top of page
adannamaata.png

సంపుటి  5   సంచిక  3

Website Published &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

వ్యాస​ మధురాలు

ఆధ్యాత్మికతలో ‘భక్తి’ వైశిష్ఠ్యం

vedantam.PNG

డా. వేదాంతం కృష్ణమాచార్యులు

మానవుడు ధర్మార్థకామమోక్షములనే చతుర్విధ పురుషార్థాలను లక్ష్యంగా చేసుకొని జీవనయాత్రను కొనసాగించడమనేది ఋషి పరంపరాగతముగా వస్తున్న సనాతన ధార్మిక అంశము.

 

  భారతీయ సాంప్రదాయంలో ‘ధర్మం’ అను పురుషార్థానికి అధిక ప్రాధాన్యమిస్తూ, అర్థకామాలను కూడా ధర్మసమ్మితాలుగా ఆచరించాలని, అనుసరించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. నాలుగవ పురుషార్థమైన ‘మోక్షాన్ని’ సాధిస్తే మనిషికి జన్మసార్థకత లభించి ‘మోక్షప్రాప్తి’ అనునది ఫలంగా కలుగుతుందని మహర్షుల ప్రబోధము.  అయితే మోక్షమను పురుషార్థాన్ని సాధించాలంటే ఆధ్యాత్మిక మార్గంలో పయనించి ‘ఆత్మజ్ఞానం’ పొందాలి. ఆత్మజ్ఞానమన్నా, ఆధ్యాత్మిక జ్ఞానమన్నా, బ్రహ్మజ్ఞానమన్నా ఒక్కటే. ఆత్మకొరకు చేసే, ఆత్మతత్వం కొరకు చేసే విచారము ‘అధ్యాత్మము’ అని చెప్పబడుతుంది. అంటే ఆత్మయొక్క అమృత తత్వమును, ఆనంద స్వరూపమును తెలుసుకొనుటయే ఆధ్యాత్మిక జ్ఞానము. ఈ జ్ఞానాన్ని పొందడానికి తోడ్పడే ఆధ్యాత్మిక మార్గాలు నాలుగు రకములుగా ఉన్నాయని భగవద్గీతలో శ్రీకృష్ణపరమాత్మ బోధించారు. 

అవి:    

1. భక్తి మార్గము

2. జ్ఞాన మార్గము

3. కర్మ మార్గము

4. యోగ మార్గము

వీటిలో ఏదో ఒక మార్గాన్ని ఆచరించడం ద్వారా ఆత్మజ్ఞానాన్ని పొందవచ్చు. ఈ ఆధ్యాత్మిక మార్గాలైన నాలుగింటిలో ‘భక్తి’ అనునది సులభమైనదిగా, శ్రేష్ఠమైనదిగా వైశిష్ఠ్యాన్ని పొందింది. ‘భక్తి’ అంటే ఏమిటి?  ఎందుకు ఈ మార్గం సులభశ్రేష్ఠమైనదిగా ప్రాచుర్యాన్ని పొందింది అన్న విషయాలను తెలుసుకుందాం. భక్తిని గురించి మన మహర్షులు ఎన్నో విధాలుగా భిన్నాభిప్రాయాలను వెల్లడించారు. అట్టి మహర్షుల్లో వేదవ్యాసుడు, నారదుడు ప్రకటించిన భక్తి నిర్వచనాలు ప్రసిద్ధమైనవిగా ఉన్నాయి.  శ్రీవేద వ్యాసులవారు “పూజాదిష్వానురాగ ఇతి పారాశర్యః” అన్నారు. అంటే భగవంతుని ప్రేమించడంలో, పూజించడంలో, సేవించడంలో, కీర్తించడంలో కలిగే అనురాగమే ‘భక్తి’ అని అర్థం. నారద మహర్షి “స్వాతస్మిన్ పరమ ప్రేమ రూపా”- అనగా సచ్చిదానంద స్వరూపుడగు పరమాత్మయందు మనకు గల శ్రేష్ఠమైన ప్రేమ భావమే ‘భక్తి’ అనబడుతుందని నిర్వచించారు. ఈయన ‘భక్తి’ ని ‘అమృత స్వరూపాచ’ అని కూడా నిర్వచించారు.  అంటే భక్తి అమృతస్వరూపమైనది, మోక్షస్వరూపమైనది అని భావము. ఎల్లప్పుడూ భగవంతుడి పట్ల మనకి ఉండే అనురాగము లేక ప్రేమయే ‘భక్తి’ అని నిర్వచనాలసారముగా మనం గ్రహించవచ్చు. ఈ ‘భక్తి’ మార్గం నవవిధములుగా ఉన్నట్లు పోతన భాగవతంలోని ఈ పద్యం తెలుపుతోంది.

