top of page

వ్యాస​ మధురాలు

‘నాలుగు స్తంభాలాట!’

అను

“పత్రికా రంగం – సాధకబాధకాలు”

సత్యం మందపాటి

ఒక మండపం నిలవటానికి నాలుగు స్తంభాలు ఎలా కావాలో, అలాగే ఒక పత్రిక నడపాలన్నా, అది నాలుగు కాలాలపాటు నిలవాలన్నా నాలుగు స్తంభాలు కావాలి.

ఒకటి, పెట్టుబడి పెట్టే పెద్దమనిషి లేదా మనుష్యులు. ధన సహాయమే కాకుండా, ఖర్చులూ, ప్రకటనలూ, అమ్మకాలూ మొదలైనవన్నీ చూసుకుంటూ, పత్రికని నడపగలిగే శక్తి, ఆసక్తి వున్నవారన్నమాట! వీరి ధనమే పత్రికా ప్రచురణకి ఇంధనం. అంటే ఆ రోజుల్లో ఆంధ్రపత్రిక, భారతి నడిపిన కాశీనాధుని నాగేశ్వరరావు, శివలెంక శంభుప్రసాద్; ఆంధ్రప్రభ నడిపిన గోయంకా; యువ, విజయచిత్ర నడిపిన చక్రపాణి; జ్యోతి నడిపిన రాఘవయ్య, లీలావతి; విజయ, అపరాధ పరిశోధన నడిపిన బాపినీడు; ఆంద్రజ్యోతి నడిపిన కేఎల్లెన్ ప్రసాద్; ఈ రోజుల్లో స్వాతి నడుపుతున్న వేమూరి బలరాం; విపుల, చతుర, తెలుగువెలుగు నడుపుతున్న రామోజీరావు మొదలైనవారు అన్నమాట.

రెండవ స్తంభం, సంపాదకులు లేదా సంపాదక వర్గం. మంచి శీర్షికలూ, ధారావాహికలూ ఇస్తూ, ఇటు సాహిత్య విలువలు కాపాడుతూ, అటు పాఠకులకి నచ్చేవీ, యాజమాన్యానికి లాభాలు తెచ్చేవీ అందిస్తూ, కత్తి మీద సాము చేసేవాళ్ళే మంచి సంపాదకులు. విద్వాన్ విశ్వం, వీరాజీ, ఎం. మాధవరావు, సుధాకర్రావు, పొత్తూరి వెంకటేశ్వరరావు, సికరాజు, వేమూరి సత్యనారాయణ, చలసాని ప్రసాదరావు, నామిని సుబ్రహ్మణ్య నాయుడు, ఎమ్మెల్ నరసింహం, ఏఎస్ లక్ష్మి, జగన్నాధశర్మ మొదలైనవారు. వైవి రాఘవయ్యగారు జ్యోతి మాసపత్రిక ప్రారంభిస్తూ, సంపాదక వర్గానికి ఎంతో ప్రాముఖ్యం ఇస్తూ – నండూరి రామ్మోహనరావు, బాపు, ముళ్ళపూడి వెంకటరమణ, వీఏకే రంగారావు, రావి కొండలరావు వంటి హేమాహేమీలని సంపాదకవర్గంలోకి తీసుకుని, మొదటి సంచికనించే తారాపథంలోకి రివ్వున దూసుకుపోయారు.

ఇక మూడో స్తంభం, రచయితలు. రచయితలు అంటే ఇక్కడ రచయిత్రులు కూడాను అని అర్ధం. కథ, నవల, కవిత, వ్యాసం, సమీక్ష మొదలైనవేవి వ్రాసినా, పత్రిక విజయవంతమవటానికి ముఖ్యకారణం రచయితలు. తెలుగు సాహిత్యంలో ఎందరో మహా రచయితలు. అందరికీ వందనాలు. అలాగే ముఖచిత్రాలకీ, కథలకీ, కవితలకీ, నవలలకీ, అందమైన బొమ్మలు వేసే గొప్ప చిత్రకారులు. బాపుగారు బొమ్మ వేస్తే, ముందు బొమ్మని పట్టిపట్టి చూసి ఆనందించి, ఆ తర్వాతే కథ చదివేవారు. ఆయన తర్వాత చంద్ర, వడ్డాది పాపయ్య, చిత్ర, గంగాధర్, కరుణాకర్, బాలి, జయదేవ్... ఇలా ఎందరో గొప్ప చిత్రకారులు – చక్కటి చీర కట్టుకున్న అందమైన అమ్మాయి నుదిటి మీద ఎర్రటి బొట్టులా, పత్రికలను అలంకరించేవారు. అలంకరిస్తున్నారు.

