు. పరాయిగడ్డపై తెలుగువారు ఎటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నారో, వాటిని వారు ఎలా పరిష్కరించుకోగలుగుతున్నారో, ఆయా సమస్యల నుండి బయటపడే దారిలేక ఎలా బలి అవుతున్నారో తెలుసుకొని కూర్చబడిన కథలివి.

 

అమెరికా తెలుగు కథా పరిణామాన్నే అమెరికా తెలుగు సాహిత్య పరిణామంగా చెప్పవచ్చు. అమెరికాలో తెలుగు కథ పుట్టు పూర్వోత్తర వికాసాలను పరిశీలిస్తే  1965 ప్రాంతపు తొలిదశలో అమెరికా గడ్డపై కాలుమోపిన తెలుగువారు, ఆ సరికొత్త  వ్యవస్థలో సర్ధుకుపోలేక విపరీతమైన ఒత్తిళ్ళకులోనై సాహిత్యం జోలికిపోలేదు. కానీ 1970 ప్రాంతంలో ఈ పరిస్థితులు మారి సాహిత్య సృజనకు అనుకూలమైన వాతావరణం  ఏర్పడింది. దీంతో అంతకుముందు రచనా వ్యాపకం కలిగిన వారేగాక, కొత్తవారు కూడా కలంపట్టి  తమ సంఘర్షణలను కథలుగా మలచడం ఆరంభించారు.

 

తొలినాళ్లలో అమెరికాకు వచ్చిన తెలుగువారు వేరు వేరు నగరాలలో స్థిరపడటం వల్ల వీరందరి మధ్య మొదట్లో పెద్దగా సంబంధాలు ఉండేవి కాదు. ఆ తరువాత అక్కడ ఏర్పడిన తెలుగు సంఘాలు ఈ కొరతను తీర్చడంలో ముఖ్య భూమికగా నిలిచాయి. డేబ్బయ్యో దశకంనాటికి అమెరికాకు వచ్చే తెలుగువారి సంఖ్య క్రమంగా పెరగడంతో అక్కడి ముఖ్య నగరాలన్నింటిలోను తెలుగు సంఘాలు ఏర్పడటం, ఆ తరువాత ఆ సంఘాలే చిన్నవో, పెద్దవో లిఖిత పత్రికలు ప్రచురించడం ఆరంభమైంది. ఆ తరువాత కొంత కాలానికి అచ్చు పత్రికలు కూడా వెలువడ్డాయి. తెలుగు భాషా పత్రిక, మధురవాణి, తెలుగు అమెరికా పత్రికల్లో అక్కడున్న తెలుగు కథకుల కథలు ప్రచురించబడేవి. తొంబయ్యో దశక ప్రారంభంలో వెలువడిన తానా పత్రిక, ఆ తరువాత కొంత కాలానికి వెలువడిన అమెరికా భారతి, తెలుగు జ్యోతి, తెలుగు వెలుగు, తెలుగు పలుకు, ఇంద్రధనుస్సు, తెలుగువాణి తదితర పత్రికలు వెలుగుచూశాయి. ఈ పత్రికలన్నీ తెలుగు కథకు అగ్ర తాంబూలాన్ని ఇచ్చాయి.

 

స్వర్గీయ పులిగండ్ల మల్లిఖార్జునరావు వ్రాసిన ‘వాహిని’ అమెరికా నుండి వెలువడిన తొలి తెలుగు కథగా చెప్పవచ్చు. ఈ కథ ఆంధ్ర సచిత్ర వారపత్రికలో ఏప్రిల్ 24, 1964లో ప్రచురించబడినది. ఈ కథా రచయిత కలం పేరు ‘ఆర్పియస్’. ఈ కథలోని పాత్రలు భారతీయులవే అయినా, సన్నివేశాలు – వాతావరణం అన్నీ అమెరికావే కావడం విశేషం. ఈ కథలో రచయిత తొలినాళ్ళలో అమెరికాకు వచ్చిన భారతీయుల మనోగతాన్ని చక్కగా ఆవిష్కరించారు. శ్రీమతి చెరుకూరి రమాదేవి – ‘పుట్టిల్లు’, కోమలాదేవి – ‘పిరికివాడు’, కస్తూరి రామకృష్ణరావు – ‘యవ్వన కుసుమాలు వాడిపోతే’ కథలు తెలుగు భాషా పత్రిక (1970, ఏప్రిల్) ప్రారంభ సంచికలో ప్రచురించబడ్డాయి. ఇవి ఉత్తర అమెరికాలో ప్రచురించబడ్డ తొలి కథలు కావడం విశేషం. ఐతే ఈ కథల్లోని కథా వస్తువు, వాతావరణం ఆంధ్రదేశానికి చెందినవి.

