top of page
bhuvanollasam.PNG
srinivyasavani.PNG

సంపుటి  6   సంచిక  1

Website Published &  Maintained by  Srinivas Pendyala | Mobile version is under construction. Use big screen for better experience.

పుస్త​క పరిచయాలు

నిర్వహణ: శాయి రాచకొండ  |  శ్రీనివాస్ పెండ్యాల

sahityam@madhuravani.com

పుస్తక విశ్లేషణ

మేము ఎంపిక చేసుకున్న కొన్ని  పుస్తకాలు ఈ ‘పుస్తక పరిచయాలు’ శీర్షికలో విశ్లేషించబడతాయి.

సంక్షిప్త పుస్తక పరిచయం

పుస్తక రచయితలకి ఉచితంగా ప్రచారం కలిగించడంకోసం మరియు పాఠకులకి కొత్త పుస్తకాల అందుబాటు గురించి క్లుప్తంగా పరిచయం చేయుట కొరకు "సంక్షిప్త పుస్తక పరిచయం" శీర్షిక ఉద్ధేశ్యింపబడింది. ఈ శీర్షిక లో తమ సరికొత్త గ్రంధాలని పరిచయం చెయ్యదల్చుకున్న వారు, ప్రచురించబడ్డ కొత్త పుస్తకాల ముఖ చిత్రం (స్కాన్ చేసిన ఫ్రంట్ కవర్), రచయిత వివరాలు, పుస్తకం గురించి ఐదు వాక్యాలు మించకుండా సంక్షిప్త సమీక్ష, కొనుగోలు వివరాలు మాకు పంపగలరు.

పంపించవలసిన చిరునామా:

sahityam@madhuravani.com

సంక్షిప్త పుస్తక పరిచయం విషయాలలో అంతిమ నిర్ణయం మధురవాణి నిర్వాహకులదే. 

Nehala.PNG
ashtadiggajalu.PNG
Navvula Najarana.PNG
vyasakabandam.PNG
Prabhata veechikalu.PNG
bharatamerica.PNG
Sushupti numchi Melakuva loki

నేహల’ సాయి బ్రహ్మానందం గొర్తి గారు రాసిన ఒక చారిత్రక నవల.  నెల నెలా సాగే ఒక హ్యూస్టన్ తెలుగు వెన్నెల కార్యక్రమంలో బ్రహ్మానందం గారు చారిత్రక నవలల గురించి,  ప్రత్యేకంగా ఈ నవల గురించి మాట్లాడినప్పుడు ఒక రకంగా నా కళ్ళు తెరుచుకున్నట్లయింది.  నేను అదివరలో ఒకటో రెండో ఇలాంటి నవలలు చదివినా రచయిత పట్లగా ఎప్పుడూ ఆలోచించలేదు.  గొర్తి గారు ఆరోజున చెప్పిన విషయాలు నన్ను ఆలోచింపచేసాయి.  నేహల నవలను అమెజాన్ లో తెప్పించి చదివాను.   నేను చదవడం కొంచెం ఆలస్యమే మరి.  

తెలుగులో చారిత్రక లేక చారిత్రాత్మక నవలలు తక్కువే అయినా, తగినన్ని ఉన్నాయనే చెప్పవచ్చు.  జరిగినది జరిగినట్లుగా రాస్తే చరిత్ర అవుతుంది కాని చరిత్రాత్మక నవల కాదు.  చరిత్ర నేపధ్యంలో చేసిన కల్పన ఈ నవలలకి రూపాన్నిస్తుంది.  నేహల నవలలో గొర్తి బ్రహ్మానందం గారి ప్రయత్నం ఇదే.  

నవలకు ముందుగా వేలూరి వేంకటేశ్వరరావు గారు చెప్పిన ‘నాలుగు మాటల’లో నేహల నవలను ఒక ప్రేమకథగా చదవమని, చరిత్రకోసం కాదని పాఠకుల్ని హెచ్చరిస్తారు.  నిజమే.  గొర్తి గారు ఈ నవలని చరిత్ర కోసం రాయలేదు.  చరిత్రలో జరిగినదిగా తను Forgotten Empire అన్న పుస్తకంలో చదివిన  ఒక రెండు పేజీల ఆధారంగా అల్లిన ఒక కథ ఇది.  పుస్తకంలో విజయనగర రాజ్యంలో క్రీ. శ. 1350-1400 మధ్యలో ఒకటవ దేవరాయల ప్రస్తావనలో రాజునే తిరుగుబాటు చేసిన ఒక అమ్మాయి గురించిన ప్రస్తావననుంది.  ఆ అమ్మాయే ఈ నవలకు ప్రేరణ.  అదే కాలంలో బహమనీ సుల్తానులు, విజయనగర రాజుల మధ్యలో జరిగే సంఘర్షణలు, ఆ ఫలితంగా గుల్బర్గా చేతులు మారి సుల్తానుల ఆధీనంలోకి రావడం  - ఈ రెంటినీ జత చేస్తూ రచయిత ఊహించిన కథ ఇది.  కౌముది అంతర్జాల మాసపత్రికలో ఈ నవల  ఒక శీర్షికగా వచ్చింది.  

రచయిత ఎంచుకున్న నేహల పేరు చాలా అందమైనది.  ప్రష్యన్ భాషలో చిన్న మొక్క/మొలక అని, అరబిక్ లో భగవంతుడిచ్చిన ప్రసాదం (gift of God) అని అర్థం.  

