top of page

ఆహ్వానిత మధురాలు

రిటైర్మెంట్

శ్యామలాదేవి దశిక

ఇదిగో మిమ్మల్నే! ఎన్ని సార్లు పిలవాలి......చేసినవన్నీ చల్లారిపోతున్నాయంటే వినిపించుకోరేం!
ఏమన్నా అంటే “ ఇదిగో... వచ్చేస్తున్నా... వన్ మినిట్ ” అంటారు. కానీ .... ఆ కుర్చీ లోంచి మాత్రం కదలరు.
ఏమిటీ...నిన్నా మొన్నటి  ఖర్చులు ఎందుకు ఎంటర్ చెయ్యలేదు అంటారా? 
చెయ్యి తీరుబడి లేక చెయ్యలేదు. గుర్తుంది లేండి. ముందు మీరు భోజనానికి రండి.
కిందటి నెల కంటే ఈ నెల ఖర్చు బాగా పెరిగిందా... ముందు ఆ రిసీట్లు ఇవ్వమంటారా? 
అబ్బ! నేనెక్కడికైనా పారిపోతానా? అప్పులవాళ్ళని అడిగినట్లు వెంటపడి మరీ అడుగుతున్నారు. కొత్తగా ఈ ఖర్చులు రాయడం కాదుకాని ఇదో పెద్ద గోలై పోయింది. వాటికోసం నా హ్యాండ్ బ్యాగ్ ని అలా తల్లకిందులు చెయ్యాలా? 
రోజూ ఆఫీసు నుంచి ఇంటికి రావడం ఆలస్యం, బయిటికి  వెళ్ళావా... ఏం కొన్నావ్... ఎంతయిందీ... కాష్ ఇచ్చావా... కార్డ్ ఇచ్చావా ?..అంటూ ప్రశ్నలతో తినేస్తున్నారు. ఎన్నడూ లేనిది ఉన్నట్టుండి ఆదాయం... బడ్జెట్... బిల్లులు....ఖర్చులు....పొదుపు......అంటూ మీకు అదే స్మరణ అయిపొయింది . అస్తమానం ఆ కంప్యూటర్ ముందు కూర్చుని వేసిన అంకెలే వేస్తూ కూడిన అంకెలే కూడ్డం . ఆ ఖర్చులు... నెంబర్లు ఎక్కడికీ పోవుకాని రండి మహాప్రభో! అవతల నాకు బోలెడు పనులున్నాయి.
రిసీట్లు కనిపించాయా.....ఈ నెలలో ఎక్కడ ఖర్చు ఎక్కువ పెట్టామో చూస్తున్నారా? క్షణంలో వచ్చేస్తారా ? 
మీరిలా కుర్చీకి అతుక్కుపోయి లెక్కలేసుకుంటూ మాటిమాటికి  “ వచ్చేస్తున్నా.... వన్ మినిట్ ”  అంటూ నన్ను మాయపుచ్చుతుంటే నాకు మా కోటయ్య గుర్తుకొస్తున్నాడు!
మా ఊళ్ళో కొత్తమాసు కోటయ్యకు ఇంటి ముందుసావిట్లోనే, పచారీ షాపు ఉండేది. రాత్రి కొట్టు కట్టేసిం తర్వాత  గల్లాపెట్టె ముందు కూర్చుని గుడ్డి దీపం వెలుగులో ఆ రోజు పద్దులన్నీ పుస్తకంలోకి ఎక్కించుకునేవాడు. పాపం కోటయ్య పెళ్ళాం రాజమ్మ, “ తినటానికి రావయ్యా మగడా ”  అని రెండేసి నిమిషాల కోసారి ఇంటి లోపల నుంచి పెద్దగా కేకేస్తూ ఉండేది. ఈ మానవుడు “ ఇదిగో వచ్చేత్తన్నా... ఇదిగో వచ్చేత్తన్నా”... అంటూనే పద్దులు పూర్తి అయ్యేదాకా కదిలే వాడు కాడు! ఆ తర్వాత లోపలికొచ్చి పెరట్లో ఉన్న పొట్ల పాదు కింద నిదానంగా నీళ్ళోసుకునేవాడు. ప్రతిరోజూ మొగుడు తిండి తింటానికి  ఎప్పుడొస్తాడా అని ఎదురు చూస్తూ గోడకు జారిగిలబడి కునికిపాట్లు పడుతూ ఉండేది ఆ ఇల్లాలు. 
ఇప్పుడు మన వ్యవహారం కూడా  అట్లాగే ఉంది! మీరు ఆ లెక్కలు..డొక్కలు కాసేపు పక్కన పెట్టి కిందకొస్తే,  భోంచేసి... మాల్ కెళ్ళి మనవరాళ్ళకు ఏమన్నా కొనాలి. రేపు పొద్దున్నే బయలుదేరి వెళ్ళాలి కదా?  వెళ్ళగానే నా చిట్టి తల్లులకి ఇవ్వడానికి ఏమైనా ఉండద్దూ?
ఏమిటీ... రామాయణం అంతా విని రాముడికి సీత ఏమవుతుంది అన్నట్టుందా ? ... ఖర్చులు తగ్గించాలా?
అనవసరమైన  షాపింగులకి ఫులుస్టాప్ పెట్టాలా? డొనేషన్లు... గిఫ్ట్ లు ఇక నుంచీ కట్టా?
బామ్మ నయినప్పటినుంచీ నేను భారీగా ఖర్చుపెడుతున్నానంటారా?