 

పెమ్మరాజు వేణుగోపాలరావు, కిడాంబి రఘునాథ్, వేమూరి వెంకటేశ్వరరావు, వంగూరి చిట్టెన్ రాజు, వేలూరి వెంకటేశ్వరరావు, సత్యం మందపాటి, చెరుకూరి రమాదేవి తదితరులు అమెరికాలోని ప్రారంభ కథకులు. మొదటి తరం రచయితలు మొదట్లో పుట్టిన గడ్డకు దూరంగా ఉండటం వల్ల ఆ జ్ఞాపకాలు, అనుభూతులను ఒకరితో మరొకరు పంచుకోవాలనుకున్నారు. అందుకు అప్పుడే ఏర్పడిన తెలుగు సంఘాలు, వాటి సావనీర్లు వీరికి ఆలంబనగా నిలిచాయి.

 

అందుచేతనే ప్రారంభ అమెరికా తెలుగు కథకుల రచనలలో నాస్టాల్జియా భావాలు కన్పిస్తాయి.  దాదాపు 25,30 ఏళ్ళుగా అమెరికాలో ఉంటున్న తొలితరానికి చెందిన ఇప్పటికీ ఆ ప్రపంచం నుండి బైటపడలేకపోతున్నారు.  ఈ తరం వాళ్ళు ఏం రాసినా మాతృదేశంతో వాళ్ళ మానసిక సాన్నిహిత్యం కనిపిస్తుంది. ఎన్నో ఏళ్ళ నుండి వీరు భౌతికంగా విదేశంలో వున్నా మాతృ దేశపు మూలాల్ని మరిచిపోలేదు. దామరాజు లక్ష్మి, శారదాపూర్ణ శొంఠి లాంటి వాళ్ళు పూర్తిగా మాతృదేశపు జ్ఞాపకాలతో కథలు రాశారు. వేమూరి వెంకటేశ్వరరావు, కిడాంబి రఘునాథ్ కథల్లోను నాస్టాల్జియా భావాలు తొంగి చూస్తుంటాయి.  

 

1990వ సంవత్సరం తరువాత వచ్చిన రెండో తరం కథకుల కథల్లో నాస్టాల్జియా భావాలు కనిపించడం లేదు. కొత్త దేశంలో తమకు ఎదురయ్యే సరికొత్త అనుభవాలను, పాత అనుభవాలను సమన్వయం చేస్తూ, ప్రతి విషయాన్ని కొత్త కళ్ళతో పరిశీలిస్తూ వ్రాసే డైస్పోరా కథా సాహిత్యం వెలువడటం మొదలయింది. 1998 అట్లాంటాలో జరిగిన ప్రప్రథమ అమెరికా తెలుగు సాహితీ సదస్సు, 2000 వ సంవత్సరం చికాగోలో జరిగిన రెండవ అమెరికా తెలుగు సాహితీ సదస్సు ఈ భావాలకు బలాన్నిచ్చాయి.

