bhuvanollasam.PNG
srinivyasavani.PNG

సంపుటి  6   సంచిక  1

Website Published &  Maintained by  Srinivas Pendyala | Mobile version is under construction. Use big screen for better experience.

new_srinivyasa_vani.png

“శ్రీని” వ్యాస వాణి

జారుడుబండలు మొదలవుతాయా?

Srinivas Pendyala, Madhuravani,Srinivas Pendyala Madhuravani

శ్రీనివాస్ పెండ్యాల

టైటానిక్ సినిమాలో tip of the iceberg అన్నట్లుగా .. ఉపద్రవం ముందు ప్రకృతి మనకు ఉప్పందిస్తుంది. 2019 చివరినాళ్ళలో... కమ్మేసి కుమ్మేసే మహమ్మారి జాడలు కనిపించినా... స్పందించని మానవాళి 2020 సంవత్సరాంతం మూల్యం చెల్లించుకొంది... నాగరికత, జీవన విధానం, ఆలోచన ధోరణి, రాజకీయాలు ఇలా రంగం ఏదైనా... మానవాళి చెల్లించిన మూల్యం లో వెతికితే, ఎన్నో పాఠాలు కనిపిస్తాయి.

2019 ప్రస్తావన ఎందుకు తెచ్చానంటే... 2020 చోటుచేసుకున్న పరిణామాలకు బీజం పడింది అక్కడే. కరోనా కబుర్లు విని పండిపోయాం. రూపు మార్చుకుంటున్న UK కరోనా లాంటి భారత దేశ రాజకీయ కబుర్లు చూద్దాం.

 

ఒక్క పోటుతో దేశాన్ని క్యూ లో నిలబెట్టినా, 15 లక్షల నీటి మూటలు బ్యాంకుల్లో జమ చేసినా, ఆర్ధిక స్థితి కళ్ళు తేలేసినా... మాయో లేక “ మతలబో " తెలీదు కానీ, ప్రజలు మార్పు కోరుకోలేదు. కొత్తదనమేంటంటే... మునుపు ఆర్యుల భావోద్రేకాన్ని దక్షిణాది నిలువరించేది. ఇప్పుడు... పట్టం కట్టడానికి మనసొప్పని ద్రావిడ ప్రజానీకం ఒక వైపు... నడ్డీ విరిగి సామంతులుగా మారిపోయిన నేతాగణం మరోవైపు. మొత్తానికి బెత్తం చేయలేని పనిలేదని తేల్చారు. వీటన్నిటికీ బీజాలు పడింది 2019 లోనే.

 

అప్రతిహతంగా సాగుతున్న BJP విజయ పరంపర 2019 పునాదిగా 2020 లో వేయిపడగలుగా విస్తరించింది. పడగలు అని ఎందుకన్నానంటే, ఒక పక్క ఆది శేషావతారపు గిల్పం వలే సుస్థిరతను సూచించినా, మరో ప్రక్క సామ్రాజ్య విస్తరణకు ప్రజాస్వామ్యంపై చిమ్మిన మకిలి మరకలు కనబడతాయి. కాంగ్రెస్ పాఠాలని కాంగ్రెస్ కే చెవి మెలేసి మరీ BJP పెద్దలు చూపిస్తున్నారు. విచ్చలవిడి పార్టీ ఫిరాయింపులు, రాజ్యాంగ సంస్థల నిర్వీర్యం, గవర్నర్ వ్యవస్థ దాష్టీకాలు వంటి పూర్వ కర్మలను అనుభవించడం ఇప్పుడు కాంగ్రెస్ వంతు.

 

చరిత్ర పలు సందర్బాలలో పునరావృతం అవుతుంది.  కాలం ఇలాగే అనుకూలిస్తే, BJP శిఖరాగ్రయానానికి నాంది పలికేది 2021 వ సంవత్సరమే. బెంగాల్ లో పీఠం ఎక్కడంతో BJP పతాక స్థాయికి చేరువ కాబోతున్నది. ఇప్పటికే కేరళ మినహా ద్రవిడ రాజ్యాలన్నీ సామంతులైన పరంపరలో, వీలైతే 2022 లేదా 2023 నాటికి తెలంగాణా జయించి BJP పతాకస్థాయిని చేరడం ఖాయం. ఇక ఆ తరువాత సాగిలాపడిన రాజ్యాంగ గళ్లు దాటి, RSS ఆమోదం ఉంటే, జమిలి ఎన్నికలతో జారుడు బండ పైకెక్కి కూర్చోవడం జరగొచ్చు. ప్రజలు 2 పర్యాయాలకు మించి ఏ నాయకత్వాన్నీ భరించరు. ప్రతిపక్షాలు సిద్దంగా లేకుంటే ప్రజలే ఆ పనికి పూనుకుంటారు. వందల కిలోమీటర్లు నడిపించినా ప్రత్యామ్నాయం లేదు కనుక మోడికే బీహార్ ప్రజలు పట్టం కట్టారు. ప్రత్యామ్నాయం కనిపించిన నాడు విషయం వేరే విధంగా ఉంటుంది. గాంధీలను వీడలేక, వారితో నడవలేక, కాంగ్రెస్ పార్టీ, మరింత కుంచించుకుపోవడం అనివార్యం. బహుశా రాజమాతను ఒప్పించి అలంకార ప్రాయంగా కుటుంబ సభ్యులకు సామూహికంగా మార్గదర్శక మండలి సభ్యత్వం కల్పించడం తప్పదేమో. పిల్లి మెడలో గంట కట్టే కపిల గులాం సైన్యానికి ధైర్యం రావడమే తరువాయి.