ఇక నాలుగవ స్తంభం, అందరిలోకి ముఖ్యమైన వారు, పాఠకులు. రాజులు లేని ఈరోజుల్లో వీరే కదా మరి, పోషకులూ, మహారాజ పోషకులూ. చాలామంది పాఠకులకి ఏం కావాలో అది రంగరించి, హాస్య కథలూ, కష్టాల  కథలూ, సుఖాల కథలూ, శృంగార కథలూ, యదార్ధగాధలూ, సాహితీ వ్యాసాలు, కార్టూన్లూ, ఇలా రకరకాల రచయితలు వ్రాసినవి, చిత్రకారులు గీసినవీ అందివ్వటం అవసరం. అందుకే పాఠకుల నాడి తెలిసిన పత్రికలు మాత్రమే సాహిత్యపరంగా, వ్యాపారపరంగా విజయవంతం అవుతున్నాయి.

ఇక అమెరికాలో కూడా అచ్చు పత్రికల అవతరణ చూస్తే, మొట్టమొదటగా గుర్తుకి వచ్చేది పెమ్మరాజు వేణుగోపాలరావు ప్రప్రధమంగా నడిపిన “తెలుగు భాషా పత్రిక”. తర్వాత వంగూరి చిట్టెన్ రాజు ఆధ్వర్యంలో  “మధురవాణి”, దండమూడి రామ్మోహన్రావు ఆధ్వర్యంలో “తెలుగు అమెరికా”, కిడాంబి రఘునాధ్ ప్రారంభించిన “తెలుగుజ్యోతి” చెప్పుకోదగ్గవి. తర్వాత రెండేళ్ళ తిరునాళ్ళలో విడుదల చేసే మన నాలుగు సంఘాల జ్ఞాపికలు, తెలుగునాడి, తెలుగువాణి లాటి ఎన్నో అచ్చు పత్రికలు వచ్చాయి.

1960, 1970 దశకాల్లో, అందులో నేనూ ఒకడిని కనుక నాకు తెలుసు – మంచి సీరియల్స్ వేసే కొన్ని పత్రికలు విడుదలయే రోజున, పాఠకులు షాపుల దగ్గర లైన్లో నుంచుని పత్రికలు కొనేవారు. పత్రికలకు అంత గొప్ప ఆదరణ వుండేది ఆరోజుల్లో.  

1980, 1990 దశకాలు వచ్చేటప్పటికీ పరిస్థితులు మారిపోయాయి. 2000 సంవత్సం వచ్చాక తెలుగు పత్రికలకు, పుస్తకాలకు విలువ పూర్తిగా తగ్గిపోయింది. దానికి చాల కారణాలు వున్నాయి.

 

  1. ఢిల్లీ దాకా తెలుగుని తీసుకుని వెళ్ళాడని పేరుపొందిన ఒక ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్లో గ్రంధాలయాలకి ప్రభుత్వ ఆర్ధిక సహాయం పూర్తిగా తగ్గించి, ఎన్నో గ్రంధాలయాలని మూసివేయటానికి కారకుడయాడు. దానితో చాల  పుస్తక ప్రచురణ సంస్థలు, పత్రిక ప్రచురణ సంస్థలు మూతపడ్డాయి.

  2. తెలుగు వాళ్లకి ఇంగ్లీషు మీడియం స్కూళ్ళమీద మోజు ఎక్కువయి, ఇటు తెలుగు, అటు ఇంగ్లీష్ రెండూ కొండెక్కిన రోజులు వచ్చాయి. దానితో తెలుగు చదవటం రాక, తెలుగు భాషాభిమానం తగ్గిపోయింది.

  3. కాస్తో, కూస్తో మిగిలిన తెలుగు భాషని, తెలుగు సినిమా తెగులూ, టీవీ తెగులూ పూర్తిగా మింగేశాయి.