 

ఉత్తర అమెరికాలోని తెలుగు రచయితలను ప్రోత్సహించాలనే సంకల్పంతో 1994లో ఆవిర్భవించిన వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా తెలుగుకథకు రాజ గౌరవాన్ని కలుగజేసింది. ఈ  ఫౌండేషన్ కృషితోనే 1995 జులైలో అమెరికా తెలుగు కథానిక మొదటి సంకలనం వెలుగు చూసింది. అమెరికాలో వెలువడిన మొట్టమొదటి కథా సంకలనం కూడా ఇదే కావడం విశేషం. ఈ ఫౌండేషన్ వారే ఏటేటా కథా పోటీలను నిర్వహించి బహుమతులు ఇవ్వడమే గాక, కథా సంకలనాలుగా కూడా ప్రచురిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ ఫౌండేషన్ వారు 12 కథా సంకలనాలను ప్రచురించారు.

 

అమెరికాలోని తెలుగు రచయితల సృజనాత్మక శక్తిని వెలికి తీయడంలోను, ఔత్సాహిక కథకులను ప్రోత్సహించి ఉత్సాహపరచడంలోను ఈ ఫౌండేషన్ గణనీయమైన పాత్రను పోషించింది. పై సంకలనాలతో పాటుగా వంగూరి చిట్టెన్ రాజు ‘అమెరికామెడీ కథలు’, ‘అమెరికాకమ్మ కథలు’, ‘వంగూరి చిట్టెన్‍ రాజు చెప్పిన నూటపదహారు అమెరికామెడీ కథలు’, వేమూరి వెంకటేశ్వరరావు ‘కించిత్ భోగే భవిష్యతి’, దామరాజు సచ్చిదానందమూర్తి ‘మా వూరి కథలు’, చిమట కమల ‘అమెరికా ఇల్లాలు’, వేమూరి వెంకటేశ్వరరావు ‘మెటామార్ఫసిస్’, పూడిపెద్ది శేషుశర్మ ‘ప్రవాసాంధ్రుల ఆశా కిరణం’, శ్యామలాదేవి దశిక ‘అమెరికా ఇల్లాలి ముచ్చట్లు’, ‘అమెరికా ఇల్లాలి ముచ్చట్లు -2’ మెడికో శ్యాం ‘శ్యామ్ యానా’, కోసూరి ఉమాభారతి ‘విదేశీ కోడలు’,  అపర్ణ మునుకుట్ల గునుపూడి ‘ఘర్షణ’, వెంపటి హేమ ‘కలికి కథలు’, “20వ శతాబ్దంలో అమెరికా తెలుగు కథానిక మరియు అమెరికా తెలుగు సాహితీవేత్తల పరిచయ గ్రంథం”(116 కథలతో, సుమారు 700 పేజీల చారిత్రాత్మక బృహత్ గ్రంథం) మొదలైన కథా సంకలనాలను కూడా వంగూరి ఫౌండేషన్ వారు ప్రచురించి కథకులను ప్రోత్సహించారు. ఈ సంస్థ హ్యూస్టన్ లో ఉత్తర అమెరికా తెలుగు కథ 50 వసంతాల వేడుకను కూడా 2014 అక్టోబర్ లో నిర్వహించింది. అమెరికా తెలుగు కథా సాహిత్యంపై తెలుగు రాష్ట్రాల్లోని విశ్వవిద్యాలయాల్లో వెలువడుతున్న పరిశోధన గ్రంథాలను సైతం ఈ ఫౌండేషన్ ప్రచురించడం విశేషం.

 

1995 సంవత్సరంలోనే సత్యం మందపాటి ‘అమెరికా భేతాళ కథలు’ అనే కథా సంపుటి వెలువడింది. ‘తెలుగువాడు పైకొస్తున్నాడు – తొక్కేయండి’, ‘చెట్టు క్రింద చినుకులు’, ‘గవర్నమెంటాలిటీ కథలు’, ‘మేడ్ ఇన్ అమెరికా’, ‘ఎన్నారై కథలు – మరో ఆరు అమెరికా కథలు’, ‘సత్యం శివం సుందరం’,’అమెరికా కథలు’, ‘ఎన్నారై కబుర్లు ఇంకోటి’ మొదలైనవి ఆయన ఇతర కథా సంకలనాలు. ఈ విధంగా కొందరు కథకులు తమ కథా సంకలనాలను తామే ప్రచురించుకొని కథలపై తమకున్న అభిలాషను వ్యక్తపరుస్తున్నారు.