నేహల ముద్గల్ గ్రామంలో సాధారణ వ్యవసాయ కుటుంబంలో పుట్టి పెరుగుతున్న ఒక అందమైన, చదువుకున్న, సంగీత నాట్యాలలో ప్రావీణ్యం కలిగివుండి, స్వతంత్ర భావాలతో ఆత్మ స్థైర్యం కలిగివున్న పద్ధెనిమిదేళ్ళ యువతి. ఆమె అందమే ఆమెకు శతృవవుతుంది.  ఆమె గురువుగారి దగ్గరే శిష్యరికం చేస్తున్న రేవన్నని ప్రేమిస్తుంది.  గురువైన వేదరాయ శర్మంటే విజయనగర రాజైన దేవరాయలకు గౌరవం.  నేహలను దేవరాయల పట్టమహిషి చేయాలన్న వేదరాయశర్మ ఆలోచన ఈ కథను నడిపిస్తుంది.  ఎంతో ధైర్యంతో రాజుని తిరస్కరించినా, రాయచూరుపై కన్ను వేసిన బహమనీ సుల్తాను ఫిరోజ్ షా కి లొంగిపోవాల్సి రావడం, చివరికి ఆమె ఆత్మాహుతి చేసుకోవడం, కట్టె, కొట్టె, తెచ్చె అని కథను చెప్పినట్లు.  

నిస్సందేహంగా రచయిత మంచి కథకులు.  రాజకీయ కుతంత్రాలు, మనుషుల మధ్య ప్రేమానురాగాలు, సంక్లిష్టమైన పరిస్థితులు తనదైన శైలిలో వివరిస్తూ పాఠకుల్ని కదలనీయకుండా చదివిస్తారు.  చదువరికి 1350 – 1400 ప్రాంతంలోని సంఘటనలు, అలనాటి సాంఘిక రాజకీయ వాతావరణం మనకు కనిపిస్తూనే వుంటాయి.  ఆ కాలంలో జరిగిన సంఘటనలను ఏవిధంగానూ మార్పు చేసి కేవలం పాఠకుల్ని చదివించడం కోసం నవలకు ఉపయోగించుకున్నట్లు అనిపించలేదు.  ఆయనకు ఆ అవసరం లేదు కూడా.  అది చరిత్రకు రచయిత ఇచ్చిన గౌరవం.  ఎంతో ధైర్యముంటే కాని రాచరికాన్ని కూడా ధిక్కరించి తన స్వతంత్రాన్ని ప్రకటించగలిగే స్త్రీలు ఆరోజుల్లో అరుదు.  నేహల అలాంటి స్త్రీ.  అయితే స్త్రీని ఒక విలాసవస్తువుగా మాత్రమే చూడగలిగే రాచరికాలు, ధనాన్ని, భోగాన్ని తిరస్కరించగలగడం తెలియని సంఘంలో పెరిగిన నేహల ఎంత నలిగిపోయిందో, ఎలా బలి అయిపోయిందో చాలా స్పష్టంగా చూపించారు రచయిత.  నవలలో ఎన్నో పాత్రలను సృష్టించారు.  కొన్ని పాత్రలు నిజమైనవి, కొన్ని కల్పనలు.  రెండు రకాల పాత్రలనూ చరిత్ర తెలిసిన పాఠకుడికి కూడా తేడా తెలియనట్లుగా అధ్బుతంగా మలచిన గొప్పదనం రచయితది.  కథ మొత్తం గుల్బర్గా, ముద్గల్, విజయనగరం, రాయచూరు మధ్యలో జరుగుతుంది.  రచయిత ఈ ప్రదేశాలను ఆసరాగా తీసుకొని కథ అల్లిన విధానం బాగుంది.

 

పుస్తకం ముందర్లో ఇచ్చిన మాప్ చాలా ఉపయోగం.  అయితే రంగులతో ముద్రించి ఇంకొంచెం స్పష్టంగా వుంటే బాగుండుననిపించింది.  కొన్ని సినిమాలలో లాగా ఇంటర్వల్  వరకూ సజావుగా సాఫీగా నడుస్తూ సాగి ఒక్కసారి రెండో భాగంలో వూపందుకుని పరిగెత్తినట్లు నవలలో కూడా సుమారు సగం వరకు కొంచెం మెల్లగా సాగి, తర్వాత వడివడిగా సాగిపోయి, చివరలో ఈ నవలని ఎలా పూర్తిచేయ్యాలా అని అవసర పడ్డారా రచయిత అని అనిపించింది.  ప్రతి అధ్యాయం చివరలో జరగబోయే సంఘటనలను పాఠకులకు ఒక సూచనగా ఇవ్వడం జరిగింది.  సీరియల్ గా ప్రతినెలా వస్తున్నప్పుడు అలాంటి సూచన తరువాత వచ్చే సంచికలో ఏమి జరగబోతోందో అనే ఉత్సుకత కలిగించే అవసరముండి ఉండవచ్చు.  పుస్తకరూపంలోని ఈ నవలకు అక్కరలేదేమో అనిపించింది.  ఒకటో రెండో చిన్న అచ్చు తప్పులు ఎక్కడో కనిపించినా, చదవడానికి ఎలాంటి ఇబ్బంది కలగలేదు.  

చరిత్ర తెలిసిన వారూ, తెలియని వారూ కూడా చదవదగిన పుస్తకం.  

పుస్తకాన్ని 2018లోనూ, మళ్ళీ 2019లోనూ ప్రచురించారు.  అంటే పుస్తకానికి పాఠకుల దగ్గర నుంచి అనుకూలంగా వచ్చిన స్పందనకి రుజువు.  అన్ని పుస్తక విక్రేతలదగ్గరా, అమెజాన్ లోనూ, దొరికే ఈ పుస్తకం ఖరీదు భారత దేశంలో  రూ. 250, బయట $10.  కినిగేలో కూడా ఈ పుస్తకం దొరుకుతుంది.  

*** 

 

హాస్య రచనలు చదవడం సులభం కానీ, అయితే హాస్య రచనలు చేయడం మాత్రం సులభం కాదు.  హాస్యం పుట్టించడం ఒక కళ.  తాను నవ్వుకోవడం వేరు, ఇతరులను నవ్వించడం వేరు.  సమాజంలో ఆర్ధిక స్తోమత పెరుగుతున్నకొద్దీ సాహిత్యం కూడా సీరియస్ రీడర్షిప్ నుంచి హాస్య రసాస్వాదనకు కొంచెం దారి మళ్ళడం తప్పనిసరి.  అలాగని అదివరలో హాస్యం లేదా అని కాదు.  జీవితంలోని కష్టాలలోంచి హాస్యాన్ని అందించలేదూ, ముళ్ళపూడి?  