  4. నర్సరీ స్కూలునించీ కాలేజీ చదువుదాకా, రాజకీయనాయకుల స్వలాభంతో, ఇప్పుడు చదువుకోవటం పోయి, చదువుకొనటం వచ్చింది. దానితో ప్రొద్దున్నే ఏడు గంటలకు బస్సెక్కిన పిల్లలు, మళ్ళీ ట్యూషనూ గీషనూ పూర్తి చేసుకుని తోటకూర కాడల్లా, రాత్రి తొమ్మిది గంటలకి గూడు చేరుతున్నారు. తెలుగు భాష, తెలుగు సంస్కృతి, ఆటపాటలన్నీ అటకెక్కుతున్నాయి. ఇరవై రెండేళ్ళ దాకా అలా పెరిగిన కుర్రకారుకి, భట్టీయం వేసిన క్లాసు పుస్తకాలు తప్ప, తెలుగు సాహిత్యం కానీ, ఇంగ్లీషు సాహిత్యం కానీ చదివే అలవాటు ఎక్కడినించి వస్తుంది?

  5. తెలుగువాడు తెలుగు సినిమాకి, మనిషికి రెండు వందల రూపాయలు పెట్టి టిక్కెట్టు కొంటాడుగానీ, పది రూపాయలు పెట్టి ఓ పత్రికగానీ, వంద రూపాయలు పెట్టి ఓ పుస్తకంగానీ కొనడుగాక కొనడు.

  6. అదీకాక తెలుగువాళ్ళు ఇతర దేశాలకి వలస పోవటం బాగా ఎక్కువయిపోయింది. ఒకవేళ తెలుగు పత్రికలు చదవటం ఇష్టమయినా, పది రూపాయల పత్రిక అమెరికా, యూరప్, ఆస్ట్రేలియాలాటి దేశాలకి పోస్టులో చేరటానికి దాని ఖర్చు ఏడెనిమిది రెట్లు వుంటుంది.

 

ఈ సమయంలోనే సాంకేతిక రంగంలో విపరీతమైన అభివృద్ధి వచ్చింది. దరిమిలా అది మధ్య తరగతి ప్రజలకు కూడా, భారతదేశంతో సహా, అందుబాటులోకి వచ్చింది.

ఇదొక ఎవరూ ఊహించని పెద్ద మార్పు. అంతర్జాలం వచ్చేసింది. ఇక్కడ కూడా సాలెగూళ్ళు వచ్చేశాయి. మనకి రకరకాల రుచులతో ఏవి కావాలంటే అవి అందించటానికి సర్వర్లు వచ్చేశాయి. ఒక వూరికీ, ఇంకొక వూరికే కాక, ఎన్నో దేశాలకి క్షణాలలో, ఏ సమాచారం, ఏ రకంగా కావాలంటే ఆ రకంగా పంపించగలిగే వేగం వచ్చేసింది. శంకరాభారణంలో చెప్పినట్టు “స్పీడు… లోకమంతా స్పీడే”!

దానితో పుస్తకాలూ, పత్రికలూ ప్రపంచమంతటా, ఎక్కువ ఖర్చు లేకుండా, మరుక్షణంలో వెడుతున్నాయి.

ఈ నేపధ్యంలోనే వచ్చాయి ‘అంతర్జాల పత్రికలు’ – Internet Magazines. వీటినే ‘సాలెగూడు పత్రికలు’ – Web Magazines, లేదా ఈ-పత్రికలు అంటారు. తెలుగు రాని మరికొందరు “Online Magazines” అని ఆంగ్లంలో అంటారు.  

ఈ ఈ-పత్రికలు నిలబడటానికి కూడా నాలుగు స్తంభాలు కావాలి. పైన చెప్పిన నాలుగు స్తంభాలలో, మొదటిది తప్ప, మిగతా మూడు దాదాపు అవే. దాదాపు అని ఎందుకు అన్నానంటే, కొంచెం తేడాలు అవసరం అవుతున్నాయి మరి. చూద్దాం అవేమిటో!