    “తన హృద్భాషలసఖ్యమున్, శ్రవణమున్,దాసత్వమున్ వందనా

    ర్చనముల్ సేవయు నాత్మలో నెఱుకయున్ సంకీర్తనల్, చింతనఁ

    బను నీతొమ్మిది భక్తి మార్గముల సర్వాత్మున్ హరిన్ నమ్మి స

    జ్జనుడై యుండుట భద్రమంచు దలతున్ సత్యంబు దైత్యోత్తమా”

అని ప్రహ్లాదుడు తన తండ్రియైన హిరణ్యకశిపునితో తాను నేర్చుకున్న విద్యను గురించి తెలుపు సందర్భములో నవవిధ భక్తులను గురించి ప్రాస్తావించడం జరిగింది.

    శ్రవణభక్తి – భగవంతుని యొక్క లీలాగుణవిశేషాలను శ్రద్ధగా వినడం.

    కీర్తనము – భగవంతుని శక్తిసామర్థ్యాలను, గుణమహిసలను కీర్తించటం.

    స్మరణము –ఎల్లప్పుడూ భగవన్నామాన్ని, స్వరూపాన్ని స్మరించడం

    పాదసేవనము – భగవతుని పాదపద్మాలను సేవించడం.

    అర్చనము-  దేవుని యొక్క మూర్తి విశేషాన్ని పూజించటం.

వందనము- భగవంతుని మూర్తిని లేదా సమస్త ప్రాణికోటిని దైవంగా తలచి

వందనం ఆచరించడం. 

    దాస్యం – ఎటువంటి కోరికలు లేకుండా పరమాత్మకు సేవచేయడం.

    సఖ్యం – భగవంతుడిని స్నేహితుడని భావించి అతనిని ప్రేమించడం.

    ఆత్మనివేదనము- దేవునికి భక్తి, శ్రద్ద, ప్రేమలతో తన సర్వస్వాన్ని అర్పించడం.

 

    ఈ విధముగా ఉన్న నవవిధ భక్తుల్లో ఏదో ఒకదాన్ని అనుసరించి ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నత స్థితికిచేరుకోవచ్చు. ఆధ్యాత్మిక మార్గాల్లో కర్మ,యోగ, జ్ఞానాదుల కంటే ‘భక్తి’యే సులభమైనది మరియు శ్రేష్ఠమైనది.  దీన్ని గురించి నారద మహర్షి రచించిన ‘భక్తి’ సూత్రాలు అను గ్రంథములో ఈ విధంగా చెప్పబడింది. ‘అన్యస్మాత్ సొలభ్యం భక్తౌ’ అనగా ఇతర మార్గములన్నింటి కంటే భక్తి సులభమైనది అని అర్థం. ఆది శంకరాచార్యుల వారు రచించిన ‘వివేక చూడామణి’ అను గ్రంథములో—

    ‘మోక్షకారణ సామగ్ర్యాం భక్తిరేవగరీయసీ

    స్వస్వరూపాను సంధానం భక్తి రిత్యాభిధీయతే’   అని చెప్పబడింది.