ఇదిగో!... నా మనవరాళ్ళ  విషయంలో బడ్జెట్టులు... కటింగులు... అంటే కుదరదు కాక కుదరదు. ముందే చెప్తున్నా! కావాలంటే మీ ఖర్చులు తగ్గించుకోండి. లేదంటే నేనూ మా అత్తయ్య రూట్ లో వెళ్ళిపోతానంతే. పిఠాపురం లో ఉండే మా మామయ్యను మేం అందరం “పిసినారి మావయ్యా” అని పిలిచేవాళ్ళం !  ఇంటి బడ్జెట్ విషయంలో మహా స్ట్రిక్ట్ గా ఉండేవాడు. చౌక చౌక అంటూ పుచ్చిపోయిన కూరలు, ముక్కిపోయిన బియ్యం తెచ్చి పడేసేవాడు. పాపం మా అత్తయ్య నానా అవస్థ  పడేది ఆయనతో!
ఆవిడకు కాఫీ అంటే ప్రాణం. తెల్లగా తెల్లారితే కాని పక్కదిగని మా మామయ్య గుర్రుపెట్టి నిద్ర పోతుంటే మా అత్తయ్య తెల్లారగట్టే లేచేది. దొడ్లో బాదం చెట్టుకింద కుంపటి వెలిగించి చిక్కటి కాఫీ చేసుకుని పొడవాటి స్టీలు గ్లాసులో పోసుకుని ముక్కాలిపీట మీద కూర్చుని నెమ్మదిగా తాగేది.  ఆ తర్వాత మొగుడు లేచే టైముకు మాములుగా నీళ్ళ కాఫీ రడీ చేసి మా మామయ్యకు ఏమాత్రం అనుమానం రాకుండా ఓ గుక్కెడు ఆయనతోపాటు తాగేది! వాళ్ళింట్లో ఓ ఏడాది పాటు చదువుకునేందుకు ఉన్ననాకు, ఈ విషయం తెలియటానికి ఆర్నెల్లు పట్టింది!  
అయినా ఇన్నాళ్ళు  ఖర్చుపెట్టింది మీరు. నేను అప్పుడు... ఇప్పుడు...  ఎప్పుడూ... జాగర్తగానే ఉన్నాను. నా పొదుపరితనం చూసి మీరు “నీకు మీ అమ్మా-నాన్న పద్మిని అని కాదు  పిసినారీ అని పెట్టాల్సింది” అని నన్ను ఒకటే ఎగతాళి చేస్తుండేవారు. అమెరికా వచ్చిన కొత్తల్లో మా ఇంట్లో అలవాటు ప్రకారం, రోజువారీ ఖర్చులు నోట్ బుక్ లో రాస్తుంటే నన్ను చూసి నవ్వేవారు. మీరు  ఆ రోజుల్లో కూడా ఏది చూస్తే అది కొనేవారు. ఏమన్నా అంటే “ఇందుకే కదా ఇంతదూరం అమెరికా వచ్చింది ” అనేవారు. వీటికి తోడు దసరా బుల్లోడిలా సరదాలకేం తక్కువలేదు. వీకెండ్ వస్తే చాలు అందరూ ఒకచోట చేరి పార్టీలు... పేకాటలు... మొదలు పెట్టేవారు. సందు దొరికితే సినిమాలకి... రెస్టారెంట్లకీ  రెడీ అయిపోయేవారు. ఓ సారి  “సర్ప్రైజ్” అంటూ నన్ను గుర్రపు పందాలకు కూడా తీసికెళ్ళారు! నేను హడలిపోయాను. అక్కడ ఉన్నంత సేపు  మొహం గంటుపెట్టుకుని కూర్చున్నాననీ… బొత్తిగా సరదాలేని మనిషినని నావంక గుర్రు గా చూసారు గుర్తుందా?!  నేను జాగ్రత్తగా దాచిన చిల్లర డబ్బులన్నీ తీసికెళ్ళి స్లాట్ మిషిన్ల కు సమర్పించేవారు! మొదటిసారి నేను ఒక్కదాన్నేఇండియా వెళ్ళాను. తిరిగి రాగానే మిగిలిన డాలర్లు మీ చేతికిస్తే, డబ్బిస్తే ఖర్చు పెట్టటం కూడా చేతకాని దాన్నని” నవ్వారు!
ఆ తర్వాత పిల్లలు... దాంతోపాటే బరువు... బాధ్యతలు పెరగటంతో మీ ఆటలు… పాటలు అన్నీ వెనక పడిపోయాయ్. కానీ టైము దొరికినప్పుడల్లా ఫ్రెండ్స్ తో టెన్నిస్ లు... గాల్ఫ్ లు ఆడేవారు. తర్వాత కొడుకులు వంక పెట్టుకుని బేస్ బాల్ ... ఫుట్ బాల్ అంటూ గేములకెళ్ళటం మొదలు పెట్టారు. ఇంక వెకేషన్లు సరేసరి. పిల్లలు ఎక్కడికంటే  అక్కడికి తీసికెళ్ళి వాళ్ళను నెత్తిమీద కెక్కించుకున్నారు.        
“మొగుడ్ని కొట్టి మొగసాలకి ఎక్కింది” అన్నట్టు ఇన్నాళ్ళు మీరు దర్జాగా  ఖర్చు చేసి ఇప్పుడు నావైపు చూస్తారేమిటీ?  ఈ మధ్యనే కదా ఫైనాన్షియల్ ప్లానర్ దగ్గిరకి కూడా వెళ్ళాం. అతను మన భవిష్యత్ కేమి డోకా లేదని చెప్పాడు. ఉన్నట్టుండి ఈ కంగార్లు... కటింగులు ఏమిటీ?
అప్పుడు హడావిడిలో కొన్ని ఖర్చులు... వివరాలు చెప్పటం మర్చి పొయ్యారా ?
అయితే ఏమిటిటా ? అందుకోసం బుర్ర ఇంతలా పాడుచేసుకోవాలా ?
