top of page
bhuvanollasam.PNG
srinivyasavani.PNG

సంపుటి  6   సంచిక  1

Website Published &  Maintained by  Srinivas Pendyala | Mobile version is under construction. Use big screen for better experience.

మధురవాణి ప్రత్యేకం - భువనోల్లాసం

నీడల్లో నీడలు

భువనచంద్ర

ఆ ఇంట్లో వాళ్ళు ఏడుస్తున్న ఏడుపులు రోడ్డంతా వినిపిస్తున్నాయి. నిజం చెబితే ఆ వీధిలోని వాళ్లల్లో మూడువంతులమంది ఆ యింట్లోనే వున్నారు. కారణం, ఆ యింటి యజమాని చాలా ధనవంతుడు. అంతేగాదు, గొప్ప ప్రజానాయకుడు. అనేకానేక బిరుదులు, సన్మానాలు, పదవులు పొందినవాడు. ‘ఏమీ లేని స్థితి’ నించి కోటీశ్వరుడిగా ఎదిగినవాడు. (కోటీశ్వరుడు కాదూ, కోటానుకోటీశ్వరుడు అంటారు గిట్టని వాళ్ళు) మొత్తం ఆరుగురు సంతానాన్నీ అద్భుతంగా ‘సెటిల్’ చేసిన గొప్ప తండ్రి. అడక్కముందే, అన్నీ కొనిచ్చే మంచి భర్త.

ఇన్ని క్వాలిఫికేషన్లు వున్న వ్యక్తి సడన్ గా చనిపోవడం నాయకుల్ని ‘దిగ్భ్రాంతి’కి గురిచేస్తే, సామాన్య ప్రజలని ‘షాక్’కి గురి చేసింది. 

“ఇలాంటప్పుడేనోయ్ అప్పల్రాజూ,  తెలిసేది. చూడూ, అన్నీవున్నా, యీ చావు అనేది వున్నదే, అర్ధంతరంగా వచ్చి అన్నిట్నీ చేతుల్లోంచి లాగేసుకుంటుంది. దానిముందర నీ డబ్బూ, నీ పదవీ, నీ మంచితనం, నీ గొప్పతనం - ఏవీ నిలబడవనుకో! ఠక్కున వస్తుంది.. ఠపకున  ప్రాణాల్ని లాక్కుపోతుంది… బస్.. క్షణంలో బంధాలన్నీ తీరిపోతాయి” జీవితసారాన్ని అప్పల్రాజుకి బోధించాడు కనకారావు.

“అవునవును అంతే మరి!” తలకాయవూపుతూ అన్నాడు అప్పల్రాజు. అందరూ చెప్పేదానికి తల వూపడం తప్ప అప్పల్రాజు  మరేం చేయ్యలేడు. ఉద్యోగం లేని మధ్యతరగతి వాడాయె. పైనవాడ్ని కాదంటే కాలరాస్తాడు. క్రిందవాడ్ని కాదంటే ఫుట్ బాల్ లా తంతాడు. మౌనమో, అన్నిటికీ అంగీకారమో తప్ప ఇంకేం చేయగలం.

“ఈయన బ్రతికి వున్నంతకాలం తనో, తను నిలబెట్టినవాడ్నో తప్ప ఎవర్నీ గద్దెనెక్కనివ్వలా. ఈసారి ఛాన్సు మనదే”, గుసగుసగా అన్నాడు ఏకాంబరం గుర్నాధంతో. 

ఏకాంబరానికి చాలా డబ్బు, కొన్ని పొలిటికల్ కనెక్షన్లు వున్నాయి గానీ ‘పోయిన’ పెద్దమనిషితో సరితూగేంతవి కాదు. “ఏంటి మనకి దక్కే చాన్సు? వాళ్ల ఏడుపులు వింటుంటే తెలీడంలా.. సానుభూతి వోట్లు వాళ్ళింట్లోనే కురుస్తాయనీ..!” కుండ పగలగొట్టినట్టు అన్నాడు గుర్నాధం. 

