top of page
bhuvanollasam.PNG
srinivyasavani.PNG

సంపుటి  6   సంచిక  1

Website Published &  Maintained by  Srinivas Pendyala | Mobile version is under construction. Use big screen for better experience.

“దీప్తి” ముచ్చట్లు

సన్నాఫ్ సిల్వియా ( కథ )

Deepthi Pendyala, madhuravani, Deepthi Pendyala madhuravani

దీప్తి పెండ్యాల

"హే ఎమిలీ, జేసన్! ఎవరు RSVP చేసారో చూడండి! సిల్వియా పొవెల్! సిల్వియా మన షోకి వస్తుందట! తనూ మాట్లాడాలనుకుంటున్నానంటూ ప్రత్యేకంగా మనకి మెసేజ్ పెట్టింది."  ఫోన్ లోనుంచి తల పైకెత్తి, సంతోషంగా చెప్పింది నందిని.

లంచ్ టేబుల్ కి ఇటువైపున కూర్చుని, దీక్షగా రావియోలి తింటున్న ఎమిలీ ఉలిక్కిపడింది. ఏదో గొంతులో అడ్డుపడ్డట్టుగా నా వైపు చూసింది.

పక్కనే ఆరడుగుల దూరంలో కూర్చున్న నేను పెద్దగా ఆశ్చర్యపడలేదు.

ఎమిలీ స్పందన గమనించని నందిని ఇంకా ఉత్సాహంగా అంది "సిల్వియా రావడమంటే, మన షో సగం సక్సెస్ అయినట్టే. మీరు అస్సలు ఊహించలేదు కదా ఆవిడ వస్తుందని?"

"ఉహూ, అస్సలు ఊహించలేదు ఈ ఉత్పాతాన్ని" ఎమిలీ నిరుత్సాహంగా అంది.
నేను స్పందించలేదు. ఎపుడూ ఏదీ కొత్తగా ఊహించాల్సిన అవసరముండదు కొందరి విషయంలో. ప్రయత్నించినప్పటికీ వ్యర్థప్రయత్నమే అవుతూంటూంది సాధారణంగా.

మా నుంచి తాను ఆశించిన స్పందన రాకపోవటం గమనించిన నందిని కాసింత ఆశ్చర్యపోతూ అంది- "సిల్వియా లాంటి పాపులర్ టీవీ స్టార్ తనంతట తానే వస్తుందంటే ఈ ఆముదం తాగిన మొహాలేంటీ?

నేను నవ్వి నందినిని అడిగాను. -"నువ్వు ఇంతకుముందు ఎపుడూ సిల్వియాని కలవటం, మాట్లాడటం జరుగలేదు కదా?"

"లేదు" నందిని చెప్పింది. తిరిగి నన్నూ అడిగింది "నువ్వు మాట్లాడావా?" అని.

నేను ఖాళీ చేసిన లంచ్ బాక్స్ ని బ్యాగులో సర్దేసుకుంటూ చెప్పాను."నాకు తప్పలేదు కనుక, చాలాసార్లు. బహుశా పుట్టకముందునుంచీ!"

జోక్ చేస్తున్నాననుకుందేమో, నందిని నవ్వింది.

 ఎమిలీ కలుగజేసుకుంది." లేదు నందినీ, సిల్వియా పెద్ద నార్సిసిస్టిక్ వుమన్. అంతే కాదు రేసిస్ట్ కూడా. ఆవిడ రావటంవల్ల మనం అనుకున్న డైవర్సిటీ ఇన్క్లూజివ్ కార్యక్రమానికి ఏ ప్రయోజనమూ ఉండదు. అసలు ఆవిడ ఈ ఇన్క్లూజివ్ ప్రోగ్రాంకి ఎందుకు వస్తుందో అర్థం కావట్లేదు. మన కార్యక్రమం ఆవిడకి ఏ రకంగానూ ఆసక్తి ఉన్న అంశం కాదు."