పెట్టుబడి పెట్టేవారు, అచ్చు పుస్తకాలకి ఖర్చు పెట్టినంతగా, ఈ-పత్రికలకు ఖర్చు పెట్టనవసరం లేదు. ఇక్కడ కావలసింది మంచి వెబ్ సైట్, దాన్ని నడపటానికి సాంకేతిక పరిజ్జానం వున్న మనిషి. కొద్దిపాటి పెట్టుబడి. మిగతా మూడు స్తంభాలు, సంపాదకులు, రచయితలు, పాఠకులు. ఈ మూడు స్తంభాలకీ, ఇవి అచ్చు పత్రికలైనా, ఈ-పత్రికలైనా పెద్ద తేడా లేదు.   

ఇక్కడ ఇంకొక విషయం చెప్పుకోవాలి. ఈ-పత్రికలు నడుపుతున్న వారిలో అధికశాతం రచయితలూ, చిత్రకారులూ. అంటే నాలుగు స్తంభాలలో, మొదటి మూడు స్తంభాలూ రచయితలే అన్నమాట!

ఈ ఈ-పత్రికల యాజమాన్యం, సంపాదకత్వం రెండూ రచయితలే నిర్వహిస్తూ, సాటి రచయితలని ప్రోత్సహించటం చూస్తుంటే ఎంతో ముచ్చటగా వుంటుంది. మన తెలుగువాళ్ళలో ఇది ఎంతో చెప్పుకోదగ్గ విషయం కదూ!

ఇక ఈ ఈ-పత్రికలని నిలబెట్టటానికి కావలసింది పాఠకులు మాత్రమే! ఇందాక మనం చెప్పుకున్నట్టు, అచ్చు పత్రిక పది రూపాయాలే అయినా, దేశదేశాలకి ఆ పత్రిక చేరటానికి ఖర్చు ఏడెనిమిది రెట్లు. ఈ-పత్రికలకి ఆ సమస్య లేదు. ప్రపంచ వ్యాప్తంగా తెలుగువారికి, ఎక్కడపడితే అక్కడ దొరుకుతుంది. అందుకని, పత్రిక ఆకర్షణీయంగా నడపాలేగానీ, పాఠకులకు ఏమీ కొదువ వుండదు.   

ఈ-పత్రికలు నడిపేవారు కూడా, ఇది ఒక వ్యాపకంగానే నడుపుతున్నారు కానీ, వ్యాపారంలా కాదు. అందుకే ఇదొక వ్యాపకంగా రచనలు చేసే రచయితలు కూడా, తమ రచనలు నలుగురితో పంచుకోవాలనే కోరికతోనే వ్రాస్తున్నారు కానీ, ధనాపేక్షతో కాదు. ఇది అభినందనీయం.

 

ఈ సందర్భంగా - మధురవాణి అంతర్జాల పత్రిక  నిర్వాహకులకు అభినందనలు! జేజేలు!

*****

మీ అభిప్రాయాలు తెలుపుటకు క్లిక్ చేయండి...click here to post your comments...

bio

సత్యం మందపాటి

సత్యం మందపాటి: తూర్పు గోదావరి జిల్లా లోని ఆత్రేయ పురంలో పుట్టి గుంటూరులో పెరిగిన సత్యం మందపాటి గారు కాకినాడ, విశాఖపట్నం లో ఇంజనీరింగ్ లో మాస్టర్స్ డిగ్రీ పట్టభద్రులు. త్రివేండ్రంలో విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ లో పదేళ్ళు సీనియర్ ఇంజనీరింగ్ మేనేజర్ గా పనిచేశారు. ఆ నాటి యువ, జ్యోతి ల నుండి ఈ నాటి రచన,  ఆంధ్రభూమి, నవ్య, కౌముది, సుజన రంజని మొదలైన అనేక పత్రికలలో ఐదు దశాబ్దాలుగా 200 కథలు, కవితలు, వ్యాసాలు, నాటకాలు, నవలలు, పత్రికలో దీర్ఘకాలిక శీర్షికలు రచించారు. అమెరికాలో అత్యధిక సంఖ్యలో కథలు  రచించిన కథకుడు సత్యం గారే. కథా సంపుటులు, నవలలు, కవితా సంపుటి వెరసి 10 పైగా గ్రంధాలు   ప్రచురించారు. సతీమణి విమల గారితో నాలుగు దశాబ్దాలుగా ఆస్టిన్ నగర నివాసి.​

comments
bottom of page