 

అట్లే ఆరి సీతారామయ్య ‘గట్టు తెగిన చెరువు’, అక్కినపల్లి సుబ్బారావు ‘మనిషి మరక’, నిడదవోలు మాలతి ‘నిజానికి – ఫెమినిజానికి మధ్య’, వేలూరి వేంకటేశ్వరరావు ‘ఆ నేల, ఆ నీరు, ఆ గాలి’, చింతపల్లి గిరిజా శంకర్ ‘కదంబము’, గొర్తి సాయి బ్రహ్మానందం ‘సరిహద్దు’, కన్నెగంటి చంద్ర ‘మూడో ముద్రణ’, డొక్కా శ్రీనివాస ఫణికుమార్ ‘పల్లకీ’, ‘టేకిటీజీ’, నారాయణ స్వామి ‘రంగుటద్దాల కిటికీ’, కూనపరాజు కుమార్ ‘న్యూయార్క్ కథలు’, కె.వి.యస్. రామారావు సంపాదకత్వంలో ‘ఈ మాట’ వెబ్ సైట్ వారు ప్రచురించిన ‘ఈ నేలా....ఆ గాలీ’, కాలిఫోర్నియా తెలుగు సాహితీ సదస్సు వారు గొర్తి సాయి బ్రహ్మానందం సంపాదకత్వంలో ప్రచురించిన ‘వెన్నెల్లో హరివిల్లు’ తదితర కథా సంకలనాలు అమెరికాలో వెలువడిన ప్రముఖ కథా సంకలనాలు.  

 

సంప్రదాయబద్ధంగా స్వదేశంలో పెరిగి, పెళ్లి పేరుతో తమ సంస్కృతి సంప్రదాయాలకు – ఆచార వ్యవహారాలకు ఎంతో భిన్నమైన వాతావరణంలోకి అడుగిడిన తెలుగింటి ఆడపడుచుల మనోభావాలను కథల రూపంలోను, కబుర్ల రూపంలోను అందించే ప్రయత్నాన్ని కొంతమంది అమెరికా తెలుగు కథా రచయిత్రులు చేశారు. దశిక శ్యామలాదేవి ‘అమెరికా ఇల్లాలి ముచ్చట్లు’, చిమట కమల ‘అమెరికా ఇల్లాలు’ ఈ కోవకు చెందిన కథా సంకలనాలు.

 

1977 నుండి జరుగుతున్న ద్వైవార్షిక తానా సమావేశాలు, 1991 నుండి జరుగుతున్న ఆటా సమావేశాలు,  అమెరికాలోని తెలుగు సంఘాలు ప్రత్యేక సందర్భాలలో ప్రచురిస్తున్న విశేష సంచికలు – సావనీర్లు వీలయినంతవరకు అమెరికాలోని తెలుగు కథకులను ప్రోత్సహిస్తున్నాయి. అమెరికాలోని తెలుగు రచయితలు చాలా మంది తెలుగు దేశపు పత్రికల్లో తమ రచనలను ప్రచురిస్తూ మంచి పేరును తెచ్చుకుంటున్నారు. అట్లే ‘ఈ మాట’, ‘కౌముది’, ‘సుజనరంజని’, ‘వాకిలి’, ‘భువన విజయం’, ‘సారంగ’, ‘మాలిక’, ‘విహంగ’ తదితర అంతర్జాల పత్రికల్లోను అమెరికాలోని తెలుగు కథా రచయితలు – రచయిత్రులు ఉత్సాహంగా రచనలు చేస్తూ కథా సాహిత్యాన్ని సుసంపన్నం చేస్తున్నారు. ఇవన్నీ కలుపుకుంటే అమెరికాలోని తెలుగు వారు సృష్టించిన తెలుగు సాహిత్యం రాశిపరంగా గణనీయంగానే ఉన్నాయని చెప్పవచ్చు.

