bhuvanollasam.PNG

సంపుటి  6   సంచిక  3

Website Published &  Maintained by  Srinivas Pendyala | Mobile version is under construction. Use big screen for better experience.

కథా​ మధురాలు

అశరీరవాణి (తొలి కథ )

 

డా. అర్చన

Archana.jpg

 

 

నాడు 

సువిశాలమైన చిత్రకూట రాజ్యం అపారమైన జన సంపదతో అలరారుతున్నది. అద్భుతమైన చరిత్రతో ప్రపంచ విఖ్యాతిగాంచిన రాజ్యమది. కష్టజీవులుగా,అలుపెరగని శ్రామికుల్లా, అపరమేధోసంపతికి మారుపేరుగా ఖండాంతరాల్లో తమ రాజ్య ఖ్యాతిని ఇనుమడింపచేస్తున్న ప్రజలతో అలరారుతున్న రాజ్యమది.

నేడు

రాజ్యపాలన సరళతరం చేయడానికి సామంతరాజ్యాలుగా చీలిన సువిశాల సామ్రాజ్యం, సువిశాలమైన రాజ్యాన్ని ఏకతాటిపై నడిపించలేని ప్రభువు, కనీస బాధ్యతలు విస్మరించి విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్న అనేకమంది ప్రజలు మరీ ముఖ్యంగా స్వార్థపరులుగా ఉన్నయువతరంతో  బాధ్యత గల కొద్దిపాటి పౌరుల శ్రమ , తెలివితేటలు బూడిదలో పోసిన పన్నీరవుతున్న వేళ మరో భీకర ప్రమాదం ఆ సువిశాల రాజ్యాన్ని తాకింది. ఆ తాకిడికి ప్రభువులు, ప్రభుత్వాలు, వర్తక వాణిజ్యాలు, ప్రజావ్యవస్థ  కుదేలు అయింది.

 

ఆ ప్రమాదమేమంటే క్రూరాసురుడు అనే భీకరాకృతి గల రాక్షసుడు చిత్రకూటములో మకాం వేసి ప్రజలని కబళిస్తున్నాడు. వాడి దాహార్తికి వేలకొద్దీ ప్రజలు ఆహుతి అవుతున్నారు. ప్రజల ప్రాణాలను కాపాడలేక చేతులెతేస్తున్న రాజ్యాధికారులు. ఈ సమస్య ఇప్పుడు మొదలైనిది కాదు. క్రూరాసురుడు అతని సోదరులు అనేక రాజ్యాలపై విరుచుకు పడి జనుల ప్రాణాలను హరిస్తున్నారు.ఈ విషయము వేగుల ద్వారా ప్రభువులకు, ప్రజలకు కూడా ముందే తెలిసింది. కొన్ని రాజ్యాలు పకడ్బందీ ప్రణాళిక తో వాడిని తరిమి కొట్టారు.కానీ చిత్రకూటములో నెలకున్న పరిస్థితులు, ప్రజల , ప్రభువుల అలసత్వము కారణంగా ఎంతో ప్రాణనష్టము జరిగిపోయింది.ఇంకా ఎంత నష్టము జరుగుతుందో అంతుపట్టకుండా వుంది.

క్రూరాసురుడికి ఎన్నో అదృశ్య శక్తులు వున్నాయి. వాడు సూక్ష్మరూపధారి మరియు  బహురూపధారి. వాడిరాకను కనిపెట్టడం బహుకష్టము. వాడి ఉనికిని గమనించేలోగా అమాంతంగా ఆరగించేస్తాడు. చిత్రకూటవాసులు వాడిని తరిమి కొట్టడానికి డప్పులు వాయించారు, నిప్పును రవ్వలు రాజేశారు, రకరకాల ఆయుధాలను ప్రయోగించారు. వాడేమో భీకరాసురుడు. ఈ తాటాకు చప్పుళ్లకు లొంగుతాడా! మరీ విచిత్రాతి విచిత్రంగా రూపాంతరము చెందుతూ తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఇళ్ల నుండి బయటికి వచ్చిన ప్రజలు మళ్ళీ ఇల్లుచేరేలోగా వాడికి బలి అవుతున్నారు. వాడికెందుకో కళాకారులమీద మరీ మక్కువ. చిత్రకూటములో ఎందరో కళాకారులను గుటకాయస్వాహా చేసాడు. ఇంకెంతమందిని చేస్తాడో.