“అదీ నిజమే అనుకో.. అయినా..!” చెప్పబోయి ఆగాడు ఏకాంబరం. మనసులో గుట్టు బయటపెట్టొద్దని గురూగారు చెప్పినమాట ఆ క్షణంలో అతనికి గుర్తుకు రావడం ఆశ్చర్యమే మరి.

“కన్నబిడ్డల్లాంటి ఈ ప్రజల బాగోగులు నా భుజాల మీదపెట్టి వెళ్ళిపోయావా నా దేవుడా!  వాళ్ళందరికీ నువ్వు కన్నతల్లిలాంటిదానివే. నాకేదైనా అయితే నువ్వే జాగ్రత్తగా చూసుకోవాల’ అని మాట కూడా తీసుకున్నావుగదా నా దేవుడా. ఇంత భారం నేనెక్కడ మొయ్యను. అదిగో, వాళ్లని ఒక్కసారి చూడు ఎలా దీనంగా నా వంక చూస్తున్నారో. అయ్యా, ఏకాంబరమా, నిన్నెప్పుడూ పెద్ద కొడుకులా భావించేవారు. తనకేదైనా అయితే నువ్వే నాకు తోడునీడగా ఉండి నా చేత ప్రజాసేవ చేయిస్తావని రోజుకొక్కసారైనా చెప్పేవారు. అయ్యో నాదేవుడా... చూడు... చూడు మన ఏకాంబరం ఎంతేడుస్తున్నాడో.” గట్టిగా మరోసారి శోకాలు పెట్టింది కనకసుందరి. 

“ఓసినీ తెలివితేటలు మండా’ ఆశ్చర్యపోతూనే అవాక్కయ్యాడు ఏకాంబరం.

“ముందుకాళ్ళకి బంధం వేయడమంటే ఇదే మరి..!” గుసగుసగా అన్నాడు గుర్నాధం.

“ఇదే టైము! ఆ పక్క మీ అమ్మగారు గోలుగోలున ఏడుస్తూ పార్టీసీటుకి ఆల్ రెడీ టెండరు పెట్టేసింది. మీరేమో ఎర్రిమొహం వేసుకుని ఇట్టా కూర్చుంటే ఏంలాభం? నాలుగేడుపులు గట్టిగా, తెలివిగా ఏడవకపోతే, సగం సానుభూతి మీ అమ్మ దొబ్బుకుపోతుంది” సన్నగా అన్నా కఠినంగా అన్నది కుసుమావతి. పరమపదించిన పెద్దమనిషిగారి పెద్దకోడలు. “అలాగే... అలాగే” అంటూ హాల్లోంచి శవం దగ్గరికి వచ్చాడు, కనకసుందరి పెద్ద కొడుకు.

***

“అయ్యో, పెద్దమనిషి గారు పరమపదించారని రెండు గంటల క్రితం ఫోనోచ్చింది. మీరు నిద్రపోతున్నారని చెప్పలేదు” వినయంగా మంత్రిగారితో అన్నాడు సెకట్రీ.

“అలాగా. ఇంకో రెండుగంటలపాటు నేను నిద్రలోనే వున్నాననీ, పడుకునేసరికే రాత్రి మూడుదాటిందనీ మెసేజ్ చెయ్యి.” కాఫీ కప్పు అందుకుంటూ అన్నారు 

మంత్రిగారు. 

 

“అదీ..” నసిగాడు సెకట్రీ.

“నాకు తెల్సులేవోయ్. బోలెడుసార్లు ఫోన్ చేశారంటావ్, అవునా? అక్కడున్న చిన్నా పెద్దా నాయకులందరికీ ఫోన్ చేసి చెప్పు. నేను మధ్యాహ్నానికి వస్తానని.” ఓసారి కాఫీ జుర్రి అన్నాడు మంత్రిగారు. సెకెట్రీ బయటికెళ్లాడు. మంత్రిగారు నవ్వుకున్నాడు.  “ఈ సెకెట్రీగాడు కూడా డబ్బులుదొబ్బి నాకు రికెమండ్ చేద్దామనుకుంటున్నాడు. అంత ఎర్రోడ్ని అయితే ఇన్నాళ్లు మంత్రిగా కథనెలానడుపుతా” అని మనసులో అనుకున్నాడు. 