ఆ మాటలు విన్నాక నందిని మరోసారి తమ ప్రోగ్రాం ఇన్విటేషన్ చూసింది. స్పష్టంగా ఉన్నాయి కార్యక్రమం ఉద్దేశ్యాలు, వివరాలు. ఇది డైవర్సిటీని ప్రమోట్ చేసే ఇన్క్లూజివ్ కార్యక్రమం.  జెండర్, రంగు, జాతి, దేశం, వయసు, భాష, సంస్కృతి ఇలా చాలా అంశాలలో మనం అవతలి వారి పరిధుల బట్టి, స్టీరియోటైపు ఆలోచనలతో అసంకల్పితంగా ఏర్పరుచుకునే అభిప్రాయాలు తోటి ఉద్యోగులపై ఏ రకమైన ప్రభావాలు చూపుతాయో, అవి ఏ రకంగా మనం మొగ్గలోనే గుర్తించి ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పరచవచ్చో, ఇలాంటి విషయాలన్నీ చర్చించేందుకు చేస్తున్న కార్యక్రమం. చాలా సంస్థల్లో ఉద్యోగులందరూ తప్పనిసరి పూర్తి చేయాల్సిన ఇన్క్లూజివ్ కోర్సుని తప్పక పూర్తి చేయటమే తప్ప, సీరియస్ గా తీసుకునేవారు తక్కువేనని గమనించాక, మరింత చర్చకి అనువుగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు.  తమ సంస్థలో పనిచేసే ఉద్యోగుల కోసం వలంటరీగా చేద్దామని ప్రయత్నించి, మంచి స్పందన రావటంతో మరి కొన్ని ఆర్గనైజేషన్లతోనూ కలిసి, మరిందరిని చేరేందుకే ఈ ప్రయత్నం. ఈ స్వచ్ఛంద కార్యక్రమానికి వచ్చేందుకు సిల్వియాకి సమయం ఉండి ఉంటుందనీ ఊహించలేదు వాళ్ళు.

ఎమిలీ కాసేపు ఆలోచించి చివరగా అంది. "ఫర్లేదు. ఆవిడకి సమయం ఉంటుందనుకోలేదు కనుక మనం ఇంతలా ఆశ్చర్యపోతున్నాము కానీ, అందరికన్నా ఈ కార్యక్రమం ఉపయోగపడేది సిల్వియా లాంటి వాళ్ళకే.  దాగని ఆవిడ జాత్యహంకారం ఇబ్బంది కలిగిస్తున్నట్టయితే, ఆవిడ చదువుకున్న హార్వర్డు వైపు చర్చని మళ్ళిస్తే సరి. అక్కడినుంచీ తన విజయాలని తలుచుకోవటం మొదలుపెడితే వేరే ప్రపంచం తెలీదావిడకి, ఏమంటావు జేసన్?" అని నా వైపు తిరిగింది.

ఎమిలీ మాటలు వింటూనే, నా పెదవులపై నవ్వు విచ్చుకుంది. "ఏమంటాను? సరిగ్గా చదివావు ఆవిడని, అని మాత్రం అంటాను. సరే, సాయంత్రం కలుద్దాము. మీరు రిప్లయ్ ఇవ్వండి ఆవిడకి". అని చెప్పి నేను బయటకి నడిచాను నా క్యూబికల్ వైపు.

వచ్చేస్తుంటే నా వెనుక ఎమిలీ, నందినితో చెబుతున్నమాటలు వినబడ్డాయి. "జేసన్ వాళ్ళ అమ్మే సిల్వియా. జేసన్ కి ఆవిడతో పడదు." అని.

నవ్వుకుని, తల విదిలించాను నేను. పడకపోవటం అంటే? బహుశా ఆవిడకి నేనంటే పడదని అనటం సరైనదేమో కదా? అనుకుంటూ నా ప్రమేయం లేకుండానే నన్ను వెన్నంటి అంటిపెట్టుకుని వుండే నా గతంలోకి వెళ్ళాను.