అయితే ఏదో పోటీ పడినట్లుగా రెండు పుస్తకాలు కనబడ్డాయి కొద్ది రోజుల క్రితం.  రెండూ 2019 చివరలో వెలువరించినవే.  నవంబరులో వచ్చింది హాస్య ప్రియ పబ్లికేషన్సు వారి ‘అష్ట దిగ్గజాలంటే ఆరు’. ఆ వెంటనే డిసెంబరులో వచ్చింది  జెవి పబ్లికేషన్సు (జ్యోతి వలబోజు) వారి  ‘నవ్వుల నజరానా’.  రెండు పుస్తకాల సైజులూ ఒకటే.  రెండు పుస్తకాలకీ ముఖచిత్రాలు గీసిన ఆర్టిస్టు సరసి గారే.  అంతే కాదు, రెండు పుస్తకాల్లోనూ, పొత్తూరి విజయలక్ష్మి గారి ముందుమాటలే!   తప్పకుండా, ఒకరితో ఒకరు కూడబల్కుకుని పాఠకులపై హాస్యపు జల్లులు కురిపించాలనే ఆకాంక్షతో రెండు రకాల ప్రయోగాలతో ప్రచురించిన పుస్తకాలు అన్నట్లున్నాయి.  రెండు పుస్తకాలూ, ఇద్దరు స్త్రీల స్ఫూర్తితో వచ్చినవే.     

అష్టదిగ్గజాలంటే ఆరు’ నిజంగా ఆరు దిగ్గజాల్లాంటి హాస్య రచయితల కలాల నుండి వెలువడిన రచనలతో కూర్చిన పుస్తకం ఇది.  అన్నీ ఫేస్ బుక్ లో ఎవరికి వారు చేసుకున్న పోస్ట్ లు ఎక్కడున్నాయో కూడా తెలియకుండా అయిపోకుండా, ఒక చోటకు చేర్చి పుస్తకరూపాన్నిచ్చి మన ముందుంచారు హాస్యప్రియ పబ్లికేషన్స్ వారు, అంటే తన ‘ఊపిరిగా’, ‘ప్రాణంగా’, తెలుగులో హాస్యాన్ని పండిస్తూన్న పొత్తూరి విజయలక్ష్మి గారు.  ఆవిడ మాటల్లోనే చెప్పాలంటే, “ఫేస్ బుక్, కంప్యూటర్ కి దూరంగా వున్న సాహిత్యాభిమానులకు పుస్తక రూపంలో చదువుకుంటూ తృప్తి పొందే పాఠకుల కోసం” అన్నమాట.  

ఆవిడ ఆశించినట్లుగా ఈ పుస్తకం ఎవరు చదివినా నిరాశ కలిగించదు.  సరికదా, ప్రతి రచయిత చేసిన ప్రయోగంలోనూ మంచి హాస్యం అనుభవించగలుగుతారు.  ప్రతీ దిగ్గజాన్నీ, మరో దిగ్గజం పరిచయం చెయ్యడం, ఆ చేసిన విధానం నాకు నచ్చింది.  సింపుల్ అండ్ స్వీట్ అన్నమాట – పరిచయం చేస్తున్న రచయిత పంథాలో.  

పొత్తూరి విజయలక్ష్మి గారి టపాసుల గురించి చెప్పనక్కరలేదు.  బ్లాక్ అండ్ వ్హైట్ రైస్ కావచ్చు, మనవరాలి తెలుగు కావచ్చు, ఒక వ్యక్తి రాయమని అడిగిన జీవిత చరిత్ర కావచ్చు.  జీవితానికి అతి దగ్గరగా, సున్నితంగా మనసుల్ని తాకే హాస్యం.  నవ్వుకోకుండా వుండలేము.  

సరే, ఆవిడ చెయ్యి తిరిగిన రచయిత్రి.  మరి మిగిలినవారో? కొచ్చెర్లకోట జగదీషు గురించి మొదటిసారిగా ఏడవ ప్రపంచ తెలుగు సాహితీ సభలలో పరిచయమయింది.  మా విజయనగరం వాడు.  అతని ఫేస్బుక్కో, బ్లాగో నేనెప్పుడూ చూడలేదు.  మాటలతో గారడీ చేయడం అతనికి సహజంగా వచ్చిన విద్య.  అధరాపురపు మురళీకృష్ణ గారు చెప్పినట్లుగా ‘కలంతో గ’మ్మత్తు’ జల్లే ‘ జగదీశుడే ఇతను.  ‘భావుకత, హాస్యం, రెండు చేతులతో రాయగల సవ్యసాచి’ ఇతను నిస్సందేహంగా.  డాక్టరుగా తన వృత్తిలో చూసిన సందర్భాలు, నర్సులు, పేషెంట్లు, బొంకుల దిబ్బ మీద చేదు దోసకాయాల్ని కూడా చాకచక్యంతో అమ్మేసే కూరగాయలమ్మే మామ్మ, పెంచుకున్న గెడ్డం – ఒకటి కాదు, అన్నింటిలోంచీ వెలికి తీయగల సునిశిత హాస్యం, మాటల చతురత, జగదీశుడి సొత్తు.  

ఒక పాత్రను సృష్టించి, ఆ పాత్ర చుట్టూ నవ్వించే కథలల్లిన మురళీకృష్ణ గారు, పెళ్ళిళ్ళు, చీరల లాంటి ఇంటింటి కథలను అతి సహజంగా చెప్పగలిగే డా. సోమరాజు సుశీల గారు (ఆవిడ లేరిప్పుడు), ‘ఈ పూట కబుర్లు ఆ పూటే చెప్పే కంభంపాటి రవీంద్ర గారు, ‘అందమా, అందుమా’ అంటూ చక్కిలిగింతలు పెట్టించే హాస్యాన్ని కురిపించిన చందు శైలజ గారు – అందరూ దిగ్గజాలే.   