అంటే ముక్తిని పొందడానికి ఉపయోగపడే సాధనాల్లో ‘భక్తి’ యే గొప్పదని దీని అర్థం.  


 

ఈ గ్రంథాల సారాన్ని బట్టి జ్ఞాన, కర్మ, యోగ మార్గాలను అనుసరించాలంటే విద్య, శాస్త్ర జ్ఞానం, వివేకం అనేవి అవసరమని ‘భక్తి’ మార్గానికి ఇవేమి అవసరం లేదని అర్థమౌతుంది.  భక్తి కి వర్ణ, వర్గ, విద్యాభేదాలు లేవు. కాబట్టి ఇది పండితుల నుండి పామరుల దాకా అందరికీ ఆచరణీయమైన మార్గముగా ప్రశస్తమైనది. అందుకే భక్తి మార్గం అన్నింటి కన్నా సులభమైనది మరియు శ్రేష్ఠమైనది. ‘భక్తి’ కి కేవలం ప్రేమభావముతో దేవుడిని నిరంతరం చింతన చేయడమే ముఖ్యము.  భక్తితో ముక్తి సులభసాధ్యము.

 

జ్ఞానమార్గం 

---------------

         జ్ఞానము అంటే అర్ధం ప్రపంచాన్ని గురించినదైన జ్ఞానం కాదు. మనిషి తన యొక్క నిజస్వరూపంను తాను తెలుసుకోవడమే అని పెద్దలు పేర్కొన్నారు. ప్రతి మనిషికి నిజమైన స్వరూపం అంతర్గతం గా ఉండే ఆత్మయే కాబట్టి ఆ ఆత్మను గురించి తెలుసుకునే జ్ఞానమే ఆత్మజ్ఞానము. నేను, నాది అనే దురభిమానం లేకపోవడం, నిరాడంబరత, అహింసను పాటించడం, ఓర్పుని కలిగిఉండటం, గురువుల్ని గౌరవించడం, పరిశుభ్రతను పాటించడం, ప్రకృతిని ప్రేమిచడం, మనసుని అదుపులో ఉంచుకోవడం అనేవి జ్ఞాన లక్షణాలు అని భగవత్గీత లో కృష్ణ పరమాత్మ చెప్పడం జరిగింది. ఈ జ్ఞాన లక్షణాల్లో కొన్నింటినైనా నిత్యం అభ్యాసం చేస్తూ ఆత్మదృష్టి కలిగి ఉండటమే జ్ఞానమార్గము. ఈ మార్గాన్ని అనుసరించడానికి గురువుల మార్గనిర్దేశం సత్పురుషుల సాంగత్యం ఎంతో అవసరం అవుతాయి. ఈ జ్ఞాన మార్గము ద్వారా ఆత్మదర్శన ప్రాప్తిని పొందవచ్చు. 

 

కర్మమార్గం 

---------------

        కర్మ అనగా పని. మనిషి దైనందిక జీవనం లో భాగంగా కర్మల్ని ఆచరిస్తాడు. ఆయా కర్మలు, వాటి ఫలితాల వలన మనిషి రోజురోజుకీ కర్మబంధనంలో చిక్కుకుపోతాడు. తద్వారా పరమాత్మ ప్రాప్తి కలిగే అవకాశం ఉండదు. ఐతే కర్మఫలాన్ని భగవదర్పణం చేయడం ద్వారా, కర్మల్ని ఫలాసక్తి లేకుండా ఆచరించడం వలన పరమాత్మ ప్రాప్తి ని పొందవచ్చు అని కర్మ మార్గం తెలుపుతుంది. 