***

శవాన్ని పూలదండలతో అలంకరించి సిద్ధం చేసేసరికి మంత్రిగారితో ఓ అరడజను మంది మంతనాలు సాగించారు. “నోట్లు” ప్రలోభం కొందరు చూపిస్తే, కొందరు కులపోళ్లు ఓట్ల ప్రతాపం చూపుతామని సన్నగా హెచ్చరికతో కూడిన వేడికోలుని సంధించారు. ఇక కనకసుందరి అయితే మంత్రిగారిని కావలించుకుని ఏడుస్తూనే, సన్నటి గొంతుతో సీటు దక్కటం తనకి ఎంత అవసరమో శోకాల మధ్య ఆయనకి వివరించింది.  మొత్తానికి సాయంత్రానికి సందడి సద్దు మణిగింది.

“సరేనమ్మా, కానీ మీ ఆయనే నిలబెట్టిన ఆ నిరీక్షణరావుని ఏంచేద్దాం. ఆయన ఎంఎల్ఏ గా ఉండగా నీకు సీటుని ఎలా ఇప్పించగలం?” చాలా సౌమ్యంగా అన్నా అందులో లేతగా ‘చికాకు’ ధ్వనిని గుర్తించింది కనకసుందరి.

“వాడి విషయం నేను చూసుకుంటా.” నమ్మకంగానూ, ధైర్యంగానూ అన్నది కనకసుందరి.

“ఏం చేస్తావూ?” మంత్రిగారి గొంతులో కుతూహలం.

“వాడు నా బిడ్డలాంటివాడు. ఒక్కమాట నేను చెబితే, వెంటనే ఏదో ఓ మిషమీద రాజీనామా చేస్తాడు.” దృఢంగా అన్నది కనకసుందరి. 

 “సరే. మీ ప్రయత్నంలో మీరు సక్సెస్ అయితే నా ప్రయత్నం నేను చేస్తాను.” లేచారు మంత్రి గారు.

***

రెండు నెలల తర్వాత ….

కనకసుందరి నిరీక్షణరావు ఖాళీచేసిన సీటులో ఏకగ్రీవంగా ఎన్నికయింది. కారణం చచ్చిపోయిన ‘పెద్దమనిషి’  ముందు జాగ్రత్తగా, స్వ, పర, ఎగస్పార్టీ వాళ్ళ వ్యవహారాలన్నీ వివరంగా డైరీ వ్రాసిపెట్టడమేగాక వారి “రాసలీ లీలల్ని’ రికార్డు చేయించి వుంచడం. ఆయన దాచిన చోటునుంచి, ఆయన మరణించిన మరుక్షణమే కనకసుందరి వాటిని ‘సంగ్రహించడం.’ 

మరో పదిహేను రోజుల్లో కనకసుందరి ఓ ‘గొప్ప’ కార్పొరేషన్ కి చైర్మన్ గా పదవీ స్వీకారం చేసింది.

***

 

“ఇంతకీ దీన్నేమందాం?” అడిగాడు మా ఫ్రెండు రంగమూర్తి. 

“కథ లాంటి నిజం, నిజంలాంటి కథ” అన్నాను నేను. 

“కథలో ట్విస్టు లేదు.. సస్పెన్స్ లేదు. ఇదేం కథ!” ముఖం చిట్లించి అన్నాడు రంగమూర్తి. 

“సస్పెన్సులు, ట్విస్టులు గొప్పవాళ్ళ రచనల్లో దొరుకుతాయి. నా కథల్లో భూతద్దం పెట్టి వెతికినా దొరకవు.” నవ్వి అన్నాను.

 “భేష్.. నీకు తెలీని కథ మరోటుంది. దాని సంగతి చెప్పమంటావా?” చిద్విలాసంగా  అన్నాడు రంగమూర్తి.

“వినడానికి సిద్ధం” కుర్చీలో నిటారుగా కూర్చుని అన్నాను.