ఆరుగురిలో ముగ్గురు వృత్తి రీత్యా వైద్యులవడం కాకతాళీయం కాదేమో.  చదువుతున్నంతసేపూ, హాయిగా, నవ్వుతూ, మిగతా ప్రపంచాన్ని మరచి పోయేలా చేయగలిగే రచనలు.  పుస్తకాన్ని మిస్ అవకండి.  మిస్ అయితే మీరేమి కోల్పోయారో మీకే తెలీకుండా అయిపోతుంది.  అన్నీ ప్రముఖ పుస్తక విక్రేతల దగ్గరా దొరికే ఈ పుస్తకం ఖరీదు – నేను చెప్పను -  నిజంగానే ఎంతైనా ఇచ్చి - బ్లాక్ లోనైనా - కొనుక్కుని చదవండి.  

***

నవ్వుల నజరానా’ ఇంకో ప్రయోగం.  జ్యోతి వల్లబోజు గారి సిన్సియర్ ప్రయత్నం.  26 మండి రచయితల కథా సంకలనం.  వంగూరి చిట్టెంరాజు గారి రచన ‘అమెరికా వాహన యోగం’ ఒక్కటే 1986లో చేసిన రచన.  మిగతా వన్నీ కొత్తగా రాసినవే.  అన్నీ చిన్న చిన్న కథలు.  2 – 3 పేజీలకు మించనివి.  గబ గబా చదివేసి నవ్వేసుకుని ఇంకో కథకు వెళ్ళిపోవచ్చు.  

జ్యోతి గారు ఇంతమందిని పురమాయించి, కథలు రాయించి, హాస్యానికి ఒక చోటు చూపించాలనే ఆవిడ తాపత్రయం తప్పకుండా మెచ్చుకోతగ్గది.  చాలా మంది రచయితలు/రచయిత్రులు నాకు పరిచయం లేదు.  కొంత మంది లబ్ధ ప్రతిష్టులూ, లేకపోలేదు.  ఇరవై ఆరు మందిలో, సుమారు ఇరవైమంది రచయిత్రులుండడం గమనించ దగ్గ విషయం.  

ఎవరైనా, ఇంకో నెల రోజుల్లో మంచి హాస్య కథ రాసి పంపండని అడిగితే ఏ రచయితకయినా కష్టమే.  ఆలోచనా స్వాతంత్ర్యం తగ్గుతుంది.  అందుకే చాలా కథలు నా మట్టుకు సహజంగా లేవు.  హాస్యాన్ని తెచ్చి పెట్టుకున్నట్లుంది.  రాజు గారి కథతో సహా.  చిట్టెన్ రాజు గారి హాస్య రచనల గురించి చెప్పనక్కరలేదు.  ఎన్ని వందల కథలో రాశారు.  అయితే ఈ సంకలనానికి ఇంతకంటే మంచి కథే ఎన్నుకుని వుంటే బాగుండి వుండేదని అనిపించింది.  అన్ని కథలూ బాగాలేవని కాదు.  కానీ, అనుకున్న స్థాయికంటే తక్కువగా వున్నాయని చెప్పవచ్చు.   

అన్ని పుస్తక విక్రేతల దగ్గరా దొరికే ఈ పుస్తకం ఖరీదు రూ. 100.  జె.వి. పబ్లికేషన్సు, హైదరాబాదు వారి ప్రచురణ ఇది.  

***

తెన్నేటి సుధ వ్యాస కదంబం వంశీ కల్చరల్ అండ్ ఏడుకేషనల్ ట్రస్ట్ వారు ప్రచురించిన డా. తెన్నేటి సుధాదేవి గారు వ్యాస సంపుటి.   సుధాదేవి గారు తెలుగు అకాడమి పూర్వ ఉపసంచాలకులు మరియు ఎన్నో సమాజ సేవలందిస్తూన్న వంశీ వ్యవస్థాపకులు, కళాబ్రహ్మ, శిరోమణి డా. వంశీ రామరాజు గారితో చేదోడు వాదోడుగా పనిచేస్తూన్న వారి సతీమణి.  సుధాదేవి గారు ఆమె రాసిన ఎన్నో పుస్తకాల ద్వారా సాహితీ ప్రపంచానికి చిరపరిచితురాలే. 

ఈ పుస్తకంలో సుధాదేవి గారు రాసిన 17 వ్యాసాలున్నాయి.  వ్యాసాల గురించి రాస్తూ, అంపశయ్య నవీన్ గారు ‘ఈ సంపుటిలోని వ్యాసాలన్నీ సమగ్రంగా, సహేతుకంగా, సవివరంగా రూపొందాయి....ఈ వ్యాసాల్లో సుధకున్న పరిశోధనా దృష్టి స్పష్టంగా కనిపిస్తుంది’ – ఆమె వ్యక్తీకరించిన అభిప్రాయాలతో పాఠకులు ఏకీభవించినా ఏకీభవించకపోయినా - అంటారు.  

వ్యాసాలు ఆమె తల్లి తండ్రి గార్లతో మొదలై పి.వి. నరసింహారావు, ఆది శంకరాచార్యులు, శ్రీ శ్రీ, బలిజేపల్లి లక్ష్మీ కాంత కవి, ఇలాంటి ప్రముఖమైన వ్యక్తుల గురించి, ఉగాది, జాతీయోద్యమ సాహిత్యం, వెలుగు చూడని మహిళా రిజర్వేషన్ బిల్లు, ఇలా ప్రస్తుత సమాజానికి సంబంధించిన వ్యాసాలు ఉన్నాయి.  తల్లి, తండ్రి పైన, వివిధ ప్రముఖ వ్యక్తుల పైనా, రచయితల పైనా ఆమెకున్న అపారమైన గౌరవం వివిధ వ్యాసాల్లో విదితమౌతుంది.  వ్యాసాల్లో సుధాదేవి గారు చెప్పిన కొన్ని విషయాలు ఏడుకేటివ్ గా ఉన్నాయి.  