 

కథలలోని ఇతివృత్తాలను ఆధారం చేసుకొని అమెరికా తెలుగు కథలను కొన్ని రకాలుగా వర్గీకరించవచ్చును. 1. అమెరికన్ సంస్కృతి పట్ల అవగాహన కలుగజేసే కథలు 2. హాస్య కథలు 3. తరాల సంఘర్షణలను చిత్రించిన కథలు 4. వివాహ సమస్యలను చిత్రించిన కథలు 5. విభిన్న సంస్కృతుల వైవాహిక జీవిత సమస్యలను చిత్రించిన కథలు 6. భార్యభర్తల అనుబంధాలను చిత్రించిన కథలు 7. మధ్య వయస్సు ఒంటరితనానికి పరిష్కారం చూపిన కథలు 8. వృద్ధాప్య సమస్యలను చిత్రించిన కథలు 9. గృహహింసను చిత్రించిన కథలు 10. అమెరికన్ సంస్కృతిలో మమేకమైన – మమేకం కాని జీవితాలను చిత్రించిన కథలు 11. మాతృభూమి పట్ల మమకారాన్ని వెల్లడించే కథలు 12. సాంస్కృతిక ఔన్నత్యాన్ని వెల్లడించిన కథలు 13. స్వదేశంలోని బంధు ప్రేమలను చిత్రించిన కథలు 14. అమెరికన్ విద్యా విధానం పట్ల అవగాహన కలుగజేసే కథలు 15. పిల్లల పెంపకంలోని సమస్యలను చిత్రించిన కథలు 16. మాతృప్రేమను తెలియజేసే కథలు 17. వ్యక్తుల వ్యక్తిత్వాలను చిత్రించిన కథలు.... తదితరమైనవి.

 

పులిగండ్ల మల్లిఖార్జునరావు, వంగూరి చిట్టెన్ రాజు, వేమూరి వెంకటేశ్వరరావు, వేలూరి వెంకటేశ్వరరావు, సత్యం మందపాటి, పెమ్మరాజు వేణుగోపాలరావు, ఆరి సీతారామయ్య, కె.వి. గిరిధరరావు, దారా సురేంద్ర, మాచిరాజు వెంకటరత్నం, గొర్తి సాయి బ్రహ్మానందం, ఎన్. నారాయణ స్వామి, పప్పు శ్యామ సుందర రావు, అక్కినపల్లి సుబ్బారావు, గవరసాన సత్యనారాయణ, జె.యు.బి. ప్రసాద్, పుట్టా విప్లవ్, అక్కిరాజు భట్టిప్రోలు, కె.యస్. రామరావు, చింతపల్లి గిరిజాశంకర్, డొక్కా శ్రీనివాస ఫణికుమార్, దామరాజు సచ్చిదానందమూర్తి, ప్రభల శ్రీనివాస్, శశి.కె.బోస్, పులికట్ భాస్కర్, కన్నెగంటి చంద్ర, తాడికొండ శివకుమార శర్మ, వేదుల చిన్న వెంకటచయనులు, వడ్లమాని విశ్వనాథ్, పట్టిసపు రామజోగి గంగాధరం, కూనపరాజు కుమార్  తదితరులు అమెరికాలోని ప్రముఖ కథా రచయితలు.

 

