
MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
Website Published & Maintained by Srinivas Pendyala | Mobile version is under construction. Use big screen for better experience.
Website Designed & Maintained by Srinivas Pendyala www.facebook.com/madhuravanimagazine
కథా మధురాలు
భిక్ష

ఆర్. శర్మ దంతుర్తి
మధ్యాహ్నం భిక్షకి బయల్దేరాడు భగవానుడు తనకూడా కొంతమంది భిక్షువులూ, ఆనందుడూ అనుసరిస్తూండగా. క్రితం రోజు వెళ్ళిన దారిలోనే బుద్ధుడు బయల్దేరుతూంటే ఆనందుడు ఏదో అనబోయేడు కానీ, ‘ఆయనకి తెలియదా’ అనే ఆలోచన రావడంతో మరి మాట్లాడలేదు. ఓ వీధిలో ఇంటి దగ్గిర ఏదో కలకలం. ఇంటి యజమాని కోపంగా ఎవరిమీదో అరుస్తున్నట్టున్నాడు. ఆ ఇంటికెదురుగా తమకి పరిచయం ఉన్న మరో ఇంటికి బుద్దుడు దారితీయబోతూంటే మొదటి ఇంట్లోంచి పెద్దగా వినిపించాయి మరో సారి కేకలు; తర్వాత ధడేల్ మంటూ తలుపు మూసుకున్న చప్పుడు. కూడా ఉన్న శిష్యులని భిక్షకి వేరే చోటకి వెళ్ళమని చెప్పి భగవానుడు ఆ కేకలు వినిపించిన మొదటి ఇంటికే బయల్దేరేడు. సంఘంలో జేరాక ఏనాడూ బుద్ధుణ్ణి విడిచి ఉండని ఆనందుడు వెనకనే అనుసరించాడు.
భిక్షకి బయల్దేరుతూ నిన్న వచ్చిన దారిలోనే వస్తున్నందుకు మొదట్లో భగవానుణ్ణి అడుగుదామనుకుని మానేసాడు కానీ ఇప్పుడింక ఊరుకోలేక అన్నాడు ఆనందుడు, “ ఆయన ఇంటి యజమాని కోపంగా ఉన్నట్టున్నాడు, ఈ పరిస్థితుల్లో ఆ ఇంటికి భిక్షకి వెళ్తే ఏమంటారో? ఆ కోపంతో మనమీద చేయి చేసుకోవచ్చు కదా? మరో చోటికి వెళితే మంచిదేమో?”
“నువ్వే చూద్దువుగాని రా,” ముందుకు దారితీసాడు తధాగతుడు.
“భవతి భిక్షాం దేహీ!” తలుపు మీద మెల్లగా తడుతూ అడిగాడు ఆనందుడు.
విసురుగా తెలుచుకున్న తలుపులోంచి ఒక్కసారిగా యజమాని కాబోలు బయటకొచ్చేడు, “ఎవర్రా నా ఇంటి తలుపు తట్టినది?” తారాస్థాయిలో కోపం ఉట్టిపటుతూంది ఇంకా.
“మేమే,” ఆనందుడు చెప్పాడు.
“బుధ్ధిలేని పనికిమాలిన జనం అంతా ఆ బుద్దుణ్ణి పట్టుకుని ఇలా సన్నాసుల్లా తయారవడం, ఇంటి కొచ్చి ప్రతీ రోజూ దేబిరించడం. ఏం, మీకు పనీ పాటా లేదా? ఊరికే అలా ఊళ్ళ మీద బికార్లుగా పడి తిని ఏడవకపోతే ఏదో ఒక పని చేసుకోరాదూ?” అత్తమీద కోపం దుత్తమీద చూపిస్తున్నట్టున్నాడు ఇంటి యజమాని.
ఆనందుడేదో అనబోతూంటే భగవానుడు వారించాడు చిరునవ్వుతో.
“ప్రతీ చేతగాని వెధవా ఇల్లు వదిలేసి సన్యాసం అంటూ ఆ బుద్ధుడనే ఆయన దగ్గిర చేరడం, ఆయనేదో ఉద్ధరిస్తున్నట్టూ ఎక్కడికీ కదలడులా ఉంది, మీరేమో భిక్ష అంటూ ఇలా ఊరిమీద పడి జనాలని దేబిరించి పట్టుకెళ్ళి ఆయనకి ఇవ్వడం. తిండి కావాలంటే పని చేయాలి. అప్పుడు డబ్బో దస్కమో దొరుకుతుంది. అక్కడితో అయిందా? ఆ డబ్బులు తీసుకెళ్ళి పచారీలు కొని వంట చేయాలి. అప్పుడు కానీ తినడానికేదీ తయారవదు. నువ్వూ నీ కూడా నించున్న ఈ పెద్ద మనిషీ ఉత్త సన్నాసులని తెలుస్తూనే ఉంది. సన్యాసి కూడా కాదు. అర్ధం అవుతోందా? పనీ పాటా చేసుకోకుండా మేము కష్టపడుతుంటే అవి తినేసి త్రేన్చడం; తేరగా కూర్చుని వంట్లో కొవ్వు పెంచడం కాదు, వెళ్ళండి ముష్ఠి వెధవల్లారా. పోయి పని చేసుకోండి. పోయి భగవానుడనే బుర్రలేని ఆ బుద్ధుడికి కూడా నేను ఇలా తిట్టాననీ అసలు బుద్ది అనేది ఉంటే బయటకొచ్చి పనిచేసి డబ్బు సంపాదన మీద దృష్ఠి పెట్టమనీ చెప్పండి. కుక్కల్లా ఊరిమీద పడి తినడం కాదు. మీరిద్దరూ, మీ సంఘం పెట్టిన బుద్ధుడూ ఎప్పుడైనా అసలు ఒక్క నాణెం చేత్తో పట్టుకోవడం మాట అటుంచి, కళ్ళతో చూసారా? లేకపోతే ఇలా తిరిపెంలాగా తిరగడమేనా? వెళ్ళండి, సన్నాసుల్లారా.”