నవోదయా బుక్ హౌస్ లో దొరికే ఈ పుస్తకం వెల రూ. 150 మాత్రమే.  వంశీ కల్చరల్ ఎండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ వారి ప్రచురణ ఇది.  

***

 

ప్రభాత వీచికలు  - ఇది డా. దూర్వాసుల మూర్తి గారి సాహితీ సమాహారం.  

మూర్తి గారు అరవై ఏళ్ళ క్రితం ఆస్ట్రేలియా దేశానికి ఒక విద్యార్థిగా వలస వెళ్ళి అక్కడే స్థిరపడిన మొదటి వ్యక్తి.  మూర్తి గారి గురించి చెబుతూ, కొంచాడ మల్లికేశ్వరరావు గారు “సాహిత్యంలో అంత పరిచయం లేదు అంటూనే ఒక పత్రికను స్థాపించి వరుసగా 17 సంవత్సరాలు బాధ్యతగా నడిపించి, అంతర్జాలం అనే మాటే లేని ఆ రోజుల అవిశ్రాంత ప్రయాణంలో అందుబాటులోనున్న పుస్తకాలను ఔపోసన పట్టి, తెలుగు భాష, సంస్కృతికి సంబంధించిన పరిశోధనాత్మకమైన అన్నో వ్యాసాలు, కథానికలు మనకు అందించారు డా. మూర్తి గారు” అంటారు. ఆ మాటలు అక్షరాలా నిజం.

   

1994 లో మూర్తి గారు సంపాదకీయం చేపట్టిన పత్రిక పేరు ‘వాహిని’.   తరువాత ‘తెలుగు వాణి’ రేడియో ప్రసారాలు ప్రారంభమైనప్పుడు వివిధ అంశాలపై మాట్లాడవలసిన అవసరం కలిగిందాని చెబుతారు.  మూర్తి గారు యువతకు తెలుగు భాష సంస్కృతుల గురించి చెప్పాలనే ఆశయంతో వివిధ అంశాలను ఎన్నుకొని శ్రావణ రూపంలో ప్రసారం చేసారు.  ఆ వ్యాసాలలో కొన్ని ‘కదంబమాల’ గా ప్రచురితమయ్యాయి.   మిగిలిన వ్యాసాలు ప్రస్తుత పుస్తకరూపం దాల్చినయ్యి.  

ఈ పుస్తకంలో ముప్ఫై వ్యాసాలున్నాయి.  వ్యాసాలు ఏ ఒక్క తరహాకు సంబంధించినవని చెప్పలేము.  సృష్టి, హిందూ మతం, బౌద్ధమతం, హిందూ దేవాలయాలు, జ్యోతిర్లింగాలు, ఇలా మత, సంస్కృతికి సంబంధమైన వ్యాసాలు,  ఆంధ్రుల చరిత్ర, అక్బరు – మొగలాయీ వైభవం, కోహినూర్ వజ్రం చరిత్ర, మౌర్య వంశం - అశోకుడు, ఇలాంటి చారిత్రక వ్యాసాలు, తెలుగు సాహిత్య చరిత్ర, తెలుగు పద్యాలు, ఛార్లెస్ ఫిలిప్ బ్రౌన్ (సి.పి. బ్రౌన్ అన్నమాట), గురజాడ వెంకట అప్పారావు, జానపద కళారూపాలు లాంటి సాహితీ వ్యాసాలు, రూపాయి చరిత్ర, నోబెల్ బహుమతులు, నిఘంటువులు, ఇలా general knowledge కి సంబంధించిన వ్యాసాలతో మూర్తి గారు పాఠకులకు తెలియని విషయాలేన్నో చెబుతారు.  ఇంత విస్తృతమైన అంశాలను ఆస్ట్రేలియా తెలుగు యువతకు అందివ్వాలనే మూర్తి గారి ఆశయం ఎంతో ఆదర్శపూర్వకమైనది.  

సాంప్రదాయక విషయాలు చర్చించే వ్యాసాలు కూడా విజ్నాన శాస్త్రం చెప్పిన పాఠాల్ని ఖండిస్తూ ఛాందస భావాలు వెల్లడించేవి కావు.  ఉదాహరణకు ‘సృష్టి’ అన్న వ్యాసంలో సృష్టి ఎలా ప్రారంభమైందీ అన్న ప్రశ్నకు సమాధానంగా, సైన్సు ఏమి చెప్పింది, పురాణాలు ఏమన్నాయి అని విడివిడిగా చెబుతూ, అందులో చివరగా బ్రహ్మ, విష్ణువు, శివుడు కలిసి మాట్లాడుకున్నట్లు ఒక చిన్న నాటిక (కొంచెం హాస్యపూరితంగా) ఉంటాయి.  

ప్రతి వ్యాసం ఎంతో శ్రమకోర్చి విషయ సేకరణ చేసి కూర్చిన విశేషాలే ఈ వ్యాసాలు.  ఆశయం గొప్పదైనప్పుడు, తగినంత శ్రమ జోడించినప్పుడు, ఫలితం కూడా అంత గొప్పగానూ ఉంటుంది.  ఆస్ట్రేలియా తెలుగు వాసులకు మూర్తి గారి లాంటి మార్గ దర్శకులుండడం వారి అదృష్టం.  

ప్రభాత వీచికలు వంగూరి వారి 90వ ప్రచురణ.  పుస్తకం ధర రూ. 100 మాత్రమే.  పుస్తకం నవోదయా బుక్ హౌస్, జె.వి  పబ్లికేషన్సు వారి దగ్గరా, వంగూరి ఫౌండేషన్ ఆఫ్ ఇండియా హైదరాబాదు వారి దగ్గరా దొరుకుతాయి.  