***

“ఏడిసినట్టుంది మీ తెలివి. నిన్నటిదాకా ‘బుద్దిలేనిదానా’ అని మావగారిచేత రోజుకి వందసార్లు తిట్లు తినేది ఇవాళ కార్పొరేషన్ చైర్మన్ అయింది. రేపో ఎల్లుండో మరో ఛాన్సు దొరికితే మినిస్టరూ అవుతుంది. హు.. మీరు వున్నారు.. ఎందుకూ.. సానుభూతిని కూడా కేష్ చేసుకోలేని దద్దమ్మ” కోపంగా యీసడిస్తూ అన్నది కుసుమావతి. చిన్నగా నవ్వాడు కనకసుందరి కుమారుడైన VSP అంటే వేంకట సత్య ప్రసాద్. 

“ప్రస్తుతం ఆవిడ పదవిలో వుండటమే మనకి అన్నివిధాలా మంచిది. బాగా డబ్బొచ్చే కార్పొరేషన్ అది. అందులో ఏడాది వుంటే చాలు.  వందకోట్లు చలాగ్గా వెనకేసుకోవచ్చు. అంతేకాదు, ముఖ్యంగా మనకి కావలసింది రాజకీయం మన చేతుల్లోంచి బయటికిపోకుండా ఉండటం. మాతృభక్తితో నేను సీటు త్యజించానని జనం  అనుకోవడంవల్ల మనకి ప్లస్సే కాని  మైనస్ కాదు. 

“నువ్వు త్యజించడం ఏమిటీ? అసలు ఎలక్షన్లో నువ్వు నిలబడలేదుగా” ఆశ్చర్యంగా అంది కుసుమావతి.

“నిలబడితే త్యజించడం ఎట్లా అవుతుందీ? అందుకే ప్రచారానికి వెళ్లినప్పుడు జనంలో చెప్పాను..ఆవిడ అన్న మాటనే! మీరందరూ మొదట మా అమ్మానాన్నలకు బిడ్డలవంటివారు. ఆ తరవాతే నేను. తండ్రి పోయినా తల్లి ఉన్నది. ఆవిడ ఉన్నంతకాలం ఆవిడకూ, మీకూ సేవ చేయడం ఓ సోదరుడిగా నా ధర్మం! అని. అంతే! జనాలు నన్ను వాళ్ళ సొంత మనిషిలా చూసుకుంటున్నారు. ఇహ పదవి సంగతంటావా? కుసుమావతీ, మనంతట మనం లంచం తీసుకుంటే నేరం. ఆవిడ ద్వారా వచ్చిపడే డబ్బు తీసుకోవడం  నేరం కాదుగా. చక్కగా వచ్చే ఎలక్షన్ల వరకూ ‘ఆదిలక్ష్మివంటి అత్తగారివమ్మ’ అని  పాడుకుంటూ అత్తగారి సేవచేసుకో. ఆ తర్వాత సంగతి ఏమిటో, స్కెచ్ గీసి మరీ నీకు చూపిస్తా” చిద్విలాసంగా అన్నాడు VSP.

“ఎంతైనా మీ ఒంట్లో ప్రవహించేది రాజకీయ రక్తమేగదా!” బుగ్గమీద చిటికెవేసి అన్నది కుసుమావతి.

***

“అయిపోయిందా?” సిన్సియారుగానే  రంగమూర్తిని అడిగాను.

“నా మొహం... అసలుకథ మొదలేపెట్టలేదుగా. ఇప్పుడు చెప్పింది కుసుమావతికి VSPకి మధ్య జరిగిన సంభాషణ మాత్రమే. తరువాత ఏం జరుగుతుందో ఈ వర్తమాన కాలంలో చూడలేము” ఆగాడు రంగమూర్తి.

“అయితే టైమ్ మెషిన్లో భవిష్యకాలంలోకి పోయి చూడాలా?” నా గొంతులోని వ్యంగ్యం నాకే స్పష్టంగా వినిపించింది.

“మరి అంత వ్యంగ్యం అక్కర్లా. VSP గీసిన స్కెచ్ చూస్తే చాలు” అన్నాడు రంగమూర్తి.