స్రవంతి, పుచ్ఛా వసంతలక్ష్మీ, పుచ్ఛా అన్నపూర్ణ, పూడిపెద్ది శేషుశర్మ, నోరి రాధిక, సుధేష్ణ, మాచిరాజు సావిత్రి, చెరుకూరి రమాదేవి, చిమట కమల, మాలెంపాటి ఇందిరా ప్రియదర్శిని, కామేశ్వరి దేవి, లలితా జొన్నాళ్, అదితం నళిని, రెంటాల కల్పన, రాధికాశాస్త్రి, గల్లా అరుణా, యార్లగడ్డ కిమీర, సాయి లక్ష్మీ, రాణీ సంయుక్త, కోసూరి ఉమాభారతి, కడప శైలజ, కాళ్ళకూరి సాయిలక్ష్మీ, అయ్యగారి రమామణి, జయశ్రీ, కనకదుర్గా, కందికొండ లత, సురంపూడి అనంత పద్మావతి, కృష్ణ ప్రియ, సునీతా రెడ్డి, దేశభొట్ల ఉమ, కొవ్వలి జ్యోతి, ఆదిరాజు ప్రియ, యస్. విజయ, నిడదవోలు మాలతి, అనంతు శివపార్వతి, సంగసాని జయ, విజయలక్ష్మీ రామకృష్ణన్, కొమరవోలు సరోజ, వేద, ములుకుట్ల గునుపూడి అపర్ణ, దువ్వూరి సుందరశ్రీ, సూర్యదేవర ప్రమీల, సూరంపూడి అనంత పద్మావతి, కోమలాదేవి, పొన్నలూరి పార్వతి, దశిక శ్యామలాదేవి, కనుపర్తి దీప్తి, y.దుర్గా,.... తదితరులు అమెరికాలోని ప్రముఖ కథా రచయిత్రులు.   

 

అమెరికా తెలుగు కథల్ని ప్రచురితమైన క్రమంలో పరిశీలిస్తే మొదటి తరం అమెరికా తెలుగు కథలలో ముఖ్యంగా కనిపించేది కల్చర్ షాక్ కథలు.  కల్చర్ షాక్ కథలు తర్వాత నెమ్మదిగా అమెరికాలోని తెలుగు కుటుంబాల జీవనానికి సంబంధించిన కథలు రావడం మొదలైనాయి. పిల్లల పెంపకంలో ఉండే ఇబ్బందులు, మారుతున్న భార్యభర్తల అనుబంధాలు, పిల్లల పెళ్ళిళ్ళ విషయంలో ఎదురౌతున్నఅవస్థలు, అమెరికాలో అతిథులతో ఇబ్బందులు, అమెరికా నుండి ఇండియాకి వెళ్ళినప్పుడు కలిగే అనుభవాలు కథా వస్తువులయినాయి. ఆ తరువాత విడాకులు, వృద్ధాప్యం, ఉద్యోగ విరమణ వస్తువులుగా కథలు వచ్చాయి. ఇప్పటికీ వస్తున్నాయి. అమెరికా తెలుగు కథలు చాలా వరకు తెలుగు పాత్రలకు, తెలుగు కుటుంబాలకే పరిమితమైనట్లుగా కనిపిస్తున్నాయి. అమెరికన్ పాత్రలు, అమెరికన్ ప్రపంచం ఈ కథలలో అరుదుగా కనిపిస్తాయి.

 

1964 లో ఉత్తర అమెరికా అమెరికా ఖండం నుండి తొలి తెలుగు కథ వెలువడిన గత యాభై సంవత్సరాలలోనూ ఎందరో అమెరికా తెలుగు రచయితలు – రచయిత్రులు తెలుగు కథా సాహిత్యాన్ని పరిపుష్టం చేశారు. అమెరికాలో తెలుగువారు సృజియించినంత సాహిత్యాన్ని అక్కడున్న ఏ ఒక్క ఇతర భారతీయ భాషల వారికీ ఇంతటి సాహిత్య స్పహ ఉన్నా దాఖలాలు కూడా లేవు. ఇది తెలుగు వారి సాహిత్యాభిరుచికి నిదర్శనం. ఇదమిద్ధంగా చెప్పలేం కానీ బహుశా ఉత్తర  అమెరికాలో భారతీయులందరి కంటే ముందుగా సాహిత్య సృజనను ఆరంభించింది కూడా తెలుగు వారే కావచ్చును. 