 

***

భారతమెరికా’ ఒక సహృదయుడైన భారతీయ పాత్రికేయుడు, సాహిత్యాభిలాషి తన తొలిసారి అమెరికా అనుభవాలను, భారత దేశ చరిత్ర, తెలుగు సాంస్కృతిక వారసత్వం, తన రచనా స్ఫూర్తి లాంటి అతి ముఖ్యమయిన విషయాలతో కూర్చి తయారు చేసిన పుస్తకం. 

రచయిత భగీరథ గారు.  ఈ పుస్తకం ఎందుకు అనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ, “ఘనమైన చరిత్ర కల తెలుగు వారు ఆత్మ విమర్శ చేసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.  అందుకే ఈ ‘భారతమెరికా’” అంటారు.  

2014 అక్టోబరు 25, 26 తేదీలలో అమెరికాలోని హ్యూస్టన్ నగరంలో జరిగిన తొమ్మిదవ అమెరికా సాహితీ సదస్సుకు వంగూరి చిట్టెన్ రాజు గారి ఆహ్వానాన్ని అంగీకరించి భగీరథ గారు అమెరికా వచ్చారు.  మధ్య యుగాల నాటి దక్షిణ భారతదేశ చరిత్ర అనే విషయాన్ని సభకు విచ్చేసిన అతిథులతో పంచుకున్నారు.  

తనకు వీసా రావడం నుంచి తను తిరిగి వెళ్ళే వరకు ప్రతి విషయాన్ని పూస గుచ్చినట్లు పుస్తకంలో వివరించారు భగీరథ గారు.  తనకు ఆతిథ్యం ఇచ్చిన మిత్రులు, తోటి ప్రసంగీకులు, తనతో భారత దేశం నుండి వచ్చిన ప్రముఖులు, ఇలా ప్రతివారితో తన అనుభవాలను ఎంతో ఆప్యాయంగా వివరించి చెప్పారు.  భగీరథగారు మనుషుల మనిషి (people’s man). ఆతిథ్యం ఇవ్వడం ఒక ఎత్తైతే అందులో ఆప్యాయతను చూడటం, గుర్తుంచుకొని తన కృతజ్నతను వ్యక్తీకరించడం, ఇంకో ఎత్తు.  ఇప్పటికీ అప్పుడప్పుడు ఆప్యాయంగా పలకరించే భగీరథ గారి గొప్పదనం అదే.   

ఎక్కువమంది మాట్లాడే అవకాశమున్న సభలలో కేటాయించే సమయం తక్కువే వుంటుంది.  అదే జరిగింది భగీరథ గారి విషయంలో కూడా. అందుకే ఆయన ఈ పుస్తకంలో తను మాట్లాడడానికి ఎంచుకున్న విషయాన్ని ఈ పుస్తకంలో వివరించారు.  తన సాహిత్యానికి స్ఫూర్తి ఎక్కడనుంచి వచ్చింది, ఎలా వచ్చింది, తెలుగు జాతికున్న సాంస్కృతిక వారసత్వం లాంటి విషయాలను ఈ పుస్తకంలో చేర్చడం జరిగింది.  బహుసా ఈ విషయాలన్నిటి గురించీ తన మనోభావాలను అమెరికా తెలుగు వారితో పంచుకోవాలనుకుని అనుకొని వుండవచ్చు, ఆ కోరిక పూర్తిగా తీరి ఉండకపోవచ్చు.  2014 లో తను పూర్తిచేయలేనిది లేక మిగిలిపోయిన తన ఆకాంక్ష ఈ పుస్తకం ద్వారా భర్తీ చేసుకున్నారేమో భగీరథ గారు.  

ఒక పరిశోధనాత్మక పుస్తకంగా చెప్పబడిన ఈ పుస్తకం ఖరీదు రూ. 350.00 (అమెరికాలో $10.00).  నవోదయా హైదరాబాదులో దొరికే ఈ పుస్తకం శైలి అండ్ శైలి హైదరాబాదు వారు ప్రచురించారు.

***

 

*సుషుప్తినుంచి - ఒక మెలకువ లోకి* - సమీక్ష: *రవీంద్రసూరి నామాల*రచయిత , సినీ డైరెక్టర్ +919848321079 ravindrasoori@gmail.com
 

ఒక పుస్తకం చూడగానే ముందుగా ఆకర్షించేది ముఖ చిత్రం అయితే లోపల ఏముందో చూడాలని ఆసక్తి కలిగించేది ఆ పుస్తకాని పెట్టిన పేరు. ఈ రెండు చూసాక కూడా పుస్తకం లోపలికి  వెళ్ధామంటే ఇంకా దేని కోసమో వెతుకుతుంటాయి కళ్ళు ..

‘సుషుప్తినుంచి’ అనే పేరు చూడగానే ఒల్లెరుగని నిద్ర నుండా లేక నిద్రాణమైన సమాజం నుండా అనే సందేహం కలగకమానదు కానీ, పుస్తకం చదివితే ఈ రెండూ కాకుండా ఇంకో అర్థం స్ఫురిస్తుంది.

నిద్రనుండి మెలకువలోకి అనే అధ్బుతమైన ఆలోచనే కాకుండా తెలియనితనం నుండి ఏదో తెలుస్తున్న తనంలోకి పరిగెత్తుతోన్న గొప్ప పరిణామం స్పష్టంగా కనిపిస్తోంది. కవి తన అంతరాల్లోని అనేకానేక ఆలోచనలను అక్షరాల్లో పొదిగి కవితగా మలిచి హృదయానికి హత్తుకునేలా ఆవిష్కరించారు. అనేక సాహితీ ప్రక్రియల్లో ఆరితేరిన మామిడి హరికృష్ణగారు తన గురించి తన కవిత్వం గురించి రాస్తూ ఓ దగ్గర ఇలా ప్రస్తావించారు . ఒక కవి ప్రస్తానాన్ని , పరిణామ క్రమాన్ని ఎలా తెలుసుకోవాలి ? ఏ ప్రమాణాల ప్రాతి పదికగా బేరీజువేయాలి అనే ప్రశ్నల పరంపరకు నావల్ల నానుండి, నాతో నాకు దొరికిన సమాధానమే ఈ ‘సుషుప్తి నుంచి’ అంటాడు.