సిల్వియా పోవెల్ మా అమ్మ. అంతకన్నా ముందునుంచే స్కాలర్ గా, పాపులర్ టీ.వీ షో హోస్టెస్ గా ప్రపంచానికి పరిచయమున్న పేరు. ఆ పేరు ప్రతిష్టలు, వాటితో వచ్చిన గర్వం వీటన్నిటినీ మరింత పెంచేందుకే అన్నట్టు పుట్టిన నా అన్న స్టీవ్. వాడికి అన్నీ అమ్మ పోలికలే. వాళ్ళ ఎలైట్ గ్రూపులూ, ఎటికెట్లూ వీటిల్లో నేనెందుకు ఇమడలేకపోయానో నాకు ఇప్పటికీ అర్థం కాదు. నేను ప్రయత్నించలేదని కాదు. అప్రయత్నంగానే ప్రతీ ప్రయత్నమూ అమ్మని ఏదోలా ఇబ్బంది పెట్టేది. ఐదో తరగతిలో అనుకుంటా ఓ సారిలాగే ఓ పార్టీలో పరిచయమై, ప్రాణ స్నేహితుడైన  జేకబ్ ని నా పుట్టినరోజు పార్టీకి పిలవమంటే విసుక్కుంది. "నువ్వూ, నీకు తగ్గట్టే స్నేహాలూ." అని. అమ్మకి వాడు ఎందుకు నచ్చలేదో ఆ వయసులో నాకు అర్థమూ అవలేదు. జేకబ్ ఉంగరాల జుట్టు అమ్మకి నచ్చలేదని తర్వాత తెలిసింది. జేకబ్ అనే కాదు, అమ్మకి చాలా మంది నచ్చకపోయేవారు. బెట్టీ యాస నచ్చలేదనీ, మేథ్యూ స్థాయి నచ్చలేదనీ, మరో స్నేహితురాలి మతం నచ్చలేదనీ అమ్మ స్పష్టంగా చెబుతూండేది. ఏదో ఒక విసుగు రూపంలో. నచ్చని మనుషుల పేర్లు గుర్తుపెట్టుకునేందుకు ఏ మాత్రం ప్రయత్నించేది కాదు.

తర్వాత అర్థమయింది. నేను, నా స్నేహాలు, నా చదువులు అన్నీ ఆవిడ నిర్వచించుకున్న గొప్పదనాల ఆవృతంలోనే ఇమిడి ఉండాలని. అయితేనే ఒప్పుకోలుకి నోచుకుంటాయనీ.  నేను వేసుకునే డ్రెస్ అయినా, నేను తీసుకునే మేజర్ అయినా అన్నీ అమ్మ అనుకున్నట్టే జరిగాయి. స్టీవ్ కీ అలాగే. కాకపోతే ప్రతీ చిన్న విషయంలోనూ అమ్మ ప్రమేయాన్ని, నిర్ణయాన్ని వాడు ఇష్టపడేవాడు. నేను రాజీ పడేవాడిని. స్టీవ్ అమ్మకి నచ్చినట్టు ఉండేవాడు. నేనూ స్టీవ్ లా ఉండేందుకు, అమ్మని మెప్పించేందుకు గట్టిగా ప్రయత్నించేవాడిని. అమ్మ దగ్గర లేని చొరవ, చనువు, ఏదయినా చెప్పుకోగలిగే స్వాతంత్రం నాకు జేకబ్ వద్ద దొరకటంతో వాడు మాత్రం నాకు ప్రాణస్నేహితుడయాడు. జేకబ్ ఇంటికి వచ్చినపుడల్లా అమ్మ చూసే చులకన చూపుపైనా ఇద్దరమూ కలిసే జోకులు వేసుకునేవారిమి. కాలేజీ డెసిషన్స్ తెలిసాక జేకబ్ కూడా నా కాలేజీలోకి వస్తున్నాడని చెబితే అమ్మ వాడిని ఎగాదిగా చూసి -"కాలేజీకి వెళుతున్నావా అయితే? ఎలా?" అంది. అమ్మని నా కంటే బాగా తెలిసినవాడు కనుక ఆ సన్నివేశం ఏ మాత్రం ఇబ్బందిగా అనిపించలేదు.