 

కర్ణుడి చావుకు ఎన్నో కారణాలున్నట్లు చిత్రకూటములో రాక్షసుడి ఆగడాలు మితిమీరడానికి ఎన్నో కారణాలున్నాయి. తమ పదవీ వ్యామోహం తప్ప ప్రజాసంక్షేమం పట్టని ప్రభువులు, ప్రలోభాలకు లోబడి కొంతమంది,  అష్టాచెమ్మటాల కొంతమంది, ఎవరైతే ఏమిటి అనే నిరాసక్తతో  అలాంటి ప్రజాప్రతినిధులను, ప్రభువులను ఎన్నుకొనే ప్రజలు చిత్రకూటవాసులు, వ్యసనాలకు,విందువినోదాలకు అలవాటుపడి నిర్లక్షధోరణితో తలలెగరేస్తూ   క్రూరాసురుడికి ఎదురువెళ్తున్నజనాలు, మూఢభక్తి తో దేవుడే కాపాడుతాడు అని ఏ ఆయుధాలు లేకుండా గుంపులుగా క్రూరాసురుడు కి ఎదురువెళ్ళి వాడి రక్కసి కోరలలో అసువులు బాసిన వారు కొంతమంది, రాజ్యములో పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకొని ప్రాణ రక్షక ఆయుధాలను అక్రమణగా రవాణా చేస్తూ కావాల్సిన వారికి అందకుండా తమ లాభానికి అమాయకుల ప్రాణాలను పణంగా పెడుతున్న మానవత్వం లేని మనుషులు ఇలా ఎన్నో కారణాలు. ఏమైతేనేమి వీటన్నిటి ఫలితంగా కుటుంబ సభ్యులను పోగుట్టుకున అమాయక ప్రజలెందరో, చివరిఘడియల్లో వారి నిర్లక్ష్యానికి పశ్చాప్తపడుతూ ప్రాణాలువిడిచిన వారెందరో. కుటుంబంలో పెద్దదిక్కును కోల్పోయి ,తమవారినెందరినో కోల్పోయి  కకావికలమైన కుటుంబాలెన్నో. తల్లిదండ్రులను పోగొట్టుకొని అనాథలైన పిల్లలెందరో. క్రూరాసురుడికి బయపడి ప్రజలు తమ పిల్లలను ఇళ్లలోనే బందీలను చేసారు,అందమైన  బాల్యాన్ని, స్నేహాన్ని ఆస్వాదించలేక ఆగమైన పిల్లలింకెందరో.

చిత్రకూటములో భాద్యత గల పౌరులే లేదా అంటే ఎంతోమంది వున్నారు.తమ ప్రాణాలొడ్డి క్రూరాసురుడి తో పోరాడి వాడి  నుండి తప్పించుకున్నవారు,వాడి కబంధ హస్తాలనుండి ప్రజలను రక్షించిన వారు, తృటిలో వాడి నుండి తప్పించుకొని ప్రాణాలను దక్కించుకొని ఆ రక్కసుడికి చిక్కకుండా తగిన మార్గాలు చెబుతున్న వారు , క్రూరాసురుడి రాకను ముందే ప్రభువులకు విషయం చేరవేసిన మెరికాలలాంటి  వేగులు, వాడిని ఎదుర్కోవడానికి కావలసిన క్రొంగొత్త ఆయుధాలను సిద్ధం చేయగల యోధులు ఇలా ఎంతోమంది వున్నారు. కానీ వీరందరి శ్రమ బూడిదలో పోసిన పన్నీరే అయింది మిగతావారందరి వలన. ఇది

 

ఇలా ఉండగా చిత్రకూటములో పరిస్థితిని గమనించిన మరికొందరు రాక్షసులు తమకి అనువైన ప్రదేశంగా ఎంచి అక్కడ మకాం వేయడానికి వచ్చారు. ప్రజలు వణికిపోతూ దేవుడికి మ్రొక్కులు మ్రొక్కారు.పూజలు చేసారు. యాగాలూ, హోమాలు చేశారు. ఎన్నడూ దేవుడిని తలవని వారు కూడా ఆ దేవుని మీద భారం వేసి కాపాడమని మ్రొక్కారు.