“బుద్ధుడు సన్యసించకముందు మాహారాజు. ఎన్నడూ ఎవరి ముందూ చేయిచాచవలసిన అవసరం లేనివాడు, ఆయన గురించి మీకు తెలిసి ఉంటే….” ఆనందుడు సమర్థించబోయేడు.
ఆనందుణ్ణి వారిస్తూ ఈ సారి భగవానుడే నోరు తెరిచి అడిగేడు సౌమ్యం ఉట్టిపడుతూండగా “అభ్యాగతులం ఆకలితో వచ్చి అభ్యర్ధించాం మీ దగ్గిర; భిక్ష ఏదైనా వేస్తారా?”
ఆనందుడు మరి మాట్లాడలేదు కానీ ఆశ్చర్యంగా చూసాడు; తథాగతుడు ఏదో భోధించబోతున్నాడు కాబోలు; ఇంక నోటికి పని మానిపించి చెవులకి పని చెప్పడం మంచిది.
“ఓరి దరిద్రుడా మళ్ళీ భిక్ష అంటున్నావే, ఇంతసేపు గొంతు చించుకుంటూ అరిచింది చాలదా? నువ్వో సన్నాసివి. నీ గురువుగా చెప్పబడే ఆ బుద్ధుడికీ, మీకూ పనేమీ లేదు. ఊరిమీద తిరిగి అడుక్కోవడం తప్ప” రెచ్చిపోతూ అరిచేడు యజమాని, “నీ గురించీ, ఆ బుద్ధుడి గురించీ ఇంత సేపటినుంచీ గొంతు చించుకు అరుస్తూంటే ఏమీ మాట్లాడవేం? దానికేం సమాధానం చెప్తావు?”
“సరే, మాట్లాడమన్నారు కనక కొన్ని ప్రశ్నలు అడగొచ్చా?”
“సరే ఏడు త్వరగా!”
“మీరు చూడబోతే ధనవంతుల్లాగా ఉన్నారు, మీ ఇంటికి అతిథులు వస్తూ ఉంటారా?”
“ఎందుకు రారు? నీలాగా నేను ఊరిమీద దేబిరించే సన్నాసిననుకుంటున్నావా?”
“ఆ వచ్చిన అతిథులకి మీరు బహుమతులు ఇస్తూ ఉంటారు కదా?”
“నేను మూర్ఖుడి లాగ కనపడుతున్నానా? ఇంటికొచ్చిన అతిధులకి ఏ యజమాని బహుమతులు ఇవ్వడు?”
“మీరిచ్చిన ఆ బహుమతులు వాళ్ళు తీసుకోకపోతే అవి ఏమౌతాయి?”
“ఏం వెధవ సన్నాసి ప్రశ్న ఇది? నేను ముందు నుంచీ చెప్తూనే ఉన్నాను. మీరందరూ పనికిరాని సన్నాసులని. మీకు ఈ మాత్రం కూడా తెలియదని ఇప్పుడే నిరూపించావు నువ్వు. ఆ బుద్ధుడు కూడా ఇలాంటివాడే కాబోలు. వాళ్ళు తీసుకోకపోతే ఆ బహుమతులు నా దగ్గిరే ఉంటాయని తెలియదా?”
“అవును కదా, మేము మీ ఇంటికి వచ్చి సౌమ్యంగా భిక్ష అర్ధించాము. మీరేమో తిట్ల వర్షం కురిపిస్తున్నారు మా మీద మీ అతిధులకి బహుమతులు ఇచ్చినట్టూ. మేము అవి స్వీకరించలేదు. అంటే అవి ఎక్కడున్నాయో అర్ధం అయిందా?” భగవానుడి మొహంలో చెరగని చిరునవ్వు.
ఒక్కసారి నిశ్శబ్దం. ఇంటి యజమాని మొహంలో రంగులూ, మనసులో కల్మషం ఎవరో కడిగేస్తున్నట్టూ మారడం కనిపిస్తూనే ఉంది. ఎవరికి ఎప్పుడు నేర్పాల్సిన పాఠం సరైన సమయంలో అప్పుడే నేర్పడం బుద్దుడికి తెలిసినట్టూ మరెవరికీ తెలియదని సంఘంలో సన్యాసులు చెప్పుకోవడం అనందుడికి మరోసారి గుర్తు వచ్చింది.
ఆనందుడు ఇంకా ఆ ఆలోచనల్లో ఉండగానే, కోపం హరించుకుపోయిన యజమాని నేల మీద కూలబడిపోతూ విప్పారిన కళ్ళతో అడిగేడు, “ఇంతకీ మీరెవరు?”
ఈ సారి ఆనందుడు చెప్పాడు సమాధానం
“యే ధర్మా హేతుప్రభవా హేతుం తేషాం తథాగతోహ్యవదత్
తేషాం చ యో నిరోధో ఏవంవాదీ మహాశ్రమణః”
[ఏ కారణాల వల్లైతే ధర్మం అనేది పుట్టి ప్రభవిస్తోందో, ఆ ధర్మాలకి కారణం ఇదీ అని చూపించినవాడు, ఆ కారణాలకి నివారణ తెలిపినవాడూ, మహా శ్రమణుడు ఈ తథాగతుడు.]
సంఘంలో అప్పుడే జేరిన కొత్త శిష్యుడితో, ఆనందుడు అనుసరిస్తూండగా ముందుకి కదిలాడు భగవానుడు.
OOO