 

ఒకసారి జేకబ్ ని అడిగాను. నీకు కోపం రాదా అని? అప్పుడు చెప్పాడు. “నాకు అలవాటే. మా నాన్న ఎప్పుడూ చెబుతూంటారు. నీ ప్రమేయం లేకుండా నీ జీవితంలోకి సూటిగా దూసుకొచ్చే చేదు మాటలు, చేతలు నిన్ను కూలబడేలా చేయగలవు. లేదా, ఎదుర్కొన్న ప్రతీసారీ నిన్ను మరింత శక్తివంతంగానూ మార్చగలవు. ఎలా మార్చుకోవాలన్నది నీ నిర్ణయమే. అని. నేను శక్తివంతుడిగా ఉండేందుకే ఇష్టపడతాను”. అని. ఆ మాటలు నాకు బాగా గుర్తుండిపోయాయి.


అమ్మ నుంచి దూరంగా కాలేజీకి వచ్చాకే నేను ఇమడగలిగే ప్రపంచం, నన్ను ఇముడ్చుకునే ప్రపంచం కనబడింది. బహుశా, ఆలోచించే స్వేచ్చ వల్ల కావచ్చు, అప్పటివరకూ ఉన్న ప్రపంచాన్నే కొత్తగా చూడటం మొదలుపెట్టాను. అలా ఎందరో నేస్తాలు నా లోకమయ్యారు. వారందరిలో ప్రత్యేకం లిలియన్. లిల్లీ పూర్వీకులు చైనా నుంచి వచ్చి స్థిరపడ్డారు. మా ఇద్దరికీ ఉద్యోగాలు వచ్చాక, నేను లిల్లీతో కలిసి ఉండాలనుకున్నాక, అమ్మకి పరిచయం చేశాను. లిల్లీని అమ్మకి పరిచయం చేసినప్పుడు అనూహ్యంగా అమ్మ విపరీతంగా సంతోషపడింది. నేను అస్సలు ఊహించని విషయం అది. ఒకానొకప్పటి తన చైనీస్ కో-హోస్ట్ ని "చాప్ స్టిక్స్" అంటూ పిలవటం ఇంకా గుర్తే కనుక, నేను అమ్మ లిల్లీని అంగీకరిస్తుంది అని కూడా ఊహించలేదు. కానీ లిల్లీ విషయంలో అమ్మ స్పందన ఆశ్చర్యపరిచింది.   నా సమక్షంలో అమ్మ కళ్ళు, నవ్వు అంత విశాలంగా మారటం ఎపుడూ చూడలేదు. నా పట్ల ఉన్న చిన్నచూపు కనబడనంత విశాలమైన కళ్ళు, పెదవుల చివర ఏ వ్యంగ్యమూ లేని అందమైన నవ్వుతో అమ్మ నా కంటికి మరింత అద్భుతంగా కనబడింది.

 ఆ తర్వాత అర్థమయింది లిల్లీ తల్లిదండ్రులు కూడా అమ్మలాగే సంపన్నులేననీ.  వాళ్ళ ప్రొడక్షన్ హౌజ్ లో ఒక షో ద్వారా వాళ్ళు అమ్మకి బాగా పరిచయమేననీ. బహుశా డబ్బుకి ఏ జాతిబేధమూ ఉండదేమో. అలా అమ్మకి తొలిసారిగా నాకు తెలీకుండానే లిల్లీ రూపంలో ఆనందం కలిగించాను. అదీ ఎక్కువ కాలం నిలువలేదు. రెండేళ్ళ తర్వాత ఈ మధ్యే లిల్లీతో బ్రేక్ అప్ అవటం, మా ఇద్దరికంటే అమ్మనే ఎక్కువ బాధించింది. 

***


"జేసన్, కాఫీ తాగుదామా?" - జేకబ్ పిలుపుతో ఆలోచనల్లోంచి బయటపడ్డాను.