 

వారి ప్రార్థనలను విన్న భగవంతుడు కరుణించి వారికి దిశానిర్దేశం చేయడానికి తన అశరీరవాణిని ఇలా వినిపించాడు.    

" చిత్రకూట వాసుల్లారా  ఇది మీ స్వయంకృతాపరాధము. చైతన్యము కొరవడిన సమాజములో, నిర్లక్ష్యధోరణి పెరిగిన సమాజములో ఇలాంటి ప్రమాదాలు సంభవిస్తూనే ఉంటాయి. ప్రమాదాన్ని ఎదుర్కొని దాని నుండి బయటపడటానికి క్రింది స్థాయి నుండి పైస్థాయి వరకు ప్రక్షాళన అవసరము. అది ఏ అద్భుత శక్తివల్లో  జరగదు. ప్రతిమనిషి నైతిక బాధ్యతతో, ఆలోచనల ఐకమత్యముతో ముందడుగువేయాలి. ఆ చైతన్యము రానంతవరకు, ఆలోచన దృక్పదం మారనంత వరకు క్రూరాసురుడు కాకపోతే మరో అసురుడు దాడిచేస్తాడు. మీరందరు స్వచ్ఛమైన మనస్సులతో, ప్రయత్నలోపం లేకుండా ప్రయత్నిస్తే నా సహకారము ఎప్పుడు ఉంటుంది. కుళ్లు కుతంత్రాలతో , మానవత్వాన్ని వీడిన సమాజానికి సాయము చేయడము నా దైవత్వాన్నేప్రశ్నిస్తుంది. మార్పు మీతోనే మొదలవ్వాలి. మంచిమనుషుల పుణ్యాన్ని మబ్బులా కమ్మేస్తున్న పాపపు నీడలు చిత్రకూటాన్ని వదలనంత కాలము మీ గతి ఇంతే. మీకెన్ని వనరులు, విజ్ఞానము వున్నా పటిష్టమైన వ్యవస్థ , పకడ్బందీ ప్రణాళిక , వ్యూహం లేనిదే విజయం సాధించలేరు. ఇప్పటికి నేను మిమ్మల్ని రక్షించగలను కానీ భవిష్యత్తులో ఎంతోమంది అసురులు దాడిచేసే అవకాశము వుంది. ప్రతీసారి గాలిలో దీపము పెట్టి నీదే భారం దేవుడా అంటే , మీ ప్రయత్నలోపాన్ని ఒప్పుకొని నేను నా భక్తులకు చెడుమార్గాన్ని చూపలేను. సృష్టిలో ప్రతి జీవికి దానికి తగ్గ ప్రాధాన్యత ఉంటుంది. దానినే ప్రకృతి సమతుల్యత అంటారు. ఎప్పుడైతే ఈ సమతుల్యతకు భంగం వాటిల్లుతుందో అప్పుడే ఇలాంటి పరిణామాలు ఎదురవుతుంటాయి. ప్రకృతి సమతుల్యతను కాపాడటం మానవుడి కనీస బాధ్యత. విశ్వమానవ సౌబ్రాతృత్వం పెంపందికోవడానికి కృషి చేయడం మానవుడి కర్తవ్యము. మానవులకు అసాధ్యమైనదంటూ లేదని ఎన్నో యుగాలనుండి ఋజువు అవుతూనే వుంది . కావాల్సిందల్లా సరైన కార్యాచరణ, ఐకమత్యమే . " అంటూ అంతర్దానమైంది అశరీరవాణి.

*****