నిజాయితీ, నిబద్దత, స్పృహ,సామాజిక స్పృహ లాంటి బరువైన సూత్రాల జోలికి వెళ్లకుండా , తేలికైన పదాలతోనే బరువైన భావాన్ని కలిగించాడు . తను నిత్యం చూస్తున్న, తను అనుభవిస్తున్న  జీవితంలోంచి మొలిచిన ఘటనలు , సంఘటనలను తన, తనవాళ్ళ, మనః ప్రవృత్తులనూ చేదుకొని అలా అలా అలవోకగా అద్భుతమైన శైలిలో రాసుకున్న కవితలే సుషుప్తి నుంచి. ఇవి ఓ కవి రాసిన కవితలు అనుకోవడంకన్నా, ఓ కవితా ప్రేమికుడు చెక్కుకున్న శిలాకవితలు అనుకోవచ్చు . శిలాకవితలు అని ఎందుకు అంటున్నానంటే ఈ పుస్తకం కవి యొక్క స్వదస్తూరితో  నిక్షిప్తం చేసుకున్న అరుదైన అద్భుతం.

గతంలో శ్రీ శ్రీ మరియు కొంతమంది కవులు రచయితలు ఇలాంటి ప్రయోగం చేసిన దాఖలాలు ఉన్నా, పుస్తకం అంతా కాకుండా, యేవో రెండూ లేక మూడు కవితలు స్వదస్తూరితో ఉండడం చూశాం . ఒకవేళ అన్ని  కవితలతో వచ్చినా ఇప్పటి తరానికిదో బహుమతే అని చెప్పొచ్చు .

స్వదస్తూరి వల్ల ప్రయోజనాలు ఏంటో ఈ కవి స్వయంగా తన మాటలో చెప్పుకున్నారు గనుక ఇక్కడ మళ్ళీ చెప్పడం అప్రస్తుతం .   

ఇందులో చేర్చిన 61 కవితలు 1986-89 మధ్య కాలంలో రాసినట్టు కవి చెప్పుకున్నారు. కొన్ని కవితలకు తనే  చిత్రాలు గీసినట్టు, చివరగా కొన్ని illustrations అనుబంధంగా పెట్టడం వల్ల కవి మంచి చిత్రకారుడని తెలుస్తుంది

సమాజాన్ని కళ్ళతో కాకుండా మనసుతో రచయితలే చూడగలరని ఈ కవి నిరూపించాడు. కవి తనలోని మనిషిని వివిధ కోణాల్లోంచి సున్నితంగానూ ,సూచనప్రాయంగానూ బహిర్గతం చేశాడనిపిస్తోంది . ఎందుకంటే జీవిత పాఠం అనే మొదటి కవితలో కవి ఒక అద్భుతమైన భవిష్యత్తును కలగన్నాడు .

ఒక మనిషిగా 

సాటిమనిషికి

నేనేమీ చేయగలను ?

అని అప్పటికప్పుడే సమాధానాన్ని వెతుక్కున్నారు . ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటూ ఎందరో కళాకారులకు తన వంతుగా సహాయం చేయడం చూస్తుంటే అప్పుడెప్పుడో రాసుకున్నట్టుగా కవి తన కవితను ఇప్పుడు నిజం చేసుకున్నారనిపిస్తోంది . కవిత్వానికి సాంఘిక ప్రయోజనం ఉండాలని బలంగా నమ్మేకవి మామిడి హరికృష్ణ .

సైనిక కవాతు అనే కవితలో

కవాతు జరుగుతోంది

నువ్వూ

నేనూ

అందరం అందులో ఉన్నాం తెల్సా ?

మరో కవితలో

రక్తం ఇంకా పారుతూనే ఉంది

కానీ ,

రక్త స్పర్శ మనకు తెలీటమ్ లేదు . అంటాడు

ఈ రెండు కవితలలో ఒకే పరిస్థితి  కనిపిస్తుంది . ఒక ప్రత్యేక పరిస్థితికి స్పందించినదైనా అందులో అద్బుతమైన భావుకత కనిపిస్తుంది .

సమాజ సమస్యలపై ఎంత కరుకుగా కలాన్ని కదిలిస్తాడో , ప్రేమ కవిత్వానికి వచ్చేసరికి అంతకన్న మృదువుగా కవిత్వాన్ని ఒలికిస్తాడు . “భావగీతం-మౌనస్వరం” అనే కవితలో ప్రేమకు సంబంధించిన ఏవో ఆస్పష్టభావనలు అలల మాదిరి మదిలో దోబూచులాడుతూ పద లావణ్యన్ని కోరుకుంటాడు కళ్ళలో, పెదవుల్లో,భంగిమల్లో, నుదిటిలో , సింధూరంలో, చెక్కిళ్లలో, ప్రేయసిని వర్ణించుకుంటాడు. ఇవన్నీ నాకు దక్కితే బావుండుననే స్వార్ధం లేదు కవికి, అందుకే చివరగా అంటాడు

చెవులలో

ఝంఝామారుతంలా వనిలో అవనిలో ఆమనిలొలుకు  నవబాణులు చివరకు ఎవరికి దక్కుతాయో అని ఒక ఆశావాదాన్ని వదిలేశాడు. ఇక్కడ కవి తనతో పాటు చుట్టూ ఉన్నవారికి ఒక అవకాశం ఇచ్చాడు . నాకే కావాలనుకునే ఆ యవ్వన వయసులో కూడా ఒక అద్భుతమైన ప్రేమను పొందే ఆశను పంచాడు. అలాగే ఈనాడు అర్హులైన ఎందరికో ఎంచుకున్న వృత్తిలో అవకాశాలు కల్పిస్తున్నాడు అంటే అప్పటి ఆ కవితకి ఓ ప్రయోజనం చేకూరినట్లైంది .