మీకు చెప్పలేదు కదూ? నా ప్రాణ స్నేహితుడు జేకబ్ ఇంకా నన్ను వదల్లేదు. నా కలీగ్ రూపంలో పక్క క్యూబికల్ లోనే ఉన్నాడు. నా ఒంటరితనం నుంచే కాదు, నన్ను బాధించే ఆలోచనల్లోనించీ నన్ను బయటకి లాగుతూనే ఉన్నాడు ఇలా.
  

జేకబ్ తో పాటు కాఫీ రూం కి నడిచాను. నా భుజం మీద తడుతూ అన్నాడు- "నందిని చెప్పింది మన కొత్త గెస్ట్ గురించి. నీకు ఇంకో న్యూస్ చెప్పాలా? లిల్లీ కూడా వస్తుంది. ఇప్పుడు లిల్లీ మీ మమ్మీ తో కలిసే పని చేస్తుందట. మీ మమ్మీ సజెస్ట్ చేసి ఉంటుంది. మిమ్మల్ని కలపటానికి ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నట్టుంది. కదా?"

"హ్మ్. కావచ్చు." అన్నాను నీరసంగా. ఈ చిన్న కార్యక్రమంపై అమ్మ ఎందుకింత ఆసక్తి చూపించి ఉండవచ్చా అని ఇందాకటినుంచీ అర్థమవలేదు. ఇప్పుడు కొంచెం కొంచెంగా అర్థమవుతున్నట్టుంది.

"నన్ను ఎప్పటికీ అర్థం చేసుకోదా ఇక ?"

“నార్సిసిస్టిక్ సిల్వియా దగ్గర గుర్తింపు కోరుకోవటమే నీ పొరపాటు. ఎక్కువగా ఆలోచించకు. "ఆల్ ఎబౌట్ మీ" అనే ఆ ధోరణికి ఎక్కడో అక్కడ బ్రేక్ పడాలి. నీ జీవితాన్ని నీ చేతుల్లోకి తీసుకో. కుదరదు అని క్లియర్ గా చెప్పు." అన్నాడు జేకబ్.

"థ్యాంక్స్ డ్యూడ్. ఐ విల్ ట్రై!" అన్నాను.


 తిరిగి క్యూబ్ కి వెళుతుంటే గుర్తొచ్చింది. ఎప్పుడూ లేనిది మొన్న క్రిస్మస్ కి కూడా తన షోస్ అన్నీ క్యాన్సిల్ చేసుకుని నన్ను ఇంటికి పిలవటం. అమ్మతో క్రిస్మస్ అంటే, ఊపిరాడనివ్వని ఎలైట్ పార్టీలే గుర్తు. అందుకే తప్పించుకున్నాను. బహుశా అప్పుడూ లిల్లీని పిలిచి ఉండాలి. 

 

నందినికి ఆ సాయంత్రమే చెప్పాను, ముందు అనుకున్నట్టు మొదట కాకుండా, కార్యక్రమం ముగిసేకన్నా సరిగ్గా 30నిమిషాల ముందు మాత్రమే నా ప్రసంగం ఉండేలా చూడమని. 

***


చూస్తూనే చకచకా కార్యక్రమం రోజు రానే వచ్చింది. అమ్మ - ద లెజెండరీ సిల్వియా పొవెల్, తనతో పాటు టీ.వీ కవరేజీ కూడా తెచ్చింది. మేము తలపెట్టిన కార్యక్రమం పూర్తిగా "ఆల్ ఎబవుట్ సిల్వియా" అన్నట్టుగా మారి, కాస్త వరకూ అసలు రూపాన్ని, లక్ష్యాన్నీ కోల్పోయింది.  నేను, ఎమిలీ ఊహించిన పరిణామమే అయినప్పటికీ, వేదికపైన ఉన్న నందినికి మాత్రం ఇలా చేతులు కట్టేసినట్టవటం కొత్త కనుకేమో, ఇంతకుముందులా ఉల్లాసంగా లేదు.  