***

“ఇంకో సంవత్సరంన్నర.. MLA పదవి నాది…” VSPతో అన్నాడు నిరీక్షణరావు. “అలాగే అన్నగారు. మా నాన్నగారు కూడా మిమ్మల్ని చాలా గౌరవించేవారు” వినయంగా అన్నాడు VSP.  “అవునవును మీ తోడ్పాటు నాకుంటే చాలు. చేసిన మేలు మరచిపోను, మేలుకు పదిరెట్లు మేలు చేస్తా” VSP భుజం తట్టి అన్నాడు నిరీక్షణరావు. 

“అయితే…” ఆగాడు VSP.

"నీ సందేహం నాకు అర్థమైంది. రాజకీయాలు జనాన్నిముంచడానికి. మనని మనం ముంచుకోడానికో, మునగడానికో కాదు. నీ పేరు బయటకి రానివ్వను.” మరోసారి VSP భుజం తట్టి లేచాడు నిరీక్షణరావు. 

*** 

“ఏకాంబరాన్ని దువ్వాలంటే గుర్నాథాన్ని దువ్వాలి. ఏకాంబరానికి గద్దెనెక్కాలని చచ్చేంత ఆశవుంది. మా అమ్మ వాణ్ని కొడుక్కింద జమచేసి నొక్కిపెట్టి  వుంచింది. వాడాపట్టునించి బయటపడాలంటే గుర్నాథంగాడ్ని ప్రయోగించాలి. వాడితో కాస్త నువ్వు పరిచయం పెంచుకో. తరవాత సంగతి నేను చూసుకుంటా” కుసుమావతితో అన్నాడు VSP. గుర్నాథం కుసుమావతికి దూరపు బంధువు. వరస ఏదైతేనేం. పనికావటం ముఖ్యం.

గుర్నాధం లొంగేది ఒక్క డబ్బుకి మాత్రమే. గుర్నాధం పెళ్ళాం ఓసారి గుర్నాధం తల్లితో “ఇదిగో అత్తా, నీ అధికారం నా మీద చూపీమాక. ఇప్పుడు నీ కొడుకు నా కొంగులో ఉన్నాడు. నేను కూర్చో అంటే కూర్చుంటాడు, నుంచోమంటే నుంచుంటాడు” అని వార్నింగిచ్చింది.

 

దానికి గుర్నాధం తల్లి పకపకా నవ్వి “ఓసోసి, ఎర్రిదానా, నీగ్గాదు.. రంభా ఊర్వశీ మేనకా దిగొచ్చినా ఆడు లొంగడు. జీవితంలో ఆడ్ని లొంగదీయాలన్నా, చెప్పిన మాట వినేట్టు చేయాలన్నాయీలోకంలో ఒక్కరికే సాధ్యం” అన్నది. 

“ఎవరికీ?” కుతూహలం కలిసిన బింకంతో అన్నది కోడలు.

“మహాత్మాగాంధీగారికి. అదీ, పచ్చనోట్ల కట్టల మీదుండే గాంధీగారికి.” మళ్ళా పకపకా నవ్విందావిడ. 

గుర్నాధం గురించిన ఈ కథ చుట్టాలు ప క్కాలు అందరూ విన్నదే. ఆ విషయం కుసుమావతికీ తెలుసు. 

***

 కనకసుందరి హైద్రాబాద్ లోనే వుంటుంది. వారానికోసారి వచ్చిపోతూ  వుంటుంది. అత్తగారు వచ్చినప్పుడల్లా కుసుమావతి వీర సేవలు చేస్తూ, అత్తగారిని ఆకాశానికెత్తుతోంది. కనక సుందరి లంచం పుచ్చుకోవడంలో చాలా పెద్ద చెయ్యని చాలా త్వరలోనే  పేరు తెచ్చుకుంది. VSPకి అర్థం కానిదేంటంటే ఆ డబ్బుని తల్లి ఏం చేస్తుందోనని.

***

“ఈసారి మీరు నాకోసం MLAసీటు వదిలేయాలి” సీరియస్ గా కనకసుందరితో అన్నాడు నిరీక్షణరావు.

“వదలకపోతే?” చిన్నగా నవ్వి అన్నది కనకసుందరి. 