పదాలు సాదాసీదాగా అనిపించిన కూర్పులో ఉన్న కవి నేర్పు అద్భుతం అందులో భావం అత్యద్భుతం అనిపిస్తుంది .

  జనరల్ గా కవులు ,కళాకారులు తమ పేరు మార్చుకోవడమో లేక కొంత కొత్త అర్ధం స్ఫురించేలా ఉన్న పేరును చిన్న చిన్న మార్పులు చేసుకోవడం సహజంగా జరుగుతుంది అలాగే యవ్వనంలో కవిత్వం రాయడం మొదలెట్టాడు.కాబట్టి తన పేరును ‘తపస్వి’ గా కొన్ని కవితలపై చెక్కుకున్నారు .

‘నిశ్శబ్ద నిశీదిలో

ఒంటరి పయనం

ఎక్కడికో అగమ్యగోచరం

‘అర్దరాత్రి’ అనే కవితను మొదలెట్టి ఎక్కడెక్కడో కదల లేకుండా చీకట్లో తిరుగుతూ చివరకు

‘వెనక్కి తిరిగి చూస్తే

అంతా చీకటి

నేనెక్కడికీ చేరుకోలేదన్నట్లుగా! అంటాడు

పుస్తకానికి పెట్టిన ‘సుషుప్తి నుంచి ‘అనే పేరుకు సరిగ్గా సరిపోయే కవిత ఇది . ఎందుకంటే ఈ కవితా నిర్మాణం ఒక కలలా ఉంటుంది . కలలు నిద్రలోనే కదా వస్తాయి .

‘అవలోకన’ కవితలో కవి యొక్క విస్తృత పరిజ్ఞానం కనిపిస్తుంది .

కవికి దీపం తో ఎక్కువ అనుబంధం ఉన్నట్లు కన్పిస్తుంది . దీపం అంటే వెలుగు మాత్రమే కాదు చైతన్యానికి ,జ్ఞానానికి ప్రతీక . కొన్ని సందర్భాల్లో విప్లవానికి జోడిస్తారు అందుకే ఆ పదాన్ని చాలా కవితల్లో దివిటీలా వెలిగించారు.

ఇంకో ఆలోచించే ఆసక్తికరమైన కవిత ‘సుషుప్తి నుంచి చేతనలోకి’ ఇందులో ఒకే ఒక వాక్యం ఓ కవితను తలపిస్తుంది .

‘మన గుండెలు మండటాన్ని నేర్చుకుంటాయ్’ అంటాడు

రేపటి నీ వాళ్ళను మండిస్తాయి

అపుడు సూర్యుడితో పనుండదు

నీవాడు,నావాడు

ప్రతి ఒక్కడూ

సూర్యుడై

ప్రపంచాన్నే జయిస్తారు ! అని ముగిస్తాడు

ఇక్కడ సూర్యుడిని ఒక విప్లవ వీరుడికి ప్రతీకగా చెప్పుకోవచ్చు .

ఈ కవి ఒకే అర్ధాన్నిచ్చే పదాలను వెంటవెంటనే వాడుతుంటాడు .బహుశ గట్టిగా చెప్పాలన్న ఆలోచన అయిఉంటుంది ఉదాహరణకు

స్వేచ్ఛగా , యదేచ్చగా

అమాంతంగా ,ఆసాంతంగా

చెరుగని, తరగని

అనుక్షణం ,ప్రతిక్షణం

ఒక విషయాన్ని ఎదుటి వారి మస్తిష్కం లోకి ఎక్కించాలన్నప్పుడు ఒక పదానికి వాడే అనేక పర్యాయ పదాలను ఉపయోగించడం ఉపన్యాసంలో చూస్తుంటాం . కవి మంచి వక్త కాబట్టి కవితల్లో మనకి అలా కనిపిస్తుంది అనుకోవచ్చు .

  మంచీ చెడూ ,నీతి న్యాయం ,చీకటి వెలుతురుల మధ్య మానసిక సంఘర్షణను ప్రతి కవితలో చిత్రించే ప్రయత్నం చేశారు .

మామిడి హరికృష్ణ గారు నిజాయితీ పరులైన అధికారి మాత్రమే కాకుండా నిబద్ధత నిండిన కవి ,చిత్రకారుడు ఇందులోని ప్రతి కవితలో ఆయన వ్యక్తిత్వం తొంగి చూస్తుంది . వీరు తమ అనుభవంనుండి తమదైన భాషలో, అనుభూతిలో, అభివ్యక్తిలో ఆవిష్కరించాలన్న తపన ఈ పుస్తకం నిండా బలంగా కన్పిస్తుంది .

 

జీవిత పాఠం నుండి ప్రారంభించిన ఈ పుస్తక ప్రస్థానం రైల్వే ఫ్లాట్ మీదుగా సామాన్యుడి తాత్విక జిజ్ఞాసను నెమరేస్తూ , ఎన్నెన్నో  ప్రయోగాత్మక మనోరీతుల్ని వివరిస్తూ, పరిణత మార్గాల వైపు పయనిస్తూ ‘సుషుప్తి నుంచి’ చేతనలోకి సాగుతుంది

కొన్ని ప్రేమ,వైరాగ్యాలు

ఇంకొన్ని సమాజ దుఖాలు

వీటి మధ్య నలిగే మనిషి అంతర్మధన ప్రతిమలు ‘సుషుప్తి నుంచి’లో మనల్ని ప్రశ్నిస్తుంటాయి.

***

Anchor 1
Anchor 2
Anchor 3
Anchor 4
Anchor 5
Anchor 6
Anchor 7
bottom of page