 

 మొదట్లో చీఫ్ గెస్ట్ హోదాలో మాట్లాడుతూ అమ్మ చాలా సమయస్పూర్తిగా వయస్సుమీరిన వారిపట్ల వివక్షని ఎలా అడ్డుకోవచ్చనేదీ చక్కగా చర్చించింది. అప్పుడు గమనించాను. అమ్మ మొహంపై ఆమె వయసు ముద్రిస్తున్న ముడుతలని. మేకప్ దాచేసిన సన్నటి ముడుతలని ఆవిడ మాటలు స్పష్టంగా పట్టి  చూపించాయి. అడ్మైర్ చేస్తూ చప్పట్లు కొడుతున్న చుట్టూ ఉన్నవారిని చూస్తే అసూయ కలిగింది. వాళ్ళలో నేనూ లేనందుకు. ఆ సంతోషం నాకూ అనుభవంలోకి రానందుకు.

 
లిల్లీ నన్ను చూసి స్నేహంగా నవ్వింది. బదులుగా నేనూ నవ్వాను. 
 
నేను మాట్లాడటం అయ్యేవరకూ ఎదురుచూసి, పూర్తి కార్యక్రమం అవకుండానే, అమ్మ బయల్దేరింది. బయల్దేరుతూ నన్ను పిలిచి, కెఫెటేరియాకి దారి తీసింది. ఊహించినదే కనుక అనుసరించాను. 


"క్రిస్మస్ కి ఇంటికి రాలేదు నువ్వు."నన్ను పాయింట్ చేస్తూ అంది.

కాఫీ కలిపి చేతికి ఇస్తూ "చూడు జేసన్, నీకు లిల్లీ తగిన అమ్మాయి. చాలా మంచిది. నువ్వే సరిగ్గా అర్థం చేసుకోలేకపోయి ఉండవచ్చు. మరోసారి ప్రయత్నించు. లిల్లీతో మాట్లాడాను. తనకి అభ్యంతరం లేదంది."

"అమ్మా, నీకు ముందే చెప్పానుగా? నాకు ప్రశాంతంగా ఉండాలని ఉంది. లిల్లీ చిన్న చిన్న విషయాలకే అతిగా స్పందిస్తుంది. ఎంత సర్దుకుపోయినా, హిస్టీరిక్ గా అరుస్తూ, ఫిజికల్ గా గాయపరుస్తుంది. గన్ తో షూట్ చేస్తానని బెదిరిస్తుంది. తర్వాతి రోజు ఏమీ జరుగనట్టే ప్రవర్తిస్తుంది. చూడు, చివరగా తను చేసిన గాయం. పని ఒత్తిడిలో తను ప్లాన్ చేసిన డిన్నర్ కి వెళ్ళటం ఆలస్యమైనందుకు ఇలా రియాక్టయింది. ఈ ఎబ్యూజివ్ రిలేషన్షిప్ లో ఉండటం నాకు మంచిది కాదు" అంటూ స్లీవ్ పైకి జరిపి, నా చేతిపై ఉన్న గాయాన్ని చూపాను.

"నువ్వు చాలా సెన్సిటివ్. అంతా మీ నాన్న పోలికే. నీ మొహం చూస్తే మీ నాన్నే గుర్తొస్తాడు. అతనూ ఇలాగే చిన్న చిన్నవాటికే అతిగా స్పందించేవాడు. ఒక్కసారి అమ్మాయిని అర్థం చేసుకోవటానికి ప్రయత్నించు." అధే ధోరణి అమ్మలో. అంత పెద్ద గాయం చూసాక కూడా నాపై ఏ సానుభూతి కలుగకపోవటం ఆశ్చర్యపరిచింది.

క్షణం పాటు మౌనంగా ఉండిపోయాను.  నెమ్మదిగా మళ్ళీ చెప్పాను. “అర్థం చేసుకునేందుకే ప్రయత్నించాను. లిల్లీకి థెరపీ ఇప్పించాలని ప్రయత్నించాను, కానీ, లిల్లీకి అలా గాయపరచటం, చుట్టుపక్కల వాళ్ళు విస్తుపోయి, కాప్స్ ని పిలిచేలా గొడవ చేయటం తప్పులా కూడా తోచట్లేదు."