 

1960 దశకంలో అమెరికన్ ఇమిగ్రేషను నియమాలలో మార్పులు వచ్చాక, తెలుగు వారు అమెరికాకి ఎక్కువగా వెళ్ళడం ప్రారంభం అయింది. ఈ నాలుగైదు  దశాబ్దాలలో వీరి జీవితాలలో వచ్చిన మార్పులు అవగాహన చేసుకోవడానికి కావలసిన విషయాలు ఇంకా పూర్తిగా అందుబాటులో లేవు. వీటిని సంగ్రహించి, విశ్లేషించి ప్రకటించే పరిశోధకులు ఇంకా బయలుదేరలేదనే చెప్పాలి. కానీ ఈ కొరతను కొంతవరకు అమెరికా కథా సాహిత్యం తీర్చిందని చెప్పవచ్చు. ఈ అమెరికా తెలుగు వారి జీవిత విశేషాలు, అక్కడి చైతన్యవంతమైన రచయితలకు కథా వస్తువులుగా మారాయి. దైనందిన జీవితాలలోని సమస్యలు, పరిస్థితులు అక్కడి కథలలో ప్రతిబింబించడం సహజమైన విషయమే కాబట్టి అక్కడి వారి జీవితాన్ని గూర్చి తెలుసుకోవాలంటే వారికి అమెరికా కథా సాహిత్యమే ముఖ్య భూమికగా నిలుస్తుందనుటలో ఎట్టి సందేహం లేదు. ఈ రచయితలు సమకాలికుల జీవితానికి మార్గదర్శకులు కూడా కాగలరు.

 

తెలుగు కథా రచయిత్రులలో చాలా మంది అక్కడి తెలుగు వారి జీవనానికి సంబంధించిన కుటుంబిక ఇతివృత్తాలతోనే కథలు వ్రాసారే తప్ప, వర్తమాన సాంఘిక – రాజకీయ – ఆర్థిక విషయాలను స్పృశించినట్లు కనిపించడం లేదు. నేడు కొత్తగా పుట్టుకొస్తున్న వివాహ వేదికలు, ఆల్ లైన్ మ్యారేజ్ బ్యూరోల వంటి అంశాలను కూడా అమెరికా తెలుగు కథ ఎక్కువగా స్పృశించినట్లు కన్పించడం లేదు. స్వదేశంలోని బంధు ప్రేమలను గూర్చి, విభిన్నమైన వాతావరణంలో తమ పిల్లలను పెంచడంలో అమెరికాంధ్రులు ఎదుర్కొంటున్న సమస్యలను గూర్చి  తెలిపే కథలు కూడా చాలా తక్కున సంఖ్యలోనే ఉన్నాయి.

 

అమెరికా తెలుగు కథల రాశి ఎక్కువగానే వున్నా, వాసి పూర్తిగా సంతృప్తికరంగా లేదనే చెప్పాలి. కథా శిల్పం తెలిసి, ముఖ్యమైన విషయాలపై మంచి కథలు వ్రాసిన కథా రచయితల సంఖ్య తక్కువనే చెప్పాలి. కథ ఎత్తుగడ, ముగింపు, భాష, శైలి వంటి అంశాల పట్ల అమెరికా తెలుగు  కథా రచయితలు ఇంకొంత శ్రద్ధ చూపితే మంచి కథలు వెలువడతాయి. ఉపన్యాసాలు, సుదీర్ఘ సంభాషణలు చాలా కథల్లో ఎక్కువగా కన్పిస్తాయి. అనేక కథలు కాలక్షేపానికి బాగానే వున్నా, ఆలోచింపజేసేవి కొన్ని మాత్రమే కన్పిస్తున్నాయి. అమెరికాలో తెలుగు కథా రచయితలు – రచయిత్రులు ఎక్కువ మందే వున్నా, ఎక్కువగా కథలు వ్రాసిన వారు చాలా తక్కువ మందే అని చెప్పవచ్చు. ఒకటో, రెండో కథా రచనలు చేసి చాలా కాలంగా రాయని కథా రచయితలు – రచయిత్రులే ఎక్కువ. అట్లే రచనలు ప్రారంభించిన తొలినాళ్ళలలో ఎక్కువ కథలు వ్రాసి, ఆ పిమ్మట స్తబ్దతగా వున్న వారు ఉన్నారు. స్థానిక సంపాదకులు కూడా కథల ఎంపిక విషయంలోను, రచనల లోటుపాట్లను సవరించడంలోను శ్రద్ధ వహించాల్సిన అవసరం ఎంతైనా వుంది.