చరిత్ర సిద్ధాంతం తెలంగాణ లో కూడా చూడవచ్చు. యాస, ఉద్యమ ముసుగులో KCR వాడిన భాష ఇంకా మన చెవుల్లో దద్దరిల్లుతూనే వుంది. ఇప్పుడు “ బండి “ ఓడై, సారుకి సర్కార్’కంపలా ముళ్లు గుచ్చుతున్న BJP జోరుతో గత ఆరు సంవత్సరాలుగా ఏకపక్షంగా ఉన్న తెలంగాణం ఒక్కసారిగా వేడెక్కుతుంది. ‘సారుకు సలాకలు ఖాయం’ అంటున్న BJP యువ నాయకత్వ జోరు ఆపడంలో KCR తడబాటు వారి ప్రసంగాల బేలతనంలో కనబడుతున్నది. ఉప ఎన్నికల నిచ్చెనలపై నిర్మించిన TRS సౌదం, దుబ్బాక ఉప ఎన్నికతో జారుడుబండ పై జర్రున జారడం మొదలయింది. బలహీనమైన కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలను కబళించి BJP పులికి ప్రాణ ప్రతిష్ట చేసిన KCR ను చూస్తే, “ఎనకట ఎవడో ఒగడు సచ్చిన పులి బొక్కల్ని ఓ తాన బెట్టి పానం పోస్తే అది ఆడ్నే సంపి తిన్న ఓ పిట్ట కథ యాద్ కొస్తంది.”. కాంగ్రెస్, తెలుగుదేశం ఉన్నంతకాలం అవినీతి, తెలంగాణా ద్రోహి వంటి పడికట్టు పదాలతో ఆటాడుకున్న KCR, ఇప్పుడు BJP ని ఎదుర్కోవడానికి కొత్త ఆయుధాలు వెతుక్కోవాలి. KCR స్వయంకృతాపరాధానికి మూల్యం చెల్లించక తప్పదు.  KCR తన పదునైన రాజకీయ జిమ్మిక్కులు చేస్తే, నాగార్జున సాగర్ ఉప ఎన్నికలలో స్వయంగా కాంగ్రెస్ కు జీవం పొసి తన డబ్బు దస్కం తో గెలిపించడమో లేదా BJP ని మూడవ స్థానానికి నెట్టి వీలైతే డిపాజిట్ గల్లంతు చేసి BJP ఎదుగుదలను ఆపే ప్రయత్నం చేయవచ్చు. తాను ఓడిపోయినా, కాంగ్రెస్ బ్రతికేవుంది అని ప్రజలను నమ్మించి. తద్వారా కాంగ్రెస్ పతనాన్ని ఆపి తిరిగి నిలిపే ప్రయత్నం జరగొచ్చు. ఇది దీర్ఘకాలంలో KCR  కు ముడిసరుకుగా ఉపయోగపడుతుంది. ఇక కాంగ్రెస్ విషయానికొస్తే, ఉన్న జానెడు జాగకు, పుట్టెడు మోతుబరీలు తయారయ్యారు. ప్రస్తుతానికి రేవంతే చుక్కానిలా కనపడినా తెలుగుదేశం మూలాలు కొంత ఇబ్బంది పెట్టవచ్చు. డిపాజిట్లు గల్లంతవుతున్నా, కనీసం ఎదురు నిలబడే నాయకుడిని నియమించుకోలేని దుస్థితిలో ఉన్న కాంగ్రెస్ కు అత్యవసర సుదీర్ఘ శస్త్ర చికిత్స అవసరం. తెలంగాణలో తెలుగుదేశం డిపాజిట్లతో పని లేకుండా, బ్యాలెట్ పేపర్లో ఖాళీలు నింపడం మాత్రమే బాధ్యతగా పెట్టుకున్నది.