నేను చేసిన ఈ ప్రయత్నాలన్నీ ఇంతకుముందూ అమ్మతో చెప్పాను. అన్నీ తెలిసి మళ్ళీ ఇలా!

"జేసన్, నీకు తెలీట్లేదు.  లిల్లీ తల్లిదండ్రులతో స్నేహం మరింత పెరిగి, కలిసి ఎన్నో షోస్ చేస్తున్నాము. ఇంతకు ముందుకన్నా వారితో ఎక్కువగా కలుస్తున్నాను.  మీ బ్రేకప్ తర్వాత వాళ్ళతో ఇంతకుముందులా కలుస్తున్నా కానీ, ఏదో ఇబ్బంది కలుగుతుంది నాకు."

"ఈజ్ ఇట్ ఆల్ ఎబౌట్ యూ అగెయిన్? అంటే ఇదంతా నీ గురించేనా, మామ్? " నేను నిస్సహాయంగా చూస్తూ అడిగాను. 

"చూశావా? నువ్వింతే. ఎపుడూ ఎదుటివాళ్ళని అర్థం చేసుకోవు. జడ్జ్ చేస్తూ ఉంటావు, అచ్చు మీ నాన్నలాగే. ఇదిగో ఇలాగే మొండిగా ప్రవర్తిస్తావేమో. అందుకే ఆ అమ్మాయికి అంత కోపమొస్తుంది. నిన్ను గాయపరుస్తుంది. నీతో మాట్లాడ్డం నాకే ఇంత విసుగ్గా ఉంది." అమ్మ మాట్లాడుతూనే ఉంది. నేను వింటూనే ఉన్నాను.  నా మనసుకి తెలుసు, లిల్లీ స్థానంలో మరి ఏ ఇతర సాధారణ అమ్మాయి ఉన్నా, మా బ్రేకప్ పై "ముందే తెలుసు!" అనే ఒక చిన్న వ్యాఖ్యకి మించి సమయం వెచ్చించి ఉండేది కాదని.

 

"లిల్లీ లాంటి అమ్మాయి నీకు దొరకదు" ఆఖరి అస్త్రంగా అంది.

"నాకు కావాల్సిందీ అదే. మళ్ళీ ఆ ఎబ్యూజ్ నేను భరించలేను." అనేసి నాలుక కరుచుకున్నాను. నేనేనా ఇంత కఠినంగా మాట్లాడింది? జర్మన్ ఫిలాసఫర్ చెప్పిన కోట్ గుర్తొచ్చింది -When you gaze for long into an abyss, the abyss also gazes into you! ఎంత నిజం?

 

అమ్మ మొహంలో రంగులు మారాయి. ఏదో చెప్పబోతూ ఒకసారి వాచీ చూసుకుంది. కార్యక్రమం అయిపోయి, అందరూ కాన్ఫరెన్స్ హాల్ బయటకి వచ్చే సమయం. 

 

అర్ధాంతరంగా ముగిస్తూ అంది. "నువ్వు అసలు లిల్లీకి తగవు. షి డిజర్వుడ్ బెటర్."  ఎప్పటిలాగే నాపై ఉండే నిశ్చితాభిప్రాయాన్ని చేదుగా చెప్పేసి, నా వ్యర్థతని నిర్ధారణ చేసి, తీర్పు ప్రకటించి, బయల్దేరేందుకని బ్యాగు చేతిలోకి తీసుకుని, లేచి నిల్చుంది.

 

"బై మామ్" అన్న నాతో  -"మళ్ళీ మాట్లాడుతాను నీతో!" అంటూ కళ్ళు చిట్లించి, తిరస్కారంగా చూస్తూ వెళ్ళింది. ఆ చూపు నాకు అలవాటయినదే. చిన్నచూపు. 

 

లేచి నిల్చుని నా క్యూబికల్ వైపు బయల్దేరాను. 

****

bottom of page