 

ఇంతకు ముందు ఎలా వున్నా, ఈ మధ్య కాలంలో వస్తున్న కొన్ని కథల్లో, ముఖ్యంగా కొత్తగా వ్రాస్తున్న కథకుల వస్తువులోను - శిల్పంలోను వైరుధ్యం చూపాలన్న తపన స్పష్టంగా కన్పిస్తుంది. ఈ రచయితలు తమ కథలపై చర్చలను, విమర్శలను ఆహ్వానించడం ఒక శుభ పరిణామం.  అమెరికా తెలుగు  రచయితలు – రచయిత్రులు కథలు వ్రాయడంలో చూపుతున్న ఆసక్తి, సమకాలీన అమెరికా తెలుగు  కథా రచనలపై సమీక్షలు – విమర్శలు – చర్చలు చేయడానికి చూపడం లేదు. రచనలపై ఉత్తమ సమీక్షలు - విమర్శలు ఎంత ఎక్కువగా వెలువడితే, అంత మంచి కథా సాహిత్యం వెలుగు చూస్తుంది.

 

అమెరికా తెలుగు కథ ఇంకా పరిపూర్ణావస్థకు చేరుకోలేదనే చెప్పాలి. వస్తుపరంగా, శిల్పపరంగా దీని స్థాయి ఇంకా ఎదగాల్సి వుంది. ముఖ్యంగా రెండు సంస్కృతుల, జీవన క్రమాల సమాగమాన్ని విశ్లేషించి సమన్వయించాల్సిన అవసరం వుంది. ఈ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకొని కథకులు చక్కని కథలల్లుతారని, అమెరికా తెలుగు డయాస్ఫోరా కథా సాహిత్యాన్ని సుసంపన్నం చేస్తారని ఆశిద్దాం. అమెరికా తెలుగు  తెలుగు సాహిత్యం దినదిన ప్రవర్ధమానమై వెలుగొందాలని మనసారా కాంక్షిద్దాం

*****

మీ అభిప్రాయాలు తెలుపుటకు క్లిక్ చేయండి...click here to post your comments...

bio

డా. తన్నీరు కళ్యాణ్ కుమార్

డా. తన్నీరు కళ్యాణ్ కుమార్: డా. తన్నీరు కళ్యాణ్ కుమార్ గుంటూరు జిల్లా తెనాలి మండలంలోని కొలకలూరు గ్రామంలో జన్మించారు. తెనాలిలోని ప్రియదర్శిని డిగ్రీ కళాశాలలో తెలుగు అధ్యాపకునిగా పని చేస్తున్నారు. కళ్యాణ్ కుమార్ వంగూరి చిట్టెన్ రాజు గారితో కలసి రాసిన పరిశోధనా గ్రంథం 'అమెరికా తెలుగు కథా సాహిత్యం, ఒక సమగ్ర పరిశీలన' 2014 లో ప్రచురితమయింది.   అమెరికా తెలుగు కథా సాహిత్యంపై పరిశోధన చేసి పిహెచ్.డి. డిగ్రీ పొందారు. అనేక జాతీయ - అంతర్జాతీయ - అంతర్జాల పత్రికలలో ఈయన రాసిన సాహితీ వ్యాసాలు ప్రచురించబడ్డాయి. ఆంధ్రదేశంలో వెలువడే ఆంధ్రజ్యోతి, సాక్షి దిన పత్రికల్లో ఈయన రాసిన పలు ఎడిటోరియల్ వ్యాసాలు ప్రచురించబడ్డాయి. 2014 ఆటా వారు నిర్వహించిన వ్యాస రచన పోటీలో ప్రథమ బహుమతి, 2015 తానా వారు నిర్వహించిన వ్యాసరచన పోటీలలో ద్వితీయ బహుమతిని కైవసం చేసుకున్నారు.

comments
bottom of page