నాకు తెలిసిందిలేండి! ఈ హడావిడి, ఆందోళనా అంతా మీరు త్వరలో రిటైర్ అవుతున్నారనేగా. రిటైర్ అవటం అనేది ఎప్పుడో ఒకప్పుడు చెయ్యవలసిందేగదా? అన్నింటి లాగే రిటైర్మెంట్ కూడా జీవితంలో అందరికీ ఎదురయ్యే పరిస్థితే. దానికంత వర్రీ ఎందుకు? ఎప్పటిలాగే ఇదీ  మేనేజ్ చేసుకుంటాం. 
ఆ రోజుల్లో మన జీవితాల్ని మెరుగుపరుచుకోవాలన్న ఆశతో... తపనతో అమాయకంగా ఈ దేశం వచ్చిన మనందరికీ ప్రతి విషయమూ ఓ కొత్త అనుభవమే.
ఎన్నాళ్ళు పని  చెయ్యాలీ?... ఎప్పుడు రిటైర్ అవ్వాలీ? రిటైర్ అయ్యాక ఏం చెయ్యాలీ ?... 
ఉన్నది సరిపోతుందా?... ఆరోగ్యాలు ఎలా ఉంటాయి? ... మన పిల్లలు మనల్ని చూస్తారా?  
ఒకరికి భారం కాకుండా ఉండాలంటే ఎలా ప్లాన్ చేసుకోవాలీ? అసలు ఎన్నాళ్ళుంటాము ? అన్న ఈ ప్రశ్నలకు సరైన సమాధానాలు ఎక్కడా ఉండవు. 
ఇన్నేళ్ళుగా ఆగకుండా పరిగెత్తుతున్న బండిని ఒక్కసారిగా ఆపాలంటే భయాలు. . . సందేహాలు. . . తికమకలు... సంకోచాలు ఉండటం సహజమే.    
మొట్ట మొదటిసారి ఎపార్ట్ మెంట్ తీసుకుని ఆ లీజ్ కాగితాలమీద సంతకం చేస్తున్నప్పుడు  మన చేతులు వణికాయి.
ఒకేసారి ఇద్దరు పిల్లలు పుట్టినప్పుడు అయినవాళ్ళు ఎవరూ లేకుండా వీళ్ళను  పెంచడం ఎలా అని బెంబేలెత్తి పోయాం. కొత్తగా ఇల్లు కొనుక్కున్నతర్వాత, మొదటి నెల మార్టిగేజ్ చూసినప్పుడు మన గుండెలు దడదడా కొట్టుకున్నాయి. పిల్లలు కాలేజీ చదువులకి వచ్చినప్పుడు ఇద్దరికీ కాళ్ళల్లో వణుకులొచ్చాయి.
చూస్తుండగానే కాలం చకచకా కదిలిపోయి అప్పుడే  రిటైర్మెంట్ స్టేజ్ కి వచ్చేసాం. సంపాదిస్తున్నప్పుడు సంబరాలు చేసుకున్నా ఫరవాలేదు కానీ, సంపాదన లేనప్పుడు ఖర్చుల్ని-అవసరాల్ని ఎలా సమన్వయం చేసుకోవాలీ అనేగా మీ సమస్య.
ఎందుకండీ అంత భయం? ఎనిమిది డాలర్లు చేతిలో పెట్టుకుని ఇక్కడికి వచ్చిన మీరు నలభై ఏళ్ల  పై చిలుకుగా శ్రమపడుతూ మా అందరికీ అన్నీ అమర్చారు. మీ అమ్మ-నాన్నలకు మంచి ఇల్లు ఏర్పరిచి చివరిదాకా వాళ్ళ మంచి-చెడు చూసారు. ఇద్దరు చెల్లెళ్ళకు చక్కని సంబంధాలు తెచ్చి పెళ్ళిళ్ళు చేసారు. మన అబ్బాయిలిద్దరినీ మంచి కాలేజీలకు పంపించారు. నా వాళ్లకు సాయం చేసారు. నన్ను మహరాణిలా చూసుకుంటారు. పైకి సరదాగా జల్సా గా కనిపిస్తారు కానీ... నిజానికి మీరు చాలా సమర్ధులు! 
ఇన్నేళ్ళ జీవితంలో బరువు - బాధ్యతలతో పాటు ఎన్నో సుఖాలు... ఆనందాలు... అనుభవిస్తూ వచ్చాం. ఇప్పుడు కూడా మనకు  ఉన్నదానితో తృప్తిగా ఎప్పటిలా సంతోషంగానే ఉంటాం. నన్ను నమ్మండి. పిల్లలిద్దరూ వాళ్ళ జీవితాలు వాళ్ళు గడుపుకుంటున్నారు. అన్నింటికీ మించి ఆరోగ్యంగా ఉన్నాం. ఇక మన పని అల్లా మిధునం సినిమాలో అప్పదాసు బుచ్చిలక్ష్మి లాగా ఆడుతూపాడుతూ కృష్ణా-రామా అనుకుంటూ గడిపేయటమే! ఇన్నాళ్ళు వేగంగా... వయ్యారాలు పోతూ...కిందకి పైకి ఎగురుతూ... అల్లల్లాడుతూ...  ప్రయాణం చేస్తున్న ఈ నావను అలజడి లేని తీరం వైపు తిప్పి తెరచాపను వదిలి నెమ్మదిగా పోనిద్దాం... సరేనా ?!!
ఏమిటీ... ఇప్పుడు మీ మనసు కుదుట పడిందా ? ఆకలి దంచేస్తోందా... ఇవ్వాళ వంట ఏమిటీ అంటారా ?!!!
అదీ... ఇప్పుడు అప్పదాసులా మాట్లాడుతున్నారు ! 
కాకరకాయ ఉల్లి కారం పెట్టి చేసాను. మామిడికాయ పచ్చడి... సాంబారు... అప్పడాలు... అన్నీ మీకిష్టమైనవే !!!!!!