         మనిషి ఎదో ఒక ప్రయోజనాన్ని ఆశించి పనిమొదలు పెడతారు. అనుకూల ఫలితం వస్తే సంతోషం చెందుతారు. అదే ప్రతికూల ఫలితం వస్తే దుఃఖం, నిరుత్సహములకు గురవుతారు. దీనికి కారణం ఫలాపేక్ష ఉండటమే. ఫలసిద్ధి ఎలా వున్నా, సమభావంతో కర్మలను ఆచరించాలి. ఈ సమభావననే యోగము అంటారు. యోగ స్థాయి లో ఉన్న వారికి పాపపుణ్యాలు అంటవు. సమభావన స్థాయి రావాలంటే దైవదృష్టి కలిగి, కర్మలను ఫలాపేక్ష లేకుండా ఈశ్వరార్పణ బుద్దితో ఆచరించాలి. తద్వారా కర్మబంధన విముక్తుడై, కర్మలన్నీ పవిత్రమై సమభావనా స్థితి కి చేరుకుంటాడు. ఫలితముగా పరమాత్మ ని పొందుతాడు. కర్మ మార్గ అనుసరణకి వివేకం, సద్గురు సాన్నిహిత్యం ఉండాలి. 

 

యోగ మార్గం 

------------------

        చిత్తవృత్తుల్ని నిరోధించడమే యోగమని పతంజలి మహర్షి యోగశాస్త్రం లో తెలిపారు అంటే మనస్సు యొక్క చంచలత్వాన్ని నిలిపివేయడమే యోగము అని భావము. యోగ మార్గము ఎనిమిది భాగాలుగా ఉంటుంది. వీటినే అష్టాంగ మార్గాలు అంటారు. అవి

1.యమము               2.నియమము

3.ఆసనము               4.ప్రాణాయామము  

5. ప్రత్యాహారము       6.ధారణము 

7.ధ్యానం                   8.సమాధి  అనునవి. 

ఈ అష్టాంగాలను ఒకేసారి అనుసరించుట సాధ్యం కాదు. కాబట్టి క్రమానుగతం గా అభ్యసిస్తూ సాధన చేయాలి.      

1.యమము 

ఇది అష్టాంగమార్గములలో మొదటిది. అహింస, సత్యం, అస్తేయము, బ్రహ్మచర్యం, అపరిగ్రహం, అను లక్షణాలన్నీ యమ శబ్దం గా చెప్పబడును. ఇతర ప్రాణులకి భాదను కలిగించకుండా ఉండడమే అహింస. ఉన్న విషయాన్ని వాస్తవం గా చెప్పడమే సత్యము. దౌర్జన్యం గా గానీ  దొంగతనం గా గానీ ఇతరుల వస్తువుల ను గ్రహించకుండా ఉండడమే అస్తేయము. స్త్రీ పురుష సంబంధమైన కామప్రవుత్తుల  నుండి దూరం గా ఉండడమే బ్రహ్మచర్యము. ఎదుటి వారి సొమ్మును ఆశించకపోవడం అపరిగ్రహం. వీటన్నిటిని నిత్య జీవితంలో భాగంగా పాటించడమే యమము అవుతుంది. 

 

2.నియమము 

శౌచము,సంతోషం, తపస్సు, స్వాధ్యాయం, ఈశ్వర ప్రణిదానములు అనునవి నియమములు గా చెప్పబడ్డాయి.శౌచము అనగా శుభ్రము ఉండటం. నిత్య సంతోషంగా ఉండటం. తపస్సు అంటే ఆత్మదర్శనం కోసం తపించిండం అని అర్థం. జప, ధ్యానాదులు చేయడం, సత్పురుషుల సాంగత్యం ఇవన్నీ తపస్సుకు సహకరించే అంశాలు. స్వాధ్యాయం అనగా వేదాలు, పవిత్ర గ్రంధాలు పారాయణం చేయుట. నిత్యం మనం చేసే ప్రతి పనీ పరమాత్మకు'సమర్పణ భావన 'తో చేయడం ఈశ్వరప్రణిదానం.ఇవన్నీ నిత్యము చేసినవారు నియమాన్ని పాటించిన వారవుతారు. 