“మీరు లంచం అడిగేప్పుడు తీసిన సంభాషణల రికార్డులు నా దగ్గర చాలా ఉన్నాయి” తలఎగిరేసి అన్నాడు నిరీక్షణరావు.

“గుడ్..! ఛానల్సుకి ఇవ్వండి.. పండగ చేసుకుంటారు. అయినా నిరీక్షణరావూ.. ఓ క్రూక్డ్ రాజకీయనాయకుడి భార్యని.  తల్లినే ముంచాలని చూసే మరో క్రూక్డ్ కొడుక్కి తల్లిని.  గుండెల్లో  విషం నింపుకొని నోట్లో తేనె పోసుకు మాట్లాడే కోడలికి అత్తని. నా జాగ్రత్తలో నేను వుండనని ఎలా అనుకున్నావూ? చేప ఏట్లో ఎగిరితే పర్లేదు. ఏమీ కాదు. బయటపడి ఎగిరితే ఎక్కడుంటుందో తెలుసా. పెనం మీదో లేక పోయ్యిలోనో” నవ్వి లేచింది కనకసుందరి. 

***

ఇదిగో రంగమూర్తి నువ్వు చూపించేది కాదు స్కెచ్చిని కాదు.. నీ వూహని” చిరాగ్గా అన్నాను నేను. 

“అవును బాబూ, జరగబోయేది ఇదే. కొడుకు తల్లిని మింగడానికీ, తల్లి కొడుకునీ, ప్రత్యర్ధినీ కూడా సంయుక్తంగా మింగడానికీ జరిగే పరమపవిత్ర కార్యక్రమంలో జరగబోయేది ఇదే.”

 

“మిస్టరీ కావాలా? ప్రొడ్యూసరు తల్లి అయితే హీరో కొడుకులాంటోడు. ఓ హీరో, అపోజిషన్ హీరోతో కలిసి, ప్రొడ్యూసర్ని ముంచింది గతం అయితే, - ప్రొడ్యూసరే ఫ్లాప్ పిక్చర్ తీసి హీరోని మింగింది ఇప్పటి మిస్టరీ.” చిద్విలాసంగా అన్నాడు రంగమూర్తి.

“అర్థం కాలేదు” నిజంగానే అన్నాను నేను. 

 

“చెప్పినా అర్థంకాదులే. గుర్నాధంగాడికి డబ్బు మీద తప్ప దేని మీదా విశ్వాసం లేదు. సెంటిమెంట్ అసలేలేదు. VSP & కుసుమావతి సంభాషణలు, VSP &  నిరీక్షణరావు సంభాషణలు, నిరీక్షణరావు & ఏకాంబరం సంభాషణలు ఎప్పటికప్పుడు కనకసుందరికి చేరిపోతున్నాయి.”

“అయితే అందరి రహస్యాలు గుర్నాథం దగ్గరుంటాయిగా?” అడిగాను.

 

“తెలివైనోడు కాయల్ని మింగుతాడే కానీ, చెట్టుని ఎత్తుకుపోయే ప్రయత్నం చెయ్యడు. ప్రస్తుతం అతను కనకసుందరి అనే చెట్టు నీడన వున్నాడు. కనకసుందరి అయిదేళ్ల పదవీకాలం ముగిసే వరకూ ఆవిడ దగ్గరే వుంటాడు. ఆ తరవాత సంగతా?  ఏ చెట్టు విరగ కాస్తుందో, ఏ చెట్టు వొట్టిపోతుందో అనేదాని మీద ఆధారపడి వుంటుంది” నవ్వాడు రంగమూర్తి.

 

నిజమేగా, ఆశ్రయమిచ్చేవారు కొందరైతే,  ఆశ్రితులుగా బతికేవారు మరికొందరు. హీరోగా వున్నంతమటుకూ యీ ఆశ్రితజనం అక్కడే వుంటారు. ఒక్కసారి ఆ హీరో జీరో అయితే ఆశ్రితులుగా మరో నీడ వెతుక్కోక తప్పదుగదా! వీళ్ళనే సినీ పరిభాషలో అంటారు నీడలో నీడలు అని. మళ్ళీ కలుద్దాం.

మీ

భువనచంద్ర

***

bottom of page