*****

మీ అభిప్రాయాలు తెలుపుటకు క్లిక్ చేయండి...click here to post your comments...

bio

శ్యామలా దేవి దశిక

శ్యామలా దేవి దశిక  : తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం లో పుట్టి, ప్రకాశం జిల్లాలోని బాపట్ల దగ్గర ఉన్న “చెరుకూరు” అనే పల్లెటూరులో పెరిగి రాజబాహదూర్ వెంకట్రామారెడ్డి ఉమెన్స్ కాలేజ్, నారాయణగూడా , హైదరాబాద్ లో చదువుకున్న శ్యామలా దేవి గారు వివాహం తరువాత నలభై ఏళ్ల క్రితం అమెరికాలో స్థిరపడ్డారు.  “అమెరికా ఇల్లాలి ముచ్చట్లు” పేరిట తెలుగు జ్యోతి, కౌముది, సుజన రంజని మొదలైన పత్రికలో ధారావాహికలు ప్రచురించారు. కుటుంబ నేపధ్యంలో అమెరికాలో దైనందిన జీవితాలని ఆహ్లాదంగా స్పృశిస్తూ సాగే “అమెరికా ఇల్లాలి ముచ్చట్లు” రెండు సంపుటాలు గా వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారు ప్రచురించారు. శ్యామలా దేవి గారు భర్త రామకృష్ణ తో  న్యూ జెర్సీ లో నివాసం.

***

comments
bottom of page