 

3.ఆసనము 

శరీరాన్ని స్థిరంగా, సుఖముగా ఉంచడాన్ని ఆసనము అంటారు. ఆధ్యాత్మిక మార్గంలో జపధ్యానాదులు అవలంబించడానికి ఆసనము ప్రధానమైనది. ఆసనాలు ఎనభైనాలుగు రకాలు (84) ఉన్నప్పటికీ ఆధ్యాత్మికతకు ఉపయుక్తమైనవి నాలుగు.అవి సుఖాసనము, సిద్ధాసనము, పద్మాసనం, స్వస్తికాసనము. వీటిలో ఎదో ఒకటి మాత్రమే అభ్యసించి, సాధన చేయడం ద్వారా శారీరక ఆరోగ్యం మరియు మానసిక స్తైర్యం పెంపొందుతాయి. 

 

4.ప్రాణాయామము 

మనసు నిలకడ లభించిన తర్వాత శ్వాస పద్దతిని అదుపు చేయడమే ప్రాణాయామము.మనోనిగ్రహానికి, మనసుకు ఏకాగ్రత ను కలిగించడానికి ప్రాణాయామం అత్యవసరం.కుడి ముక్కు రంధ్రం ద్వారా ఊపిరి ని పీల్చి, కొంత సేపు బంధించి ఉంచాలి.తదుపరి నెమ్మదిగా ఎడమ ముక్కు రంధ్రం ద్వారా విడవాలి. ఈ ప్రక్రియ ను ప్రాణాయామం అంటారు. ప్రాణాయామం చేసేటప్పుడు 'ఓం' కారమును గానీ, ఇష్టం దైవన్ని గానీ స్మరించాలి. 

 

5.ప్రత్యాహారము 

సహజంగా బాహ్య విషయాలందు 

వుంటూ బహిర్ముఖులై ఉన్న ఇంద్రియాలను, బాహ్య విషయాల నుండి మరల్చి అంతరింద్రియాలపై లగ్నం చేసి ఇంద్రియాలను వశపరచుకొనుటయే ప్రత్యాహారం.

 

6.ధారణము 

ధారణము అంటే జ్ఞాపకశక్తి. ఇంద్రియాలను, మనస్సును ఒకే లక్ష్యం పై చలనం లేకుండా ఏకాగ్రతను నిలపడాన్ని ధారణం అంటారు. 

 

7.ధ్యానం 

ధ్యానం అంటే ధ్యాస. అనగా ఒకే వొస్తువు మీద మనస్సును ఏకాగ్రముగా నిలపడాన్ని ధ్యానం అంటారు. ధ్యానానికి సూర్యోదయ, అస్తమయ కాలాలు శ్రేష్టమైనవి. దీనినే సంధ్యాకాలం అంటారు. 

 

8.సమాధిస్థితి 

అరక్షణం పాటు ఆకార రహితమైన కాంతి కన్నుల ముందు గోచరించునట్లు అనిపిస్తుంది. ధ్యానఫలితం గా సిద్దించిన అనుభవమే సమాధి. 

ధారణ, ధ్యానం, సమాధి అను మూడు అంగములు కలిస్తే 'యోగసిద్ది'కలుగుతుంది. యోగసిద్ది వల్ల ఆత్మదర్శన ప్రాప్తి కలుగుతుందని యోగశాస్త్ర గ్రంధం లో వివరించబడింది. 


       ఆధ్యాత్మిక మార్గములైన నాలుగింటిలో 'భక్తి'కి  హృదయం లోని ప్రేమ, జ్ఞాన మార్గానికి జ్ఞానం పొందడం, కర్మ మార్గానికి పని లేదా కర్మను భగవంతును కి సమర్పించడం, యోగమునకు మనోనిగ్రహాన్ని సాధించడం ప్రధానమైన అంశాలుగా గ్రహించవచ్చు. 

*****

bottom of page