ఇక నవ్యాంధ్ర గురించి పెద్దగా మాట్లాడుకోవడానికేమీ లేదు. దింపుడుకళ్ళం ఆశతో ధర్మపోరాటాలు చేసిన పెద్ద కొడుకుకీ, ‘నేను విన్నానూ, నేను ఉన్నాను’ అన్న ఓదార్పులకీ మధ్య నలిగిన నవ్యాంద్రులు... మార్పును క్వింటాళ్ళలో కొని తెచ్చుకున్నారు. అది కొరివో లేక కెంపో ఈపాటికే ఎవరి ఆలోచనా ధోరణి లో వారికి అర్థమయ్యే ఉంటుంది. వి"భజన" హామీలు, అమరావతి... లాంటి భేతాళ ప్రశ్నలు మాత్రం అలానే ఉన్నాయి. పదే పదే వినిపించిన ప్రత్యేక హోదా, రాజధాని, పోర్టులు, పార్కులు, కాపులు, ఇళ్ళూ, గుళ్లూ,  వంటివి రాజకీయ ముఖచిత్రం నుండి మాయమయ్యాయి. తెస్తామన్నవారు, ప్రశ్నిస్తామన్నవారు, పొడిచేస్తామన్నవారు ఇప్పుడు ఈ విషయ ప్రస్తావన కూడా తేవడం లేదు. హస్తినా పుర ప్రభువులు నోరిప్పేదెప్పుడో... భేతాళుడు చెట్టెక్కెదెప్పుడో?

ప్రత్యేక హోదా, అమరావతి, విభజన హామీలు వంటివి దాదాపుగా ముగిసిన అధ్యాయాలే. ఇవి అధిగమించగల సవాళ్లే. నవ్యాంధ్ర ఎదుర్కుంటున్న అతిపెద్ద సమస్యల్లా అక్కడి ప్రజల ఆలోచనల్లో రాని మార్పు, సంఘటిత పరిచే నాయకత్వం. గడచిన ఏడాదిన్నర కాలంలో పతాక శీర్షికలెక్కిన సమస్యలు చూస్తే... కూల్చివేతలు, కాల్చివేతలు, బూతు పురాణాలు, కుల రణాలు. వీటికోసమా గత 6 సంవత్సరాలుగా పోరాటం చేస్తుంది? రాష్ట్రాలు భౌగోళికంగా విడిపోయాయే గాని వనరులు విడిపోలేదు. ఇప్పటికిప్పుడు ఒక మహానగరం కృత్రిమంగా నిర్మించడం, కులాల కుంపట్లు ఆర్పడం అసాధ్యం. మరి ఏది సాధ్యం? సమాజంలో వేళ్లూనుకున్న సమాధానం లేని సనాతన సమస్యలను కొన్ని రోజులు పక్కనపెట్టి రాష్ట్రాన్ని వాస్తవికతతో ముందుకు తీసుకెళ్లేలా నాయకులను నడిపించడం. ఇది చేయవలసింది ప్రజలే ... ఇక్కడ తెలంగాణ ఉద్యమాన్ని ఉదాహరణగా తీసుకోవచ్చు. అప్పటి, పక్షవాత కేంద్ర నాయకత్వం కొంత ఊతం ఇచ్చినా... తెలంగాణ ప్రజలు చూపిన కూర్పు ఒక చక్కటి ఉదాహరణ. కులాలు, వర్ణాలు, జాతులు, మతాలు, ఉద్యోగులు, నిరుద్యోగులు ఇలా తేడా లేకుండా సమసమాజమంతా ఏకమై కాలాన్ని... రాజకీయాన్ని... కట్టి పడేసి ఒకే విధానంగా, ఒకే నినాదం గా పోరాడి రాజకీయ పార్టీలకు తప్పని పరిస్థితులు సృష్టించారు. రాష్ట్రం సిద్ధించాకా, ఇప్పటికీ అదే స్పూర్తి కనిపిస్తున్నప్పటికీ... ప్రజలు, నాయకులు వారి వారి సనాతన ధర్మాల మూలాలు అవినీతి, అణచివేత వంటి సహజ ధోరణిలోకి మళ్ళీ జారుకుంటున్నారు. ఇది తెలిసిన రోగమే.. ఎలాగూ దానికి మందు, విరుగుడు లేదు. ఆ మాటకొస్తే మన దేశ పరిస్థితులకు మందు అవసరం కూడా లేదు. ఎందుకంటే... ప్రజలే అత్యంత అవినీతి పరులు. వారిలోంచి పుట్టినవారే నాయకులు... పెద్దగా కంగారు పడనవసరం లేదు. విచిత్రమేమంటే ఇప్పటికీ ఏ ఇద్దరు నవ్యాంద్రులను కదిపినా... వారు ప్రస్తావించేది వారి నాయకుడు ఎంత బాగా తిట్టాడో, అమెరికాలో మావాడు ఏం వెలగబెడుతున్నాడో లేదా హైదరాబాదులో మళ్ళీ ఎంత బాగా మమేకమయిపోయామో అని మాట్లాడుకుంటారు. మరి రేపటి వారి పరిస్థితేంటీ? అప్పులు తెస్తూ దోచిపెడుతున్న రాజుల మాటేమిటి? అసలు మిగిలిన దక్షిణాది రాష్ట్రాల విషయం దేవుడెరుగు, కనీసం ఈశాన్య చిట్టెలుకలతో పోటీ పడగలరా?

 

ఈశాన్యులను చిట్టెలుకలతో ఎందుకు పోల్చానో మరొక వ్యాసంలో వివరిస్తాను!